Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎవరు దొంగ

[శ్రీ కొడాలి సీతారామా రావు రచించిన ‘ఎవరు దొంగ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“నా బేగ్ కొట్టేశారెవరో బస్సులో” చెప్పింది మార్గరెట్ గుంటూరు బస్ స్టేషను ఎదురుగా వున్న పోలీసు స్టేషనులో హెడ్ కానిస్టేబుల్‌తో.

“ఏ బస్సులో? ఎప్పుడు? వివరంగా చెప్పండి.”

“నేను విజయవాడ నుంచి వచ్చాను బస్సులో. ఫ్రీ బస్సు అవటం వల్ల రద్దీ ఎక్కువగా వుంది. అలాగే ఎక్కాను. చివరి సీట్లలో కూచున్నాను. టిక్కెటు తీసుకున్నాక ఫోన్‌లో మాట్లాడుతున్నా మా అమ్మాయితో. ఆ సమయంలో బాగ్ నా పక్కన పెట్టుకున్నాను, మాట్లాడుతూ బస్ స్టాండుకి ముందు స్టేజీలో ఆగినప్పుడు దిగిపోయా బ్యాగు మర్చిపోయి. దిగాక గుర్తొచ్చి ఆటోలో బస్ స్టాండుకి వచ్చి బస్సులో చూస్తే లేదు. కండక్టర్ కూడా ఏ బ్యాగు బస్సులో లేదన్నాడు. అందులో పది తులాల బంగారం నగలు, పాతిక వేల రూపాయలు వున్నాయి” చెప్పింది మార్గరెట్.

“అంత విలువైన బంగారం డబ్బు పెట్టుకుని నిర్లక్ష్యంగా వుంటే ఎట్లా? వివరంగా రాసివ్వండి. వెంటనే పురామయిస్తాం. బ్యాగు రంగు కూడా రాయండి.”

ఆమె కంప్లయింట్ రాసి ఇచ్చింది.

***

మార్గరెట్ కంప్లైంట్ ఇవ్వగానే హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్‌ని పిలిచి బస్ స్టేషన్‌కి వెళ్ళి పాత కేడీలని ఎంక్వైరీ చేయమన్నాడు. అందుబాటులో లేనివాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోమన్నాడు.

***

బయటికి వచ్చాక ఆలోచనలో పడింది. తను ఎంత తప్పు చేసింది. విజయవాడలో నాన్ స్టాప్ ఎక్కకుండా ఫ్రీ బస్ అని ఆశపడి పల్లె వెలుగు ఎక్కింది. నగలు, డబ్బు వుండి తను అలా ఎక్కకుండా వుండాలిసింది. జనం బాగా వుండటం చూసైనా ఎక్కకుండా వుండాల్సింది. అందరితో పాటు తోసుకుని మరీ ఎక్కింది. ఎక్కాకైనా కూతురుతో అంతసేపు మాట్లాడకుండా వుండాలిసింది. బస్సు ఎక్కిందగ్గర నించీ మాట్లాడుతూనే వుంది దిగేదాకా. దిగేటప్పుడు కూడా మాట్లాడుతూనే దిగిపోయింది. పైగా బ్యాగు ఏదో బరువన్నట్టు పక్కన పెట్టుకుంది. ఆ క్షణంలో దాంట్లో వున్న వస్తువుల గురించి మర్చిపోయింది.

గుంటూరు వూళ్లోకి వచ్చేముందు రైలు గేటు దగ్గర దిగిపోయింది, అక్కడినించీ ఇల్లు దగ్గరని. దిగాక గుర్తొచ్చి ఆటోలో బస్ స్టేషన్‌కి వెళ్ళినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు కంప్లైంట్‌లో ఇచ్చినవన్నీ మళ్ళీ వుంటాయా. అసలు దొరుకుతాయా. తను తప్పు చేసింది.

***

వసంత రాణి తుళ్ళూరులో తన క్లాస్‌మేట్ కట్టుకున్న ఇంటి గృహప్రవేశం కోసం వచ్చింది గుంటూరు నుంచీ. గుంటూరులో తను ఎంఆర్వో ఆఫీసులో సీనియర్ క్లర్కుగా చేస్తోంది. ఒక కూతురు. పదవ తరగతి చదువుతోంది. తనని స్కూలుకి పంపి తుళ్ళూరు వచ్చింది. ఆమె మొదట్లో పొన్నూరు తాలూకా ఆఫీసులో జూనియర్ క్లర్కుగా చేరింది పదిహేనేళ్ళ క్రితం. చేరిన ఏడాదికే మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేశారు. అతను గుంటూరులో ఓ ప్రైవేటు బాంకులో క్లర్కు. పెళ్లవగానే తను అక్కడికే బదిలీ కోసం అప్లికేషన్ పెట్టింది. బదిలీ వచ్చేదాకా అతనే పొన్నూరు నుంచీ గుంటూరు వెళ్ళేవాడు. పొన్నూరులో వేరేగా తన తల్లిదండ్రులకి దూరంగా ఇల్లు తీసుకుంది. రెండేళ్ళు బాగానే గడిచాయి. ఇంతలో భర్త హఠాత్తుగా మాయమై పోయాడు. బ్యాంకు వారు చెప్పిందాని ప్రకారం కష్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం మాయం చేశాడు. అధికారులు తెలుసుకునే ముందే పారిపోయాడు. పోలీసు కేసు పెట్టారు. పోలీసులు ఈమె చుట్టూ, ఈమె తల్లిదండ్రులు, అత్తామామా చుట్టూ తిరిగారు. పోలీసు నిఘా పెట్టారు. ఆ సమయంలో ఈమె గర్భిణి.

