Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గాయం

[వజ్జీరు ప్రదీప్ గారు రచించిన ‘గాయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

కాలం ఎంత గొప్పదో తన మానాన తాను సాగిపోతూనే ఉంది. అది ఎవరిని పట్టించుకోదు, చూస్తుండగానే ఎన్ని ఏళ్లు గడిచి పోయాయో.

శిశిర ఋతువు కావడంతో చెట్లపై నుండి ఆకులు రాలుతున్నాయి. చెట్టు కింద వెహికిల్ పార్కు చేశాక, కానిస్టేబుల్స్ రంగనాథం, సురేష్‌ను ఓ పని మీద పంపించాను, పక్కనే వున్న కేఫ్ అబ్బాయిని పిలిచి కాఫీ చెప్పగానే తీసుకవచ్చాడు.

నా జీవితం నుండి వసంతం వెళ్లి ఎన్ని ఏళ్ళు అయ్యింది. నాకు ఇంటి పేరు కన్నీళ్ళు, నా పేరు కష్టంగా మారిపోయి నా పేరేంటో నాకే గుర్తులేనంతగా నా మెదడు మందగించన రోజులు నా కండ్ల ముందు మెదిలాయి.

మనసు మెల్లగా గతంలోకి తొంగి చూసింది.

కథలోకి వెళితే..

***

హాల్లో కూర్చుండి హనికి మ్యాథ్స్ బుక్ లోని డౌట్సు క్లియర్ చేస్తుంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది. అమ్మ ఎవరో ఫోన్ చేశారని పిలిచింది. నేను ఆఫీస్ నుండి ఏమో అనుకున్నాను.

రిసీవర్ ఎత్తి “హలో” అన్నాను, బయట నుండి ఎవరిదో ఆడగొంతు వినిపించింది.

“ఎవరు?” అన్నాను

“నేను ప్రేమను” అంది.

“ప్రేమా, ఏంటి విషయం?” అన్నాను.

“నేను మీతో మాట్లాడాలి” అంది.

“చెప్పు” అన్నాను.

“నేను రేపు ఉదయం హైదరాబాద్ నుండి వస్తున్నాను, మీరు టౌన్‌కి వస్తారా? మీతో పర్సనల్‌గా మాట్లాడాలి, ప్లీజ్! వస్తారు కదూ” బ్రతిమిలాడుతూ అంది.

“సరే వస్తాను” నేను కొద్దిసేపు ఆలోచించి అన్నాను.

ఆ రోజు ఆఫీసుకు వెళ్లాను అన్నమాటే గానీ మనసంతా ఏదో ఆందోళనగా వుంది, తను అక్కడికి ఎందుకు రమ్మంది ఏం చెప్తుంది నాకు అర్థం కాలేదు.

ఉదయం నేను రెడీ అయి టౌన్‌కు వెళ్లి నిల్చున్నాను.

సూపర్ డీలక్స్ బస్ వేగంగా వచ్చి ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం ఫైంట్ పై ఆగింది. ఒక్కొక్కరు దిగుతున్నారు. ‘తను వచ్చిందా? లేదా?’ అని నేను అటువైపే చూస్తున్నాను.

గాలికి ఎగిరే రింగు రింగుల కురులను సరిచేసుకుంటూ ఎల్లోరంగు చుడీదార్లో దిగింది. మీన నేత్రాల లాంటి కన్నులతో నన్ను తన్మయత్వంతో చూస్తూ “హాయ్” అంది తను.

నేను “హాయ్” చిన్నగా నవ్వుతూ అన్నాను.

“చాలా సేపు వెయిట్ చేయించానా?” విప్పార్చిన కళ్లను గుండ్రంగా తిప్పుతూ అంది.

“ఏంటండీ ఈ రోజు బస్టాండ్ అంతా చాలా రద్దీగా ఉంది?” ఎడంచేత్తో చున్నీని తిప్పుతూ అంది ప్రేమ.

“పండగకు హాస్టల్ పిల్లలకు సెలవు ఇచ్చారు. అందుకే రద్దీ ఎక్కువగా వుంది” కాస్త ముందుకు నడుస్తూ అన్నాను.

ఇద్దరం బయటకు వచ్చి నిల్చోగానే ఆటో అతను వచ్చీ “ఎక్కడికి భయ్యా” అన్నాడు.

తను అడ్రస్ చెప్పి ఆటో ఎక్కి కూర్చుంది, అసలేం జరుగుతుందో అర్థం కాక నేను మౌనంగా ఎక్కాను.

