[శ్రీ చిటికెన కిరణ్ కుమార్ రచించిన ‘మగ్గం మాట్లాడింది’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ సందినేని నరేంద్ర.]
కవి చిటికెన కిరణ్ కుమార్ కలం నుండి జాలువారిన ‘మగ్గం మాట్లాడింది’ కవిత పై విశ్లేషణా వ్యాసం ఇది. మగ్గం బట్టలు నేసే సాధనం. మగ్గంపై పని చేసే వారిని చేనేతకారులు అంటారు. సిరిసిల్ల ప్రాంతం చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. సిరిసిల్ల ప్రాంతంలో నివసించే చేనేత కార్మికుల కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న హీనస్థితి బాధను కలిగిస్తుంది. అలాంటి దారుణమైన దృశ్యాలను చూసిన కవి హృదయం ద్రవించింది. కవి హృదయగతమైన భావాల స్పందనే ‘మగ్గం మాట్లాడింది’ అనే కవితగా ప్రాణం పోసుకుంది. ‘మగ్గం మాట్లాడింది’ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.కవిత్వానుభూతుల లోకంలో విహరిద్దాం.
“అవును మగ్గం మాట్లాడింది/పురి లేని మనసు ద్వారాన్ని/ఒకే సారి ప్రశ్నించింది/ గుండెను కండెగా చేసుకుని/నిత్యం రెండు వైపులా/బతుకు దెబ్బల పోరాటంలో/ఊగుతున్నావెందుకని!/మరి …!/ మగ్గం మాట్లాడింది!/”
ఈ కవితా పంక్తులు సామాజిక, మనోభావ కవిత్వంగా రూపుదిద్దుకున్నాయి. కవి మగ్గాన్ని ఒక సాధారణ వస్తువుగా కాక మనిషి అంతరాత్మలా తీర్చిదిద్దాడు. మగ్గం అనే జడ వస్తువుకు మాట్లాడే శక్తిని ఇచ్చాడు. మగ్గం ద్వారా మనిషి జీవన సంఘర్షణలను, అంతరంగ వేదనలను ప్రతీకాత్మకంగా వ్యక్తపరిచాడు. ఇది వస్తు మానవీకరణకు చక్కని ఉదాహరణగా కనిపిస్తుంది.
కవి మగ్గం మాట్లాడింది అని ప్రకటించాడు. అది కవితకు సహజత్వం ఉట్టిపడేలా చేసింది. సాధారణంగా మగ్గం మాట్లాడదు. మౌనంగా ఉండాల్సిన మగ్గం యంత్రం మాట్లాడటం ద్వారా కవి అంతర్గత ప్రశ్నలను బయల్పరిచాడు. మగ్గం మౌనంగా ఉన్న శ్రమజీవి, జీవితానికి ప్రతినిధి అనే భావాన్ని కవి స్థాపించాడు. మగ్గం మాట్లాడటం ద్వారా అంతర్గత ప్రశ్నలకు ద్వారం తెరుస్తుంది.
పురి లేని మనసు అనేది మనిషి మనస్సులో స్థిరత్వం లేని ఆశలు, నిరాశల మధ్య ఊగిసలాట కొనసాగుతున్న స్థితిని సూచిస్తుంది. సరైన దారిలో సాగని జీవితం, లక్ష్యం లేని ఆలోచనల వల్ల మనస్సు అయోమయంలో పడింది. ‘గుండెను కండెగా చేసుకొని’ అనేది జీవన పోరాటాల్లో భావోద్వేగాలను దాచుకొని యాంత్రికంగా మారిన మనిషిని సూచిస్తుంది. మగ్గానికి కండె ప్రాణం వంటిది. భావోద్వేగాల అదుపు, బాధను బలంగా మార్చుకోవడం, జీవన యంత్రంలో భాగమవడం అనేది మనిషి యంత్రంగా మారుతున్న స్థితిని సూచిస్తుంది. ‘నిత్యం రెండు వైపులా/బతుకు దెబ్బల పోరాటంలో/ఊగుతున్నావెందుకని’ ఇది సామాన్య జీవి ఎదుర్కొనే ద్వంద్వాన్ని సూచిస్తుంది. ఒక వైపు జీవన అవసరాలు, మరో వైపు స్వాభిమానం కోసం సాగిన పోరాటం, రెండు వైపులా దెబ్బలు తగలడం, ఎటు తిరిగినా ఏదో రకమైన బాధ గుండెను పిండినట్లుగా ఉంది. ‘ఊగుతున్నావెందుకు?’ అనే ప్రశ్న అత్యంత గంభీరమైనది. ఇది మగ్గం అడిగిన ప్రశ్న. అయినా, వాస్తవానికి మనిషి తనకు తానే వేసుకోవాల్సిన ప్రశ్న. స్థిరంగా నిలబడకుండా, అటు ఇటు ఊగిపోవడంపై ఆత్మవిమర్శ కొనసాగింది. ఇందులో మగ్గం శ్రమకు ప్రతీక. మౌనంగా సహించే వర్గానికి ప్రతినిధి. మనిషి అంతరాత్మగా మారి ప్రశ్నించే స్వరం. కవి చెబుతున్నది ఏమిటి? జీవితపు పోరాటాల్లో మనిషిని ఎందుకు యంత్రంలా మారిపోతున్నావు? అని మనసు వేసే ప్రశ్నలు మాత్రం ఆగవు. బతుకును మనం నడిపిస్తున్నామా? బతుకులో మనం ఊగిపోతున్నామా? అనే ప్రశ్నను కవి అత్యంత స్ఫూర్తిదాయకంగా వ్యక్తపరిచాడు.
