అక్టోబర్ 19వ తేదీ శ్రీమతి మాతంగిని హజ్రా జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో విభిన్న కోణాలు దర్శనమిస్తాయి. వయోబేధం కనపడదు. లింగ బేధం లేదు. కులమత తేడాలు లేకుండా కలసిమెలసి దేశం నలుచెఱగుల నుంచి పోరాటాలు ఉవ్వెత్తున లేచాయి. 1916కు ముందు ఎన్ని పోరాటాలు జరిగినా, ఆ తరువాత అంతా ‘గాంధీయుగం-గాంధీజగమే’. ఆయన అనుచరగణమే ముఖ్యపాత్ర పోషించారు.
ఇటువంటి అనుచరులలో ‘గాంధీబురి’ (బెంగాలీలో వృద్ధ గాంధీ) అని పేరు పొందిన మహిళ ఒకరు. ఈమె 73 ఏళ్ళ వయస్సులో ప్రాణత్యాగం చేసిన శ్రీమతి మాతంగిని హజ్రా.
ఈమె 1869 అక్టోబర్ 19వ తేదీన నాటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని తమ్లుక్ దగ్గరలో ఉన్న హోగ్లా గ్రామంలో జన్మించారు. తండ్రి ఠాకుర్‌దాస్ మైటీ పేద రైతు. మాతంగిని మైటీ పేదరికం కారణంగా చదువుకోలేదు. 12వ ఏటనే 60 ఏళ్ళ వృద్దుడు త్రిలోచన్ హజ్రాతో వివాహం జరిగింది. ఇతను మేదినీపూరికి చెందిన అలీనాన్ గ్రామస్థుడు. 18 ఏళ్ళ వయసులోనే భర్త మరణించాడు. తరువాత తండ్రి దగ్గరకు వచ్చారామె. కాని కొన్ని కారణాల వలన మళ్ళీ అలీనాన్ గ్రామానికి వెళ్ళి జీవించారు. ఇదే ఈమె స్వాతంత్ర్య పోరాట కార్యక్షేత్రమయింది. తన చుట్టుప్రక్కల వారికి సాయం చేస్తూ అండదండగా ఉండేవారామె.
1905 నుండి స్వాతంత్ర్య పోరాటం వైపు ఈమె దృష్టి మరలింది. కాంగ్రెస్ సమావేశాలకు అత్యుత్సాహంతో కాలినడకన వెళుతూ ఉండేవారు. నాయకుల మాటలు వింటుండేవారు. బ్రిటిష్ అధికారులతో గొడవ పడి తన చుట్టుప్రక్కల వారికి న్యాయం చేయాలనుకునేవారు.
స్వాతంత్ర్య పోరాటంలో గాంధీయుగం మొదలైన తరువాత తన జీవితాంతం పోరాటంలో పాల్గొన్నారు.
1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ వరకు బాపూజీ నిర్వహించిన దండి ఉప్పుసత్యాగ్రహ ప్రభావం ఈమె మీద పడింది. సహచరులతో కలిసి ఉద్యమించారు.
అలీనాన్ ఉప్పుతయారీ కేంద్రంలో ఉప్పు తయారు చేసి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. పోలీసులు అరెస్టు చేసి వృద్ధురాలని విడుదల చేశారు.
ఆ తరువాత చౌకీదారీ పన్ను విధించడానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. పోలీసులు ఈమెను అరెస్టు చేసి బరంపురం జైలులో బంధించారు. ఈ జైలు శిక్షననుభవించిన 6 నెలల కాలంలో జైలులోని రాజకీయ ఖైదీలతో పరిచయం పెంచుకున్నారు. స్వాతంత్ర్యోద్యమం గురించి వారి దగ్గర చాలా విషయాలను తెలుసుకున్నారు. గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలను గురించి క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారు. అంతటితో ఆగలేదు. ఆచరించి చూపించాలని, ఆయన చెప్పిన విధంగా పోరాటంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
1932 జనవరి 26వ తేదీన ఉద్యమం తీవ్రతరమయింది. ఉద్యమకారుల సందడి, నినాదాలు విని తన ఇంటి నుండి బయటకు వచ్చారు. కొంతమంది యువకులే ఉన్నారు. ఒక్క మహిళ కూడా లేదు. ఈ విషయం ఆమెని తీవ్రంగా బాధించింది. స్వయంగా ఊరేగింపులోకి ఉద్రేకంగా దూసుకుని వెళ్ళారు. వృద్ధురాలని అరెస్టు చేయలేదు.
ఈమె ఇంటి నుండి బయటకు రాగానే బెంగాలీ సంప్రదాయం ప్రకారం శంఖం పూరించి స్వాగతం పలికేవారు. తమ్లుక్ లోని కృష్ణగంజ్ మార్కెట్‌కి వెళ్ళేవారు. అక్కడి వారితో సమావేశాన్ని నిర్వహించేవారు.
1933 జనవరి 17వ తేదీన గవర్నర్ అండర్సన్ తమ్లుక్‌కి వచ్చారు. అప్పటికి అక్కడ ‘కర్బందీ ఉద్యమం’ జరుగుతోంది. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి అక్కడికి వచ్చిన గవర్నర్‌కి నల్లజెండాతో నిరసన తెలియజేశారు మాతంగిని. నినాదాలతో మారు మోగించారు. ఈమెను అరెస్టు చేసి 6 నెలల పాటు ముర్షిదాబాద్ జైలులో నిర్బంధించారు.
గాంధీజీ ప్రకటించిన శాసనోల్లంఘనోద్యమంలోనూ ఈమె పాలు పంచుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్రను నిర్వహించారు.
