Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కోవిడ్ మహమ్మారి దుష్ప్రభావాన్ని చాటిన కవిత ‘యాత్రా గాథ’

[ప్రముఖ కవి శ్రీ నందిని సిధారెడ్డి గారి ‘యాత్రా గాథ’ అనే కవిత విశ్లేషిస్తున్నారు నరేంద్ర సందినేని.]

ప్రముఖ కవి, రిటైర్డ్ తెలుగు భాషా ఉపన్యాసకులు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, డాక్టర్ నందిని సిధారెడ్డి కలం నుండి జాలువారిన ‘అనిమేష ఉపద్రవ గాథ’ కావ్యంలోని ‘యాత్రా గాథ’ కవిత పై విశ్లేషణ ఇది.

కోవిడ్ -19 మహమ్మారి చరిత్రను ‘యాత్రా గాథ’ రూపంలో కవి చిత్రించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రయాణాన్ని, దాని ప్రభావాలను, మానవ జీవితంలో తీసుకొచ్చిన మార్పులను ప్రతీకాత్మకంగా ఈ కవితలో ఆవిష్కరించారు. ఈనాటి ఆధునిక సమాజంలో ప్రపంచీకరణ వల్ల సంభవించిన మార్పులను, వాటి వెనుక ఉన్న చేదు వాస్తవాలను ఈ కవిత ఎంతో సూటిగా, గంభీరంగా విశ్లేషిస్తుంది. ఒక మహత్తర సామాజిక, ఆర్థిక పరిణామాన్ని కవి అద్భుతంగా చిత్రించారు.

ఇక ‘యాత్రా గాథ’ కవితా చరణాలలోకి దృష్టిని సారించి, కవి అందించిన భావజాలాన్ని, అలౌకిక అనుభూతుల విస్తార లోకాన్ని ఆస్వాదిద్దాం.

***

జీవితం దేశం వైపు చూస్తున్నది/దేశం ప్రపంచం వైపు పరికిస్తున్నది/ ప్రపంచం కాలం వైపు చూపిస్తున్నది

కవి ఒక భావ స్రవంతిని నిర్మిస్తూ వ్యక్తి నుండి దేశం, దేశం నుండి ప్రపంచం, ప్రపంచం నుండి కాలం వరకు దృష్టిని విస్తరింపజేశారు. ఈ పంక్తుల్లో విస్తరిస్తున్న దృక్కోణం ఒక ప్రయాణాన్ని సూచిస్తుంది. ఇక్కడ కవి మనిషి చూపు, ఆలోచన ఎలా విస్తరిస్తుందో క్రమబద్ధంగా (లీనియర్ ఆర్డర్ లో) చిత్రించారు.

జీవితం నుండి దేశం వైపుకు సాగిన పయనం: ఒక వ్యక్తి జీవితం తన చుట్టూ ఉన్న దేశ కాల పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. అందువల్ల అతని దృష్టి వ్యక్తిగత స్థాయి నుండి దేశం వైపుకి విస్తరిస్తుంది.

ప్రపంచం వైపు సాగిన పయనం: నేడు ఏ దేశం కూడా ఒంటరిగా ఉండదు. ప్రతి దేశం అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ, వాటి ప్రభావాలను పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగుతుంది.

ప్రపంచం నుండి కాలం వైపుకు సాగిన పయనం: ప్రపంచమంతా కాలం వైపు దృష్టిని సారిస్తోంది, రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో అనే అనిశ్చితి ఒక వైపు కొనసాగుతుండగా, మరొక వైపు కాలం తీసుకువచ్చే మార్పుల పట్ల ఆసక్తి, ఆలోచన పెరుగుతున్నాయి.

ఇందులో వాడిన ‘చూస్తున్నది’, ‘పరికిస్తున్నది’, ‘చూపిస్తున్నది’ అనే క్రియా పదాలు ఆలోచనల లోతును మరింత పెంచుతున్నాయి. ఈ పదాల ద్వారా దృష్టి క్రమంగా విస్తరిస్తూ మరింత గాఢమైన అవగాహన వైపు పయనిస్తున్నట్లు కవి సూచించారు.

 మొత్తంగా ఈ పంక్తుల్లో ఒక క్రమబద్ధమైన భావ ప్రయాణం కనిపిస్తుంది. వ్యక్తి జీవితం తన దేశ కాల పరిస్థితులతో అనుసంధానమై ఉంటుంది. దేశం అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తుంది. ప్రపంచం కాల గమనాన్ని అనుసరిస్తుంది. ఈ విధంగా స్థానికత నుండి విశ్వ వ్యాప్తత వరకు ఉన్న పరస్పర సంబంధాన్ని ఎంతో సమర్థంగా ఆవిష్కరించారు.

‘ప్రపంచీకరణ కదా/విపణులతో పాటు’

ఇక్కడ కవి నేటి ఆధునిక ఆర్థిక విధానమైన ప్రపంచీకరణను నేరుగా ప్రస్తావించారు. విపణి అంటే మార్కెట్. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రపంచమంతా ఒక పెద్ద మార్కెట్ గా మారిపోయింది. విదేశి వస్తువులు, విదేశి సంస్కృతి, విదేశి వ్యాపారాలు మన దేశంలోకి విచ్చలవిడిగా ప్రవేశిస్తున్నాయని ఈ పంక్తి సూచిస్తోంది.

‘విపత్తులు దిగుమతి చేసుకోవలసిందే’

దిగుమతి అవుతున్న విపత్తులు అనే భావ వ్యక్తీకరణలో వ్యంగ్యంతో పాటు హెచ్చరిక కూడా అంతర్లీనంగా ఉంది. ఈ పంక్తి కవితకు ప్రాణప్రదమైనదిగా నిలుస్తుంది. ఇందులో తీవ్రమైన వ్యంగ్యం (irony), సామాజిక స్పృహ ప్రతిఫలించాయి. ప్రపంచీకరణ ప్రభావంతో మనం కేవలం విదేశీ వస్తువులు, సాంకేతికత, విపణులను స్వీకరించడమే కాకుండా, వాటితో పాటు వచ్చే అంతర్జాతీయ సమస్యలు, సంక్షోభాలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కవి సూచిస్తున్నాడు. ఆర్థిక మాంద్యం, పర్యావరణ కాలుష్యం, కొత్త వైరస్‌ల కారణంగా వ్యాపించే మహమ్మారులు, పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో ఏర్పడే సామాజిక సమస్యలు వంటి అనేక ప్రతికూల పరిణామాలు మనం కోరుకోకపోయినా మన సమాజంలో ప్రవేశించి దానిలో అంతర్భాగమై పోతాయని కవి హెచ్చరిస్తున్నారు.

