Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బ్రిటిష్ ఇండియా – విక్టోరియా రాణి – జడ బిళ్ళ స్టాంపులు

మే 6వ తేదీ విక్టోరియా రాణి స్టాంపులు తొలిసారిగా విడుదలయిన రోజు. ఈ సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఇప్పుడంటే స్టాంపులు వివిధ పరిమాణాలలో, చిత్ర విచిత్ర సమ్మిళత సప్తవర్ణశోభాలంకృతమై, గులాబీ, మల్లెల, సుగంధ పరిమళభరితమై, కొన్ని ముఖ్యమైన, గొప్పగా ప్రసిద్ది చెందినవి స్వర్ణతాపడంతో ముద్రించబడుతున్నాయి. అందరినీ అలరిస్తున్నాయి.

కాని రోలెండ్‌హిల్ తపాలా స్టాంపును కనుక్కున్న కొత్తలో ప్రపంచంలోని వివిధ దేశాలలో రకరకాల స్టాంపులు విడుదలయ్యాయి. స్వతంత్ర రాజ్యాలు వారివారి రాణుల, రాజుల చిత్రాలతో ముద్రించుకునేవారు. మనదేశం వంటి వలసదేశాలు ఆయా దేశాల రాణులు, రాజుల చిత్రాలతో స్టాంపులను ముద్రించి చలామణిలో ఉంచేవారు.

మనదేశంలో 1854 తరువాత విక్టోరియా రాణి చిత్రంతో స్టాంపులు విడుదల చేయడం మొదలయింది. వివిధ విలువలలో (ఆనాటి ద్రవ్యమానం ప్రకారం) స్టాంపులను ముద్రించారు బ్రిటిష్‌వారు.

1854లో అర్ధణా, ఒక అణా, రెండు అణాలు, నాలుగు అణాలు విలువలతో స్టాంపులు విడుదలయ్యాయి. అర్ధణా స్టాంపులు నీలి, ఊదారంగులలో ముద్రించారు. దీర్ఘచతురస్రాకారపు చట్రంలో విక్టోరియా రాణి చిత్రం నీలిరంగులో కనిపిస్తుంది. స్టాంపు పై భాగంలో ‘INDIA’ అని, క్రింద భాగంలో ‘HALF ANNA’ అని వ్రాసి ఉంది.

ఈ 4 స్టాంపులు 1854 లో విడుదల అయినవి

1 అణా విలువగల స్టాంపులలో ఎరుపు రంగు దీర్ఘచతురస్రాకారపు చట్రంలో విక్టోరియా రాణి చిత్రంతో కన్పిస్తుంది. స్టాంపు పైభాగాన ‘INDIA’ అని క్రింది భాగంలో ‘ONE ANNA’ అని వ్రాసి ఉంది.

4 అణాల స్టాంపులు నీలి, ఊదా రంగులలో విడుదలయ్యాయి. ఈ స్టాంపులు అష్టభుజి ఆకారపు చట్రంలో ముద్రించబడ్డాయి. పై అర్ధచంద్రాకారంలో ‘INDIA’ అని క్రింద అర్ధచంద్రాకారంలో ‘FOUR ANNAS’ అని వ్రాసి ఉంది.

ప్రపంచంలో ఒక స్టాంపును రెండురంగులలో ముద్రించడం దీనితోనే మొదలు. చుట్టూ ఉన్న అష్టభుజి చట్రం ఎరుపు రంగులో, విక్టోరియా రాణి చిత్రం నీలిరంగులోనూ ముద్రించారు.

ఇవి కలకత్తాలో రూపొందించబడినాయి. టైపోగ్రఫీ ద్వారా ఉత్పత్తి చేయబడినాయి. లిథోగ్రాఫ్‌లో ముద్రించబడినాయి.

1856లో ఈస్టిండియా కంపెనీ (తూర్పు ఇండియా సంఘం) రెండు అణాల స్టాంపు విడుదలయింది. ఈ స్టాంపు దీర్ఘచతురస్రాకారపు చట్రం లోపల అండాకారపు చట్రంలో అనాస ఆకుపచ్చరంగులో విడుదలయింది. దీనిపై అర్ధచంద్రాకారంలో ‘EASTINDIA POSTAGE’ అని, క్రింద అర్ధచంద్రాకారంలో “TWO ANNAS’ అని వ్రాసి ఉంది.