ఇందులో సరళమైన భాష, సామాజిక తాత్విక ధోరణితో సాగిన గంభీరమైన భావం ఉంది. పాఠకున్ని ఆలోచింపజేసే ప్రశ్నాత్మకమైన శైలి ఉంది. ఇది కేవలం చేనేత కార్మికుల జీవితాన్ని గూర్చి వారిని ఎదురుగా నిలబెట్టి అడిగిన ప్రశ్న. రెండు వైపులా ఊగడం అనేది ఒక వైపు కుటుంబం, మరొక వైపు సమాజం, ఆకలి, ఆశలు, శ్రమ ఫలితం కోసం ఎదురు చూసే దీనస్థితిని తెలుపుతుంది. మనిషి జీవితం కూడా మగ్గంలోని కండె వలెనే నిరంతరం ఉగుతూ బతకడం కోసం కొట్టుమిట్టాడుతున్న పోరాటంగా చిత్రించబడింది.
‘మరి..!’ అనే విరామం, ప్రశ్నాత్మకమైన శైలి. ఇది పాఠకున్ని ఆలోచింపజేస్తుంది. సమాధానం చెప్పదు. ఇది కవితను విమర్శనాత్మక తాత్విక స్థాయికి తీసుకెళ్లింది. ‘మగ్గం మాట్లాడింది’ అంటే ఇది కేవలం మగ్గం మాట్లాడిన మాట కాదు. మనిషి అంతర్గత స్వరం అని స్పష్టం అవుతుంది. ఈ కవితా పంక్తులలో మగ్గం ద్వారా కవి శ్రమజీవి వేదనను, జీవన పోరాటాన్ని, లక్ష్యం లేకుండా సాగుతున్న మనిషి మనుగడను సూటిగా కాక ప్రతీకల ద్వారా ప్రభావవంతంగా వ్యక్తీకరించాడు. మగ్గం మాట్లాడింది అనేది మనిషి మౌనంగా భరించిన జీవితం ఒక్క సారిగా ప్రశ్నించినట్టుగా ఉంది. ఇది భావోద్వేగాలతో కూడినది. జీవితాన్ని ప్రశ్నించే తీరు అద్భుతంగా వ్యక్తం అవుతుంది.
“జానెడు పొట్ట కోసం/చెమట చుక్కల యాతనతో/ నేసిన గుడ్డకు ప్రతిఫలమేదని/ వార్లను పలు సార్లు చేతిలో/మరీ మరీ/తడుముతున్నావెందుకని/ అదేమని/మగ్గం మాట్లాడింది!/”
ఈ కవితా పంక్తులలో కవి మగ్గాన్ని కేవలం వస్త్రం నేయు సాధనంగా కాకుండా శ్రమజీవి తరఫున ప్రశ్నించే చైతన్యంగా నిలబెట్టాడు. ఇది సామాజిక వాస్తవాన్ని కవితాత్మకంగా వ్యక్తపరిచిన శక్తివంతమైన భావం. మగ్గం కేవలం పనిముట్టు కాదు. అది శ్రమజీవి అంతరాత్మగా, ప్రశ్నించే చైతన్యంగా రూపాంతరం చెందింది.
జానెడు పొట్ట కోసం అనే ఈ కవితా పంక్తి జీవనాన్ని అత్యంత అవసర స్థాయికి తీసుకొస్తుంది.శ్రమజీవి కేవలం జానెడు పొట్ట కోసం బతుకుతున్నాడు. కేవలం ఆకలిని తీర్చుకోవడానికి మాత్రమే శ్రమిస్తున్న దయనీయ స్థితిని సూచిస్తుంది. చెమట చుక్కల యాతనతో అనేది నిరంతరం శ్రమతో ఆకాంక్షలు ముడుచుకుపోవడాన్ని ,యౌవనం జారిపోవడాన్ని,శరీరం క్రమంగా క్షీణించడాన్ని, ఆశలు, కలలు నెమ్మదిగా కనుమరుగు కావడాన్ని తెలియజేస్తుంది. చెమట అనేది కేవలం కష్టానికి సంకేతం కాదు. శరీరం పై పడే కాలపు గాటు. తిరిగిరాని నిమిషాల జ్ఞాపకం,జీవితం మెల్లగా కరిగిపోతున్నది అన్న వేదనకు రూపం.జీవితాన్ని మౌనంగా మింగేస్తూ వెళ్లే కాలం వల్ల కలిగే అంతర్లీన బాధ.దాన్ని బయటకి చూపించే ద్రవరూపమే చెమట అని వ్యక్తం అవుతున్నదియాతన అనేది శ్రమ వెనుక ఉన్న మౌన వేదనను బలంగా తెలుపుతున్నది. ఇక్కడ చెమట చుక్కలు శారీరక కష్టం,మానసిక వేదన,నిరంతర శ్రమకు చిహ్నంగా ప్రతీకగా నిలుస్తున్నాయి.
