Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యూరప్ పర్యటనలో అందాలూ అనుభవాలూ ఆనందాలూ-4

[యూరప్‍లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]

పారిస్ – Louvre Museum

పారిస్ వెళ్లినవారిని సాధారణంగా అడిగే ప్రశ్న Louvre Museum చూసారా? అని.

చాలా పెద్ద మ్యూజియం. మొత్తంగా లోపల బైట వైపు తిరిగి చూడాలంటే కనీసం 2-3 రోజులు పడుతుంది.

వందల కొద్దీ శిల్పాలు, లెక్కకు మించిన  రంగుల పెయింటింగ్స్ జీవకళతో ఉట్టిపడుతూ ఉన్నాయి. నేలమాళిగల్లో మరిన్ని ఉన్నాయని విన్నాము. ఉన్న కొద్దీ సమయం లోనే  చూడాలని డిసైడ్ అయ్యాము. ముఖ్యంగా మోనాలిసా పెయింటింగ్ కోసం.

మ్యూజియం బయటవైపు నలుమూలల గదులతో ఉన్న ప్రకారం ఉంది. లోపల అనేక భవనాలున్నాయి. గార్డెన్స్ ఉన్నాయి, పెద్ద పచ్చని మొక్కలతో ఎత్తుగా ఉన్న మేజ్ ఉంది. అదొక పద్మవ్యూహంలా లోపలి వెళ్లాలని ట్రై చేసాము కానీ ఏదో మరమ్మత్తు జరుగున్నందువల్ల వీలవలేదు. పెద్ద గాజు పిరమిడ్, చిన్న పిరమిడ్స్ ఉన్నాయి. దాని లోపలకి దిగితే భవంతి లోపలి దారి. షాప్స్ ఉంటాయి. ఎక్కడికక్కడ మ్యూజియం లోపలి ఎలా తిరిగి చూడొచ్చో సూచనలుంటాయి. అదొక అద్భుతమైన రంగుల కళల ప్రపంచం. లెక్కలేనన్ని పెయింటింగ్స్. చూస్తూ గడిపేయవచ్చు. పాలరాతి శిల్పాలు ఎంతో బాగున్నాయి.

మోనాలిసా పెయింటింగ్ దగ్గర భద్రత ఎక్కువ. ఎందుకంటే ఒకసారి దొంగిలించబడిందిట. ఇంకోసారి దాన్ని పాడుచెయ్యటానికి ట్రై చేశారట.

అందుకని దూరంగానే ఉండి చూడాలి. ఫ్యూ సెకండ్స్ మాత్రమే. లక్కీగా ఆ రోజు మమ్మల్ని “ఆర్ యూ ఫ్రమ్ ఇండియా?” అని అడిగి ఎక్స్‌ట్రా టైం ఇచ్చారు. సెల్ఫీ తీసుకున్నాము.

లోపల చాలా షాప్స్ ఉన్నాయి. ఫ్రెంచ్ మేకరోని అనే స్వీట్ క్రీం biscuits లాంటివి తిన్నాము. చాలా ఫేమసట.

బహుశా మేము నాల్గో వంతు మ్యూజియం కూడా చూసివుండము. అప్పటికే 4 గంటలకి పైన చూసాము. అదే చాలు అనుకోని ఇంకో ప్రదేశానికి వెళ్ళాము.

అక్కడ మ్యూజియం గురించి విన్న సంగతులు కొన్ని:

