Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వనం కోసం, జనం కోసం సాగే కవనం ‘ఎవరిదీ చూపు’

[డా. విజయ్ కోగంటి గారు రచించిన ‘ఎవరిదీ చూపు’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

వృత్తిరీత్యా అధ్యాపకులైన డా. విజయ్ కోగంటి కవి, కథకులు, అనువాదకులు, వ్యాసకర్త. ‘ఎవరిదీ చూపు’ వారి మూడవ కవితాసంపుటి. ఇందులో 71 కవితలున్నాయి.

“విజయ్ కవిత్వం స్థూలంగా సరళమైంది. సరళత అంటే వాచ్యత అని కాదు. సరళతలో కవితాత్మకతను ఇమడ్చడం ఒక ప్రతిభ. సరళ కవిత్వంలో ఒడుపుతో గాఢతనూ, క్లుప్తతనూ సాధించవచ్చు. ఆ ప్రతిభ ఈ కవికి ఉందని ఇందులోని చాలా కవితలు ఋజువు చేస్తున్నాయి.” అని వ్యాఖ్యానించారు శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య తమ ముందుమాటలో.

డా. విజయ్ కోగంటి గారి కవిత్వపు సరళతకి సంబంధించి పై అభిప్రాయం నూటికి నూరు పాళ్ళు నిజం. ఈ సంపుటి లోని కవితలు సరళంగా ఉంటాయి, క్లుప్తంగా ఉంటాయి, అదే సమయంలో లోతైన భావాన్ని తమలో ఇముడ్చుకుని విస్తృతమైన సారాన్ని ప్రతిపాదిస్తాయి. సున్నితంగా అనిపించే వస్తువుతో అల్లిన కవిత సైతం.. అందులో వాడిన ఓ పదంతోనో, ప్రతీక తోనూ, గాఢమైన అనుభూతిని మిగులుస్తుంది.

ఈ కవితలోని చాలా కవితలు వనం కోసం (కేవలం అడవి మాత్రమే కాదు, అరణ్యాలలోని సకల వృక్ష, జంతు జాలం, స్థూలంగా సమస్త ప్రకృతి), జనం కోసం (సమస్త మానవాళి) ఉద్దేశించినవి. ఈ కవితల్లో నదులు, పక్షులు, ఆకాశం, నక్షత్రాలు, మనుషులు, వారి స్వభావాలు అన్నీ కవితా వస్తువులే! ప్రకృతి లేనిదే ప్రాణి లేడు కదా!

~

ఊహలు పిట్టలై, రంగుల ఈకలతో, కువకువలతో, గుండె చిటారు కొమ్మన వాలి కిందాకా ఊగి పైకెగిరి పలవరిస్తే ఏమవుతుంది? ఒక అద్భుతమైన కవిత రూపుదిద్దుకుంటుంది. అదే ‘ఉదయానే ఓ రంగుల పిట్ట’. హృదయంలో కదిలే భావం చిన్నదైనా, గాఢత, ఆర్ద్రతలను రెక్కలుగా చేసుకుంటే, అంతరంగంలో చలిస్తుంది, అక్షరమై కాయితానికెక్కుతుంది.

ఎప్పుడో 1802లో విలియమ్ వర్డ్స్‌వర్త్ వ్రాసిన ‘My Heart Leaps Up’ అనే కవితలోని ‘The Child is father of the Man’ అనే వాక్యాన్ని గుర్తు చేస్తుంది ‘నేను అంటే’ కవిత. ‘నేను అంటే ఎవర’ని అడిగిన పాప, ‘నేనంటే నువ్వు కూడా కదా’ అని సంభాషిస్తున్న వ్యక్తితో అంటుంది. బాల్యపు అనుభవాలు, భావోద్వేగాలు, విలువలు – మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి, బాల్యం భవిష్యత్తు వ్యక్తిని ప్రభావితం చేస్తుందని గ్రహిస్తాం. పిల్లలతో సంభాషణలో అలవోకగా జ్ఞానబోధ జరిగిపోతుందని ఈ కవిత ద్వారా మరోసారి నిర్ధారితమవుతుంది. పాపని కవితగా పరిగణిస్తే, కవితకీ కవికీ అబేధమన్న సూచన కూడా వ్యక్తమవుతుంది.

