Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గద్వాల సంస్థానము – కామసముద్రం అప్పలాచార్యులు

[డా. పి. సావిత్రి సాయి గారు రచించిన ‘గద్వాల సంస్థానము – కామసముద్రం అప్పలాచార్యులు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

శ్రీ కామసముద్రం అప్పలాచార్యులుగారు కవి, సంగీతకారుడు. ఇతడిని ‘ఆంధ్ర జయదేవ’గా పేర్కొంటారు. అతడు సంగీత-సాహిత్యాలలో దిట్ట. ఇతడు 17వ శతాబ్దంలోని పెదసోమభూపాలుని ఆస్థానంలో సంగీత విద్వాంసుడిగా సేవలందించాడు. అప్పలాచార్యుడు కౌండిన్యస గోత్రికుడు. శ్రీనివాసాంబ, కృష్ణమాచార్యుల పుత్రుడు. అహోబిల శ్రీనివాసుని శిష్యుడు. మహారాజుగారి కోరిక మీద జయదేవుడు రచించిన ‘గీతగోవిందం’ సంస్కృత కావ్యంలోని 12 సర్గలు, 24 అష్టపదులు, 32 శ్లోకాలను తెలుగులోకి ‘శ్రీకృష్ణ లీలాతరంగిణి’ గా రచించాడు.

ఈతడు గద్వాల సంస్థానాధీశులు చినసోమభూపాలుని ఆస్థానకవిగా ఆయన కోరిక మేరకు యథాశ్లోకతాత్పర్య రామాయణంలోని వివిధ కాండలను రచించారు. అలాంటివారిలో తిరుమల కృష్ణమాచార్యుడు సుందరకాండను 3 ఆశ్వాలలో రచించారు. చతుర్విధ కవితా నిర్వాహకులైన కామసముద్రం అప్పలాచార్యులు కిష్కింద కాండని 3 ఆశ్వాలుగా రచించడమే గాకుండా ఈ రామాయణానికి అవతారికని కూడా రచించాడు.

అష్టపది:

ఒకనాడు సోమభూపాలుడు కొలువుదీర్చి ఉన్నపుడు అప్పలాచార్యులవారిని పిలిపించి జయదేవుని అష్టపదులను తెలుగులో మార్చవల్సిందిగా కోరాడు. జయదేవుడు అష్టపదులకి యావద్భారత దేశంలోనూ ఖ్యాతి ఉంది. అవన్నీ సంస్కృతంలోనే ఉన్నా.. ఏ భాషకా భాషవారు ఇవి తమవేనేమో అనుకునేంతగా జనజీవితంలో మమేకమైపోయిన గీతాలు. వాటిని అనువదించే ముందు అతను ముందు జయదేవుని జీవితం, ఆయన సాహిత్యాన్ని, ఔపోసన పడదాం అనుకుని కృష్ణుణ్ణి మనస్సులో స్మరించుకుని, జయదేవుడు పుట్టిన ఊరు ఒరిస్సాలోని ‘కిందుబిల్వం’ అనే ప్రదేశానికి వెళ్ళి ఆ మట్టిని చేత్తో పట్టుకొని ముద్దెట్టుకున్నాడు. జయదేవుడి తల్లితండ్రులైన భోజదేవుడు, రమాదేవి తమ పిల్లాణ్ణి ఊయలలూపిన ప్రదేశానికి వెళ్ళి ఆనందంలో ఊగిపోయాడు. జయదేవుడి గీతాలకి నాట్యం చేసిన ఆయన, పద్మావతి నర్తించిన మండపాల మీద కూర్చుని అరచేతుల్తో ఆ గచ్చు తుడిచాడు. అన్ని చోట్ల కృష్ణ దర్శనం, కృష్ణ స్మరణం, జరిగిపోతోంది అప్పలాచార్యులకి. మొత్తానికి జయదేవుడి గీతగోవిందం కళ్ళకద్దుకున్నాడు. 12 సర్గలు, 24 అష్టపదులు, 72 శ్లోకాలలో ఉన్న గీతగోవిందంలో మధుర శృంగార భక్తిని.. ఆస్వాదించి, దీన్ని తెలుగులో రాయడానికి శ్రీకారం చుట్టాడు. జయదేవుని ఆత్మని ఆవిష్కరించుకుని కొన్ని అవే రాగాలు ఉంచేసి, కొన్ని సౌలభ్యాన్నిబట్టి రాగాన్ని మార్చి మొత్తానికి, ‘శ్రీకృష్ణలీలాతరంగిణి’ అనే ఆంధ్రాష్టపదిని పూర్తిచేసాడుట! వాస్తవానికి ఈ ‘కృష్ణలీలాతరంగిణి’ సంస్కృత కావ్యాన్ని నారాయణతీర్థులు రచించారు. అయితే కామసముద్రంవారు దీన్ని తెలుగులోకి అనువదించి, సులభ శైలిలో ఆంధ్రాష్టపది (తరంగిణి)గా మలిచారు. శ్రీకృష్ణుని లీలలను వర్ణిస్తూ, అలల (తరంగాల) వలె ఒకదాని తర్వాత ఒకటిగా ప్రవహించే భక్తిగీతాలు లేదా శ్లోకాల సమాహారాన్ని ‘కృష్ణలీలాతరంగిణి’ అంటారు. భారతీయ సంగీతంలో ఇది అత్యంత ప్రసిద్ధిచెందిన ఒపేరా లేదా నృత్యనాటక రూపకం.

