Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గీత

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వి. ప్రసాదరావు గారి ‘గీత’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

మునిమాపు వేళ..

ఆ పట్టణ శివారు ప్రాంతంలో.. రైల్వేట్రాక్ పై ఉత్తర దిశ నుండి ఓ భారీ గూడ్స్ రైలు వేగంగా వస్తోంది..! దానికి..

***

నేనెవడినో నాకు తెలీదు! కన్నోరెవరో తెలీదు..! ఆల్లు నాకేం పేరెట్నారో తెలీదు! సుట్టాలు.. బందువుల్లేరు.. సదువు లేదు.. అసలీ కాలంలోన బతకడానికి పని కొచ్చి లోక గేనమే నాకు వేదట! అబద్దమాడ్డమంటే యేటో తెలీనోడివి యెలాగ బతుకుతావురా..? ఇది రాములోరి సత్తి కాలం కాదురా.. ఏ టయానికి సత్తిం సెప్పాలో.. ఏ టయానికి ఓయానికి అబద్దమాడాలో తెల్సుకునే గేనం లేకపోతే శానా పెమాదం రా.. ఆల్లు నిన్ను సంపేత్తారా అని శానా మంది శానా సార్లు బోద సేసినారు! అల్లంతా నాకు తెల్సినోల్లే.. నా లాగ బతుకుతున్నోల్లే..!

నేను బెంగెట్టీసుకున్నాను. యెక్కడెక్కడి కెల్నా అల్లొదల్రట! యెతికెతికి పట్టీసుకుంటారట! సేయని తప్పు నేనే సేసినట్టు వొప్పుకోమని కొట్టి కొట్టి మరీ సంపేతారట..! పోయిన్నెలే మా వోడొకడ్ని అలాగే కొట్టిసి సంపేసినార్రా.. అని శానా బయం పుట్టించేసినారు! ఏ కాశీ కో బండెక్కిసి పారిపో.. ఇందంటే వుంటే బతుకు బుగ్గేరా.. అని వుపాయం సెప్పిసినారు!! ఆల్లు సెప్పినట్టే ఏ బండో ఎక్కి పారిపోదావని టేసనుకు యెల్తంటే వోలమ్మ టేసన్నిండా పోలీసోల్లే! యేదో పారిటీవోల్లు దర్నాలు సేస్తున్నారంట! అక్కడ పోలీసోల్ని సూసీ సూడగానే యెనక్కి పారొచ్చేసినాను. ఆ పోలీసోల్లకి దొరికీసి ఆల్ల సేతుల్లో బాదలు పడి కుక్కసావు సావకుండా నా యంతట నేనే సుకంగ సచ్చిపోదావని గట్టిగ నిర్ణయించేసుకున్నాను. అలాగనుకున్న రోజునే సావడానికి బయల్దేరాను. అసలు నేనెందుకు సచ్చిపోవాలనుకున్నానంటే దానికో కతున్నాది..! అదేటంటే..

వో రోజున పెద్ద మనిసి లాగున్న వొకాయన శాన యేగంగ కార్లోన యెల్తన్నాడు! వొక దగ్గిర టపీమని బండాపీసి.. లోపల్నుండి వొకాడ మనిసిని కెబుక్కున తోసీసినాడు! ఆ యెంటనే ఆ మనిసి దిగి ఆడమనిసి పీక నులిమేసి.. సంపీసి మల్ల యేమెరగనోడిలాగ కారెక్కీసి యేగంగ యెల్లి పోయ్నాడు! నేను దగ్గిర్లోన వో సెట్టు సాటున ఒంటేలు పోసుకుంటున్నోడిని ఆ కారాగడం సూసినాను. ఆ యెంటనే ఆడమనిసి పడిపోడం.. ఆ పెద్దమనిసి ఆ యాడ మనిసికేసి యెల్లడం సూసి.. ఆ మనిసి నేటి సేస్తున్నాడే అని డవుటొచ్చీసి యెల్నాను. నేను గబగబ అ యాడమనిసి దగ్గర కెల్నానో లేదో కారు యమా పీడుగా యెల్లి పోయినాది! అప్పుడికే ఆ యాడమనిసి సచ్చిపోయినట్టు నాలిక యెల్ల బెట్టీసున్నాది! అంతే.. అది సూసి నేను కర్ర లాగ బిగుసుకోని అక్కడే వుండి పోయినాను. అలాగ యెంతసేపుండి పోయినానో తెలీదు! తెలివొచ్చి సూసీ సరికి జెనాలు మూగీసున్నారు!