మొత్తంగా, ప్రపంచీకరణ ప్రయోజనాలతో పాటు దాని దుష్పరిణామాలను కూడా గుర్తించి, వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

‘ప్రపంచీకరణ కదా’ అనే పంక్తి ఈ కవితకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక వ్యాఖ్యగా మాత్రమే కాకుండా, తదనంతర భావాల ప్రవాహానికి ఉపోద్ఘాతంగా కూడా పని చేస్తుంది. ప్రపంచీకరణ కారణంగా దేశాల మధ్య వాణిజ్య, సాంకేతికత,సాంస్కృతిక సంబంధాలు విస్తరించినప్పటికీ, దాని ప్రతికూల ప్రభావాలు కూడా తప్పనిసరిగా ఎదురవుతాయని కవి సూచిస్తున్నారు. ఈ పంక్తిలో వ్యంగ్యాత్మక సామాజిక వ్యాఖ్య అంతర్లీనంగా ఉంది‌. ప్రపంచీకరణ వల్ల మార్కెట్లలో పెట్టుబడులు, వస్తువులు మాత్రమే కాకుండా, ఆర్థిక సంక్షోభాలు, పర్యావరణ సమస్యలు, మహమ్మారులు వంటి విపత్తులు కూడా సరిహద్దులను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తాయని కవి హెచ్చరిస్తున్నారు‌. ‘విపణులు’ మరియు ‘విపత్తులు’ అనే పదాల ధ్వని సారూప్యత కవితలోని భావగాంభీర్యాన్ని మరింత పెంచింది. సంక్షిప్తత, భావసాంద్రత, వ్యంగ్యం, సమకాలీన చైతన్యం ఈ కవిత ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. ఈ పంక్తుల ద్వారా ప్రపంచీకరణ యొక్క ద్వంద్వ స్వరూపాన్ని – అభివృద్ధికి అవకాశాలను

కల్పించడమే కాకుండా, ప్రమాదాలను కూడా వెంట తెచ్చిపెడుతుందనే వాస్తవాన్ని – కవి సమర్థంగా వ్యక్తీకరించారు. అందువల్ల ఈ కవిత ఆధునిక ప్రపంచ వ్యవస్థపై ఒక ఆలోచనాత్మక వ్యాఖ్యగా నిలుస్తుంది. క్లిష్టమైన ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాలను సామాన్యుడికి అర్థమయ్యేలా సులభమైన పదాలతో, పదునైన భావవ్యక్తీకరణతో కవి

ఆవిష్కరించారు. ‘విపణులు (లాభాలు, మార్కెట్లు) ఉన్న చోటే ‘విపత్తులు’ (నష్టాలు, ప్రమాదాలు) కూడా ఉంటాయనే ప్రపంచీకరణలోని అంతర్గత వైరుధ్యాన్ని కవి అత్యంత ప్రభావవంతంగా ఆవిష్కరించారు.

‘వాషింగ్‌టన్ వ్యాపారి/వలవేసి తెచ్చాడో/కాలిఫోర్నియా సుకుమారుని/కరచాలనం తెచ్చిందో/ఓడలో తేలి వచ్చిందో/ విమానంలో ఎగిరి వచ్చిందో’

ఇక్కడ వ్యాధి వ్యాప్తిలో ప్రపంచీకరణ రూపం స్పష్టంగా కనిపిస్తుంది. వైరస్ దేశంలోకి ఎలా ప్రవేశించిందో కవి ఇక్కడ ఊహాత్మకంగా చిత్రించారు. అంతర్జాతీయ వ్యాపారాలు, వాషింగ్టన్ వ్యాపారి, సంపన్నుల ప్రయాణాలు, విదేశీయులతో కరచాలనాలు, ఓడలు, విమానాల ద్వారా ఈ మహమ్మారి సరిహద్దులు దాటి వచ్చిందని పేర్కొన్నారు. ప్రపంచీకరణ వల్ల మనుషుల ప్రయాణాలు ఎంత సులభమయ్యాయో, వ్యాధుల వ్యాప్తి కూడా అంతే వేగంగా జరుగుతోందనే భావాన్ని కవి శిల్పాత్మకంగా ఆవిష్కరించారు.

ఈ పంక్తుల్లో కవి ప్రశ్నార్థక శైలిని ఉపయోగించారు. వ్యాపారం, ప్రయాణం, అంతర్జాతీయ సంబంధాలు, మానవ సంచారం – ఇవన్నీ ప్రపంచీకరణకు చిహ్నాలు. అదే మార్గాల ద్వారా వైరస్ కూడా ప్రపంచమంతా వ్యాపించిందనే భావనను కవి సూచించారు. ఇక్కడ ప్రశ్నలకు సమాధానం అవసరం లేదు; అవి ప్రపంచీకరణ యొక్క అనివార్య పరిణామాలను సూచించే కవితాత్మక దృశ్యాలుగా నిలుస్తాయి. ఈ చిత్రణ పాఠకులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.

‘న్యూయార్క్ ఊపిరితిత్తుల్ని చుట్టుకున్నది/రేవులో నౌకను పరీక్షించనందుకు/స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నివ్వెరపోతుంది/ట్విన్ టవర్స్/ట్విట్టర్‍లో ఆందోళన పడతాయి’

ఇక్కడ అద్భుతమైన మానవీకరణ personification మరియు రూపక అలంకారాలు ఉపయోగించారు.

‘న్యూయార్క్ ఊపిరితిత్తుల్ని చుట్టుకున్నది’ అనే రూపకం అత్యంత ప్రభావవంతంగా ఉంది. కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేసే వ్యాధి. అమెరికా ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన న్యూయార్క్ నగరాన్ని ఈ మహమ్మారి చుట్టుముట్టిన పరిస్థితిని కవి ఒక మనిషి శరీరంలోని ఊపిరితిత్తులను వ్యాధి ఆవరించినట్లుగా చిత్రించారు. ఈ రూపకం ద్వారా మహమ్మారి తీవ్రతను ఎంతో స్పష్టంగా, హృదయాన్ని తాకే విధంగా వ్యక్తపరిచారు. ఇక్కడ న్యూయార్క్ నగరం కేవలం అమెరికాకే కాకుండా, ప్రపంచ ఆధునిక నాగరికతకు ప్రతీకగా నిలుస్తుందని కవి సూచిస్తున్నారు.

‘రేవులో నౌకను పరీక్షించినందుకు/స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నివ్వెరపోతుంది’ అనే పంక్తుల్లో కవి ప్రతీకాత్మకతను చక్కగా వినియోగించారు. అమెరికా స్వేచ్ఛా భావనకు చిహ్నమైన Statue of Liberty ను సాక్షిగా నిలబెట్టి అధికార యంత్రాంగం ప్రదర్శించిన నిర్లక్ష్యంపై గాఢమైన విమర్శ చేశారు.

