Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆధునిక ప్రపంచపు అదృశ్య భయాలు, సంక్షోభాలను వ్యక్తీకరించిన కవిత ‘అపరిచిత గాథ’

[శ్రీ నందిని సిధారెడ్డి గారి ‘అపరిచిత గాథ’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

ప్రముఖ కవి, రిటైర్డ్ తెలుగు భాషా ఉపన్యాసకులు (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట), తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ నందిని సిధారెడ్డి కలం నుండి జాలువారిన ‘అనిమేష’ ఉపద్రవగాథ కావ్యంలోని ‘అపరిచిత గాథ’ కవితపై విశ్లేషణా వ్యాసం ఇది. శీర్షికకు తగ్గట్టుగానే ‘అపరిచిత గాథ’ కవిత ఒక నిగూఢమైన వేదనను, ఊహించని జీవిత సంక్షోభాన్ని ఆవిష్కరిస్తుంది. ఇందులోని ప్రధాన వస్తువు – నమ్మిన విలువలు, కన్న కలలు అకస్మాత్తుగా విచ్ఛిన్నమైతే కలిగే మానసిక వేదనే. ఈ కవిత లోతైన భావోద్వేగాలను, విరుద్ధ చిత్రాలను, అంతర్మథనాన్ని ఎంతో చైతన్యవంతంగా వ్యక్తపరుస్తుంది. ఇందులో ఆశాభంగం, అంతరంగ విరామం, మానవ సంబంధాల పతనం ప్రధాన భావాలుగా కనిపిస్తాయి. కరోనా వైరస్ సృష్టించిన అభద్రతా భావాన్ని ఆధునిక మానవుడి మూఢ నమ్మకాలను మరియు ప్రపంచీకరణ వెనుక ఉన్న విధ్వంసకర కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించాయి. ఆధునిక ప్రపంచంలో వ్యాపించిన అదృశ్య భయం, అనిశ్చితి, గ్లోబల్ సంక్షోభాలను బలమైన ప్రతీకలతో వ్యక్తపరుస్తుంది. ఇది వ్యక్తిగత స్థాయి నుంచి సమస్త మానవ సమాజం వరకు విస్తరించే ఆటంక భావనను ప్రతిబింబించే కవిత.

ఆధునిక మానవ జీవితంలో అస్తవ్యస్తత, అసహాయత, విజ్ఞాన పరిమితి, అధికార వైఫల్యం వంటి భావాలను సంక్షిప్తంగా ప్రతిబింబిస్తుంది. కరోనా సంక్షోభం సృష్టించిన నైరాశ్యాన్ని, ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిమితులను మరియు మానవ స్వభావంలోని వైరుధ్యాలను అత్యంత లోతుగా విశ్లేషించింది. ఇప్పుడు కవితా చరణాల లోకంలోకి ప్రవేశించి, ఆ భావ సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం. కవిత్వానుభూతుల విస్తార లోకంలో విహరిద్దాం.

♠

‘నిశ్శబ్దం నివ్వెర పోయింది’

ఇది నిశ్శబ్దం కూడా ఆశ్చర్యపోయేంతటి సంఘటన. ఇది ఒక తీవ్రమైన దెబ్బను లేదా అనూహ్య పరిణామాన్ని సూచిస్తుంది. సాధారణంగా నిశ్శబ్దం అంటేనే ప్రశాంతతకు సంకేతం. కానీ ఇక్కడ నిశ్శబ్దం కూడా ఆశ్చర్యపోయింది. అంటే, జరిగిన సంఘటన బీభత్సమైనదని అర్థమవుతుంది.

‘సముద్రం సరాయించింది’

విశాలతకు, స్థిరత్వానికి ప్రతీక అయిన సముద్రం కూడా కదిలితే, ఈ ప్రపంచం అస్థిరమైంది అనే భావన కలుగుతుంది.

‘అరి చేతి స్వర్గం హఠాత్తుగా కూలిపోయింది’

అంటే మనకు దగ్గరగా ఉన్న చిన్న చిన్న ఆనందాలు, ఆశలు ఒక్కసారిగా నశించి పోవడం. అరిచేతిలో ఉన్నట్టుగా భావించిన ఆనందం, భద్రత కలిగిన ప్రపంచం ఒక్క సారిగా కుప్పకూలిపోవడం. ఇంత వరకు నమ్మిన ‘స్వర్గం’ నిజానికి మాయ మాత్రమే అని తేలిపోవడం.

‘పాలు పాల లాగే వున్నాయి’

ఇది ఒక విరోధాభాసం. బాహ్యంగా అన్నీ సరిగ్గా ఉన్నట్టు కనిపించినా, అంతర్గతంగా అలా ఉండకపోవచ్చు.

‘పాలు తాగిన కలలు విరిగిపోయాయి’

అంటే, కలల విచ్ఛిన్నమయ్యాయని అర్థం. మనం చూసే బాహ్య ప్రపంచం మారలేదు; మన దైనందిన జీవితం మామూలుగానే ఉంది. కానీ ఆ పాలను చూస్తూ కన్న తెల్లని, స్వచ్ఛమైన కలలు మాత్రం ముక్కలై పోయాయి. ఈ కవితలో ప్రతీకలు చాలా బలంగా ఉన్నాయి – పాలు నిర్మలత్వానికి, పవిత్రతకు ప్రతీక.

‘ఇల్లు భద్రమే/గొళ్ళాలు భద్రమే/ ఇంట్లో హృదయాలు ఛిద్రం/ మనుషులే ఛిద్రం ఛిద్రం’

ఇక్కడ కవి గొప్ప వైరుధ్యాన్ని చూపారు. ఇల్లు, తలుపు గొళ్ళాలు అన్నీ సురక్షితంగానే ఉన్నప్పటికీ, నిర్దోషమైన ఆశలు, బాల్య స్వప్నాలు నాశనం అవుతున్నాయి. ఇంట్లో భౌతికమైన రక్షణ ఉన్నా, మానసికమైన రక్షణ మాత్రం లేదు. ఇంట్లో నిలబడి ఉన్నా, అందులో ఉండాల్సిన హృదయాలు ఛిద్రమయ్యాయి. మనుషుల మధ్య ఉండాల్సిన అనుబంధాలు చిందర వందర అయ్యాయి అని, ‘మనుషులే ఛిద్రం ఛిద్రం’ అన్న పదం బలంగా సూచిస్తోంది. చాలా సరళమైన పదాలతో (‘పాలు’,‘గొళ్ళాలు’ వంటి) అత్యంత సంక్లిష్టమైన మనస్థితిని కవి ప్రతిబింబించారు. వస్తువుల భద్రతకు, వ్యక్తుల అభద్రతకు మధ్య ఉన్న అంతరాన్ని శక్తివంతంగా చిత్రించారు. జీవితంలో అన్నీ బాగున్నాయి అనిపించే సమయంలో లోలోపల బంధాలు ఎలా శిథిలం అవుతాయో, మనిషి ఎంత ఒంటరిగా మారుతాడో ఈ కవిత ప్రతిబింబిస్తుంది. ఈ కవితలో ముఖ్యమైన శైలీ లక్షణం విరుద్ధత. ఈ విరుద్ధత ద్వారా కవి చెప్పదలచింది ఏమిటంటే – బయటి భద్రత కంటే అంతర్గత శాంతి, మానవ సంబంధాలే ముఖ్యమైనవని. ఈ కవితలో సంక్షిప్త వాక్య నిర్మాణం ఉంది; ఇది భావాన్ని మరింత గట్టిగా వ్యక్తపరుస్తుంది. ఉపమలు, రూపకాలు విస్తారంగా ఉపయోగించబడ్డాయి – సముద్రం, పాలు, స్వర్గం వంటి వాటి ద్వారా ‘ఛిద్రం ఛిద్రం’ అనే పునరుక్తి ద్వారా భావ తీవ్రతను పెంచారు.

ఈ కవితా పంక్తులను కేవలం వ్యక్తిగత బాధగా మాత్రమే కాకుండా, సమాజంలో పెరుగుతున్న విభేదాలు, విలువల పతనంగా కూడా చూడవచ్చు. బాహ్య ప్రపంచం సురక్షితంగా కనిపించినా, మనుషుల మధ్య ప్రేమ, నమ్మకం, అనుబంధం క్షీణిస్తున్నాయని సూచిస్తుంది. ’అపరిచిత గాథ’ అనేది ఒక చిన్న కవితగా కనిపించినా, ఇది మనిషి అంతర్గత ప్రపంచం, అతని విరిగిపోయిన కలలు, సంబంధాల శూన్యతను గాఢంగా ప్రతిబింబించే ఆధునిక వేదన గాథగా నిలుస్తుంది. ఈ కవితా పంక్తులు మనకు ఒక ప్రశ్న వేస్తాయి – మన చుట్టూ ఉన్న భద్రత నిజమా? లేక మన హృదయాల పగుళ్లను దాచే మాయ మాత్రమేనా?

