[డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘వైద్యుడు’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ సందినేని నరేంద్ర.]
ప్రముఖ కవయిత్రి, డాక్టర్ కందేపి రాణీప్రసాద్ కలం నుండి జాలువారిన ‘వైద్యుడు’ కవితపై విశ్లేషణా వ్యాసం ఇది. వైద్యుడు సమాజానికి చాలా ముఖ్యమైనవాడు. వైద్య వృత్తి చాలా పవిత్రమైనది. మనిషి జీవితంలో వైద్యుడు దేవునితో సమానం. వైద్యుని పాత్రను భావోద్వేగభరితంగా కవితలోని భావాలు ప్రతిబింబిస్తున్నాయి. కవయిత్రి రాణి ప్రసాద్ కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారిద్దాం. కవిత్వానుభూతుల లోకంలో విహరిద్దాం.
‘భువిలో ప్రాణాలు పోసే అపర బ్రహ్మలారా/’
ఈ కవితా పంక్తిలో వైద్యులను అపర బ్రహ్మలు అని సంబోధించడం రూపకాలంకారానికి చక్కటి ఉదాహరణ. ప్రాణం పోయే స్థితిలో ఉన్న రోగిని తిరిగి ఆరోగ్యవంతునిగా మార్చడాన్ని సృష్టి శక్తితో పోల్చారు.
‘ఇలలో ప్రాణుల సృష్టించే ధరణి దేవతలారా/’
ఇక్కడ వైద్యులను దేవతలుగా భావించడం జరిగింది. వైద్యులు అందించే సేవల వలన రోగుల కుటుంబాల్లో జీవితంపై ఆశలు చిగురించి ఆనందం వెల్లివిరుస్తుంది. సృష్టికి మూలం దేవుడు. భూమిపై జీవుల ప్రాణ రక్షణ చేసేది వైద్యుడు. అందుచేత వైద్యున్ని దైవ సమానుడిగా భావించిన తీరు కవితకు సహజత్వాన్ని అందిస్తుంది.
‘వందనాలు వందనాలు మీకు/వైద్యులారా!/
“ప్రణామాలు ప్రణామాలు మీకు/ప్రాణదాతలారా!/’
ఈ కవితా పంక్తులు వైద్యులకు ఎనలేని గౌరవాన్ని ప్రతిపాదిస్తాయి. పాఠకునిలో కూడా వైద్యుని పట్ల ఒక రకమైన భక్తిని కలిగిస్తుంది.
‘రాత్రైనా పగలైనా పేదోడైనా/
కుబేరుడైనా/
భరించలేని బాధలతో డాక్టరింటి/
తలుపు తడితే/
చీము నెత్తురితో మురిగి/
దుర్వాసన వచ్చినా/
అసహ్యించుకోకుండా పరీక్షించేది/
వైద్యుడే!/’
ఇది వైద్య వృత్తి యొక్క మహిమాన్వితతను, సేవా స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ వైద్యుడి సేవను, మానవతా ధర్మంగా చిత్రించిన తీరు వాస్తవికంగా ఉంది. విశ్రాంతి లేకుండా నిరంతరం సేవ చేసే వైద్యుని త్యాగాన్ని కవయిత్రి గుర్తించారు. సామాజిక స్థాయి ఏదైనప్పటికీ ధనవంతుడు, పేదవాడు అనే తేడాలు వైద్యుడికి లేవు. వైద్యుడి దృష్టిలో కేవలం రోగిగా మాత్రమే కనిపిస్తాడు. వైద్య సేవలోని సమానత్వం, కర్తవ్యనిబద్ధత వల్ల రోగి దేహంలోని అసహ్యకరమైన పరిస్థితులను కూడా సహనంతో ఎదుర్కొనే వైద్యుని మనోధైర్యాన్ని అభినందించాలి. వైద్యుడు కేవలం వృత్తిపరంగా మాత్రమే కాక సేవకుడిగా, రక్షకుడిగా రోగులని కాపాడుతాడు. రోగిని అసహ్యించుకోకుండా పరీక్షించేది వైద్యుడే. ఇక్కడ వైద్యునికి వృత్తి పట్ల గల మానవతా