Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గడి

[శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి రచించిన ‘గడి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

మెట్లు మెట్లుగా అమరిన
కొలువు బొమ్మలలో
మొట్ట మొదటిగా అమ్మ
ఎక్కి కూర్చుంది.

సుకుమారులు
సుందర జీవితాకాంక్షలు,
దృఢ కార్య దీక్షను కలిగిన వారు,
ఆడపిల్లలు,
బతుకమ్మలు
బ్రతుకంతా భద్రంగా గడపాలని,
గుమ్మడి గోగులు, తంగెడు, జిల్లేడు
పూలను పేర్చిన శిఖరాన
కుశల అభయ ముద్రల అంబ అధిరోహించింది.

ఉత్తర దిశలో దుర్గ
కలకత్తా కాళి ఆర్జవ కర
దుష్ట చర్యా ఘోషల మదమణిగించాలని,
త్రిపురాసుర సంహార త్రిశూల కులిశ ధారలను
తిరుగు లేని ఓషధీ చిత్రికలతో
సాన తీర్చింది.

ఇటు పక్కన దిశలో
రావణుని కూల్చిన రాముడు
రాజ్యానికి తిరిగివచ్చిన ఆనందంతో
పండుగను జరుపుకుంటున్న
రామలీలా ఘట్టం ఆవిర్భవించింది.
మరల రామరాజ్యం
వచ్చే రోజు వస్తుందని ఆశ కలిగింది.

జమ్మి వృక్షాన గోప్యంగా వుంచిన
అస్త్ర శస్త్రాలను
చేగొన్న విజయ ఉత్సవానికి అలై బలై
కలయిక బంగారాన్ని పంచి
కౌగలించిన సంబరానికి
నిర్భయమైన రహదారులు పంట పండింది.

సముద్ర తీరాల శంఖ తీర్థాల
వినీల గగనాల ఏకఛత్రం
భూమి నంతా ఒక్కటి చేసిన సన్నివేశం
పూర్వ సంస్కృతి మాధ్యమాలను
విరివిగా పంచింది

ఇటు దసరా, దీపావళి పరంపరల
జనసందడి ఉత్సాహాలతో
అటు గుమ్మడి పండు లాంతరులతో
హలోవీన్ అతీత శక్తులను తరిమి వేసేందుకు
విచిత్ర వేషధారణలు వేసుకునే వైనం;

దేశం ఏదైనా ఆచారం ఏదైనా
దురాచార దూరాలకు,
సర్వ మానవ వికాసానికి
కలిమి తరుణాల పండుగ
మంచి తారీఖుల గడిని
వేస్తూనే ఉంటుంది.

Exit mobile version