ఆధునిక వంచన ఎలా ఉంటుందో ‘ఓ కొత్త కథ చెప్పనా?’ కవిత వివరిస్తుంది. “నీకు తెలియకుండా జరిగే నీదే అయిన కథ” అని అంటారు కవి. నిజమే. మనిషి తన ప్రమేయం లేకుండానే యుద్ధంలోనూ, వైషమ్యంలోనూ చొచ్చుకునిపోయి, బయటకు రాలేక, ఆశించినట్టు బ్రతకలేక కొట్టుమిట్టాడడాన్ని ఈ కవిత స్ఫురింపజేస్తుంది.

స్నేహమంటే ఓ భరోసా. ఒక ఆత్మీయత. ఒక నమ్మకం. బ్రతుకు భారమవుతున్నప్పుడు భుజం మీద మిత్రుని చేయి పడితే చాలు, జీవనోత్సాహం ఎగసిపడుతుంది. అదే ‘స్నేహ స్పర్శ’ ప్రభావం. “మంత్రాన్ని నమ్మకపోయినా/వెచ్చగానో చల్లగానో తాకే/మాటనో చేతినో మనసునో/నమ్మాల్సిందే” అనే ఈ భావాన్ని కాదనగలమా? అదొక బంధమంటారు కవి.

ప్రతి మనిషికి అతని లోటుపాట్లు తెలుస్తాయి. లోపలి భావాన్ని అదిమిపెట్టి బయటకు మరో భావనను ప్రదర్శించగలడు. అవసరమైతే మరో ముఖం తగిలించుకుంటాడు. కానీ ఏదో ఒక సమయంలో తనని తాను తరచి చూసుకోవాల్సి వస్తుంది. అంతరంగంలో తిరుగాడే సత్యాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుంది. తనలోని అసలైన మనిషితనాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. ‘నీ లోపలి నిజం’ కవిత ఈ విషయన్నే నొక్కి చెబుతుంది.

జీవితమంటే సుఖదుఃఖాల కలయిక. సుఖానికి పొంగక, దుఃఖానికి క్రుంగక, ఒకే రకంగా ఉండాలని మన పెద్దలు చెబుతారు. ‘చలిత’ కవిత ఇదే స్థితప్రజ్ఞత నేటి అవసరమని గుర్తు చేస్తుంది.

‘మా అమ్మ’ కవిత – అమ్మలు పిల్లల్ని పెంచుతున్న క్రమంలో వారి వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతారో చెబుతుంది. ముదిమి మీద పడుతున్న మాతృమూర్తిని చూసినప్పుడు కవికి ఆమె తమ కోసం పడిన కష్టాలు, నేర్పిన పాఠాలు గుర్తొస్తాయి. మరుజన్మలోనైనా అమ్మై పుట్టాలన్న కోరిక కవిలో కలుగుతుంది.

‘అందని చందమామ’ అని మనకొక ప్రయోగం ఉంది. సాధారణంగా అందుబాటులో లేని, ఊహలకు అందే ప్రేయసి, లక్ష్యం లేదా అసాధ్యమైన కోరికను ఈ ప్రయోగం సూచిస్తుంది. కవిత్వంలో విరహ వేదనకు, అసాధ్యమైన ప్రేమకు ప్రతీకగా దీన్ని తరచుగా ఉపయోగిస్తారు. అయితే చందమామని అసలు అందకు అని కోరుకున్నారు కవి. ఎందుకో ‘అందుకే అందకు’ కవిత చెబుతుంది.

ఏ ఎండకా గొడుగు పట్టమని చెప్పకపోయినా, ఆధునిక సంక్షుభిత జీవితాలలో నెగ్గుకురావాలంటే బతకడమెలాగో తెలియాలి అంటుంది ‘అవును, ఇప్పుడైనా..’ కవిత. పుస్తకాల చదువులే కాకుండా, చుట్టూ ఉన్న మనుషుల స్వభావాలను చదవాలని సూచిస్తుంది.

‘ఇదే నిజం’ అనే కవితలోని “ఎవరి కుట్ర ఎవరి రచ్చ/ఏ వివక్ష ఎవరి కక్ష/ఎవరి శిక్ష ఏ పరీక్ష/ఎవరి క్షిపణి ఎవరి విపణి” అన్న కవితా పాదాలు వర్తమాన అంతర్జాతీయ ఘటనలకు అద్దం పడతాయి. “ఎవరాకలికి ఎవరు బలి?” అని ప్రశ్నిస్తుందీ కవిత. అగ్రరాజ్యంగా భావింపబడే ఓ దేశపు అధినేత దురహంకారాన్ని, యుద్ధోన్మాదాన్ని ఈ కవితలో చూడవచ్చు.