యేటయింది..? యేటయింది..? ఈ యమ్మను ఎవలు సంపీసినారు..? నువ్వు సూసేవా..? ఈ పిల్ల వొంటి మీదున్న బంగారం కోసం నువ్వే సంపీసినావా..? అని యేటేటో అడిగేస్తన్నారు! అల్లకి నేనేం సెప్పినానో తెలీదు! శానా బయమేసి అక్కడ్నించి పారొచ్చీసినాను. వొస్తుంటే వొక పోలీసాయన ఎదురుపడ్డాడు. అతన్ని సూసి మరో కాసి పారిపోదామనుకున్నోడ్ని మంతరమేసినట్టు ఆగిపోయ్నాను. అతను నా దగ్గిర కొచ్చి ఏంటలాగ యెర్రి మొగ వెట్నావు.. యేంటికత..?.. అని గట్టిగా అడిగినాడు. నాకే పాపం తెలీదన్నాను. యేడుసుకొని సూసింది సూసినట్టు సెప్పినాను. ఆ పోలీసతను టేసనుకు తీస్కెల్లి యేదేదో రాసిన కాయితమ్మీద నా యేలి ముద్రేయించేసుకున్నాడు! ఆ సంగతి మా వోల్లకి తెల్సింది.. ఆ యెంటనే రకరకాలుగా మాట్లాడి బయం పుట్టించేసినారు..!

వోరేయ్.. మల్ల ఆ పోలీసోల్లే వొచ్చి నువ్వే ఆ పిల్లను సంపీసినట్టు వొప్పుకోమని నిన్ను కుల్ల బొడిసేస్తారు. నువ్వొప్పుకోలేదనుకో మల్ల కుల్ల బొడిసి సంపేత్తారు.. కాబట్టికి యెటన్నా పారిపో. శానా దూరంగా ఏ కాశీ కేసో పారిపో.. అని మరింత బయిం పెట్టించీసినారు..! ఆ బయం తోటే టేసనుకి యెల్లి మల్ల అక్కడా పోలీసోల్లని సూసి యెనక్కి వొచ్చేసినాను! అల్ల సేతికి సిక్కి కుక్క సావు సావడం కన్న నా సావు నేనే సుకంగ సావాలని గట్టిగ నిర్నయించేసుకున్నాను..!. యెలాగ సావడం అనుకుంటన్నానో లేదో మా గుడిసిల పక్కనే వున్న సెత్తల సెరువు కనబడింది! మరేటీ ఆలోసించకుండా ఆ సెరువులోన గభీమని దూకీసినాను! వొర్సాల్లేక ఆ సెరువులోన సగం నీల్లే వున్నాయి గావాల..! నా నడుము దగ్గరకే మునిగినాను, ఆ సెరు వొడ్డున వో దొరబాబు సటుక్కున నా ఫొటోలు తీసినాడు! ఆ బాబే మల్ల నవ్వుకోని నా కేసి సూసి యిదిగో సావాలంటే శానా దార్లు వున్నాయి. కానీ సావాలని యెప్పుడూ యిందులోన దూకమాక..! ఈ సెరువుని వో పెద్దమనిసి కబిజా సేసేసాడు! ఆడే దీన్ని సెత్తలు.. మట్టి మసానం తోటి కప్పేసి సయిట్లు కింద మార్సీసి అమ్మేసుకుంటాడని బోగట్టా వొచ్చింది ! అలాగ సూత్తన్నావేంటి..? బేగి బయటికి రా.. సెత్తల్లోన పురుగులూ అయి కుట్టీసి జుబ్బుపడిపోతావ్.. అని గట్టిగా కేక వేసినాడు. నేను మల్ల బయపడి పోయ్నాను.

గబగబ సెత్తల్ని కాల్లు తోటి నెట్టుకొని నడ్సుకొనొచ్చి వొడ్డెక్కినాను. దగ్గర్లో నున్న నూతిలోని నీల్లు రేకు డొక్కు తోని తోడుకోని స్తాన్నవాడి – యింకెలాగ సావాలి దేవుడా? అని నా దార్న నేను యెల్లబోతుంటే నాకు సిన్న డవుటొచ్చేసి ఆగిపోయి ఆ బాబు నడిగినాను.

“బాబూ.. నా ఫోటో యెందుకు తీసినారు..?” అని.

