Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గణపతి బప్పా మోరయా!!!

[2026 సెప్టెంబర్ 14 వినాయక చవితి పర్వదినం సందర్భంగా కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘గణపతి బప్పా మోరయా!!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

 

జూలై 1893

వెరావల్ గ్రామం, ప్రభాస్ పటాన్, కథియావార్

ఆశన్న ఉషన్న అన్నదమ్ము లోయి..
అల్లా నేరేడు లోయి..
సక్కని చందమామ సాదురుల్లా లోయి..
కర్బలా అడవిలోన కదనమే జరిగిందోయి..”

తాజియా’లు పట్టుకుని ఊరేగింపుగా బయలు దేరిన ఇస్లామీయులు, ఇమామ్ హసన్ (ఆశన్న), ఇమామ్ హుస్సేన్ (ఉశన్న) ల బలిదానాన్ని స్మరిస్తూ పాటలు పాడుతున్నారు. కొందరు తమని తాము గాయపరుచుకుంటూ, ఇమామ్‌ల త్యాగాన్ని తలచుకుని దుఃఖిస్తున్నారు. రోదిస్తున్నారు. ముస్లిములే కాదు, హిందువులు కూడా వారితో పాటుగా ఊరేగింపులో పాల్గొన్నారు. ఇది కేవలం ముస్లిముల పండుగ కాదు, భారతీయుల పండుగ అనిపిస్తున్నది, హిందూ ముస్లిములు కలసి పెద్ద ఎత్తున ఎలాంటి భేదాలు లేకుండా ఉత్సాహంగా పండుగలో పాల్గొనటంతో.

కత్తుల గిరికీలు కొట్టేరయా.. ఆశన్న ఉషన్న లోయి..

రక్తపు ఏరులు పారేనయా.. అల్లా నేరేడు లోయి..”

పాట పాడుతున్నా కొద్దీ, ఇమామ్ సోదరుల వీరోచిత గాథ వినిపిస్తున్నకొద్దీ ఆవేశం పెరుగుతోంది. దుఃఖం పెరుగుతోంది. తీవ్రమైన దుఃఖం వల్ల కలిగే తీవ్రమైన ఆవేశం కలుగుతున్నది.

రోదనల తీవ్రత పెరిగింది. శరీరాలపై పడే దెబ్బల తాకిడి తీవ్రత పెరిగింది. ఇమామ్ సోదరులకు జరిగిన అన్యాయం పట్ల ఆవేశం పెరుగుతోంది.

మామూలుకన్నా ఎత్తుగా ఉన్న తాజియాలు దీపాల వెలుగులో గంభీరంగా కనిపిస్తున్నాయి.

తాజియా అనేది ఇరాక్ లో ఉన్న ఇమామ్ హుస్సేన్ పవిత్ర సమాధి (మక్బరా)  నమూనా.

వెదురు కర్రలు, రంగుల కాగితాలు, అద్దాలు, జరీతో సహా ఇతర అలంకరణ సామగ్రితో కళాత్మకంగా తయారు చేస్తారీ తాజియాలను. మామూలుగానే ఎత్తుగా ఉండే తాజియాలు ఈ సంవత్సరం మామూలుకన్నా మరింత ఎత్తుగా తయారు చేశారు.

ఈసారి తాజియాలను నిమజ్జనం చేయాలన్న నిర్ణయం విషయంలో స్థానికంగా ఉన్న హిందువుల వ్యతిరేకతను బ్రిటిష్‌వారు పట్టించుకోలేదు. హిందువుల వ్యతిరేకత, దాన్ని బ్రిటిష్ వారు కాదనటం ఇస్లామీయులకు ధైర్యాన్ని ఇవ్వటంతో పాటూ, హిందువులపై ఆగ్రహాన్ని కలిగించింది. హిందూ ముస్లిమ్‌ల ప్రతి వివాదంలో ప్రభుత్వం ముస్లిములనే సమర్ధించటం హిందువులలో బ్రిటిష్ వారిపై నిరసనను కలిగించింది.

ఆ సమయంలో  జునాగఢ్ పాలకుడు ఇస్లామీయుడు. స్థానిక పాలనాధికారులకు ఎట్టి పరిస్థితుల్లో శాంతి భంగం కాకూడదని ఆజ్ఞాపించాడు. దాంతో స్థానిక అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రదర్శన ఏ బాటను అనుసరించాలో స్పష్టంగా నిర్దేశించారు. భక్తులు ఆ బాట నుంచి పక్కదారి పట్టకుండా అన్ని ఏర్పాటుచేశారు.

ఊరి పొలిమేరలు దాటిన తరువాత ఉన్న జలాశయం లోతును పెంచారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఊరేగింపు వెంట ఉంటూ అప్రమత్తంగా ఉన్నారు అధికారులు.

ఊరేగింపు ఊరి పొలిమేరలు దాటి జలాశయాన్ని సమీపిస్తున్నది.

అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

నిమజ్జనానికి ముందు ఆగింది ఊరేగింపు.

వాయిద్యాల మోత తీవ్రమయింది.