ఈ మ్యూజియం ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసే మ్యూజియం. ఈ మ్యూజియం తర్వాత ప్రజలు ఎక్కువగా చూసే చైనాలోని నేషనల్ మ్యూజియం, లండన్ లోని మోడ్రన్ మ్యూజియం, వాటికన్ మ్యూజియం ఉన్నాయిట . 2018లో 10 మిలియన్ల విజిటర్స్ మార్క్‌ని దాటేసింది. కానీ కోవిడ్ కారణంగా దీనిని కొంతకాలం మూసేశారు. దానివల్ల సందర్శకుల సంఖ్య కూడా కొంచెం తగ్గింది. ఇప్పటికి ప్రతిరోజు 15000 మందికి పైగా ఈ మ్యూజియం చూస్తారు. గ్యాలరీలు 15 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్నాయి. మ్యూజియం ఉన్న చోటులో 1190లో ఒక కోటగా కట్టారుట. 16వ శతాబ్దం వచ్చేటప్పటికి అది రాజభవనంగా మార్చబడింది. ఎప్పుడైతే రాజభవనం అయిందో అది సైజులో పెద్దగా అవటం మొదలుపెట్టింది. ఈ కోటని ఫ్రాన్స్ రాజు ఫిలిప్ 2 బయట దాడుల నుంచి రక్షించడం కోసం కట్టాడట. 12వ సంవత్సరంలో ఈ కోట పూర్తయింది. 14వ శతాబ్దంలో కింగ్ తన అఫీషియల్ ప్యాలెస్ కింద డిక్లేర్ చేశాడు. తర్వాత ఫ్రెంచ్ విప్లవం తరువాత రాజుని ఖైదు చేసిన తర్వాత, ఆ రాజు సేకరించిన వస్తువులు పెయింటింగ్స్ ఇలాంటివన్నీ కూడా ప్రతి వస్తువు ఒక జాతీయ సంపదగా చెప్పి, వస్తువులన్నిటినీ ప్రజల కోసం ప్రదర్శనకు ఉంచారు.

మోనాలిసా గురించి ప్రపంచానికి తెలిసింది 1911లో అది దొంగిలించబడ్డప్పుడు. మ్యూజియంలో దానిని 1919లో తిరిగి పెట్టినప్పుడు ప్రపంచంలోనే చాలా ఫేమస్ పెయింటింగ్ మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఈ మ్యూజియం ఖాళీగా ఉంది. ఎందుకంటే జర్మన్ సైన్యం నుంచి ఇందులో ఉన్న వస్తువులన్నింటినీ కాపాడటం కోసం కొన్ని వందల ట్రక్కుల్లో 3690 పెయింటింగ్స్ ఇతర వస్తువులు తీసుకుని సురక్షితమైన ప్రాంతాల్లో దాచారట. జర్మన్ సైనికులు మ్యూజియంకి వచ్చేటప్పటికి ఖాళీ గోడలే వాళ్లకి కనపడ్డాయి. మ్యూజియంని జర్మన్ సైనికులు తాము దోచుకున్న సంపదని దాచడానికి గోడౌన్‌గా వాడారట. ప్రపంచ యుద్ధాల్లో 200 పైగా చిన్న పెద్ద మ్యూజియంలు పాడైపోవడం లేదంటే దెబ్బతినడం జరిగాయట. 1947 నాటికి చాలా కళాఖండాలన్నీ కూడా మ్యూజియంకి తిరిగి రావడంతో, ప్రజల సందర్శనం కోసం తెరిచారట. ఈ మ్యూజియంలో దాదాపు 70 శాతం పెయింటింగ్స్ ఫ్రెంచ్ కళాకారులు వేసినవే. అలాగే ఈ మ్యూజియంలో ముఖ్యంగా చెప్పే ఒక పిరమిడ్ ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ అన్నమాట. కానీ ఇందులో అదొక్కటే కాదు, ఐదు పిరమిడ్స్ ఉన్నాయి.

తిరిగివెళ్తూ రాజుల సొమ్ములు రాళ్ల పాలు, పెయింటింగ్స్ కళాఖండాల పాలు అనుకున్నాము.

మోనాలిసా పెయింటింగ్:

ఈ చిత్రపటాన్ని లియోనార్డో డా విన్సీ అనే ఇటాలియన్ ఆయిల్ పెయింటర్ చిత్రించాడు. లియోనార్డో ఐరోపాలో పునరుజ్జీవనోద్యమ కాలంలో ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో నివసించాడు.

ఈ పెయింటింగ్ ఫ్లోరెన్స్‌లో నివసించిన ధనిక పట్టు వ్యాపారి ఫ్రాన్సిస్కో డెల్ జియోకోండో భార్య అయిన లిసా డెల్ జియోకొండో అని వారు నమ్ముతారు.