“పొటోలు తీయడం నా ఆబీ” అన్నాడా బాబు. ఆబీ అంటే నాకు తెలీదు. అదేంటని అడగలేక పోయ్యాను. యెవులయినా పెళ్లిల్లకో.. పండుగులకో పోటోలు తీయడం నేను సూసినాను. కానీ.. ఈ బాబేటో సావడానికి సెర్లోన దూకిన నా ఫొటో తీసినాడు.. అనుకోని ఆచ్చర్యమయిపోయ్నాను.

“నీ పోటో పోటీకి పంపిస్తానోయ్.. ‘సెత్త బతుక్కి సివరి దారి’ అని పంపిస్తానోయ్” అన్నాడు.  యేం దారో.. నా కేటీ అర్థం కాక బొమ్మలాగ వుండి పోయాను,

“బాబూ.. బాదలూ.. కస్టాలు.. ఆకలీ అన్నీ మర్సిపాడానికి సచ్చిపోదావని సెర్లోన దూకీసినాను! నీల్లు లేక బతికినాను. యిప్పుడు మర్సిపోయిన ఆకలి మల్ల గేపకం వస్తున్నాది.. అది మూడ్రోజులాకలి..! కుసింత తిండి పెట్టించి పున్నిం కట్టుకో బాబూ..” అని దండం పెట్టినాను. ఆ బాబేటనుకున్నాడో మరి.. ఇరవయి రూపాయల నోటు సొక్కా జేబునుండి తీసి సూపించినాడు!

“సూడవోయ్.. యీ డబ్బుకు యే తిండి వస్తాదో అది కొనుక్కోని తిను..” అని ఆ నోటియ్యడానికి ఆ సెయ్యి నా కల్ల ముందెట్టి అడిగినాడు! “నీ పేరేటి..? వూరేది..? యేం సదివినావు? యెందుకు పేనం తీసుకోవాలని సూసినావు” అని.

“బాబూ, వూరూ.. పేరూ తెలీదు! కానీ శానా మంది యెర్రోడా.. అని అంటారు. లేదంటే గుడ్డోడా అంటారు. యెలాగ పిల్సినా ‘వూ’ అంటాను” అని నాకతంతా నాకు తెల్సింది సెప్తుంటే మల్ల నాకు దుక్కమొచ్చేసింది! కల్ల నీల్లెట్టీసుకున్నాను.

“యిదిగో యెర్రోడా.. అలాగ యేడవ కూడదోయ్. నీకు వూరూ.. పేరూ లేకపోతే నేమోయ్.. నీవీ దేసంలోనే పుట్నావు కదా.. అందుసేత నీవు భారతీయుడి వేనోయ్..” అన్నాడు. మల్ల ఆ బాబే “భారతమాతే నీకు తల్లోయ్.. తండ్రి అదేనోయ్.. భారతీయులందరూ నీ సోదర్లేనోయ్..! కస్టపడి పని సేసుకోవాలోయ్. ప్రేమే నీ ఆయుదమోయ్.. క్రుసే నీ బలమోయ్.. దెయిర్నమే నీ వూపిరోయ్. ఆ సూరీడుని గేపకం పెట్టుకోవోయ్.. సీకటి నుండి యెల్తుర్లోనికి పచ్చిలా యెగురుకుంటూ యెల్లిపోవాలోయ్.. ఆసల తీరం యెతుక్కుంటూ పోవాలోయ్..” అని యేటేటో సెప్పుకుపోతుంటే నేన్నిజంగా యెర్రోడి లాగయిపోయాను! కొంచెం సేపు తరాత సూద్దును కదా. ఆ బాబు సేతిలోన నోటు నా సేతిలోన వున్నాది. ఆ బాబు మాత్తరం లేడు! అంత భ్రమ లాగయిపోయి వుండి పోయినాను.

ఆ రోజు ఆ బాబు దరమాన కుసింత టిపినీ తిన్నాను. కడుపు నిండక పుల్లుగ నీల్లు తాగేసినాను. ఆ బాబుకు మనుసులోన మల్ల మల్ల దండ వెట్టీసుకున్నాను. ఆ రోజునుండి పని కోసం తిరిగినాను. యే బాబయినా పని సూపుతాడేటో అని ఆసగ తిరిగినాను. అలాగ నాలుగు రోజులు తిరిగి తిరిగి శాన నీరసమయి పోయ్నాను. కానీ యే పని దొరకలేదు! అడుక్కోడం యిష్టం లేక వో గుడి దగ్గర పులోర యిస్తే తిని నీల్లు తాగి తిరుగుతున్నాను. నీర్సం తోటి కాల్లకి పీకులు.. కంటికి మసకలొచ్చీసినాయి! మల్ల సచ్చిపోదావనే అనుకున్నాను. అనుకోని ఆ దేవుడ్నే యేడ్సుకొని అడిగినాను. వో రోజు కనికరమేసి గావాల దేవుడే వో దారి సూపించినాడు.