‘నేసిన గుడ్డకు ప్రతిఫలమేదని’ – ఇది ఆర్థిక అన్యాయంపై వేసిన ప్రశ్న. శ్రమకి తగిన ఫలితం దక్కక పోవడంపై ఉన్న నిస్సహాయ ఆవేదన. కవి ఇక్కడ ప్రత్యక్ష విమర్శ చేయకుండా ప్రశ్న రూపంలో వాస్తవాన్ని ఎత్తిచూపాడు.
“వార్లను పలు సార్లు చేతిలో/మరీ మరీ/ తడుముతున్నావెందుకని/” ఇక్కడ వార్లు అనే పదం కవితకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఇవి నేసే బట్ట కొలతకు ఉపయోగించే దారాలు. కార్మికుడు నేసిన ప్రతి మీటర్ దారం అతడి శ్రమకు ప్రమాణం. కానీ, ఆ కొలతను మరీ మరీ తడుముతూ చూడడం ద్వారా యజమాని అనుమానం, కఠినత్వం, కార్మికుడి పై ఉన్న అవిశ్వాసం వ్యక్తమవుతుంది. ఇది వ్యక్తిగత సంఘటన కాదు. శ్రామికవర్గం ఎదుర్కొనే వ్యవస్థాపక అన్యాయానికి ప్రతీక. ‘అదేమని/మగ్గం మాట్లాడింది!’ అనేది ఇక్కడ కవి అద్భుతమైన మానవీకరణను ఉపయోగించాడు. మౌనంగా ఉండాల్సిన మగ్గం మాట్లాడుతుంది ఎందుకు?ఎందుకంటే మనుషులు మౌనంగా ఉన్నప్పుడు వారి బాధలను వస్తువులే ప్రశ్నిస్తున్నాయి అనే భావన ఇక్కడ వ్యక్తం అవుతుంది. మగ్గం ప్రశ్న అడగడం అంటే శ్రమ విలువను కొలిచే మనసుకు పనిముట్టే ఎదురు ప్రశ్న వేయడం. ఇది మగ్గం శ్రమజీవిని అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నలో ఆశ్చర్యం ఉంది. ఆగ్రహం ఉంది. నిస్సహాయత ఉంది. మగ్గం అడిగిన ప్రశ్న సమాజాన్ని నిలదీస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ మగ్గం మౌన శ్రమకు స్వరం. దోపిడీకి వ్యతిరేకంగా లేచిన చైతన్యం. ఇది సరైన ప్రతిఫలం లేని చేనేత కార్మికుడి శ్రమకు అద్దం పట్టింది. శ్రమజీవి హక్కుల కోసం అతని తరఫున మగ్గం ప్రశ్నిస్తున్నది. పొట్ట కోసం చేసే శ్రమ, చెమటతో నేసిన వస్త్రాలు, ఇవన్నీ సమాజానికి విలువైనవే. కానీ, వాటికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు అనే వాస్తవాన్ని ఈ కవితా పంక్తులు గట్టిగా నొక్కి చెబుతున్నాయి. ఈ కవిత కేవలం చేనేత కార్మికుడి గురించి కాదు.శ్రమ చేసే ప్రతి మనిషికి సంబంధించినది.శ్రమను కొలిచే దారం ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ, శ్రమలో దాగిన బాధ, చెమట జీవన పోరాటాన్ని కొలిచే కొలత ఎవరిది? అనే ప్రశ్న ఈ కవిత మన ముందు ఉంచుతుంది. వార్లు అంటే శ్రమకు పెట్టే ప్రమాణం. మగ్గం మాట్లాడటం మానవీకరణ. ప్రశ్నార్ధకశైలి సామాజిక చైతన్యాన్ని రేకెత్తించే విధానం. సరళమైన భాష,లోతైన భావాన్ని సూటిగా చెప్పడం. పాఠకుని హృదయాన్ని ఆలోచింపజేస్తుంది. కవి చేనేత కార్మికుడి ఒక ఆర్థిక సమస్యగా కాకుండా, ఒక మానవీయ కోణాన్ని చూపిస్తాడు. జానెడు పొట్ట కోసం కార్చే చెమటను ఆ చెమట విలువను మరీ మరీ కొలిచే వ్యవస్థపై మగ్గం చేత ప్రశ్న వేయించడం ద్వారా కవి మన సమాజంలోని బలహీనతను తెలియపరుస్తున్నాడు. ఇది శ్రమ గౌరవాన్ని కోరే ఒక మౌన నిరసన. మాటల కంటే బలమైన కవితాత్మక స్వరం. ఇది నేతకాండ్ర జీవనానికి దర్పణంగా ఉంది.
