[శ్రీమతి రోహిణి భైరవజోశ్యులు గారు రచించిన ‘ఎక్స్చేంజ్ ఆఫర్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
“అబ్బబ్బబ్బా! మా అత్తగారితో విసుగెత్తిందనుకో!” అన్నది శ్రావణి తన కొలీగ్ వత్సలతో.
“ఏమైంది? మీ అత్తగారు మంచిదనే అన్నావుగా! ఇప్పుడేమిటి ఈ కొత్త విసుగు?”
“ఇది కొత్త విసుగు కాదే పాతదే. నిజంగా ఆవిడ చాలా మంచిదే. అన్ని పనులూ తనే చేస్తుంది. నన్ను తన కన్న కూతురిలా చూసుకుంటుంది. కానీ ఆవిడ మడి, ఆచారాలతో మమ్మల్ని చంపేస్తుంది.” ఒకింత బాధగా చెప్పింది శ్రావణి.
“అవునా! మరి నాకిన్ని రోజులూ చెప్పలేదే.” అడిగింది వత్సల.
“ఇలాంటి కారణాలు చెప్తే నవ్వుతారని చెప్పలేదే.”
“నేను నవ్వనుకానీ అసలు విషయం చెప్పవే. పరిష్కార మార్గం కనిపించక మానదు.”
“అయితే ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్ళాలి.” అన్నది శ్రావణి ఎటో చూస్తూ.
“సమస్యలు చెప్పమంటే, ఎటో చూస్తావేమే?” విసుక్కున్నది వత్సల.
“సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ చెప్పేటప్పుడు ఇలాగే ఎటో చూస్తారు, లేదా గుండ్రాలు గుండ్రాలుగా కళ్ళముందు తిరుగుతుంది కదా! అలా గుండ్రంగా తిప్పడానికి ఇప్పుడు నా దగ్గర వస్తువేమీ లేదు. అందుకే ఎటో చూస్తున్నాను. నువ్వూ అటే చూడు. నా ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది.” చెప్పింది శ్రావణి.
“సరేలే! నేనూ అటే చూస్తాను. చెప్పు మరి నీ సమస్యల ఫ్లాష్‌బ్యాక్.”
***
శ్రావణి అత్తగారి పేరు రమణమ్మ. ఆవిడ మనిషి మంచిదే కానీ మడి, ఆచారాలు అంటూ చాదస్తాలు ఎక్కువ. వంటింట్లోకి ఎవరినీ రానివ్వదు. ఆవిడకు చిన్నతనంలోనే తల్లి పోతే, వాళ్ళ బామ్మ దగ్గర పెరిగింది. తల్లిలేని పిల్ల అని అతిగారాబం చేయడంతో, చదువు వంటబట్టలేదు కానీ, బామ్మ మడి, ఆచారాలు మాత్రం బాగా వంటబట్టించుకున్నది.
శ్రావణి ఉద్యోగం చేస్తుంది. పొద్దున్నే “అత్తయ్యగారు కాఫీ!” అని వంటింటి గడపవతల నిల్చొని అడుగుతుంది. “స్నానం చేసావా?” అనుమానంగా చూస్తుంది. స్నానం చేస్తేనే కానీ కాఫీ ఇవ్వదు. వంట పూర్తయ్యాక, నైవేద్యం పెట్టాక కానీ ఎవరికి భోజనం పెట్టదు. శ్రావణికి ఆఫీసుకు వెళ్ళే సమయం దాటిపోతున్నా, ఆవిడ సహస్రనామాలు అవ్వాల్సిందే, తరువాతనే నైవేద్యం. ఒక్కొక్కసారి భోజనం చేయకుండానే ఆఫీసుకు వెళ్ళిపోయేవారు శ్రావణి, శ్రీరామ్.
ఆఫీసు క్యాంటీన్ లో భోజనం చేసేవాళ్ళు.
అది తెలిసి, “ఛీ! ఛీ! మడి తడి లేకుండా, ఎవరో చేసిన వంటల్ని తింటారా? స్నానం చేసి, కట్టుకున్న బట్టలు ఉతికి ఆరేసి, లోపలికి రండి.” అనేది.
దాంతో శ్రీరామ్‌కు తల్లిమీద కోపం వచ్చేది.
“నీ ఉద్దేశ్యం నాకర్థం కాలేదు. ఇంట్లోనూ తినక, బయటా తినక, మేమేమై పోవాలి? తినకుండా ఉపవాసం ఉండమన్నావా?” అని తల్లి మీద ఎగిరేవాడు.
దానికావిడ నొచ్చుకునేది.
మరుసటి రోజు ఇంకా పొద్దున్నే లేచి, వంట, పూజ, నైవేద్యం పెట్టేది.