‘నివ్వెరపోతుంది’ అనే మానవీకరణ అలంకారం ద్వారా జాతీయ ప్రతీకకే ఆశ్చర్యం కలిగించే పరిస్థితి ఏర్పడిందని సూచించారు. స్వేచ్ఛకు, అమెరికా గర్వానికి ప్రతీకగా నిలిచిన ఆ విగ్రహం, తన కళ్ళ ముందే జరుగుతున్న ఘోర మరణాలను చూసి నివ్వెరపోయిందని చెప్పడం కవి ఊహాశక్తికి, భావవ్యక్తీకరణ నైపుణ్యానికి నిదర్శనంగా భావించవచ్చు.

‘ట్విన్ టవర్స్/ట్విట్టర్‌లో ఆందోళన పడతాయి’ అనే పంక్తుల్లో ఆధునిక సమాచార యుగాన్ని ప్రతిబింబించే వ్యంగ్య ధోరణి కనిపిస్తుంది. ఒకప్పుడు ఉగ్రవాద దాడులతో ప్రపంచాన్ని కుదిపేసిన World Trade Center జ్ఞాపకాలు, నేడు ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో చర్చకు వస్తున్న తీరు కలవరాన్ని కలిగిస్తుంది. ఉగ్రవాదుల దాడికి గురైన చారిత్రక ట్విన్ టవర్స్ జ్ఞాపకాలు, సామాజిక మాధ్యమాలన్నింటిని భయాందోళనలతో నింపుతున్నాయని కవి ఆధునిక కాలపు వాడుక భాషలో (contemporary imagery) వ్యక్తీకరించారు.

‘ట్విన్ టవర్స్’ మరియు ‘ట్విట్టర్’ పదాల ధ్వని సారూప్యత కవితకు శైలీ సౌందర్యాన్ని, వ్యంగ్యాత్మక ప్రభావాన్ని మరింత పెంచింది.

‘అధికారం ఉదాసీనత వెల వేల వేల ప్రాణాలు’

ఈ పంక్తిలో ప్రభుత్వాల నిర్లక్ష్యం, పాలనా వ్యవస్థల వైఫల్యం స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. ఇది పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే రాజకీయ విమర్శగా నిలుస్తుంది. వైరస్ తీవ్రతను ముందుగానే అంచనా వేయడంలో పాలకులు చూపిన ఉదాసీనత వల్ల వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని కవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పంక్తి ద్వారా పాలనా వ్యవస్థల నిర్లక్ష్యం కారణంగా సంభవించిన మానవ నష్టాన్ని కవి ఎత్తి చూపారు. ఇది కేవలం ఆరోగ్య సంక్షోభాన్ని మాత్రమే సూచించదు; పరిపాలనా వైఫల్యంపై చేసిన గట్టి విమర్శ కూడా.

‘వైద్యం చేయబోయి/వైద్యులే రాలిపోతున్నారు’

ఈ పంక్తి కవితలో అత్యంత విషాదభరితమైనది. ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులే తగిన రక్షణ కవచాలు లేక వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తుంది. ఇది సమాజం ఎదుర్కొన్న నిస్సహాయ పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ పంక్తులు అత్యంత మానవీయ భావాలను ప్రతిబింబిస్తాయి. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులే తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చిన విషాదాన్ని కవి హృదయ విదారకంగా చిత్రించారు.

‘రాలిపోతున్నారు’ అనే పదం, చెట్టు నుండి ఆకులు రాలినట్లుగా వైద్యులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారనే తీవ్రమైన బాధను, వేదనను వ్యక్తం చేస్తుంది.

‘మాస్కుల ధరలు మూడింతలు/వెంటిలేటర్లు దొరుకవు/పడకలు చాలవు’

ఈ పంక్తుల ద్వారా కవి మహమ్మారి కాలంలో నెలకొన్న దుర్భర పరిస్థితులను ఎంతో వాస్తవికంగా చిత్రించారు. మాస్కుల బ్లాక్ మార్కెట్, వెంటిలేటర్ల కొరత, ఆసుపత్రుల్లో పడకలు దొరుకని దుస్థితి ఈ పంక్తుల్లో ప్రతిఫలిస్తుంది. ‘పడకలు చాలవు’ అనే పదాల ద్వారా ఎంతటి అధికారంలో ఉన్న వారైనా ఈ మహమ్మారి ముందు నిస్సహాయులుగా మారాల్సి వచ్చిందనే సత్యాన్ని కవి సూచించారు. అలాగే, మహమ్మారి సమయంలో ఆరోగ్య వ్యవస్థ ఎదుర్కొన్న తీవ్రమైన సంక్షోభాన్ని యథాతథంగా ఆవిష్కరించారు. మార్కెట్ శక్తుల దోపిడి, వైద్య వనరుల కొరత, ప్రజల్లో నెలకొన్న ఆందోళన వంటి అంశాలన్నీ కొద్ది పదాల్లోనే ప్రభావవంతంగా ప్రతిబింబించబడ్డాయి.

‘రోజు రోజుకు రోగాలు ఇంతలింతలు’

ఈ పంక్తి ఆనాటి భయానక పరిస్థితుల తీవ్రతను సూచిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో కూడా సాగిన శవాల వ్యాపారాన్ని కవి ఇక్కడ ఎండగట్టారు. వ్యాధి వ్యాప్తి నియంత్రణ లేకుండా విస్తరిస్తున్న దృశ్యాన్ని కవి ప్రజల దైనందిన అనుభవంగా ఆవిష్కరించారు.

ఈ కవిత సమకాలీన చరిత్రను కవిత్వంగా మార్చింది. వార్తల్లో చూసే భయానక నిజాలను, అంతర్జాతీయ భౌగోళిక అంశాలను, న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్‍లను జోడించి ఒక ప్రపంచ స్థాయి విషాదాన్ని శక్తివంతంగా ఆవిష్కరించారు. పదాల ఎంపికలో ఉన్న పదును సమాజం పట్ల ఉన్న ఆర్తి ఈ కవితను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాయి. ప్రపంచీకరణ, మహమ్మారి, అధికార నిర్లక్ష్యం, వైద్యుల త్యాగం, ఆరోగ్య వ్యవస్థ సంక్షోభం వంటి అంశాలను సమన్వయ పరుస్తూ, ఆధునిక మానవ చరిత్రలో ఒక విషాద ఆధ్యాయాన్ని కవితాత్మకంగా నమోదు చేస్తుంది. రూపకాలు, మానవీకరణ వ్యంగ్యం, ప్రతీకాత్మకత వంటి కవితా శిల్పాల ద్వారా కవి సమకాలీన వాస్తవాన్ని శక్తివంతంగా ఆవిష్కరించారు.