విషాద సూచక ధ్వనులు తీవ్రమయ్యాయి.

శరీరంపై పడుతున్న దెబ్బల ధ్వనులు వాయిద్యాల మోతలకు ప్రతిధ్వనుల్లా ఉన్నాయి.

వాతావరణం హద్దులు దాటుతున్న ఆవేశ, విషాదాలతో నిండిపోయింది.

అంతలో అనూహ్యంగా కొందరు వారికోసం నిర్దేశించిన బాట వదలి పక్క బాటలోకి పరుగెత్తారు. ముందు చుక్కలుగా, తరువాత బొట్లు బొట్లుగా, ఆపై ధారలా, తరువాత ప్రవాహంలా, వెల్లువలా  మారినట్లు అసలుదారి వదిలి పరుగెత్తేవాళ్ళ సంఖ్య పెరిగింది.

అక్కడ ఉన్న పోలీసులు వారిని అదుపులో పెట్టలేకపోయారు.

అడ్డుపడ్డ పోలీసు అధికారులపై రాళ్ళు రువ్వటం ఆరంభమయింది.

***

దేహోత్సర్గ్ తీర్థం

మందిరంలో సాధువులు ధ్యానంలో ఉన్నారు.

మందిరంలో ఒక మూల మంత్రాలు వల్లెవేస్తున్న విద్యార్థులున్నారు.

ఒకవైపు భజనలు పాడుతూ మాలలల్లుతున్న మహిళలున్నారు. పూజారి పూజలో నిమగ్నమైవున్నాడు.

ప్రశాంతంగా, పవిత్రంగా ఉన్న వాతావరణం దూరంగా ముంచేందుకు వస్తున్న అలల శబ్దంలాంటి శబ్దంతో భంగమయింది.

కుక్కల అరుపులు వినిపించాయి. ఏదో వేటాడే గుంపు పరుగులెత్తుతూ వస్తున్న శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతోందో అక్కడి వారికి అర్ధమయ్యేలోగా మారణాయుధాలు పట్టుకున్న ముస్లిముల మూక మందిరంపై దాడి చెసింది.

చేతిలో ఉన్నదానితో కనబడినవాడిని కొట్టటం ఆరంభమయింది. అక్కడున్న  చిన్న చిన్న మందిరాలను తగులబెడుతున్నారు.

ప్రశాంతంగా ధ్యానంలో ఉన్న సాధువులను ఈడ్చి లాగి కొట్టి  చంపారు. కొందరిపై కిరోసిన్ పోసి తగులబెట్టారు.

పవిత్రంగా, ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం క్షణాలలో అపవిత్రమై, అశాంతిమయమై శవాలు, బూడిదల స్థలంగా మారిపోయింది.

మొత్తంగా పదకొండుగురు హిందువులు, ఇద్దరు ముస్లిములు ప్రాణాలు కోల్పోయారు. ఇరవై మంది దాకా గాయాలపాలయ్యారు. అనేక మందిరాలు, ఇళ్ళు పరశురామప్రీతి అయ్యాయి.

***

జునాగఢ్‌లో జరిగిన మతకల్లోలాలలో నష్టపోయిన హిందువుల సహాయార్థం బొంబాయిలోని గుజరాతి హిందువులు సమావేశాలు జరిపి, హింసను ఖండించారు. ఈ మత కల్లోలాల్లో నష్టపోయిన హిందువుల సహాయార్థం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ముస్లిములు కూడా, గాయపడిన ముస్లిముల సహాయార్ధం, పోలీసు కేసుల్లో ఇరుక్కున్న ముస్లిములకు చట్టపరమైన సహాయం చేయటం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

***

ఉద్విగ్నతలు అంతర్గతంగా ఉన్నా, బాహ్యంగా పరిస్థితి చక్కబడుతున్నట్టు అనిపించింది.

ఇంతలో ఒక శుక్రవారం నాడు, ప్రార్థనలు పూర్తి చేసుకున్న ముస్లీములు, జామా మసీదునుంచి ‘దీన్, దీన్’ అని అరుస్తూ బయటకు పరుగెత్తుకు వచ్చారు. పలు రకాల మారణాయుధాలతో వారు హనుమాన్ లేను లోకి దూసుకువెళ్ళారు. అక్కడ ఉన్న హనుమాన్ మందిరం పైన దాడి చేశారు.

వారిని ఆపాలని ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్ళను బాణాలుగా విసిరారు. ప్రక్కనే ఉన్న భవన నిర్మాణ స్థలంలోని టైల్స్ తీసి మిస్సైళ్ళుగా పోలీసులపైకి విసిరారు. హిందువు అన్నవాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ వెతికి వెతికి చంపేశారు. ట్రామ్ లోకి ఎక్కి ట్రామ్‌లలో ప్రయాణిస్తున్నవారినీ చంపారు.

ప్రతిగా, మరుసటి రోజు ఉదయం మహారాష్ట్ర మిల్లుల్లో పనిచేసేవారు ముస్లిములపై దాడి చేశారు. పలు చోట్ల ముష్టియుద్ధాలయ్యాయి. వీధులు మానవ వధా వేదికలయ్యాయి. అరుపులు కేకలతో బొంబాయి వణికి పోయింది. చివరికి సైన్యాన్ని పిలవాల్సివచ్చింది.