ధర్మం, కర్తవ్యం పట్ల గాఢమైన నిబద్ధత ప్రబలంగా వ్యక్తమయ్యింది. మన సమాజంలో వైద్యుని సేవ ఎంతో విశిష్టమైనది. వైద్యుడు సర్వ మానవ సమానత్వానికి ప్రతీకగా నిలుస్తాడు. ఒక వైపు రోగి యొక్క నిస్సహాయ స్థితి, మరో వైపు వైద్యుని కర్తవ్య నిబద్ధత, సహనం, రోగులను సేవించడంలోని పవిత్రతను తెలియజేస్తాయి. వైద్యుడు తన వ్యక్తిగత సౌఖ్యాన్ని, భయం, అసహ్యం అన్న వాటిని పక్కనపెట్టి ప్రాణ రక్షణ కోసం ప్రయత్నించే దేవదూతగా నిలుస్తాడు. వైద్యుడు మానవ రూపంలో ఉన్న దేవుడు. రోగి వైద్యుని ఇంటి తలుపు తట్టినప్పుడు దేవుని గుడి తలుపు తట్టినట్టుగా భావించవచ్చు. వైద్యుడు ఏ సమయాన అయినా నిరంతరం నిజాయితీగా సేవలను అందిస్తాడు. ఇది వైద్యవృత్తి యొక్క నిస్వార్థతతను సూచించే కీలకమైన భావన. ఇక్కడ కవితా చిత్రణ అత్యంత వాస్తవికంగా ఉంది. కష్టాల్లో ఉన్న మనిషి శరీర స్థితి ఎలా ఉన్నా వైద్యుడు అసహ్యించుకోడు, రోగిని కాపాడాలనే ఒకే ఒక్క తాపత్రయంతో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. ఈ కవితా పంక్తులు వైద్య వృత్తిలోని దయ, త్యాగం, ధైర్యం, ఒత్తిడిలను బలంగా వ్యక్తపరిచిన తీరు అద్భుతంగా ఉంది. వైద్యుడు భూమిపై బ్రహ్మ సృష్టి యొక్క ప్రతిరూపం. మనిషికి ప్రాణం పోసి రక్షించడానికి, కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి దేవుడే స్వయంగా మనిషి రూపంలో దిగి వచ్చాడు అనే భావనను కవయిత్రి వైద్యుని రూపంలో ప్రతిపాదించింది. వైద్యుడు చనిపోయే స్థితిలో ఉన్న రోగులకు జీవం పోసి సృష్టికర్తగా నిలుస్తున్నాడు. మనుషులను రక్షించే దేవతల బాధ్యతను భూమిపై వైద్యులే నిర్వర్తిస్తున్నారు అని ఈ కవితలో వైద్యుడు గొప్పతనాన్ని వ్యక్తం చేసిన తీరు బాగుంది.
‘గుండెకు చిల్లు పడినా పొట్టలో పుండు/
ఏర్పడినా/
మెదడు మాట విననన్నా కాలేయం/
కదలనన్నా/
బెత్తం తీసుకుని బెదిరించి గుంజీలు/
తీయించి దారిలోకి సవ్య మార్గంలోకి తెచ్చేది/
వైద్యుడే!/’
కవయిత్రి ఇక్కడ వైద్యుడిని ఒక జీవ రక్షక యోధుడిగా, ప్రాణ పునరుద్ధారకుడుగా చిత్రించారు. మనిషి శరీరంలో ఎలాంటి అవయవం తిరుగుబాటు చేసినా, ఆ బీభత్స పరిస్థితిని శాంతపరిచి దారిలోకి తీసుకు వచ్చేది వైద్యుడే. గుండె, పొట్ట, మెదడు, కాలేయం ఇవి ప్రధానమైన అవయవాలు. వాటిలో ఏదైనా క్రమబద్ధంగా పనిచేయకపోతే ప్రాణం ప్రమాదంలో పడుతుంది. అలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురై మరణం అంచుల్లోకి వెళ్లిన మనిషిని ఆరోగ్యవంతునిగా చేయడం వైద్యుడి చేతుల్లోనే ఉంది. అనారోగ్యంతో తిరుగుబాటు చేస్తున్న అవయవాలను సక్రమంగా పని చేయించే ప్రక్రియను బెత్తం తీసుకుని బెదిరించడంగా వర్ణించారు కవయిత్రి.