‘ఉన్నవాళ్లు ఇంట్లో ఇంటర్నెట్లో ఎట్లో/తమను తాము బిగించుకోవచ్చు/మరో ఇల్లున్న వాళ్ళు/మరో నగరానికి తరలిపోవచ్చు’

ఈ పంక్తులు లాక్‍డౌన్ కాలంలో సమాజంలో ఉన్న వర్గ వైరుధ్యాలను, నాటి ఆర్థిక అసమానతలను ప్రతిబింబిస్తున్నాయి. ధనికులు – పేదల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కవి ఎండగట్టారు. ఆర్థికంగా స్థిరపడిన వర్గాలు లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమై ఇంటర్నెట్ వంటి సాంకేతిక వనరుల సహాయంతో సురక్షితంగా తమ పనులను కొనసాగించగలిగారు. ఈ పంక్తుల్లో ఆర్థికంగా బలమైన వర్గం పరిస్థితిని కవి చిత్రించారు. ఇంటి భద్రతలో ఉంటూ ఆన్‌లైన్ సౌకర్యాలు ద్వారా కొనసాగించే అవకాశం వారికి ఉంది. ‘ఇంట్లో ఇంటర్నెట్లో’ అనే పద ప్రయోగం ద్వారా, ధ్వన్యనుసరణతో కూడి ఉండటం వల్ల భావాన్ని మరింత ప్రభావవంతంగా వ్యక్తం చేస్తుంది. అలాగే, మరో ఇల్లు ఉన్న సంపన్నులు నగరాల్లోని రద్దీ, మహమ్మారి భయాల నుంచి తట్టుకోలేక ఫామ్ హౌస్‍లు లేదా ఇతర సురక్షిత ప్రాంతాలకు సులభంగా తరలిపోగలిగారు. ఈ పంక్తులు సంపన్న వర్గానికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నాయి. వారికి సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడటానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఒక ఇల్లు కాక మరొక ఇల్లు, ఒక నగరం కాక మరొక నగరం. ఈ విధంగా సామాజిక అసమానతలను కవి సూక్ష్మంగా విమర్శించారు.

‘ఎట్లో బిగించుకోవచ్చు’ అనే పద ప్రయోగం ద్వారా ధనిక వర్గానికి లాక్‌డౌన్ అనేది కేవలం ఒక చిన్న అసౌకర్యం మాత్రమేనని కవి వ్యంగ్యంగా సూచించారు. ఈ విధంగా సంక్షోభ సమయంలో కూడా వర్గాల మధ్య ఉన్న అవకాశాల అసమానతను కవి చక్కగా ఆవిష్కరించారు.

‘పని వాళ్ళకే నష్టం/పరిశ్రమ మూతబడితే/బతుకు మూతబడుతుంది’

‘పని వాళ్ళకే నష్టం’ అనే పంక్తి కవిత యొక్క హృదయంగా నిలుస్తుంది. రోజువారీ శ్రమపై ఆధారపడి జీవించే కార్మికులు, కూలీలు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసి బతికేవారు తమ జీవనాధారాన్ని కోల్పోయారని కవి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సంక్షోభం వల్ల కలిగే అసలు భారాన్ని మోయాల్సి వచ్చేది పనివాళ్లేనని ఈ పంక్తి సూచిస్తుంది. ‘పరిశ్రమ మూతబడితే/బతుకే మూతపడుతుంది’ అనే పంక్తులు రూపకాత్మకంగా ఎంతో శక్తివంతమైనవి. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, కర్మాగారాలు మూతపడటం అనేది కేవలం ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడమే కాదు; వాటిపై ఆధారపడిన వేలాది కుటుంబాల జీవన ప్రవాహం ఆగిపోవడమేనని కవి తెలియజేస్తున్నారు. ‘పరిశ్రమ’ మరియు ‘బతుకు’ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ పంక్తులు ఎంతో హృద్యంగా వ్యక్తీకరిస్తాయి.

ఈ భాగం కవితలో అత్యంత హృదయవిదారకమైనదిగా చెప్పవచ్చు. మానవీయ కోణంలో చూస్తే, ఇది శ్రామిక వర్గంపై పడిన కొరడా దెబ్బను ప్రతిబింబిస్తుంది. ధనికులకు లాక్‌డౌన్ కేవలం ఒక విరామం మాత్రమే అయితే, రోజువారీ కూలీలు, వలస కార్మికులు, పనివాళ్లకు, అది జీవన్మరణ సమస్యగా మారింది. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు మూతపడటంతో వారి ఉపాధి పూర్తిగా దెబ్బతింది. ‘పరిశ్రమ మూతబడితే బతుకే మూతపడుతుంది’ అనే పంక్తి ద్వారా కవి శ్రామికుల దయనీయ స్థితిని ఎంతో గాఢంగా ఆవిష్కరించారు.

‘ఇజాలన్నీ ఔట్‌డేటెడ్/టూరిజమొక్కటే/ప్రపంచం ఆమోదించేది/ప్రపంచాన్ని ఆకర్షించేది’

అనే ఈ భావం ద్వారా కవి ఒక పెద్ద రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాన్ని ప్రశ్నించారు. ఇది ఇజాల వైఫల్యాన్ని సూచిస్తుంది. పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజం వంటి ఏ ఇజం కూడా ప్రపంచ సంక్షోభం వచ్చినప్పుడు పేదలను, మానవాళిని కాపాడలేకపోయాయని కవి విమర్శించారు. అందువల్ల అవన్నీ కాలం చెల్లినవిగా అంటే ఔట్‌డేటెడ్‌గా మారిపోయాయని పేర్కొన్నారు‌‌. ‌

నేటి ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఎవరు? ప్రపంచీకరణను శాసిస్తున్నది ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానంగా కవి దానికి పర్యాటకం (Tourism) నే సూచించారు. ప్రపంచ దేశాల సరిహద్దులను చెరిపేసి, ప్రజలను ఒక చోట చేర్చి, ప్రపంచాన్ని పరస్పరం దగ్గర చేసే శక్తి పర్యాటక రంగానిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అదే పర్యాటకం వల్ల వైరస్ వేగంగా వ్యాపించిందనే అంతఃసూత్రాన్ని కూడా కవి వ్యంగ్యంగా సూచించారు. ప్రపంచీకరణ యుగంలో పర్యాటక రంగం యొక్క ప్రాధాన్యాన్ని కవి గుర్తు చేస్తారు. దేశాల మధ్య సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలను బలపరిచే ప్రధాన రంగాలలో పర్యాటకం ఒకటి. ఇది ప్రపంచాన్ని దగ్గర చేసే శక్తిగా పని చేస్తుంది. అయితే, మహమ్మారి కారణంగా ఈ రంగం కుదేలవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది అనే అంతర్లీన భావం ఈ కవితలో వ్యక్తమవుతుంది.