ఈ మారణకాండలో మొత్తం ఎనభై మరణాలు, పదిహేనువందల సంఖ్యలో మనుషులకు గాయాలు అయ్యాయి.

ఇంత తీవ్రమైన రీతిలో హింస గతంలో ఎప్పుడూ చెలరేగలేదు.

***

‘కేసరి’ పత్రిక ఆఫీసులో కూర్చున్న ఆ  అయిదుగురి ముఖాలు గంభీరంగా ఉన్నాయి.

“పరిస్థితి ఇలాగే కొనసాగితే మన మనుగడ ప్రశ్నార్ధకమయిపోతుంది” అన్నాడు కృష్ణ గోవింద్ ఖటాగల్.

“హిందువులు కావాలని మసీదు ముందు పెద్దగా వాయిద్యాలు మ్రోగించారట. అందుకని ఆగ్రహించిన ముస్లిములు మారణాయుధాలతో దాడి చేశారట. మత కల్లోలాలకు కారణం హిందువులేనట” కసిగా అన్నాడు బాలాసాహెబ్ నాటు.

“ఎప్పుడు మత కల్లోలాలు జరిగినా, నేరం హిందువులపైనే నెట్టటం ప్రభుత్వానికి అలవాటయిపోయింది” కసిగా అన్నాడు జవాలె.

“హిందువులు జునాగఢ్ అల్లర్లలో నష్టపోయినవారి సహాయార్ధం కమిటీ ఏర్పాటు చేయటం ముస్లిములకు నచ్చలేదట” అన్నాడు రంగారి.

“వాళ్ళూ సమావేశాలు చేశారు. వాళ్ళూ కమిటీ ఏర్పాటు చేశారు.” అన్నాడు జవాలె వెంటనే.

“బొంబాయిలో గొడవలలో హిందువుల పాత్ర లేదనీ, పోలీసులు సత్వరం సరైన చర్యలు తీసుకునివుంటే, హిందువులు తిరగబడి కోట్టాల్సిన అవసరం ఉండేది కాదనీ ఋజువులు చూపించాను. పోలీసులు రక్షిస్తారని ఎదురుచూసి, పోలీసులెంత సేపటికీ రాకపోతే, అప్పుడు తమ రక్షణ తామే చేసుకోవాలని గ్రహించిన తరువాతే హిందువులు హింసకు దిగారని నిరూపించాను. హిందువులవైపు నుంచి హింస ఎప్పుడూ ఆరంభం కాదని నొక్కి చెప్పాను. అసలు ఆ రోజు హిందువులు వాయిద్యాలే మ్రోయించలేదనీ నిరూపించాను. మరుసటి రోజు బోంబే గజెట్‌లో ఆ వార్త వచ్చింది” మెల్లిగా, గంభీరంగా చెప్పాడు కేసరి పత్రిక సంపాదకుడు, సామాజిక కార్యకర్త బాల గంగాధర తిలక్.

ఆకాలంలో మహారాష్ట్రలో బాల గంగాధర తిలక్ హిందూ సంప్రదాయవాదులలో ప్రసిద్ధి పొందినవాడు. సంప్రదాయాన్ని వ్యతిరేకించిన వారిని విమర్శించటమే కాదు, బ్రిటిష్ వారికి పక్కలో బల్లెంలా ఎదిగాడు. తిలక్ అంటే బ్రిటిష్ అధికారులు భయపడేవారు. జాతీయ భావాలతో, స్వతంత్రపుటాలోచనలతో తిరుగులేని దేశభక్తుడిగా గుర్తింపు పొందాడు తిలక్.

“కానీ, విన్సెంట్, ఈ హింసకు గో రక్షకులదే బాధ్యత అని, వాళ్ళవల్లే ముస్లిములు తప్పనిసరి పరిస్థితుల్లో హింసకు పాల్పడ్డారనీ అంటున్నాడు” వార్త పత్రిక చూపిస్తూ చెప్పాడు భౌసాహెబ్ రంగారి.

“ఇది మొదటిసారి కాదు, బ్రిటిష్ వారేకాదు, సంస్కరణవాదులయిన మనవారు కూడా తప్పు మనదే అంటారు. నిజానిజాలను విచారించరు. జరిగింది పట్టించుకోరు. కారణాలు అన్వేషించరు. నిష్పాక్షికత అన్నది తెలియదువారికి. నేరం హిందువులదే అంటారు. అందరికీ పాపాలభైరవుడిలా హిందువులే తేరగా దొరికారు” నిష్ఠూరంగా అన్నాడు లక్ష్మణ్ జవాలే.

తలపంకించాడు తిలక్.

“ప్రమాదం ఒకవైపునుంచి వస్తే దృష్టి ఆ వైపు కేంద్రీకరించవచ్చు. దాడి నాలుగువైపులనుంచీ జరుగుతూంటే, ఒకేసారి నాలుగు వైపులా ఎలా పోరాడతాం” ఆలోచనగా అన్నాడు తిలక్.