ఇది వైద్యుని నిపుణతను,శస్త్ర చికిత్సా సామర్థ్యమును తెలియ జేస్తుంది. గుండె, మెదడు, కాలేయం వంటి అవయవాలు పనిచేయని క్లిష్ట పరిస్థితుల్లో వైద్యుడు చికిత్సను అందించాల్సి ఉంటుందని కవయిత్రి అద్భుతంగా చిత్రించారు. తీవ్రమైన బాధతో, నిరాశతో వ్యవహరించే రోగిని ఆసుపత్రిలో పరీక్షించి మందులు ఇచ్చి సవ్యమైన ఆరోగ్యాన్ని అందించే వ్యక్తి వైద్యుడు అనే సందేశం ఈ కవితలో ఉంది. నొప్పికి చేసే చికిత్స, ఇంజక్షన్లు,శస్త్ర చికిత్సలు, ఆంక్షలు, ఆదేశాలు రోగిని రక్షించడానికి అవసరం అనే భావాన్ని బెత్తం రూపంలో కవయిత్రి చక్కగా ప్రతిపాదించారు. రోగి శరీరం తప్పు దారిలో నడిచినప్పుడు, అవయవాలు గతి తప్పినప్పుడు, ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు, ఆ శరీరాన్ని తిరిగి సరైన మార్గంలో నడిపేది వైద్యుడే. ఎంత తీవ్రమైన వ్యాధి శరీరాన్ని బాధించినా, అవయవాలు తమ సహజకర్తవ్యాన్ని విడిచిపెట్టినా, ఆ అస్తవ్యస్త పరిస్థితిని నియంత్రించి, శరీరాన్ని తిరిగి సాధారణ ఆరోగ్య స్థితికి మార్చేది – క్రమ పద్ధతిలో చికిత్స చేసి జీవన మార్గాన్ని సరిచేసేది వైద్యుడే అని కవయిత్రి తెలియజేస్తారు. ఈ కవితా పంక్తులలో గుండె పోటు, పొట్టలోని పుండు, కాలేయం వంటి ముఖ్య అవయవాలు వైఫల్యం పొందిన రోగి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా వైద్యుడు ధైర్యంగా ముందుకు వచ్చి చికిత్స చేసి ప్రాణాన్ని రక్షించే గొప్ప వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. ఎంత తీవ్రమైన వ్యాధి అయినా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినా, కఠినమైన చికిత్స పద్ధతులు ఉపయోగించి రోగిని తిరిగి ఆరోగ్యవంతునిగా చేసి ప్రాణం నిలబెట్టేది వైద్యుడే అని కవయిత్రి ప్రకటిస్తున్నారు.