ఈ కవితకు సామాజిక వాస్తవికత ప్రధాన ఆధారం. ఇందులో సంక్షిప్తతతో కూడిన సాంద్రత కనిపిస్తుంది. కొద్దిపాటి పదాలలోనే కవి విస్తృతమైన సామాజిక చిత్రాన్ని ఆవిష్కరించారు.

సమాజంలోని ఆర్థిక, సామాజిక అసమానతలను అత్యంత సహజంగా, హృదయానికి హత్తుకునే విధంగా ప్రతిబింబించారు. సంక్షోభం అందరిని ఒకే విధంగా ప్రభావితం చేయదని, ధనిక, పేద వర్గాల మధ్య ఉన్న అంతరాలు విపత్తు సమయంలో మరింత స్పష్టంగా బయటపడతాయని కవి సూచించారు.

ఈ కవితలో కేవలం లాక్‌డౌన్ దృశ్యాన్ని మాత్రమే చూపించలేదు; దాని వెనుక దాగి ఉన్న ఆర్థిక అసమానతలను, సామాజిక వాస్తవాలను, నగ్న సత్యాలను కూడా ప్రశ్నించారు. సులభమైన వాడుక భాషలో ‘ఇంటర్నెట్’, ‘ఔట్ డేటెడ్’, ‘టూరిజం’ వంటి ఆంగ్ల పదాలను తెలుగు కవిత్వంలోకి సహజంగా మేళవిస్తూ, సమకాలీన సామాజిక వాస్తవికతను (Contemporary Realism), కవి సమర్థవంతంగా ఆవిష్కరించారు.

అలాగే, సంపన్నులు మరియు శ్రామికుల జీవితాలను వ్యతిరేక దృశ్యాలుగా చిత్రించడం ద్వారా సామాజిక అసమానతలను స్పష్టంగా చూపించారు. ‘బతుకే మూతబడుతుంది’ అనే రూపకం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని, మానవ జీవిత విషాదంగా మలిచారు. కవితలో కరుణ, విమర్శ, సామాజిక చైతన్యం సమన్వయమై ఉన్నాయి.

మొత్తంగా, మహమ్మారి సమయంలో బయటపడిన వర్గ విభేదాలు, కార్మికుల దుర్భర పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థపై సంక్షోభ ప్రభావం వంటి అంశాలను సామాజిక స్పృహతో చిత్రించిన వాస్తవిక కవిత్వానికి ఈ కవిత ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది.

‘చైనా టూరిస్టులు/ఇరాన్ పురానిర్మాణాలు/చూడటానికొస్తారు’

ఈ పంక్తులు ప్రపంచ పర్యాటక సంస్కృతిని సూచిస్తున్నాయి. చరిత్ర, సంస్కృతి, కళా వైభవాలను ఆస్వాదించడానికి దేశాల సరిహద్దులను దాటే ప్రయాణించే మనిషి స్వభావాన్ని కవి గుర్తు చేస్తున్నారు.

‘ప్రపంచవ్యాపారి సంపాదన పట్టలేక/ఇటలీ అందాలు ఆస్వాదించటానికి/చైనా నుంచి వొస్తాడు’

ఈ పంక్తులు సంపాదనతో పాటు వినోదం, అనుభూతి, ఆనందం కూడా మానవ జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలుగా మారాయని కవి సూచిస్తున్నారు. ఇవి భౌగోళిక సరిహద్దుల చెరిపివేతను, ప్రపంచీకరణ ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అలాగే, ఆధునిక మానవుడి స్వేచ్ఛాయుతమైన, విలాసవంతమైన ప్రయాణ సంస్కృతిని ఆవిష్కరిస్తున్నాయి.

‘దేశాల ఆదర్శాలు రెండే రెండు/అయితే సంపాదన/తప్పితే ఆస్వాదన’

ఈ పంక్తుల్లో నేటి ప్రపంచాన్ని నడిపిస్తున్న ప్రధాన శక్తులు రెండేనని కవి సూటిగా తెలియజేశారు. అవి భౌతిక సంపాదన మరియు ఆస్వాదన. మానవత్వం, నైతికత విలువల కంటే ఆర్థిక ప్రయోజనాలు, భౌతిక సుఖాలకే ప్రపంచం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని కవి సున్నితంగా విమర్శించారు.

ఈ పంక్తుల ద్వారా ఆధునిక ప్రపంచం ఆర్థికాభివృద్ధి పేరిట సంపాదనను, వినియోగ సంస్కృతి పేరిట ఆస్వాదనను ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని ముందుకు సాగుతోందని కవి విమర్శనాత్మకంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండు లక్ష్యాలను సాధించడానికి మనిషి ప్రపంచమంతా సంచరిస్తూ తన జీవితాన్ని గడుపుతున్నాడని కవి సూచిస్తున్నారు.

‘ఇటలీ ఏమి/ఇరానేమి/ స్పెయినేమి/ఫ్రాన్స్ దుబాయ్ ఇంగ్లాండ్ సౌదీ ఇండియా’

ఈ పంక్తి దేశాల వరుసని ప్రపంచ పటాన్ని కళ్ళ ముందుంచుతుంది. దేశాల పేర్లను వరుసగా ప్రస్తావించడం ద్వారా కవి వైరస్ వ్యాప్తి యొక్క విశాలతను, ప్రపంచ అనుసంధానాన్ని స్పష్టంగా చూపించారు. ఇక్కడ దేశాలు విభిన్న సంస్కృతులు, రాజకీయ వ్యవస్థలు మరియు ఆర్థిక స్థాయిలకు చెందిన సమాజాలు ప్రతీకలుగా నిలుస్తాయి. వైరస్ సార్వజనీనతను, అందరినీ సమానంగా ప్రభావితం చేసే స్వభావాన్ని ఈ కవిత అత్యంత బలంగా ప్రతిబింబిస్తుంది. వైరస్ స్వభావాన్ని వర్ణించిన తీరు ద్వారా మనుషులు సృష్టించుకున్న కృత్రిమ విభజనలను ప్రకృతి ఎలా తిరస్కరిస్తుందో కవి అద్భుతంగా ఆవిష్కరించారు. సరిహద్దులు లేని శత్రువుగా వైరస్‌ను చిత్రీకరిస్తూ, అగ్రరాజ్యాలు, సంపన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనే భేదాలు దానికి లేవని తెలియజేశారు. వైరస్ అన్ని దేశాలను తన ప్రభావ పరిధిలోకి తీసుకువచ్చింది. దానికి భౌగోళిక సరిహద్దులు, రాజకీయ హద్దులు అనే పరిమితులు లేవని ఈ పంక్తులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

‘వైరస్‌కు సరిహద్దులు లేవు’

అనే పంక్తి కవితలో ప్రభావవంతమైన భావాన్ని వ్యక్తం చేస్తుంది. మనుషులు నిర్మించుకున్న దేశ సరిహద్దులు వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని కవి సూచిస్తున్నారు. ఇది కేవలం వైద్యశాస్త్రానికి సంబంధించిన సత్యమే కాక, మానవ నాగరికత ఏర్పరచుకున్న కృత్రిమ విభజనల పరిమితులను ప్రశ్నించే సున్నితమైన తాత్విక వ్యాఖ్య కూడా.