నలుగురూ ఒక్కసారి తిలక్ వైపు చూశారు.

“ముస్లిములకూ, మనకూ నడుమ విభేదాలు చెలరేగితే న్యాయం చేయాల్సింది ప్రభుత్వం. కానీ, ప్రభుత్వం విభేదాలను పెంచాలని చూస్తున్నది తప్ప తగ్గించాలని చూడటం లేదు. మనమధ్య వైషమ్యాలు పెరిగితే కలిసికట్టుగా పోరాడలేము. మనలో ఐక్యత లేదు. మనల్ని విడగొట్టటం సులభం. అందుకని మనవైపు వివక్ష ప్రదర్శిస్తున్నది. మనల్ని రెచ్చగొడుతున్నది.” ఆలోచిస్తున్నట్టు నెమ్మదిగా అన్నాడు తిలక్.

“ఇది నిజం. మనలో ఐక్యత లేదు.” అన్నాడు కృష్ణగోవింద్ ఖటోగల్.

అందరూ అతనివైపు చూశారు ప్రశ్నార్ధకంగా.

“నేను తిలక్ కార్యకలాపాలను దగ్గరగా చూస్తున్నాను. ‘రుఖ్మాబాయి’ వివాదం సమయంలో తిలక్‌ను అందరూ ఛాందసుడని,  పాతను పట్టుకుని వ్రేలాడతాడనీ విమర్శించారు” అన్నడు ఖటోగళ్.

రుఖ్మాబాయి వివాదం అందరికీ తెలుసు. ఆమెకు పదకొండేళ్ళ వయసులోనే వివాహం చేశారు పెద్దలు. ఆమెకు భర్త ఇంటికి వెళ్ళే వయసు వచ్చేసమయానికి ఆమెకు అతను నచ్చలేదు. అతను పేదవాడని, అతడితో తనకు ఊహ తెలియని వయసులో జరిగిన వివాహం చెల్లదనీ ఆమె కోర్టును ఆశ్రయించింది. ఆ వివాహం చెల్లదనీ, ఆమె భర్త దగ్గరకు వెళ్ళనవసరం లేదని కోర్టు తీర్పునిచ్చింది. ఆ విషయం అక్కడ ఉన్నవారందరికీ తెలుసు.

“ఆ తీర్పును జాగ్రత్తగా విశ్లేషించండి. ఈ తీర్పు ప్రేరణగా తీసుకుని తనకు భర్త నచ్చలేదనో, అతడి దగ్గర ధనంలేదనో, అత్తమామలు నచ్చలేదనో, అతను గురకపెడతాడనో ప్రతి ఒక్కరూ, ప్రతి చిన్న విషయానికీ వివాహాన్ని తిరస్కరిస్తే ఏమవుతుంది? జన్మజన్మాంతర సంబంధమైన వివాహ బంధం అభాసుపాలవుతుంది. అందుకే, ఆమె ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ కూడా వివాహబంధం జీవితాంతం అని వాదించాడు తిలక్. ఇది గమనించాలి. అదీగాక ఎప్పుడయితే అలాంటి వివాహాలు చెల్లవో, అప్పుడు స్త్రీలకు భర్త ఆస్తిపై హక్కు పోతుంది. అది అన్యాయం” అన్నాడు ఖటోగళ్.

“వివాహవయోపరిమితి పెంచే విషయంలో కూడా, అందరూ విమర్శించినా తిలక్ వాదన నాకు నచ్చింది” అందరివైపూ చూస్తూ అన్నాడు లక్షణ్ జవాలే.

“మన ఇంట్లో దుమ్ము ధూళి ఉన్నాయని చెప్పి బయటవాడు వచ్చి మన ఇల్లు శుభ్రం చేస్తానంటే ఒప్పుకుంటామా? ఇల్లు శుభ్రంగా ఉండాలి. కానీ, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకుంటాం. బయటనుంచి ఎవడో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆధిక్యతను నిరూపించుకోవటం ద్వారా మనలో న్యూనతాభావం కలిగించాల్సిన అవసరం లేదు” కఠినంగా అన్నాడు తిలక్.

అందరూ అతడివైపు ఒకేసారి చూశారు.

