పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో 01 అక్టోబర్ 2025 బుధవారం సాయంత్రం ‘గరం గరం చాయ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది.
ప్రముఖ రచయిత ఆర్.సి.కృష్ణస్వామిరాజు రచించిన ఈ పుస్తకాన్ని త్రిపురలోని దమ్మ దీప అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.పి.నరసింహరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ కృష్ణస్వామిరాజు మాండలికాలు, పల్లెపదాలతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సులువుగా అర్థమయ్యేలా రచనలు చేస్తున్నారని కొనియాడారు. సామాజిక మాద్యమాల్లో రీల్స్ రాజ్యమేలుతున్న ఈ తరుణంలో వాటికి ఏమాత్రం తీసిపోకుండా పొట్టి కథలను రచించడం రచయిత ప్రతిభకు నిదర్శనమన్నారు.
తిరుపతికి చెందిన రచయిత, కవి డాక్టర్ ఎం.ధర్మయ్య మాట్లాడుతూ కృష్ణస్వామిరాజు తన రచనలతో తెలుగు భాష అనే దీపాన్ని వెలిగిస్తున్నారని చెప్పారు.
కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.శైలమ్మ పుస్తక సమీక్ష చేశారు. ఈ పుస్తకంలో రచయిత సమాజంలోని విభిన్న కోణాలను స్పృశిస్తూ రచనలు చేశారని చెప్పారు. ఇందులో కుటుంబ సంబంధాలు, కార్యాలయ సంబంధాలు, ప్రస్తుత సమాజంలో వైద్యవిధానం, రాజకీయాలు, పిల్లల విద్య, రైతుల హృదయస్పందన, భార్యాభర్తల మధ్య సంబంధాలు తదితర అంశాలను పొందుపరిచి చక్కటి భాషలో అందరూ చదవగలిగేలా పుస్తక రచన చేయడం గొప్ప విషయం అన్నారు.
పిఆర్ఎస్ఐ తిరుపతి చాప్టర్ చైర్మన్ డాక్టర్ జిఎస్.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ డి.చంద్రమోహన్, ట్రెజరర్ కె.మధుసూదన్, మాజీ చైర్మన్ డా.సి.స్వరాజ్యలక్ష్మి, సాహితీ ప్రియులు ఆచార్య గార్లపాటి దామోదర్ నాయుడు, డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, మల్లేశ్వరరావు, తోట వెంకటేశ్వర్లు, మన్నవ గంగాధరప్రసాద్, రొడ్డా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
—
జారీ చేసిన వారు
డి. చంద్రమోహన్,
సెక్రటరీ,
పిఆర్ఎస్ఐ తిరుపతి చాప్టర్.

