Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎత్తరా! ఎత్తరా! జాతీయ జెండా!!

[శ్రీ తోకల రాజేశం రచించిన ‘ఎత్తరా! ఎత్తరా! జాతీయ జెండా!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

పల్లవి:
ఎత్తరా! ఎత్తరా! జాతీయ జెండా
ఆకాశమున పూల జల్లులే నిండా!

చరణం 1:
మన రక్తమును తాగి మన మూలుగులు పీల్చి
మాన ప్రాణాలతో బంతులాడిన తెల్ల
దొరలను ఎదిరించి నిల్చిందిరా! దేశ
భక్తుల త్యాగాన పూచిందిరా!!

చరణం 2:
తెల్ల చీకటి కమ్ము భారతావని మీద
సూర్యుడై ఈ జెండ పుట్టిందిరా!
బాధతో నెర్రెలు వడిన గుండెల మీద
మేఘమై అమృతమ్ము కురిసిందిరా!!

చరణం 3:
మనిషి మనిషికి మధ్య మట్టిగోడలు లేచి
పోరాటమునకడ్డుగా నిల్చినప్పుడు
కులము కుళ్లును కొంత కడిగిందిరా!
మతము బెబ్బులినదుపు చేసిందిరా!!

చరణం 4:
మన రంగులేవైన మన హంగులేవైన
రాష్ట్రాలు భాషలు రకరకాలుగనున్న
మూడు రంగుల జెండ మన ఆస్తిరా!
ఈ దేశమే కదా! మన తల్లిరా!!

ఎత్తరా! ఎత్తరా! జాతీయ జెండా!
ఆకాశమున పూల జల్లులే నిండా!!

Exit mobile version