[శ్రీ ఫణిహారం వల్లభాచార్య వెలువరించిన ‘గడ్డిపూలు’ అనే చిరుకవితల సంపుటిని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
‘గడ్డిపూలు’ పుస్తకం చేతికి అంది కవర్ పేజ్ చూడగానే, ముందుగా మనసులో మెదిలినది ఎమిలీ డికిన్సన్ గారి ‘The Grass so little has to do’ కవిత. ఆ కవితలో కవయిత్రి గడ్డిని సరళమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడిపే ఒక వినయపూర్వకమైన జీవిగా చిత్రించారు. “గడ్డికి చేయాల్సింది చాలా తక్కువ ఉన్నప్పటికీ, అది రోజంతా తేనెటీగలు, చిట్టిపిట్టలకు ఆతిథ్యం ఇస్తుంది, గాలి మోసుకొచ్చే మధురమైన స్వరాలకు ఊగుతుంది, సూర్యకాంతిని తనలో పొదుపుకుంటుంది, రాత్రిపూట ముత్యాల లాగా పొగమంచు బిందువులను పోగుచేస్తుంది.” అంటారామె. ఎంత గొప్ప భావన కదా! ఇది మానవుల జీవితం కంటే గడ్డి నిశ్చింత, స్వేచ్ఛ పట్ల కవయిత్రి ఆకాంక్షను సూచిస్తుంది.
గడ్డిపూలు అనేవి గడ్డిలో పూసే పూలు. సాధారణంగా వీటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. అడపాదడపా ఏ ప్రకృతి ప్రేమికుడి దృష్టిలోనో పడి అతనిలోని భావుకుడు మేల్కొంటే, వాటిని తన డైరీలోనో, జర్నల్ లోనో, వర్ణిస్తాడు.
మన సమాజంలో విలువలేని వాటిని గడ్డిపూలతో పోల్చడం కూడా కద్దు. అయితే సృష్టిలో దేని ప్రయోజనం దానికి ఉంటుంది. అల్పమైనదని జనాలు భావించేది కూడా అమోఘమైన ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది కొన్నిసార్లు.
అలాంటి గడ్డిపూలు శీర్షికతో, తన మది అనే తోటలో పూసిన భావ కుసుమాలను గుచ్ఛంగా అందించారు శ్రీ ఫణిహారం వల్లభాచార్య.
“ఈ రాతలను ఏ ప్రక్రియలో చేరుస్తారో తెలియదు. 1996-97 మధ్య మనసుకు తోచినట్టు పేర్చినవివి” అన్నారు కవి తమ ముందుమాటలో. ఇందులోని కొన్ని భావాలు అస్పష్టంగా ఉన్నాయి. కొన్ని ప్రతీకాత్మకం! కొన్ని సులభగ్రాహ్యం! ఏదో ఆలోచనా ఝరి పొంగినప్పుడు వ్రాసుకున్నవై ఉంటాయి ఈ కవితలు.
~
“గుండెలో గాలి/గొంతులో గగనం/వెలుగుల వంతెన” అనే ఈ కవిత – మనిషి శరీరంలో పంచభూతాలు ఉన్నాయని సూచిస్తుంది. భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం, అగ్ని ఆకాశాన్ని లేదా శూన్యాన్ని మనకి చేరువ చేస్తుంది. అందుకే కవి అగ్నిని వెలుగుల వంతెన అని పేర్కొన్నారు.
“ఎడారిలో/వాన/కవిత్వం” అన్నారు. దీన్ని రెండు రకాలుగా చూడవచ్చు. ఎండి బీడు బారిన భూముల వంటి హృదయాలో వర్షం లాంటి హర్షం కురిపించేది కవిత్వం అని అనుకోవచ్చు. అదే సమయంలో సమహృదయులు కాని, కవిత్వం పట్ల ఆసక్తి లేని వారికి చక్కని కవిత వినిపించినా, విస్తృతంగా పరుచుకున్న ఎడారిలో, ఓ చోట కురిసిన నాలుగు చినుకుల్లా.. అది వృథా అయిపోతుందని అర్థం చెప్పుకోవచ్చు.
“నిన్నటివాళ్ళు/ఇవాళ లేరు/రేపు నాదే” – ఈ కవితని విజయం సాధించేవాళ్ళకి వర్తింపజేయచ్చు. ఒకడు గొప్పగా కృషి చేసి తన రంగంలో అగ్రస్థానానికి చేరవచ్చు. కానీ ఎన్నటికీ అక్కడే ఉండలేడు. ఎత్తుకు తీసుకెళ్ళిన కాలమే క్రిందకి దింపుతుంది. తదుపరి మరొకరిని అందలం ఎక్కిస్తుంది. దీన్ని మరో రకంగా అర్థం చేసుకోవచ్చు. జీవితం ఎవరికీ శాశ్వతం కాదు, మృత్యువు తప్పదు. నిన్నటి మనుషులు నేడు భౌతికంగా కనుమరుగవుతారు. రేపు మన వంతు అని సూచిస్తుంది.
“ఒక జీవిత దూరం/ప్రయాణం/గమ్యం రాలేదు”. వేదాంతులు చెబుతూంటారు.. గమ్యాన్ని కాక గమనాన్ని ఆస్వాదించాలని. గమనం సాగాలి, గమ్యం చేరుతామో లేదో అన్నది జీవితం నిర్దేశిస్తుంది.
