[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[వేగంగా ఇంట్లోకి వచ్చిన హసంతి, తల్లి వివరాలు అడుగుతున్నా చెప్పకుండా, తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. తన గదిలో కూర్చున్న కార్తీక్ – హసంతి పంపిన గిఫ్ట్ పార్సిల్ తెరుస్తాడు. అందులో గిప్ట్ రాప్ చేసిన డైరీని తెరిచి చదవబోతుండగా ఫోన్ మోగుతుంది. ఆ కాల్ చేసింది అతని ఫ్రెండ్ సిద్ధార్థ. కార్తీక్ చేసిన ట్యూన్ డైరక్టర్‍కి బాగా నచ్చిందనీ, రెండు రోజులు సెలవు పెట్టి వస్తే రికార్డింగ్ ఏర్పాట్లు చేసుకుంటాడట అని చెప్తాడు సిద్ధార్థ. ఆఫీసులో లీవ్ అడిగి, కన్‌ఫర్మ్ అయ్యాక, చెప్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్. హాల్లో కూర్చుని చిక్కుడు కాయలు వొలుస్తున్న తల్లి దగ్గరికి వచ్చి – గౌతమ్‌తో 15 ఏళ్ల క్రితమే సంబంధం మాట్లాడారని చెబుతున్నారు కదా, మరి ఇన్నేళ్లు నన్ను ఎందుకు చూడటానికి ఒక్కసారి కూడా రాలేదని అడుగుతుంది హసంతి. అందుకు కారణం చెబుతుంది కవిత. తన గదిలోకి వెళ్ళి అద్దంలో చూస్తూ అంతర్మథనం చెందుతుంది హసంతి. కాసేపటికి గౌతమ్ వస్తాడు. వెడ్డింగ్ కార్డ్స్ మోడల్స్ వచ్చాయని చెప్పి, హసంతి లేదా అని అడుగుతాడు. పైన ఉంది వెళ్ళు అంటుంది కవిత. కార్డ్స్ తీసుకుని హసంతి గదిలోకి వెళ్తాడు. ఆమెకి చూపించి, ఆమెకి నచ్చిన కార్డుని ఫైనల్ చేస్తానంటాడు. హసంతి ముభావంగా ఉండడం చూసి, వెళ్ళిపోతాడు గౌతమ్. హసంతి పంపిన డైరీ చదువుతూ, ఆమె భావుకతను మెచ్చుకుంటాడు కార్తీక్. ఇక చదవండి.]
రాత్రి పది గంటలకి గౌతమ్ తండ్రి రఘురాంకి ఫోన్ చేసింది వసంత తల్లి కవిత.
“హలో! ఎవరు?” అన్నాడాయన సెల్‍లో పేరు చూడకుండా.
“నేను అన్నయ్యా!.. కవితని”
“చెప్పమ్మా!.. ఏం కావాలి?”
“గౌతమ్ ఇంట్లో ఉన్నాడా?”
“ఆఁ..”
“అన్నయ్యా!.. హాసంతి ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళింది. ఇంకా రాలేదు. ఉప్పల్ బస్ స్టాప్‌లో ఉందట. బస్సులు స్ట్రైక్ అంటున్నారు. గౌతమ్‌ని తొందరగా వెళ్లి హసంతిని తీసుకు రమ్మని చెప్పండి.”
“తప్పకుండా కవితా! అరగంటలో హసంతి ఇంట్లో ఉంటుంది” అన్నాడు.
***
ఉప్పల్ బస్ స్టాప్‌లో నిలబడ్డ హసంతి అసహనంగా ఉంది. అక్కడ నిలబడ్డ వాళ్లలో కొంతమంది ఆటోలో వెళుతున్నారు.. షేర్ ఆటోలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో వెళ్లాలంటే హసంతికి చిరాకు.
ఓ ఆటోవాడు ఆగి “యాడికి బోవాలె?” అన్నాడు.
“మారేడ్‌పల్లి”
“ఎంతమంది?”
“ఒక్కదాన్నే.”
పై నుండి కిందికి చూసి “ఏభై.. రూపాయలు” అన్నాడు.
పగలే 200 తీసుకుంటారు. అంతకుముందు ఇద్దరు ఆటో వాళ్ళు 500 అడిగారు. వీడేంటి 50 అంటున్నాడు అనుకొని, అనుమానంగా చూసి “వద్దు” అంది.
ఆటోవాడు ముందుకెళ్ళి ఆగాడు.
