Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గదిలో సముద్రం

[బి. కళాగోపాల్ గారు రచించిన ‘గదిలో సముద్రం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

ఎప్పట్లానే నిద్రపట్టని ఈ సుదీర్ఘ రాత్రి దుఃఖం నీలోకి కొంచెం మెలకువగా కొంచెం మాగన్నుగా చలికాలపు రాత్రి నెగడులోకి మంటనేదో ఎగదోసినట్లుగా నీ మెదడు పొరల్లోకి నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. చుక్కలు చుక్కలుగా ఒంటరి చూరు నుండి కారుతున్న దుఃఖపు చినుకుల్ని అనుభవిస్తూ నీవనుకుంటావు ఆ డాక్టరు అడిగిన అదే ప్రశ్నకు నీ ముఫ్ఫై ఐదేళ్ల  వైవాహిక జీవనంలోని సారమంతా తోడేసినట్లు  రెండోసారి అవునని చెప్పాల్సిన పరిస్థితి దాపురించినందుకు నీవు మళ్ళీ నిలువెల్లా గాయపులోతుల్లోకి కూరుకు పోయావు.

ఎంతో సంయమనంతో, ఓర్పుగా, నేర్పుగా జీవిస్తూ వచ్చిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో పిల్లలు పుట్టారు, పెరిగారు.. వారు ఎదిగే క్రమంలోనే ఈ సంఘర్షణ అంత అని  గట్టిగా ఒప్పేసుకుంటావు. నీలం రంగు జీరోబల్బు వెలుగులో నిన్ను మోహించిన కలలు, భయపెట్టే ఆలోచనలు పురి విప్పుతూ తమ నగ్ననిజాల్ని ఒక్కటొక్కటిగా గొంతెత్తి  ప్రశ్నిస్తుంటే జవాబులేని  నిస్సహాయస్థితిలో కూరుకుపోతావు. ఇన్ని ఏళ్ళుగా జ్ఞాపకాల గొలుసుల దూరం.. ఆకర్షణ, ప్రేమ, బంధాలు, బాధ్యతలు జడివానలా నిన్ను ఊపిరి సల్పనీవు. జీవితమంటే ఆనందం.. ప్రేమ.. కామం.. ఇచ్ఛతో రగిలే కోరికలోని సంతృప్తి అని నమ్మిన రోజులవి. అతడి స్పర్శను ఇష్టంగా అనుభూతి చెందావు. ఉత్తరం రాశాడు.. నీ పుట్టినరోజుకో  పెద్ద గ్రీటింగ్ కార్డు మడతలు మడతలుగా పంపితే ఈ ప్రపంచాన్ని జయించినంతగా సంతోషపడ్డావు. నీ చనుద్వయాన్ని తాకేంత చనువును అతడికిచ్చి గట్టిగా హత్తుకున్నావు. ఎర్రటి అధరాలపై అతడి ఒత్తైన మీసకట్టు గండు తుమ్మెదలా మధువును గ్రోలినా అడ్డుచెప్పలేని మైకంలో కూరుకుపోయావు.

అదిగో! ఆ తప్పటడుగే కదా నీ ఇద్దరు బిడ్డల జీవితాల్ని శాసించింది. ప్రేమమైకంలో కూరుకుపోయారు. వయస్సు తెచ్చిన ఆకర్షణల జోరులో ఏకమవుదామని నిశ్చయించకున్నారు. ఎవడి భవిష్యత్తు ఎవరికి తెలుస్తుంది కనుక? ఐనా.. అతడు మంచివాడే! ఆ రోజు అడిగిన ప్రశ్న “ఈ వివాహం నీకు సమ్మతమేనా?! ఇంట్లో ఏదో పెద్దవాళ్ళు చెప్పారని మాత్రం ఓకే అనకు” అని ఐనా..

నీ మట్టిబుర్రకు తట్టలేదు..  అతడికి తట్టనిది నాకెలా తడుతుంది? అనుకున్నావేమో? పందొమ్మిదేళ్ల వయస్సు వేడి నీది. నీ అందానికి దాసోహమన్న ఆర్తి అతనిది. నాన్న నీ పెళ్లి ఎంతో ఘనంగా చేసి బాధ్యత తీరిందనుకున్నాడు. కొత్త కాపురం రగిలే కోరికలు, జ్వలించే కాంక్షల నడుమ ఒక్కటైన దేహాలు. మూడేళ్ల తర్వాత పాప. అటుపిమ్మట ఐదేళ్లకు బాబు జన్మించాక నీ జీవితమెంతో స్థిరంగా, గంభీరంగా హుందాగా జరిగిపోసాగింది. ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాశావు. పాప కడుపులో పడ్డప్పటినుండి ఉద్యోగానికై ట్రైనింగ్‌లు, పరీక్షలు ఎన్నో రాశావు. జీవితం నిన్ను గెలిపించింది. ప్రభుత్వోద్యోగం నిను వరించింది.