‘వర్ణ భేదాలు అంతకంటే లేవు/ వర్గం కులం మతం వరుసకయినా లేవు’

అనే పంక్తులు ఈ కవితకు విశ్వమానవీయ దృక్పథాన్ని అందిస్తున్నాయి. వైరస్ దృష్టిలో ‘మనిషి ఎవరు?’ అనే ప్రశ్నకు ప్రత్యేకమైన సమాధానం ఉండదు. వైరస్‌కు మనిషి అంటే మనిషే. అతను ఏ కులానికి చెందిన వాడు, ఏ మతానికి చెందిన వాడు, ఏ వర్గానికి చెందిన వాడు, నల్లవాడా లేదా తెల్లవాడా అనే వర్ణ వివక్ష వైరస్‌కు ఉండదు. అలాగే, అతని సామాజిక హోదా ఏమిటి వంటి వంటి విషయాలన్నీ వైరస్‍కు అప్రసక్తం. సమాజంలో మనం నిర్మించుకున్న విభజనలను కవి ఈ సందర్భంగా ఎత్తిచూపుతున్నారు. ఇది భేదభావాలు లేని దండయాత్రగా చిత్రీకరించబడింది. సాధారణంగా మనుషులు తమ కులం, మతం, వర్ణం, వర్గం, హోదా వంటి అంశాల ఆధారంగా గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. అయితే మనిషి నిర్మించుకున్న ఈ భేదాలేవి వైరస్‍కు వర్తించవు. సమాజంలోని ఉన్నత వర్గాలకు చెందిన వారైనా, సాధారణ ప్రజలైనా వైరస్ అందరినీ ఒకే విధంగా ప్రభావితం చేస్తుంది. ఈ విధంగా వైరస్ రూపంలో ఒక భయంకరమైన సమానత్వం కనిపిస్తుందని కవి సూచిస్తున్నారు.

‘నగరమా దేశమా ద్వీపమా/ సామ్రాజ్యమా అగ్రరాజ్యమా/చింత లేదు’

అనే పంక్తులలో కవి వైరస్ యొక్క నిరపేక్ష స్వభావాన్ని ప్రతీకాత్మకంగా చిత్రించారు. చిన్న ద్వీపదేశమైనా, ప్రపంచ అగ్రరాజ్యమైనా వైరస్ ముందు అన్నీ సమానమే. ఇక్కడ ‘సామ్రాజ్యం’, ‘అగ్రరాజ్యం’ అనే పదాలు మానవ అధికారం, శక్తి ఆధిపత్యాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. వైరస్ వాటన్నింటినీ ఒకే స్థాయికి తీసుకువస్తుందనే భావాన్ని కవి ఈ పంక్తుల ద్వారా వ్యక్తం చేశారు.

‘శరీరమైతే చాలు/వైరస్ సంబురాలు’

ఈ పంక్తులు వ్యంగ్యం, వాస్తవికత కలగలిసిన అద్భుతమైన భావవ్యక్తీకరణకు నిదర్శనం. వైరస్‌కు మనిషి శరీరమే కావాలి; మిగిలిన అన్ని గుర్తింపులు దానికి అనవసరం.

‘సంబురాలు’ అనే పదం ఇక్కడ తీవ్రమైన వ్యంగ్యార్థాన్ని సంతరించుకుంది. మానవ విషాదమే వైరస్‌కు విజయోత్సవమని కవి సూచిస్తున్నారు. ఒక ప్రాంతం ఎంత పెద్ద నగరమైనా, ఎంతటి సైనిక బలం కలిగిన అగ్రరాజ్యమైనా వైరస్‌కు అనవసరం. దానికి కావలసింది కేవలం ఒక మానవ శరీరం (Host) మాత్రమే. మనుషులు తాము నిర్మించుకున్న సామ్రాజ్యాలను చూసి గర్విస్తున్న వేళ, ప్రకృతి ముందు వాటన్నింటి విలువ శూన్యమని, చివరికి మనిషి నశ్వరమైన శరీరంగానే మిగిలిపోతాడనే జీవన సత్యాన్ని (Existential Truth) కవి ఇక్కడ ప్రతిపాదించారు.

‘వైరస్ సంబురాలు’ అనడం అత్యంత శక్తివంతమైన వ్యంగ్యానికి (irony) ఉదాహరణ. మానవాళి అంతా భయంతో అల్లాడిపోతుంటే, వైరస్ మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రపంచమంతటా తన విజయయాత్రను కొనసాగిస్తుందనే భావంలో మానవ గర్వాన్ని అణిచివేసిన ప్రకృతి వ్యంగ్య నవ్వు కనిపిస్తుంది. ఇది ఆధునిక సామాజిక దృక్పథంతో లోతైన తాత్విక చింతనను ప్రతిబింబించే కవితా రూపం.

ప్రపంచాన్ని కుదిపేసిన ఒక మహమ్మారి వైరస్ నేపథ్యంలో మన జీవన విధానాన్ని, ప్రపంచీకరణ లోపాలను, ప్రకృతి శక్తిని సవాలు చేసే మనిషి నిస్సహాయతను ఈ పంక్తులు అత్యంత శక్తివంతంగా విశ్లేషించాయి.

ఈ కవిత ప్రపంచీకరణ, పర్యాటకం, వినిమయ సంస్కృతి, మహమ్మారి వంటి అంశాలను ఒక తాత్విక దృష్టితో పరిశీలిస్తుంది. మానవుడు నిర్మించుకున్న భౌగోళిక, సామాజిక,రాజకీయ సరిహద్దులన్నింటినీ వైరస్ ఎలా అధిగమించిందో కవి అత్యంత వ్యంగ్యాత్మకంగా, వాస్తవికంగా చిత్రించారు.

ఈ పంక్తుల్లో ప్రధాన వస్తువు ‘వైరస్ వ్యాప్తి మరియు దాని సార్వజనీనత’. మానవ నిర్మిత సరిహద్దులను, ఆర్థిక అంతరాలను కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి ఎలా చెరిపేసిందో తెలియజేయడమే ఈ కవిత ప్రధాన ఉద్దేశ్యంగా భావించవచ్చు. ప్రపంచీకరణ సృష్టించిన జీవనశైలి, మానవ జీవితంలోని వైరుధ్యాలను కవి ఈ కవితలో ప్రతిబింబించారు. సరళమైన పదాలతోనే విశ్వజనీన సత్యాన్ని, సమకాలీన సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రించడంలో కవి కృతకృత్యుడయ్యారు. ఇది పాఠకులను ఆలోచింపజేసే గొప్ప సామాజిక కవిత. జాబితా శైలి (Enumeration) ద్వారా వైరస్ ప్రపంచ వ్యాప్తతను కవి సమర్థంగా ప్రతిబింబించారు. ఈ పంక్తుల్లో వ్యంగ్యం కవిత అంతటా అంతర్లీనంగా ప్రవహిస్తుంది. విశ్వ మానవతా దృక్పథం ప్రధాన భావంగా నిలుస్తుంది. సంక్షిప్తతతో కూడిన భావసాంద్రత ఈ కవితకు ప్రత్యేక బలం. సామాజిక విమర్శ, తాత్వికత, సమకాలీన చరిత్ర ఇందులో సమన్వయమై ఉన్నాయి.