అంతలో “హసంతీ! హసంతీ!” అని పిలిచాడు గౌతమ్. తల తిప్పి చూసింది. బైక్ మీద కనిపించాడు గౌతమ్. ఈ గ్యాప్‌లో మరో ఆటో వచ్చి ఆగింది.
“ఎక్కడికెళ్లాలమ్మా! బస్సులు రావటం లేదు” అన్నాడు. అతనికి 50 ఏళ్ళు పైనే ఉంటాయి.
“మారేడ్‌పల్లి”
“పగలైతే 200 ఇస్తారు. ఇంకో 100 కలిపి ఇయ్యమ్మా” అన్నాడు.
తన దగ్గరికి గౌతమ్ రాబోయేంతలో ఆటో ఎక్కేసింది. ఆటో కదలబోతుంటే బైక్ స్టాండ్ వేసి తనూ ఆటో ఎక్కాడు గౌతమ్.
“హసంతీ! ఆగు.. నేను నిన్ను పికప్ చేసుకోవడానికే వచ్చాను.” అని డ్రైవర్‌తో “ఆటో ఆపేయ్” అన్నాడు.
“సార్! ఓల్డ్ సిటీలో గొడవలు అంట. సిటీ బస్సులు రావు. దొరికిన బేరాన్ని చెడగొట్టకండి. మీరు దిగండి” అన్నాడు ఆటో ఆపకుండా.
“స్టాప్ ద ఆటో. చెప్పు ప్లీజ్. ఈ సమయంలో నువ్వు నాతో రావడం సేఫ్టీ. అత్తయ్య మా నాన్నకి ఫోన్ చేసి చెప్తే.. వచ్చాను.. ప్లీజ్ ఆపమని చెప్పు.”
మరీ బిగువు చేసే పరిస్థితి కాదనుకొని, బావుండదని
“ఆపండి” అంది. ఆటో ఆగింది.
వేలెట్లో నుండి డబ్బు తీసి ఇవ్వబోతుంటే
“వద్దమ్మా! పది అడుగులు కూడా రాలేదు. ఇంకో గిరాకీ చూసుకుంటాలే!” అంటాడు అనుకుంది.
కానీ అతను హసంతి ఇచ్చిన 100 కాగితం తీసుకుని వెళ్లిపోయాడు.
గౌతమ్ బైక్ మీద కూర్చోవటం అతనితో వెళ్లడం హసంతికి ఇష్టం లేదు. అయినా తప్పలేదు. అయిష్టంగా కూర్చుని ఇద్దరి మధ్య హ్యాండ్ బ్యాగ్ పెట్టింది.
“హసంతీ! కంఫర్టబుల్‌గా కూర్చో.”
“…..”
“ఏదో అవుటాఫ్ మూడ్ అవుట్‌లో ఉన్నట్టున్నావు?”
“అదేం లేదు గౌతమ్.”
“నేను నిన్ను డిస్టర్బ్ చేయటం లేదుగా”
“అయ్యో! అదేం లేదు”
“ఇప్పుడు నీతో ఇలా ట్రావెల్ చేయటం నాకెంతో హ్యాపీగా ఉంది. మరి నీకూ” అన్నాడు.
“…..”
“ఏదో ఒకటి మాట్లాడు హసంతీ!”
“ఏం మాట్లాడాలి?”
“ఎనీ థింగ్”
“నువ్వే చెప్పు.. వింటే బాగుంటుంది.”
“చిన్నప్పుడు తూనీగా.. తూనీగా పాట పాడదానివి గుర్తుందా!”
“ఊఁ..”
“ఏదైనా చిన్నప్పుడు మనసులో బలంగా నాటుకుంటే.. పెద్ద అయినా కూడా అది వదలిపెట్టదు” అన్నాడు.
“…….”
“అప్పుడు నువ్వు తూనీగా.. తూనీగా పాట తప్పుగా పాడేదానివి గుర్తుందా!”
‘అప్పుడేమో గాని ఇప్పుడు నిజంగా తప్పటడుగు వేస్తున్నట్టు అనిపిస్తోంది’ అనుకుంది.
అంతలో ఇల్లు రావడంతో బైక్ దిగిన హసంతి.. “థాంక్స్ గౌతమ్” అని లోపలికి వెళ్తుంటే
“హసంతీ! వన్ మినిట్” అని ఆమె చేయి పట్టుకుని
“నీతో జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని ఉంది హసంతీ! చిన్నతనంలో మా అమ్మ చెయ్యి పట్టుకుని నడిచేవాడిని. ఇప్పుడు అమ్మ లేదు. చెయ్యి పట్టుకుని నడిచే తోడు లేదు. కానీ అమ్మ చెప్పిన తోడు నువ్వు నా జీవితాంతం ఉంటావని నమ్మకంతో ఇన్నేళ్లు నీకోసం ఎదురు చూశా” అన్నాడు ఒకలా.