“ఆ కష్టాన్ని తీర్చడానికి/చెమట తడి వార్లను ప్రశ్నించింది!/ఆ ..తడికి కన్నీళ్ల తడి తోడై/మనసు ముద్దయ్యింది!/అయినా మళ్ళీ రమ్మని/మళ్ళీ వాటు వేయమని/మగ్గం మాట్లాడింది!”
మగ్గం ఇక్కడ కేవలం పనిముట్టు కాదు. అది శ్రమజీవిని ఓదార్చి, మళ్లీ పోరాటానికి పిలిచే జీవన స్వరం. ఈ కవితా పంక్తులలో భావోద్వేగాలు పరాకాష్ఠకు చేరినాయి. శ్రమ, కన్నీరు, ఆశ, నిరాశ, ఇవన్నీ ఒకే చోట మేళవించి కవి మగ్గాన్ని మనిషి అంతరంగ స్వరంగా నిలబెట్టాడు.
“ఆ కష్టాన్ని తీర్చడానికి/చెమట తడి వార్లను ప్రశ్నించింది” – ఇక్కడ కష్టం అనేది ఒక్క రోజుది కాదు. అది తరతరాల శ్రమ. చెమటతో తడిసిన వార్లు శ్రమకు కొలతగా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రశ్నించే స్థాయికి ఎదుగుతాయి. ఇది కవి ప్రదర్శించిన అద్భుతమైన భావ విప్లవం. శ్రమను కొలిచే సాధనం, శ్రమను ప్రశ్నించడమే కాదు, శ్రమకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తోంది.
“ఆ.. తడికి కన్నీళ్ల తడి తోడై/మనసు ముద్దయ్యింది!” – చెమట తడికి కన్నీటి తడి తోడవడం అంటే ఒకటి శారీరక శ్రమ, మరొకటి మానసిక వేదన, ఈ రెండు కలవడం ద్వారా శ్రమజీవి జీవితంలో కష్టం, వేదన విడదీయరాని విధంగా ఏకమైనాయి. ఇది కార్మికుడి అంతర్లీన ప్రపంచాన్ని మన ముందు ఉంచుతుంది. ఈ కవితా పంక్తి భావోద్వేగాల సంగమం. శ్రమజీవి అంతర్గత వేదనను ఈ రూపకం అత్యంత సున్నితంగా ఆవిష్కరిస్తుంది.
“మనసు ముద్దయ్యింది” అనేది మనసు ముద్దగా మారడం, బాధలోనే కరుణ, ఆశ, మానవత్వం కరిగిపోవడం చేత భావోద్వేగ తీవ్రత పరాకాష్ఠను చేరుకోవడాన్ని తెలియజేస్తుంది. భరించలేని బాధలో మనసు మృదువై కరిగిపోయిన స్థితి. ఇక్కడ కవి కన్నీళ్లతో మనసు ముద్దగా మారినట్లుగా చూపడం ఒక సున్నితమైన దృశ్యాత్మక రూపకం.అంతరంగం తట్టుకోలేని వేదన, లోలోపల కరిగిపోయిన హృదయం.ఇది ఆర్తనాదంలా కాకుండా మౌనంగా చెల్లాచెదురైన బాధను వ్యక్తం చేస్తుంది.
“అయినా మళ్ళీ రమ్మని/మళ్ళీ వాటు వేయమని” – ఎంత బాధ ఉన్నా, ఎంత కన్నీళ్లు కారినా, జీవితం ఆగదు. మళ్లీ రమ్మని అంటే ఈ రోజు కాదు. రేపు కూడా అదే శ్రమకు పిలుపు. మళ్లీ వాటు వేయమని అంటే అదే మగ్గం, అదే దారం, అదే చెమట, అయినా పని మానకూడదు. ఇక్కడ మగ్గం ఒక పనిముట్టు కాదు. అది జీవన యంత్రం. శ్రామికుడి జీవితం కన్నీళ్లతో నిండిన జీవన అవసరం అతడిని మళ్లీ పనికి బానిసగా చేస్తుంది. ఇందులో ప్రశ్నలు ఉన్నాయి. వేదన ఉంది. కన్నీళ్లు ఉన్నాయి. కానీ విరామం లేదు. ఇది శ్రామికుని జీవితాన్ని ఒక విషాద గాథగా మాత్రమే కాక ఒక నిరంతర పోరాటంగా చిత్రిస్తుంది. కన్నీళ్లతో ముద్దయిన మనసు కూడా జీవన అవసరాల ముందు మళ్లీ మగ్గం దగ్గర నిలబడాల్సి వస్తుంది. ‘మగ్గం మాట్లాడింది’ అంటే మనిషికి విశ్రాంతి ఇవ్వని సమాజపు వ్యవస్థ మాట్లాడింది అని కవి మనకు చెబుతున్నాడు. ఇది మౌనంగా గుండెను తాకి గట్టిగా ఆలోచింపజేసే శక్తివంతమైన కవితా స్వరం. ఇక్కడ కవిత తాత్వికంగా మారుతుంది. ఎంత బాధ ఉన్నా జీవితం ఆగదు. మళ్లీ అనే పదం పునరావృత శ్రమను, ఆగని పోరాటాన్ని సూచిస్తుంది. ఎంత కష్టం ఉన్నా, ఎంత కన్నీరు కారినా, మనిషి మళ్ళీ అదే శ్రమలోకి దిగాల్సిందే. పేద చేనేత కార్మికుడి జీవన విధానానికి చెందిన నిర్బంధ చక్రం ఆగదు అని చెప్పిన తీరు బాగుంది.
