Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఫన్నీ పక్షి

[బాలబాలికల కోసం ‘ఫన్నీ పక్షి’ అనే చిన్న కథని అందిస్తున్నారు కూచిమంచి నాగేంద్ర.]

గోదావరి తీరంలో వున్న భద్రగిరి అడివిలో రాణి అనే రామచిలుక వుంది. ఆ అడవిలో అది చాలా అందమైన పక్షి. ఒక రోజు ఆశ్చర్యంతో ఒక కొమ్మ మీద వాలిన రంగుల పక్షిని చూసి, “హేయ్, ఎవరు నువ్వు? ఇంత అందంగా ఉన్నావు!” అని అడిగింది.

“నేనా? నేను ఒక విదేశీ పక్షిని, నా పేరు ఫన్నీ” అంది ఆ పక్షి.

“ఫన్నీనా? అదేం పేరు?” అని చిలుక వెనకాలే ఉన్న ఉడుత అడిగింది. అప్పటికే అక్కడకు చేరిన కాకి, “విదేశీ పేర్లు అలాగే ఉంటాయిలే” అంది.

అక్కడకు వచ్చిన జంతువులు, పక్షులన్నీ తననే చూడటంతో ఫన్నీ కొంచెం కంగారు పడింది.

“ఫన్నీ, నువ్వు అంత దూరం నుండి ఇక్కడికి ఎందుకొచ్చావు?” మళ్లీ అడిగింది రాణి.

“నేను ఒక్కదాన్నే కాదు, మా దేశం నుంచి చాలా పక్షులు వచ్చాయి. ఇప్పుడు మాకు అక్కడ వేసవి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే మేము ఈ సమయంలో ఆహ్లాదకరంగా ఉండే మీ దేశంలోని సరస్సుల దగ్గర చిన్న చిన్న చెట్ల మీద నివాసం ఏర్పరచుకుంటాం. ఇక్కడే గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగి, వాటికి రెక్కలొచ్చాక, ఇక్కడ వేసవి మొదలయ్యే సమయానికి తిరిగి మా దేశానికి వెళ్లిపోతాం. ఇక్కడి సరస్సులలో మాకు చేపలు సమృద్ధిగా దొరుకుతాయి. పైగా, మీ దేశంలో పక్షి ప్రేమికులు ఎక్కువ. అందుకే మాకు ఏ భయం ఉండదు. అందుకే మేము శీతాకాలంలో ఉత్తరం నుండి వేల యోజనాలు ప్రయాణించి ఈ దక్షిణ ప్రాంతానికి వస్తాం” అని ఫన్నీ వివరించింది.

“భలే భలే! మరి మా దగ్గర నుండి అక్కడికి ఎవరైనా వస్తారా?” అని ఒక చిన్న కుందేలు అడిగింది.

“ఎందుకు రారు? మాలాగే అక్కడి శీతల ప్రదేశాలకు ఈ దేశం నుంచి కూడా పక్షులు వస్తాయి” అంది ఫన్నీ.

అప్పుడే అక్కడికి వచ్చిన మృగరాజు ఫన్నీ మాటలు వింటూ, “చాలా పక్షులు వచ్చాయని అంటున్నావు, నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు” అన్నాడు.

“లేదండీ. నేను మొదటిసారి రావడం, అందువల్ల దారి తప్పాను” అంది ఫన్నీ.

“మీరు అలా ప్రయాణిస్తూ మా దేశానికే వస్తున్నట్లు ఎలా తెలుసుకుంటారు?” రాణి అడిగింది.

“మేము మా దేశం నుంచి బయలుదేరి మీ దేశంలోకి అడుగుపెట్టేటప్పుడు, అన్ని మతాల ప్రార్థనలు ఒకే చోటు నుండి వినిపిస్తుంటాయి. పచ్చని తివాచీలా మొక్కలు, చెట్లతో మీ భూమి ఆహ్వానం పలుకుతుంది. రెపరెపలాడే మీ దేశపు మూడు రంగుల జెండా ‘రండి రండి’ అంటుంది. ఆ ఆనవాళ్లతో మేము వేద భూమిలో అడుగుపెట్టామని గ్రహిస్తాం అని మా పక్షులు అంటాయి. అదే మాకు ఆనవాలు” అంది ఫన్నీ.

“మృగరాజా, ఇలాంటి పక్షుల్ని నేను కొల్లేరు దగ్గర చూశాను” అని ఒక గ్రద్ద అంది.

“అయితే ఈ విదేశీ అతిథికి ఆహారం పెట్టి, తర్వాత ఆ పక్షుల దగ్గరికి చేర్చు. అతిథులను గౌరవించడం మన సంప్రదాయం” అన్నాడు మృగరాజు.

“అదే మీ దేశానికున్న ప్రత్యేకత రాజా. అందుకే మేము క్షేమంగా తిరిగి వెళ్తున్నాం. నాకైతే ఇక్కడే ఉండిపోవాలని ఉంది” అంది ఫన్నీ.

“మరి అలాంటప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చు కదా?” అంది రాణి.

“లేదు లేదు, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండలేను. వచ్చే ఏడాది జంటగా వస్తాను. ఇక్కడే ఉండిపోతాను” అంది ఫన్నీ.

“అయితే వచ్చే ఏడాది మీ జంటకు స్వాగతం పలకాలన్నమాట” అన్నాడు మృగరాజు.

“ఫన్నీ పక్షి జంటకు ఇదే మా ఆహ్వానం” అన్నాయి పక్షులు.

“ఇప్పుడే కాదు!” అంటూ అందరూ వీడ్కోలు పలకగా, గ్రద్దతో కొల్లేరు వైపు సాగిపోయింది ఫన్నీ.

Exit mobile version