నాన్నని గొడుగుతో పోల్చడం ఒక చక్కని ప్రతీక. ‘కొన్ని క్షణాలు’ కవిత జీవితంలో ఒడిసిపట్టుకోవాల్సిన వాటి గురించి గొప్పగా వివరిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని కామెంగ్ నది గురించి వ్రాసిన కవిత అన్ని నదులకి నమస్కారం వంటిది. ‘ఎందుకని..’ అనే కవిత అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది, జవాబులను వెతకమంటుంది. మనసుకు పట్టిన అనాది ముసురును తొలగించుకోమంటుంది.

రోజూ కొత్త ఉదయాలకై అన్వేషించనక్కరలేదని, నిష్కల్మషమైన మనుషుల్లో ఉదయాలు వెలుగులవుతాయని ‘ఉదయాల్లాంటి మనుషులు’ కవిత చెబుతుంది.

‘ఇల్లు చేరుకోవాలి’ కవిత ఎవరికి వారు చదువుకుని ఆస్వాదించవలసిన కవిత. ‘ఏకం సత్..’ కవిత జీవితాన్ని వ్యాఖ్యానిస్తుంది. అలతి పదాలలో అనంత భావాన్ని వ్యక్తం చేసింది.

“నిన్న పలకరించిన మనుషులు ఈ వేళ ఏరీ?” అని వాపోతుంది ‘వై, హౌ అండ్ వెన్’ కవిత. మనిషిని చూసి మనిషే భయపడుతున్న వర్తమాన దుస్థితికి ఈ కవిత అద్దం పట్టింది.

జీవితాన్ని వైకుంఠపాళితో పోలుస్తూ చెప్పిన ‘ఆట నీదే’ కవిత అత్యంత స్ఫూర్తిదాయకమైనది. ఎదుట పడే పాములను తప్పించుకుంటా బ్రతుకాట ఆడాలని సూచిస్తుంది.

పనుల భారాన్ని తగ్గించుకుని, కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపమని వర్క్‌హాలిక్స్‌కి చెబుతుంది ‘నిశ్చేతనం’ కవిత. బ్రతుకు నిస్సారం కాకుండా, చైతన్యం వెల్లివిరియాలంటే ఏం చేయాలో చెబుతుంది.

ఇంకా కొన్ని చక్కని కవితలున్నాయి. ప్రశ్నించేవి కొన్ని, ఆగ్రహం వ్యక్తం చేసేవి కొన్ని, అన్వేషించేవి కొన్ని, చెట్టూ పిట్టల చెట్టాపట్టాలను కళ్ళకు కట్టేవి కొన్ని.. హాయిగా చదివిస్తాయి, ఆలోచింపజేస్తాయి.

~

“ఎగసిపడే ఆగ్రహాన్ని, నులి తిరిగే వేదనననీ అదిమిపెట్టి మంద్ర స్థాయిలో మాట్లాడగల తాపసి విజయ్.” అని అన్నారు శ్రీ కొప్పర్తి వెంకటరమణమూర్తి, వెనుక అట్ట మీది బ్లర్బ్‌లో. ఇదే అర్థాన్నిచ్చే ఓ ప్రశ్నకు డా. విజయ్ కోగంటి ఏం జవాబిచ్చారో ఇంటర్వ్యూలో చదవండి.

~

మనిషి కన్నుకు పట్టిన మసకను తొలగించుకుంటే, చూపు ఎవరిదో తెలుస్తుంది. ఎటు చూడాలో అర్థమవుతుందని ఈ సంపుటిలోని కవితలు సూచిస్తాయి.

***

ఎవరిదీ చూపు? (కవిత్వం)
రచన: డా. కోగంటి విజయ్
ప్రచురణ: ప్రచ్ఛాయ, హైదరాబాద్
పేజీలు: 164
వెల: ₹ 200/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/EVARIDEE-CHOOPU-Vijay-Koganti/dp/8199107588/

 

~
డా. విజయ్ కోగంటి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-vijay-koganti-2/

Exit mobile version