[శ్రీ గంటా మనోహర్ రెడ్డి రచించిన ‘ఒక్క క్షణం..!’ అనే కవితని విశ్లేషిస్తున్నారు సందినేని నరేంద్ర.]
ప్రముఖ కవి, విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి, గంటా మనోహర్ రెడ్డి కలం నుండి జాలువారిన ‘ఘంటాపథం’ కవితా సంపుటిలోని ‘ఒక్క క్షణం’ కవితపై విశ్లేషణా వ్యాసం ఇది. క్షణం అంటే కన్ను మూసి తెరిచినంత కాలం. క్షణం అంటే లిప్త కాలం. చాలా తక్కువ సమయం. ఈ కవిత ఒక వ్యక్తి హృదంతరాల నుండి పొంగి పొరలి వచ్చిన అభిప్రాయాలను, జీవితంలోని ప్రేరణాత్మక ఆశయాలను వ్యక్తపరుస్తుంది. ఈ కవితలోని ప్రతి పంక్తి ఒక దార్శనిక కలగా, ప్రేరణాత్మక భావాలతో అలరారుతున్నది. ఈ కవితలో ‘ఒక్క క్షణం’ అనే పదాన్ని పదే పదే ఉపయోగించి ఆ క్షణానికి ఉన్న విలువను, ఆ క్షణం యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పడం జరిగింది. ‘ఒక్క క్షణం’ అనే పదానికి ప్రాముఖ్యత ఉంది. ‘ఒక్క క్షణం’ కూడా గొప్ప మార్పునకు పునాది కాగలదని తెలుస్తోంది. కవి మనోహర్ రెడ్డి ‘ఒక్క క్షణం’ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.
‘ఒక్క క్షణం.. హంసలాగా బ్రతకాలని ఉంది
అవినీతిని ఏరిపారవేయాలని ఉంది’
ఈ కవితా పంక్తులు మనసులోని లోతైన భావాల్ని ప్రతిబింబిస్తాయి. ఒక మనిషి జీవితానికి, సమాజానికి సంబంధించిన గొప్ప లక్ష్యాలను సూచిస్తాయి. ఒక్క క్షణం హంసలాగా బ్రతకాలని ఉంది అనడం మనిషి జీవితంలో పవిత్రతను, స్వచ్ఛతను, నిస్వార్థతను కోరుకునే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. హంస నీరు కలిసిన పాలలోంచి నీటిని వదలి పాలను మాత్రమే తీసుకుంటుంది. హంస వలె మనిషి కూడా మంచిని స్వీకరించి ఉత్తమ జీవితాన్ని గడపాలని ఆశించడం చక్కగా ఉంది. హంసను భారతీయ సాహిత్యంలో పవిత్రతకు, విచక్షణకు ప్రతీకగా భావిస్తారు. మనిషి కూడా హంసలాగా స్వచ్ఛమైన, ప్రశాంతమైన, నీతివంతమైన జీవితం గడపాలి అని కోరుకోవడం బాగుంది. హంసలాగ జీవించడం అంటే మనిషి నిస్వార్థత, తెలివి, మంచి చెడుల విచక్షణా జ్ఞానంతో బ్రతకడం అని చెప్పవచ్చు. మనిషిలోని కల్మష భావాలు, మనసులో అలుముకున్న చీకట్లు తొలగి ప్రశాంతమైన స్థితికి చేరాలి అని చెప్పిన తీరు బాగుంది. అవినీతిని ఏరి పారవేయాలని ఉంది అనడంలో సమాజంలో విశృంఖలంగా వ్యాపించిన అవినీతిని నిర్మూలించాలి అనే తపన కనబడుతున్నది. జనులలో నైతికత లోపించినప్పుడు సమాజంలో అసమానతలు నెలకొంటాయి. అసమానతల వల్ల ప్రజలకు తీరని నష్టం కలుగుతుంది. సమాజంలో కొనసాగుతున్న అవకతవకల్ని, తప్పుడు పనుల్ని, అన్యాయాలను పూర్తిగా తుదముట్టించాలి. కొంత మంది స్వార్థపరులై అవినీతి,అక్రమాలకు పాల్పడుతుంటారు. వ్యవస్థలో నెలకొన్న అవినీతి వల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రజలు సమాజంలో మార్పును కోరుతున్నారు. మంచి విలువలు, పారదర్శకత కలిగిన సమాజాన్ని నిర్మించాలనే గొప్ప సంకల్పం ఉంది. మనిషి జీవితంలో స్వచ్ఛత కలిగి ఉండాలి. మనిషి నైతికతపై దృష్టి పెట్టాలి. మనిషి నిష్కల్మషంగా, సహజ న్యాయ సూత్రాలు దృష్టిలో పెట్టుకొని జీవనం సాగించాలి. సమాజంలో మంచి మార్పును తీసుకురావాలి అని కోరుకోవడం,ఒక సామాజిక బాధ్యత అని గుర్తు చేస్తుంది.
