[జోశ్యుల సూర్య ప్రకాష్ గారు రచించిన ‘ఫిల్మ్ మేకర్స్‌కి మాత్రమే’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు చైతన్య పిన్నమరాజు.]
‘ఫిల్మ్ మేకర్స్‌కి మాత్రమే’ అనే ఈ కొత్త తరం సినిమా పుస్తకం నా చేతిలోకి వచ్చి చాలా రోజులైనప్పటికీ, చదివి రివ్యూ చేయడానికి ఇప్పటికి కుదిరింది.
జోస్యుల సూర్యప్రకాశ్ గారు వేసిన సినిమా పుస్తకాలు, అలాగే ‘ఓం స్వామి’ జీవిత చరిత్ర.. లాంటివన్నీ చదివాను. ఆయన ఒక యజ్ఞంలా పుస్తకాలు అచ్చు వేస్తూ వస్తున్నారు. ఈ పనులకి చాలా సమయం, డబ్బు ఖర్చు చేయాలి. ఎంతో ఇష్టం ఉంటేగానీ ఈ కష్టాన్ని భరించడం కష్టం.
ఈ ‘ఫిల్మ్ మేకర్స్‌కి మాత్రమే’ పుస్తకం చాలా క్లుప్తంగా, చాలా మంది గొప్ప గొప్ప ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్‌ని మనకు పరిచయం చేస్తుంది. కేవలం పరిచయం మాత్రమే. వాళ్ల గురించి పరిశీలన, వాళ్ళు తీసిన ఆ సినిమాల మంచి, చెడ్డలు.. మనమే వెతుక్కుని, వాళ్ళ సృజనని అనుభవించి పలవరించాలని ఆయన ఉద్దేశం. సినిమా అందించిన అద్భుతమైన దర్శకులూ, కళాకారులు.. ఉత్తమాభిరుచిని కళగా ప్రపంచానికి అందించిన స్రష్టలు.. చార్లీ చాప్లిన్ నుంచి మన సత్యజిత్ రే, కె. విశ్వనాధ్ లాంటి గొప్ప దర్శకుల వరకు, ఇంకా యువతరం మెచ్చిన ఈ కాలపు గొప్ప దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, మణిరత్నం, వెట్రిమారన్, తెలుగు సినిమా నిండా గోదావరిని పరిచేసిన వంశీ.. ఇలా పరిచయం చేసుకుంటూ పోయారు.
సినిమాల్లోకి వద్దామనుకునే వాళ్లకన్నా ఈ పుస్తకం పరిశ్రమలో ఉన్నవాళ్లకే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎన్నో శైలిలు, ఎందరో దర్శకులు. విభిన్నమైన పద్ధతులు, విలక్షణమైన నరేషన్. సక్వెన్స్ బ్రహ్మ హిచ్‌కాక్, మెదడుకి మేత పెట్టే క్రిష్టపర్ నోలన్.. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే స్పీల్‌బర్గ్, కొత్త ప్రపంచాల్లోకి తీసుకుపోయే జేమ్స్ కామరూన్, ఇలా ఎంతో మంది. ఇవన్నీ చూసుకుంటూ బ్రహ్మాండమైన సర్కస్‌లో తప్పిపోయే చిన్న పిల్లల్లా ఈ పుస్తకంలో తిరుగాడతాం.
సినిమాల మీద వచ్చే పుస్తకాలు ఇరవై, ముప్పై సంవత్సరాల క్రితం తెలుగులో బాగా తక్కువగా ఉండేవి. ఇవాళ పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. సూర్య ప్రకాష్ గారు లాంటి వాళ్లు అందుకు పూనుకుంటున్నారు. ఇది మంచి విషయం. ఇదే సమయంలో ఇంటర్నెట్‌లో ప్రపంచం.. (అందులో సినిమా కూడా ఉంది) అరచేతిలోకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మాయ చేయటం కష్టం. సినిమా ప్రేమికులు ఈ పుస్తకాన్ని చదవండి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించాలనిపిస్తే పించండి. లేదా చర్చ లేపండి. ఠాఠ్ ఆ డైరక్టర్ గురించి నువ్వు రాసింది తప్పు, అని నిలదీయండి. ఏదైనా మంచిదే. ఆయన తెరతీసాడు. అందులో చాలా కొటేషన్స్ ఉన్నాయి. అభిప్రాయాలు ఉన్నాయి. అభిప్రాయాలు వెలిబుచ్చిన వాళ్ల పేర్లు ఉన్నాయి. వాళ్లందరినీ తెలుసుకోవటం బాగుటుంది. సినిమా అంటే ఇష్టం ఉంటే ఇంకా బాగుంటుంది.
