Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సామాన్యుల జీవితాల గురించి అద్భుతమైన కవిత – ‘సామాన్యుడు’

[మాదాడి నారాయణ రెడ్డి గారి ‘సామాన్యుడు’ కవితని విశ్లేషిస్తున్నారు నరేంద్ర సందినేని.]

ప్రముఖ రచయిత, కవి, రిటైర్డ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన ‘సామాన్యుడు’ కవిత పై విశ్లేషణా వ్యాసం ఇది. సామాన్యుడు కవిత ఏమిటని ఆసక్తితో చదివాను. సామాన్యుల జీవితాల గురించి అద్భుతమైన కవితను అందించారు. ప్రతి ఒక్కరు సామాన్యుడు ఎవరు? సామాన్యుడి గురించి ఏమి రాశారు అని ఆసక్తితో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కవిత చదవగానే నాలో ఆలోచనలు రేకెత్తించింది. కవి నారాయణరెడ్డి(మానారె) సామాన్యుడి నాడిని గట్టిగా పట్టి చూపించారనిపించింది.

“చరిత్ర గ్రంథాల్లో స్థానం లేనివాడా”

మనం ఒక పరి చరిత్ర పుస్తకాలు తిరగేస్తే రాజుల గురించి రమణీమణుల గురించి గ్రంథాలు కావ్యాలు వెలిశాయి. అందులో సామాన్యులకు చోటు లేదనే వాస్తవాన్ని చక్కగా కవితలో వివరించారు. ఇవ్వాళ సామాన్యుడి గురించి ఆలోచించేవాళ్లు ఎవరు ఉండరు. కవి నారాయణరెడ్డి (మానారె) హృదయం ద్రవించి సామాన్యుడు కవితకు రూపం ఇచ్చారు.

“కవన వనాల్లో స్థాణువైనా కాని వాడా”

స్థాణువు అంటే ఇక్కడ వృక్షం అని అర్థం అవుతుంది. కవి యొక్క భావనా ప్రపంచపు కవన వనాల్లో వృక్షమైన కాని వాడు ఎవరు? సామాన్యుడు అని అర్థమవుతుంది. కవన వనాల్లో సామాన్యుడు వృక్షం అయితే సామాన్యుడి గురించి వ్రాయబడి ఉండేది. సామాన్యుడు స్థాణువైనా కాని వాడా అని మనలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాడు.

“యుద్ద విజయాల్లో గుర్తింపు లేని వాడా”

యుద్ధ విజయాల్లో సామాన్యులు సైనికులు అని అర్థమవుతుంది. ఆ యుద్ధంలో విజయం సాధించడానికి ఎందరో సామాన్యులు ప్రాణాలు కోల్పోతారు. సామాన్యులు ఆ యుద్ధంలో గెలిచినప్పటికీ వాళ్లకు ఎలాంటి గుర్తింపు ఉండదు. రాజులకు గుర్తింపు వస్తుంది. యుద్ధంలో ప్రాణాలు అర్పించిన నిజమైన యుద్ధవీరులైన సామాన్యులకు ఎలాంటి గుర్తింపు, గౌరవము లభించదు. భావాన్ని చక్కగా వ్యక్తీకరించారు.

“యుగ పురోగమనములో నలిగిన వాడా”

వేదాల అనుసరించి యుగాలు నాలుగు.

సత్య యుగము లేదా కృతయుగం – ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది.

త్రేతా యుగం – ధర్మం మూడు పాదాలపై నడుస్తుంది.

ద్వాపర యుగం – ధర్మం రెండు పాదాలపై నడుస్తుంది.

కలియుగం – ఈ కలియుగంలో మనిషి ప్రకృతి నుండి దూరమై నీచమైన హీనమైన బతుకు గడుపుతున్నాడు. ఈ యుగ పరిమాణం వలన సామాన్యుడు నలిగిపోతున్నాడనే సంగతిని మనకు తెలియజేస్తున్నారు.