హసంతిని అతని మాటలు కదిలించినా.. పైకి ఏం మాట్లాడలేదు.
“హసంతీ! ఎన్నో ఏళ్లుగా నిన్ను చూడకపోయినా నేను ఏనాడు నిన్ను మిస్ అవలేదు. నీతోనే జీవించాను. ఇప్పుడు నిన్ను చూశాక నా చివరి శ్వాస వరకు నీతోనే జీవించాలని అనుకుంటున్నాను” అన్నాడు.
“ఓ.కే. గౌతమ్!..గుడ్ నైట్” అని లోపలికి వెళ్ళింది హసంతి.
లోపలికి వస్తున్న హసంతిని చూసి
“గౌతమ్ రాలేదా?” అడిగింది తల్లి కవిత.
“వెళ్లిపోయాడు.”
“అదేమిటే!.. కనీసం లోపలికి రమ్మనకుండా ఎలా పంపావు?” అంది కవిత.
“అవన్నీ నాకు తెలియదు” అని లోపలికి వెళ్లి తలుపేసుకుంది.
‘నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు వద్దని గౌతమ్‌తో ఎందుకు చెప్పలేకపోతున్నాను’ అనుకుంటూ తలుపేసుకుంది.
కార్తీక్ కోసం రాస్తున్న కవితల డైరీలో..
“కాలం నీడలో కొందరిని మర్చిపోతాం;
కొందరి నీడలో కాలాన్నే మర్చిపోతాం;
నువ్వు నీడవా? లేక కాలానివా?
కాలమే నిర్ణయించాలి..”
అని రాసింది హసంతి.
***
కార్తీక్ అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ..
“ఇదంతా కలలా అనిపిస్తోంది. ఎవరీ హసంతి? నేను ఎవరో తెలియకుండా, నన్ను ప్రేమించడం ఏమిటి? అందులోనూ సంవత్సరంన్నర నుండి ప్రేమిస్తోంది. ఒక్కరోజైనా తన ప్రేమ నాతో చెప్పకపోవడం ఏమిటి? అసలు ఆమె ఎలా ఉంటుందో?!..ఆమెని ఎలా కలుసుకోవాలో?! దూరంగా చూస్తూ ప్రేమిస్తూ ఉందంటే.. నేనూ నిజంగా అందగాడినే” అనుకున్నాడు.
హసంతి ఇచ్చిందని శ్రీరామ్ ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ మళ్ళీ ఓపెన్ చేశాడు.. డైరీలో మరో పేజీ తిప్పాడు.
“నువ్వు లేని ఈక్షణం ఒక యుగంలా ఉంది. యుగమంతా ఎదురు చూస్తా.. నీతో గడపబోయే ఆ క్షణం కోసం.”
డైరీ మూసి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. హసంతి లోని.. భావుకత గుండెల్లో తెలియని స్పందన కలిగిస్తోంది.
హృదయంలో తెలియని ఆనందం తాండవం చేస్తోంది.
ఇన్నాళ్ళూ తనలో నిద్రిస్తున్న తొలి ప్రేమకు బద్ధకం వదిలించి తన హృదయపు చప్పుడు వినమని తొందర పెడుతున్నట్టు అనిపిస్తోంది. తొలిప్రేమకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
మనసంతా భారంగా మారింది.
డైరీ మూసి పక్కన పెట్టాడు.
డైరీ కింద ఉన్న.. ఒక చిన్న గాలిపటం కనిపించింది. అది చాలా క్యూట్‌గా ఉంది. దాని మీద ‘ఫైండ్ ద మూమెంట్’ అని రాసుంది.
కార్తీక్‌కి మొదట ఏమీ అర్థం కాలేదు. క్షణం సేపు మౌనంగా దాన్నే చూస్తుంటే ఆ మూమెంట్ ఏదో గుర్తొచ్చింది.
కార్తీక్ అద్దెకుంటున్న ఇంటి ఓనర్ మనవడు ఐదేళ్ల అయాన్. తెల్లగా, బొద్దుగా ఉంటాడు. వీలు దొరికినప్పుడల్లా కార్తీక్ వాడిని ఆడిస్తుంటాడు.