‘మగ్గం మాట్లాడింది’ అనేది మళ్లీ మగ్గం స్వరం వినిపించడం, జీవితం వెనక్కి తగ్గనీయని శక్తి. శ్రమజీవిని మళ్లీ పనికి పిలిచే విధి. నిరాశలోను ఆశను నింపే అంతరాత్మ. ఈ కవితా పంక్తులలో చెప్పేది శ్రమజీవి కన్నీళ్లు ఆగినా, జీవన చక్రం ఆగదు. వేదన ఉన్నా, మనసు కరిగిపోయినా మళ్లీ జీవించాల్సిందే. ఈ కవితా పంక్తులు కేవలం శ్రమను కాదు, శ్రమ వెనుక నిలిచే అచంచలమైన మానవ సంకల్పాన్ని ప్రతిబింబిస్తాయి. మగ్గం విధి. మగ్గం జీవన యంత్రం. మగ్గం మనిషిని ఆపకుండా విశ్రాంతి ఇవ్వకుండా మళ్ళీ శ్రమకు పిలిచే శక్తిగా నిలుస్తుంది. ఈ కవితా పంక్తులు శ్రమజీవి త్యాగాన్ని, బాధలను, అత్యంత సున్నితంగా, గంభీరమైన రూపకాలతో వ్యక్తపరుస్తాయి. ఈ కవితా పంక్తులలో చెమట – కన్నీళ్ళ సంగమం ద్వారా శ్రమజీవి వేదనను, ఆశ ఉన్నా తప్పించుకోలేని జీవన చక్రాన్ని,మగ్గం ప్రతీకతో మనిషి విధిని అత్యంత కవితాత్మకంగా, హృదయ స్పర్శగా చిత్రించాడు.
“బ్రతుకు చిత్రంలో/ఎన్ని విచిత్రాలు ఉన్నా/జుట్టుకు నూనె చుక్క రాసుకోకున్నా/మగ్గం సలాయికి నూనె రాస్తాడు!/మళ్ళీ…/మగ్గం మాట్లాడింది/”
“బ్రతుకు చిత్రంలో/ఎన్ని విచిత్రాలు ఉన్నా..” – జీవితాన్ని ఒక చిత్రంగా చూడటం ద్వారా కవి అనిశ్చితిని, అసమానతలను వ్యక్తపరుస్తాడు. బ్రతుకుచిత్రం అంటే జీవితం అనే పెద్ద కాన్వాస్. విచిత్రాలు అంటే ఆశ్చర్యాలు మాత్రమే కాదు, విరుద్ధాలు, అన్యాయాలు, అవాస్తవాలతో కూడినది. ఎన్ని విచిత్రాలు ఉన్నా అని కవి చెప్పడం ద్వారా జీవితంలోని అసహజతను ముందుగానే సూచించాడు.
జుట్టుకు నూనె చుక్క రాసుకోకున్నా అనేది తీవ్రమైన పేదరికాన్ని వ్యక్తం చేసే భావాన్ని కలిగించే కవితా పంక్తి. చేనేత కార్మికుడు నిరంతర శ్రమజీవి, పేదరికంతో కనీస వ్యక్తిగత సౌఖ్యం పూర్తిగా పక్కకు నెట్టబడింది.శ్రమజీవి తన శరీరానికి మౌలిక సంరక్షణ ఇవ్వలేని దయనీయ స్థితి కొనసాగింది అనేది ఇక్కడ వ్యక్తం అవుతుంది. ఇది పేదరికానికి స్పష్టమైన రూపకం.