అయితే 1856 నుండి 1864 వరకు అర్ధణా, ఒక అణా, 2 అణాలు, 4 అణాలు, 8 అణాల విలువలతో స్టాంపులు విడుదల అయ్యాయి. ఇవన్నీ దీర్ఘచతురస్రాకారపుచట్రం లోపల అండాకారపు చట్రంలో విక్టోరియా రాణి చిత్రంతో విడుదల అయ్యాయి. ఈ అన్ని స్టాంపులు పై అర్ధ చంద్రాకారంలో ‘EASTINDIA POSTAGE’ అని, క్రింద అర్థచంద్రాకారంలో ద్రవ్య విలువలు ముద్రించబడ్డాయి.

½ అణా స్టాంపులు నీలిరంగులో, 1 అణా స్టాంపులు గోధుమ రంగులో, 2 అణాల స్టాంపులు లేత గులాబీ రంగు, లేత పసుపు, నారింజ రంగులలో విడుదల అయ్యాయి.

4 అణాల స్టాంపులు నలుపు, పొగ, అనాస ఆకుపచ్చ రంగులలో విడుదలయ్యాయి.

8 అణాల స్టాంపులు ముదురు ఎరుపు, లేత ఎరుపు రంగులలో విడుదలయ్యాయి.

1857 భారత ప్రథమ స్వాతంత్ర్య సమరం తరువాత ఈస్టిండియా కంపెనీ పరిపాలన అంతమయింది. 1858 నవంబర్ 1వ తేదీ నుండి బ్రిటిష్ ఇండియా భూభాగాలన్నీ ప్రత్యక్షంగా బ్రిటిష్ రాణి అధికారంలోకి బదిలీ చేయబడ్డాయి.

1860లో మే 9వ తేదీన ఒక అణా, నాలుగు అణాలతో పాటు 8 పైసల విలువగల స్టాంపులు విడుదల చేయబడ్డాయి. 1865 నాటికి 9 పైసల విలువ గల స్టాంపులను విడుదల చేశారు.

1867లో తొలిసారిగా 6 అణాల ఎనిమిది పైసల విలువలో స్టాంపులు విడుదలయ్యాయి.

1874లో తొలిసారిగా 1 రూపాయ విలువలో స్టాంపు విడుదలయింది. ఇది కూడా దీర్ఘచతురస్రాకారపుచట్రం లోపల అష్టభుజి ఆకారపు చట్రంలో విక్టోరియా రాణి చిత్రంతో విడుదలయింది. ఇది లేత పొగ రంగులో విడుదల అయింది. పై అర్ధ చంద్రాకారంలో ‘EASTINDIA POSTAGE’ అని, క్రింద అర్ధచంద్రాకారంలో ‘ONE RUPEE’ అని వ్రాసి ఉంది.

1876లో క్రొత్తగా 6 అణాల విలువగల స్టాంపులు రెండు రంగులలో విడుదలవడం విశేషం. ఇవి ఆలివ్ రంగు, గోధుమ రంగులలో విడుదల అయ్యాయి.

1876లోనే నారింజ లేత ఎరుపు రంగులో తొలిసారిగా 12 అణాల విలువలో ముద్రించారు. విక్టోరియా చిత్రం దీర్ఘచతురస్రాకారపు చట్రంలో ముద్రించారు. 6 అణాలు, 12 అణాల స్టాంపులలో కూడా విక్టోరియా రాణి చిత్రం పైన ‘EASTINDIA POSTAGE’ అని, దిగువ భాగాన ద్రవ్య విలువలు ముద్రించబడ్డాయి.

1877 జనవరి 1వ తేదీన ‘విక్టోరియా రాణి’ భారతదేశానికి ‘విక్టోరియా చక్రవర్తిని’ హోదాలో బాధ్యతలను పూర్తిగా స్వీకరించారు. ఇప్పటి నుండి స్టాంపుల మీద ద్రవ్య విలువలు అలాగే ఉన్నాయి. కాని రాచముద్ర ‘EASTINDIA POSTAGE’ నుండి ‘INDIA POSTAGE’ గా రూపాంతరం చెందింది.

1877 లో విడుదలయిన స్టాంపులు

ఈమె చక్రవర్తిని అయినప్పటి నుండి విడుదలయిన స్టాంపులన్నీ దీర్ఘచతురస్రాకారపుచట్రంలో ముద్రించబడ్డాయి. కాని లోపలి చట్రాలు (విక్టోరియా మహారాణి చిత్రాలు ముద్రించినవి) వివిధ ఆకృతులలో తయారు చేయబడినాయి.