రెయిలువేవోల్లకి నాలాంటి యెదవల వల్లే శానా నష్టమొస్తున్నాదని గట్టిగా తిట్టుకోని వో సారి టిటి బాబొకాయన కదిలెల్లిపోతన్న బండ్లో నుంచి నన్ను తోసేసినాడు! ప్లాటుపారమ్మీద బొక్క బోర్ల పడిపోయాను, వొక్కాలిరిగిపోయింది! అదింక పనికిరాదని పెద్దాస్పత్తిరి లోన తీసీసినారు!

అసలు ఆ కాలే అవిటిది! అదీ యిరిగిపోయింది! యిప్పుడు సంకలోన కర్రెట్టుకోని నడుసుకోడం నేర్చుకున్నాను. కర్ర గుచ్చుకుంటున్నాదని..  అలవాటయిందాక రోజూ యేడిసీవోడ్ని! ఆ బాబు తోసీసినప్పుడే సచ్చిపోయుంటే ఆ దేవుడి దగ్గరకే యెల్లి దండమెట్టీసుండేవాడిని.., నాకేటేటో గేపకం వొచ్చేస్తున్నాయి! కల్ల నీల్లు వొచ్చేస్తన్నాయి!

నేను పుట్టిన యాడాదికే మాయమ్మ నన్నొగ్గీసి యెటో యెల్లిపోయినాది..!. ఆ తరాత మా యయ్య యింకో అమ్మని తీసుకొని యెటో యెల్లిపోయ్నాడట.

వో రోజున నేను మా గుడిసిలోన యేడుసుకొని వుంటే వో బయరాగాయన వొచ్చి నన్ను యెత్తుకోని ఆడితో తీసుకెల్లి పోయ్నాడట! ఆ బయిరాగే నాకు అడుక్కోడం నేర్పించినాడు; వొక్కంట్లోన జిల్లిడు పాలు పోసినాడు! రొండు కల్లు బాగుంటే ముస్టెక్కువెయ్యిరట..! ముస్టి తక్కువొచ్చిన రోజున గట్టిగ కొట్టీవోడు! రొండో కంట్లోన జిల్లిడు పాలు పోసేస్తానని.. సంపీస్తానని బెదిరించాడు! నేను బయం పెట్టేసుకుని అక్కడ్నించి పారిపోయ్యాను. ఈ పట్నమొచ్చీసినాను,

వో రోజున వో సదుకున్న బాబును ముస్టడిగితే యివ్వలేదు! “నీవెలాగ ముస్టాడి వయినావోయ్..?” అనడిగినాడు. కతంత సెప్పినాను . అదంత యిని ఆ బాబు పకపకమని నవ్వినాడు!

“ముస్టోల్ల సేత.. ముస్టోల్ల కోసం.. ముస్టి వలన యిన్నాళ్లు పెరిగావన్నమాట..” అని మల్ల నవ్వినాడు! “నీలాంటి బెగ్గరుల వల్లనే ఈ దేసం పరువు పోతున్నాది.. పో.. ఎక్కడన్నా పని చేసుకుని బతుకు” అని కసిరీసినాడు! ఆ బాబు మాటలకు నాకేడుపొచ్చేసినాది. ముస్టెత్తుకోవాలంటే సిగ్గనిపించేసింది! మల్ల ముస్టెత్తుక కూడదని అనీసుకున్నాను. ఏదన్న పని సేసుకొని బతకాలనుకున్నాను. ఆ రోజు నుంచీ పని కోసం తిరిగినాను. యెవలూ యే పనీ యివ్వలేదు. రెయిలు పెట్టెల్లోన తుడిసీ పని కొన్ని రోజులు సేసినాను. అదిగో ఆ రోజుల్లోనే ఓ పెట్టె లోన వో మనీ పర్సు దొరికినాది. దాన్ని తీసి సూద్దును గదా.. వోలమ్మ బోల్డు డబ్బు! వో బాబు ఫోటో అందులోన కనిపించినాయి!