‘గోత గోవిందం’ జయదేవుడు రచించిన సంస్కృత కావ్యం. దీన్నే అష్టపదులు అని కూడా అంటారు. ఈ కావ్యం రాధథాకృష్ణుల మధ్య ప్రేమను, విరహవేదనని వర్ణిస్తుంది. మన దేశంలో 12వ శతాబ్దంలో జన్మించిన ఈ కావ్యం భారతదేశమంతటా ప్రాచుర్యం పొందింది. సంగీత, నృత్య రూపకాలలో ఈ అష్టపదులను తరుచుగా ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా అస్సాం, ఒడిషాల లలితకళలపై గీతగోవిందం ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

జయదేవుని గీతగోవిందంలో మొత్తం 83 గీతాలున్నాయి. మొత్తం 12 భాగాలు, ఒక్కొక్క భాగాన్ని 24 ప్రబంధాలుగా విభజించారు. ప్రబంధాలలో అష్టపదులు కన్పిస్తాయి. అంటే ఎనిమిది పదాలు, లేదా ఎనిమిది శ్లోకాలు కల్గింది కావున ఈ శ్లోక నిర్మాణానికి అష్టపదులని పేరు.

గీతగోవిందం:

ఇది జయదేవుని గొప్పకావ్యం. రాధకృష్ణుల ప్రేమ తత్వమును గూర్చి అష్టపదులుగా రచించిన మహానుభావుడు. అది 12 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయం 24 ప్రబంధాలుగా విభజింపబడింది. ఒక్కొక్క ప్రబంధంలో ఎనిమిది ద్విపదలు ఉంటాయి. వీటినే అష్టపదులు అంటారు. ఈ గ్రంథములో 24 అష్టపదులు, 80కి పైగా శ్లోకాలు కలిగి, 12 సర్గలతో వ్రాయబడెను. గోవిందుని గూర్చి రచింపబడిన గేయ ప్రబంధమగుటచే దీనికి ‘గీతగోవిందం’ అని పేరిడిరి. ఈ అష్టపదులు నాయక, నాయకీ నటులచేత పాడబడినట్లు రచింపబడ్డాయి. దీనిలో 19వ అష్టపది ‘దర్శనాష్టపది’ అనీ ‘సంజీవినీ అష్టపది’ అని చెప్పబడింది. ఇది రాధాకృష్ణుల ప్రణయ తత్త్వమే పరమార్థంగా భావించే, నింబార్కుడి వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఉన్న కావ్యం. దీనికే ‘ఆంధ్రాష్టపదులు’ అని కూడా వ్యవహారనామం ఉంది.