ఈ క్రమంలో ఎన్నెన్ని నిద్రలేని రాత్రులు, పాపాయి ఆకలి ఏడ్పులు, జ్వరాలు, సమ్మెటపోట్లలాంటి పరిస్థితులు.. పల్లెలోని అత్తగారింటికి నోములు, క్రతువులు, పండుగలంటూ పయనాలు. అటు ఉద్యోగం, ఇటు మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు నీ గర్భాశయం మరోమారు పనిముట్టైంది.

ఇంటిపనుల్లో అతడెంత సహాయం చేస్తున్నా ప్రకృతికి ఎదురీదలేని అతడి నిస్సహాయ మగతనం ముందు నీ ఒత్తిడి ఎన్నిమార్లు మందుగుండులా పేలలేదు? నీలోనూ, అతనిలోనూ నెమ్మదిగా తగ్గుతున్న ఆకర్షణల  వలయం.. రంగులు వెలసిపోతున్న నడీడు జీవితాల ముంగిట్లో బాధ్యతల బరువును ఇద్దరూ పంచుకుంటూ.. భుజం మార్చుకుంటున్న దృశ్యాలు వారాలై, నెలలై, సంవత్సరాల్లోకి మారుతుంటే.. గోడ మీద కొత్త క్యాలెండర్ మరెన్నో సవాళ్ళను విసరసాగింది.

తొమ్మిదో తరగతి చదువుతున్న నీ కూతురు మాధురి అడిగిన ప్రశ్న ఏదో మూల నిన్నెంతగా బాధపెట్టిందని? “అమ్మా! తరగతిలో అందరూ మెచ్చూర్ అయి వస్తున్నారు. మరి  నేనప్పుడు అలా అవుతాను?” అని అడిగినప్పుడు నువ్వెంతగా ఏడ్చావో నువ్వెలా మర్చిపోతావు. నీ దరిద్రపుగొట్టు దుఃఖానికి మరో కారణం ఉందని నీ బిడ్డకు చెప్పలేని మౌనవ్యధను ఎవరి ముందు దించుకుంటావు? ఆ యేడు.. ఎండాకాలం సెలవుల్లో రెండునెలల గర్భాన్ని క్లినికల్ అబార్షన్ చేయించుకున్న నీ లోపలి గాయపు నెత్తురును ఎలా చూపగలవు? అసలు నీ మనసు లోతుల గురించి చెప్పుకుంటూ వెళితే అన్నీ జవాబులేని ప్రశ్నలే? అతగాడిని అడగాలనుకున్న ప్రశ్నలకు నీ జీవితం ఏమని సమాధానమిస్తుంది? రెండవైపులా మోగితేనే చప్పట్లని తెల్సిన నీకు, అతడినడిగే ప్రశ్నలన్నింటిని అతడు నీకు అవే ప్రశ్నల్ని గుప్పిస్తే గనుక నీవేమని జవాబు చెప్తావు? జీవితం పెట్టే పరీక్షలకు ఇద్దరి దగ్గరా జవాబు లేదని నీకు తెలుసు. బాకీ అంటావా? ప్రారబ్ధం అంటావా? లేదా విధి అంటూ జరగాల్సింది ఏదో జరుగుతుందిలే అనుకునే వైరాగ్యం దశల్లోకి నీవింకా వెళ్ళలేదు గనుకే ఈ గుంజాటన అంతా..! అబార్షన్ జరిగిన యేడు నీవెంతో కుంగిపోయావు.

మాధురిని తీస్కొని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లవు. మెదటిసారి స్కానింగ్ చేసేటపుడు ఆవిడేదో మొహం చిరాగ్గా పెట్టి “ఏమీ కనిపించట్లేదు,  పొట్ట నిండా నీళ్ళ తాగి రమ్మను” అని దురుసుగా అన్నప్పుడు గుడ్లనీరు తీసుకోవడం మినహా నీవెంత ఖేదపడ్డావని? మాధురి బేలముఖంలో ఎన్నో ప్రశ్నలు, ఆ చిన్ని గుండె బాధతో ఎంత విలవిల్లాడిందని? కీరియోటైపు, జెనెటికల్ టెస్టు అంటూ అవీ ఇవీ అన్నీ రిపోర్టులు తెప్పించుకున్నాక ఆవిడ చెప్పిన విషయాలకు నీకెంత ముచ్చెమటలు పట్టాయని? అసలు జీవితమెంత నిస్సారమని, భవిష్యత్తు అంతా అగమ్య గోచరమని కుప్పకూలావు. “అమ్మాయికి హైపోప్లాస్టిక్ యుటెరస్ ఉంది. మూడు నెలలు ఈ మందుబిళ్లలు, ఇంజక్షన్లు తీసుకోవాలి. ఎగ్ డొనేషన్‌తో సంతానం అవుతుంది. పెళ్ళి చేయొచ్చు. మీ బిడ్డకు మంచి చదువు చెప్పించి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి” అని డాక్టరమ్మ చెప్పినపుడు నీ గుండె గూడుపట్లను పట్టి కుదుపుతున్న దుఃఖాన్ని మౌనంగా పెదవి చాటున బంధించి మెడికల్ షాపులో ఏమీ ఎరగనట్లుగా మందులు కొనుక్కొని ఇంటికొచ్చి జరిగిందంతా అతడికి వివరించినపుడు అతడు ఎంత కన్నీటి పర్యంతం అయ్యాడని, మాధురి భవిష్యత్తు బాగుండాలని కోటి దేవుళ్లకు మొక్కావు.