వోలమ్మ.. యీ బాబే నాకు అయిదు రూపాయలిచ్చినాడు పెట్లోన తుడిసినానని. గబీమని బండి దిగి సూసినాను. బాబు బిర్జీ మీద నుండెల్లిపోతన్నాడు. బాబూ.. బాబూ అని అరుసుకోని పరిగెత్తినాను. కుంటి కాలితోటి పరిగెత్తలేక పోయాను. అంతలోన వో పెద్ద మీసాల పోలీసాయన పులిలాగ నాకేసి సూసినాడు. నా దగ్గిరకొచ్చి సెంప మీద కొట్టి నా సేతిలోన పర్సు లాగేసున్నాడు!

“యిది నేను దొంగలాడనేదు. పెట్లోన దొరికినాది! అదుగో, ఆ యెల్లి పోతున్న బాబుదే! పరుసులోన అదిగో ఆ బాబు పొటో కూడ వున్నాది.. సూడండి” అని యెంత సెప్పుతున్నా యినిపించుకోకండా లాటి కర్ర తోటి గట్టిగ బాదీసినాడు! కుయ్యోమని యేడుసుకోని బయటికొచ్చేసినాను..! రెండు గంటలసేపు యేడిసి మల్ల పని కోసం తిరిగినాను. యెందరిని బతిమాలుతున్నా లేదు పొమ్మంటున్నారు. “యేం పని సేయగలవు రా కుంటాడివి.. గుడ్డోడివి” అని కసిరీసినోల్లే అందరు.

వో సారి వో మంచి బాబు నా పరిస్తితి సూసి నన్ను తీసుకొనిపోయి వొక అనాదలాస్రమం లోన సేర్పించినాడు. ఆ మనిసి బగమంతుడే నాకు. కాల్ల మీద పడి దండవెట్టినాను. అక్కడ కొన్రోజులున్నాను. అక్కడ తినేసి కూర్చోకండా నేను సేయగలిగే పన్లు సేసేవాడ్ని! మేవున్న ఆశ్రమం – యెవరో దరమాత్ముడు ఆయన జాగా లోన కట్టుకోనిచ్చినాడట..! కొన్నాళ్లకి ఆ దరమాత్ముడు పోయినాడు! ఆయన కొడుకులు ఆ జాగాని అమ్మేసి పంచీసుకున్నారు.. మాకు బుర్రకి అయిదొందల రూపాయలిచ్చి తోలేసినారు.

మల్ల నేను రోడ్డు మీద పడిపొయ్నాను. పన్లు కోసం తిరిగినాను. “నువ్వెందుకు పనికొస్తావ్.. అయినా నీవేం పన్లు సేయగలవ్ పో.. పో..” అని కసిరీసికున్నారే గానీ వొక్కలూ పనియ్యలేదు!.

వోసారి పోలీసోల్లు నేను సేయని దొంగతనం నా మీద తోసేసి.. జెయిల్లోన పెట్టీసినారు. అందుకాల్ల మీద కోపం రాలేదు. ఆల్లని మెచ్చుకని దండవెట్టుకున్నాను. జెయిల్లోన మూడ్నెల్లు ఆయిగ గడిసిపోయ్నాయి!

“వొరేయ్.. రేపుదయాన్న నిన్ను బయటకు పంపించేస్తాం రా.. రడీగుండు” అని మా జైయిలు జెవానొకాయన సెప్పినాడు. ఆ మాటినగానే మల్ల బయం పట్టీసుకున్నాది!

“మనుషులు పాపాలకు తప్ప మరింక దేనికీ బయపడకూడదు..” వోసారి వో సాములోరు వో పెద్ద గుడిలోన సెప్పుతుంటే యెల్లి యిన్నాను. ఆ సాములోరికి వొంటి నిండా బంగారమే! మనిసీ బంగారం రంగులోన పుస్టి గున్నారు.

