[మోహనరావు మంత్రిప్రగడ గారు రచించిన ‘ఫెయిలైన రమేష్ ప్లాన్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
అరవరాజు గుమ్మంలో కూర్చున్నాడు బైట నుంచి జానకి ఓ బాబుని తీసుకు రావడం చూసాడు. గుమ్మం దగ్గరే ఆగిపోయింది.
“అదేంటి జానకి అక్కడే ఆగి పోయావు లోపలికి రా” అన్నాడు అరవరాజు సౌమ్యంగా.
“ఈ బాబు మన బాబేనా” అని మళ్ళా అడిగాడు.
జానకి ఆశ్చర్యపోయింది అతనంత సౌమ్యంగా అడగడం చూసి.
“అవును మన బాబే” అంది నెమ్మదిగా.
“మరైతే వచ్చావెందుకు” అడిగాడు అరవరాజు.
ఆమె కొంచంసేపు తటపటియించి “ఈ బాబు తన కొడుకు కాదు కనక బాబును తండ్రికి ఇచ్చేసి రమ్మన్నాడు” అంది పక్కకు తిరిగి.
“అది సరే, ఈ బాబు మన ఇద్దరి పుట్టినవాడు కదా, మరి నువ్విలా ఈ బాబుని వదిలేసి వెడితే వీడి ఆలన, పాలనా ఎవరు చూస్తారు? మా ఇంట్లో ఆడదక్షత కూడా లేదు. మా నాన్న పెద్దవాడైపోయాడు” అన్నాడు.
“అయితే నువ్వు పెళ్ళి చేసుకోలేదా” అడిగింది జానకి.
“లేదు ఎలాగు నా మూలంగా నువ్వు తల్లివైనావు కదాని మనం పెళ్ళి చేసుకొందాం అని అడిగితే నువ్వు కాదన్నావు, ఇంక నాకు పెళ్ళి మీద యావ పోయింది” అన్నాడు అరవరాజు.
“ఐతే మరెలా? ఈ బాబుని తీసుకు రావద్దని గట్టిగా చెప్పాడు రమేష్” అంది జానకి నసుగుతూ.
అరవరాజు కొంచంసేపు ఆలోచించి “అతన్ని వదిలేసి ఈ బాబుతో నా దగ్గర ఉండకూడదా” అడిగాడు.
“అంటే అతను నన్ను బాగా ఇష్టపడుతున్నాడు. నా పేర ఏభై లక్షలకు ఇన్సురెన్సు కూడా చేయించాడు” అంది.
ఆ మాటకు అరవరాజు ఉలిక్కిపడి, “ఇన్సురెన్సు నీ పేర చేయంచడమేమిటి? అతని పేర కదా తీసుకోవాలి” అని అడిగాడు ఆశ్చర్యంగా!
“లేదు. అది ఏభైలక్షలు నాకే వస్తాయిగా. అందుకని అలా చేసాడంట” అంది జానకి.
“హలో పిచ్చిదానా, నీకు ఏభై లక్షలు వచ్చేదాకా నువ్వుంటావా?” అడిగాడు అరవరాజు.
“అదేంటి అలా మాట్టడతన్నావు” కంగారుగా అడిగింది జానకి.
“అంటే ఏభై లక్షలు దాక కట్టడానికి శానారోజులు పడతది. ఈలోగ రెండేళ్ళు కట్టాక నిన్ను సంపేసి నా భార్య పాయిందని ఏభై లక్షలు లాగేత్తడు, కావాలంటే ఎవరైన ఇన్సురన్సు ఏజంటు నడిగితె తెలుత్తాది, నేనలా బైటకెల్త, పిల్లగాడితో ఈడనే ఉండు సీకటైపోతంది కదా. తెల్లారాక పోదుగాని, ఈలోగ మా నాయన కూడ వత్తాడు”అని బైటకు దారితీసాడు అరవ రాజు.
ఆ తరవాత జానకి తలుపేసి తనకు తెలిసిన ఏజంటు దగ్గరకు పోయి బోగట్టా చేసింది, అతగాడు అంత వివరంగా చెప్పాడు. తిన్నగా ఇంటికొచ్చింది. అప్పటికే అరవరాజు నాయన వచ్చేఉన్నాడు, జానకిని చూసి ఆనమాలుకట్టి
“ఏం అమ్మాయి బాగుండావా? ఏడుంటున్నావు? ఈడు నీ కొడుకా?” అడిగాడు.
“బాగనె ఉన్నాను, బొంబాయిలో ఉంటన్నా. ఈడు నీ మనవడే. అరవరాజు కొడుకే” అంది
“అట్టనా మంచిగున్నాడమ్మ, మరెందుకు వచ్చినావు” అడిగాడు ఆయన.
“నేనిందాకానే వచ్చా. అరవరాజుని కలిసినా. ఆయన బైటకెళ్ళాడు, ఈలోగ నాకు ఎరికైన వాళ్ళ ఇంటికి పాయి వచ్చినాను” అంది.
ఇంతలో అరవరాజు వచ్చాడు. “ఏంటి ఏం ఆలోసించుకొన్నావు?” అని అడిగాడు.
“అసలు యిషయం నాకు బాగ బోధైనాది, అతగాడి మోసం తెలిసినాది. నేను ఈడనే ఉండిపోతా” అంది తలొంచుకొని.
ఆ తరవాత అరవరాజు అతని నాయనకు విషయం బాగా వివరించాడు. “సరే బాబా మంచిది. రేపే పోయి గుడిలో తాళి కట్టేసి తీసుకురా. బెడదుండదు” అన్నాడు.
అలా, మరునాడు అరవరాజు పెళ్లి అయిపోయింది.
***
ఒక రోజు ఇంట్లో ఎవరు లేరని తెల్సుకొని రమేష్ అరవరాజు ఇంటికి వచ్చి సావిటల్లో కూర్చున్న జానికిని చూసి లోపలకొచ్చి “నిన్ను పిల్లాడిని వదిలేసి రమ్మంటే రాలేదేంటి?” అని అరిచాడు.
“ఏం మళ్ల వస్తే దుబాయ్ సేట్‌కి అమ్మేద్దామనుకున్నావా?” అడిగింది.
“ఐతే అరవరాజు నీకు అంతా చెప్పేసాడా?” అడిగాడు రమేష్.
“అవును నీ ఇన్సూరెన్సు మోసం గురించి కూడా తెలుసుకొన్నాను”, అంది జానకి.
“సరే నే చెప్పేది కూడా విను, నువ్వు ఇప్పుడు నాతో రాకపోతే మొత్తానికే పైకి పంపేస్తాను”, అని బొడ్డులోంచి కత్తి తీసి క్రిందపెట్టాడు.
ఇంతలో అతని ఫోన్ మోగింది. తీసాడు.
“ఒరే బావ నువ్వు ఎనక్కి తిరిగిసూడు. అరవరాజు బాబు దూడ్డుకర్ర వేసుకోని గుమ్మంకి అడ్డంగా ఉన్నాడు. ఆడు ఆ కర్రతో నీ బుర్ర మీద ఒకటి ఇచ్చాడంటే అమ్మాయిని లేపడం మాట అటుంచి నువ్వు టపా కట్టేస్తావు” అని చెప్పాడు అవతల మనిషి. రమేష్ ఉలిక్కిపడి తిరిగి చూసి గబుక్కున లేచి అతన్ని తప్పించుకొని బైటకి పరుగు తీసాడు.
“అమ్మాయి, వీడి పీడా వదిలింది. మళ్ళీ రాడులే” అని లోపలకి వచ్చాడు ఆవిడ మావగారు.