మరో మూడునెలల తర్వాత మాధురి మెచ్చూర్ ఐందని ఇంటర్ ఫస్టియర్‌లో ఉన్నపుడు హాస్టల్ వార్డెన్ ఫోన్ చేసి చెప్పినప్పుడు నీలో ఒకింత ఆనందం. సంఘం దృష్టిలో బిడ్డకు ఫంక్షన్ జరిపించి సరైన దారిలోనే వెళ్తున్నానని నీవెంతో గర్వించావు. అంతకు మందు పొడిచిన లోకం కాకులు ఇంత వయస్సొచ్చినా ఆడపిల్ల ఫంక్షన్ కాలేదా? అని విస్మయపడ్డారు. చాకుల్లాంటి మాటలతో నిన్ను ఈటెల్లా పొడిచే కొలిగ్స్ నోర్లు కట్టడి చేసినందుకు..ఈ ఫంక్షన్ జరిపించిన ఆ రాత్రి ఎంతో గర్వంగా ఉప్పొంగిపోయావు. ఎదుగుతున్న బిడ్డకు ధైర్యం చెప్పి, హాస్టల్లో దిగబెట్టి వచ్చాక బావురుమంటున్న ఇంట్లో మీరే ముగ్గురు ఉన్నపుడు అతడికి ఎంతో  ధైర్యం చెప్పావు. జీవితం ఒక మలుపు నుండి మరో మలుపుకు అలుపెరుగని పోరాటమని.. ఒక సమస్య తీరిందనగానే మరొక సమస్య పొంచి ఉంటుందన్న నిజం.. ఎందుకో నీకు అంగీకరించబుద్ధి కావట్లేదు. సుదీర్ఘ పోరాటంలో బహుశా అలసిపోయావేమో!

ఆడపిల్ల అందునా మందులు వేసుకుంటేనే నెలసరి వచ్చే అమ్మాయికి  వివాహం జరుగుతుందా? ఇదెలా సాధ్యమని  ఆగిపోక, అన్ని మార్గాలను ఉపయోగించుకొని పెళ్లి ప్రయత్నాలను కొనసాగించిన సహనం, నీలోని గొప్ప ఆయుధం.. ఈ క్రమంలో మాధురి చక్కని యంఎన్‌సిలో కుదురుకోవటం నీకో గొప్ప ఊరట. తనకెదురుగా వరుడ్ని నిలబెట్టమని అపుడే నా జీవిత సమస్య అతడికి చెబుతానన్న మాధురి ఆత్మవిశ్వాసానికి తలఒగ్గి అలాగేనన్న తల్లి ప్రేమ నీది. అన్నట్టుగానే మాధురి ముందు నిలబడ్డ రాకేష్ అతడి మంచితనం, కుటుంబం అన్ని తెల్సుకున్నాకే చివరి నిముషంలో మాధురి వెల్లడించిన సత్యానికి అబ్బురపడ్డ రాకేష్ ఈ కాలంలో ఏమైనా జరగొచ్చు.. అన్ని సాధ్యమే.. నాకు చదువుకొని మనస్సున్న మంచి అమ్మాయైతే చాలు అందునా ఉద్యోగస్థురాలు తనకు బాధ్యతలెక్కువ అంటూ సానుకూల సంకేతాలు ఇవ్వడమే మాధురి జీవితంలో ఓ గొప్ప శుభ పరిణామమని మురిసిపోయావు .

ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్ళిని ఎంతో ఘనంగా జరిపించారు. మాధురి అత్తవారింటికి వెళ్లి పోయింది. తనకు కొత్త జీవితం మొదలయింది. నిత్యం సంఘర్షణాత్మకమైన జీవితపు లోతుల్ని తడమటం ఎవరికి సాధ్యమని? ఈ మధ్య అతడెందుకో ముభావంగా ఉండటం నీకెందుకో మింగుడు పడటం లేదు. మళ్ళీ మళ్ళీ రేగిన గాయన్నే గుర్తు చేస్తున్న రాత్రి నిశ్శబ్దం. గదిలో పరుచుకున్న జీరోలైటు వెలుగులో ముసుగు కప్పుకొని తెర తీసేందుకు ఎదురుచూస్తున్న డ్రెస్సింగు టేబిల్ అద్దం. ప్రతి నిత్యం వినయ్ నుండి వచ్చే రాత్రి ఫోన్ కాల్‌తో అతలాకుతలం అవుతున్న ఊపిరి. ఏదో భయం, అలజడి, ఆందోళనలతో నిద్రపట్టని సుదీర్ఘరాత్రి భవిష్యత్‌ను వెలిగించే నీ కలలన్ని తలగడ దిండులో కన్నీటి చారికలై మిగిలిపోతున్నాయి. బిడ్డకు బిడ్డకు పెంపకంలో తేడాల్లేకున్నా ఆడపిల్ల అందునా హార్మోనల్ అసమతుల్యతలతో  కొట్టుమిట్టాడుతుంటే అసలు ఈ రహస్యం గదిగోడలకు కూడా తెలియనీయకుండా ఉండేందుకై నీవెంత తాపత్రయపడ్డావో ప్రతి నిత్యం, పగలు, రేయి నీ మనస్సెంత క్షోభించిందో కదా! ఈ బాధలన్ని నిన్ను చూస్తున్న సంఘానికి అర్ధం అవుతాయా? అసలు సంఘానికి చెప్పాల్సిన అవసరమేలేనపుడు? ఎవరి నుండి నువ్వు ఓదార్పు ఆశించిలేవని.. ఒంటరి రాత్రి  అంతులేని దుఃఖాన్ని కౌగలించుకున్నావని తెలుస్తోందిగా  నీకు ఇప్పుడు. పెగలని దుఃఖం నిద్రరాని కనురెప్పల బరువు కొంచెం మెలకువగా మరికొంచెం మాగన్నుగా ఉన్నపుడు అంత అర్థరాత్రి అతడికొచ్చిన ఫోన్ కాల్‌తో చప్పున మెలుకువలోకి వచ్చావు.

ఏమీ అర్థంగానట్టు అతడివైపు చూస్తున్నావు, హాల్లో అటు ఇటూ తిరుగుతూ వినయ్‌తో మాట్లాడుతున్న అతడు నీ అలికిడికి ఉలిక్కిపడి హడావిడిగా ఫోన్ కట్ చేశాడు. “ఇంకా పడుకోలేదా? రాత్రి బాగా పొద్దుపోయింది” అని అతడంటున్నా.. తన  వదనంలోని అలజడిని కనిపెట్టేశావు నువ్వు.  “ఏమైందో చెప్పండి? వినయ్, సాకేత బాగున్నారు కదా!” అని వణుకుతున్న గొంతుతో నువ్వు ప్రశ్నిస్తుంటే అతడు నిన్ను దాటవేసి “రేప్పొద్దున చూద్దాం” అంటూ పడకగదిలోకి దారితీశాడు. ఏమీ అర్ధంకాక తెల్లమొహం వేశావు.

మళ్లీ మొదలు, వలయం లాంటి జీవనంలో అంతుచిక్కని ఎనిగ్మా లాంటి రాత్రి. ఈ రాత్రి మలిగాలి తూరుపున వెలుతురు చార మొలవాలి. రాత్రంతా కలత నిదురతో ఏమీ చెప్పలేని ఖాళీతనంతో గుండెలోని బరువును అలాగే ఉంచుకొని నీ సగం పక్కను ఆక్రమించుకున్న అతన్ని ఓ విరాగిలా చూసి ఈ రాత్రెలా గడుస్తుందో తెలియని అనిశ్చితి, మళ్ళీ ఏ ఫోన్ కాల్‌తో ఎలాంటి ఉపద్రవం విరుచుకుపడుతుందో తెలీని విలవిలతో భారంగా నిద్రలేస్తావు. చల్లని నేలపై కాళ్ళు ఆనించి ఎదురుగా పల్చని ఎర్రగుడ్డ మాటున దాక్కున్న అద్దంలో నీ ప్రతిబింబం మసక మసకగా వ్యక్తావ్యక్తంగా వెక్కిరిస్తుంటే.. రేగిన జుట్టు, ఉబ్బిన కనురెప్పలతో వాచిన మొహం, పాపిట నడుమ గట్టి పడిన గంజిలాంటి తెల్లని పిడచకట్టిన వెంట్రుకలతోనున్న నీ ముఖాన్ని తేరిపార జూడలేవు. నీ మొహంలోకి లోతుగా చూడాలంటే భయపడతావు. ఎంతో అయిష్టంగా ఉంటుంది నీకు.

అంతరంగం అడిగే కత్తిమొనలా వేలాడే ప్రశ్నలకు బదులివ్వలేవు. చటుక్కున అక్కడి నుండి కదులుతావు. మప్ఫై ఐదేళ్ల క్రితం ఇతన్ని పెండ్లి చేసుకోకుంటే..