మగ్గం సలాయికి నూనె రాస్తాడు అనేది మగ్గం అనే జడ సాధనం చక్కగా పని చేయడానికి నూనె రాస్తాడు. తన శరీర సంరక్షణ కంటే ఉపాధి సాధనాన్ని సంరక్షించుకోవడానికి కార్మికుడు ప్రాధాన్యత ఇస్తాడు. అతడు సుఖ జీవనానికి కాకుండా పని చేయడానికి మాత్రమే తన విలువైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అని కవి తెలియజేస్తున్నాడు. మనిషి తన అవసరాలను వదిలిపెట్టి తన జీవనాధారమైన యంత్రానికి ప్రాధాన్యం ఇవ్వడం, మనిషి యంత్రానికి లోబడిపోయిన స్థితిని సూచిస్తుంది.
‘మళ్ళీ..!’ అనే ఈ విరామ చిహ్నం అలసిన, నిరాశ పొందిన, ఆగలేని పరిస్థితిని ఒకే మాటలో వ్యక్తం చేస్తుంది. ఈ మళ్ళీ అనే పదం శ్రమజీవిని గురించి కవిత అంతట కొనసాగే పునరావృత జీవన చక్రాన్ని గుర్తుచేస్తుంది.
ఆ మగ్గం మాట్లాడింది అనేది శ్రమజీవి తన జీవితాని కంటే తన సాధనానికి ఎక్కువ విలువ ఇవ్వాల్సిన విపరీత వ్యవస్థలో జీవిస్తున్నాడు. మనిషి ఆకలితో ఉన్నా యంత్రం నడవాలి. మనిషి తలకి రాసుకోవడానికి నూనె లేదు కానీ మగ్గానికి రాయడానికి నూనె ఉంది. ఇది సామాజిక విమర్శ, శ్రమ దోపిడిపై నిశ్శబ్ద ఆవేదన. ఇది ఒక సాధారణ దృశ్యం కాదు. శ్రమజీవి చేనేత కార్మికుడి జీవితానికి ఈ కవితా పంక్తులు అద్దం పడుతున్నాయి.
“తన తనువుపై చిల్లుల గుడ్డలున్నా…/తన నేత కళా రూపంతో/రథ చక్రాలను రంగరిస్తూ/ చరిత్రలో అద్భుతాలు సృష్టిస్తాడంది!/మళ్ళీ మళ్ళీ …/ఆ మగ్గం మాట్లాడింది!/”
ఈ కవితా పంక్తులు చేనేతకారుడి జీవితాన్ని అతని కళాత్మక దృష్టిని అత్యంత సున్నితమైన భాష,భావంతో ఆవిష్కరిస్తాయి.ఇక్కడ కవి చేనేతను ఉపాధిగా కాక,చరిత్రను మలిచే సృజనాత్మక శక్తిగా చిత్రిస్తాడు.
‘తన తనువుపై చిల్లుల గుడ్డలున్నా…’ అనే కవితా పంక్తి చేనేతకారుడి వ్యక్తిగత దారిద్ర్యాన్ని స్పష్టంగా చూపుతుంది. వేసుకున్న వస్త్రం చిరిగి పోయినా, అతని జీవితం కష్టాలతో నిండినది అయినా, అతని లోపల నిబిడీకృతమైన కళ మసకబారదు. ఇది కళాకారుడి త్యాగానికి ప్రతీక. శ్రమతో ప్రపంచాన్ని అలంకరించే చేనేత కార్మికుడి శరీరానికి తగిన వస్త్రం లేకపోవడం, వ్యవస్థలోని వైఫల్యం. చేనేత కార్మికుడి శరీరంపై చిరిగిన వస్త్రాలు. కానీ, ప్రపంచానికి చేనేత కార్మికుడు అందించే వస్త్రాలు విలువైనవి. చేనేత కార్మికుడు తాను స్వయంగా పేదరికంలో ఉండి సమాజాన్ని చక్కని వస్త్రాలను అలంకరించే కళాకారుడు అనే భావం ఇక్కడ ప్రతిఫలిస్తుంది.
తన నేత కళా రూపంతో అనేది చేనేతకారుడికి వృత్తిమీద ఉన్న అపారమైన గౌరవాన్ని తెలుపుతుంది. నేత ఒక పని మాత్రమే కాదు. అది అతని శ్వాస, అతని గుర్తింపు. కళగా మారిన శ్రమ ఇక్కడ స్పష్టంగా వ్యక్తం అవుతుంది. ఇది తరతరాల నుండి వచ్చిన చేనేత కళా నైపుణ్యం. ఇది కేవలం వృత్తి కాదు, సంస్కృతి. ఇది చేనేత కార్మికుడి శ్రమను కళాస్థాయికి ఎత్తి చూపుతుంది. కవి నేతను ఒక శిల్పిగా, సృజనకర్తగా ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తాడు.శ్రమను కళా రూపంతో గౌరవిస్తాడు.