కొంత దూరం వెళ్ళాక “ఇక్కడే ఆపండి” అంది.

అది నాలుగు కాలేజీల కూడలి. చుట్టూ కోచింగ్ సెంటర్లు విద్యార్థులతో రద్దీగా వుంటుంది, ఎవరినైనా కలవడానికి వచ్చిందేమో అనుకున్నాను. తను ముందు నడుస్తుంటే తన చున్నీ నా మోముపై పడుతుంది.

కొంత దూరం వెల్లగానే మెల్లగా ఆగింది. అది శాంతారామ్ బేకరీ. ఇద్దరం లోపలకు వెళ్ళి కూర్చున్నాము.

బేకరీ అతన్ని పిలిచి తను ఏదో ఆర్డర్ చెప్పింది.

“ప్రేమా ఇక్కడకి ఎవరైన ఫ్రెండ్స్ వస్తున్నారా?” మనసులోని సంశయం తీర్చుకోవలన్న ఉద్ధేశంతో అడిగాను.

“ఊ..” అంది నా కళ్ళలోకి చూస్తూ.

“ఎవరు?”

“ఇంకెవరు మీరే” అంది నేను బిత్తరపోయి చూస్తున్నాను.

బేకరీ అతను రెండు ఐస్‌క్రీంలు తీసుకవచ్చి టేబుల్‌పై పెట్టాడు.

“సారీ ప్రేమా, నేను ఐస్‌క్రీం తినను. నీకు తెలుసు కదా దాని టేస్ట్ నచ్చదు” అన్నాను.

“ఇష్టమైన వాళ్ళ కోసం కొన్ని అలవాట్లు చేసుకోవాలి. అయినా తింటేనే గదా దాని రుచి తెలిసేది” ప్రేమగా అంటూ నా చేతికందించింది.

కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడాక బయటకు వచ్చాం.

“బస్టాండ్‌కు వెళ్దామా?”

“శ్రీకాంత్, కాసేపు గార్డెన్లో కూర్చుని వెళ్ధాం, ఇంటికి వెళ్థే బోర్ కొడుతుంది.” గోముగా అంది.

తన హ్యాండ్ బ్యాగ్ నాకందించింది. ఎదురుగా ఉన్న పబ్లిక్ గార్డెన్ లోకి వెళ్లాక అటు ఇటు చూసి “ఆ శివాలయం వైపు కూర్చుందాం” అన్నాను.

అక్కడక్కడ కొందరు ప్రేమికులు వృద్దులు, టైం పాస్ కోసం వచ్చిన వారు కూర్చున్నారు. ఒక వైపు గార్డెన్లో వున్న ఊయల ఇతర ఆట వస్తువులపై చిన్న పిల్లలను ఆడిస్తున్నారు కొందరు పేరెంట్స్.

ఇద్దరి మధ్య కాసేపు మౌనం రాజ్యమేలింది.

చిలక జ్యోతిష్కుడు మా ముందుకు వచ్చి “ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండ్రి సారు” నవ్వుతూ అన్నాడు. తను చెప్పే ముచ్చట్లు వినగానే ముచ్చటేసింది.

“సరే ఏం చెబుతాడో చూద్దాం” అంది.

“చెప్పండి” అని అతను పేర్చిన కార్డులపై డబ్బులు పెట్టాను.

పంజరంలోని చిలక బయటకు వచ్చి ఒక కార్డు తీసింది.

“సీతారాముల ఫోటో వచ్చింది దొరా” నవ్వుతూ అన్నాడు.

అది చూడగానే ప్రేమ గల గల నవ్వింది.

తన చెక్కిళ్లపై గుంటలు పడి తన మొఖం మరింత అందంగా కనిపించింది.

“మీ ఇద్దరి జంట సీతారాములలాగా ఉంటుంది దొరా, ఇది నేను గాదు నా చిలక చెప్పిన మాట” చిలక జ్యోతిష్కుడు తనదైన శైలిలో చెప్పిండు.

“థ్యాంక్ గాడ్” ప్రేమ ఆకాశం వైపు చూస్తూ అంది.

“చూశావా నా మనసులో మాటను చిలక జ్యోతిష్కుడు చెప్పాడు. ఆ దేవుడే మనల్ని ఒకటి చేయాలని సంకల్పించాడేమో!” నా చేతులను తన చేతులలోకి తీసుకుంటూ నా చేతి రేఖలపై చూపుడు వేలితో గాట్లు గీస్తూ అంది.