‘చేతుల్ని చూసి కళ్ళు భయపడతాయి/నులుముకోవడానికి లేవబోయి/ మునివేళ్ళు చతికిలబడతాయి’

మన చేతులు మనకే భయంకరంగా అనిపించడం అంటే, మనం చేసే పనుల పట్ల లోపల పశ్చాత్తాపం ఉంది అని సూచిస్తుంది. తమను తాము శుభ్రం చేసుకోవాలనే ప్రయత్నం కూడా విఫలం అవుతోంది. ఇది ఆత్మశుద్ధి అసాధ్యతను సూచిస్తుంది. సాధారణంగా కళ్ళను నులుముకోవడానికి చేతులు వెళ్తాయి‌. కానీ ఇక్కడ చేతులే శత్రువులుగా మారాయి. ‘కళ్ళు భయపడతున్నవి’ అనడంలో చేతుల ద్వారా వైరస్ లేదా ప్రమాదం సోకుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ’మునివేళ్ళు చతికిలబడటం’ అంటే, ఒక పని చేయబోయి భయంతో ఆగిపోవడాన్ని కవి ‘చతికిలబడటం’ అనే పదంతో అద్భుతంగా వ్యక్తీకరించారు. సహజమైన స్పర్శ కూడా ఇక్కడ భారంగా మారింది.

‘కడుక్కోవటానికి వెళ్ళినప్పుడల్లా/వాష్ బేసిన్ మీది అద్దం చిట్లుతుంది/మాటి మాటికీ/మన వైపు చూస్తూ/సబ్బు కిసుక్కుమంటుంది’

మన ప్రతిబింబం పగిలిపోవడం అంటే మన వ్యక్తిత్వ స్వరూపం విభజన. ఇది అద్భుతమైన మానవీకరణ. అద్దం చిట్లడం అంటే మనిషి తన రూపాన్ని చూసి తానే భయపడటం, లేదా తన అస్తిత్వం ముక్కలవ్వడం అని భావించవచ్చు. ‘సబ్బు కిసుక్కుమంటుంది’ అనే వ్యక్తీకరణలో, మనిషి పడుతున్న తపనను చూసి ప్రకృతి లేదా కాలం వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. శుభ్రతకు ప్రతీక అయినది కూడా ఇక్కడ వ్యంగ్యంగా మారి మన తప్పులను ఎగతాళి చేస్తున్నట్టు భావం కలుగుతుంది.

‘పాలపాకెట్లు కడగటానికి/శుభ్రహస్తాలు మొరాయిస్తాయి’

పాలపాకెట్లు, శుభ్రహస్తాలు నిర్మలత్వానికి సంకేతాలు. అవే మొరాయిస్తున్నాయి అంటే, పాప భీతి అంతగా పెరిగి నిర్మలతే దూరమై పోయిందని అర్థం. పాలు, నిత్యావసర వస్తువులను కూడా కడగాల్సివస్తున్న పరిస్థితి. ఒక విచిత్రమైన మన వ్యవస్థను సూచిస్తుంది. ఎంత కడిగినా అవి ఇంకా అపరిశుభ్రంగానే ఉన్నాయేమో అన్న భావం (ఫోబియా) ఇక్కడ వ్యక్తమవుతోంది.

ఈ కవితలో సాధారణ వస్తువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. చేతులు సహకరించకపోవడం కవి మనసులోని వికృత ప్రతిబింబాలను సూచిస్తుంది.

‘తెలియకుండానే/ముట్టకుండానే/ చూరులోంచి భయం/పొడిపొడిగా రాలుతుంది’

ఇక్కడ భయం స్పష్టమైన కారణం లేకుండానే ఉద్భవిస్తోంది. అది దుమ్ములా నెమ్మదిగా మనపై పడుతుంది. కానీ నిరంతరం కొనసాగుతూ, అస్పష్టమైన ఆందోళనకు బలమైన రూపంగా మారుతోంది.

‘తెలియకుండానే’, ‘ముట్టకుండానే’ అనే పదాలు అభద్రతా భావాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ‘చూరులోంచి భయం’ అనే ప్రతీక చాలా ప్రభావవంతంగా ఉంది. మన ఇంటి పైకప్పు మనకు రక్షణ ఇవ్వాలి. కానీ, అక్కడ నుంచే భయం రాలుతుంది అని చెప్పడం ద్వారా ఆందోళన గాలిలోనూ, పరిసరాల్లోనూ విస్తరించి ఉంది అని కవి సూచిస్తున్నారు. వాష్ బేసిన్ మీది అద్దం, సబ్బు, పాలపాకెట్లు వంటి సాధారణ వస్తువుల ద్వారా కవి అసాధారణ భయాన్ని సృష్టించారు. ‘సబ్బు కిసుక్కుమంటుంది’, ‘అద్దం చిట్లుతుంది’ వంటి వాక్యాల ద్వారా జడ వస్తువులకు జీవం ఇచ్చారు. ఈ కవితలో సంక్షిప్తత స్పష్టంగా కనిపిస్తుంది – చిన్న పంక్తుల్లోనే గాడమైన భావాలను వ్యక్తం చేశారు. పునరుక్తి మరియు లయ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ‘మాటిమాటికి’ వంటి పదాలు భావాన్ని బలపరుస్తాయి. మొత్తంగా ఈ కవిత – మనుషుల మనసులో దాగి ఉన్న పాప భీతిని, స్వీయ విరక్తిని గాఢంగా ప్రతిబింబిస్తుంది. సాధారణ దినచర్య దృశ్యాల ద్వారా కవి ఒక లోతైన మానసిక స్థితిని వ్యక్తం చేశారు. ఈ కవితా పంక్తుల్లో అంతర్గత భయం మరియు ఆత్మ నింద ప్రధానంగా ప్రతిఫలిస్తున్న భావాలు.

ఈ కవిత మనిషి అంతరంగంలో జరుగుతున్న సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. బయట శుభ్రత కోసం చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ, లోపల మాత్రం పాప భీతి, భయం, విచ్ఛిన్నత కొనసాగుతూనే ఉంటాయి. అందువల్ల శరీరం శుభ్రం కావచ్చు గానీ, మనస్సు శుభ్రం కాకపోతే భయం వెంటాడుతూనే ఉంటుంది. ఈ కవితలో కవి మనిషి అంతర్గత అశాంతిని అత్యంత సృజనాత్మకంగా చిత్రించారు. సాధారణ జీవితంలోని చిన్న చిన్న దృశ్యాల ద్వారా మనసులో దాగి ఉన్న భయం ఎంత లోతుగా, మన జీవనాన్ని ప్రభావితం చేస్తుందో స్పష్టంగా చూపించారు. ఇది ఒక మానసిక వేదనకు ప్రతీకాత్మక చిత్రంగా నిలుస్తుంది‌. అలాగే, ఈ కవిత కరోనా కాలం నాటి భయానక వాతావరణాన్ని, లేదా ఒక అదృశ్య భయం కారణంగా మనిషి దైనందిన జీవితం ఎంతగా అతలాకుతలమైందో అత్యంత ప్రభావవంతంగా తెలియజేస్తుంది. అపనమ్మకం, అస్పృశ్యత, అంటువ్యాధి భయం వల్ల మనిషి తన సొంత అవయవాలనే అనుమానించే మానసిక స్థితిని ఇది ప్రతిబింబిస్తుంది. ఈ కవిత కేవలం అంటువ్యాధి గురించిన భయాన్ని మాత్రమే కాదు; ఆధునిక సమాజంలో మనుషుల మధ్య పెరిగిన దూరాన్ని, ఒకరినొకరు తాకడానికి భయపడే ఒంటరితనాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.