స్నేహితులెవరైనా ఇంటికి వస్తే, వీళ్ళు మనవాళ్ళేనా అని ఆరాలు తీస్తుంది. ఖర్మకాలి వాళ్ళు తమవాళ్లే అని తెలిస్తే, వాళ్ళతో ఎక్కడో బీరకాయ పీచు సంబంధం ఉన్నట్టు కనిపెడుతుంది.
ఇక పనిమనిషిని వంటింట్లోకి రానివ్వదు. వంటింటి పక్కన ఉన్న బాల్కనీని యుటిలిటీ కింద మార్చి, ఆమెను అక్కడ గిన్నెలు కడగమన్నారు. ఆ కడిగిన గిన్నెల మీద మళ్ళీ నీళ్ళు చల్లి, అప్పుడు వాడుకోవాలి. ఇక మడి చీర ఆరేయడానికి స్థలమే దొరకలేదు. ఇంతకుముందున్న ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి, బోలెడు బయలు ఉండేది. ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లో ఆవిడ చీర ఎక్కడ ఆరేయాలో..? అది ఎవరూ ముట్టుకోకూడని స్థలంలో ఆరేయాలి. ఇలాంటివే.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
***
“ఇదీ మా అత్తగారి ఫ్లాష్‌బ్యాక్.” చెప్పడం ముగించింది శ్రావణి.
“అవునే! మొత్తం కళ్లకు కట్టినట్లు చెప్పావు. దీనికి పరిష్కారం ఆలోచించాలి. ఆవిడ మారేటట్టు చేయాలి. ఎలా?” అన్నది వత్సల.
“అదే కదా నా సమస్య.” దిగాలుగా అన్నది శ్రావణి.
ఈలోపల లంచ్ టైమ్ అయిపోవడంతో, మళ్ళీ ఆఫీసు పనులలో పడ్డారు.
***
ఒకరోజు వాళ్లిద్దరూ ఆఫీసునుంచి ఇంటికి వస్తుండగా దారిలో ఒక విచిత్రమైన బోర్డు కనబడింది. ఆ బోర్డు మీద ఇలా రాసి ఉంది..
“ఇక్కడ మనుషులను ఎక్సేంజ్ చేయబడును”
ఇది చూసి అర్థంకాక అయోమయంలో పడ్డారు.
“ఏమిటే ఇది? కొత్తగా, చాలా విచిత్రంగా ఉంది.” ముందుగా తేరుకున్న వత్సల అన్నది.
“అవునే! ఇలాంటి బోర్డు నేనెక్కడా చూడలేదు.” ఆశ్చర్యంనుంచి ఇంకా కోలుకోని శ్రావణి, నోరు వెళ్ళబెట్టే ఉన్నది.
“లోపలికెళ్ళి కనుక్కుందాం పద.” స్నేహితురాలి రెక్క పట్టుకుని లాక్కుపోయింది వత్సల. అదొక రంగులు వెలసిపోయిన పాతబడిన ఇల్లు.
ముందరి వరండాలో అయిదారు మంది కూర్చున్నారు, డాక్టర్ కోసం ఎదురుచూసే పేషంట్లలాగా.
వాళ్ళ పక్కన కూచున్నారు. పక్కన కూర్చున్న వాళ్లను విషయమేమిటని ఆరా తీసింది వత్సల.
“మా కోడలు మరీ మోడర్న్. మా ఆచార వ్యవహారాలంటే అసలు గిట్టదు. ఇక్కడ అలాంటి వాళ్లను మారుస్తారని తెలిసి వచ్చాను.” అన్నది.
ఇంకొకావిడ తన మొగుడు, తన మాట వినడం లేదని, ఇక్కడ మొగుడిని మారుస్తారని తెలిసి వచ్చిందట. అన్నీ ఇలాంటి కేసులే.
ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళి, కాసేపయ్యాక నవ్వు మొహాలతో వస్తున్నారు.
వీళ్ల వంతు వచ్చింది. లోపలికి పిలిచారు.
అక్కడొక టేబుల్ వేసి ఉంది. ఒక పెద్దాయన టేబుల్‌కు ఒక వైపున కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆయన, తన పేరు నిశ్చింతరావు అని చెప్పాడు.
‘ఏమిటో ఇతని పేరు, ఆఫీసు పేరు.. అన్నీ వింతగానే ఉన్నాయి.’ అనుకున్నది వత్సల.
టేబుల్‌కు ఇవతల ఉన్న కుర్చీలలో వీళ్లిద్దరినీ కూర్చోమన్నట్టు సైగ చేశాడు ఆయన.