నవవిధ భక్తి మార్గాల్లో పిత్రాపుత్ర, రక్ష్యరక్షక, ఆధారధేయ, శరీరాత్మ, జ్ఞాతజ్ఞయ, భోక్తృభోగ్య, స్వస్వామి, భార్యాభర్తృ, శేషశేషి అను మార్గాలలో భార్యభర్తృ భక్తిమార్గం ‘గీతగోవిందం’ లో జయదేవుడు నిరూపించాడు.

జయదేవకవి రాధను ఇంద్రాణి అంటూ తన జయదేవస్వామి చరిత్రలో ఈ విధంగా పేర్కొన్నారు. తొల్లి ఒకప్పుడు స్వర్గరాజ్యరమ్యమైన ఇంద్రాణి వైకుంఠధాముని దర్శించటానికి వెళ్ళి అతని నవమన్మథ మన్మథాకృతిని దర్శించినంత మాత్రాన మోహబాణ పాతాలకు పాలై స్వామిని చూచి “ఓ దీనమూర్తిహరా! నన్ను నీ ఉత్సంగానికి ఆశ్రితురాలిగా చేయవే” అని ప్రార్ధించింది. భగవంతుడు ఆమెను చూచి “నేను సాధు సంత్రాణ శీలుడనై కృష్ణాఖ్యతో భూమిమీద అవతరిస్తాను. నీవు రాధగా జన్మించి నీ మనోరధసిద్ధి పొందుదువు గాక” అని అనుగ్రహించాడు.

జయదేవుడు శ్రీకృష్ణుని పరబ్రహ్మ స్వరూపంగా పూజించెను. ఈ గీతగోవిందాన్ని శృంగార రసంతో, మధుర భక్తితో, నాయకనాయికీ భావంతో స్తుతించాడు. ఇందు రాధ నాయకి, జీవాత్మ. కృష్ణుడు పరమాత్మ. సఖ – ఈ సఖి జీవాత్మను ముక్తి పథంలో నడిపించి పరమాత్మలో లీనము చేయడానికి తోడ్పడుతుంది. ఇదే గీతగోవిందంలోని సారాంశం.

కామసముద్రం అప్పలాచార్యుల అనువాద శైలి:

జయదేవుని అసలు సంస్కృత ‘గీతగోవిందం’లో 12 సర్గలు, 24 అష్టపదులు మరియు 72 శ్లోకాలు ఉన్నాయి. కానీ కామసముద్రం అప్పలాచార్యులు వీటిని తెలుగులోకి అనువదిస్తూ ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరించారు.

మూలగ్రంథంలో ప్రతి సంస్కృతశ్లోకానికి సమానమైన అర్థం అచ్చేలా ఒక తెలుగు పద్యం (కందం, ఉత్పలమాల లేదా చంపకమాల వంటి ఛందస్సులో) రచించారు.

ఎనిమిది చరణాలు కలిగి ఉండే ప్రతి అష్టపదిని, తెలుగు నాట్య విద్వాంసులకు మరియు గాయకులకు అనుకూలంగా ఉండే విధంగా పాటగా, చూర్ణికలు, దరువులు మరియు కీర్తనల రూపంలోకి మలిచారు.

అష్టపదుల ముఖ్య ఉద్దేశం:

ఈ కావ్యంలోని ప్రధాన ఇతివృత్తం రాధకృష్ణుల ప్రణయ వృత్తాంతం. దీనికి అప్పలాచార్యులవారి తెలుగు వివరణ ప్రకారం ఇది కేవలం లౌకికమైన శృంగార కావ్యం కాదు; ఇది మధురభక్తి మరియు తద్వారా జీవాత్మ-పరమాత్మల అనుసంధానికి ప్రతీక ఇది.