నీలి ఆకుపచ్చరంగులో అర్ధణా, గులాబీ, ముదురు ఎరుపు రంగులలో, 9 పైసలు 1 అణా గోధుమ, రేగుపండు రంగులలో, 1 అణా 6 పైసలు ఎరుపు గోధుమ రంగులో, 2 అణాలు లేత నీలిరంగు, నీలిరంగులలో, 3 అణాలు నారింజరంగు, గోధుమ – నారిజ రంగులలో, 4 అణాలు ఆలివ్ గ్రీన్, పొగ రంగులలో, 4 అణాల 6 పైసలు పసుపు – ఆకుపచ్చ రంగులో, 8 అణాలు ఎరుపు ఊదా, లేత ఊదారంగులలో, 12 అణాలు ముదురు ఎరుపురంగులో, 1 రూపాయ పొగ రంగులో ముద్రించబడినాయి. అవన్నీ ఒక చోట పేర్చితే అందమైన చిత్ర విచిత్ర రంగుల చిత్రంలా దర్శనమిస్తాయి.

1895 సెప్టెంబర్ 1వ తేదీన స్టాంపుల చిత్రాలలో మార్పులు తీసుకొచ్చారు. దీర్ఘచతురస్రాకారపుచట్రం లోపల వంపుల చట్రంలో విక్టోరియా చక్రవర్తిని చిత్రాన్ని ముద్రించారు. ఈమె మేలిముసుగు ధరించి కన్పిస్తారు. 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయల విలువలలో ఈ స్టాంపులు విడుదలయ్యాయి. స్టాంపుల పై భాగంలో ‘INDIA’ అనీ, కింద భాగంలో ‘POSTAGE’ అనీ అర్ధచంద్రాకారంలో ముద్రించబడి ఉన్నాయి. లోపలి వంపుల చట్రంలో మధ్యభాగంలో రెండు వైపులా 2,3,5 అని వ్రాసి ఉంటుంది.

1895లో విడుదలయిన స్టాంపులు

1900 అక్టోబర్ 1 నుండి 1902 వరకు అంతకు ముందులానే అర్ధణా, ఒక అణా, రెండు అణాల విలువలో స్టాంపులను విక్టోరియా రాణి చిత్రంతోనే అన్నీ చతురస్రాకారపు చట్రంలోనే ముద్రించారు. అర్ధణా రెండు రంగులలో, అణా ఎరుపు రంగులో అండాకారపు చట్రంలో రాణి చిత్రం కనిపిస్తుంది. రెండు అణాలు రెండు రంగులలో అష్టభుజి చట్రాలలో రాణి చిత్రాన్ని ముద్రించారు.

1900 లో విడుదలయిన స్టాంపులు

ఈ సిరీస్‍లో కొత్తగా 3 పైసల స్టాంపులను ముద్రించారు. ఇప్పటికి ఇవే తక్కువ విలువగల స్టాంపులు. ఈ స్టాంపు దీర్ఘచతురస్రాకారపు చట్రంలోని అండాకార చట్రంలో విక్టోరియా చక్రవర్తిని ముఖచిత్రం కనిపిస్తుంది.

22 జనవరి 1901 నాడు చక్రవర్తిని మరణించేవరకు ఈమె చిత్రం స్టాంపుల మీద కనువిందు చేసింది. ఆ రోజుల్లోనే వివిధ సమ్మిళిత వర్ణాలతో శోభిల్లిన స్టాంపులను విడుదల చేసి చరిత్రను సృష్టించడం గొప్ప విశేషం.

ఈ స్టాంపులను ‘ది లా ర్యూ డిజైన్ ఫర్ ది రీసెస్’ వారు ముద్రించారు.

స్వతంత్ర భారతదేశం కూడా విక్టోరియా రాణి స్టాంపు విడుదలైన 150 సంవత్సరాల సందర్భంగా 1990 మే 6వ తేదీన ఆరు రూపాయల విలువతో స్టాంపును విడుదల చేసి గౌరవించింది.

విక్టోరియా రాణి చిత్రంతో విడుదలైన స్టాంపులలో సింహాభాగం తల మీద చిన్న కిరీటం జడ భాగం పోనీ టైల్ గా ముద్రించారు. వీటిని జడబిళ్ళ స్టాంపులు అని సరదాగా పిలిచేవారు.

1840 మే 6వ తేదీ నుండి విక్టోరియారాణి చిత్రంతో స్టాంపులను విడుదల చేయడం మొదలయింది. కాబట్టి మే 6వ తేదీ ఈ సందర్భంగా ఈమెకు నివాళిగా ఈ వ్యాసం.

***

Image Courtesy: Internet

Exit mobile version