ఓ రోజు టెర్రస్ మీద వాడితో గాలిపటం ఎగరేస్తుంటే, అది తెగి చెట్టు మీద పడి చిరిగిపోయింది.
వాడు ఏడుస్తూ తన కైట్ తనకి కావాలని గొడవ చేస్తుంటే, వాణ్ణి తీసుకొని వీధి చివర షాపుకెళ్లి కొత్త గాలిపటం, చాక్లెట్లు కొని తీసుకొచ్చాడు.
అది ఆమె ఎలా చూసిందో? కార్తీక్‌కి అర్థం కావడం లేదు. ఒకవేళ ఆమెది ఈ ఏరియానే అయ్యుంటుందేమో! లేకపోతే ఆమెకి ఈ ఇన్సిడెంట్ తెలిసే ఛాన్సే లేదు.
కాసేపటికి గుర్తొచ్చి ఐ గాట్ ఇట్ అనుకుని.. ఆ చిన్న గాలిపటాన్ని రెండు చేతులతో సున్నితంగా తడిమి గుండెలకి హత్తుకున్నాడు.
దాని తర్వాత సిక్కులు చేతికి తొడుక్కునే సిల్వర్ కడియం కనిపించింది. దానిని తీసుకుని చేతికి వేసుకోబోయి, ఒక్క క్షణం ఆగి, ఎదురుగా మొహం బ్లర్‌గా ఉన్న ఓ అందమైన అమ్మాయిని హసంతిలా ఊహించుకున్నాడు.. తన ఎదురుగా నిలబడి తన చేతికి ఆమే తొడుగుతున్నట్టు ఊహించుకుంటూ చేతికి తొడుక్కున్నాడు.
డైరీ తీసుకొని మరో పేజీ తిప్పాడు. అందులో
“గాలుల సున్నితత్వాన్ని,
“పువ్వుల సువాసనల్ని, ..ప్రశాంతంగా మొదలయ్యే ఉదయాన్ని,
ఉల్లాసంగా ముగిసిపోయే సాయంత్రాన్ని..
జీవితకాలం ఆస్వాదించినా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది మన ప్రేమలా!”
మళ్లీ డైరీ పక్కన పెట్టాడు.
కవితలు ఒక్కసారి చదివితే అర్థమయ్యేవిగా లేవు.. ఆమె ప్రేమలా..
తర్వాత ప్యాక్ ఉన్న మరో వస్తువు తీశాడు.
తెల్లని కర్చీఫ్ మీద రెండు హార్ట్ సింబల్స్. పక్కపక్కనే ఒకదానిపై ఒకటి ఉన్న రెడ్, ఎల్లో పెయింట్ చేసి ఉన్నాయి. కర్చీఫ్ కార్నర్‌లో వయొలిన్ బొమ్మ అవుట్ లైన్ గీసుంది.
అంతే!.. కార్తీక్ చెవుల్లో..
“నిదరే.. కల అయినది..
కలయే.. నిజమైనది..
బతుకే.. జత అయినది
జతయే.. అతనన్నది..
మనసేమో.. ఆగదూ..
క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా..”
పాట ధ్వనించసాగింది.
మళ్లీ డైరీ తీశాడు ఇంకో పేజీలో
“రాత్రి నిద్ర కోసం తపించాను. కలలోనైనా నువ్వు నాతో మాట్లాడతావని.”
డైరీ పక్కన పడేసిన కార్తీక్‌కి నిజంగానే గుండెలు పిండేసినట్టు అనిపించింది.
తర్వాత ఓ చిన్న బాక్స్‌లో పెన్‌లా ఉండే చిన్న పొడవాటి డబ్బా కనిపించింది. దాని మూత తీశాడు. అందులో సిగరెట్ దాని మీద ‘ఇంటు’ మార్క్ ఉంది. ‘డోంట్ స్మోక్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్’ అని రాసుంది.
కార్తీక్ నవ్వుకున్నాడు.
ఆ తర్వాత ఓ ఫోటో కనిపించింది. అది డి.ఎల్.ఎఫ్ ఎదురుగా ఉన్న రెస్టారెంట్ ముందు చెట్టు కింద బైక్ మీద కూర్చుని టీ తాగుతూ స్మోక్ చేస్తున్న పిక్ అది. హసంతి తన ఎదురుగా కూర్చుని చేతిలో ఉన్న సిగరెట్ లాక్కుని అవతల పారేసి ‘డోంట్ స్మోక్ ఎవర్’ కోపంగా అన్నట్టు అనిపించింది.