కొంతమంది మోనాలిసా పెయింటింగ్ నిజానికి లియోనార్డో డా విన్సీ తల్లి కాటెరినా పెయింటింగ్ అని నమ్ముతారు.

1516లో దానిని లియోనార్డో ఫ్రాన్స్‌కు తీసుకువచ్చాడు. ఫ్రాన్స్ రాజు, ఫ్రాన్సిస్ ది 1, లియోనార్డో నుండి పెయింటింగ్‌ను కొనుగోలు చేశాడు.

మోనాలిసా ఫ్రెంచ్ విప్లవం వరకు వెర్సైల్ ప్యాలెస్‌లో ఉంది. ఫ్రాన్స్‌లో చాలా మార్పులు వచ్చిన కాలం ఇది. విప్లవం తరువాత ఫ్రాన్స్ యొక్క కొత్త నాయకుడు నెపోలియన్ బోనపార్టే. అతను మోనాలిసాను తన కోటకు తరలించి తన బెడ్‌రూమ్‌లో వేలాడదీశాడు.

1797లో, మోనాలిసా ప్యారిస్‌లోని ఒక ప్రసిద్ధ ఆర్ట్ మ్యూజియం అయిన Louvre కు తరలించబడింది. అది ఇప్పటికీ వేలాడుతోంది. ఇది ఫ్రాన్స్ ప్రభుత్వ ఆధీనంలో ఉంది.

1911లో, మోనాలిసా దొంగిలించబడింది! Louvre మ్యూజియం సిబ్బంది – అది ఫోటో తీయబడిందని భావించారు, కానీ వాస్తవానికి దాన్ని ఎవరో తీశారు. దాని కోసం వెతకడానికి Louvre ఒక వారం పాటు మూసివేయబడింది.

విన్సెంజో పెరుగ్గియా అనే పేరుగల Louvre లోని ఒక కార్మికుడు వాస్తవానికి దానిని దొంగిలించాడు. అతను మరియు మరో ఇద్దరు కార్మికులు గోడపై నుండి చిత్రపటాన్ని తీసి, రాత్రిపూట దానితో ఒక గదిలో దాచిపెట్టారు.  మరుసటి రోజు, విన్సెంజో దానిని తన కోటులో దాచిపెట్టి, మ్యూజియం మూసివేయబడిన తర్వాత దానితో బయటకు వెళ్ళాడు. పెయింటింగ్‌ని తిరిగి ఇటలీకి వెళ్లి ఇటాలియన్ మ్యూజియంలో చూపించాలనుకున్నాడు. రెండేళ్లపాటు దాన్ని తన అపార్ట్‌మెంట్‌లో దాచిపెట్టడంతో అసహనానికి గురై ఇటలీలోని ఫ్లోరెన్స్‌లోని ఓ గ్యాలరీకి విక్రయించేందుకు ప్రయత్నించాడు. కానీ అతను పట్టుబడ్డాడు. Louvre కి తిరిగి వెళ్ళే ముందు పెయింటింగ్ ఇటలీ అంతటా చూపబడింది. రెండవ ప్రపంచ యుద్ధసమయంలో మోనాలిసా ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాలకు తరలించబడింది. శాంతిని ప్రకటించిన తర్వాత 1945లో ఇది Louvre మ్యూజియంకు తిరిగి ఇవ్వబడింది.

మోనాలిసా పెయింటింగ్‌ని అనేకసార్లు పాడు చెయ్యాలనే ప్రయత్నాలు జరిగాయట. కారణం తెలియదు. కొద్దికాలం కిందట ఇంకు జల్లెందుకు ట్రై చేశారట. అందువల్ల ప్రస్తుతం ఈ పెయింటింగ్‌ని బుల్లెట్ ప్రూఫ్ అద్దాల లోపల పెట్టారు.

Photos: Mr. D. Nagarjuna

(వచ్చే వారం కలుద్దాం)

Exit mobile version