తను అలా మాట్లాడేసరికి చేయి నావైపు తీసుకుని నీర్ఘాంత పోయాను.

“శ్రీకాంత్, నేను చెప్పాలనుకున్న మాట ఇదే, నువ్వు అవునన్నా కాదన్నా ఐ లవ్ యు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను” నా కండ్లలోకి చూస్తూ అంది ప్రేమ.

ఒక ఆడపిల్ల నన్ను ప్రేమిస్తున్నానని ధైర్యంగా బాహాటంగా చెప్పింది. నేను ఎస్ అనాలో నో అనాలో అర్థం కాక నా పరిస్థితిని చూసి నాకే సిగ్గు వేసింది.

“ప్రేమా, మీ నాన్న విషయం ఆలోచించావా? ఆయన నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు, ఒక్కగానొక్క కూతురు ఇలా చేసిందంటే తట్టుకోలేడు” రేపటి పరిణామాలను అంచనా వేస్తూ అన్నాను.

“తనతో నాకేం పని లేదు, నాకు నువ్వు కావాలి. మా అమ్మ ఆ రోజు మీ ఇద్దరికీ పెళ్లి అయితే మీ జంట బాగుంటుంది అని చెప్పిందీ గుర్తు లేదా?” అంది.

“నిజమే ప్రేమా! మనం రెండు వైపుల నుండి ఆలోచించాలి. నాకు కొంచెం టైం కావాలి” అన్నాను.

“పల్లీలు తీసుకుంటారా?” అంది పల్లీలు అమ్మే ఆవిడ.

“ఇవ్వమ్మా” అంటూ డబ్బులు ఆమెకు అందిస్తూ అన్నాను.

“ప్రేమ! నాకు లైఫ్‌లో గోల్ వుంది, నేను ఎస్సై జాబ్ తెచ్చుకోవాలి, ఆ తరువాతే మిగతావి” పల్లీల పొట్లం అందిస్తూ అన్నాను.

నా మనసు కూడా ఏదో కొత్తదనాన్ని కోరుకుంటుంది ఏమో! నేను మౌనంగానే చూశాను, అసంకల్పితంగానే తను మాట్లాడిన మాటలతో తను నా మనసులో తిష్ట వేసుకుని కూర్చుంది.

ఇద్దరం ఆటోలో దిగేసరికి కాశీరాం పాన్ షాప్ కాడ నిల్చున్న దివాకర్ మామ చూడనే చూశాడు.

“శ్రీకాంత్, నేను వెళ్తాను నువ్వు కాసేపటి తర్వాత రా” అంది.

“ఏంటి మామా, ఏం విశేషం, ఈ రోజు మొఖంలో ఏదో కొత్త కళ కనిపిస్తుంది” నా జబ్బను చరుస్తూ అన్నాడు దివాకర్.

“ఏ అదేం లేదు మామా” సిగ్గుపడుతూ అన్నాను.

“నాకు అర్థమైందిలే” నవ్వుతూ అన్నాడు దివాకర్.

కాలేజీ ఫ్రెండ్స్ అందరం సాయంకాలం రైల్వే స్టేషన్ దగ్గరున్న కాశీరాం కొట్టుకాడికి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో ఊర్లో వాళ్ళ తాత ఒక్కడే కాశికి పొయి వచ్చాడంటా అందుకే వాడికి కాశీరాం అని పేరు పెట్టారు అంటాడు.

రైల్వే స్టేషన్‌లో అనౌన్స్ వినిపిస్తుంది. స్టేషన్‌లో నుండి వచ్చే జనం ఆటోల వైపు వెళ్తున్నారు.

“మామా ఎటు వెళ్ళావు ఈ రోజు?”

“స్కూల్ పిల్లలను దింపి సురేష్ వాళ్ళ భార్యను డెలివరికి టౌన్ హాస్పటల్‌కు తీసుకెళ్ళాలంటా. రెడీ అయ్యాక ఫోన్ చేస్తానంటే ఇదిగో మన కాశీరాం గాడిని పలకరిద్దామని ఇక్కడకు నిల్చున్నాను” దివాకర్ తన దినచర్యను చెప్పుకచ్చాడు.

“నేను ఈ రోజు సిటీకి వెళ్ళాను, ప్రేమ ఏదో విషయం మాట్లాడుదాం అంది” మెల్లగా అన్నాను.