‘తలుపులకవతల/ఏ ద్రోహం తచ్చాడుతుందో తెలువదు/ఏ అపరిచిత పరాన్నజీవి/పూరిక్కల మీద పారాడుతుందో/గన్నేరుచెట్టు ఎరుగలేదు’

మన గృహం అనే సురక్షిత స్థలం ఇప్పుడు అనిశ్చితితో నిండి ఉంది. శత్రువు ఎవరో? ఎక్కడో తెలియని భయం మనసును పట్టుకుంది. ఇది కనిపించని ద్రోహం, అపరిచిత భయం. తలుపు బయట ఏ శత్రువు పొంచి ఉందో తెలియని ఒక వింత పరిస్థితిని కవి వర్ణించారు. ‘పరాన్నజీవి’ అనే పదం ద్వారా కవి ఒక ప్రత్యేక వైరస్ మరియు సూక్ష్మ శత్రువును సూచిస్తున్నారు. ఇది కనిపించదు, కానీ దాని ప్రభావం ఘోరంగా ఉంటుంది. గన్నేరుచెట్టు ప్రకృతి యొక్క అమాయకత్వానికి ప్రతీకగా నిలుస్తుంది; ప్రకృతికి ఈ ప్రమాదం అర్థం కాని స్థితిని ఇది సూచిస్తుంది. ఇక్కడ వైరస్‌ను ఒక అపరిచిత పరాన్నజీవిగా పేర్కొంటూ, అది ప్రకృతిలో గన్నేరుచెట్టుకే తెలియకుండా ఎలా కలిసిపోయిందో కవి చెప్పారు. మనిషి నిర్మించుకున్న రక్షణ కవచాలన్నీ ఈ సూక్ష్మజీవి ముందు విఫలం అయ్యాయని దీని అర్థం.

‘ఇంటి ముందట కట్టిన భేతాళ యంత్రం/ఇక పని చెయ్యదు/ నరదిష్టి కానక్కరలేదు’

ఈ కవితా పంక్తుల ద్వారా కవి పాత కాలపు దిష్టి నివారణ పద్ధతులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తాయెత్తులు, దిష్టిబొమ్మలు, నరదిష్టి యంత్రాలు వంటి సంప్రదాయ నమ్మకాలు కంటికి కనిపించని కీడును అరికడతాయని మనం నమ్ముకున్నాం. అయితే కంటికి కనిపించని వైరస్ వంటి ఆధునిక ముప్పుల ముందు అవి పూర్తిగా విఫలం అవుతున్నాయి. అంటే, ఆధునిక సమస్యలకు పాత పరిష్కారాలు సరిపోవు అని కవి స్పష్టంగా తెలియజేస్తున్నారు. మనిషి భయం ఎంత ప్రాచీనమైనదో, ఈ వైరస్ తెచ్చిన ముప్పు అంత ఆధునికమైనది. ఈ విరుద్ధతను కవి చాలా పదునైన రీతిలో వ్యక్తపరిచారు.

“జలచరమౌనో/గుహచరమౌనో/ చెట్టుకు వేలాడేనో/జంతువు దవడలో కదలాడేనో/దిష్టి ఏదో గుర్తు దొరకదు’

మూలాలను అన్వేషిస్తూ – వైరస్ ఎక్కడి నుండి వచ్చింది? జలచరమా? గుహల్లో నివసించే గబ్బిలమా? చెట్లపై ఉండే ప్రాణులా? లేక జంతువుల నుంచా? అనే అయోమయాన్ని కవి వ్యక్తపరుస్తారు. శత్రువు ఎవరో మనకు స్పష్టంగా తెలియనప్పుడు ఎవరిని నిందించాలి? శత్రువు తెలియనప్పుడు కలిగే బాధ, అనిశ్చితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ ‘దిష్టి’ అనేది ఒక విస్తృత ప్రతీక – వైరస్, భయం, అనిశ్చితి, మానవ దుర్బలతకు సంకేతంగా నిలుస్తుంది.

‘నరదిష్టి కానక్కరలేదు/కకావికలం చెయ్యటానికి/కనిపించని ఏ దిష్టి అయినా చాలు’

ఇది మనుషుల వల్లే కాదు, కనిపించని సూక్ష్మ శక్తుల వల్ల కూడా నాశనం సంభవిస్తుంది.

‘చంపటానికి కత్తే అక్కర్లేదు/ ఉరితీయడానికి తాడే అక్కర్లేదు’

పూర్వం హింస అంటే కత్తి, తాడు ఆయుధాలు. ఇప్పుడు హింస కనిపించని రూపాల్లో ఉంటుంది. మాటల ద్వారా మనసును గాయపరచడం, మానసిక ఒత్తిడి, అసత్య ప్రచారం, సాంకేతిక ప్రభావాలు. కనిపించని గాయాలు లోతుగా మిగులుతాయి. మాటల ముసుగులో మనసులు చీలిపోతాయి. నిశ్శబ్దంగా మనుషుల్ని విరిచేస్తుంది. హింసకు సాంప్రదాయ ఆయుధాలు అవసరం లేదు. ఆధునిక కాలంలో అదృశ్య శక్తులే ఘోరమైనవి.

‘ప్రపంచీకరణ యుద్ధానికి/అణుబాంబులు అక్కరలేదు/వైరస్ చాలు’

ఇది కవితలో అత్యంత శక్తివంతమైన పంక్తి. గ్లోబల్ ప్రపంచంలో ఒక చిన్న వైరస్ కూడా ప్రపంచాన్ని స్తంభింపజేయగలదు. ఇది ఆధునిక యుగంలోని పాండమిక్ భయాన్ని ప్రతిబింబిస్తుంది. ఆధునిక యుద్ధం వైరస్ రూపంలో కనిపిస్తున్నది అనే భావన ఇక్కడ వ్యక్తమవుతోంది. ఒక దేశాన్ని నాశనం చేయడానికి ఇప్పుడు కత్తులు, ఉరితాళ్లు లేదా భారీ అణు బాంబులు అవసరం లేదు అని కవి హెచ్చరిస్తున్నారు. ప్రపంచీకరణ వల్ల దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోయి, మనుషుల రాకపోకలు పెరగడం వల్ల ఒక చిన్న వైరస్ ప్రపంచాన్ని హడలెత్తించింది అనే భావాన్ని వ్యక్తం చేశారు. అగ్రరాజ్యాల అహంకారాన్ని ఒక సూక్ష్మజీవి మట్టి కరిపించింది అనే భావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.

‘మనిషి హడల్/దేశాలు హడల్/ ప్రపంచమే హడల్ హాడల్’

హడల్ అనే పునరుక్తి ద్వారా భయం వ్యక్తి నుంచి దేశం వరకు వ్యాపించింది అని చూపించారు. ‘హడల్ హడల్’అనే పద ప్రయోగం భయ తీవ్రతను మరింత పెంచుతుంది. ప్రశ్నారూప వాక్యాలు అనిశ్చితి, ఆందోళనను వ్యక్తపరుస్తాయి. ప్రతీకాత్మకంగా వైరస్, దిష్టిబొమ్మలు, యుద్ధం వంటి భావాలను కవి ఉపయోగించారు.

ఈ కవిత మనకు చెప్పేది ఏమిటంటే – మనం నిర్మించిన భద్రతా వ్యవస్థలు, తలుపులు, యంత్రాలు నిజమైన రక్షణను ఇవ్వలేవు. డబ్బు అనే శత్రువు కంటికి కనిపించకపోయినా, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అంటే,ఆధునిక యుగంలో భయంకరమైనవి కనిపించని శక్తులే.

ఈ కవిత ఆధునిక ప్రపంచపు అసహాయ స్థితిని ప్రపంచీకరణలో దాగి ఉన్న ప్రమాదాలను, మానవుని చిన్నతనాన్ని గాఢంగా ప్రతిబింబిస్తుంది. ఇది ఒక అదృశ్య గాథ. కత్తులు, బాంబులు లేకుండానే ప్రపంచాన్ని కుదిపేసే భయానక వాస్తవాన్ని కవి చూపించారు.

ఈ కవితా పంక్తులు మానవ నాగరికత యొక్క బలహీనతను ఎత్తి చూపుతున్నాయి. మనం ఎంతటి సాంకేతిక విజ్ఞానాన్ని సంపాదించినా, యుద్ధతంత్రాలు నేర్చుకున్నా, ప్రకృతి విసిరే ఒక చిన్న సవాలు ముందు ప్రపంచమంతా మోకరిల్లక తప్పదు అని కవి హెచ్చరిస్తున్నారు. మన పాత నమ్మకాలుగానీ, కొత్త ఆయుధాలుగానీ, మన ప్రాణాన్ని కాపాడలేవు అని ఈ కవిత సూచిస్తుంది.

‘జీవితం జీవకళ కోల్పోతుంది’

జీవితం తన సహజ సౌందర్యాన్ని, ఉల్లాసాన్ని కోల్పోయి, ఆనందరహితమైన, నిస్సారమైనదిగా మారుతుంది.

‘ప్రయోగశాల వెలవెలబోతుంది’

శాస్త్రం పరిష్కారం చూపలేని స్థితి. మనం నమ్ముకున్న విజ్ఞానం కూడా నిలిచి పోయింది‌.