ఇన్ని సంఘటనలు, ఇంత బాధ అనుభవవశంగాని నొప్పి ఉండేవి గావని మళ్ళీ ఓ పశ్చాత్తాప నిర్వచనాన్ని అన్వయించుకుంటావు. అలా జరిగి ఉండకుంటే బాగుండనని అనిపించిన ఎన్నో సందర్భాలు ఈ ఒడ్డునున్న రాళ్ళను బలంగా ఢీ కొట్టి శక్తి విహీనమై ఏంచేయలేక  తిరిగి వెనక్కి మరలే కెరటాల్లా  మెదడు పొరల్లోనూ, హృదయనాడుల్లోనూ దౌడు తీస్తున్న ఆలోచనల ప్రకంపనలు. ప్రతిరోజూ ప్రతిపూట ఇవే ఆలోచనలు నీలో. నీవెవరికీకీ చెప్పుకోలేకోలేవు! ఎందుకంటే అవతలి వ్యక్తులకు మీ అన్యోన్యత, దాంపత్యం ఒక అద్భుతమనిపిస్తుంది. బహుబాగైన జోడి.. రత్నాల్లాంటి బిడ్డలిద్దరూ వారికేమని బాహాటంగా ఈర్ష్యపడుతూ సూదిలాంటి మాటల్ని వదిలినా..!

వారికి తెలియని  పొదల్ని ముళ్ళు తీగల్ని చుట్టుకున్న నీ జీవన పార్శ్యంలో రగిలే వేదన ఎవరికీ ఎప్పటకీ అర్థం కాదు. చెప్పలేవు, చెప్పకూడని ఒప్పందమనీ కూడా నీ అంతరాత్మ  నీతో గట్టిగా ప్రతిజ్ఞచేయిందిగా. మరి వినయ్ కేమైనట్లు?

ఇన్నాళ్లు, మాధురి జీవితాన్ని నిలబెట్టాలని తనకు సంబంధించిన శారీరక సమస్యను అధిగమించి తను బాగుండాలని అహరహరమూ తపన పడ్డావే! ఈ అంతర్లీన పెనుగులాటలో చిక్కి ఒక్కగానొక్క  మగబిడ్డకు న్యాయం చేయలేకపోయావా? వాడి పట్ల తల్లిగా నీ మమతానురాగాల్ని పండించటంలో విఫలమయ్యావా? భర్త దాచి పెడుతున్న సంగతేమిటి? వాడికిష్టమైన సాకేతతోనేగా పెండ్లి జరిపించింది? వివాహమయ్యాక తలెత్తిన చెప్పుకోలేని సమస్యలలో నవదంపతులు హైరనా పడుతున్నారా? వారిలో సామరస్యం, పరస్పర ప్రేమ, ఆకర్షణ ఏమైనట్లు? ఈ రాత్రి గట్టిగా ఆయన్ని నిలదీయాలని రూఢి పర్చుకున్నావు.

ఉదయమంతా దైనందిన జీవనంతో బిజీగా గడిపిన ఎవ్వరికైనా పొద్దు పోయిందంటే చాలు ఒక ఉద్వేగం, ఉద్విగ్నత అలుముకుంటాయి మనసులో. ఇది అని చెప్పలేని మనో ఉపశాంతిని వెతుక్కునే క్రమంలో ఎన్నో అభిరుచులు రాత్రిని వెలిగిస్తాయి. గదిలో చిక్కగా,మందంగా, మంద్రంగా  పరుచుకుంది రాత్రి. కర్టెన్లను దగ్గరికి జరిపావు. తలదిండుపై ఆనుకున్న రెండు ముఖాల్లో తీరని బతుకు అలసట, మౌనం, ఖేదం, స్తబ్దత ఎప్పట్లగే పల్చని ఎర్రగుడ్డ చాటున దాగిన డ్రెస్సింగ్ టేబిల్ మిర్రర్ ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న  పరిచిత వ్యక్తి ఆగమనానికై నిరీక్షిస్తున్నట్లుగా గంభీరంగా ఉంది. గదిలో చిక్కని మౌనం.. ఒకరి శ్వాస, మరొకరికి వినపడేంత గాఢమైన నిశ్శబ్దం.. రాత్రి తన గరుకు వేళ్ళతో చిక్కుపడ్డ నీ కురులను దువ్వుతున్నట్లు ఆలోచనలను పూర్తిగా ఘనీభవింపజేసుకొని  కొంచెం మెలకువగా మరికొంచెం మాగన్నుగా పక్కమీద బొర్ల బోతున్నావు.. అదిగో అప్పుడే డబుల్ కాట్  బెడ్ కింద బోర్లించి పెట్టిన సెల్ సైలెంట్ గా నీలంరంగు కాంతిని ప్రమాదకరంగా వెదజల్లసాగింది.