‘యెంత పున్నేత్ములో’ అనీసుకున్నాను. మరి నేనేం పాపం సేసినానో తెలీదు..! శానా బయం పట్టీసుకున్నాది! బయం తోటి నిద్రొచ్చింది కాదు! ఆకలీ లేదు! వో రోజున జెయిల్లోనే టీవీ సూస్తుంటే వో మనిసిని సూపించినారు. ఆ మనిసి పెద్ద ముటాతో కలిసి సమద్రం మీద నుండి సీక్రీటుగ బొంబాయి వొచ్చేసినాడట! ఆ మనిసీ.. ముటావోలూ ఈ దేశపోల్లు కారట! ఆల్లొచ్చి ఆ బొంబాయి లోన శానామందిని సంపీసినారట! సచ్చిపోయినోల్లకీ.. ఆ ముతావోల్లుకి మద్దిన యే గొడవలూ లేవట! మరెందుకని ఆ ముటా వోల్లు సంపీసినారో తెలీదు! కానీ ఆ ముటాలోని వో మనిసి – ఆడు వొక పెద్ద వోటేల్లోన దిగినోల్లందరి సంపేత్తుంటే పోలీసోల్లకి దొరికి పోయ్నాడంట! ఆడ్ని పట్టుకొని జెయిల్లోన పెట్నారంట! ఆ సంపినోడికీ పెతీ రోజూ పల్లూ పాయిసాలు.. సేపలు.. మాంసాల తోటి బోయినవెడతన్నారట.. అడిగినవన్నీ యిచ్చేసి యింటల్లుడిలాగ సూసుకుంటన్నారట! ‘అంతలాగ నాకు సూడక్కర్లేదు! నేనీ దేసమ్మనిసినే. నేనెవుర్నీ సిన్న దెబ్బయినా కొట్టినోడ్ని కాదు కాబట్టి కి నా మీద దయ సూపించి రోజు కొక్కసారి యింత గెంజన్నం పెడితే సాలు.. ఉత్తి పున్నేనిక్కాదు.. నా సేత ఏదయిన పని సేయించుకొని పెడితే సాలు ..!’ అని శానా సార్లు అనీసుకున్నాను.

ఆ రాత్తిరంతా నిద్దరొచ్చింది కాదు. రేపెలాగరా బగమంతుడా అనే ఆలోసన్లు! రాత్తిరెల్లిపోయి పొద్దొచ్చీసింది! పదిగంటలకే బయటికి యిడిసి పెట్టేసినారు! మల్ల రోడ్డు మీద కొచ్చీసినాను. కానీ నెల్లోపునే మల్ల లోన కొచ్చేసినాను.

యేటి కత..? అని లోపలున్న నా స్రేయితులు అడిగినారు. మద్దిమద్దిన పొర్లుకనొస్తున్న యేడుపును మింగుకొని సెప్పినాను.

వో రోజున వో యాస్పత్తిరి కాడ నిలబడుంటే వొక మనిసి నన్ను సూసి నా సంగతి అడిగి తెల్సుకున్నాడు. జాలి సూపించి వోటేలుకు తీస్కుపోయి కడుపు నిండా బోయినం పెట్టించినాడు.

“యిదిగో వో పని సేస్తావా..? శానా శానా డబ్బిస్తారు.” అన్నాడు. పని అనగానే శానా సంతోసమేసి అతనెనకాల యెల్లాను. ఆ మనిసి అక్కడేదో సెప్పినాడు. “నీవు శాన నీర్సంగ వున్నావు.. మరి పని సెయ్యాలంటే శాన బలముండాల గద. ఆస్పత్రికి పద, బలమ్మందులు యిప్పిస్తాను” అన్నాడు. నిజమే, సరయిన తిండి లేక గదా నీర్సపడి పోయున్నానని అనుకోని అతనెనుకాలే యెల్నాను. మర్సటి రోజున ఆ యాస్పత్రి మంచమ్మీద శవం లాగ పడుకొని వున్నాను. తెలివొచ్చి అక్కడోల్లని అడిగినాను. తిండి లేక శాన నీర్సమయిపోయున్నానని పరీచ్చలు సేసినారట! పేగు కుల్లి పోయిందనీ.. అర్జింటుగ తీసేకపోతే సచ్చిపోతానని సెప్పి తీసేసినారట! బొడ్డు దగ్గర శానా నొప్పెడుతుంటే అడిగితే సెప్పినారు..

పేనాలు కాపాడిన దరమరాజులని ఆల్లకి దండవెట్టినాను. వారం రోజులుంచి పంపీసినారు.. నా సేతల పదేల రూపాయలెట్టినారు! ఎందుకు బాబూ.. డబ్బిస్తున్నారని అడిగినాను.

