Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

క్రెస్కోగ్రాఫ్‌ని కనిపెట్టిన జగదీష్ చంద్రబోస్

[బాలబాలికల కోసం ‘క్రెస్కోగ్రాఫ్‌ని కనిపెట్టిన జగదీష్ చంద్రబోస్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

మొక్కలకు, చెట్లకు కూడా ప్రాణం ఉంటుందనీ, అవి కూడా పరిసరాల ప్రభావాలకు లోనవుతాయని కనుక్కున్న శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గురించి తెలుసుకుందామా! ఇతడు 1858వ సంవత్సరంలో నవంబరు 30వ తేదీన జన్మించాడు. బ్రిటిష్ ఇండియాలోని తూర్పు బెంగాల్‌లో మైమెన్ సింగ్ అతని స్వగ్రామం. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్నది. అతని తల్లిదండ్రులు భగవాన్ చంద్రబోస్, బామా సుందరీ బోస్‌లు. తండ్రి బ్రహ్మ సమాజంలో నాయకుడు గానూ డిప్యూటీ మెజిస్ట్రేట్ గానూ పని చేశారు. పిల్లలకు మాతృభాషలోనే బోధించాలని భావించేవాడు. ఇతని కుటుంబం మొదట్లో ఢాకా జిల్లాలోని మున్షిగంజ్‌లోని రార్ఖిఖల్ గ్రామానికి చెందినటువంటిది. వీరిది బెంగాలీ కాయస్థ కుటుంబం. 19వ శతాబ్దంలో బెంగాల్‌లో జరిగిన ఉద్యమాలలో పాల్గోనేవారు. కుటుంబం మొత్తం బ్రహ్మ సమాజానికే అంకితమైనటు వంటివారు.

జగదీష్ చంద్రబోస్ చిన్నతనంలో బాగా సున్నితమైన మనసుతో ఉండేవాడు. ఆదర్శవంతమైన విద్యార్థిగా పొందాడు. బోస్ బాల్యంలో ప్రకృతిని, సైన్స్‌ను ప్రేమించేవాడు. కలకత్తాలోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి డిగ్రీ పట్టాను అందుకున్నాడు. ఆ తరువాత వైద్య విద్యను చదవటానికి అండన్ వెళ్ళి పోయాడు. కానీ అక్కడి వాతావరణం సరిపడక అనేక ఆరోగ్య సమస్యలకు లోనయ్యాడు. తిరిగి భారతదేశానికి వచ్చేశాడు. కలకత్తా చేరి, ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా ఉద్యోగం కొనసాగించాడు. సరైన నిధులు లేకున్నా కలకత్తాలో తన పరిశోధనలను మాత్రం ఆపలేదు. ఆ రోజులలో జాతివివక్షత ఎక్కవగా చూపెట్టేవారు.

భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, జీవ భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, పురాతత్వ శాస్త్రంలలో విజ్ఞానాన్ని సాధించాడు. బెంగాలీ సాహిత్యాన్ని కూడా చదువుకున్నాడు. బంగ్లా సైన్స్ ఫిక్షన్‌ను విపరీతంగా చదివేవాడు. రేడియో సిగ్నల్స్‌ను గుర్తించడానికి అర్ధవాహక జంక్షన్లను జగదీష్ చంద్రబోస్ మొదటగా వాడాడు. రేడియో తరంగాలను కనుక్కోవడంలో ప్రధాన పాత్ర పోషించింది చంద్రబోసే. ఈ పరిశోధనా ఫలితాల వలననే ఆ తర్వాత వచ్చిన ‘మార్కోనీ’ పూర్తి స్థాయిలో రేడియోను కనుగొనగలిగాడు. తన పరిశోధనలను బోన్ అందరికీ అందుబాటులో ఉంచాడు. వ్యాపారాత్మకంగా కానీ, కీర్తి ప్రతిష్ఠల కోసం తపత్రయ పడలేదు. ఇతనిని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు.