తర్వాత మడత పెట్టిన ఓ పేపర్ కనిపించింది. దానిని తీసి చూశాడు. అందమైన అక్షరాల్లో
“నీ జ్ఞాపకాల్లో నా రాత్రులు నిద్రపోకుండా మేల్కొంటున్నాయి” అని రాసింది.
అంతే! అక్షరాలని కార్తీక్ పెదవులు సున్నితంగా ముద్దాడాయి.
***
హసంతి గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి పార్టీకి పెట్టుకెళ్ళిన జువెలరీ తీస్తుంటే అద్దంలో ఆమె ప్రతిబింబం
“అసలేం జరుగుతోందో ఆలోచిస్తున్నావా? హసంతీ! గౌతమ్ మనసులో నువ్వు ఉన్నంతవరకూ, అతను నీ నీడలా నీ వెంటే నడుస్తాడు.
అతని మనసులో నీ రూపాన్ని బాల్యం నుండే ప్రతిష్ఠించుకున్నాడు. నిన్ను సున్నితంగా, అమ్మ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆరాధిస్తున్నాడు. ఆ ప్రేమలో నువ్వు కోరుకునే లక్షణాలు ఎన్ని ఉన్నాయో!? నీకే తెలియాలి. ఒక్కసారి తాళి కట్టించుకుంటే జీవితాంతం అతనితో కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సర్దుకుపోవాలి. ఎంగేజ్మెంట్ అయినంత మాత్రాన తాళి కట్టించుకోవాలని.. రూలు ఎక్కడా లేదు. ముందుగా హెచ్చరిస్తున్నా! ఆ తర్వాత నీ ఇష్టం. కాంప్రమైజ్ అవటమా? ధైర్యంగా నువ్వు ఇష్టపడుతున్న కార్తీక్‌కి పచ్చ జెండా ఊపటమా? ఆలోచించుకో..” అని అంది.
“ఇంతకీ నువ్వు చెప్పొచ్చేదేంటో.. నాకు అర్థం కావడం లేదు” అంది హసంతి అసహనంగా.
“ఎవరితో ఎవరు జత కలిస్తే బావుంటుందో చెబుతున్నాను.”
“నాకు అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. అయ్యో” అని హసంతి అరిచిన.. అరుపుకు ప్రతిబింబం భయపడి అదృశ్యమైపోయింది.
***
హసంతి పంపిన గిఫ్ట్ ప్యాక్‌లో ఉన్న వస్తువుల్ని యధాతధంగా పెట్టి మళ్లీ ప్యాక్ చేసి బీరువాలో దాచుకున్నాడు కార్తీక్.
ఫోన్ తీసి..
“హలో రమణన్ సార్!.. వణక్కం” అన్నాడు.
“ఆఁ.. సొల్లుంగ కార్తీక్” (ఆఁ.. చెప్పండి కార్తీక్) అన్నాడు.. అవతల వైపు నుండి టీం లీడర్.
“సార్!.. ఎనక్కు రెండు నాళ్ లీవ్ వేణుమ్. రొంబ అర్జంట్. ఉంగలక్కు ఆల్రెడీ సొల్లిటే. షార్ట్ ఫిలిం రీ రికార్డింగ్ ఇరుక్కు.”
(సార్! నాకు రెండు రోజులు లీవ్ కావాలి. చాలా అర్జెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను. షార్ట్ ఫిలిం రీరికార్డింగ్ ఉంది) అన్నాడు.
“ఓ.కే.. ఓ.కే.. డూ ఇట్ వెల్. వన్డే యు విల్ బి కం మూవీ మ్యూజిక్ డైరెక్టర్. ఆల్ ద బెస్ట్”
“థాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్” అని ఫోన్ పెట్టేసాడు.
***
అదే సమయంలో హసంతి ఫోన్ కూడా మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆమె ఫ్రెండ్ ధృతి మాట్లాడుతుంటే.. అయిష్టంగా మొహం పెట్టి,.. ఫోన్ కట్ చేసింది.
(సశేషం)
ఎం. వెంకటేశ్వర రావు చక్కని కథా రచయిత. మంచి నవలా రచయిత. “అదివో… అల్లదివో!” వీరి కథా సంపుటి. ఇటీవలి కాలంలో “విజయ విలాసం” పేరిట వ్యక్తిత్వ వికాసం సంబంధిత వ్యాసాలు కూడా రాస్తున్నారు.