‘ఒక్క క్షణం విహంగాన్నై విహరించాలని ఉంది
శాంతి పథాన్ని స్థాపించాలని ఉంది’
ఈ కవితా పంక్తులు అర్థవంతమైన ఆలోచనలను ప్రతిఫలిస్తాయి. ఇక్కడ ఒక్క క్షణం విహంగాన్నై విహరించాలని ఉంది అంటే మనిషి పక్షిగా మారి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలి అనే భావనను సూచిస్తుంది. మనిషి మనస్సులోని స్వేచ్ఛా భావన వల్ల జీవితంలో ఆందోళన నుంచి విముక్తిని కోరుకునే సంకల్పాన్ని సూచిస్తుంది. మనిషి తన జీవితంలో ఆనందం, స్వేచ్ఛ మరియు భౌతిక పరిమితుల నుంచి విముక్తిని కోరుకోవడం సూచిస్తుంది. పక్షి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే ప్రాణి. మనిషి తన బాధలు, బాధ్యతల బరువు నుంచి ఒక్క క్షణం విముక్తి పొందాలనే కోరికతో ఆకాశంలో విహరించే పక్షిలా స్వేచ్ఛను అనుభవించాలని ఆశిస్తున్నాడు. ఇది వ్యక్తి యొక్క లోతైన కోరికల్ని తన మనసులోని నిర్బంధాల్ని విడిచిపెట్టాలి అనే తపనను తెలియజేస్తుంది. శాంతిపథాన్ని స్థాపించాలని ఉంది అంటే మనిషి తన వ్యక్తిగత జీవితంలో శాంతిని కోరుకోవాలి, విశాల ప్రపంచానికి కూడా శాంతిని అందించాలి అనే ఒక గొప్ప ఆరాటాన్ని తెలియ జేస్తుంది. సమాజంలో చెలరేగుతున్న హింస, కలహాలు, అసమాపతల నుంచి బయటపడటానికి సద్భావనను ప్రోత్సహించడానికి మనిషి చేసే ప్రయత్నాన్ని సూచిస్తుంది. స్వేచ్ఛ, శాంతి, ఆనందం కలిగిన జీవితాన్ని అన్వేషించే ఆత్మ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. మనిషి తన జీవనంలో శాంతిని, సత్సంబంధాలను సాధించాలనే లక్ష్యాన్ని సూచిస్తుంది. కవితలోని భావాలు మనిషికి స్వేచ్ఛ, ఆనందం మరియు సామాజిక సమానత్వం కావాలనే ఆకాంక్షను తెలియజేస్తున్నవి.