‘విజ్ఞాన శాస్త్రాలకు చెమటపడుతుంది’

విజ్ఞాన శాస్త్రం తానే కష్టాల్లో పడింది. ఇది మన సమస్యల తీవ్రత ఎంత ఉందో తెలియజేస్తుంది. ప్రయోగశాలలు, విజ్ఞానం, పరిశోధన. అధికారం, పాలక వ్యవస్థ వంటి ప్రతీకల ద్వారా కవి చెప్పదలచింది ఏమిటంటే – సమస్యలు అంత తీవ్రమైపోయాయి కాబట్టి విజ్ఞానశాస్త్రం కూడా తడబడుతోంది. విజ్ఞాన శాస్త్రపు నిస్సహాయతను చూపిస్తూ, సాధారణంగా ఏ సమస్యకైనా పరిష్కారం చూపే ప్రయోగశాలలు (ల్యాబ్స్) ఈ వైరస్ ముందు వెలవెలబోతున్నాయి అని కవి వర్ణించారు. ఎంతటి మేధావులకైనా,శాస్త్రవేత్తలకైనా ఈ వింత వ్యాధి అంత చిక్కక చెమటలు పట్టించడం అనేది ఆధునిక విజ్ఞానం ఎదుర్కొన్న అతి పెద్ద సవాలుకు ప్రతీకగా నిలుస్తుంది.

‘అధికారం తలపట్టుకుంటుంది’

ఈ పంక్తి ద్వారా, పాలకులు పరిస్థితిని నియంత్రించ లేక, ఏమి చేయాలో తెలియక అసహయంగా ఉన్న దుస్థితిని కవి వ్యక్తపరిచారు. ఇది వ్యవస్థలోని వైఫల్యాన్ని సూచిస్తుంది.

‘జరుగుతున్నదేదో/ జరుగవలసిందేదో/అంతుపట్టక/ జగమే చిన్నబోతుంది’

ఈ పంక్తులు వాస్తవం మరియు ఆశయం మధ్య గందరగోళం నెలకొనడం, సమాజంలో ఏర్పడిన అనిశ్చితికి సంకేతం. ప్రపంచం తన విశాలతను కోల్పోయి చిన్నది అయిపోయినట్లు అనిపిస్తోంది. ఇక్కడ భయం, సమస్యలు మన ప్రపంచాన్ని సంకుచితం చేస్తున్నాయి అనే భావం స్పష్టంగా వ్యక్తమవుతోంది. ఇది మానసిక సంక్షోభానికి సూచిక. ఈ కవితలో చిన్న పంక్తుల్లోనే పెద్ద భావాలు వ్యక్తం అవుతున్నాయి. జీవితం, ప్రయోగశాల, అధికారం వంటి అంశాలు ప్రతీకలుగా ఉపయోగించబడ్డాయి. వ్యక్తి, శాస్త్రం, అధికారం, ప్రపంచం అనే స్థాయిల్లో భావ విస్తరణ కనిపిస్తుంది. ఈ కవిత మనకు చెప్పేది ఏమిటంటే – జీవితం తన సహజ ఆనందాన్ని కోల్పోయింది. సమస్యల ముందు విజ్ఞానం కూడా అసమర్థంగా మారుతోంది. అధికార వ్యవస్థలు విఫలం అవుతున్నాయి. దాని ఫలితంగా ప్రపంచం మొత్తం గందరగోళంలో పడింది. అంటే, మనిషి నిర్మించిన అన్ని వ్యవస్థలు ఒకేసారి పరీక్షకు గురి అవుతున్నాయి. మొత్తానికి, ఈ కవిత ఆధునిక కాలంలోని సంక్షోభాన్ని, మానవుని అసహాయతను, విజ్ఞానం మరియు అధికారాల పరిమితులను సూటిగా, గాఢంగా ప్రతిబింబిస్తుంది. ఇది అనిశ్చితి మధ్యలో నిలిచిపోయిన మానవ జీవితాన్ని ఆవిష్కరిస్తుంది.

‘సంతలోకి వెళ్లకుండా ఉండగలడా మనిషి/సముద్రంలోకి వెళ్లకుండా బతకగలడా మనిషి/రోడ్డు మీదకి పోకుండా తరించగలడా మనిషి’

సంత అంటే అంగడి. వారానికి ఒక రోజు జరిగే సంతకు వెళ్లి, మనుషులు తమకు అవసరమైన వివిధ రకాలైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాంటి సంతలోకి వెళ్లకుండా ఉండగలడా మనిషి? అని కవి ప్రశ్నిస్తున్నారు. సమాజం అనేది మనుషుల పరస్పర సంబంధాల సమాహారం. మనిషి సమాజం లేకుండా జీవించలేడు. రోడ్డంటే ప్రయాణం, కదలిక. జీవితం అనేది స్థిరంగా ఉండదు; అది ఎప్పటికప్పుడు ముందుకు సాగాల్సిందే. ఈ మూడు ప్రశ్నల ద్వారా కవి చెప్పేది ఏమిటంటే: మనిషి కొన్ని అనివార్య పరిస్థితుల నుంచి తప్పించుకోలేడు. ఇక్కడ ప్రతీకలు ఇలా ఉన్నాయి – సంత: సమాజ జీవనం. సముద్రం: జీవన పోరాటం, అనిశ్చితి. రోడ్డు: కాల ప్రవాహం, ప్రయాణం. ఇవన్నీ కలిసి మనిషి జీవితంలోని విభిన్న దశలను సూచిస్తున్నాయి. మనిషి పుట్టుకతోనే ఒక సామాజిక జీవి. సంతలోకి వెళ్లకుండా, సముద్రంలోకి వెళ్లకుండా, రోడ్డు మీద అడుగు పెట్టకుండా, మనిషి జీవించలేడు. అది కేవలం అవసరం మాత్రమే కాదు, మనిషి సహజ స్వభావం. లాక్‌డౌన్ వంటి ఆంక్షలు మనిషి సహజ స్వభావాన్ని బంధించాయి. ఆ బంధనం మనిషిని మానసికంగా కుంగదీసింది అని కవి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఒక పక్క విప్పబోతుంటే/మరొక దగ్గర తప్పి పడుతున్న/చిక్కుముడి కదా మనిషి/చిక్కు చిక్కుల ముడి మనిషి జీవితం’

సమస్యను పరిష్కరించాలనుకుంటే మరో సమస్య ఎదురవుతుంది; జీవితం ఎప్పుడూ సులభంగా సర్దుబాటు కాని సంక్లిష్ట ప్రక్రియ. మనిషి స్వభావం, ఆలోచనలు, సంబంధాలు గందరగోళంతో నిండి ఉంటాయి. ‘చిక్కు చిక్కుల ముడి మనిషి జీవితం’ అనే పునరుక్తి ద్వారా ఈ సంక్లిష్టతను కవి మరింత బలంగా వ్యక్తం చేశారు. ఇందులోని ప్రశ్నారూప శైలి పాఠకుడిని ఆలోచింపజేస్తుంది. ‘చిక్కు చిక్కుల ముడి’అనే పద ప్రయోగం భావ గాఢతను పెంచుతుంది. జీవితం చిక్కు ముడి అనే ప్రధాన రూపకంతో చిత్రీకరించబడింది.

ఈ కవిత మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది. మనిషి సమాజం, పరిస్థితులు, జీవన పోరాటం నుంచి తప్పించుకోలేడు. సమస్యలు ఒకటి కాదు, వరుసగా వస్తూనే ఉంటాయి. జీవితం సూటిగా సాగేది కాదు ; అది ఎప్పుడూ చిక్కులతో నిండి ఉంటుంది. అంటే, జీవితం అనేది పరిష్కారాల కంటే సమస్యలతో కూడిన నిరంతర ప్రయాణం.

ఈ కవిత మనిషి జీవితాన్ని చాలా సరళమైన, కానీ గంభీరమైన రూపకంతో చిక్కుముడిగా చూపిస్తుంది. మనిషి జీవితం విప్పాలనుకుంటే మరింత చిక్కబడే ముడిలా ఉంటుంది. దానిని పూర్తిగా విప్పడం సాధ్యం కాదు ; దానితో కలిసి జీవించడం నేర్చుకోవడమే అసలైన సవాలు.

చిక్కుముడి – మానవ జీవితం: ఈ కవితలో ఒక గొప్ప తాత్విక చింతన ఉంది. ఒక సమస్యను పరిష్కరిస్తున్నాం అని అనుకుంటూ ముడిని విప్పుతుంటే, మరో చోట కొత్త సమస్య పుట్టుకొస్తుంది. మనిషి జీవితమే చిక్కుముడి. వైరస్‌ను అరికట్టడానికి దూరం పాటిస్తే ఉపాధి కోల్పోతాడు. ఈ రెండింటి మధ్య నలిగిపోయే మనిషి స్థితిని ‘చిక్కు చిక్కుల ముడి’ అని కవి అభివర్ణించారు.

