జీవితంలో వివాహం ఒక గొప్ప సన్నివేశం! అది ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా, జీవితమంతా కలిసి మెలసి ఉంటామని, ఒకరినొకరు అర్థం చేసుకుని, కష్టమైనా, సుఖమైనా, ఒక అవగాహనతో కలిసి జీవిస్తామని ఒకరికొకరం అండగా నిలుస్తామని, దేవుని స్మరిస్తూ పెద్దల ముందు ప్రమాణం చేసి పెళ్లి తంతుకు సహకరించి పెళ్లి అయిందనిపిస్తారు. అప్పటివరకు వారివి వేరు వేరు జీవనశైలులు అయివుంటాయి. ఇద్దరూ ఒక్కటై జీవించడం మొదలు పెట్టక, అసలు విషయాలు ఒక్కొక్కటి బయట పడుతుంటాయి. అయితే ‘మగవాడికి నాకేమిటి?’ అనే తరతరాల నుంచి వస్తున్న పురుష ఆధిక్యం చాలా చోట్ల స్త్రీల పరిస్థితిని గందరగోళం దిశకు మళ్లిస్తుంది. భార్యను బానిసగా చేసి, ఏ మాత్రం భార్య మాటకు, అభిరుచికి విలువనీయకుండా, ఒక వంట మనిషిగా, పిల్లల్ని కనే యంత్రంలా చూసినా, భవిష్యత్తు గురించి భయపడి, పరిస్థితికి సర్దుకుపోయే స్త్రీలు చాలా మంది ఉండగా, అటు భర్తకు, ఇటు తల్లిదండ్రులకు – బంధువులకు మధ్య నలిగిపోయి ఏమి చేయాలో తోచని స్థితిలో, ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, నిరాశా జీవితంతో చిక్కి శల్యమయ్యేవాళ్ళు, ఎదురుతిరిగి భంగపడేవాళ్ళూ, సంసారాన్ని ఆ తర్వాత సరిదిద్దుకునే స్త్రీమూర్తులు కూడా వుంటారు. ఇలా ఇంటింటికి, ఒక కథ తప్పక ఉంటుంది. అందులో కొన్ని బయటికి వచ్చేవి, కొన్ని చీకటిలో కలిసిపోయేవి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే, భార్యాభర్తల మధ్య సమస్య (అది ఏదైనా కావచ్చు) ఉత్పన్నమైనప్పుడు, అటో ఇటో తేల్చుకుని విడిపోయేవాళ్లు కొందరూ, హింసను భరిస్తూ జీవచ్ఛవాల్లా బ్రతికేవారు కొందరూ, పరిస్థితులకు రాజీ పడిపోయి బ్రతికేవారు కొందరూ వుంటారు.
ప్రేమ వివాహాలు కూడా అవగాహన లేక అతి కొద్దికాలంలో విడిపోయేవాళ్లు ఎక్కువైనారు. ఇది దురదృష్టకరమైన విషయం.
ఇక అసలు విషయానికి వస్తే, ఈ మధ్య నేను చదివిన ‘మడం తిప్పిన మోహం’ అనే కథ నన్ను బాగా ఆకర్షించింది. కథను రచయిత్రి తీర్చిదిద్దిన విధానం నన్ను అమితంగా ఆకట్టుకుంది. ఈ కథ చదువుతుంటే సమకాలీన వైవాహిక జీవితాలనే కళ్ళముందు ఉంచినట్లు కనిపిస్తుంది. కథ చివరివరకూ చదివిన తర్వాత, ఇది నిజంగా జరిగిన కథా వస్తువేమో అనిపిస్తుంది. ఈ కథ నిజంగా జరిగినా, జరగక పోయినా, కథలోని సన్నివేశాలు, పాత్రలు కూడా నిజ జీవితంలోనుండే తీసుకున్నట్టుగా పాఠకుడికి అనిపిస్తుంది.