మహమ్మారిని కేవలం ఒక వైద్య సంక్షోభంగా కాకుండా, మానవ నాగరికత నిర్మించుకున్న సరిహద్దులు, వర్గ విభజనలు, ఆధిపత్యభావనలను ప్రశ్నించిన ఒక చారిత్రక ఘటనగా కవి చిత్రించారు. వైరస్ ముందు మానవ జాతి అంతా ఒకటేననే విశ్వమానవీయ సందేశాన్ని కవి అత్యంత ప్రతిభావంతంగా వ్యక్తీకరించారు.

‘సియోల్ లో చర్చి నుంచి విస్తరించింది/మక్కాలో/మసీదు నుంచి ముసురుకున్నది’

ఈ పంక్తుల్లో కవి వైరస్ వ్యాప్తికి దోహదపడిన సామూహిక సమావేశాల ప్రమాదాన్ని సూచించారు. వైరస్ యొక్క భౌతిక సంక్రమణ స్వభావాన్ని ప్రతిబింబిస్తూ, ఈ విపత్తు మతాలకు అతీతమైనదని వెల్లడించారు. మతపరమైన ఆరాధన స్థలాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు ఏవైనా కావచ్చు; వైరస్ మాత్రం వాటన్నింటికీ అతీతంగా తన ప్రభావాన్ని చూపుతుందనే సార్వత్రిక సత్యాన్ని ఈ పంక్తులు ఆవిష్కరిస్తున్నాయి. కవిత ఆరంభంలోనే రెండు విభిన్న ఆరాధన కేంద్రాలను దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలోని చర్చి, ఇస్లాం మత పవిత్ర క్షేత్రమైన మక్కాలోని మసీదును – ప్రస్తావించడం విశేషం. ఈ రెండు ప్రదేశాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందిన వాస్తవాన్ని ఉదాహరణగా చూపుతూ, మతం, ప్రాంతం, విశ్వాసం వంటి భేదాలకు వైరస్ అతీతమని కవి స్పష్టం చేశారు. దేవుడు తమను రక్షిస్తాడనే విశ్వాసంతో భక్తులు గుమిగూడే పవిత్ర స్థలాలు సైతం కూడా ఈ భౌతిక వైరస్ ప్రభావం నుంచి మినహాయింపు పొందలేకపోయాయని కవి సూచించారు. తద్వారా ప్రకృతి విపత్తులు లేదా మహమ్మారుల ముందు మానవులందరూ సమానులేననే సార్వత్రిక సత్యాన్ని ఈ పంక్తులు ఆవిష్కరిస్తున్నాయి.

వైరస్ కు భక్తితో, ప్రార్థనలతో ఎలాంటి సంబంధం లేదు. దానికి కావాల్సింది కేవలం మనుషుల కలయిక మాత్రమే అని చెప్పడం ద్వారా కవి మత సంస్థలను విమర్శించడం కాదు. వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం జన సమూహాలే అవుతాయని సూచించడానికి చర్చి, మసీదు వంటి ప్రతీకలను ఉపయోగించారు. ఈ రెండు వేర్వేరు మత చిహ్నాలను ప్రస్తావించడం ద్వారా వైరస్‍కు మతభేదాలు లేవని తెలియజేశారు. ఒకే ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల వారిని సమానంగా ప్రభావితం చేసిందనే భావం ఇందులో అంతర్లీనంగా ఉంది.

‘ఒకరి నుంచి ఒకరికి/గుంపు నుంచి గుంపుకు’

ఈ పంక్తులు సమూహ సంస్కృతిపై వైరస్ చూపిన ప్రభావాన్ని సూచిస్తాయి (The irony of social Nature). మానవుడు సంఘజీవి. సహజంగా గుంపులుగా జీవించడమే అతని నైజం. అయితే, వైరస్ కాలంలో అదే సంఘజీవన లక్షణం అతనికి శాపంగా మారింది. గుంపులే వైరస్ వ్యాప్తికి ప్రధాన ఇంధనంగా మారాయని కవి ఇక్కడ సామాజిక వాస్తవికతను ఆవిష్కరించారు.

ఈ పంక్తులు వైరస్ వ్యాప్తి గొలుసును, అత్యంత సరళంగా ప్రభావవంతంగా వివరిస్తాయి. వ్యక్తిగత సంబంధాలు, సామూహిక విపత్తుగా ఎలా మారతాయో ఈ కవి ఈ రెండు పంక్తుల ద్వారా స్పష్టం చేశారు. ఇక్కడ ఉపయోగించిన పునరుక్తి శైలి భావాన్ని మరింత బలంగా పాఠకులకు చేరవేస్తుంది.

‘కాయం దొరికితే చాలు/కణం లేని క్రిమి తయారు’

జీవశాస్త్ర విశ్లేషణలో కవితాత్మకత (Biological Realism).

ఈ పంక్తులు కవి యొక్క శాస్త్రీయ అవగాహనను దానిని కవితాత్మకంగా వ్యక్తీకరించిన శిల్పాన్ని ప్రతిబింబిస్తాయి. వైరస్ అనేది స్వతంత్ర కణ నిర్మాణం లేని సూక్ష్మజీవి. జీవనం సాగించడానికీ,వృద్ధి చెందడానికీ అది తప్పనిసరిగా మరొక జీవి శరీరాన్ని(హోస్ట్) ఆశ్రయించాల్సి ఉంటుంది. నిష్క్రియంగా కనిపించే ఈ సూక్ష్మజీవి, మానవ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే క్రియాశీలకమై వేగంగా వ్యాపించి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించగలదనే సత్యాన్ని కవి ఎంతో సంక్షిప్తంగా, ప్రభావవంతంగా వ్యక్తీకరించారు.