“ఓ సామాన్యుడా! ఓ సామాన్యుడా!

నీవు అసామాన్యుడవు”

అసామాన్యుడవు అంటే అర్థం ఇక్కడ గొప్పవాడని చెప్పవచ్చు. సామాన్యున్ని నీవు గొప్పవాడవు అని వివరణాత్మకంగా తెలియజేశారు.

“పండించిన పంటల ప్రపంచానికి పంచి

అర్ధాకలితో అలమటించేవాడా”

రైతు ఆరుగాలం కష్టించి పంటను పండిస్తాడు. రైతు మాత్రం అర్ధాకలితో అలమటిస్తాడు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు మనం రోజు చూస్తున్నాం. కరువులు కాటకాలతో వ్యవసాయం ఒక జూదంగా మారింది. రైతులు కష్టపడి పంటలు పండించినప్పటికీ సరియైన గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతు పుట్లకొద్ది ధాన్యం పండిస్తాడు. రైతు మాత్రం పట్టెడు అన్నం దొరకక యాతన పడుతున్నాడు. రైతే రాజు, దేశానికి వెన్నెముక, నినాదాలుగా మిగిలిపోయాయి. దేశ రాజధానిలో రైతులు హార్తాల్ చేపట్టారు.

ప్రభుత్వము ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలు నిషేధించాలని రైతులు ఆందోళన ఒక సంవత్సరం పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీ వాళ్లకు ధారా దత్తం చేసే నిరంకుశ చర్యలను రైతులు దేశవ్యాప్తంగా ఆందోళన చేసి అడ్డుకున్నారు. రైతుల రోదనలు మిన్ను ముట్టాయి. చివరికి ప్రభుత్వం దిగివచ్చి రైతు చట్టాలను అమలులో పెట్టలేదు. ఇవ్వాళ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకు వచ్చారు. రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైంది.

“అందమైన అంబరాలతో అందరి మానాన్ని కాపాడి

నీ అభిమానాన్ని చంపుకునేవాడా”

అందమైన వస్త్రాలు తయారుచేసే చేనేత కార్మికులు బతుకు గడవక ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం. చేనేత కార్మికులు అందమైన వస్త్రాలు తయారుచేసి అమ్మినప్పటికీ వాటికి సరైన ధర లభ్యం కావడం లేదు. చేనేత కార్మికులు అర్ధాకలితో అలమటిస్తూ జీవితాన్ని భారంగా గడుపుతున్నారు. చేనేత కార్మికులు పేదరికంలో కొట్టుమిట్టాడుతూ కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు. చిరిగిన దుస్తులు కట్టుకొని బతుకును వెళ్ళదీస్తున్న దయనీయ స్థితి మనం ఎరిగినదే. చేనేత కార్మికుల కుటుంబాలు తీవ్రమైన దారిద్రంలో మగ్గుతూ సరియైన కూడు, గూడు, గుడ్డ, లభించక పేదరికంలో నలిగిపోతున్నారు. పెద్దపెద్ద పరిశ్రమలు వచ్చినవి. చేనేత మగ్గాలు మూలన పడ్డవి. చేతిలో పనిలేదు. చేసిన పనికి సరైన కూలీ లేదు. ప్రభుత్వాలు చేనేత కార్మికుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నాయి. చేనేత కార్మికుల దయనీయ స్థితి పట్ల కవి నారాయణరెడ్డి (మానారె) ఆవేదన వ్యక్తం చేశారు. అంబరం అంటే నిఘంటువు అర్థం వస్త్రం.

“సుందర మందిరాలందరికి నిర్మించి

ఆకాశం పందిరి కింద కాపురం చేసేవాడా”

భవన నిర్మాణ కార్మికులు దివారాత్రులు శ్రమించి సుందర మందిరాలు నిర్మిస్తున్నారు. కానీ వాళ్లకు సరియైన గూడు ఉండటం లేదు. ఆకాశం పందిరి కింద అంటే చెట్ల కింద వీధుల్లో, మురికి వాడల్లో, మరియు పేవుమెంట్ల మీద నివసిస్తున్నారు.