‘కలరా, కరోనా, క్యాన్సర్ భూతాలు/
నెత్తికెక్కినా/
ఎయిడ్స్, ప్లేగు, మశూచి/
మహమ్మారులు చుట్టుముట్టినా/
జుట్టు పట్టుకుని లాక్కొచ్చి భూమి/
ఆవల విసిరి కొట్టి/
ఆరోగ్యం స్వస్థత చేకూర్చి/
నిలబెట్టింది వైద్యుడే!/’
డా. కందేపి రాణీప్రసాద్
ఈ కవితా పంక్తుల్లో కవయిత్రి వైద్యుడి మహత్తును, సమాజంలో అతని పాత్రను అతి శక్తివంతమైన రూపకాలతో ప్రతీకాత్మకంగా చూపించారు. రోగాలు, మహమ్మారులను, భయంకర భూతాలుగా చిత్రిస్తూ వాటితో యుద్ధం చేసే యోధుడిగా వైద్యుడిని ప్రతిష్ఠించారు. కలరా, కరోనా, ఎయిడ్స్, ప్లేగు, మశూచి వంటి చిన్న, పెద్ద మహమ్మారులు మానవజాతిని చుట్టుముట్టినా – అవి భూతాల్లా నెత్తికెక్కినా – మనిషిని ఆపదల నుంచి బయటకు తెచ్చేది వైద్యుడే అనే భావం స్పష్టంగా వ్యక్తం అయింది. వైద్యుడు మానవాళికి పరమ రక్షకుడు. ఇందులో రోగాలను భూతాలుగా మహమ్మారులను చీకటి శక్తులుగా చూపడం ద్వారా ఆపద ఎంత ఘోరమైనదో, పోరాటం ఎంత సంక్లిష్టమైనదో కవయిత్రి అద్భుతంగా చూపించారు. రోగాలను భూమి ఆవల విసిరి కొట్టడం అని చెప్పడం అతిశయోక్తి ద్వారా వైద్యుని ప్రతాపాన్ని వివరించింది. కవయిత్రికి వైద్య వృత్తి పట్ల కృతజ్ఞతా భావం ఉంది. మానవ జాతి రక్షణలో వైద్యుల నిరంతర పోరాటం అనే అంశాలను అద్భుతమైన కవితాత్మక రూపంలో వివరించారు. ఆరోగ్యాన్ని అందించి, స్వస్థత చేకూర్చేది వైద్యుడే అనేది కవితాసారంగా భావించవచ్చు.
‘కరుడు గట్టిన నేరస్తుడైనా/
దేశాన్నేలే ప్రధానైనా/
పుట్టిన పసిగుడ్డు నుంచి/
పండు ముదుసలి దాకా/
చదువురాని కూలీ ఐనా/
రాకెట్టు పంపే శాస్త్రవేత్తైనా/
మానవ రూపంలోని దేవుడైనా/
బతికించేది వైద్యుడే!/’
ఈ కవితా పంక్తులు వైద్య వృత్తి మహిమను అత్యంత ప్రభావవంతంగా విస్తృతమైన సామాజిక సందర్భాలతో చాటి చెబుతున్నాయి. మనిషి ఏ స్థితిలో ఉన్నా ఆఖరుకు తన జీవన రక్షణ కోసం వైద్యుడి దగ్గరికి చేరాల్సిందే అనే భావాన్ని కవయిత్రి శక్తివంతంగా ప్రతిపాదించారు. ఈ విభిన్న రోగుల ప్రధాన ఆశయం తమ ప్రాణాలను కాపాడుకోవడమే. మనిషి స్థాయి ఎంత ఉన్నతమైనదైనా, ఎంత తక్కువదైనా అతని జీవితాన్ని నిలబెట్టేది వైద్యుడు మాత్రమే. రోగి ప్రాణం, శ్వాస, ఆరోగ్యం అన్నవి చివరికి వైద్యుడు చేతుల్లోనే ఉంటాయి. రోగుల ప్రాణరక్షణకు తుది ఆధారం వైద్యుడు అనే భావాన్ని బలంగా వ్యక్తపరుస్తుంది ఈ కవిత. వైద్యుడు మానవ రూపంలోని దేవుడు అనేది శక్తివంతమైన రూపకం. రోగం యెదుట అందరూ సమానమే. వైద్యుడి సేవను కవయిత్రి కేవలం వృత్తిగా కాకుండా మానవత్వపు జీవిత రక్షణ ధర్మంగా చిత్రించిన తీరు అద్భుతంగా ఉంది. చక్కటి వైద్యుడు కవితను రాసిన కవయిత్రి కందేపి రాణీప్రసాద్‌ను అభినందిస్తున్నాను. వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
డా. కందేపి రాణీప్రసాద్ గారి పరిచయం, సంచికలో వారి ఇతర రచనల జాబితా ఇక్కడ చూడవచ్చు.