రాధ (జీవాత్మ) భగవంతుని కోసం పరితపించే మానవ ఆత్మకు ప్రతిరూపంగాను; కృష్ణుడు (పరమాత్మ) సర్వవ్యాప్తి అయిన భగవంతుని రూపానికి ప్రతిరూపంగాను; చెలికత్తెలు (సఖులు) జీవుడిని దేవుని వైపు నడిపించే గురువుల వంటివారు.

ఈ గ్రంథంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని అష్టపదుల అంతరార్థాన్ని అప్పలాచార్యుల వారు తెలుగులో ఏ విధంగా అర్థాన్ని వివరించారో ఉదాహరణకు క్రింద వివరించడం జరిగింది.

1. ‘ప్రళయ పయోధి జలే’ (దశావతార కీర్తనం):

లోకాన్ని రక్షించడానికి శ్రీమహావిష్ణువు ఎత్తిన పది అవతారాలను కీర్తిస్తూ, దుష్టశిక్షణ-శిష్టరక్షణ ఎలా జరిగిందో ఇందులో అందంగా వర్ణిస్తారు.

2. ‘చందనచర్చిత నీలకళేబర’ (రాసలీలల వర్ణన):

శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి జరిపిన వసంతోత్సవ లీలలను, ప్రకృతి అందాలను అప్పలాచార్యులు అచ్చ తెలుగు పదాల సొగసుతో రసవత్తరంగా అనువదించడం దీని ప్రత్యేకత.

3. ‘ప్రియే చారుశీలే- (అనునయకీర్తన) :

రాధ అలకను తీర్చడానికి శ్రీకృష్ణుడు ప్రార్ధించే ఈ ఘట్టాన్ని తెలుగులో శృంగార, భక్తి రసాలు ఒలికేలా మలిచారు. కృష్ణుడే స్వయంగా రాధ పాదాలను తన శిరస్సుపై ఉంచుకోమనే పరమార్థం – భక్తుడికి అదీ పరమ భక్తి పారవశ్యం కలిగినవారికి భగవంతుడు లొంగిపోతాడనే అంతరార్థాన్ని ఇస్తుంది.

జయదేవుని అష్టపదులు అత్యంత క్లిష్టమైన సంస్కృత పదబంధాలతో కూడి ఉంటాయి. అప్పలాచార్యులు వీటిని తెలుగులోకి అనువదించడమే గాకుండా, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలలో అభినయించడానికి వీలుగా చరణాలను, యతులను, ప్రాసలను కూర్చి సంస్కృత కావ్యాన్ని ఒక గేయ ప్రబంధంగా (సంగీత రూపకం)గా మార్చారు.

17వ శతాబ్దంలో కర్ణాటక సంగీత నియమాలకు లోబడి, రాగలక్షణాలను దెబ్బతీయకుండా అష్టపదులకు సరికొత్త స్వర కల్పన చేసారు. సంగీతంతోపాటు సాహిత్య శాస్త్రంలోను ఆయనకున్న అపారమైన పాండిత్యానికిగాను ఆయన గద్వాల దర్బారులో ‘విద్వత్కవికుంజర’ (పండితులలో ఏనుగువంటివాడు) మరియు ‘చతుర్విధకవితావిశారద’ అనే బిరుదులతో సత్కరించబడ్డారు. పెదసోమభూపాలుని కాలం నుండి కేవలం కవిగానే కాకుండా సంగీత, విద్వత్సభలను నడిపించే ప్రముఖ న్యాయనిర్ణేతగా ఆయన వ్యవహరించేవారు. అటువంటి మహనీయుని కీర్తి ఆచంద్రతారార్కం నిలిచి వుంటుంది.

ఆధార గ్రంథాలు :

  1. ‘ఆంధ్ర అష్టపదులు’ – శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు
  2. ‘శ్రీ కృష్ణలీలీతరంగిణి’ – తెలుగు అనువాదం – డా. ఉండేకోడు రత్తయ్య
  3. ‘ఆంధ్రసంస్థానములు-సంగీత వాజ్ఞయము’ – డా. చల్లా విజయలక్ష్మి
Exit mobile version