‘ఒక్క క్షణం జ్యోతినై వెలగాలని ఉంది
అజ్ఞానపు తిమిరాన్ని తరిమి వేయాలని ఉంది’
ఒక్క క్షణం జ్యోతినై వెలగాలని ఉంది అంటే ఒక్క క్షణం కోసం ఆనందాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని, ప్రబోధాన్ని పొందాలనే సంకల్పం ఉందని అర్థమవుతుంది. ఇది ఒక వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించడంలో ఉన్న ఆరాటాన్ని సూచిస్తుంది. కేవలం ఒక్క క్షణం అయినా జీవితంలో జ్ఞానమనే ప్రకాశాన్ని పొందడం ఎంత ముఖ్యమో తెలియ జేస్తుంది. జ్యోతి అనే పదం అర్థవంతమైన జ్ఞానం, దివ్యత్వం, దైవానుభూతికి ప్రతీక. ఈ జ్యోతి వెలగడం ద్వారా మన మనసులోని చీకట్లను దూరం చేయగలుగుతాం. అజ్ఞానపు తిమిరాన్ని తరిమివేయాలని ఉంది అంటే అజ్ఞానం అనే చీకటిని దూరం చేయాలనే మనసులోని భావన. ఇది మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని,అవగాహన లోపాన్ని, మాయాజాలాన్ని తుడిచివేయాలనే ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. అజ్ఞానం అనగా దివ్య జ్ఞానం లేకపోవడం, నిజమైన స్వరూపం గుర్తు పట్టలేకపోవడాన్ని తెలియజేస్తుంది. తిమిరం అనేది చీకటికి ప్రతీక. అజ్ఞానం తరిమి వేయడం అంటే అజ్ఞానాన్ని జ్ఞానంతో దూరం చేయడం. జీవన మార్గంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించడం అనే గొప్ప సంకల్పం వ్యక్తం అవుతుంది. జీవితంలో ముసురుకున్న చీకట్లు తొలగి పోవాలంటే జ్ఞానమనే జ్యోతి వెలగాలి. ఈ ఆలోచన మనిషికి జీవిత లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది. ఇది వ్యక్తి ఆత్మశోధనకి ప్రేరణ నిచ్చే గొప్ప భావన.
‘ఒక్క క్షణం ఖడ్గంగా ఉండి పోవాలని ఉంది
అభివృద్ధి నిరోధకుల్ని హతమార్చాలని ఉంది’
ఈ కవితా పంక్తులు సాధారణంగా మార్పును కోరే ఆవేశాన్ని మరియు కీలకమైన భావనలను తెలుపుతున్నాయి. మనిషి అచంచలమైన ధైర్యంతో, మార్పు కోసం నిరంతరం పోరాటం చేయాలి. ఒక్క క్షణం ఖడ్గంగా ఉండి పోవాలని ఉంది అంటే మనం ధైర్యంతో ముందుకు సాగాలి అని ప్రతిపాదిస్తుంది. ఖడ్గం అనే పదం శక్తి, ధైర్యం మరియు పోరాటానికి చిహ్నం. ఒక్క క్షణం ఖడ్గం వలె ధైర్యంగా, నిర్భయంగా నిలబడాలి అని సూచిస్తుంది. మనిషి జీవితంలో ఎన్నో సవాళ్లు వస్తాయి. కాని, ఆ క్షణం నుండి మనం నిశ్చయంగా, నిర్భయంగా నిలబడి సమస్యలను ధైర్యంతో ఎదుర్కొవాలి. ఇది మనిషిలోని ఆత్మ విశ్వాసాన్ని తెలుపుతుంది. అభివృద్ధి నిరోధకుల్ని హతమార్చాలని ఉంది. మన చుట్టూ ఉండే ప్రతిబంధకాలను సూచిస్తుంది. సమాజం అభివృద్ధికి అడ్డుగా ఉన్న ప్రతిబంధకాలను ఎదుర్కొవాలి. సామాజికంగా, రాజకీయంగా దేశ అభివృద్ధిని అడ్డగించే వారు అడుగడుగునా ఉంటారు. సమాజంలో పేరుకుపోయిన అవినీతిని, అన్యాయాన్ని మనిషి ధైర్యంగా ఎదుర్కోవాలి. అభివృద్ధి నిరోధకుల్ని హతమార్చడం అంటే వారిని సమూలంగా నిర్మూలించడం. సమాజానికి మంచిని తీసుకు రావాలి. ఇది మనిషి వ్యక్తిగతం పైన, సామాజిక స్థాయిలో జరుగుతున్న అవాంఛిత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మనిషి సమస్యలను, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడితేనే సమాజంలో మార్పు సాధ్యం అవుతుంది. ఇది వ్యక్తుల మధ్య పోరాటానికి పిలుపు కాదు. సమాజం అభివృద్ధి పథంలో సాగేందుకు ఇచ్చిన పిలుపు. అన్యాయానికి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ప్రజల్లో సత్ప్రవర్తనను ప్రోత్సహించాలి.ఇది మనిషి ఆలోచనలో చర్యల్లో గొప్ప మార్పులను సూచిస్తుంది. సమాజం అభివృద్ధికి పునాది పడుతుంది అనే గొప్ప సందేశం వ్యక్తం అవుతున్నది.
‘ఒక్కక్షణం రాకెట్టునై దూసుకుపోవాలని ఉంది
అంతరిక్షంలోని ధరల్ని అణగ ద్రొక్కాలని ఉంది’
కవి మనోహర్ రెడ్డి భావన ఎంతో గొప్పగా ఉంది. ఒక్క క్షణం రాకెట్టులా దూసుకుపోయి అంతరిక్షంలోకి వెళ్లాలి, అంత ఎత్తుకు దూసుకుపోయిన ధరలను నేలకు తాకునట్లుగా అణగ ద్రొక్కాలి. పెరుగుతున్న ధరల వల్ల సామాన్యుని జీవితం కునారిల్లి పోతున్నది. ధరల పెరుగుదల సామాజిక సమస్య మరియు ఆర్థిక సమస్యగా ఉంది. అంతరిక్షానికి చేరుతున్న ధరలను అణచివేసేందుకు ప్రభుత్వ, వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలపై చొరవ అవసరం ఉంది. ప్రభుత్వం ధరల నియంత్రణపై తక్షణ చర్యలు తీసుకోవాలి. నిత్యావసర వస్తువులకు గరిష్ట ధరలు నిర్ణయించి కఠినంగా అమలు చేయాలి. ఇంధనం, ఆహారం వంటి వస్తువుల పన్ను భారాన్ని తగ్గించాలి. రైతులు, చిన్న వ్యాపారుల కోసం తక్కువ వడ్డీకి రుణాలు అందించాలి. పేద ప్రజలకు సబ్సిడీ ద్వారా నిత్యావసర వస్తువులు సరసమైన ధరల్లో అందించాలి. ప్రజల భాగస్వామ్యంతో ధరలు తగ్గించవచ్చు. ప్రజలు, వ్యాపారులు, ప్రభుత్వం కలిసి పని చేస్తే ధరల పెరుగుదలను అణచవచ్చు.
‘ఒక్క క్షణం కోయిలనై పాడాలని ఉంది
ఆనందామృతాన్ని అందరికీ పంచివ్వాలని ఉంది’
ఈ కవితా పంక్తులు అద్భుతమైన భావోద్వేగాన్ని, మనసుకు హత్తుకునే రీతిని వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క క్షణం కోయిలనై పాడాలని ఉంది. మనం కోయిలలా మారి మధుర స్వరాలతో ఆనందాన్ని చాటాలని అర్థం అవుతుంది. కోయిల తన కుహూ కుహూ రాగాలతో మైమరిపించి అందరికీ సంతోషాన్ని పంచుతుంది. ప్రతి క్షణం జీవితంలో ఎంతో విలువైనది, ప్రతి క్షణం సంతోషాలు పూయించే సందర్భం కావాలి. కోయిల వలె మనం కూడా ఆనందాన్ని అందరికీ విరివిగా అందించాలనే భావం వ్యక్తం అవుతుంది. ఆనందామృతాన్ని అందరికీ పంచివ్వాలని ఉంది అంటే ఆనందామృతం అనేది అద్భుతమైన ఆనందాన్ని పరిపూర్ణమైన సుఖాన్ని సూచిస్తుంది. ఈ ఆనందానుభవాన్ని, ఇతరులకు పంచే సంకల్పం ఇందులో ఉంది. మనం సంతోషం అనుభవించినప్పుడు ఆ సంతోషాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అందించాలనే తపన ఉండాలి. ఇది సామాజిక బాధ్యత మరియు పరస్పర సహకార భావం కావచ్చు. ఈ పంథాలో జీవితం అనేది ఒక చక్కటి అనుభవంగా మారుతుంది. అందరి మధ్య పరస్పర సంతోషం, ప్రేమ విరజిమ్మే దిశగా జీవితం సాగుతుంది. మనిషి కోయిలగా మారి అందరికీ కమ్మని సంగీతాన్ని,ఆనందాన్ని పంచడం ఒక గొప్ప లక్ష్యం.
‘ఒక్క క్షణం మయూరంగా మారాలని ఉంది
స్వేచ్ఛా వాయువుల్లో నాట్యం చేయాలని ఉంది’
ఈ కవితా పంక్తి భావ ప్రధానంగా, ప్రాకృతిక ఆనందానికి ప్రతీకయైన నెమలి స్వేచ్చా, సౌందర్యం గూర్చి చేసిన ఆలోచనగా ఉంది. మయూరం తన అందమైన రెక్కలను విప్పి నాట్యం చేయడం, సౌందర్యం, ఆనందం, స్వేచ్ఛకు సంకేతం. మనిషి తాను కొద్ది క్షణాలు నెమలిగా మారి స్వేచ్ఛతో పరిమితులు లేకుండా ఆనందభరితంగా జీవించాలని కోరుకుంటున్నాడు. అందమైన నెమలి ప్రకృతిలో స్వతంత్రంగా జీవించే జీవి. మనిషి తాను జీవితంలోని గందరగోళం, చిక్కుల నుండి బయటపడాలి, సౌందర్యాన్ని, స్వేచ్ఛను కనుగొనాలి అని కోరుకుంటున్నాడు. నెమలి స్వతంత్ర జీవన విధానానికి, మానసిక ఉల్లాసానికి ప్రతీకగా భావించి చర్చిస్తున్నాడు. స్వేచ్ఛా వాయువులు అనేది స్వతంత్రతకు ప్రతీక. మనిషి స్వేచ్ఛా వాయువుల్లో అపరిమిత ఆనందంతో నాట్యం చేయడం అనేది బంధనాల నుండి విముక్తి పొంది ఆత్మ సంతృప్తిని అనుభవించడాన్ని సూచిస్తుంది. మనిషి పరిమితుల నుండి బయటపడి ప్రకృతితో మమేకమై ఆనందంతో స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించాలని కవి సూచిస్తున్నాడు.
‘ఒక్క క్షణం సింహంనై గర్జించాలని ఉంది
స్వార్థ పిశాచాన్ని చీల్చి చెండాడాలని ఉంది’
ఈ పంక్తులు లోతైన భావాలతో ముడిపడి ఉన్నాయి. మనలో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, సమాజంలో ఉన్న దుష్ట శక్తులపై పోరాడే సంకల్పాన్ని ప్రేరేపిస్తున్నాయి. సింహం ధైర్యానికి, శక్తికి, స్వేచ్ఛకు ప్రతీక. మనిషి సింహంలా ధైర్యంగా, అమితమైన శక్తితో సమాజంలో నిలవాలి అనే సూచన కనబడుతుంది. జీవితం మనకు పరీక్షలు పెట్టినప్పుడు ఒక్క క్షణం నిబ్బరంగా నిలబడటం చాలా ముఖ్యం అని కవితలోని భావాలు చెబుతున్నాయి. మనిషి తనలోని శక్తిని పూర్తిగా వినియోగించుకోవాలి. మనిషి తాను ఏమిటి?తన ఉనికి ఏమిటి? అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా బెంబేలుపడి బెదిరిపోకూడదు. మనిషి తనలోని శక్తులను గుర్తించి ధైర్యంతో ముందుకు సాగాలి. ‘స్వార్థ పిశాచాన్ని చీల్చి చెండాడాలని ఉంది’ అంటున్నాడు కవి. సమాజంలో నివసిస్తున్న మనం స్వార్థంతో, స్వలాభంతో ఇతరులను దోపిడీ చేసే దుష్ట ఆలోచనలను దూరం చేయాలి. మనిషిలో స్వార్థం ఒక రాక్షస శక్తి వలె ఉంటుంది. మనిషి తనలోని స్వార్థాన్ని విడనాడాలి. స్వార్థం సంకుచిత మనస్తత్వాన్ని సూచిస్తుంది. నిలువెల్లా పేరుకుపోయిన స్వార్థం మనిషిని ధర్మం నుండి దూరం చేస్తుంది. స్వార్థం అనేది రాక్షసత్వంతో ముడిపడి ఉంటుంది. స్వార్థాన్ని కవి పిశాచంతో పోల్చాడు. స్వార్థం తలకెక్కి పిశాచంగా ప్రవర్తించే వారిని ధైర్యంగా ఎదుర్కొవాలి. సమాజంలో నెలకొన్న స్వార్థాన్ని నాశనం చేయాలి అనే హితవు ఇందులో కనబడుతుంది. స్వార్థ శక్తులపై పోరాటం అంటే వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంలోనే కాదు. సమాజంలో పెచ్చు పెరిగిపోయిన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు మరియు అప్రజాస్వామ్య శక్తులను ధైర్యంగా ఎదుర్కోవాలి అని తెలియజేస్తుంది. మనిషి ధైర్యంగా, నిబ్బరంతో జీవించాలి. ధర్మాన్ని పాటించాలి. మనిషి స్వార్థంతో కేవలం సొంత ప్రయోజనాలను ఆశిస్తే అది సమాజానికి తీవ్రమైన హానిని కలిగిస్తుంది. అందుకే ఒక్క క్షణం సింహం వలె స్వార్థానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఇది మనిషిలోని ఆత్మ నిబ్బరం మాత్రమే కాదు, సామాజిక దృక్పథం అని చెప్పిన తీరు చక్కగా ఉంది. మనలోని సామాన్యుడికి మేలుకొలుపు. సమాజం అభివృద్ధి కొరకు న్యాయాన్ని నిలబెట్టాలి. స్వార్థాన్ని అణిచివేయాలి.ధైర్యంగా ముందుకు సాగాలి అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.
‘ఒక్క క్షణం వెన్నెలనై వ్యాపించాలని ఉంది
హింసా చీకట్లను తరిమివేయాలని ఉంది’
ఈ పంక్తులు అద్భుతమైన భావాలతో అలరారుతు ఉన్నాయి. వెన్నెల ఎంత స్వచ్ఛంగా, నిశ్శబ్దంగా ఉంటుందో అలాగే మన హృదయం కూడా ఆ క్షణంలో స్వచ్ఛంగా అనుభూతి చెందాలనే గాఢమైన భావన. వెన్నెల అనేది స్వచ్ఛత, నిశ్శబ్దం మరియు ప్రశాంతతకు ప్రతీక. మనసులోని ఆలోచనలను, సంక్లిష్టతలను దూరం చేసి ఆ క్షణం వెన్నెల వెలుగు నింపాలని సూచిస్తుంది. వెన్నెలనై అంటే మనసు ప్రశాంతంగా మారి చుట్టూ ఉన్నవారికి కూడా సానుకూలతను అందించాలి. అంతర్లీనంగా చెప్పేది ఏమిటి?అంటే మనం స్వచ్ఛమైన, పవిత్రమైన జీవితాన్ని గడపాలి. హింసా చీకట్లను తరిమి వేయాలని ఉంది. ఇక్కడ చీకట్లు అనే పదం గాఢమైన నిశ్శబ్దం, విషాదాన్ని సూచిస్తుంది. చీకట్లు అనేది మనసు, సమాజం, ప్రపంచంలో ఉన్న ప్రతికూల శక్తులకు ప్రతీక. హింసకు సంకేతమైన ఆ చీకట్లను అజ్ఞానం, బాధలు అన్నింటిని తొలగించాలి. స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి ఉండాలి అని మనసులోని కోరికను తెలియజేస్తున్నది. హింస అంటే కేవలం దౌర్జన్యం మాత్రమే కాకుండా మనసులోని బాధలు, ద్వేషం, అలజడి వంటి నెగటివ్ భావాలను సూచిస్తుంది. ఈ చీకట్లు మనం పంచే వెలుగుతో, ప్రేమతో తొలగిపోవాలని కోరుకుంటున్న భావన ఇది. ఈ కవితా పంక్తులు మానవ జీవితంలో ప్రశాంతతను, సానుకూలతను సూచిస్తాయి. ఒక శ్రేయస్సును కలిగించే భావజాలాన్ని ప్రతిపాదిస్తాయి. వెలుగుకు ప్రతీకలైన ధర్మం, శాంతి, ప్రేమ నెలకొని, ముసురుకున్న చీకట్లు తొలగి పోతాయి అనే ఆశాభావం వ్యక్తం అవుతున్నది.
‘ఒక్క క్షణం దారంగా ఉండిపోవాలని ఉంది
మమతల కుసుమాల్ని హారంలో చేర్చాలని ఉంది’
ఈ పంక్తులు గుండె నుంచి వెలువడిన లోతైన భావాల సమాహారం. ఒక్క క్షణం దారంగా మారి మనుషుల మమతల కుసుమాల్ని హారంలో చేర్చాలని భావిస్తున్నాడు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం వంటి అందమైన భావాలను కలిపి ఒక హారంలా తయారు చేసి దానిని అందంగా రూపొందించాలనే ఆకాంక్షను తెలియజేస్తున్నాడు. మమతల కుసుమాలు ప్రేమ, ఆప్యాయత, అనురాగం వంటి భావాలను సూచిస్తాయి. ఆ ప్రేమ, అనురాగం, ఆత్మీయత అన్నింటిని కలిపి ఒక అందమైన అనుబంధంగా మార్చాలి. ఇది అనుబంధాల సౌందర్యాన్ని వాటి విలువను తెలియ జేస్తుంది. మనసులోని అందమైన భావాలు, జ్ఞాపకాలతో రాశీభూతమైన క్షణాలుగా మార్చుకోవాలన్న ఆశయాన్ని తెలియజేస్తుంది. మనిషి జీవితంలో ప్రేమ, అనుబంధాలు, మనసుకు ఆనందాన్ని, ప్రేరణను అందిస్తాయి. మనుషులను ప్రేమతో ఒక్కటిగా చేయాలనే గొప్ప భావన ఈ కవితలో వ్యక్తం చేయబడినది.
‘ఒక్క క్షణం సూర్యుడిగా మారాలని ఉంది
మానవతా కిరణాలను ప్రసరింప చేయాలని ఉంది’
కవితలోని భావాలు ప్రేరణాత్మకమైనవి. ఒక్క క్షణం సూర్యుడిగా మారాలని ఉంది అంటే తాను చాలా వేగంగా ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి, శక్తివంతమైన మార్పును తీసుకురావాలి అని కవి కోరుకుంటున్నాడు. సూర్యుడు మనకు ప్రేరణను, శక్తిని అందిస్తాడు. తాను సూర్యుడిగా మారాలి అంటే చుట్టు నెలకొని ఉన్న పరిసరాలను వెలిగించే స్తోమతను, ప్రజలకు ఉత్తేజాన్ని మార్పులు తెచ్చే శక్తిని పొందడం అని అర్థం. మానవతా కిరణాలను ప్రసరింప చేయాలి అంటే ఇతరులకు తాను సహాయం చేయాలని, ప్రేమతో, దయతో ప్రపంచాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు భావించవచ్చు. ఈ కవితా పంక్తి ద్వారా ప్రపంచం అంతటా మానవతా విలువలను, ప్రేమను, దయను, సహకారాన్ని విస్తరింప చేయాలి అని భావిస్తున్నాడు. కిరణాలు అనే పదం వెలుగును, జీవనోత్సాహాన్ని కొత్త ఆలోచనలను సూచిస్తుంది. మానవతా కిరణాలు అనడం చేత మనిషి హృదయంలో నెలకొని ఉన్న మానవత్వం, దయ, ప్రేమ, సహాకార భావాలను ప్రపంచమంతటా వ్యాపింప జేయాలి అనే భావన వ్యక్తం అవుతుంది. ప్రపంచంలో మంచితనాన్ని, జ్ఞానాన్ని మరియు ప్రేమను విస్తరించే ఉద్దేశాన్ని చూపుతుంది. విశ్వ వ్యాప్తంగా మార్పును తీసుకురావాలి. ఇతరుల జీవితాలను మెరుగుపరచాలి అనే గొప్ప సందేశం ఈ కవితలో వ్యక్తం అవుతుంది.
‘ఒక్క క్షణం మహాత్మునిగా మారాలని ఉంది
స్వర్ణ యుగాన్ని సృష్టించాలని ఉంది’
తాను ఒక మహానుభావునిగా మారాలి. సమాజంలో మార్పు తీసుకు రావాలి అనే గొప్ప ఆలోచనలు తనలో కలుగుతున్నాయి. ఏదో సాధించాలన్న తపన తనలో వ్యక్తం అవుతున్నది. ఒక్క క్షణం మహాత్మునిగా మారాలని ఉంది అనడం వల్ల మనసులో ఒక గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండి సమాజంలో తాను ఇతరులకు మార్గదర్శకుడు కావాలి అనే కాంక్షను తెలియజేస్తుంది. తాను మనస్సులో మహాత్మునిగా మారాలని కోరుకుంటున్నాడు. మహాత్మునిగా మారాలి అంటే తనలో సద్గుణాలు, త్యాగం, శాంతి, దయ వంటి లక్షణాలు ఉండాలి. తాను సాధారణ మనిషి స్థాయి నుండి ఒక అసాధారణమైన మహాత్మునిగా మారాలి అనే గొప్ప లక్ష్యాన్ని ఎన్నుకున్నాడు కవి.
స్వర్ణ యుగాన్ని సృష్టించాలని ఉంది అనడంలో పూర్వ కాలంలో ఉన్న ఉత్తమ సమాజాన్ని స్థాపించాలి అనే తపన కనబడుతుంది. ప్రజలు అందరు శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వంతో జీవనం సాగించాలి అనే గొప్ప ఆకాంక్ష వ్యక్తం అవుతున్నది. అందుకు సమాజంలో మార్పు అవసరం. ఒక ఉత్తమ సమాజం కొరకు అడుగులు పడాలి. స్వర్ణ యుగాన్ని సృష్టించాలి అని చెప్పే భావన గొప్పగా ఉంది.
‘అందుకే.. ఆ మధుర క్షణం కోసం నిరీక్షించాలని ఉంది
ఆ క్షణంలోనే ఇదంతా సాధిద్దామని ఉంది’
చక్కటి కవితను రాసిన కవి మనోహర్ రెడ్డిని అభినందిస్తున్నాను. వీరు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.