“ఇంకేముంటది అల్లుడు లవ్ మ్యాటరేగా” నవ్వుతూ అన్నాడు దివాకర్.

“అవును మామ ఆలోచించుకుని చెప్పమంది” జరిగిన విషయం చెప్పాను.

“మీ ఇద్దరు చిన్నప్పటి నుండి స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్, అందరం అప్పుడే అనుకునే వాళ్ళం, వీళ్ళు క్లాస్ లోనే కాదు జీవితంలో కూడా ఒకరిని విడిచి ఒకరు వుండలేరని. ఆ మాటే నిజమౌతుందిలే. ఎట్లాగు టైం అడిగావు కదా! అప్పటివరకు ఆలోచించుకో” అన్నాడు దివాకర్.

మా ఇద్దరిది ఎదురెదురు ఇల్లే కావడంతో రోజు తను నన్ను చూస్తూ, నేను తనను చూస్తూ కాలం గడిపే వాళ్ళము.

ఓ రోజు అనుకోకుండా ఇంట్లోకి వచ్చింది, మధ్యాహ్నం సమయం కావడంతో అందరూ వ్యవసాయ పనులకు వెళ్ళారు. నేను డ్రాయింగ్ షీట్ పై ఏదో మ్యాగజైన్‌లో కథకు వేసిన చిత్రం నన్ను ఆకర్షించడంతో పెన్సిల్ తో గీస్తున్నాను. తను వెనక నుండి వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది.

“ప్రేమా.. ఏయ్!.. ప్రేమా.. వదులు” తనను విదిలించుకుంటూ లోలోన మురిసిపోతూ అన్నాను.

ఇంటి ముందు హాల్లో గోడపై నేను వేసిన శ్రీరాముని చిత్రాన్ని చూసి “పక్కన సీతమ్మను వేయలేదు ఏంటీ?” ముఖం చిన్న బుచ్చుకుని అంది ప్రేమ.

“సీతమ్మ లేదని చిన్నబోకు. ఇప్పుడు గీయమంటే గీస్తాను.” తన చేతిని నా చేతిలోకి తీసుకుని మా రెండు చేతులతో బ్రష్ తీసుకోని గోడపై సీతమ్మ చిత్రం గీయడం మొదలుపెట్టాను.

తను నా బుగ్గ పైన ముద్దు పెట్టింది, రతీ మన్మథులు ఆ క్షణం మమ్ము పూర్తిగా ఆవహించారేమో! కోరికలు కళ్ళెం తెగిన గుర్రంలా పరిగెత్తాయి.

కనకాంబరం చెట్లపూలపై తుమ్మెద వాలింది నా మనోఫలకం పై కొత్త అధ్యాయం ఆ రోజే ప్రారంభమైంది.

ఇది ప్రేమ అని అప్పటివరకు నాకు తెలియలేదు రెండు మనసులు కలిస్తే మనసు ఇంత తియ్యగా ఉంటుందా! మాలో కొత్త అక్షరాలతో కూడిన భావాలు ప్రేమ కావ్యమై అదరామృత బీజాక్షరాలతో శ్రీకారం చుట్టాయి.

శ్రీరాముడి పక్కన సీతమ్మ చిత్రం అందంగా గీశాను. ప్రేమ తన్మయత్వంతో కను రెప్పలు వాల్చకుండా ఆ చిత్రాన్ని అపురూపమైన దృశ్యంగా చూస్తుంది.

నేను పెయింటింగ్ బాక్స్, బ్రష్‌ను తనబ్బిలో సర్దిపెట్టాను, నన్ను చూస్తూ ఓ ప్రేమ పాట పాడింది ప్రేమ. నా మనసు పరవశంతో పులకించింది. తన గాత్రం అంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం.

తను స్కూల్లో కావేరి టీచర్ వద్ద, హైదరాబాద్‌లో మరో గురువు వద్ద మ్యూజిక్ నేర్చుకున్నది. ఏ పాటైనా ఒక్కసారి విన్నది అంటే అదే రాగంలో ఆలపించేది. స్కూల్ కాంపిటీషన్, వినాయక మండపాలవద్ద, రవీంద్ర భారతిలోను చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చింది.

టేబుల్ పై వున్న నోట్స్‌లో పేపర్ చింపి ఏవో నాలుగు లైన్లు రాసి నా వైపు విసిరేసింది అది అర్థం కాని భాషలో వుంది.