ఆ తరువాత విషయమేమిటని అడిగారు. మొత్తం ఏకరువు పెట్టింది శ్రావణి. “ఎలాగైనా మా అత్తగారి చాదస్తాన్ని వదిలించాలి.” అని వేడుకున్నది.
ఆయన అర్థమైనట్టు తల పంకించి, “మీకు మీ అత్తగారి స్థానంలో వేరే ఎవరినైనా ఆధునిక భావాలున్న అత్తగారిని పంపించాలా.. ఐ మీన్.. ఎక్స్చేంజ్ ఆఫర్ అన్నమాట.”
ఆ మాటకు బాంబు పేలినట్టు ఉలిక్కిపడ్డారు ఇద్దరూ.
“అబ్బే! అలా చేస్తే, మా వారు నన్ను చంపి, పాతరేస్తారు. ఆవిడ ప్రవర్తన మార్చండి చాలు.” అన్నది.
‘అయితే! మీకేమీ అభ్యంతరం లేదన్నమాట’ మనసులో అనుకున్నాడు ఆయన.
“అలాగే! ఏదో ఒక కారణం చెప్పి, మీ అత్తగారిని తీసుకుని రండి. మీకొక శాంపిల్‌గా ఆధునిక భావాలు కల మనిషిని పంపుతాను. ఆమె మీ ఇంట్లో కొన్ని రోజులు ఉంటుంది. మీకు నచ్చితే, మీ అత్తగారిని ఆవిడలాగా మారుస్తాము.”
“కానీ.. మా అత్తగారికి ఏం చెప్పి తీసుకురావాలి.” నసుగుతూ అడిగింది శ్రావణి.
“ఇక్కడ భజనలు, సత్సంగాలు జరుగుతున్నాయని ఇక్కడికి తీసుకుని రండి. ఆవిడకు కొంత మార్పు అవసరం అని ఒప్పించండి. ఇందులోనే మీ టాలెంట్ ఆధారపడింది.” శ్రావణిని ప్రోత్సహిస్తూ మాట్లాడాడు ఆయన.
తల ఊపి, ఇద్దరూ బయట పడ్డారు.
***
“అత్తయ్యగారూ! కాశీ నుంచి ఒక భజనబృందం వచ్చింది. కొన్ని రోజులపాటు భజనలు, సత్సంగాలు జరుగుతాయట. ఇష్టమైన వాళ్ళు జాయిన్ కావచ్చని అన్నారు. మీకు అభ్యంతరం ఉండదు కదా అని మీ పేరు ఇచ్చాను. మీకు కూడా కాస్త చేంజ్ ఉంటుంది.” శ్రావణి జంకుతూనే అన్నది రమణమ్మతో.
ఆవిడ బోలెడు సంతోషపడింది.
మరుసటి రోజే ఆమెను తీసుకుని వెళ్ళి అక్కడ చేర్పించింది.
“ఇక్కడ భజనలు, సత్సంగాలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో ఆవిడ ఒప్పుకుని వచ్చింది. కాబట్టి ఆ కార్యక్రమాలు జరిపించే పూచీ మీదే. పైగా ఆవిడకు మడి, ఆచారాలు ఎక్కువ.” రహస్యంగా ఆయనతో చెప్పింది శ్రావణి.
“మీకెందుకు? ఇక్కడికి వచ్చేవాళ్ళు దాదాపుగా అలాంటి వాళ్ళే ఉన్నారు. మీరు నిశ్చింతగా ఉండండి.” హామీ ఇచ్చాడు నిశ్చింతరావు.
తల్లిని భజనలకు పంపినట్టు తెలిసి అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు శ్రీరామ్.
***
పొద్దున్నే ఎవరో తలుపు తడుతుంటే, వెళ్ళి తలుపు తీసింది శ్రావణి.
ఎదురుగా స్లీవ్ లెస్ జాకెట్టు, సిల్క్ చీర, కళ్ళకు నల్ల కళ్ళజోడుతో ఒకావిడ ప్రత్యక్షమైంది.
“ఎవరండీ మీరు?” అయోమయంగా అడిగింది శ్రావణి.
“నన్ను నిశ్చింతరావు పంపాడు. నా పేరు శాంతి. కొన్నాళ్ల పాటు మీ అత్తగారి స్తానంలో ఉంటానన్నమాట.” అన్నది ఆవిడ. ఆవిడకు యాభై ఏళ్ల వయసుంటుంది.
ఈరోజు పొద్దున్నే శ్రీరామ్ ఆఫీసుపని మీద క్యాంపుకెళ్ళడం శ్రావణి అదృష్టం.