ఒక్క ఉదుటుగా లేచిన నీ భర్త సెల్‌ను చెవికానించుకున్నాడు. అంత నిశ్శబ్ద  వాతావరణంలో పావని మాటలు గుండెను కోస్తున్నట్లుగా వినిపించసాగాయి. నీ చేయి అతడి చేయిని గట్టిగా పట్టుకుంది. విషణ్ణమైపోయాడతను. ఇంతకు ముందు నుండీ నువ్వు అడుగుతున్న ప్రశ్నలు, చెప్పలేని జవాబులు, దాచిపెట్టిన అర్థం గాని ఎనిగ్మా లాంటి విషయమేదో నీ కర్ణభేరి పుటలకు ములుకులు ములుకులుగా గుచ్చసాగింది. అతడి మాట, పలుకు, సత్వశోధనలైన వాస్తవాలు ఒక్కటొక్కటిగా నగ్ననిజాలై తమ పొరలను విప్పి  దర్శనం గావిస్తుంటే నీ మాతృ హృదయం  ఉక్కిరిబిక్కిరై పోసాగింది. ఇంతటి కఠిన నిజం, చేదు వాస్తవాన్ని ఎప్పటికి అంగీకరించలేనంటుంది నీ బుద్ధి, మెదడు. జీర్ణం కాని ఆవేదన అంతా నీ నరనరాల్లో సూదుల్లాంటి ప్రకంపనలతో ముళ్ల పొదలై నిన్ను చుట్టబెడుతుంటే పూడుకు పోయిన ఈ దుఃఖాన్ని ఎలా వెళ్లగక్కుతావు?

వినయ్ స్వరంలో అంతులేని ఆవేదన, ఒక డల్‌నెస్, నిస్సత్తువ, పేలవమైన వాడి ముఖం, ఊహించుకోలేక రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని దేవుడెంత కఠినాత్ముడని, మన జీవితాలకు ఇన్ని పరీక్షలేమిటని Sense of belonging తో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. నా బిడ్డలు అనుకున్న నీ పొసెసివ్‍నెస్, నీ లోని మాతృప్రేమ,తల్లితనం బాధ్యత.. అన్నీ బరువెక్కిన బంధాలై..ఇక వద్దు చాలు అనిపించేంత వెగటుగా ఎడారి స్వప్నాలై ఇవన్నీ దారిదొరకని ఇసుక లోయల్లో ఖననమైతే చాలనిపించే మనోవైకల్యం నిన్నావహించింది. నీ భర్త మాట్లాడిన ఆ రెండు మాటలే వెయ్యి బాంబుల మోతతో.. వంద శతఘ్నులు పేలినట్లుగా నరనరాన ప్రకంపనల్ని ప్రజ్వలింప జేస్తుంటే రగులుతున్న నీ గాయానికి ఏ లేపనంతో పట్టీ వేసుకుంటావు?

ఓర్చుకునే  శక్తి లేని బాధ ఒళ్ళంతా కమ్మివేస్తుంటే జ్వరమానిని నూటనాలుగు ఫారన్ హీట్లతో నీ శరీరాన్ని పులియబెడుతుంటే రేపటి దినాన్ని ఎలా మొదలుపెడతావు? ఒక పోరాటం నుండి ఇంకో  పోరాటం.. నెవర్ ఎండింగ్ ప్రాసెస్, విసుగు, విరామం లేని జీవన సమరంలో చెర్నాకోల ఝళిపిస్తున్న తట్టుకోలేని నిజం. మనస్సు, శరీరం, బుద్ధి అంగీకరించడానికి మారాం చేసే నిజం. “వినయ్ కూ, మాధురిలాగే ఐంది. స్పెర్మ్ కౌంట్ లేదు. పిల్లలు పుట్టరని తెల్సింది.. ఏం చేస్తాం?అంతా మన బ్యాడ్ లక్. ఇద్దరు పిల్లలకు ఇలా జరగటం మన దురదృష్టం.” పొడిపొడిగా మాట్లాడి అటు తిరిగిన అతడేమాత్రం ఊహించలేకపోయాడు.. నీలోని మాటల్లేనితనాన్ని.. శిలలా బండబారి స్పందన కోల్పోయిన నీ హృదయాన్ని అతడేమాత్రం అంచనా వేయలేకపోయాడు. అతడొక ఐస్‍బర్గ్ లాంటి వాడు కనుక.. మగవాడై బతికి పోయాడు కనుక.. నీవు ఆడదానివి కనుక నీవు అనుభవించిన ప్రసవపు నొప్పి, చన్ను కొరికిన బిడ్డ పట్ల చంపుకోలేని ప్రేమ నీలో ఇంకా సజీవంగా ఉన్నాయి కనుక, సున్నితత్వం, ఆలోచనల్లోని అమాయకత, అన్ని జమిలిగా అలుక్కుపోయాయి నీలో. అతడికేం తెలుసు?