“ప్రేమ ఇదేంటి?” సైగ చేస్తూ చిన్నగా అన్నాను.

“చెప్పుకో చూద్దాం” అనడంతో నేను పెదవి విరిచాను.

“దాన్నీ ‘క’ భాష అంటారు మా కాలేజీలో మేము ఇలాగే రాసుకుంటాం” అని నవ్వుతూ లోనికి వెళ్ళింది. అందులో విషయం ఏంటో తెలియక నేను నానా యాతనపడ్డాను. చివరకు ఊర్లో ఓ పిల్లవాడు చదివి చెబితే గాని నా మట్టి బుర్రకు అర్థం కాలేదు.

తాను హైదరాబాద్ వెళ్తున్నాను, కొంత దూరం తనతో రమ్మని ఆ “క” భాషలోని భావమంటా. సరే తను మళ్ళీ ఎప్పుడస్తుందో వెళ్ళనైతే వెళ్దాం అనుకున్నాను.

“శ్రీకాంత్ ఇంకో సంవత్సరం అయితే నా స్టడీ కంప్లీట్ అవుతుంది, ఇద్దరం హైదరాబాదు లోనే జాబ్ చేస్తూ ఇక్కడే వుందాం” అంది.

‘మా ఇద్దరి ఆలోచనలు భావాలు కలిసినవి. తనతో దేశ విదేశాలలో ప్రదర్శనలిప్పించాలి, సినిమాలలో తనకు అవకాశం వచ్చేలా ప్రయత్నించాల’ని మనసులో సంకల్పించుకున్నాను.

“శ్రీకాంత్ అది నువ్వంటే ఇష్టపడుతుంది, మీ పెండ్లికి నేను మామను ఎలాగోలా ఒప్పిస్తాను, రేపు మాకు పొలం వద్ద పనుంది, ప్రేమను అక్కడి వరకు దిగబెట్టి రా” అంది వాళ్ళ అమ్మ.

“సరే అత్తయ్యా” అని చెప్పి ఇంట్లోకి వెళ్ళాను.

టివిలో ‘గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం’ అంటూ బొంబాయి ప్రియుడు పాట వస్తుంది. ఆ సినిమా పాటలు అంటే ప్రేమకు కూడా చాలా చాలా ఇష్టం అని చాలాసార్లు పాడి వినిపించింది.

ఆరు బయట చైర్ వేసుకొని ఆకాశంలో జాబిల్లిని చూస్తున్నాను. ఈ రోజు ఎందుకో చుక్కలు వెన్నెల చాలా చాలా కొత్తగా కనిపిస్తున్నాయి, ఆ వెన్నెల వెలుతురులో ప్రహారి గోడపై పారిన బచ్చలి తీగపై పండ్లు మెరుస్తూ ఆకాశంలోని నక్షత్రాలతో పోటీ పడుతున్నాయి.

ప్రేమంటే ఇంత అందంగా ఉంటుందా మధ్యాహ్నం జరిగిన సంఘటన నా మది తలపుల్లోకి పదే పదే వస్తుంది.

~

ఇద్దరం సికింద్రాబాద్ స్టేషన్లో దిగి బయటకు వచ్చి టీ తాగి అమీర్ పేట బస్ ఎక్కాము.

సత్య అక్క వాళ్ళ భర్త ఏదో సినిమా ఆఫీస్‌లో చేస్తుంటాడని విన్నాను, తనను కలసి ప్రేమ విషయం చెప్పి మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ను కలసి మాట్లాడాలి అనుకున్నాను.

ఒక రోజు సారథి స్టూడియో వద్ద మా క్లాస్‌మేట్ బాలు నన్ను చూసి గుర్తు పట్టి “ఎట్లచ్చావు శ్రీకాంత్?” ఆప్యాయంగా పలకరిస్తూ అన్నాడు. స్టూడియో ముందున్న చెట్టు కింద చిన్న టీ స్టాల్లో టీ తాగుతూ కూర్చున్నాక సత్యక్క భర్త విషయం చెప్పాను.

“శ్రీకాంత్ సినిమాలోకి రావడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? సత్యక్క భర్త శంకర్ అయినా నేనైన, ఇంకెవరైన పై స్థాయిలో ఓ డైరెక్టరో, ప్రొడ్యూసరో, మ్యూజిక్ డైరెక్టర్ లాంటి వాళ్ళు మన దగ్గరి బంధువులు వుంటే తప్ప మనకు అవకాశాలు రావు” అన్నాడు బాలు.