కోట్లాది జనాభా ఉన్న ఈ ప్రపంచం, కరోనా దెబ్బకు నిశ్శబ్దంగా మారిపోయింది. కళకళలాడాల్సిన జీవితం జీవకళను కోల్పోవడం, మానవ నాగరికత ఎదుర్కొన్న ఒక చీకటి కాలాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కవిత కేవలం అనారోగ్యం గురించి మాత్రమే చెప్పడం లేదు; ఇది మనిషి స్వేచ్ఛకు, సామాజిక అవసరాలకు మధ్య జరుగుతున్న సంఘర్షణను చూపిస్తుంది. ఎంతటి మేధావి అయినా ప్రకృతి విసిరే ఈ చిక్కుముడిని విప్పడం అంత సులభం కాదు అని ఈ కవిత హెచ్చరిస్తోంది.

‘రోడ్లు మాస్కులు వేసుకొని/కావలి కాస్తాయి’

ఈ రూపకం ద్వారా నగర జీవితం మూగబోయింది అని సూచించబడింది. సాధారణంగా మనుషులే మాస్కులు ధరిస్తారు. కానీ ఇక్కడ కవి, రోడ్లు మాస్కులు వేసుకొని కావలి కాస్తున్నాయి అని ఒక వినూత్నమైన ఊహను వ్యక్తం చేశారు. నిర్మానుష్యంగా మారిన రోడ్లు, వాటిపై తిరగని జనాలు – ఇవన్నీ చూసి రోడ్లే ముసుగు వేసుకున్నట్టుగా అనిపిస్తుంది. రొదలేని బస్సులు, విశ్రాంతి తీసుకుంటున్న విమానాలు – లాక్‌డౌన్ కాలంలోని నిశ్శబ్దాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి.

‘రైళ్ళు లేక/పట్టాలు చెట్టాపట్టాలేసుకుంటాయి’

ఈ కవితా పంక్తిలో రైళ్ళు లేకపొవడంతో పట్టాలు నిరుపయోగంగా మారి ప్రకృతిలో కలిసిపోతున్నాయి అనే భావం వ్యక్తమవుతోంది. ‘రైలు పట్టాలు చెట్టాపట్టాలు’ అనే రూపకం ద్వారా ప్రకృతి పునరుద్ధరణను కవి చక్కగా సూచించారు. రైళ్ళు తిరగకపోవడంతో పట్టాలు ఒక దానికొకటి తోడుగా చెట్టాపట్టాలేసుకున్నట్లుగా వర్ణించడం కవి భావనా శక్తికి నిదర్శనం. నిరంతరం యంత్రాల రాపిడికి గురయ్యే పట్టాలకు కూడా ఈ విరామం ఒక విశ్రాంతిగా అనిపించింది అనే భావం ఇందులో వ్యక్తమవుతోంది.

‘రెక్కలు మూసుకొని/విమానాలు విశ్రమిస్తాయి’

ప్రపంచీకరణకు ప్రతీకలైన విమానాలు కూడా నిలిచి పోవడంతో, ప్రపంచం తన వేగాన్ని కోల్పోయింది.

‘దుకాణాలు తెరిచినా రెప్పపాటే/ సూపర్ మార్కెట్లు/ట్రేలు తెరిచి తెల్లబోవచ్చు’

దుకాణాలు తెరిచినా రెప్ప పాటే మూతపడుతున్నాయి‌. సూపర్ మార్కెట్లు, ట్రేడింగ్ కేంద్రాలు తెరిచి ఉన్నా వెలవెలబోతున్నాయి. కొనుగోలు శక్తి చలనం తగ్గిపోవడంతో మార్కెట్లు దిగ్బ్రాంతికి గురయ్యాయి. సాధారణంగా సూపర్ మార్కెట్లు, దుకాణాలు జనాలతో కిటకిటలాడుతూ ఉండాలి. కానీ ఇప్పుడు అవి జనాలు లేక వెలవెలబోతున్నాయి. వినియోగదారుడు లేని వాణిజ్య ప్రపంచం ఎంత నిర్జీవంగా మారుతుందో ‘తెరిచి ఉన్న ట్రేలు తెల్లబోవడం’ అనే పదబంధం స్పష్టం చేస్తోంది. అంగడిలో సరుకులు ఉన్నా, వాటిని కొనుగోలు చేసే మనిషి లేకపోవడం వల్ల కనిపించే నిస్సహాయత ఇక్కడ ప్రతిబింబిస్తోంది.

‘ఆసుపత్రులు కోమాలో స్పృహకోల్పోవలసిందే/ వెంటిలేటర్లు కూడా డౌటే’

ఆసుపత్రులు కోమాలోకి వెళ్లినట్టుగా, స్పృహ కోల్పోయినట్టుగా కనిపిస్తున్నాయి. వెంటిలేటర్లు కూడా సరిపోవా? అన్న అనుమానం ఉంది. రోగులను కాపాడాల్సిన రక్షణ కేంద్రాలైన ఆసుపత్రులు అసహాయంగా మారిన దృశ్యం కనిపిస్తోంది. ప్రాణ రక్షణ పరికరాలపై కూడా అనిశ్చితి కొనసాగుతోంది. ఇది మహమ్మారి తీవ్రతను బలంగా తెలియజేస్తోంది. ఆసుపత్రుల కోమా స్థితి: సాధారణంగా ఆసుపత్రులు రోగులను కోమా నుండి బయటకు తేవాలి. కానీ కరోనా ప్రభావంతో ఆసుపత్రులే కోమాలోకి వెళ్లినట్టుగా అనిపిస్తోంది. ఇది వైద్య వ్యవస్థ ఎదుర్కొన్న అతి పెద్ద సంక్షోభాన్ని సూచిస్తుంది. వెంటిలేటర్లు కూడా సరిపోని ఆ దారుణ స్థితిని ‘డౌట్’ అనే పదంతో భయానకంగా వ్యక్తపరిచారు.

‘మంచిదే/మనిషి రోడ్డున పడకూడదు’

మనిషి రోడ్డు పైకి రావడం,బయట తిరగడం ప్రమాదకరం.

‘నలుగురు కూడిన చోట/ఏ రోగం నెలవై ఉందో/నలుగురు కూడితే/ తగని రోగం తగులవచ్చు/ నరలోకానికి నాశనగాలం రావొచ్చు’

నలుగురు కూడిన చోట సామాజిక దూరం పాటించాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది. ‘తగని రోగం తగులవచ్చు’ అనేది కరోనా వ్యాధి వ్యాప్తిపై ఉన్న భయాన్ని వ్యక్తపరుస్తోంది. ‘నలుగురు కూడిన చోట నారాయణుడు ఉంటాడు’ అనే పాత సామెతకు విరుద్ధంగా, ‘నలుగురు కూడితే తగని రోగం రావచ్చు’ అని కవి హెచ్చరిస్తున్నారు. సామాజిక సంబంధాలే శాపంగా మారిన కాలాన్ని ‘నరలోకానికి నాశనగాలం’గా అభివర్ణించారు. మనిషి ప్రాణం కాపాడుకోవాలంటే ఇతర మనుషుల నుండి దూరంగా ఉండటమే సరైన మార్గం అని కవి సందేశం. ఈ కవితా పంక్తులు కేవలం లాక్‌డౌన్ దృశ్యాలను మాత్రమే వర్ణించకుండా, మానవ నిర్మిత వ్యవస్థలు – రైళ్ళు, విమానాలు, ఆసుపత్రులు – ప్రకృతి ప్రకోపం ముందు ఎంత దుర్భలమో ఎత్తి చూపుతున్నాయి. మనిషి తన ఉనికిని కాపాడుకోవడానికి తన సామాజిక స్వభావాన్ని కూడా త్యాగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. రోడ్లు, రైలు పట్టాలు, విమానాలు ఇవన్నీ జీవం పొందినట్లు వర్ణించబడ్డాయి. రద్దీకి బదులుగా నిశ్శబ్దం, కదలికకు బదులుగా విరామం కనిపిస్తుంది. సూటి, హెచ్చరికాత్మక భాష పాఠకుడిని అప్రమత్తం చేస్తోంది. ఈ కవిత మనకు చెప్పేది ఏమిటంటే – ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోవచ్చు. రవాణా, మార్కెట్లు, ఆసుపత్రులు ఇవి మనిషి నిర్మించిన వ్యవస్థలు. ఒక చిన్న వైరస్ ముందు బలహీనం అవుతాయి. జీవితాన్ని కాపాడుకోవడానికి దూరం అవసరం. అంటే, ఇది మనిషి అహంకారానికి ప్రకృతి ఇచ్చే గట్టి హెచ్చరిక. ఈ కవిత ఒక మహమ్మారి సమయంలో ప్రపంచం ఎలా మారిపోయిందో గాఢమైన ప్రతీకలతో, నిశ్శబ్ద భయంతో చిత్రిస్తుంది. నిశ్చలమైన ప్రపంచంలో దాగి ఉన్న వినాశ భయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