అటువైపు తిరిగిన నీవు గదిలో సముద్రంమై  పోటెత్తుతున్నానని.. నీలో అలవిగాని దుఃఖం తనువెల్లా ఆక్రమించి గుండెగూటిని ఉప్పెనల్లే కమ్మేసిందని! నీలో శరాఘాతం లాంటి ఆలోచనలు, అంగీకరించబడని నిజాలు.. దిండు లోకి నిశ్శబ్దంగా ఇంకుతున్న కన్నీటి చారికలు తవ్వుకుంటున్నా కొద్దీ దుఃఖమే! ఒలకబోసుకుంటున్నా కొద్దీ  తరగని వ్యథనే..! ఐనా అతన్ని పోరుతున్నావు. బాబును బెంగుళూరు నుండి రమ్మని ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకునేలా చూడమని. ఎవరి తప్పు లేకుండా జరిగిన విషయమిది. మర్చిపోవాలని నీ మనస్సెంత ఊరుకోబెడుతున్నా ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్న గతం.. వర్తమానంలోని అనిశ్చితి. కాలానికి ఎదురీదుతున్న మనసు అవస్థ.. అత్యంత కఠినంగా సవాలును  విసురుతున్న రేపటి సమస్యను మళ్ళీ ఎలా నరుక్కురావాలి? అసలు ఏ కుటుంబంలోనైనా ఇలాంటి సమస్యలు వస్తాయా? వస్తే గిస్తే, ఆర్థికమూ, ఆరోగ్య విషయాల్లో తలెత్తేవి కావచ్చు. మనసు అవు తందాని అక్కడి.  ఇలా కొడుకుకు పెళ్ళి అయ్యాక తెల్సిన ఈ సమస్యను వాడు ఎలా స్వీకరిస్తున్నాడు? కోడలు అంగీకరించడానికి ఎంతగా ఆందోళన చెందుతుందని? ఆమె తరపున తల్లితండ్రులు ఎంత మ్రాన్పడిపోయి ఉంటారు? పైగా ఇద్దరు ఏరికోరి చేసుకున్న వివాహమాయే! ఒకరికి పిల్లలు పుట్టారని తెల్సినా వదులుకోలేని బంధం.

లోపాన్ని ఎత్తి చూపి మనసును విరిచేసి పారిపోయే మనిషి బంధానికి ఏం విలవనిస్తాడు? ఈ విషయంలో మాధురిని అద్భుతంగా చూసుకుంటున్న రాకేష్ మంచి మనసును మెచ్చుకుంటావు. కోడలు అలాగే ఉండాలనుకుంటావు. ఈ క్రమంలో తననుండి ఎలాంటి వ్యతిరేకత, దురుసు సంభాషణను ఊహించలేవు. అలజడికి లోనవుతావు. అశాంతిగా అయిపోతావు. మళ్ళీ ఫోన్ కాల్.. మళ్ళీ అదే విలవిల.

మొన్న సాకేత  ఈయనతో  సంభాషించిన విషయం విని నీ మనసు కుదుట పడింది కదూ! హైదరాబాద్‍లో డాక్టర్ అప్పాయింట్ మెంట్ తీసుకున్నారని “మామయ్యా! మీరు రండి” అని చెప్పినపుడు లోన ఎంతో కంగారుగా ఉన్నప్పటికీ.. ఆయన్ను పంపించి నీవు క్షణమొక యుగంలా  గడిపావు. ఆ రోజు మాధురిని చూసిన డాక్టరమ్మ అడిగిన మొదటి ప్రశ్న తిరిగి వినయ్‌ను చుస్తున్న ఈ డాక్టర్ అడిగిన మొదటి ప్రశ్న అదే..! కాకపోతే అప్పుడు నువ్వు ఇప్పుడు మీ ఆయన చెప్పిన సమాధానం మాత్రం ఒక్కటే..!! ఔను మాది మేనరికమేనని, అదిగో అదే శాపమైంది నీ బిడ్డల పాలిట  అన్పించింది కదా నీకు. అందరికీ జరగనిది ఎక్కడ కొన్ని కేసుల్లో జరిగే నష్టంలో నీ బిడ్డలు ఉండటం నీ ప్రారబ్ధం..! ఎన్నోసార్లు అదే మాట తల్చుకొని ఆ దుఃఖం నుండి బయటకు  రావాలని విఫల యత్నం చేస్తావు.

నీకెంత బాధ, నొప్పి ఉందో అతనికీ అంతేనని తెల్సుకోకుండా అలా నెపాన్ని చుట్టూ తిప్పి తిప్పి  ముఫ్ఫైఐదేళ్ల కిందటి నీ మేనరిక వివాహానికి ఆపాదిస్తూ ఇలా ఇన్ని జీవితాలతో ఆడుకుంటున్న విధి వైపరీత్యాన్ని అసలు జరుగకుండా  మిగిలిపోయిన ఏవో సంగతుల గురించి  ఇప్పుడు మళ్ళీ ఆలోచించుకోవడం, అలా అతడ్ని వివాహం చేసుకోకుండా ఉంటే  ఇన్ని తలనొప్పులు, నీ బిడ్డలకింత బాధ ఉండదు కదా అనుకోవడం బాధపడటం ఏమంత అవసరం నీకు?