“నువ్వు చాలా సంవత్సరాలుగా వుంటున్నావుగా ఎవరైన తెలిస్తే చెప్పచ్చు గదరా” బతిమిలాడుతూ అన్నాను.

“స్కూల్లో నుండే నేను నాటకాలు వేస్తుంటే మీరంతా సినిమాలోకి వెళ్ళరా బాలూ, భవిష్యత్తు ఉంటదంటేనే ఇక్కడకు వచ్చాను, ఆ తరువాత తెలిసింది ఈ రంగులు కలల వెనుకున్న నల్ల రంగు. ఆకలితో పోరాటం చేయలేక మనసు చంపుకుని ఊరు రాలేక నరకయాతన అనుభవించాను. నేనే కాదు ఇక్కడ చాలా మంది పరిస్థితి అంతే “ చెమ్మగిల్లిన కండ్లను తుడుచుకుంటూ అన్నాడు బాలు.

“అయ్యో! నువ్వు ఒకటి రెండు సినిమాలలో కనిపించేసరికి ఊరు అంతా నువ్వు హీరో అయ్యావని కార్లలో తిరుగుతూ అద్దాల మేడలో ఉంటున్నావని జనం రకరకాలుగా చెప్పుకుంటున్నారు” ఆశ్చర్యంగా అన్నాను.

“దూరపు కొండలు నునుపు అంటారు అనుకొనీలే, ఇక్కడ చూశావుగా నా పరిస్థితి ఇప్పుడిప్పుడే టివి సీరియల్స్‌లో అవకాశాలు వస్తున్నాయి, షూటింగ్ వున్న రోజు అటు, లేని రోజు ఫ్లంబర్ వర్క్‌కి వెళ్థున్నాను బతకాలి గదా” తన బాధను దాచుకోడానికి ప్రయత్నం చేస్తునే అన్నాడు.

“మరి ఎలారా?”

“ఒక పని చేయండి రా, ముందు టీవిలో కాంపిటేషన్ ఫోగ్రామ్స్‌లో పాటిస్పేట్ చేయమను. అక్కడ ఎవరి దృష్టిలో పడిన అవకాశం రావచ్చు, ఏదైనా ఛానల్ వారు అనౌన్స్ చేసినప్పుడు చెబుతాను, ఆడిషన్స్‌కు అటెండవ్వమను సెలక్టైతే మన అదృష్టం పండినట్టే” బాలు చెప్పగానే నా మనసు కూర్చోన్న చోటే టివి ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ తను స్టేజీపై పాడుతున్నట్టు మదిలో భ్రమేదో పరిభ్రమించింది.

ఈ పట్టణం కన్న పల్లెటూరిని ఇష్టపడే నాకు ఇప్పుడెందుకో ఇక్కడే వుంటే బాగుండు అనిపిస్తుంది.

ట్యాంక్‌బండ్‌పై బుద్ధుని విగ్రహం చూస్తూ లుంబినీ పార్క్‌లో తన ఒడిలో ఒదిగి స్టడీ అయిపోయాక భవిష్యత్తు గురించి అల్లుకున్న కలలను చెబుతుంటే భావాత్మకమైన ఎన్నో జ్ఞాపకాలను నా మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకున్నాను.

ఉదయం ప్యాసింజర్‌కు వెళ్తే డైరెక్టు ఊరిలో దిగచ్చు, మిస్ అయితే మధ్యలో దిగి ఆటో ఎక్కవలసి వుంటుందని రెడీ అయి తనతో చెప్పి ఊరు చేరాను.

కాశీరాం పాన్ షాప్ వద్ద ఆగి ప్రేమ విషయం బాలు గాడు కలిసిన విషయం మిత్రులతో షేర్ చేసుకున్నాను.

“తను టీచింగ్ ఫీల్డ్ ఎంచుకుంటాను అంటుంది, నేనే సినిమా ఇండస్ట్రీలో తనను ఒక గాయనిగా చూడాలి అనుకుంటున్నాను రా” నానిగాడితో అనగానే వాడు ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు.

“సరే శ్రీకాంత్, నీ ప్రయత్నం నువ్వు చేయి. తప్పేముంది తదుపరి నిర్ణయం దేవుడికి వదిలేయ్” విజయ్ నా భుజంపై చేయి వేసి అన్నాడు.

“నేను అదే ఆలోచిస్తున్నాను” అన్నాను.