“ఆద్యంతాలు లేని భారతీయ ధర్మం సజీవనది లాంటిది. ఎన్నెన్నో ఉపనదులు ఎన్నెన్నో వందల వేల ఏళ్ళనుంచీ ఈ సజీవ నదిలో కలుస్తూన్నాయి. కాబట్టి నది కలుషితమవటంలో ఆశ్చర్యంలేదు. కానీ, సజీవ ధర్మం జీవలక్షణం ఏమిటంటే,  ఈ కలుషితాలను తొలగిస్తూ, తనని తాను శుభ్రపరచుకుంటూ ముందుకు సాగుతుంది. మనకు బయటవారి ప్రేరణ అవసరం లేదు. అంతర్గతంగా మనలోంచే ఈ ప్రేరణ వస్తుంది. మన ఇల్లు మనమే శుభ్రం చేసుకునేట్టుగా, మన సమాజంలోని అసమానతలను, అన్యాయాలను, మన ధర్మంలోని కలుషాలనూ మనమే ఏరిపారేసుకుంటాం. బయటవాడెవడు మన ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోవటానికి? పైగా, ఈ విషయాలను చూపి మన సమాజాన్ని చూసి మనమే అసహ్యించుకునేట్టు చేయాలన్నది బిటిష్ వారి పథకం. అందుకే, ప్రతి చిన్న విషయాన్నీ పెద్దదిగా చేసి చూపి మనం అనాగరికులం, బ్రిటిష్ వారే మనల్ని నాగరీకులను చేయాలన్న ఆలోచనను సమాజం మెదడులో నింపుతున్నారు  విదేశీ పాలకులు”.  మెల్లిగా ఆరంభమయిన జల్లు చివరికి తుఫానులా పరిణమించినట్టు తిలక్ స్వరం చివరికి ఆవేశంతో ఉరిమింది.

కాస్సేపు గదిలో నిశ్శబ్దం తాండవించింది.

నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ మళ్ళీ తిలక్ అన్నాడు.

“సంస్కరణల పేరుతో, కొన్ని వర్గాలలో వైషమ్యాలు రెచ్చగొట్టి, ద్వేషభావనల అగ్నులను రగిల్చి, మన సమాజాన్ని నిలువునా చీల్చాలని చూస్తున్నారు. బ్రిటిష్‌వారు ఆడే ఈ ఆటలో మనవాళ్ళే పావులయ్యారు. గొప్ప సంస్కర్తల్లా, సమాజ మనస్సాక్షుల్లా తమని తాము ప్రకటించుకుంటూ, వారు ఈ ధర్మాన్ని లోపలనుంచి తొలిచివేసే చెదపురుగుల్లా తొలిచివేస్తున్నారు. మనమెందుకూ పనికిరాని అనాగరికులం, మన పూర్వీకులు అనాగరికులు, అభివృద్ధి నిరోధకులు అని నమ్మించాలని మనవాళ్ళే ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రపంచంలో అతి ప్రాచీన నాగరికత వారసత్వంలా కల మనము, బ్రిటిష్ వారి వారసత్వాన్ని మన వారసత్వంగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాము” నిప్పులు కురుస్తున్నాయి తిలక్ కళ్ళు.

తిలక్ మాటలు వింటూంటే అందరికీ, తిలక్‌కూ, పండిత రమాబాయికీ నడుమన చెలరేగిన వివాదం మనస్సుల్లో మెదిలింది.

పండిత కుటుంబంలో జన్మించింది రమాబాయి. పేదరికంవల్ల, ప్రవచనాలు చెప్తూ పొట్టపోసుకుంటున్న ఆమెకు బ్రహ్మో సమాజ్‌కు చెందిన వ్యక్తితో వివాహమయింది. అతని మరణం తరువాత ఆమె రానడే పిలుపు మేరకు మహారాష్ట్ర వచ్చి ప్రార్థనా సమాజ్ కార్యకర్త అయింది. స్వయంగా, మహిళల ఉద్ధారణ కోసం ‘ఆర్య మహిళా సమాజా’న్ని స్థాపించింది. క్రీస్టియన్ మిషనరీల సహాయంతో విదేశాలకు వెళ్ళింది. అక్కడ ఆమె మతం మారింది. భారత్ తిరిగివచ్చి ‘శారదా సదన్’ విద్యా సంస్థను ఏర్పాటు చేసింది. ఆమెను మహిళోద్ధారకురాలిగా  భావించిన  రానడే, అగర్కర్ వంటి సమాజ సంస్కర్తలు ఆమెకు సహాయం చేశారు.

ఒకవైపు నుంచి అందే విదేశీనిధులు, మరోవైపు దేశంలో సంస్కరణాభిలాషుల వల్ల  లభిస్తున్న సహాయంతో ఆమె తన దగ్గరకు వచ్చే అభాగ్య మహిళల మతం మార్చటం ఆరంభించింది. ఈ నిజం తెలియక  కేసరి పత్రిక ద్వారా తిలక్ ఆమెపై ప్రశంసలు కురిపించాడు. ఎప్పుడయితే ఆమె తన కార్యక్షేత్రాన్ని పూనాకు మార్చిందో,  ఆమెను దగ్గరగా చూసే అవకాశం తిలక్‌కు లభించింది. భర్తను కోల్పోయిన మహిళలకు ఆశ్రయం ఇచ్చి, ఉపాధి కల్పించే నెపం మీద ఆమె మతాంతరీకరణకు పాల్పడుతున్నదని తిలక్ ఆరోపించాడు. ఆమెకూ, మిషనరీలకూ ఉన్న సంబంధాన్ని ఋజువులతో సహా చూపించాడు. నిరసన వ్యక్తపరచాడు. దాంతో రమాబాయి పూన వదలి ‘కేడ్గావ్’లో, ఈసారి బహిరంగంగానే చర్చ్ ప్రాధాన్యం కల ఆశ్రమాన్ని నెలకొల్పింది.