దుర్భరమైన దారిద్ర్యంలో కునారిల్లుతున్నారు. వాన నుండి మరియు ఎండ నుండి వారికి సరైన రక్షణ లేదు. మురికివాడల్లో నివసిస్తున్న సామాన్యుని దయనీయ పరిస్థితులను చూస్తే కళ్ళనుండి కన్నీళ్లు ఉబికి వస్తాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా దేశమంతా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ పేదవాడికి సరైన గూడు లేదు, కూడు లేదు, గుడ్డ లేదు. దుర్భర దారిద్రంలో మగ్గుతున్న సామాన్యుని జీవనాన్ని తలుచుకుంటే బాధ వేస్తుంది.

“ఓ పరోపకారి!”

పరోపకారి అంటే దయగలవాడు. ఆధునిక యుగంలో కూడా పరోపకారులు ఉన్నారు. పరోపకారి మెరుగైన ప్రపంచాన్ని సృష్టించే సమయము డబ్బు, అనుభవము, నైపుణ్యాలు వలె ప్రతిభను దానం చేసే వ్యక్తి ఎవరైనా పరోపకారులు. పరోపకారం మానవ జాతి పట్ల ప్రేమ మరియు దాతృత్వం కోసం తనను తాను అంకితం చేసుకునే వ్యక్తి పరోపకారి.

ఇతరుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించే వ్యక్తి పరోపకారి.

“ఓ నిరాడంబరీ!”

నిరాడంబరీ వ్యక్తి అంటే చాలా సాదాసీదాగా ఉన్న వ్యక్తి. మీరు కూడా మీ పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకుని మీ జీవితాన్ని నిరాడంబరం చేసుకోగలరు. నిరాడంబరంగా గడుపుతూ ఆడంబరం లేకుండా ఉండేవాడు. ఉన్నదానితో తృప్తిపడి జీవించడమే నిరాడంబర జీవితం. ఇటువంటి జీవితమే ప్రపంచం దృష్టిలో అత్యంత ఆమోదయోగ్యం అని చెప్పవచ్చు.

“ఓ నిస్వార్థీ!”

స్వార్థం మూడు రకాలు.

1) సుస్వార్థము: తనకోసం తాను నిజాయితీగా కష్టించి బ్రతకడమే సుస్వార్థం.

2) దుస్వార్థం: తాను బ్రతకడం కోసం పరులను మోసగించడమే దుస్వార్థం.

3) నిస్వార్థం: తాను బ్రతుకుతూ పరువులకు చేతనైనంత సహాయం చేయడమే నిస్వార్థం. ఉదారంగా వ్యవహరిస్తున్న దాతృత్వం. తనకు ప్రాధాన్యతను ఇచ్చుకోకుండా ఇతరుల కోసం తన సమయము లేదా డబ్బు లేదా కృషిని ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం నిస్వార్థం. గ్రామీణ ప్రజలు పట్టణవాసుల కంటే ఎక్కువ నిస్వార్థం ప్రదర్శిస్తారు. పశువులు పక్షులు, చెట్లు చేమలు, నదులు నిస్వార్థానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. కోయిలలు ఏ ప్రతిఫలం ఆశించకుండా మధురంగా రాగాలాపన చేస్తాయి. పెంపుడు పక్షులు ఇండ్లలో మనతోపాటు మెసిలే పిచ్చుకలు. వీటిలో ఎలాంటి స్వార్థం కనిపించదు. అవి అమాయకంగా మన వెన్నంటే తిరుగుతాయి. పిచ్చుకలు ప్రతి ఇంటి నేస్తాలు అవి ఇండ్లలోనే తమ గూడును నిర్మించుకుంటాయి. ఎక్కడ అద్దం కనిపించిన దాని ముందు వాలిపోయి తన ప్రతిబింబాన్ని శత్రువులా భావిస్తూ పొడుస్తూ ఉంటే దాని అమాయకత్వాన్ని ప్రదర్శిస్తుంది. కోయిలలు పిచ్చుక పావురం ఈ మూడు జాతులు పక్షులు పవిత్రతకు ప్రేమకు అమాయకత్వానికి నిస్వార్థానికి గుర్తుగా చెప్పుకోవాలి.