‘రథ చక్రాలను రంగరిస్తూ’ అనే రూపకం అత్యంత సారవంతమైనది. చేనేతకారుడు బట్టలపై వేసే వివిధ డిజైన్లు, ఆకృతులు ఇక్కడ రథచక్రాల అలంకరణగా మారాయి. రథచక్రం అంటే గమనం,చలనం,చరిత్ర, ప్రవాహం.ఆ చక్రాలను రంగరించడం అంటే సాధారణ వస్త్రాలపైన సమాజ సంస్కృతిని అందంగా మలచడం, డిజైన్లు వేయడం. చరిత్రలో అద్భుతాలు సృష్టిస్తాడంది అనేది చేనేతకారుడు తయారుచేసిన బట్టపై అతని పేరు లిఖించబడకపోయినా, అతని శ్రమకు తగిన గుర్తింపు లేకపోయినా, అతని నేతలోని కళాకౌశలం తరతరాలకు నిలిచే సంస్కృతిగా మారుతుంది. చరిత్రను నిర్మించేది రాజులు కాదు. మౌనంగా శ్రమించే కార్మికుల చేతులే అన్న సత్యాన్ని ఈ కవితా పంక్తి ప్రకటిస్తోంది. ఇక్కడ అద్భుతమైన వస్త్ర కళ,సాంస్కృతిక వారసత్వం, చేనేత కార్మికుడి కృషి కాలాన్ని దాటి నిలిచేదిగా వర్ణించబడింది. ‘మళ్ళీ మళ్ళీ…/ ఆ మగ్గం మాట్లాడింది’ అనే కవితా పంక్తి మగ్గాన్ని ఒక ప్రాణిగా చూపుతుంది. అది కేవలం యంత్రం కాదు. చేనేతకారుడి మనసుకు స్వరం. అతని బాధ, ఆశ, సృజన అన్ని మగ్గం ద్వారా మాటల రూపంలో వ్యక్తం అవుతున్నాయి. మళ్లీ మళ్లీ మాట్లాడటం అంటే ఎన్ని కష్టాలు ఉన్నా ఆ కళను విడవకుండా కొనసాగించాలి అనే అంతర్గత పిలుపు. ఇది చేనేత కారుడి జీవిత వ్యథను మాత్రమే కాదు, అతని కళా మహిమను చరిత్రలో అతని నిశ్శబ్ద పాత్రను ఆవిష్కరిస్తుంది. చేనేతకారుడు దారిద్య్రంలో మగ్గుతూ కూడా సౌందర్యాన్ని సృష్టించేవాడు. ఇది అతని గొప్పతనానికి ఒక సజీవ సాక్ష్యం. ఇది నిరంతరంగా సాగే తరతరాల చేనేత కార్మికుడి శ్రమను, గని సృజనను, విరామం లేని జీవితాన్ని సూచిస్తుంది. చేనేత కార్మికుడి శ్రమను గుర్తించాలి అని మగ్గం పదేపదే హెచ్చరిస్తోంది. ఈ కవితా పంక్తులలో శ్రమజీవి దేహం క్షీణించినా, అతని వస్త్ర కళ చరిత్రలో నిలిచిపోతుందనే వ్యక్తం అవుతున్నది. ఈ కవితా పంక్తులలో కవి చేనేత కార్మికుడి సృజనాత్మక మహత్తును, చరిత్రలోని అతని స్థానాన్ని, చక్కటి శైలితో గొప్పగా ఆవిష్కరించాడు. చేనేత కార్మికుడి తరఫున ఇక్కడ మగ్గం మాట్లాడింది.
“ప్రతి తనువుకు రక్షణ నిచ్చిన/తన వంటిలోని ప్రతి రక్తపు చుక్క/నీళ్లుగా మారుతున్నా../ నేనెప్పటికీ చేనేతనే అంటాడంది!/ఎందుకో/మగ్గం మాట్లాడింది/ ఐనా మగ్గం నడుపుతూనే ఉంటానని/ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు!/”
ఈ కవితా పంక్తులు చేనేతకారుడి ఆత్మవిశ్వాసం, వృత్తి పట్ల గల నిబద్ధతను తెలుపుతాయి. కవి ఇక్కడ వ్యక్తి – వృత్తి మధ్య ఉన్న అనుబంధాన్ని జీవనతత్వంగా మలిచాడు. మగ్గం ఇక్కడ కేవలం మాట్లాడే సాధనంగా కాక శ్రమజీవి జీవన తత్వాన్ని ప్రకటించే అంతిమ స్వరంగా మారింది. ఈ కవితా పంక్తుల్లో చేనేత కార్మికుడి త్యాగాన్ని, అంకితభావాన్ని, సంకల్పాన్ని వ్యక్తీకరించిన తీరు అద్భుతంగా ఉంది.
ప్రతి తనువుకు రక్షణ నిచ్చిన అనే కవితా పంక్తి చేనేత వస్త్రాల సామాజిక విలువను సూచిస్తుంది. ప్రతి వ్యక్తి శరీరానికి రక్షణ కల్పించే బట్టలను తయారు చేసే చేనేతకారుడే తన శరీరానికి రక్షణ లేకుండా ఉన్నాడు. ఇక్కడ ప్రతి తనువు అంటే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి నుంచి పేదవాడి వరకు అందరు చేనేత కార్మికుడు నేసిన వస్త్రాలను ధరిస్తారు. అట్టి చేనేత వస్త్రాలు సమాజానికి గౌరవాన్ని తెచ్చి పెడతాయి అని కవి చెబుతున్నాడు. నేతగాడు నిరుపేద అయినా, వస్త్రాలు అందించి సమాజానికి రక్షణను కల్పిస్తున్నాడు.