ఈ కథలో కథానాయిక పేరు వైదేహి. వైదేహి ఉద్యోగస్థురాలు. భర్త పెద్దగా ప్రేమించినట్టు కనపడక పోయినా పెద్దగా ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు, ఆయనిది. అయితే సంసార బాధ్యతలు, చిన్న పిల్లల చదువులు, వారి స్కూలు ఫీజులు కట్టడాలు అన్నీ బాధ్యతగా తానే చేసుకుంటుంటుంది. అలా సంసారం మామూలుగానే సాగిపోతుంటుంది. దురదృష్టవశాత్తు ఒక దుర్ముహుర్తాన, భర్త లీలలు బయటపడతాయి. భర్త మరో ఆమెతో కాపురం పెట్టినట్టు, వాళ్లకు పుట్టిన పిల్లల స్కూలు ఫీజులు కట్టిన రుజువులు బయటపడటంతో, భర్తను ప్రశ్నిస్తుంది. భర్త కోపానికి గురియై, బెల్టుదెబ్బలు తిన్న వైదేహిని, అప్పుడే అక్కడికి అనుకోకుండా వచ్చిన తమ్ముడు అక్క పరిస్థితి చూసి చలించిపోతాడు. బావను చావబాదాలాన్నంతగా, కోపోద్రేకుడై, తర్వాత సంయమనం పాటించి అక్కను వాళ్ళ ఇంటికి తీసుకెళతాడు. ఇల్లు వైదేహిది కనుక భర్తను ఇల్లు ఖాళీ చేయిస్తారు.. ఇక్కడ కథానాయిక నూటికి నూరుపాళ్లు వివాహబంధంలో స్త్రీ మనస్తత్వాన్ని కథలో అభివ్యక్తం చేశారు రచయిత్రి. భర్తను, తల్లీ తమ్ముడూ కలిసి ఇల్లు ఖాళీ చేయించడం అసలు ఇష్టం ఉండదు. కనీస అవసరాలకు కూడా తనమీదే ఆధారపడి వుండే భర్త వంటరిగా ఎన్నిబాధలు పడుతున్నాడోనని (అతను తనకు అన్యాయం చేస్తున్నాడని తెలిసి కూడా) తెగ బెంగ పడిపోతుంది. దీనికి తోడు పుండుమీద కారం చల్లినట్టు, తమను పూర్తిగా విడాకుల ద్వారా వేరు చేసే ప్రయత్నం తల్లీ – తమ్ముడూ చేస్తున్నారని తెలిసి, మరింత వ్యథకు గురి అవుతుంది. భర్తను చూడాలన్న ఆరాటం ఆమెలో అధికమౌతుంటుంది. తల్లి తమ్ముడికీ తెలియకుండా భర్తను కలుసుకోవాలని నిర్ణయానికి వస్తుంది. తల్లికి – తమ్ముడికీ తెలిస్తే ఏమౌతుందో ఆమెకు తెలుసు. అందుకే, రోజూ ఆఫీసుకు వెళుతున్నట్లుగానే తయారై, తల్లి సిద్దంచేసిన లంచ్ బాక్స్ సర్దుకుని బయలుదేరుతుంది. సగం దూరం వెళ్లిన తర్వాత బస్సు దిగి, భర్త ఉంటున్న ప్రదేశానికి వెళ్లే బస్సు భయం.. భయంగా ఎక్కుతుంది. కథకు పతాక సన్నివేశం ఇదే. నిజానికి తప్పు చేసిన భర్త, తనని క్షమాపణ అడగాలి, కానీ అదేమీ పట్టించుకోకుండా భర్త మీద వున్న ప్రేమ కొద్దీ అతనిని కలవాలనే ఆశతో బయలు దేరింది వైదేహి. కానీ తాను దిగవలసిన బస్సు స్టాప్ దగ్గరవుతున్నకొద్దీ కథలో కొత్తదనం తీసుకు వచ్చే ప్రయత్నం చేసారు రచయిత్రి. మామూలు పాఠకులు జరగబోయే సన్నివేశాన్ని ఎలా అర్థం చేసుకునే అవకాశం ఉందంటే, భర్తను బ్రతిమాలి ఇంటికి ఆహ్వానించడమో, లేకపోతే భర్తతో ఘర్షణపడడమో, లేదా గతంలో మాదిరిగానే భర్తతో తన్నులు తినిరావడమో జరుగుతుందని. కానీ రచయిత్రి ఆమెలో మరో రూపంలో ఆమెలో ఆలోచనలు రేకెత్తింపజేసి, ఆధునిక ఆలోచనలు గల స్త్రీని ఆమెలో ప్రవేశపెట్టి కథకు కొసమెరుపు స్థాయిని తీసుకు వస్తారు రచయిత్రి.
ఈ పురుషాహంకార పితృస్వామ్య ప్రపంచంలో స్త్రీ ఎప్పుడూ బానిసగానే చూడబడుతున్నది. ఎవరో ఒకరు దీనికి చరమగీతం పాడాలి కనుక ఆ పని తనతోనే ప్రారంభం కావాలనే ఆలోచన వైదేహిలో మరింత బలపడ్తుంది. రచయిత్రి మాటల్లో చెప్పాల్సి వస్తే.. “తలుపు గడియ తట్టాల్సిన వైదేహి చేతులు, చీర చెంగుతో నుదుటపట్టిన చిరు చెమటను తుడుచుకున్నాయి. ఒక నిర్ణయానికి వచ్చిన వైదేహి తేలికైన హృదయంతో గిర్రున వెనుతిరిగింది చైతన్యం దిశగా!”.
కథకు ఇవే ఆఖరి ముగింపు మాటలు.
కథ చదువుతున్నంత సేపూ, త్వరగా కథను చదివేయాలనే ఉత్కంఠను కలిగించే రచనా కౌశలం ఈ రచయిత్రిది. ఈ సందర్భంగా రచయిత్రికి అభినందనలు. ఈ కథా రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి. ఈ కథ రచయిత్రి కొత్త కథా సంపుటి ‘చీకటి వెన్నెల’ లోనిది. ఈ కథలు చదవాలనుకున్నవారు, పుస్తకం కోసం, రచయిత్రిని 9866059615 మొబైల్ నంబరులో సంప్రదించవచ్చును.
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.