Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గద్ద ముక్కు టూకాన్ పక్షి

[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]

పిల్లలూ!

ప్రకృతిలో ఎన్నెన్నో వింతలు – విడ్డూరాలు కనిపిస్తాయి. జంతుజాలంలోని వైవిధ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. శరీర అవయవాల అమరికలలోని ప్రత్యేకతలు ఆయా జంతువుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి.

ఈ విధంగా శరీర అవయవాలలో ముఖ్య భాగమయిన ముక్కు ప్రాధాన్యత కలిగిన ఒక పక్షి గురించి చూద్దాం.

తన శరీరపు పొడవులో సగం కంటే పొడవయిన ముక్కు గల పక్షి టూకాన్ పక్షి. ఈ ముక్కు తేలికగా ఉంటుంది. ఇది పసుపు, ఎరుపు, నలుపు, నీలం మెదలయిన రంగు రంగులతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ముక్కు మన దంతాలలా ఉపయోగపడుతుంది.

సుమారు 2.9 అంగుళాల పొడవుంటాయి. దీని ముక్కుతో పోల్చితే మిగిలిన శరీరభాగాలు చిన్నగా ఉంటాయి. చిన్నతోక, గుండ్రంగా, మందంగా ఉండే చిన్నిమెడ, చిన్న చిన్న రెక్కలు ఉంటాయి.

వీటి కాలి వేళ్ళు కూడా చిత్రంగా ఉంటాయి. మెదటి వేలు, నాలుగవ వేలు వెనుకకు తిరిగి విచిత్రంగా కనిపిస్తాయి.

ఇవి ఎక్కువగా దక్షిణ అమెరికా లోని ఉష్ణమండల అడవుýలో నివసిస్తాయి. ఎక్కువగా చెట్ల తొర్రలలోని గుహలలో నివసిస్తాయి. ఇవి చిన్న చిన్న గుంపులుగా మాత్రమే జీవిస్తాయి. ఎక్కువ దూరం ఎగరలేవు.

ఇవి మిశ్రమాహారులు. పండ్లుతోపాటు గుడ్లు, కీటకాలు, చిన్న చిన్న జంతువులని తింటాయి. మన దొంగలు మనిళ్ళలో దూరి దొంగ తింటాయి కదా! ఇవి కూడా దొంగ తిండి తినే ప్రయత్నం చేస్తాయి. ఇందు కోసం దీని పొడవయిన ముక్కు ఉపయోగపడుతుంది. దీని ముక్కుని ఇతర పక్షుల గూళ్ళలోకి పోనిచ్చి ఆహారాన్ని దోచుకుంటుంది. ఒకే ప్రదేశంలో ఉండి దూరంగా ఉన్న పండ్లని తింటుంది.

మనలో కొంతమంది మనుషులు తిన్నది అరిగే వరకు నడుస్తుంటారు. మరి కొంత మంది రక రకాల విన్యాసాలు పోతుంటారు. ఇవి కూడా ఒకేసారి ఎక్కువ తినేసి ఆపసోపాలు పడుతూ తోటివాటితో కుస్తీలు పడుతుంటాయి.

వివిధ రకాల శబ్దాలను చేస్తాయి. అంటే మన మిమిక్రీ ఆర్టిస్ట్‌లా అన్నమాట. కొన్ని మనలాగా గురక పెడతాయి. మనం చేత్తో తలుపులను తట్టినట్టు తమ గూళ్ళతో పాటు, ఇతర పక్షుల గూళ్ళ బయట కూడా ముక్కుతో తట్టుతూ శబ్దాలను చేస్తాయి. కొన్ని కప్పల్లా బెకబెకలాడితే మరికొన్ని గాడిదల్లా ఓంఢ్ర పెడతాయి.

వీటి ఈకలతో అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. అవి చాలా ఖరీదయినవి కూడా! కొన్ని ప్రాంతాలలో దీనిని ఆహారంగా కూడా ఉపయోగిస్తున్నారు.

ఇవి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్న పక్షి. అవునంటారా?

Exit mobile version