‘దగ్గులోంచే/తుమ్ములోంచే/తుంపిళ్లలోంచే/చేతుల్లోంచే/చెప్పా పెట్టకుండా/కనిపెట్టలేకుండా/కోవిడ్ కోరలు చాస్తుంది/టీవీలు చేతులెత్తి దండం పెడతాయి/దూరం దూరం/విడ్డూరం/సామాజిక దూరమే/సమస్యకు పరిష్కారం’

కరోనా వ్యాధి వ్యాప్తి మార్గాలను కవి వరుసగా చూపిస్తూ, అది ఎంత సులభంగా మన మధ్యకు చేరుతుందో తెలియజేస్తారు. వైరస్ యొక్క అదృశ్య స్వభావాన్ని వివరించి, మనిషి గమనించక ముందే అది వ్యాపిస్తుంది అని చెబుతారు. వైరస్‌ను ఒక పిశాచి మృగంలా రూపకంగా చూపిస్తూ, దాని భీకరతను వివరిస్తారు. ప్రసార సాధనాలైన టీవీ, మీడియా కూడా అసహాయంగా మారిన పరిస్థితిని కవి చూపిస్తారు. అవి నిరంతరం హెచ్చరికలు చేస్తున్నా, సమస్యను పూర్తిగా ఆపలేక పోతున్నాయి. మనిషి సహజ స్వభావానికి సమీపం అనేది సహజం. కానీ ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితిలో సామాజిక దూరమే సమస్యకు పరిష్కారంగా మారింది. ఇది ఒక కొత్త సామాజిక భావనగా కవి పేర్కొంటారు. ఈ కవితలో ప్రధాన సందేశం ఏమిటంటే, మనుషుల మధ్య దూరం పాటించడం ద్వారానే రక్షణ పొందవచ్చు అని, కనిపించని శత్రువుగా ఉన్న కోవిడ్ వ్యాధి తుమ్ములు,దగ్గుల ద్వారా సులభంగా వ్యాపిస్తూ, కంటికి కనిపించకుండానే ప్రాణాంతకం అవుతుంది అని కవి వర్ణిస్తారు. అగ్ర రాజ్యాలను కూడా గడగడలాడించిన ఈ వైరస్ ముందు ఆధునిక సమాచార వ్యవస్థలు, టీవీలు కూడా చేతులెత్తేసినట్లు చూపించడం ద్వారా మానవ నిస్సహాయతను ఎత్తి చూపారు. ఇక్కడ కవి ఒక లోతైన వ్యంగ్యాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో సామాజిక దూరం కొత్తది కాదు; కులం పేరుతో వివక్ష చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే కరోనా కాలంలో వచ్చిన దూరం ప్రాణ రక్షణ కోసం అవసరం. ఇది పాత వివక్షకు భిన్నమైనది అని కవి వివరిస్తారు. ఇప్పుడు ఆరోగ్య రక్షణ కోసం ఏర్పడిన ఈ కొత్త దూరం ఒక ప్రత్యేకమైనది. పరిశుభ్రత ప్రాముఖ్యతను కూడా కవి తెలియజేస్తారు. చేతుల పరిశుభ్రత వైరస్‌ను నివారిస్తుంది అని కవి చెబుతారు. చిన్న చర్యలే పెద్ద ప్రమాదాన్ని నివారించగలవు అనే సందేశాన్ని అందిస్తుందీ కవిత.

మొత్తంగా, ఈ కవిత మనకు చెబుతున్నది ఏమిటంటే – వ్యాధి కనిపించదు, కానీ వేగంగా వ్యాపిస్తుంది. అందువల్ల మనిషి జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దూరం పాటించడం, పరిశుభ్రతను కాపాడుకోవడం – ఇవే రక్షణ మార్గాలు. అంటే, ప్రపంచాన్ని కుదిపేసిన ఈ సమస్యకు పరిష్కారం మన ప్రవర్తనలోనే ఉంది అని కవి సూచిస్తున్నారు. ఈ కవిత మహమ్మారి కాలంలో మానవ జీవితంలో వచ్చిన మార్పులను, భయాన్ని మరియు కొత్త సామాజిక నియమాలను సూటిగా, ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తుంది. అదృశ్య శత్రువుతో పోరాడుతున్న మానవ సమాజాన్ని ప్రతిపాదించే చైతన్య కవితగా ఇది నిలుస్తుంది.

‘శతాబ్దం కింద/చేతులు కడుక్కొమ్మని చెప్పినందుకు/సెమ్మిల్వీస్‌ను చిత్రహింసలు పెట్టి చంపింది వియన్నా’

శుభ్రంగా చేతులు కడుక్కోవాలి అని చెప్పినందుకు వియన్నా దేశంలో ఇగ్నాజ్ సెమ్మిల్వీస్‌ను తీవ్రంగా హింసించారు. విజ్ఞానాన్ని సమాజం ఎలా తిరస్కరించిందో స్పష్టంగా చూపిస్తుంది. ఇగ్నాజ్ సెమ్మిల్వీస్ అనే వైద్యుడు చేతులు కడుక్కోవడం ద్వారా వ్యాధులు తగ్గుతాయి అని చెప్పినప్పుడు అతన్ని అవమానించడం జరిగింది. 19వ శతాబ్దంలో చేతులు కడుక్కోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను అరికట్టవచ్చు అని చెప్పిన ఆ వైద్యుడిని ఆ కాలపు సమాజం పిచ్చివాడిగా ముద్ర వేసి హింసించింది. నేడు అదే చేతులు కడుక్కోవడం గొప్ప జీవన సూత్రంగా మారింది అని చెప్పడం ద్వారా, విజ్ఞానాన్ని గుర్తించడంలో సమాజం చేసిన ఆలస్యాన్ని కవి సూచించారు. ఇక్కడ కవి చరిత్రలోని ఆ అజ్ఞానాన్ని గుర్తు చేసి, నేటి పరిస్థితితో దాని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తారు.

‘ఫ్లోరెన్స్ చేతి దీపమే’

ఈ కవితా పంక్తి ద్వారా ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క సేవా స్ఫూర్తి ప్రతిబింబిస్తుంది. ఆమె వైద్య రంగానికి అందించిన విశిష్ట సేవలను కూడా ఇక్కడ ప్రస్తావించడం గమనార్హం. పరిశుభ్రత మరియు సంరక్షణ ద్వారా ఆమె వైద్య రంగానికి వెలుగునిచ్చిన చిహ్నంగా నిలిచింది. ‘చేతి దీపం’ అనే రూపకం ద్వారా ఆరోగ్యం, శుభ్రతలు జీవన మార్గాన్ని వెలిగించే దీపాలుగా కవి చిత్రించాడు.

‘బతుకాలంటే చేతులు కడగండి/ఇరువై సెకన్లు కడగండి/బతుకాలంటే అదే మంత్రం అదే తంత్రం’

ఇవి కోవిడ్ కాలంలో ప్రపంచం మొత్తం అనుసరించిన పరిస్థితిని సూచిస్తున్నాయి. ఇక్కడ కవి ‘మంత్రం – తంత్రం’ అనే పదజాలం ద్వారా శాస్త్రీయ చర్యలు కూడా ఒక రీతిగా ఆచారంలా మారిపోయాయి అని వ్యంగ్యంగా చెబుతున్నారు.

‘సినీ తారలు చేతులు కడుక్కోవటం నేర్పుతారు/నీళ్లు దొరకని వాళ్లను/వాళ్ళు చూడలేరు’

ఈ కవితా పంక్తులు తీవ్ర సామాజిక అసమానతను వెలికితీస్తాయి. ఒక వైపు మీడియా ప్రముఖులు ప్రజలకు సూచనలు ఇస్తుంటే, మరో వైపు ప్రాథమిక వనరులు లేని వర్గాల బాధను ఎవరూ పట్టించుకోకపోవడం – ఇది ఆధునిక సమాజంలోని విరుద్ధ ధోరణిని స్పష్టంగా చూపిస్తుంది. ఈ కవితలో ఒక కఠిన వాస్తవం ప్రతిబింబిస్తుంది. సినీ తారలు విలాసవంతమైన భవంతుల్లో నివసిస్తూ శుభ్రంగా చేతులు కడుక్కోవాలి అని ఉచిత సలహాలు ఇస్తారు. కానీ కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకని అట్టడుగు వర్గాల ప్రజల దీనస్థితిని వారు గమనించ లేరు. చేతులు కడగడం ఒక వర్గానికి ఆరోగ్య సూత్రం అయితే, మరో వర్గానికి అది అందని ద్రాక్షలా మారింది అని కవి ఎద్దేవా చేశారు. ఈ కవిత కోవిడ్ విపత్తును కేవలం ఒక ఆరోగ్య సమస్యగా కాకుండా, దాని వెనుక ఉన్న చారిత్రక మూలాలను మరియు సమాజంలోని ఆర్థిక అసమానతలను ప్రశ్నించే తాత్విక విశ్లేషణగా నిలుస్తుంది.