“విదేశీయుల సహాయంతో తన తోటివారి సనాతన ధర్మాన్ని బూడిద చేసేందుకు కంకణం కట్టుకుని  సహాయం, సేవల  ముసుగు వేసుకున్న మేకవన్నె పులి రమాబాయి” అని తిలక్ ప్రకటించాడు. రమాబాయి పాఠశాల వదిలి వచ్చిన  మహిళలకు తన పాఠశాలలో ఉచిత విద్యాబోధనను ప్రకటించాడు కూడా.

ఈ రకంగా సమాజ సేవ పేరిట, సమాజ సంస్కరణల పేరిట, భారతీయుల నడుమ చిచ్చు పెట్టటం ఒకవైపు, ధర్మాన్ని విమర్శిస్తూ తమ ధర్మం పై చులకన భావం కలిగేట్టు చేస్తూ,  మతం మార్చటం మరోవైపుగా, ప్రభుత్వం ఒకవైపు, ఇస్లామీయులు మరోవైపుగా భారతీయ ధర్మంపై నలువైపుల నుంచీ దాడి జరుగుతున్నదని నిరూపించాడు తిలక్. కానీ, ఇది గ్రహించలేని భారతీయులు మాత్రం తమ ధర్మం ఆద్యంతాలు లేనిదన్న భరోసాతో తమ ధర్మంలో లోపాలను మాత్రమే బహిరంగం చేస్తూ, మంచిని విస్మరించి తామున్నకొమ్మనే నరుక్కుంటూన్నారు.

ఇది తిలక్‌ను మరింత ఆవేదనకు గురిచేస్తున్నది.

“పరాయివారెలాగో పరాయివారు. కానీ, మనవారు శత్రువులకన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మనకు నీతులు చెప్పేవారే, మనల్ని సంస్కరించాలని తపన పడేవారే. ఈ పరిస్థితి మారకపోతే, మనం అస్తిత్వం కోల్పోతాము. మనము మనముగా మిగలం” చివరి మాటలనేప్పుడు తిలక్ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.

గదిలో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు.

గదిలో వాతావరణం మార్చేందుకు భౌ సాహెబ్ వంగారి, తన సంచీలోంచి కొన్ని ఫోటోలు తీశాడు.

“క్రితం సంవత్సరం మా వాడ (ఇల్లు)లో గణేశ్ చతుర్థి సంబరాలు గడిపాం. ఈ సంబరాలు ప్రతి సంవత్సరం గడపాలని సార్వజనిక్ గణేశోత్సవ సమితిని ఏర్పాటు చేశాను. ఆ సందర్భంలో తీసిన ఫోటోలు ఇవి” ఫోటోలు చూపించటం ఆరంభించాడు.

తిలక్ అనాసక్తంగా ఆ ఫోటోలు చూస్తున్నాడు. అతని మనసులో ఏవేవో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి.

ఫోటోలు చూపిస్తూ చెప్పాడు వంగారి.

“తురకల దాడులలో ఆత్మవిశ్వాసం కోల్పోయి, అనైకమత్యంతో ఉన్న వారందరిలో ఆత్మవిశ్వాసం నింపి, ధర్మభావన ద్వారా దేశభక్తి రగిలించి ఐక్యత సాధించేందుకు శివాజీ మహారాజ్, స్వామీ సమర్థ రామదాసు ప్రేరణతో గణేశోత్సవాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాడు. అతనికీ, అతని తల్లి జీజాబాయికీ దొరికిన వినాయక విగ్రహం ‘కస్బా గణపతి’గా ఇప్పటికీ పూజలందుకుంటున్నది”

చెప్తున్న వంగారీ తిలక్ తనవైపు అదోరకంగా చూస్తూండటంతో ఆపాడు. కానీ, తిలక్ చూపు తనవైపున్నా, దృష్టి తనపై లేదని గ్రహించాడు. ఏమనాలో తోచలేదు. ఇది గమనించని కృష్ణాజీ ఖస్గివాలే గొంతువిప్పాడు.

“శివాజీ తరువాత పీష్వాలు  పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను కొనసాగించారు. భారతీయ ధర్మానుయాయులందరూ అన్ని భేదభావాలు మరచి ఒకటవటంలో ఈ ఉత్సవాలు ఎంతో తోడ్పడ్డాయి. పీష్వాల తరువాత ఎవరికివారు వ్యక్తిగతంగా, ఎవరి ఇళ్ళల్లో వారు పూజలు చేసుకుంటున్నారు. ఈమధ్య నేను గ్వాలియర్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఉత్సవాలు అందరూ జరుపుకోవటం చూశాను. ఆ విషయం వంగారికీ బాలాసాహెబ్ నాటూకూ చెప్పాను. మనము కోల్పోయిన మన సంప్రదాయాన్ని మనం మళ్ళీ పాటించాలని క్రితం సంవత్సరం (1892) వంగారి వాడలో గణేశ్ ఉత్సవాలను జరిపాం.”

ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు తిలక్.

తిలక్ హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవటం, తీసుకున్న నిర్ణయాలు అమలు పరచటం వారికి తెలుసు.