ఈ పుస్తకం గురించి నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పుస్తకం రచయిత సూర్యప్రకాష్ గారు.. నాలాంటి వారి అందరికి అన్నీ తెలిసి ఉంటాయిలే అనుకునే, ఆ దర్శకులు అందరూ మన ఇంట్లో వాళ్లే అన్నట్లు రాసారు. ఆయనంటే సినిమా సమీక్షకులు కనుక.. ఆయనకు వాళ్లందరి వర్క్స్ తోనూ పరిచయం ఉంటుంది. వాళ్ల గురించి మొత్తం కాకపోయినా కొంత తెలిసే ఉంటుంది. హాలీవుడ్ దర్శకులు, కొరియన్ దర్శకులు, జపాన్ దర్శకుడు అకీరా కురసోవా, మన సత్యజిత్ రే , వీరి జాతీయిత, నేపథ్యం. వాళ్ల దేశాలు. ప్రాతాలు క్లుప్తంగా ఫుట్ నోట్స్‌లో ఇవ్వాలి. అలా కాకుండా అందరినీ రొడ్డకొట్టుగా హడావిడిగా ఒకే గాటిన కట్టేసారు. వచ్చే పార్ట్ 2 లో అయినా ఇది పాటిస్తారేమో అని ఆశ.
సూచన:
తర్వాత తనకు తోచిన విధంగా దర్శకుల గురించి వారి సినిమాల గురించి రాసుకుంటూ పోయారు. కొందరి దర్శకుల పాత్రల గురించి రాశారు.. కొంతమందివి రాయలేదు. ఇదో స్టైల్ అనుకున్నారేమో తెలీదు.. మొత్తం మీద ఈ రకమైన పుస్తకాలలో ఇది మొదటిది కనుక రాబోయే పార్ట్ 2 లలో ఇంకొంచెం పద్ధతిగా, ఇంకొంచెం వివరంగా స్పష్టంగా ఈ పరిచయాలు ఇంకా బలంగా రావాలని కోరుకుంటున్నాను.
సినిమా ప్రియులారా..! ఇది చిన్న పుస్తకం.. చదవండి.. సినిమా గురించి కొంచెం తెలిసినట్లు ఉంటుంది. ఈ నాంది ప్రస్తావనలతో మరింత లోతుల్లోకి వెళ్లండి. మంచి సినిమాలు తీయడానికి ప్రేరణ పొందండి.
సూర్య ప్రకాష్ గారు మరిన్ని పుస్తకాలు మరింత బాగా తీసుకురండి.
***
రచన: సూర్యప్రకాశ్ జోశ్యుల
జోశ్యుల పబ్లికేషన్స్
పుటలు: 196
వెల: ₹ 249
ప్రతులకు:
జె. దుర్గాభవాని
ఫోన్: 9704683520,
9493443832
చైతన్య పిన్నమరాజుగా పరిచితులైన రచయిత అసలు పేరు శ్రీనివాసరాజు. హైదరాబాద్ టివి అండ్ సినిమా రచయితగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రయాణం.
ప్రస్తుతం శ్రీ విజయేంద్రప్రసాద్ (ఫిల్మ్ రైటర్) గారి స్టోరీ డిపార్ట్మెంట్లోనూ, freelance writer గా వర్క్ చేస్తున్నారు. రాయడం కంటే చదవడం ఎక్కువ ఇష్టం.
ఉదయని ఆన్లైన్ మ్యాగజైన్ ఉగాది పోటీలో.. ‘ఎస్టేట్ తగాదా’ కథకు మొదటి బహుమతి పొందారు.
వీరి తొలి కథ ‘ఒకరోజే రాజు’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడింది. తర్వాత All India Radio తో కలిపి రకరకాల కథలు సుమారు ఆరేడు కథలు (రకరకాల పత్రికలలో ఆదివారం అనుబంధంలో..) ఒక హాస్య నాటిక కూడా రచించారు.