నెలలు నిండి ఆడపిల్ల పుట్టింది. కడుపు పండిందని సంతోషించాలో, భర్త చేసిన పనికి బాధపడాలో తెలియలేదు. అత్తామామా ఈమెతో బాగానే వున్నారు. మనవరాలిని చూసుకునేందుకు వస్తూనే వున్నారు. కాలక్రమంలో ఆమెకి ప్రమోషన్ వచ్చి గుంటూరు ఎంఆర్వో ఆఫీసుకు వచ్చింది.

కాలం గడిచే కొద్దీ భర్త తిరిగి వస్తాడనే ఆశ వదులుకుంది. పిల్లని చూసుకుంటూ కాలం గడుపుతోంది. రోజూ పొన్నూరు నుంచే ఉద్యోగానికి వస్తోంది. కూతురుని తల్లిదండ్రుల దగ్గిర వదిలి.

కొద్ది రోజులుగా ఇల్లు కట్టుకోవాలనుకుంటోంది. బ్యాంకు లోను కోసం వెళితే ఐదు లక్షలు తక్కువ వస్తోంది తను దాచుకున్న డబ్బు, లోనూ కలిపితేనే. అదెలా సంపాదించాలా అని ఆలోచన చేస్తోంది. తను నిజాయితీగా వుద్యోగం చేస్తుంది. లంచాలు తీసుకోదు. అందువల్ల ఆమెకి జీతం తప్ప మరో ఆధారం లేదు. ఇప్పుడు ఆమె మనసంతా ఐదు లక్షల మీదే వుంది. ఇప్పుడు స్నేహితురాలి ఇల్లు చూశాక మరీ తొందర పడుతోంది. ఆమె మంగళగిరి బస్ స్టాండులో గుంటూరు వెళ్ళే బస్సు కోసం వేచి వుంది.

***

మార్గరెట్ మూడేళ్ళ క్రితం వరకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్ నర్సుగా చేసేది. ఒక రోజు తన నిర్లక్ష్యం వల్ల ఒక గర్భిణి ఆసుపత్రి ఆవరణలోనే ప్రసవించింది. ఆమె నిర్లక్ష్యం అని తేలటంతో ఆమెని విధుల నుంచీ తొలగించారు. మూడేళ్లు ఖాళీగా వున్నాక గుంటూరులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. వున్న ఒక్క కూతురికి పెళ్లి చేసి పంపించింది విజయవాడలో వున్నప్పుడే. అమ్మాయి పెళ్లి కోసం తన నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకుంది. ఆ అప్పు తీరటంతో నగలు విడిపించుకుని వెళుతోంది. కొంత డబ్బు కూడా డ్రా చేసి తెచ్చుకుంటోంది. ఇంతలో ఇలా జరిగింది. భర్త ఏమంటాడో అనే భయం వుంది.

***

ఆగిన బస్సులో ఎక్కింది వసంత రాణి. సీట్లు ఖాళీ లేవేమో అనుకుంది. కానీ చివరిలో సీట్లో కూర్చుంది. తన పక్కన కూచున్నామె ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆమె ధోరణి చూస్తే చాలా సేపటి నుంచీ మాట్లాడుతోంది. వినకూడదనుకున్నా ఆమె మాటలు వినపడుతున్నాయి. కూతురుకి చెప్తోంది అత్త మామల్ని పట్టించుకోవక్కర్లేదని. ఇలాంటి తల్లుల వల్లే కుటుంబాలు ఛిద్రమౌతున్నాయి అనుకుంది వసంత రాణి. తన ఆలోచనలలో తను వుంది. జనం ఒక్కొక్కరూ దిగిపోతున్నారు. తన వెనక పక్కన వున్నవారందరూ దిగిపోయారు. తన పక్కన కూచున్న ఆమె కూడా ఫోన్ మాట్లాడుతూనే దిగిపోయింది. బస్సు బయలుదేరాక చూసింది. ఆవిడ తన బ్యాగు మర్చిపోయింది.

వసంత రాణికి దుర్భుధ్ధి కలిగింది. ఎప్పుడూ తను అలా ఆలోచించలేదు. ఆ బ్యాగు తను తీసుకుంటే. అందులో డబ్బో, నగలో వుంటే తన ఇంటికి కావాల్సిన సొమ్ములో కొంతైనా దక్కుతుంది అనుకుంది. చుట్టూ చూసింది. తన వెనక, పక్కన ఎవరూ లేరు. తను తీసుకున్నా ఎవరూ గుర్తించే అవకాశం లేదు. ఆ బ్యాగు తీసుకుంది. తన చేతి సంచిలో పెట్టుకుని బస్ స్టేషన్‌లో ముందే దిగిపోయింది.