రాత్రికి వచ్చిన శ్రీరాంతో చిన్న అబద్ధమాడింది శ్రావణి. “ఈమె మా స్నేహితురాలి తల్లి. మా ఫ్రెండ్ వాళ్ళు, ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్లారు. ఈమెను కొన్నిరోజులు చూసుకోమని మనింట్లో వదిలారు.”
అదృష్టం.. ‘ఈవిడకు ఇంకెవరూ బంధువులు లేరా? అక్కడ వదలకుండా, మనింట్లో ఎందుకు వదిలారు?’.. లాంటి ప్రశ్నలు వేయలేదు శ్రీరామ్.
***
పొద్దున నిద్ర లేచిన శ్రావణికి, శ్రీరామ్‌కు శాంతమ్మ, తన గదిలో కనబడలేదు. ఇద్దరూ గాభరా పడిపోయారు. పోలీసు కంప్లయింట్ ఇవ్వాలనుకున్నారు.
ఇంతలో వగర్చుకుంటూ లోపలికి వచ్చింది శాంతి. ప్యాంటు, టీ షర్టు వేసుకుని, కాన్వాస్ షూస్ వేసుకున్న ఆవిడను వింతగా చూసారు.
“పొద్దున్నే జాగింగ్‌కు వెళ్ళాను. నాకు వెంటనే ఒక గ్లాసుడు బత్తాయి రసం ఇవ్వమ్మాయ్!” అన్నది తన గదిలోకి వెళ్తూ.
ఆవిడను మనసులోనే తిట్టుకుంటూ బత్తాయిరసం చేసి, ఆవిడకు ఇచ్చింది. మరో అరగంటకు డ్రిల్ లాంటి ఎక్సర్ సైజులు చేసింది. టిఫిన్ తిని, రెస్టు తీసుకున్నది.
మధ్యాహ్నం భోంచేసి, టీవీలో ఇంగ్లీష్ సినిమాలు చూసింది.
సాయంత్రం చుడీదార్ వేసుకుని, “అమ్మాయ్! నేనలా క్లబ్ వైపు వెళ్ళొస్తా! రాత్రికి రోటీలు, సలాడ్, కూర చెయ్యి.” అంటూ బూట్లు టక టక లాడించుకుంటూ వెళ్ళిపోయింది.
రాత్రి రోటీలు తిని, లస్సీ తాగింది.
ఇక తమ స్నేహితులు వస్తే, వాళ్ళతో జోకులు వేస్తూ అక్కడే కూర్చుని, “అమ్మాయ్! వీళ్లకు పకోడీలు వేయించి పట్టుకురా!” అని ఆర్డర్ పెట్టేది.
‘ఈవిడ పేరు శాంతి కాదు అశాంతి అని ఉండాల్సింది.’ విసుక్కుంటూ అనుకున్నది శ్రావణి.
ఈవిడను ఎంత త్వరగా వదిలించుకుందామా అనిపించింది.
“అమ్మో! మా అత్తగారిని ఈవిడలాగా తయారు చేస్తారేమో! ముందులాగా మడి, ఆచారాలున్న అత్తగారే కావాలి. రేపే ఈవిడను ఆ సంస్థకు అప్పగించి, బంగారంలాంటి తన అత్తగారిని తెచ్చుకోవాలి.” అనుకుంటూ కళ్ళు మూసుకుని పడుకుంది.
***
“అమ్మాయ్! ఏమిటా మొద్దు నిద్ర?” ఎవరో కుదుపుతూ నిద్ర లేపుతున్నారు.
ఉలిక్కిపడి నిద్ర లేచిన శ్రావణికి ఎదురుగా అత్తగారు నవ్వుతూ కనిపించారు.
సంతోషంతో ఒక్క ఉదుటన నిద్ర లేచి, “మీరెప్పుడొచ్చారు? ఆ అశాంతి వెళ్ళిపోయిందా?” అన్నది.
“నేనెప్పుడు రావడమేమిటే? నేనిక్కడే ఉన్నానుగా! అశాంతి ఎవరు? మతి గానీ పోయిందా లేక పీడకలేమైనా వచ్చిందా?” అన్నది.
‘అమ్మో! ఇదంతా కలా?’ గుండెలమీద చేయి వేసుకుని తృప్తిగా నిట్టూర్చింది శ్రావణి.
***
పొద్దున్నే తనకొచ్చిన కల గురించి వత్సలతో అన్నది.
ఆశ్చర్యంతో విన్న వత్సల, “మనుషులను ఎక్స్చేంజ్ చేసే సంస్థలు కూడా ఉంటాయా, నీ పిచ్చికాని. భలే కల కన్నావే!” అంటూ పడీ, పడీ నవ్వింది.
