[బాలబాలికల కోసం ‘భారత అణు శాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ భాభా’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
భారత అణుశక్తి శాస్త్ర పితామహుడు, పద్మ భూషణ పురస్కార గ్రహీత ఐన హోమీ జహంగీర్ భాభా గారి గురించి తెలుసుకుందామా! వీరు 1909వ సం.. అక్టోబరు 30వ తేదీన బొంబాయిలో జన్మించారు. వీరి తండ్రి పేరు జహంగీర్ హోర్ముస్ జీ భాభా. భాభా తండ్రి న్యాయవాదిగా పనిచేసేవారు. తల్లి పేరు మెహరీన్. హోమీ భాభా సంపన్న పార్శీ కుటుంబంలో జన్మించారు. తన ప్రాథమిక విద్యను బొంబాయి కేధడ్రల్ అండ్ జాన్ కానన్ పాఠశాలలో పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎల్ఫిన్ స్టోన్ కళాశాలలో ప్రవేశించారు.
1927 లో రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చదివారు. కేంబ్రిడ్జ్ లోని కైయస్ కాలేజీలో చేరారు. కేంబ్రిడ్జ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు. ఆ తరువాత భారతదేశం తిరిగి వచ్చి టాటా స్టీల్ మిల్స్‌లో మెటలర్జిస్టుగా పని చేశాడు. తల్లిదండ్రులు, మామల పట్టుదలతో భాబాను చదివించారు. 1930 జూన్‌లో ట్రిప్రోస్ పరీక్ష రాసి మొదటి తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. సైద్ధాంతిక బౌతిక శాస్త్రంలో డాక్టరేట్ కోసం పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. అందుకు కేంద్రంగా కావెండిష్ ప్రయోగశాలను ఎన్నుకున్నాడు. అదే ప్రయోగశాలలో ‘జేమ్స్ చాడ్విక్’ న్యూట్రానును కనుగొన్నాడు. పలువురు శాస్త్రవేత్తలు అక్కడ అనేక విషయలను కనుగొన్నారు.
భాభాకు ఇంజనీరింగ్ లో సాలమన్స్ స్టూడెంట్‌షిప్ పురస్కారం 1931-1932 విద్యా సంవత్సరంలో లభించింది. 1933లో బాభా తన మొదటి పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. ‘ది అబ్సార్ ప్షన్ ఆఫ్ కాస్మిక్ రేడియేషన్’ అనే శాస్త్రీయ పరిశోధనా పత్రం సమర్పించాక అణు భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ లభించింది. విశ్వ కిరణాలలో శోషణ లక్షణాలు ఎలా ఉన్నాయో విశదీకరించారు మరియు ఎలక్ట్రాన్ షవర్ ఉత్పత్తి గురించి వివరణను వివరంగా చెప్పారు. దీని వలన భాభా ఐజాక్ న్యూటన్ స్టూడెంట్‌షిప్‌ను వరసగా మూడు సంవత్సరాలు గెలుచుకున్నారు. 1935వ సంవత్సరంలో ‘భాభా పరిక్షేపణ’ ను కనుగొన్నాడు ప్రొసీడింగ్స్ ఆఫ్ ద రాయల్ సొసైటీలో ఒక పరిశోధనా పత్రాన్ని భాభా సమర్పించారు. దీనిలో ఎలక్ట్రాన్ పాసిట్రాన్ పరిక్షేపణ మధ్యచ్చేద వైశాల్యాన్ని నిర్ణయించే మొదటి గణనను చేశారు. భాభా చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ఎలక్ట్రాన్ పాసిట్రాన్ పరిక్షేపణను ‘భాభా పరిక్షేపణ’ గా పేర్కొన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు భాభా ఇంగ్లండు నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతీయ భౌతిక శాస్త్రవేత్త సి. వి. రామన్ వద్ద రీడర్ గా పని చేయడం ప్రారంభించారు. 1941లో 20వ తేదీన రాయల్ సొసైటీకి ఫెలోగా ఎంపికయ్యారు. ముంబై టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి స్థానంలో కీలక పాత్ర పోషించారు. దీనికి జె.ఆర్.డి. టాటా సహాయం చేశారు.
భారతదేశంలో కేంద్రక భౌతిక శాస్త్రం, కాస్మిక్ కిరణాల గురించి పరిశోధన చేయడానికి సరియైన సదుపాయాలు లేవు. ప్రాథమిక భౌతిక శాస్త్రంలో శక్తివంతమైన పరిశోధనా పాఠశాల ఆవశ్యకతను గుర్తించారు. సర్ దొరార్జీ టాటా సహాయంతో ‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి’ అనే సంస్థను నెలకొల్పారు. 1954 లో ‘అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంట్ ట్రాంబే’ను ప్రారంభించారు. అణుశక్తి యొక్క శాంతియుత ఉపయోగాలపై ఐక్యరాజ్యసమితి సమావేశాలు నిర్వహించింది. 1955లో స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరిగిన ఈ సమావేశాలకు భాభా అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాగే 1958లో విదేశీ గౌరవ సభ్యునిగా ‘అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెన్’ కు ఎంపిక కాబడ్డాడు.
అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి భాధ్యత వహించవలసిందిగా అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆదేశించారు. 1944లో అణ్వాయుధాలపై పరిశోధనలు చేశాడు. భారత చైనా యుద్ధం తరువాత భాభా తన పరిశోధనలను తీవ్రతరం చేశారు. అణు భౌతిక శాస్త్రం పురోగతిపై కీలక ఉపన్యాసాలు ప్రయోగాలు ఎక్కువగా చేపట్టారు. అంతరిక్ష పరిశోధన కోసం భారత జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి విక్రమ్ సారాభాయి తోడ్పాటు నందించారు. 1954 లో బాభాకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది ఆ తర్వాత భారత క్యాబినెట్ శాస్త్రీయ సలహా కమిటీకి సభ్యుడిగా పని చేశారు. భారత అణుశక్తి విభాగానికి భాభా చేసిన సేవలకు గుర్తింపుగా భారత అణుశక్తి పితామహుడిగా పిలవబడ్డారు.
భారతదేశంలో యురేనియం నిల్వల కన్నా థోరియం నిల్వలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. దీన్ని గుర్తించిన భాభాకు థోరియం నుండి శక్తిని వెలికి తీయవచ్చని ప్రతిపాదించిన ఘనత దక్కింది. ఈ థోరియం కేంద్రికృత వ్యూహం ప్రపంచం లోని విధానాల కంటే బిన్నంగా ఉన్నందున మంచి ఖ్యాతి లభించింది. 1966 జనవరి 24న మోంట్ బ్లాంక్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో భాభా మరణించారు. ముంబై లోని రీసెర్చి సెంటర్‌కు భాభా అటామిక్ రీసెర్చి సెంటర్‌గా పేరు పెట్టారు. భాభా ఫోటోతో ఒక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. 1967 నుండి భాభా ఫెలోషిప్ లను అందిస్తున్నారు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