***

కానిస్టేబుల్ పోలీసు స్టేషన్‌కి వచ్చి చెప్పాడు. ఆ బ్యాగు పాత కేటుగాళ్ళెవరూ తీయలేదు. నిజానికి దొంగలే అయినా పోలీసులు అడిగితే నిజం చెప్తారు. దాంతో హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌తో కలిసి బస్ స్టేషన్‌కి వచ్చాడు. సెక్యూరిటీ రూములో వుండే సిసి టీవీ ఫుటేజీ చూశాడు. అనుమానించాల్సిందేమీ కనపడలేదు. అయితే మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు ముందు దిగిన ఆమె కొంచెం కంగారుగా వున్నట్టు వుంది. ఆమె చేతి సంచి గట్టిగా పట్టుకుంది. ఆ చేతి సంచిలో ఆ బ్యాగు వుండి వుండవచ్చు అనుకున్నాడు . ఆమెని వాళ్ళు గుర్తు పట్టారు కూడా. ఆమె ఇంటికి వెళితే ఆమె నించీ ఆ బ్యాగు తీసుకోవచ్చుననుకున్నారు. కానీ ఆమె నిజాయితీపరురాలని తెలుసు. ఏమో ఎవరైనా తప్పు చేయవచ్చు అవకాశం వచ్చినప్పుడు. అలా బయటికి వెళ్లారు.

***

ఇంటికి వెళ్ళిన వసంతలో తప్పు చేసిన భావన కలిగింది. ఇంతవరకూ నిజాయితీగా వున్న తను దీనిలో వుండే సొమ్ముతో తన ఇల్లు నిర్మించుకోవాలనుకోవటం తప్పు అనిపించింది. ఈ ఒక్క తప్పుతో తను ఇంతకాలం సంపాదించుకున్న మంచి పేరు కాస్తా పోతుంది. అవకాశం వస్తే తనూ దొంగతనం చేస్తుందని అందరూ అనుకుంటారు. అప్పుడు తనకీ, తన భర్తకీ తేడా ఏముంది. పైగా తన కూతురికీ, తల్లిదండ్రులు, అత్తమామలకీ ఎంత అవమానం. తన కూతురిని స్నేహితులు దొంగ కూతురని హేళన చేస్తారు. చిన్నపిల్ల తట్టుకోలేదు ఆ అవమానం. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే?తను జైల్లో వున్నా తట్టుకోగలదా ఆ బాధ.

వెంటనే కూతురికి చెప్పి బస్ స్టేషన్ కి వెళ్ళి అధికారులకి ఈ బ్యాగు ఇచ్చేస్తే తనకి మనశ్శాంతి వుంటుంది. అలాగే అధికారులకి ఆ బ్యాగు అందించింది. వాళ్ళు వెంటనే పోలీసులకి ఫోన్ చేశారు. బ్యాగు దొరికిందని. వసంత రాణి కంగారు పడుతోంది తనని దొంగగా జైల్లో పెడతారేమోనని. కాసేపటికి పోలీసులు వచ్చారు. స్టేషన్ కి వెళ్ళాక మార్గరెట్ సమక్షంలోనే ఆ బ్యాగు తెరిచి అందులో వున్న వస్తువులు తీస్తే, ఫిర్యాదులో చూపినన్ని నగలు లేవు. మూడు నగలు, డబ్బు పదివేలే వుంది.

వసంత రాణిని అడిగారు మిగతా నగలు, డబ్బు ఎక్కడ పెట్టారని. ఆమె చెప్పింది “నేను తప్పు ఆలోచనతో ఆ బ్యాగు తీసుకెళ్లిన మాట నిజమే. కానీ ఆ బ్యాగు అసలు తెరవలేదు. ఇంటికెళ్ళేటప్పటికి నాకు తప్పు చేశానన్న పశ్చాత్తాపం కలిగి వెంటనే బస్ స్టేషన్‌కి వచ్చాను.”

ఆమె చెప్పింది నిజమే అని వారికి తెలుసు. ఆమె ఇంటికి వెళ్ళగానే ఆమె కూతురు అదే చెప్పింది. వారు బ్యాగులోని ఇతర వస్తువులు తీసినప్పుడు బ్యాంకు రసీదులు కూడా వున్నాయి. అవి చూస్తే వారికి అర్థమైంది మార్గరెట్ తప్పుడు కంప్లైంట్ ఇచ్చిందని. ఆమెని మందలించారు ఆ రసీదులు చూపిస్తూ. ఆమె తన తప్పు ఒప్పుకుని మన్నించమని వేడుకుంది. ఆ కంప్లైంట్ ఆమె చేతే చింపించేశారు.

వసంత రాణి పోలీసులకి కృతజ్ఞతలు చెప్తూ తృప్తిగా బయటికి వచ్చింది.

Exit mobile version