‘రోడ్డెక్కినా చావే/ఎక్కకపోయినా చావే’

ఈ పంక్తులు అత్యంత విషాదభరితమైన భావాన్ని వ్యక్తం చేస్తాయి. ఇది లాక్‌డౌన్ పరిస్థితుల్లో జీవనోపాధి కోల్పోయిన కార్మిక వర్గం ఎదుర్కొన్న దుర్భర స్థితిని ప్రతిబింబిస్తాయి. జీవితం ఒక సంకట స్థితిలో చిక్కుకుపోయిందనే నిరాశ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కవితా పంక్తులు చరిత్రలోని అజ్ఞానాన్ని గుర్తు చేస్తూ, ఆధునిక శాస్త్రాన్ని మంత్రంలా మార్చిన సమాజాన్ని విమర్శిస్తాయి. అలాగే, అసమానతలను బహిర్గతం చేస్తూ, సామాన్యుల బాధను గాఢంగా ప్రతిబింబిస్తాయి. ఇది కేవలం ఆరోగ్య సూచనల కవిత కాదు; ఇది సమాజపు అంతర్గత విరోధాలు, మానవ జీవిత విలువలు, అసమానతలపై ఒక గాఢమైన సామాజిక విమర్శ.

పేదరికం – చావుకు ఎదురీత: ‘రోడ్డెక్కితే వైరస్ చంపుతుంది, ఇంట్లో ఉంటే ఆకలి చంపుతుంది’ అనే నగ్న సత్యాన్ని రోడ్డెక్కినా చావే,ఎక్కకపోయినా చావే అనే పంక్తుల్లో బంధించారు. ఇది కేవలం ఆకలి సమస్య మాత్రమే కాదు; ఇది అస్తిత్వ పోరాటం.

‘బియ్యం లేవు మరి/బిక్కు బిక్కుమనే పిల్లలను/జోకొట్టటానికి పాటలు రావు/పాలు రావు/ మాటలు కడుపు నింపవు’

ఈ కవితా పంక్తులు ఆకలి అనే నిర్దయ నిజాన్ని ముందుకు తెస్తాయి. పిల్లల ఆకలి కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు – అది సమాజం విఫలమైంది అనే సంకేతం. కవి మాటలతో, హామీలతో, భావోద్వేగాలతో ఆకలిని తీర్చలేం అని స్పష్టం చేస్తారు. ఇది వాస్తవికతకు దగ్గరైన ఘాటు వాక్య నిర్మాణం. పాలు లేక జోలపాటలకు లొంగని ఆకలితో అలమటించే దీనస్థితిని వర్ణిస్తూ ‘మాటలు కడుపు నింపవు’ అని ఆదర్శవాదపు మాటల వెనుక ఉన్న విరుద్ధతను ఎత్తి చూపారు.

‘ఎవరికయినా కడుపు తీపి/ఎవరిదయినా కడుపుకోత’

ఈ వ్యత్యాసం ద్వారా సమాజంలోని అసమానత స్పష్టమవుతుంది. ఎవరి పిల్లలైనా తల్లిదండ్రులకు సమానమే. కానీ వనరులు ఉన్న వారికి అది కేవలం భయం మాత్రమే అయితే, వనరులు లేని వారికి అది పుట్టెడు దుఃఖంతో కూడిన కడుపుకోతగా మారుతుంది. ఈ విధంగా కవి వర్గ వ్యత్యాసాన్ని నిలదీస్తారు. ఒక వైపు సుఖసంపదలు, మరో వైపు దారిద్ర్యం – ఈ ద్వంద్వం కవితలో కఠినంగా ప్రతిఫలిస్తుంది.

‘కొలకుల్లోంచి జారిపడిందే కలతో..’

ఈ రూపకం అత్యంత కవితాత్మకమైనది. జీవితం ఒక పాత్రలా భావిస్తే, అందులో నిలువలేక జారిపోతున్నట్టుగా కవి చిత్రీకరించారు. ఇది నిరాశ, అసహాయత, విఫల ఆశల ప్రతీక.

‘కన్నీళ్లు ఆపుకున్నా/కాలం ఆపలేం’

ఇక్కడ కాలం ఒక నిర్దాక్షిణ్య శక్తిగా ప్రతిపలిస్తుంది. మన బాధలను ఆపగలిగినా, కాల గమనాన్ని మాత్రం ఆపలేం అని కవి చెప్పారు. ఈ పంక్తి జీవన సత్యాన్ని తేటతెల్లం చేస్తుంది.

‘కడుపునింపకపోయినా/కన్నీళ్లు ఇంకిపోయినా/దీపాలు వెలిగించండి/అణుశక్తి ప్రజ్వరిల్లి/పరాన్నజీవి పరారవుతుంది/దీపాలు వెలిగించండి’

కన్నీళ్లు ఇంకిపోయినా కాలం ఆగదు అని చెప్పడం ద్వారా సామాన్యుడి నిస్సహాయతను ప్రతిబింబించారు. ఇక్కడ అసలు వ్యంగ్యం బయట పడుతుంది. ప్రజల ప్రాథమిక అవసరాలు తీరకపోయినా, పై పై చర్యలతో సంతృప్తి చెందే సమాజాన్ని కవి విమర్శిస్తున్నాడు. ‘దీపాలు వెలిగించండి’ అనే పిలుపు పదేపదే రావడం గమనార్హం. ఇది ఒక ప్రతీక. ఒక వైపు ఆశ, ఐక్యత, ఉత్సాహానికి సూచికగా కనిపిస్తే, మరోవైపు అదే పిలుపును కవి ఒక వ్యంగ్యాస్త్రంగా ఉపయోగించారు.

‘ఆ పూటకు ఎల్లని కర్మజీవులు/రెన్నెల్ల సరుకులు భద్రపర్చుకొన్న/ప్రాప్తకాలజ్ఞులు భద్రజీవులు/దీపాలు వెలిగించండి’

ఈ కవితా పంక్తుల్లో వర్గ విభేదం స్పష్టంగా కనిపిస్తుంది. రోజువారీ కూలీలకు ఒక పూట సరైన ఆహారం దొరకడం కూడా కష్టమే. ధనిక వర్గం ముందుగానే సరుకులు నిలువ చేసుకుని భద్రంగా జీవిస్తుంది.

‘ప్రాప్త కాలజ్ఞులు’ అనే పదం ఇక్కడ వ్యంగ్యంగా వినిపిస్తుంది‌. అది నిజమైన తెలివితేటలను సూచించదు. స్వార్థపూరిత భద్రతను సూచిస్తుంది. ఇక్కడ ‘కర్మజీవులు’ ఆ పూటకు తిండి లేని అభాగ్యులు. ‘భద్రజీవులు’ అంటే రెండు నెలల సరుకులు ముందే దాచుకున్న తెలివైన మధ్యతరగతి ఎగువతరగతి ప్రజలు. దీపాలు వెలిగిస్తే అణుశక్తి పుట్టి వైరస్ పోతుంది అనే నమ్మకాలను ప్రచారం చేస్తున్న సమయంలో, అసలు అన్నం లేని కడుపుల్లో ఆకలి మంటలు ఎలా ఆరుతాయి? అనే ప్రశ్నను కవి ముందుకు తెస్తారు.