“ఓ పరోపకారీ! ఓ నిరాడంబరీ!

ఓ నిస్వార్థీ! నీవు అసామాన్యుడవు!”

సామాన్యుడైన నీవు పరోపకారివి, సామాన్యుడైన నీవు నిరాడంబరివి, సామాన్యుడైన నీవు నిస్వార్థివి,

సామాన్యుడైన నీవు అసామాన్యుడవు, గొప్పవాడవు అని తెలియజేస్తున్నారు

“తరతరాలుగా ప్రదర్శింపబడుతున్న

అన్యాయపు నాటకానికి అంత మెప్పుడో?”

తరతరాలుగా ధనవంతులు పేదలపై ఆధిపత్యం చలాయిస్తూ వారి శ్రమను దోచుకుంటున్న తీరుని గమనిస్తూ అన్యాయపు నాటకానికి అంత మెప్పుడో? అని జనాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

పెట్టుబడిదారులు, శ్రామిక వర్గం, రెండే వర్గాలు అని మార్క్స్ తెలియజేశారు, కారల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని ఆచరించి శ్రామిక వర్గం యొక్క ఆకాంక్షలకు రూపమిచ్చి జారు నియంతపై యుద్ధం ప్రకటించి విజయం సాధించారు. 1917 అక్టోబర్ 17న లెనిన్ మహాశయుడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సోవియట్ రష్యాలో కమ్యూనిస్ట్ రాజ్య స్థాపన చేయటం జరిగింది. శ్రామిక వర్గం యొక్క శ్రమకు విలువ కట్టినవాడు. శ్రామిక వర్గం ఐక్యతను నెలకొల్పి శ్రామిక వర్గం రాజ్యాన్ని స్థాపించిన ధీశాలి లెనిన్. భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రంలో సాయుధ పోరాటం జరిగింది. నిజాం నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగకుండా కాంగ్రెస్ వాదులు హైదరాబాద్ రాష్ట్రంలో జరుగుతున్న సాయుధ పోరాటాన్ని అణచి వేశారు. లేకుంటే హైదరాబాద్ రాష్ట్రంలో శ్రామిక వర్గం యొక్క రాజ్యం స్థాపించబడేది. రజాకార్లు దోపిడీలు దొంగతనాలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటం కొనసాగింది. 4000 మంది వీరులు అసువులు బాశారు. ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి ప్రజల సంక్షేమం కొరకు పాటుపడ్డారు. దురదృష్టవశాత్తు సాయుధ పోరాటాన్ని కాంగ్రెస్ నాయకత్వం ద్రోహం చేసి అణిచివేసింది. ఇప్పటికీ ధనికుల నిరంకుశ చర్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నప్పటికీ పేదలు నిరుపేదలుగా మారారు. సామాన్యుల కూడు, గూడు,గుడ్డ, లేకుండా వీధుల్లో మురికివాడల్లో, పేవుమెంట్ల మీద, చెట్ల కింద నివసిస్తున్న దుస్థితిని చూసి కలత చెందారు. తరతరాలుగా ప్రదర్శింపబడుతున్న అన్యాయానికి అంతం ఎప్పుడు అని కవి సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. మంచి సమాజం పట్ల ఆకాంక్షతో పేదలపై జరుగుతున్న అన్యాయాలకు అంతం ఎప్పుడు అని ఆశావహ దృక్పథంతో మనలను మంచి సమాజం దిశగా నడవాలని చెపుతున్నారు. పేదలపట్ల సానుభూతితో ప్రశ్నిస్తున్న తీరు అద్భుతంగా ఉంది.