నూలువడకడం మొదలు పెట్టారు. చుట్టు ప్రక్కల వారిని నూలు వడకడంలోను, ఖద్దరు తయారీలోను పాలుపంచుకునేట్లు ప్రోత్సహించారు. ఖాదీ ఉద్యమానికి ఊతమందించారు.
1933లో బెంగాల్ లోని సెరాంపూర్‌లో సబ్ డివిజినల్ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో అరవైమూడేళ్ళ వయసులోను అమిత ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సమావేశాలకి హాజరయిన వారి మీద పోలీసులు కర్కశంగా లాఠీఛార్జి చేశారు. ఈ లాఠీఛార్జిలో ఈమె కూడా గాయపడ్డారు.
ఈమె జీవితంలో చివరి మలుపు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం. గాంధీజీ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టి ‘చేయి లేదా చావు’ (Do Or Die) అనే నినాదాన్ని అందించారు. 1942 సెప్టెంబర్ 29వ తేదీన ఈ ఉద్యమంలో భాగంగా 6000 మంది వాలంటీర్లను (ఎక్కువ మంది మహిళా వాలంటీర్లు) వెంటబెట్టుకుని తమ్లుక్ పోలీస్ స్టేషన్ మీద దాడికి బయలుదేరారు ఈమె.
మేదినిపూర్ జిల్లాలోని పోలీస్ స్టేషన్లను చుట్టుముట్టే ప్రయత్నం జరిగింది.పోలీసులు వాలంటీర్ల మీద కాల్పులు జరిపారు. ఈమె వారి మీద కాల్పులు జరపొద్దని కోరారు. కాల్పులకు అదరలేదు, బెదరలేదు. క్రిమినల్ కోర్టు భవనానికి ఉత్తర దిక్కు నుండి ఊరేగింపును నడిపించారు. త్రివర్ణపతాకంతో ఒంటరిగా ముందుకు సాగారు. పోలీసులు ఆమె మీద కాల్పులు జరిపారు. నుదురు, రెండు చేతులు బుల్లెట్ గాయాలకు గురయ్యాయి. శరీరమంతా రక్తసిక్తమయింది.
అయినా ఆమె పోరాటం, నినాదం ఆగలేదు. ‘వందేమాతరం!, మాతృభూమికి నమస్కారం’ అంటూ ఆ 73 ఏళ్ళ వృద్ద వీరనారి వీరమరణం పొందారు. కాని జెండాని నేలకొరకనీయలేదు. ఆమె చేతిలోని జెండా గాలిలో ఎగురుతూనే ఉంది. ఈ విధంగా సెప్టెంబర్ 29 వ తేదీన 1942 నాడు తమ్లుక్ లోనే మరణించారు మాతంగిని హజ్రా.
తమ్లుక్‌లో ఒక సమాంతర ప్రభుత్వం ఏర్పాటయింది. అంతే కాదు ‘బిప్లాబీ’ అనే పత్రికనూ నడిపిందా ప్రభుత్వం. ఆ పత్రికలో మాతంగిని హజ్రా గురించి ఈ విధంగా ప్రశసించారు.
“మాతంగిని క్రిమినల్ కోర్టు భవనానికి ఉత్తరం నుండి ఊరేగింపును నడిపించింది. కాల్పులు ప్రారంభమయిన తరువాత కూడా ఆమె స్వచ్ఛంద సేవకులందరినీ వదిలి త్రివర్ణపతాకంతో ముందుకు సాగింది. పోలీసులు 3 సార్లు కాల్చారు. నుదురు, రెండు చేతులకు గాయాలైనా కవాతును కొనసాగించింది. పదేపదే కాల్పులు జరుగుతున్నా ‘వందేమాతరం!, మాతృభూమికి నమస్కారం’ అని మాతృభూమిని ప్రార్థిస్తూ నేలకొరిగినా, చేతిలో ఎగిరే జెండాను చూస్తూ అమరులయ్యారు.”
ఈమె జీవితచరిత్రను వ్రాసిన గ్రంథకర్త భౌమిక్ ఈమెను గురించి “మాతంగినికి గాంధీజీ పట్ల ఉన్న ప్రేమ చాలా గొప్పది. ఆమె మా గ్రామంలో ‘గాంధీబురి’ (వృద్ధ గాంధీ మహిళ) అని పిలవబడింది. మాతంగిని ద్వారా నేను బాపూజీ సందేశాన్ని తెలుసుకున్నాను. మరియు నా స్వంత ఆత్మను నింపాను. నేను ఆమెకథ నుండి మరియు ఆమె ప్రాక్టికల్ రియలిజమ్ నుండి ధైర్యాన్ని పొందాను” అని వ్రాసుకున్నారు.
ఈ విధంగా అరవైల నుండి డెబ్భైల వరకు గాంధేయురాలిగా వివిధ ఉద్యమాలలో పాల్గొని, చిన్నవయసు వారికి మార్గదర్శకురాలై నిలిచి, తన ప్రాణాలకంటే జాతీయజెండా, స్వాతంత్ర్యం ముఖ్యమని భావించి ప్రాణత్యాగం చేసి – జెండాని నేల మీద వాలిపోకుండా కాపాడిన అపర వీరనారీశిరోమణి, 73 సంవత్సరాల గాంధీబురి ధన్యురాలు.
ఆమె జ్ఞాపకార్థము ‘తమ్లుక్ జాతీయ ప్రభుత్వం’ 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 17-12-2002 వ తేదీన 5 రూపాయల విలువతో ఒక స్టాంపు విడుదలయింది. అజోయ్ కుమార్ ముఖర్జీ స్టాంపుతో కలిపి 2 Stamps of Se-Tenant గా విడుదలయింది.
అక్టోబర్ 19 వ తేదీన ఈమె జయంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet