Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు భాష ఘనతను చాటిన కవిత ‘తెలుగు వాడా!’

[శ్రీ రేగులపాటి కిషన్ రావు రచించిన ‘తెలుగు వాడా!’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

ప్రముఖ కవి, రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, రేగులపాటి కిషన్ రావు కలం నుండి జాలువారిన ‘కాంతి పుంజం’ కవితా సంపుటిలోని ‘తెలుగువాడా!’ కవిత పై విశ్లేషణా వ్యాసం  ఇది. తెలుగు వాడా! కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నన్ను ఆలోచింపజేసింది. కవిత శీర్షిక పేరు తెలుగు వాడా.

తెలుగు వాడా అంటే ఎవరు? తెలుగు భాష మన మాతృభాష. ఒక ప్రాంతంలో జీవించే జనుల మధ్య సంభాషణకు ఉపయోగించే సహజమైన భాష. ఆ ప్రాంతపు భాషగా తెలుగు గుర్తింపు పొందుతుంది. ఆ ప్రాంతంలో నివసించే అందరూ అదే భాషను మాట్లాడడం జరుగుతుంది. చిన్నప్పటినుండి అమ్మ దగ్గర నేర్చుకున్న భాష తెలుగు భాష. తెలుగు మాట్లాడేవాడిని తెలుగువాడు అంటారు. తెలుగు వాడు ఎట్లా ఉండాలి? తెలుగు వాడు ఎట్లా నడుచుకోవాలి? తెలుగువాడు తెలుగు భాషను ఇష్టపడే వాడై ఉండాలి. తెలుగువాడు తెలుగు భాషను గౌరవించాలి. తెలుగువాడు తెలుగు భాషను నేర్చుకోవాలి. తెలుగువాడు తెలుగు భాషను ప్రేమించాలి. తెలుగువాడు తెలుగు భాష అభివృద్ధికి దోహదం చేయాలి. తెలుగు వాడు అన్ని రకాల కార్యక్రమాలలో తెలుగు భాష అమలు కోసం ప్రయత్నం చేయాలి.

తెలుగువాడా కవితను చదివిన తర్వాత కిషన్ రావుకు తెలుగు భాష పట్ల అమితమైన అనురాగం ఉందని తెలుస్తుంది. కిషన్ రావు తెలుగు భాష విశిష్టతను తెలుసుకున్నారు. కిషన్ రావు తెలుగు భాష మీద అభిమానంతో కథలు, గేయాలు, కవితలు, నాటికలు, వ్యాసాలు, విమర్శ గ్రంథాలు, గజల్స్, రుబాయిలు, నానీలు, యాత్ర సాహిత్యం కూడా అందించారు. కిషన్ రావు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారని చెప్పడంలో సందేహం లేదు.

తెలుగు భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో తెలుగు రాజభాష. త్రిలింగ పదం నుంచి తెలుగు వెలువడింది అంటారు. శాతవాహన రాజులు సంకలనం చేసిన గాధా సప్తశతి మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. తెలుగు భాష మూల పురుషులు ఏనాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారం తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాల నాటిది. భాష అంటే ఏమిటి? మనసులోని భావనను బహిర్గత పరిచే సాధనం భాష. స్పష్టమైన ఉచ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేట్లు చెప్పగలడమే భాషకు నిర్వచనం. భాషకు మాటలతో అవసరం లేదు. సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాష అవుతుంది. మానవజాతి ఆవిర్భావం నాటి నుండి ఆధునిక మానవుని వరకు మనిషి అవసరాలలో పెరిగిన మార్పులు అభిప్రాయ వ్యక్తీకరణలో చోటుచేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, భావోద్వేగాల సమ్మేళణము, మాటల ఆవిర్భావానికి కారణభూతమైంది. విశ్వ ఆవిర్భావ క్రమంలో ఇదో అద్భుతం.

దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు. భావాన్ని వ్యక్తం చేయడానికి భాష అవసరం. భాష నాగరికతతో పాటు వృద్ది చెందుతుంది. భాష పుట్టిన చాలా కాలం వరకు ఆ భాషకు లిపి ఉండదు. లిపి ముందుగా రాజ్య వ్యవహారాల కోసం పుడుతుంది. కాని వాఙ్మయం కోసం కాదు. మాట్లాడే భాషను లిఖితపూర్వకంగా గుర్తించడాన్ని లిపి అంటారు. ఒక్కో భాషకు ఒక్కో లిపి ఉంటుంది. లిపిలేని భాషలు ఉన్నాయి. మనిషికి ప్రకృతికి సంబంధం ఉంది. మనిషి తన భావ ప్రకటన కోసం ప్రకృతిని సహజంగా వాడుకుంటాడు. భాషని శక్తివంతంగా మలుచుకోవడానికి ప్రకృతిలోని చెట్లను, చేమల్ని, జంతువులను, పక్షులను ఇలా అన్నింటిని వాడుకుంటాడు. 12వ శతాబ్దంలో పాల్కురికి సోమనాథుడు నవ లక్ష తెలుంగు అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణం కలిగిన తెలుగుదేశం అని వర్ణించాడు. తెలుగు అజంత భాష అనగా ప్రతి పదం ఒక అచ్చుతో అంతం అవుతుంది. 15వ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటే తెలుగుని ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్, ప్రాచ్య ఇటాలియన్‌గా అభివర్ణించాడు.

‘తెలుగు వాడా! వెలుగు వాడా!
తెలుగు భాషను ఆదరించీ
తెలుగు భాషను అభ్యసించీ
తెలుగు భాషను ఉద్ధరించుమురా.’

తెలుగు రాష్ట్రంలో జన్మించిన వాడు తెలుగువాడుగా పిలవబడతాడు అని చెప్పవచ్చు. తెలుగువాడు తను పుట్టి పెరిగిన ఊరి వాళ్ళలా పల్లె భాషలో మాట్లాడటం, పల్లె సంస్కృతికి నిదర్శనంగా చెప్పవచ్చు. తెలుగు వాడు తెలుగు భాష పట్ల మమకారం కలిగి ఆసక్తితో మాట్లాడుతూ ఉండాలి. తెలుగు భాషలో మాట్లాడటం వల్ల తెలుగుతనం యొక్క కాంతి అబ్బి తెలుగువాడు వెలుగు వాడు అవుతాడు అని చెప్పడం చక్కగా ఉంది.

తెలుగువాడు తెలుగు భాషను ఆదరించాలి. తెలుగువాడు తెలుగు భాషను అభ్యసించాలి. తెలుగువాడు మన పూర్వులు రచించిన తెలుగు పుస్తకాలు చదవాలి. పండితుల రచనలు చదివితే తెలుగు భాష గొప్పతనం గురించి అవగాహన వస్తుంది. తెలుగు భాష అభివృద్ధి కొరకు శ్రద్ధతో పని చేయాలి అనే సంకల్పం చెప్పడం చక్కగా ఉంది. కవి కిషన్ రావు తెలుగు భాష ప్రాముఖ్యతను ఎరిగిన వారు, తెలుగు భాషా ప్రేమికుడిగా తెలుగులో అపారమైన సాహిత్యాన్ని సృష్టించారు. అందుకే తెలుగు వాడిగా తెలుగు భాష వ్యాప్తి కొరకు పాటుపడాలని గుర్తు చేయడం మరియు కర్తవ్యం వైపు నడిచేలా చేయడం చక్కగా ఉంది.

‘తెలుగు కోసం తెలివి కోసం
తెలుగు పలుకులు పలికి పలికి
తెలుగు ఘనతను చాటి చెప్పే
తెలుగు తేజును పంచుచుండుమురా.’

చిన్ననాడు అమ్మ ఒడిలో నేర్చుకున్న భాష తెలుగు. ఉగ్గుపాలతో అమ్మ నేర్పిన విద్య తెలుగు. అమ్మ నుండి నడకను, నడతను నేర్చుకోవడం వల్లనే తెలుగు భాష వికాసం చెందింది. అమ్మ నుండి తెలుగు భాష పలుకులు పలకడం వల్లనే తెలివి కూడా పెరిగింది. తెలుగు పలుకులను పదే పదే పలకడం వల్ల తెలుగు భాష అలవడుతుంది. తెలుగు భాషను నేర్చుకొని తెలుగువాడుగా తెలుగు భాష యొక్క ఘనతను ప్రపంచానికి చాటి చెప్పాలి. తెలుగువాడు తెలుగు నేర్చుకున్న తెలుగు భాష యొక్క తేజస్సును అందరికీ పంచాలి. అప్పుడే తెలుగు భాష యొక్క ప్రయోజనం సిద్ధిస్తుందని కవి కిషన్ రావు పేర్కొనడం చక్కగా ఉంది.

‘తెలుగు పాటలు పాడ నేర్చీ
తెలుగు కథలను చెప్ప నేర్చీ
తెలుగు కావ్యం చదువ నేర్చీ
తెలుగు వక్తగా మెప్పు పొందుమురా.’

తెలుగువాడా తెలుగు పట్ల అనురక్తితో భాషలోని కమ్మనైన పాటలను నేర్చుకుని పాడితే తెలుగు భాష యొక్క కమ్మదనం వ్యాప్తి అవుతుంది. తెలుగువాడా కథలను చదువుము. తెలుగు కథల్లో గల మాధుర్యం భాషా వైవిధ్యం, నీతి, పదుగురికి అర్థమయ్యేటట్లు రమ్యంగా చెప్పమంటున్నారు. తెలుగులో ఉన్న కావ్యములను బాగా చదివి భాష యొక్క సౌందర్యం విశిష్టతను గురించి వివరించమని చెప్తున్నారు. తెలుగు భాషలోని పాటలను, కథలను, కావ్యములను చదివి అపార జ్ఞానం పొంది తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి ఉపన్యాసం ద్వారా తెలియజేయమని చెప్తున్నారు. తెలుగువాడిగా తెలుగు వక్తగా ఘన కీర్తిని గడించమని కోరుతున్నారు.

‘తెలుగు ఘనతను తెలియజేసే
తెలుగు సాహితీ చదివి చదివీ
తెలుగువారల కవన ఘనతను
తెలుగు భాషలో చెప్పుచుండుమురా.’

తెలుగు భాష యొక్క ఘనతను తెలియజేసే సాహిత్య గ్రంథాలను ఆధ్యయనం చేసి తెలుగు భాషలో రచించిన కవుల గ్రంథాల యొక్క గొప్పతనాన్ని వ్యక్తము చేయుము అని చెప్పుచున్నారు. ఏదైనా ఒక భాషలో అక్షర జ్ఞానం ఉంటే ఆ భాష మాట్లాడే ప్రాంతంలో మన జీవనానికి భాష ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగు భాష వల్ల మనోభావం మాటలలో కచ్చితంగా వ్యక్తం చేయగల అవకాశం ఉంటుంది. తెలుగు భాషలో రచించిన పుస్తకాలు తెలుగువారే వ్రాసి ఉండడం వలన వాటిని చదివి అర్థం చేసుకోవడానికి మనకు తెలుగు భాష వచ్చి ఉండాలి. తెలుగు చదవడం వల్ల తెలుగు భాష గొప్పతనం మనకు తెలుస్తుంది. తెలుగువాడిగా తెలుగు భాష యొక్క విశిష్ట గ్రంథాల గొప్పతనాన్ని తెలియజేయమని చెప్పడం చక్కగా ఉంది.

‘తెలుగువారలు మెచ్చునట్లుగా
తెలుగు భాషను వ్యాప్తి చేసే
తెలుగు తనయులు సంతసించగా
తెలుగు సంస్కృతి చాటి చెప్పుమురా.’

తెలుగు ప్రాంతాల్లో నివసించే తెలుగు వారు మెచ్చునట్లుగా తెలుగు భాష వ్యాప్తి కొరకు కృషి చేయమని కోరుతున్నారు. తెలుగువారు ఆనందించినట్లుగా మన తెలుగు భాష సంస్కృతి యొక్క విశిష్టతను చాటి చెప్పుము అని తెలియజేయడం చక్కగా ఉంది. తెలుగు భాష ప్రాధాన్యత కోల్పోయి ఆంగ్ల విద్య పట్ల ఆదరణ పెరిగింది. కవి కిషన్ రావు తెలుగు భాషా ప్రేమికుడిగా తెలుగు భాష విశిష్టతను తెలియజేస్తూ తెలుగువాడు తెలుగు భాష ప్రాధాన్యతకై కృషి చేయాలని పేర్కొనడం అద్భుతం.

తెలుగు భాష ప్రాధాన్యత సంతరించుకొని ప్రాథమిక విద్య నుండి కళాశాల విద్య వరకు తెలుగు భాషను బోధనా భాషగా అమలు చేయాలి. తెలుగు భాష నిరాదరణ మంచిది కాదు. తెలుగు వాళ్లంతా తెలుగు భాష పరిరక్షణ కొరకు పాటుపడాలి. మన మాతృభాష అయిన తెలుగుతో పాటు మనం ఇతర భాషలను కూడా సులభంగా నేర్చుకోగలుగుతాం. మన మాతృభాష పట్ల ఆదరణ వల్ల మన రాష్ట్రం సుసంపన్నమై సుభిక్షంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. తెలుగు భాష స్వర్ణ యుగం కొరకు మనమంతా ఉద్యమించాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతో ఉంది. ‘తెలుగు వాడా’ కవితను విరబూయించిన కిషన్ రావు యొక్క కృషిని అభినందిస్తున్నాను.


రేగులపాటి కిషన్ రావు 12- 01-1948 రోజున జన్మించారు. వీరు చింతల ఠాణం గ్రామం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు. వీరి తల్లిదండ్రులు చంద్రమ్మ, భూం రావు, వీరి తండ్రి భూం రావు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు.

కిషన్ రావు 1 వ తరగతి నుండి 5వ తరగతి వరకు చింతల ఠాణం గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో చదివారు. 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల, వేములవాడలో చదివారు. 9వ తరగతి నుండి 11 వ తరగతి వరకు సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివారు. కి‌షన్ రావు డిగ్రీ, ఎం.ఏ. ప్రైవేట్ గా చదివారు. కిషన్ రావు టీచర్ ట్రైనింగ్ ప్రభుత్వ శిక్షణ కళాశాల, బాల్కొండలో పొందారు. కిషన్ రావు బీఈడీ ప్రభుత్వ శిక్షణ కళాశాల, తిరుపతిలో చదివారు. కిషన్ రావు 28-10-1970 రోజున గుంజపడుగ గ్రామం, మంథని తాలూకాలో టీచరుగా ప్రభుత్వ పాఠశాలలో నియమించబడ్డారు. కిషన్ రావు 31-01-2004 రోజున స్కూల్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ పాఠశాల, ఇల్లంతకుంట గ్రామము, మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పదవీ విరమణ పొందారు.

రేగులపాటి కిషన్ రావు వివాహము విజయలక్ష్మితో 31 మే 1964 రోజున గూడెం గ్రామం,ముస్తాబాద్ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. రేగులపాటి కిషన్ రావు విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. ప్రథమ సంతానం: ఆలూరి కవిత. భర్త: ఆనందరావు. ఆనందరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆనందరావు దంపతులకు ఇద్దరు సంతానం.1) నిహిత్ రావు 2) నిర్మయ్.

2) ద్వితీయ సంతానం: అజిత. అజిత అనారోగ్యంతో ఏడు సంవత్సరాల వయసులోనే ఈ లోకాన్ని వీడిపోయింది.

రేగులపాటి కిషన్ రావు సహచరి విజయలక్ష్మి కథా రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. విజయలక్ష్మి 20 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేశారు. విజయలక్ష్మి నాలుగు పుస్తకాలు వెలువరించారు. 1) మొగిలిపూలు నానీలు, 2007 2) పరిష్కారం కథల సంపుటి, 2008 3) అంతరించిన ఆదర్శాలు కథల సంపుటి, 2012 4) మమకారం కథల సంపుటి, 2013.

రేగులపాటి కిషన్ రావు రచించిన ముద్రిత కథా సంపుటాలు:

1) కథక చక్రవర్తి 2008 2) సంస్కారం కథలు 2012 3) ఈ తరం పెళ్లి కూతురు 2013 4) అన్వేషణ 2014 5) పరిమళించిన మానవత్వం 2014 6) నవ చైతన్యం 2016

కిషన్ రావు రచించిన ముద్రిత నవలలు:

1) ఆమె వితంతువు కాదు, 1976 2) ప్రతివ్రత ఎవరు?, వాణిశ్రీ 1978 3) సంఘర్షణ 1981 4) ప్రేమకు పెళ్లెప్పుడు? 1982

రేగులపాటి కిషన్ రావు రచించిన ముద్రిత కవితా సంపుటాలు.

1) ప్రగతి పాటలు, 1982 2) కవితా పుష్పాలు, 1984 3) కొత్త పాటలు, 1985 4) మల్లె మొగ్గలు, 1986 5) రవిబింబం, 1989. 6) పాడవే కోకిలా! 1996. 7) కలం బలం, 1996 8) మన ధర్మం, 1997 9) సజీవ సత్యాలు, 1997 10) కాంతిపుంజం, 1999 11) ప్రగతి రథం, 2001 12) గెలుపొందిన పావురం, 2001 13) అక్షర సౌజన్యం, 2010

రేగులపాటి కిషన్ రావు రచించిన ముద్రిత గ్రంధాలు.

1) వ్యాస సంపుటి వ్యాస మంజరి,1989. 2) సాహితీ సౌరభం సమీక్ష వ్యాసాలు, 2007. 3)భాగవత విష సర్పం (విమర్శ)1980. 4) మా ఢిల్లీ యాత్ర కథాంజలి పత్రికలో సీరియల్ గా 1986 నవంబర్ నుంచి జనవరి 1987 వరకు వచ్చింది.

రేగులపాటి కిషన్ రావు రచించిన అముద్రిత గ్రంధాలు:

1) వెలుగు నానీలు 2) గజల్స్ కవితలు 3) రుబాయిలు.

రేగులపాటి కిషన్ రావు రాసిన కవితలు రేగులపాటి మాధవరావు హిందీలోకి అనువదించి విజయ్ రాగ్ పేరుతో పుస్తకంగా ప్రచురించారు.

రేగులపాటి కిషన్ రావు సాహిత్యం పై పీహెచ్.డి సిద్ధాంత గ్రంథం వెలువడింది. రేగులపాటి కిషన్ రావు గారి జీవితం, సాహిత్యం – ఒక అధ్యయనం. పరిశోధకులు: కటుకం శారద.

రేగులపాటి కిషన్ రావు రచించిన కవితలు వివిధ సాహితీ సంస్థలు ముద్రించిన కవితా సంకలనాల్లో ప్రచురింపబడ్డాయి. వాటి వివరాలు.

  1. కాళోజి నారాయణరావు గారి సంపాదకత్వంలో ప్రగతి సాహితీ సంస్థ న్యూఢిల్లీ వారు ప్రచురించిన జలపాతం కవితా సంకలనం.
  2. ఉదయ భారతి సాహితీ సంస్థ,తిరుపతి వారి మంజీర స్వరాలు కవితా సంకలనం.
  3. నటరాజ కళానికేతన్ ఎల్లారెడ్డిపేట కరీంనగర్ వారు ప్రచురించిన కిరణాలు – ఈతరం పాటలు”లో కవితా సంకలనం.
  4. డాక్టర్ రేగులపాటి మాధవరావు గారి సంపాదకతంలో సాహితీ సమితి వరంగల్ వారు ప్రచురించిన చిగుళ్ళు -శిఖరాలు కవితా సంకలనం.
  5. మానేరు రచయితల సంఘం,సిరిసిల్ల కరీంనగర్ వారు పత్తిపాక మోహన్ గారి సంపాదకత్వంలో ప్రచురించిన “అరవై నాలుగు వసంతాల సినారె “అభినందన కవితల పుస్తకం.

రేగులపాటి కిషన్ రావు పొందిన అవార్డులు పురస్కారాలు:

  1. ఉత్తమ కవితా బహుమతి: తెలుగు సాహితీ సమాఖ్య, కాకినాడ, 1985.
  2. సినారె సాహితీ పురస్కారం సిరిసిల్ల, 1995.
  3. ఉత్తమ కవితా అవార్డు: భావ తరంగిణి మాసపత్రిక, మచిలీపట్నం, 2005.
  4. మలయశ్రీ ప్రగతిశీల సాహితీ అవార్డు :నవ్య సాహిత్య పరిషత్,కరీంనగర్, 2009.
  5. రంగినేని సుజాత మోహన్ రావు ట్రస్ట్ పురస్కారం,సిరిసిల్ల.
  6. బాల సాహితీ మూర్తులు ఆత్మీయ సత్కారం, 2017.
  7. ఈగల్ ట్రస్ట్ కరీంనగర్ ఉగాది సన్మానం, బహుమతి, 2013.
  8. నారదాసు లక్ష్మణరావు ఉగాది పురస్కారం, 2013.
  9. సారస్వతి జ్యోతి మిత్రమండలి,బోయినపల్లి వెంకట రామారావు ప్రశంసా పత్రం,2007.
  10. లైన్స్ క్లబ్ కరీంనగర్ మానేరు వారిచే ప్రశంసా పత్రం,2006.
  11. శాతవాహన కళోత్సవాలు ప్రశంసా పత్రం, 2008.
  12. స్నేహ సేవా సమితి డాక్టర్ వై.వి. లక్ష్మీదేవి నేత్రనిధి వారిచే ప్రశంసా పత్రం.
  13. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ వారిచే ఉగాది కవి సమ్మేళనంలో ప్రశంసా పత్రం, 2008.
  14. ఉదయ సాహితీ కరీంనగర్ జిల్లా వర్ధమాన రచయితల మహాసభల సందర్భంగా ప్రశంసా పత్రం, 2006.
  15. ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు పొంది రెండుసార్లు సన్మానం పొందారు.

డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి 64 ఏటా సిరిసిల్లలో సినారె చేతుల మీదుగా విశిష్ట సాహితీ పురస్కారం పొందడం ఆనందం కలిగించిన అనుభూతులు అని కిషన్ రావు చెప్పుకున్నారు.

రేగులపాటి కిషన్ రావు టీచర్ ట్రైనింగ్ చేసినప్పుడు లంబాడి రామదాసు నాటికలో నటించారు. దొంగ వీరుడు నాటికలో నటించారు. కిషన్ రావు పార్కిన్సన్ వ్యాధికి గురై ఏడు సంవత్సరాలు అనారోగ్యంతో తీవ్రమైన బాధను అనుభవించారు. అనారోగ్యంతో ఉన్న కిషన్ రావుకు వారి జీవన సహచరి విజయలక్ష్మి సేవలు అందించారు. రేగులపాటి కిషన్ రావు అశేష సాహితీ లోకాన్ని శోక సాగరంలో ముంచి తేదీ 05-01-2023 రోజున భువి నుండి దివికి తరలి వెళ్లారు. రేగులపాటి కిషన్ రావు అందించిన సాహిత్య సంపద అమూల్యమైనది. ఎప్పటికీ నిలిచి ఉంటుంది. వారికి నా నివాళి అర్పిస్తున్నాను.

Exit mobile version