“ఆమె గొంతులో/పారావతం/ఐరావతం ఒరిగింది”. ఇది ఓ గాయనికి సంబంధించినది. పారావతము అంటే కపోతము లేదా పావురమనే అర్థం తీసుకోండా, కలధ్వని (a low sweet tone) అనే అర్థాన్ని తీసుకోవాలి. అప్పుడు ఐరావతమంటే ఏనుగో, సింహమో, పామో కాకుండా – అమృతం అనే అర్థం వస్తుంది. మధురమైన ధ్వనిలో ఆమె పాడుతుంటే అమృతం కురిసిందని భావం! పదాల కేళి కదూ!
“ప్రాణం/మరో గుండెను/ఎత్తుకుపోతుంది” – ఇది చాలా లోతైన భావాలు ఇమిడి ఉన్న కవిత. ఆత్మీయులు గతించినప్పుడు, వాళ్ళ వియోగం జీవించి ఉన్న వాళ్ళకి గుండెకోత కదా!!
“కృష్ణ/ప్రేయసి/విడిన ధమ్మిల్లం” – ఈ కవితలో సౌందర్యారాధన గోచరిస్తుంది. ప్రేయసి కొప్పు విడిపోయి నల్లని కేశాలు వీపున జారాయట.
“సముద్రం/ఎంత ఏడ్చాడో/దేవుడు” కన్నీరు ఉప్పన. సముద్రపు నీరు ఉప్పన. మామూలు మనుషులు రోదిస్తే కారే కన్నీరు సముద్రపు ప్రమాణంలో ఉండదు. సర్వశక్తిమంతుడైన దైవం రోదిస్తే ఆ ఉబికే కన్నీరు సముద్రమవుతుందని కవి భావన! దేవుడు రోదించాల్సిన అవసరం ఏముందని అడగద్దు. మృగాల్లా మారిన మనుషులు చేసే దుశ్చర్యలు చూస్తే దేవుడికి సైతం కన్నీళ్ళు వస్తాయి!!
“నగరం/దున్నపోతు/వాన కురుస్తోంది”. ఈ కవిత ప్రతీకాత్మకమైనది. దున్నపోతు మీద వాన కురిసినా దానికేమీ పట్టదని అంటారు. అలాగే పంటపొలాలున్న చోట కాకుండా, జనారణ్యం లాంటి నగరంలో వర్షం కురిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదన్నది కవి భావన కావచ్చు.
“పొద్దున్నే/ఇల్లంతా మబ్బు/స్కూళ్ళు తెరిచారు”, “నిద్ర రావడం లేదు/మా అబ్బాయి/కథ చెప్పలేదు”, “మనసంతా దిగులు/మా వాడి ఆటలో/నేను లేను”, “నిద్రలో/నవ్వాడు/నా అజ్ఞానానికా?” ఈ కవితలు తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధాన్ని చాటుతాయి.
“కంటితో విన్నా/చెవితో చూశా/దారి దొరికింది”. కఠిన పరిస్థితులలో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేయాలని ఈ కవిత సూచిస్తోంది.
“ప్రశ్నా కాదు/జవాబు లేదూ/జీవితం”. జీవితాన్ని ఇంతకన్నా క్లుప్తంగా ఎలా వ్యాఖ్యానించగలం?
“సంకల్పం లేదు/సంఘర్షణ లేదు/జీవిస్తున్నాను” – లక్ష్యమూ, రాపిడీ లేని బ్రతుకు బ్రతుకే కాదని సూచిస్తుందీ కవిత.
“అన్వేషణ/ముగిసింది/అంతా నిశ్శబ్దం”. చాలా గొప్ప భావాన్ని నింపుకున్న కవిత. ఆధ్యాత్మికంగా మనిషి దేని కోసమో వెతుకుతాడు. ఆశించినది దొరికినప్పుడు శాంతి లభిస్తుంది. అంతరంగంలోని అలజడి సర్దుకుని ప్రశాంతత ఏర్పడి మౌనం అనుభవంలోకి వస్తుంది.
“ఏదీ/అర్థం కాలేదు/లోపలికి చూశాను”. ఇదీ ఆధ్యాత్మిక భావనని ఇముడ్చుకున్న కవితే. బాహ్యపు విషయాలను వదిలి, మనలోకి మనం చూసుకోవడమే జ్ఞానానికి తొలి అడుగు.
~
ఇంకా కొన్ని అద్భుతమైన కవితలున్న ఈ పుస్తకం సైజ్ విభిన్నంగా ఉంది – 10 x 10 cm. ఆయా కవితలకి శ్రీ కూచి గీసిన చిత్రాలు ప్రతీకాత్మకంగా ఉన్నాయి. ముఖచిత్రం కూడా వారే గీశారు.
జేబులో పెట్టుకోడానికి అనువుగా ఉన్న ఈ పుస్తకాన్ని ప్రయాణాల్లోనో, పార్కులో కూర్చుని ఉన్నప్పుడో హాయిగా చదివేయవచ్చు. ఎన్నో ఆలోచనలని రేకెత్తించే అందంగా అనిపిస్తాయీ గడ్డిపూలు.
***
రచన: ఫణిహారం వల్లభాచార్య
ప్రచురణ: హెచ్.ఎస్. పబ్లిషింగ్ హబ్, హైదరాబాద్.
పుటలు: 94
వెల: ₹ 100/-
ప్రతులకు:
ఫణిహారం వల్లభాచార్య
ఫోన్: 9000221269
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