ఇప్పుడు మళ్ళీ  కథ మొదలు.. శక్తి , సత్తువ, ఉత్సాహం లాంటి వనరులన్నింటిని సమీకరించుకొని వినయ్, సాకేత జంట బాగుండాలని కోరుకుంటావు. వాళ్ళు హాస్పిటల్‍౬కు చెకప్ లకు వెళ్లి వచ్చినపుడల్లా గుండెదడనే నీకు.  మాధురి విషయం వాడికి చెప్పినా తాను బయాలజికల్ ఫాదర్‌ను కాలేకపోతున్నాననే వ్యథతో నిరాశ మనస్సుతోనున్న వినయ్‌ను నీ మాటలేవీ  సాంత్వన పర్చడం లేదు. మళ్ళీ  టెస్టులు, రిపోర్టులు, హాస్పిటల్  బిల్లులు లక్షల్లో.. రోజులు గడిచి పోతున్నాయి. వారిద్దరి మధ్య ఏ రాత్రి ఏ కీచులాట మొదలవుతుందోనన్న గుండెదడ, రాత్రిపూట అతడి ఫోన్ మోగిందంటే.. ఒక రకమైన డిప్రెషన్ లోకి కూరుకు పోవటం నీవసలు  మర్చిపోలేవు.

కాలం చేస్తున్న గాయపు మరకలు నీకు కొత్త కావు. అతడితో గడిపిన అద్భుతమైన రాత్రులు.. అవి అందించిన ఆనందకర క్షణాలు.. భవిష్యత్‌లో తీరని గాయాలై కుంపట్లను రాజేస్తాయని తెలియనితనం. ఎవరికైనా పుట్టబోయే బిడ్డలు ఎలా ఉంటారు? వారు ఏం చేస్తారు? వారితో ఎన్నెన్ని చిక్కులు? అని ఆలోచిస్తే అసలు దాంపత్య బంధమే నిలవదు. వివాహవ్యవస్థనే కూలిపోతుంది. మధ్యలో వచ్చి చేరిన పిల్లలు వారి పెంపకం తల్లి తండ్రులకు కొన్ని జ్ఞాపకాలని అందిస్తాయి. చివరికి ఒకరికొకరుగా మిగిలిన చీకటి ముసిరిన ఒంటరితనంలోకి జారిపోక తప్పదు. గదిలో ఎప్పటిలా ఒంటరిగా మీరిద్దరే పడకమీదికి చేరి చెరోవైపు ఒత్తిగిల్లారు. నీలంరంగును ప్రశాంతంగా వెదజల్లుతున్న జీరోబల్బు. సెక్సు లేని ప్రేమ, స్నేహం, బంధం ఇవేగా నీకంటూ చివరికి మిగిలాయి. అతడి పట్ల ప్రేమ నీ బిడ్డల పట్ల బాధ్యత ఒక్కటే. ఒక్కసారంటూ పుట్టాక చివరి వరకు నాశనమవకుండా మిగిలిఉంటాయి. నువ్వు ఎప్పుడూ అనుకుంటావు.. మనుషులు కూడా కొన్నిసార్లు జీవితాల మీద పట్టు వదిలేసి ఏ గమ్యం లేకుండా స్వేచ్చగా జీవించే స్థితికి చేరుకుంటారని.. అతి బాధను కూడా అధిగమించి అది పంచే వేదనను మర్చి ఒక మనో ప్రశాంతతను జీరో ఐన ఆలోచనలతో ఒక ఉపశాంతిని పొందడమే జీవితమని..! ప్రేమ, బంధం, స్నేహంతో జీవితాలని పంచుకోవటమని నీకు స్పష్టంగా తెల్సిపోయింది.

గదిలో మళ్ళీ సెల్ మోగింది. అతడిలో ఎలాంటి తొట్రుపాటు లేదు. నీలం రంగు నీ ముఖాన్ని వెలిగిస్తోంది. నీరవ నిశ్శబ్దంలో సాకేత మాటలు స్పష్టంగా విన్పడుతున్నాయి. ఫోన్లో స్వరం మారింది. వినయ్  గొంతులో అప్పటి దుఃఖం లేదు. మాట బలంగా, విశ్వాసంగా పలుకుతున్నాడు. మూడు నెలలు వాడాల్సిన ట్రీట్మెంట్ బహుశా ఆ ట్రీట్మెంట్ ఇచ్చే సక్సెస్ అనే ప్రేరణ వారి గొంతులో ఆనందాన్ని ఒంపసాగింది. గదిలో కనిపించని జ్ఞాపకాల పరిమళమేదో నిన్ను చుట్టబెట్టింది. ఏదో చిన్న ఆశ లోపలెక్కడో కదిలినట్టు అనిపిపించింది నీకు. మూసిన తలుపుల వెనుక జీరోలైటు చీకటిని పారదోలుతూ మిణుకు మిణుకుమంటూ వెలగసాగింది.. నీ మదిలో గదిలో..

Exit mobile version