“శ్రీకాంత్, నువ్వు అనుకున్నంత ఈజీగా జీవితం ఉండదు రా. అసలే లవ్ మ్యాటర్ ఈ కాలంలో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు జాగ్రత్త మరి” కాశీరాం హెచ్చరిస్తూ అన్నాడు.

కాశీరాం గాడి మాటలు ఎందుకో నాకు చేదుగా వినిపించాయి. దాంతో వాడివైపు కోపంగా చుశాను. వాడు నావైపు చూడకుండానే పాన్ చుట్టి పేపర్లో మలిచాడు.

నేను అక్కడ నుండి ఇంటికి వస్తుంటే అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి.

‘కాశీరాం చెప్పిన దాంట్లో తప్పేమీ కనిపించలేదు, వాళ్ళ అన్న విషయంలో ఇదే జరిగింది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు, మొదట బాగానే ఉన్నారు, సంవత్సరం తిరిగేలోపు వారి మధ్యకు ఓ బాబు వచ్చాడు, కానీ వాళ్లు మాత్రం ఉత్తర దక్షిణ ధృవాలుగా విడిపోయారు. అందుకే వాడికి ప్రేమికులన్నా, ప్రేమన్న ఇష్టం వుండదు.’ అయినా అందరి విషయంలో అలానే జరగాలని లేదు కదా అనుకున్నాను.

“బాబు వచ్చేది ఏ రైలు నాయనా?” ఓ పెద్దావిడ కంటిపై పడుతున్న సూర్యుడి వెలుగుకు చేయి అడ్డుపెట్టుకుని అడిగింది.

“అవ్వా, ఫ్యాసెంజర్ ఇప్పుడే కదిలింది” నేను నా ఆలోచనలలో నుండి తేరుకొని అన్నాను.

ఈ మధ్య తన నుండి ఎలాంటి ఫోన్ రాలేదు, ఎందుకు ఫోన్ చేయలేదు నాకు అర్థం కాక నేరుగా వెళ్ళి వాళ్ళ అమ్మను అడిగాను.

“ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటా అందుకే ఫోన్ పక్కన పెట్టిందంటా. మాకు కూడా చేయడంలేదు బాబు” అంది అత్తయ్య.

నిజమే! నేను కూడా తనను డిస్టర్బ్ చేయకూడదు మనసులో అనుకున్నాను.

జేబులో ఫోన్ మోగింది, అక్క ఎందుకో ఫోన్ చేస్తుంది అనుకుంటూనే తీశాను.

“శ్రీకాంత్ ఎక్కడున్నావురా? బావ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేరవుతున్నావో అడగమంటే చేస్తున్నాను, ఏమైనా మనీ అవసరముంటే చెప్పు, అనవసరంగా టైం వేస్టు చేసుకోకు” అక్క గట్టిగా చెప్పింది.

నేను చిన్నప్పటి నుండి కన్న కల ఒక్కటే ఎస్సై కావడం, నేనెందుకు ఒదులుకుంటాను, వాళ్ళు లెక్చరర్స్ కావడంతో ఎప్పుడు చెబుతుంటారు, ఉద్యోగం ఉంటే మనిషికి ఈ సమాజంలో ఉండే విలువ, గౌరవం ఎలా వుంటుందో వివరించేవారు.

అమ్మ, నాన్నతో చెప్పి కోచింగ్‌కు వెళ్ళాను, కొద్ది రోజుల్లోనే ఖాకీ యూనిఫాం ఒంటిపైకి వచ్చింది కాని తాను మాత్రం ఇంకా ఎక్కడుందో తెలియడం లేదు. అసలేమైంది.

నేను తనను త్వరగా పెండ్లి చేసుకుని ఇండస్ట్రీలో గాయనిగా చూడాలనుకున్న కల కలలాగే ముగుస్తుందా అనుకుని తన కోసం మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాను.

“శ్రీకాంత్, నీ ఫోన్ మోగుతుంది ఏం ఆలోచిస్తున్నావు?” అమ్మ టీపాయ్ పై వున్న ఫోన్ నా చేతిలో పెట్టి వంటింట్లోకి వెళ్ళింది.

నేను ఫోన్ ఎత్తగానే “హలో” అంది, అది ప్రేమ గొంతు వినగానే ఒంట్లో వేయి మెగావాట్ల పవర్ జెనరేట్ అయినట్టు అనిపించింది.