‘తన వంటిలోని ప్రతి రక్తపు చుక్క నీళ్లుగా మారుతున్నా..’ ఈ కవితా పంక్తిలో చేనేత కార్మికుడు శ్రమతో కరిగిపోవడాన్ని తెలుపుతుంది. శ్రమ నేరుగా ప్రాణ శక్తిని హరిస్తున్నా చేనేత కార్మికుడు వెనుకడుగు వేయడు అని సూచిస్తుంది. రక్తం నీళ్లుగా మారడం అంటే శ్రమ ఎక్కువై శక్తి తగ్గిపోవడం,శరీరం క్షీణించడం,బాధను కలిగిస్తుంది.
‘నేనెప్పటికీ చేనేతనే అంటాడంది’ – ఇక్కడ చేనేత వృత్తి మాత్రమే కాదు, ఇది అతని జీవనాధారం. చేనేత తన విధి. చేనేత తన అస్తిత్వం. పరిస్థితులు మారినా, కష్టాలు పెరిగినా చేనేత వృత్తి పట్ల గల నిబద్ధత, అంకితభావం, ఆత్మగౌరవం మారదు అని కవి స్పష్టం చేస్తున్నాడు. చేనేత కార్మికుని శరీరం కృశించి పోయినా, రక్తం క్షీణించిపోయినా, వృత్తిపై ఎనలేని విశ్వాసంతో, దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు అని కవి చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
‘ఎందుకో../ మగ్గం మాట్లాడింది’ – ఎందుకో అనే పదం ఆ నిబద్ధతకు కారణాలు చెప్పలేని స్థితిని సూచిస్తుంది. ఎందుకో అనేది త్యాగానికి సంకేతంగా నిలుస్తుంది. ఎందుకు అతడు మగ్గం వదలడు? ఎందుకు ఇంకా మగ్గంపై శ్రమిస్తాడు? ఈ ప్రశ్నలకు కవి సమాధానం చెప్పకుండా పాఠకుడి ఆలోచనలకే వదలి పెడుతున్నాడు.
‘మగ్గం మాట్లాడింది’ అనేది ఇక్కడ మగ్గం చేనేత కార్మికుడి శ్రమను, త్యాగాన్ని సమాజానికి ప్రకటించిన ఒక చక్కటి విధానం.
“ఐనా మగ్గం నడుపుతూనే ఉంటానని/ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు” – అనేది విరామం లేని పోరాటాన్ని తెలుపుతుంది.
జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వృత్తిని విడిచిపెట్టని మనిషి మనోధైర్యానికి ప్రతీక ఇది. చేనేతకారుడి సంకల్పం మాటల రూపంలో కాక చేతుల కదలికల ద్వారా వ్యక్తం అవుతుంది. చేనేతకారుడు గొప్పలు చెప్పుకునే వాడు కాదు. ప్రమాణాలు చేయడు. కేవలం మగ్గాన్ని నడుపుతూనే ఉంటాడు. చేనేతకారుడు కష్టాల మధ్య నలిగిపోతున్నా, మగ్గం శబ్దంతోనే జీవన సంకల్పాన్ని ప్రకటించే వ్యక్తి అని తెలుస్తున్నది. చేనేత కార్మికుడు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా, అకుంఠిత దీక్షతో శ్రమను కొనసాగిస్తున్నాడు. శ్రమజీవి జీవితం కరిగిపోయినా, అతని వృత్తి పట్ల గల నిబద్ధత చెదరదు. చేనేత కార్మికుడి అంకిత భావాన్ని, త్యాగాన్ని,వృత్తిపై అతని నిబద్ధతను, గాఢమైన ప్రేమను,శ్రమలోని గౌరవాన్ని కవి అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇక్కడ మగ్గం మాట్లాడింది అనేది చేనేత కార్మికుడి ఆత్మగతమైన భావాలు కవితా రూపంలోకి మారినట్టుగా భావించవచ్చు. చేనేత కార్మికుని జీవితంలో ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి జడ సాధనమైన మగ్గంతో మాట్లాడించడం కవి చేసిన అద్భుతమైన ప్రయోగంగా భావించవచ్చు.
‘మగ్గం మాట్లాడింది’ అనే చక్కటి కవితను అందించిన కవి కిరణ్ కుమార్‌ను అభినందిస్తున్నాను. మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
వీరు తేది 27-09-2025 రోజున అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం వారిచే డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య తొలి పురస్కారం అందుకున్నారు.