1904వ సంవత్సరంలో భారతదేశం నుంచి అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొదటి వ్యక్తిగా గుర్తింపబడ్డాడు. మొక్కలు వివిధ సందర్భాలలో ఎలా ప్రవరిస్తాయో, ఎలా ప్రతిస్పందిస్తాయో తెలుసుకునేందుకు ‘క్రెస్కోగ్రాఫ్’ అనే పరికరాన్ని కనిపెట్టాడు. క్రెస్కోగ్రాఫ్ ద్వారా వృక్ష, భౌతిక శాస్త్రాలలో అనేక ఆవిష్కరణలు చేశాడు. కలకత్తాలోని బోస్ ఇన్సిస్టిట్యూట్‌లో ఆనాడు తయారుచేసిన క్రెస్కోగ్రాఫ్‌ను చూడవచ్చు. వృక్షాల పెరుగుదలలో తేడాలను గుర్తించడానికి వీలుంటుంది. ఉష్ణోగ్రత, రసాయనాలు, వాయువులు విద్యుచ్ఛక్తి వంటి అంశాలను తీసుకుని బోస్  పరిశోధనలు చేశాడు. క్రెస్కోగ్రాఫ్‌లో గడియారపు గేర్లు ఉంటాయి. వృక్షాల శీర్షాలకు గానీ, వేర్లకు గానీ పొగ గ్లాసు ప్లేటును అమర్చినపుడు వాటి పెరుగుదలను గుర్తించవచ్చు. ప్లేటు మీద వృక్షాల పెరుగుదల రేటు ప్రతి సెకనుకు ఎంత జరుగుతుందని గమనించవచ్చు. క్రెస్కోగ్రాఫ్ ద్వారా 10,000 పాయింట్ల వరకు కొలిచే కొలబద్ద కలిగి ఉంటుంది.

బోస్ యొక్క క్రెస్కోగ్రాఫ్‌ను చూసిన తర్వాత ‘రండాల్ ఫోంటెన్’ అనే శాస్త్రవేత్త కొత్త ఎలక్ట్రానిక్ క్రెస్కోగ్రాఫ్‌ను కనిపెట్టాడు. 1975లో రండాల్, స్టాన్‌ఫోర్ట్ యూనివర్శిటీలో మొక్కల కదలికలను కనిపెట్టేందుకు ఉపయోగించాడు. ఈ ప్రయోగాల ద్వారా అనేక విషయాలు తెలిశాయి. దీని ద్వారా ‘ఆర్గానిక్ బయో ఫీల్డ్ సెన్సర్’ ను, రండాలి ఫొంటెన్ కనుగొన్నాడు.

క్రెస్కోగ్రాఫ్‌లోని మైక్రోమీటర్ ఆధారంగా అతి సూక్ష్మమైన కొలతలను 10,000,000 భాగాల వరకు కొలవవచ్చు క్రెస్కోగ్రాఫ్ అంటేనే మొక్కల కదలికలను గమనించి కొలిచే సాధనమని చెప్పుకున్నాం కదా!. దీని ద్వారా మొక్కల పెరుగుదల రేటును, కొలతను కొలవవచ్చు. రేడియో సూక్ష్మ తరంగాల పైన పరిశోధనలు చేయడమే కాక సైన్స్ కథలను రాయడంలో బోస్ సిద్ధహస్తుడు. రేడియోల ఆవిష్కరణల మీద బోస్‌కు నోబుల్ ప్రైజు రావలసి ఉంది. వృక్షశాస్త్రం మీద బోస్ చేసిన పరిశోధనలు అమూల్యమైనవి. బోస్ కృషిని గుర్తించి, చంద్రుడి మీదున్న ఒక శిఖర బిలానికి బోస్ పేరు పెట్టారు.

మొక్కల కదలికలే కాకుండా, నిర్జీవమైన ఇనుము లాంటి పదార్ధాలలోను స్పందనలుంటాయని బోస్ గుర్తించాడు. 1895లో బోన్ ధాతు సంబంధిత డిటెక్టర్లలోకి తరంగాలను పంపినప్పుడు కొన్ని సంకేత చిత్రాలు వచ్చాయి. ఆ ప్రయోగం మరల మరల చేసినపుడు వాటిలోని తేడాలను గమనించాడు. కొద్ది సమయం విరామం ఇచ్చిన తర్వాత ప్రయోగం జరిపినప్పుడు సంకేత చిత్రాలు స్పష్టంగా రావడాన్ని గమనించాడు. నిర్జీవ ధాతువులు సైతం అలసిపోయినపుడు పని మందగిస్తుందని గుర్తించాడు. నిర్ణీత పదార్థాల్లో కూడా ప్రాణశక్తితో కూడిన సంవేదనాశీలత ఉందని సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. జీవులలోను, నిర్జీవులలోను ప్రాణముందని గుర్తించిన వ్యక్తి జగదీష్ చంద్రబోస్. రెస్పాన్స్ ఇన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ (1902), ద నెర్రస్ మెకానిజమ్ ఆఫ్ ప్లాంట్స్ (1926) వంటి పుస్తకాలు ప్రసిద్ధి చెందినవి. పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాల్లోనే కాదు, సమస్త జగత్తులోను ఒకే ఆత్మ ఉందనే భారతీయ తత్వాన్ని జగదీష్ చంద్రబోస్ నిరూపించాడు. 1937 నవంబర్ 23వ తేదీన ఝార్ఖండ్‌లో మరణించాడు.

Exit mobile version