తిలక్ ముఖం చూస్తే ఏదో ఆలోచన అతనికి వచ్చిందని అర్ధమయింది వారికి. వారూ లేచి నిలబడ్డారు.

అంతలో తిలక్ ముఖం నవ్వుతో వెలిగిపోయింది.

“మోరయా గోసావి” అన్నాడు తిలక్.

వాళ్ళు అయోమయంగా చూశారు తిలక్ వైపు.

వాళ్ళకు చించ్వాడాకు చెందిన మోరయా గోసావి తెలుసు. గణపతి భక్తులలో గొప్ప భక్తుడు అతడు. అతడికోసం గణపతి చించ్వాడాలో వెలిశాడు. అతని కొడుకు చింతామణిని దైవంలా భావిస్తారు. కానీ అతని ప్రసక్తి ఇప్పుడెందుకు?

మోరయా గోసావి గణపతి దర్శనానికి మోరెగావ్ మందిరానికి వెళ్తే అక్కడికి రానివ్వలేదు. తరువాత అతని మహిమ తెలిసి మందిరంలోకి ఆహ్వానించినా పోలేదు. అతనెక్కడుంటే అక్కడుంటానని గణపతి వాగ్దానం చేస్తే చించ్వాడా అడవుల్లోకి వెళ్ళి అక్కడ గణపతిని ప్రతిష్ఠించాడు. ఇదంతా వారికి తెలుసు. కానీ ఇప్పుడు అతని ప్రసక్తి ఎందుకో వారికి అర్థం కాలేదు.

“మోరయా గోసావిని మందిరంలోకి రానీయకపోతే, గణేశుడే మందిరం వదలి అతడున్న చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడే పూజలందుకున్నాడు” అన్నాడు తిలక్.

“అవును.”

“ఇప్పుడు మనం చేయాల్సిందీ అదే. ఎవరిళ్ళల్లో వాళ్ళు పూజలు చేసుకుంటున్న గణపతిని వీధుల్లో ప్రతిష్ఠించాలి. ఎలాంటి తేడాలు లేకుండా ధార్మిక వాతావరణంలో అందరూ, అన్ని భేదభావాలు మరచి  ఒకటిగా కలిసే వీలు కల్పించాలి. సార్వజనిక గణేశ ఉత్సవాలు వీధి వీధినా, వాడవాడనా, అడుగడుగునా నిర్వహించాలి. ఈ ఉత్సవాలలో, ధర్మభక్తి ద్వారా దేశభక్తి బోధించాలి. స్వతంత్రేచ్చను రగిల్చాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ఆత్మగౌరవాన్ని జాగృతం చేయాలి. ఇందుకు, గణపతి భక్తులలో అగ్రగణ్యుడు మోరయా మనకు దారి చూపించాడు.”.

ఏదో సుందర స్వప్నం చూస్తున్నవాడిలా తిలక్ వదనం వెలిగిపోతోంది ఆనందంతో..

“గణపతి బప్పా మోరయా” నినదించాడు.

మిగతావారు అప్రయత్నంగా నినదించారు.

“గణపతి బప్పా, మోరయా”

***

“గణపతి బప్పా మోరయా”

బొంబాయి పూనా లతో సహా మహారాష్ట్రా అంతా నినాదం ప్రతిధనించసాగింది.

తరువాత చకచకా జరగాల్సింది జరిగిపోయింది.

తురకల పండగలలో పాల్గొనే హిందువులందరికీ, ఆయా పండుగలను బహిష్కరించమని పిలుపునిచ్చాడు తిలక్. అంతేకాదు, వారి ఉత్సవాలలో వాయిద్యాలను వాయించేవారు, అక్కడకు వెళ్ళటం మాని, గణపతి ఉత్సవాలలో తమ ప్రతిభను ప్రదర్శించాలని కోరాడు. మొహర్రం ఉత్సవాలకు ధన సహాయం చేసే హిందువులంతా, గణేష్ ఉత్సవాలలో పాల్గొనాలని ప్రకటించాడు. కుల, వర్గ, వర్ణ భేదాలు మరచి హిందువులంతా ఒక్కటై ఐకమత్యంతో నిలవాలని బోధించాడు.

గణెశ్ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసి, ఔత్సాహికులకు బాధ్యతలిచ్చి వారిని కార్యకర్తలుగా మలచాడు. గణెశ్ సంబరాలలో భాగంగా, ధార్మిక ప్రవచనాలు, ధర్మం, సంస్కృతి సంప్రదాయాలను వివరించే ఉపన్యాసాలు, పాటలు, భజనలు, నాటికలు ఏర్పాటు చేశాడు.

సంస్కరణవాదులు, రానడే, గోఖలేల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఒంటరిగా ధార్మిక సమావేశాలను నిర్వహించాడు. ఆ సమావేశాలలో స్వచ్ఛందంగా వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తిలక్ ఉపన్యాసాలకు ముగ్ధులయ్యారు. ప్రేరేపితులయ్యారు.

