[స్వప్న దొంగరి గారు రచించిన ‘ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఎవరికి వాళ్ళు నిర్మించుకున్న చెరసాలలో బంధీలైనప్పుడు..
ఆలోచనలతో చేసే యుద్ధంలో మనసునెపుడు గెలిపించకు..
మనసు ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది..
చిగురించే ఆశలను చిదిమేయడానికి సిద్ధంగా ఉంటుంది..
వేల ఆశల సౌధాలను నేలకూలుస్తునే ఉంటుంది..
రేపటి అనిశ్చితి లోని భయం
ఈ రోజు నీతో నిన్ను యుద్ధం చేయమంటోంది..
మంచి చెడుల మధ్య
సుఖ దుఃఖాల మధ్య
శాంతి అశాంతిల మధ్య
భయం సంక్షోభాల మధ్య
నీకేది కావాలో మనసే చెప్తుంది..
బయటి ప్రపంచంతో యుద్ధం
అంతః ప్రపంచంతో యుద్ధం
శ్వాసించే ప్రతి నిమిషం ఏదో ఒక యుద్ధమే..
అందుకే ఎవరి యుద్ధం వాళ్లే చేయాలి
ఎవరి దారి వాళ్లే వెతుక్కోవాలి..