“ఇరులు ముసిరిన నీ నిండు జీవితంలో

పండు వెన్నెలలు పసందు లెప్పుడో?”

ఇరులు అంటే చీకటి, అంధకారం, అని అర్థం. చీకటి ముసిరిన నీ నిండు జీవితంలో పండు వెన్నెలలు పసందులెప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. ఇవ్వాళ ఉన్న సమాజంలో పేదల జీవితాల్లో వెలుగులు వెన్నెలలు కానరావడం లేదు. పేదలు నిరుపేదలుగా మారుతున్నారు.. ఇంకా వాళ్ళ జీవితాల్లో అంధకారం ముసిరి ఉంది. అలాంటి పేదలు సంతోషంతో సౌఖ్యంతో కనీస అవసరాలు అయినా కూడు, గూడు, గుడ్డ వాళ్లకు లభించాలని వాళ్ల జీవితాల్లో పండువెన్నెలలు, ఆనందాలు అనుభవించాలని శ్రామిక వర్గ పక్షపాతిగా కవి నారాయణరెడ్డి (మానారె) చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు.

“నీ స్వత్వాన్ని లోకం గుర్తించే దెప్పుడో

నీకు బ్రహ్మరథం పట్టే దెప్పుడో?”

స్వత్వం అంటే బలం అని అర్థం. సామాన్యుడైన నీ బలాన్ని లోకం ఎప్పుడు గుర్తిస్తుంది. నిన్ను బ్రహ్మరథం మీద కూర్చుండబెట్టి ఊరేగించేది ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. సామాన్యుడిని కూడా బ్రహ్మరథం పట్టే రోజులు రానున్నాయని కవి నారాయణరెడ్డి (మానారె) ఆశావహా దృక్పథంతో భావం వ్యక్తం చేస్తున్నారు.

“స్వశక్తి తెలియని హనుమంతుడవు నీవు

ఇప్పటికైనా కళ్ళు తెరువు- నీకు ఏ సంకెళ్లు లేవు”

స్వశక్తి మనలను నిర్భయంగా చేస్తుంది. తన శక్తి ఏమిటో మనకు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. హనుమంతునికి తాను వంద యోజనాలు ఎగిరి దాటగలను అని తెలియదు. వానర శ్రేష్ఠులు తనకు తెలియజేసినప్పుడు తనకు తన శక్తి తెలియ వచ్చింది. ఆపై సముద్రంపై ఎగిరి లంకకు చేరుకోగలిగాడు. తన శక్తి తెలియని హనుమంతుడవు నీవు సామాన్యుడవు అని ప్రబోధం చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరువు నీకు ఏ సంకెళ్లు లేవు. సామాన్యుడైన నీవు కళ్ళు మూసుకొని ఉన్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు నీకు ఏ సంకెళ్ళ తో నిన్ను బంధించలేరు అని తెలియజేస్తున్నారు.

“నిజంగా నిజంగా నీవు స్వేచ్చా జీవివి

శత విధాల ఉజ్జ్వల భావివి”

సామాన్యుడైన నీవు నిజంగా స్వేచ్చాజీవివి అంటున్నారు. శతవిధాల సామాన్యుడైన నీవు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. సామాన్యుడిని బ్రహ్మరథం పట్టి ఊరేగిస్తున్నారు. సామాన్యుడు స్వేచ్ఛాజీవి అంటున్నారు. సామాన్యుడిని ఏ సంకెళ్లు బంధించలేవు అంటున్నారు. సామాన్యుడి పట్ల చూపిస్తున్న అభిమానం చక్కగా ఉంది.

కవి నారాయణరెడ్డి (మానారె)ను చక్కటి కవిత అందించినందుకు అభినందిస్తున్నాను,. వారు మరిన్ని మంచి కవితా సుమాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను.

Exit mobile version