“ప్రేమా, ఎక్కడున్నావు? ఇన్ని రోజులు ఏమై పోయావు?” టెన్షన్‌తో తలపట్టుకుని అడిగాను.

“శ్రీకాంత్, నీకు ఓ విషయం చెప్పాలని ఫోన్ చేశాను”

“చెప్పు ప్రేమా”

“ప్లీజ్! శ్రీకాంత్ అయామ్ సారీ, మా నాన్న నాకు బలవంతంగా మ్యారేజ్ చేశాడు, నేను బెంగుళూర్‌లో వున్నాను. నేను నీతో మళ్ళీ మాట్లాడటం కుదురుతుందో లేదో వుంటాను” అంటూ ఫోన్‌లో భయం భయంగా మాట్లాడుతుంటే ఎవరో వచ్చి ఫోన్ తీసుకున్నట్టున్నారు. నేను అక్కడి పరిస్థితిని అంచనా వేసి మళ్ళీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్ అని వాయిస్ వచ్చింది.

 నేను ఒక్కసారిగా నిల్చున్న చోటే కుప్పకూలి ఆకాశాన్ని చూస్తు బిగ్గరగా ఏడ్చాను, ఇంటి వెనుక పట్టాలఫై నుండి వెళ్ళే గోదావరి ఎక్స్‌ప్రెస్ కూత నా గొంతును డామినేట్ చేసింది, అమ్మ,నాన్న పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి విషయం విని షాక్ అయ్యారు.

“తానొకటి తలిస్తే దైవమోకటి తలుస్తుందంటారు, ఆ పిల్ల నీకు రాసిలేదు, బాదపడకు రా చిన్నోడా, ఇంతకన్న మంచి అమ్మాయి నీ జీవితంలోకి వస్తుందేమో. మ్యారేజస్ ఆర్ మేడిన్ హెవెన్ అని అంటారు కదా ధైర్యంగా వుండు” నాన్న ధైర్యం చెబుతూనే వున్నాడు.

“జీవితంలో ఎంతో మంది వస్తారు వెళ్తారు, చిన్నా నేను చెప్పినట్టు చేయరా నీ లైఫ్ చేంజ్ అవుతుంది” అమ్మ బతిమాలాడి చెప్పింది.

అమ్మ ఆలోచన సబబుగానే వుంది, ఎంత కాలం కోల్పోయినదాని కోసం బాధపడుతూ కూర్చుంటాం, అలా అయితే అక్కడే ఆగిపోతాం అని నాకు అనిపించింది.

అమ్మ నాన్న ఆలోచనలను అక్క, బావ ఏకీభవించారు,

మేళ తాళాలు, వేదమంత్రాలతో శశి వెన్నెలను తీసుకవచ్చింది. ఆ తరువాత ఇద్దరు పిల్లలు, వారి స్టడీ, ట్రాన్ఫర్స్‌తో మరో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను.

పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి, నాన్న ఆ రోజు చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది. నా ఆలోచనలు శశి భావాలు ఒకేలా వుండటం, తను స్కూల్ టీచర్‌గా పిల్లలకే కాకుండా నాకు సలహాలు ఇస్తూ నేను డ్యూటీలో వున్న అమ్మానాన్నలను కంటికి రెప్పలా చూసుకుంటుంది.

ఇప్పుడు నేను ప్రతీ కాలేజీలో పిల్లలకు వారి భవిష్యత్తు నిర్మించుకోవడం ఎలా, ఎగ్జామ్స్ టైంలో ఒత్తిడిని ఎలా జయించాలి, ఉద్యోగం సాధించడానికి కేటాయించవలసి సమయం దానికి సంబంధించిన ప్రణాళిక ఎలా వేసుకోవాలో, డ్రగ్స్, సూసైడ్స్ వంటివాటిపై అవగాహన కల్పిస్తుంటే నాన్న చాలా సంతోషిస్తున్నాడు.

***

“సర్.. సార్..” అన్న మా కానిస్టేబుల్ రంగనాధం పిలుపుతో నేను ఆలోచనల నుండి వర్తమానంలోకి వచ్చాను.

గతంలో చేదు అనుభవాలు, తీపిజ్ఞాపకాలు ఎన్ని వున్న ఇప్పుడు ప్రతీ రోజు మరిన్ని కొత్త విషయాల కోసం అన్వేషిస్తున్నాను, నేను పోలీస్ ఆఫీసర్‌ను. నాకు డ్యూటినే ముఖ్యం.

Exit mobile version