“తిలక్ మత భావనలను రెచ్చగొడుతున్నాడు. ముస్లిములపై ద్వేషం పెంచుతున్నా”డని కాంగ్రెస్ వారు ఆరోపించారు. తిలక్ పట్టించుకోలేదు. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు పూజలు చేసుకుంటూ, ఒకరితో ఒకరు సంబంధంలేనట్టు ఉంటున్నవారిని ఒకటిగా, ఒక శక్తిగా మార్చటం తప్పు అయితే, ఆ తప్పే చేస్తానని నిర్మొహమాటంగా అన్నాడు తిలక్. సమాజంలో ఐకమత్యం సాధించటం మతతత్వమయితే, తాను మతతత్వ వాదినే పొమ్మన్నాడు.

అంతవరకూ ముహర్రంలో తాజియాల తయారీ కోసం, ఇంకా  ఇతర అనేక ఖర్చులు పెట్టే హిందువులు ఇప్పుడు తమ దృష్టిని గణేశ్ ఉత్సవంవైపు మరల్చారు. ముహర్రంలో పాల్గొనే మేలాలు గణేశుడి వైపుకు మళ్ళాయి.

గణేశ్ ఉత్సవానికి పత్రికలన్నీ విస్తృత ప్రచారాన్నిచ్చాయి.

ఫలితంగా భారతీయుల పండుగలా జరుపుకునే ముహర్రం, ఇస్లామీయుల పండుగలా మారిపోయింది.

1893లో 300-400 పీర్లతో జరుపుకున్న ముహర్రం 1894 కల్లా 50-75 మాత్రమే కల పీర్ల పండుగలా మారిపోయింది.

దాంతో సమాజంలో కలకలం మొదలయింది. తిలక్ మతావేశాలు రెచ్చగొడుతున్నాడని సంస్కరణవాదులు విమర్శలు ఆరంభించారు. హిందూ పండుగల సమయంలో ఏదో కారణంతో రాళ్ళు రువ్వటం, గొడవలు, వంటి చెదురుముదురు సంఘటనలు జరిగాయి.

తిలక్ ఎవ్వరి విమర్శలూ పట్టించుకోలేదు.

1894లో గణేశ్ ఉత్సవం సమయంలో  వీధి వీదినా వాడవాడనా వినాయకుడి విగ్రహాలు వెలిశాయి. పిల్లలు, పెద్దలు, వృద్దులు అన్న తేడాలు లేకుండా, నిమ్న కులము, అగ్ర కులము అన్న స్పృహ లేకుండా,  నూతన చైతన్యంతో ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలలో పాల్గొన్నారు.

“గణపతి బప్పా మోరయా” అన్న నినాదాలు, బొంబాయి, పూనా సరిహద్దులు దాటి దేశం నలుమూలలా విస్తరించాయి. గణేశ చతుర్ధి  ఒక జాతీయ పండుగలా ఎదిగింది. కులం, ప్రాంతం వంటి అన్ని సంకుచితాలను విస్మరించి ప్రజలంతా ఒక్కటిగా నిలచి వినాయకుడిని అర్చించుకోవటం సంప్రదాయమయింది.

వినాయకచవితి సంబరాల ద్వారా ఏకమవుతున్న హిందూ సమాజాన్ని చూసి బ్రిటిష్ ప్రభుత్వం గడగడలాడింది.ఈ సంబరాలను అడ్డుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది. వారి ప్రతి ప్రయత్నం సంబరాలలో పాల్గొనేవారి సంఖ్యను పెంచింది. సంబరాలు దేశమంతా విస్తరించటంలో తోడ్పడింది.

తిలక్‌ను మత దురహంకారి అని దూషించినవారి స్వరాలు “గణపతి బప్పా మోరయా” అన్న నినాద జలపాత హోరులో అణిగిపోయాయి.

తిలక్‌ను, ‘లోకమాన్య తిలక్’ అంటూ దేశ ప్రజలు హృదయానికి హత్తుకున్నారు. అంతవరకూ మహారాష్ట్రకే పరిమితమయిన తిలక్ ఖ్యాతి దేశం నలుమూలలా పాకిపోయింది. భారతీయులలో జాతీయ భావాలకు బీజం వేసి, భారతీయుల ఐక్యతకు మార్గం చూపిన తిలక్,  దేశంలో తొలి ‘జాతీయ స్థాయి నాయకుడి’గా ఎదిగాడు. ఆనాడు వినాయక చవితి సంబరాల ఆధారంగా తిలక్ నాటిన సామాజిక ఐక్యతా బీజాలు ఈనాడు భారతీయ సమాజాన్ని ధార్మికత ఆధారంగా ఐక్యం చేస్తున్నది. ఆనాడు తిలక్‌ను వ్యతిరేకించిన శక్తులు, ఈనాడు కూడా అదే వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాయి. కానీ, “గణపతి బప్పా మోరయా” అన్న నినాదం దేశవ్యాప్తంగా మార్మ్రోగుతూ, అన్ని విచ్చిన్నకరశక్తుల కేకలనూ ముంచెత్తుతున్నది. దేశ సమైక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలుస్తున్నది.

గణపతి బప్పా మోరయా!!

Exit mobile version