ఈ పంక్తుల్లో శాస్త్రీయ అవగాహన కవిత్వంతో సమన్వయమై కనిపిస్తుంది. వైరస్‌కు స్వతంత్ర జీవన సామర్థ్యం లేదని, అది ఒక జీవకాయాన్ని ఆశ్రయించినప్పుడే, క్రియాశీలంగా మారుతుందని కవి సంకేతాత్మకంగా సూచించారు. ‘కాయం’ (శరీరం) మరియు ‘క్రిమి’ ( వైరస్) మధ్య ఉన్న పరస్పర ఆధారిత సంబంధాన్ని కవి చక్కని రూపకంతో ఆవిష్కరించారు. జీవశాస్త్ర సత్యాన్ని కవితా భాషలో మలచి,శాస్త్రీయ వాస్తవికతకు కళాత్మక అభివ్యక్తిని అందించారు.

‘చేతులు కలిపామా/పెదవులు కలిశాయా/నోరు ఆవులించిందా/ అంతే’

ఇక్కడ మానవ సంబంధాలు దూరం అవుతాయి. ఈ పంక్తులు వైరస్ సోకే భౌతిక మార్గాలను సూచించడమే కాకుండా, మానవ అనురాగాలపై పడిన దెబ్బను కూడా ప్రతిబింబిస్తాయి. మనుషుల ఆత్మీయతకు చిహ్నమైన కరచాలనం, ప్రేమను వ్యక్తపరిచే చుంబనం, అలాగే సహజంగా జరిగే శ్వాస సంబంధిత చర్యల ద్వారానే వైరస్ వ్యాపించి మరణానికి దారితీయవచ్చని కవి హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ‘అంతే’ అనే పదం కవితకు శక్తివంతమైన ముగింపునిస్తుంది. సాధారణంగా కనిపించే చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతక పరిణామాలకు దారి తీయవచ్చనే భావాన్ని అది సంక్షిప్తంగా, అత్యంత ప్రభావవంతంగా వ్యక్తపరుస్తుంది.

శైలీ మరియు శిల్పం:

ఈ పంక్తుల్లో కవి శైలీ వైశిష్ట్యం ప్రత్యక్షతతో పాటు వేగవంతమైన కథనంలో ప్రతిఫలిస్తుంది. ‘చేతులు కలిపామా?’, ‘పెదవులు కలిశాయా?’ వంటి సంక్షిప్త పదబంధాలు కవితలో ఉత్కంఠను, భయాందోళనను సమర్థవంతంగా ఆవిష్కరించాయి. శాస్త్రీయ సత్యాన్ని సామాజిక దృక్పథంతో కవిత్వీకరించడం ఈ పంక్తుల విశిష్టత. వైరస్ వ్యాప్తి చెందే సాధారణ మార్గాలను కవి కవితాత్మక భాషలో హృద్యంగా ప్రభావవంతంగా చిత్రించారు. ఇక్కడ కవి హెచ్చరిక ధోరణిని అవలంబించి, మనుషుల సహజమైన సామాజిక ప్రవర్తనలైన కరచాలనం, సాన్నిహిత్యం, శ్వాసకు సంబంధించిన చర్యలు ఎలా ప్రమాదానికి దారితీయవచ్చో సూచించారు.

ప్రత్యేకంగా ‘అంతే’ అనే ఒక్క పదంతో కవిత ముగియడం చాలా ప్రభావవంతమైన శిల్ప లక్షణంగా నిలుస్తుంది. ఆ పదం వైరస్ వ్యాప్తి ఎంత సులభంగా, ఎంత వేగంగా జరుగుతుందో పాఠకుడికి ఒక్కసారిగా అనుభూతి కలిగిస్తుంది. అది ఒక హెచ్చరిక, ఒక విషాద వాస్తవం, అలాగే ఒక వ్యంగ్య వ్యాఖ్య కూడా. ఈ మూడింటి సమ్మేళనమే ఆ పదానికి విశేషమైన ప్రభావాన్ని కలిగించింది. చర్చి, మసీదు ఇక్కడ ప్రపంచ మానవ సమాజానికి ప్రతీకలుగా నిలుస్తాయి. మత, జాతి, దేశ భేదాలకు అతీతంగా వైరస్ అందరినీ సమానంగా ప్రభావితం చేస్తుందనే భావాన్ని కవి సూచించారు. కవి కొద్దిపాటి పదాల్లోనే మహమ్మారి వ్యాప్తి తత్వాన్ని సమర్థవంతంగా వ్యక్తీకరించారు. ‘ఒకరి నుంచి ఒకరికి’, ‘గుంపు నుంచి గుంపుకు’ వంటి పునరుక్తి నిర్మాణాలు వైరస్ వ్యాప్తి వేగాన్ని, విస్తృతిని సూచిస్తున్నాయి.

అలాగే, ‘అంతే’ అనే ముగింపు పదం ద్వారా ప్రమాదం ఎంత సమీపంలో ఉందో వ్యంగ్యాత్మక హెచ్చరికగా తెలియజేశారు. శాస్త్రీయ అవగాహనతో కూడిన కవిత్వాన్ని సృష్టిస్తూ, వైరస్ స్వభావాన్ని కవి కవితాత్మక భాషలో స్పష్టంగా ఆవిష్కరించారు.

ఈ పంక్తులు మహమ్మారిని కేవలం ఒక ఆరోగ్య సమస్యగా కాకుండా, మానవ సంబంధాల స్వరూపాన్ని ప్రశ్నించే సామాజిక ఘటనగా చిత్రిస్తాయి‌‌. మతం, దేశం, జాతి, సంస్కృతి వంటి భేదాలకు అతీతంగా ప్రతి మనిషి ఒకే జీవ సత్యానికి లోబడి ఉంటాడని కవి గుర్తు చేశారు. సంక్షిప్తమైనప్పటికీ, గాఢమైన, భావవ్యక్తీకరణతో ఈ పంక్తులు సమకాలీన జీవితానికి కవితాత్మక సాక్ష్యంగా నిలుస్తాయి. మహమ్మారి వ్యాప్తి స్వభావాన్ని సామాజిక మానవ శాస్త్రీయ కోణాలతో మేళవించి కవి చిత్రించారు. వైరస్ ఎలా వ్యక్తి నుంచి వ్యక్తికి, సమూహం నుంచి సమూహానికి వ్యాపిస్తుందో కవితాత్మకంగా ఆవిష్కరిస్తూనే, మతం, దేశం, జాతి, సంస్కృతి వంటి భేదాలకు అతీతంగా మానవ సమాజమంతా ఒకే ప్రమాదానికి లోనవుతుందనే సందేశాన్ని కూడా అందించారు.

‘యాత్రా గాథ’ అనే అద్భుత కవితను అందించిన కవి నందిని సిధారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు‌. వారి సృజనాత్మక కలం నుంచి ఇలాగే మరెన్నో సుగంధభరిత కవితా సుమాలు విరబూసి, తెలుగు సాహిత్య లోకాన్ని పరిమళింపజేస్తూ సాహిత్య ప్రియుల హృదయాలను అలరించాలని ఆకాంక్షిస్తున్నాను.

Exit mobile version