‘అణుశక్తి ప్రజ్వరిల్లి, పరాన్నజీవి పరారవుతుంది’ అనే భావం చిన్న చర్యలను అతిశయంగా చూపించే సామాజిక నినాదాలపై విమర్శగా కనిపిస్తుంది. ఆకలి, దారిద్ర్యం వంటి వాస్తవ సమస్యలను పరిష్కరించకుండా, సంకేతాత్మక చర్యలతో సమస్యలు తొలగిపోతాయి అని నమ్మే దృక్పథాన్ని కవి ప్రశ్నిస్తున్నారు. ఈ కవితలో ఆకలి అనే నిర్దయ వాస్తవం, సామాజిక అసమానత, ఆశల విఫలం, పైపై ప్రదర్శనలపై వంగ్యం, వర్గ విభేదాల గాఢ చిత్రణ – అన్నీ కలిసిపోయి శక్తివంతమైన సామాజిక కవిత్వాన్ని నిర్మించాయి. ఇది కేవలం బోధన చెప్పే కవిత కాదు; సమాజం ఎక్కడ తప్పు చేస్తుందో కళ్లకు కట్టినట్టు చూపించే అద్దం. ఈ కవితలో సామాజిక వైరుధ్యం అత్యంత పదునైన అంశంగా కనిపిస్తుంది. ఒకవైపు ప్రాణ రక్షణ కోసం దీపాలు వెలిగించే సంబరం; మరోవైపు ఆ దీపం వెలుగులో కూడా కనబడని పేదవాడి ఆకలి కేకలు. ‘దీపాలు వెలిగించండి’ అనే పునరుక్తి ద్వారా ఆ పిలుపులోని డొల్లతనం, పేదరికం పట్ల సమాజానికి ఉన్న అలసత్వాన్ని కవి ఎండగట్టారు. ఇది కేవలం కరోనా కాలానికే సంబంధించినది కాదు; అది ఆపద సమయంలో బయటపడిన సామాజిక అసమానతల ప్రతిబింబం. ఆకలి తీరని వాడికి అద్భుత పాఠాలు కూడా వెలుగు ఇవ్వలేవు. వనరులు ఉన్న వారికే భద్రత ఒక హక్కుగా మారింది అని ఈ కవిత స్పష్టం చేస్తుంది.

‘అపరిచిత గాథ’అనే అందమైన కవితను అందించిన కవి నందిని సిధారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. వారి కలం నుండి ఇలాగే మరిన్నో సుగంధభరిత కవితా సుమాలు విరబూయాలని మనసారా కోరుకుంటున్నాను.

♠

నందిని సిధారెడ్డి గారు 02-05-1954 న రైతు కుటుంబంలో జన్మించారు. వీరు బందారం గ్రామం, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లాకు చెందినవారు. వీరి తల్లిదండ్రులు రత్నమ్మ, బాలసిద్దారెడ్డి. వారి బాపు బాల సిధారెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐలో పని చేశారు. వారి బాపు తెలంగాణ రైతాంగ పోరాటంలో గ్రామ రక్షక దళం నాయకుడిగా వ్యవహరించారు. బందారం గ్రామంలో పరంపోగు భూములను దున్నించి భూమి లేని పేదలకు పంచి పెట్టారు. ‘నా ప్రేరణ మా బాపు, మా అవ్వ వారి ఆర్ద్ర గుణం నాకు చాలా ఇష్టం’ అని సిధారెడ్డి అంటున్నారు. సిధారెడ్డి చిన్నతనంలోనే బాపు నుంచి ప్రేరణ పొంది ఆభ్యుదయ భావాలను పుణికి పుచ్చుకున్నారు.

వీరి అవ్వ రత్నమ్మ తేది 14-09-2019 న ఈ లోకాన్ని వీడిపోయారు. వీరి బాపు బాలసిద్ధారెడ్డి తేది 06-10-2011 న స్వర్గస్తులయ్యారు. 1979 మే 18 న సిద్దిపేటలో సిధారెడ్డి మల్లీశ్వరిగారిని వివాహం చేసుకున్నారు. సిధారెడ్డి, మల్లీశ్వరి దంపతులకు వీక్షిత అనే ఒక్క కూతురు ఉంది. ఆమె ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించింది.

సిధారెడ్డి 1961 సంవత్సరంలో 1వ తరగతిలో ప్రవేశం పొంది, 5 తరగతి వరకు బందారం ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఆ తరువాత 6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు వెల్కటూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. వీరు 1970 వ సంవత్సరంలో 10 వ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. వీరు ఇంటర్ మరియు డిగ్రీ విద్యను 1970 నుండి 1975 వరకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభ్యసించారు. వీరు ఎం.ఏ.తెలుగు విద్యను 1976 – 1978 వరకు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం, ‘తెలుగు కవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై పరిశోధన చేసి 1981 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నుండి ఎం ఫిల్. పట్టా పొందారు. అలాగే, ‘తెలుగు కవిత్వంలో వాస్తవికత – అధివాస్తవికత’ అనే అంశంపై డాక్టర్ సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో పరిశోధన చేసి, 1986 సంవత్సరంలో పి.హెచ్.డి. పట్టాను సంపాదించారు. వీరు 1984 ఫిబ్రవరిలో మెదక్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా ఉపన్యాసకులుగా ఏపీపీఎస్సీ ద్వారా నియమించబడ్డారు. అనంతరం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేటలో తెలుగు భాషా ఉపన్యాసకులుగా పని చేస్తూ 2012 మే నెలలో పదవీ విరమణ పొందారు. తరువాత, మే 2017 లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమించబడి, 2020 వరకు బాధ్యతలను నిర్వహించారు. సిధారెడ్డి పర్యవేక్షణలో ఆరుగురు విద్యార్థులు పి.హెచ్.డి పూర్తి చేశారు. వెల్దండి శ్రీధర్, మట్టా సంపత్ కుమార్ రెడ్డి, మోతుకుల నారాయణ, లక్ష్మణ్ కుమార్, కడివెండి మమత, రాజు డాక్టరేట్ పట్టాలు పొందారు. సిధారెడ్డి మంజీరా రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక మరియు తెలంగాణ రచయితల సంఘం వంటి సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలు అందించారు. అదే విధంగా మంజీర, సోయి, జంబి, పునాస పత్రికలకు సంపాదకులుగా బాధ్యతలు నిర్వర్తించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం స్వీకరిస్తున్న శ్రీ నందిని సిధారెడ్డి

వీరు రాసిన తొలి కవిత 1974 సంవత్సరంలో మాతృభూమి ఒక లోకల్ పత్రికలో ప్రచురింపబడింది. వీరు రాసిన తొలి కథ 1974 సంవత్సరంలో గులాబీ లోకల్ పత్రికలో ప్రచురింపబడింది. కవి సిధారెడ్డిని సృజన వైపు ప్రేరేపించి ప్రోత్సాహం అందించిన గురువు తెలుగు ఉపాధ్యాయుడు అష్టకాల రామ నరసింహ శర్మ గారేనని వారు పేర్కొన్నారు.

నందిని సిధారెడ్డి ముద్రిత రచనలు:

  1. భూమి స్వప్నం – కవితా సంపుటి
  2. సంభాషణ – కవితా సంపుటి
  3. ప్రాణహిత – కవితా సంపుటి
  4. ఒక బాధగాదు – కవితా సంపుటి
  5. నది పుట్టువడి – కవితా సంపుటి
  6. ఇక్కడి చెట్ల గాలి – కవితా సంపుటి
  7. నీటి మనసు – కవితా సంపుటి
  8. నాలుగు దశాబ్దాల నందిని సిధారెడ్డి కవిత్వం –
  9. అనిమేష ఉపద్రవ గాథ కావ్యం –
  10. నాగేటి చాల్లల్ల పాటలు –
  11. చిత్ర కన్ను కథలు –
  12. కులవృత్తులు – సాహిత్యం వ్యాసాలు
  13. ఇగురం – వ్యాస సంపుటి
  14. ఆవర్తనం – వ్యాస సంపుటి
  15. నూరు పూలు ముందు మాటలు
  16. తెలుగు కవిత్వం: వాస్తవికత – అధివాస్తవికత సిద్ధాంత గ్రంథం మార్చి
  17. స్వర్ణ విహాన్ – (ఎంపిక చేసిన సిధారెడ్డి తెలుగు కవితల హిందీ అనువాదాలు)

నందిని సిధారెడ్డి రాసిన సినీ గీతాలు:

నందిని సిధారెడ్డి రచించిన నృత్య రూపకాలు:

  1. నా తెలంగాణ కోటి రత్నాల వీణ.
  2. అన్నదాత.
  3. దాశరథి.
  4. మేఘవాణి.

నందిని సిధారెడ్డి పొందిన అవార్డులు:

  1. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు
  2. దాశరథి అవార్డు
  3. విశ్వ కళాపీఠం అవార్డు
  4. సదాశివుడి అవార్డు
  5. నంది అవార్డు
  6. తేజాఆర్ట్సు – పురస్కారం
  7. రొట్టెమాకురేవు కవిత్వ అవార్డు
  8. ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ స్మారక పురస్కారం
  9. అల్లూరి సీతారామరాజు కవితా పురస్కారం
  10. తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం
  11. కృష్ణారెడ్డి స్మారక పురస్కారం
  12. పల్లా దుర్గయ్య స్మారక పురస్కారం
  13. బి.యన్. సాహితీ పురస్కారం
  14. పల్లేరు స్వయంప్రభ స్మారక పురస్కారం
  15. ఆర్ట్సు సంస్కృతి అకాడమీ పురస్కారం
  16. అనిమేష ఉపద్రవగాథ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 31-03-2026 న పొందినారు.

Exit mobile version