నీవు శానా పేదోడివని తెల్సినది. బాగ డబ్బున్నాయన నీ సంగతి తెల్సి ఈ డబ్బిచ్చినాడు. ఈ డబ్బుతోటి మందులు.. పల్లు కొనుక్కో.. బాగా తిను. మంచి ఆరోగ్గిం వస్తాది.. యెల్లు.. అని బోద సేసి పంపీసినారు. ఆ డబ్బిచ్చిన బాబెవలో తెలీదు.

మల్ల బగమంతుడే ఆ బాబులా గొచ్చి డబ్బిచ్చినాడని పొంగిపోయి దండవెట్టేసుకున్నాను. తరాత ఆ డబ్బు తోటి యేటి సేసుకోవాలో ముందల ఆ డబ్బెక్కడ దాసుకోవాలో తెలీక బయపడిపోయాను. మనుసు సాంతి సేసుకోని తీరిగ్గ ఆలోసించాలనుకున్నాను. అంతలోన ఆకలి గేపకమొచ్చినాది. మంచొటేలుకు పోయి కడుపు నిండ తిన్నాను. తరాత బయం లేకండ రొండ్రోజులన్నా పడుకోడానికని వో సవక రకం లాడిజీ లోన దిగినాను. యేం పన్లు ఈ డబ్బుతో సేసుకోవచ్చునో.. యే యాపారాలు గట్రా సేసుకవచ్చునో – అని ఆ రాత్తిరంతా పడుకకండా ఆలోసిత్తన్నాను. మద్ది రాత్తిరయినాదో లేదో తెలీదు!

లాడిజీ లోన కేకలు.. అరుపులు.. గోలగోలయి పోయింది! పోలీసోల్లొచ్చి ఆ లాడిజీలో వున్న ఆడోల్లనీ.. మగోల్లనీ యీడ్సుకోని పోయినారు. నన్నూ బరబరా యీడ్సేసి తీస్కుపోయినారు! అలాగ యెందుకు యీడ్సుకని పోతన్నారా.. నేను సేసిన తప్పేటో అడిగినా సెప్పలేదు.. సరిగదా రొండు సెంపల మీద పడీ పడీ మని దెబ్బలు కొట్టేసినారు. ఆ గందరగోలం మద్దిన నా డబ్బేటయినాదో నాకు తెలీదు! డబ్బు పోతేపోనీ నేను మల్ల మీ దగ్గిర కొచ్చినాను. అదే సంతోసం..!

బయిట రోడ్డు మీద మీటింగొకటి పెట్టున్నారు! ‘దేసానికి సతంత్రమొచ్చి డబ్బయ్యేల్లు పైనే అయినాయి. అయినా పేదోడి బతుకులు మార్లేదు! యింకా యే రోడ్డున సూసినా యే మురికివాడల సూసినా పేదోల్లు.. నిరుపేదలే! ఆల్ల బతుకులు బాగుపడాల..! మా పారిటీ గెలిస్తే అల్లందరికీ పనీ.. డబ్బూ యిస్తాం..’ అని గట్టిగ మయికులోని సెప్తున్నారు! నా కాస పుట్టింది. ఆ పారిటివాల్లు, గెలిసీ లాగ సూడు తండ్రి అని ఆ బగమంతుడికి దండపెట్టుకున్నాను.

అది సూసినారు మా స్రేయితులు –

“వొరే.. ఎంతమాయికుడివి రా నువ్వు.. నీ కిడినీని నీకు తెలీకుండా తీసేసి ఇంకోల్లకి అమ్మీసుకుని నీ సేతల పదేల రూపాయలెట్టేసినార్రా.. ఆల్లు లచ్చల్లచ్చలకి అమ్మేసుకున్నార్రా.. సీమకున్నంత లోకగేనమయినా లేదురా నీకు.. యెలాగ బతుకుతావురా..” అని రకరకాలుగ మాటలాడినారు! నేను అయోమయిపోయాను. తరాత రొండు నెలలకి గావాల మల్ల బయటికొచ్చేసినాను.

మల్ల నా కత యెనకటి కొచ్చీసినాది! కిడినీ తీసిందగ్గర సీము పట్టేసింది. రగతం లేని వొంట్లోన నీరు పట్టేసి పెద్ద జబ్బే పడిపోయానట..!

సెతన లేక బసులటేండు లోన పడిపోయున్నానంట! వో దరమాత్ముడు సూసి ఆస్పత్తిరి లోన సేర్పించినాడు. ఆ రోజు నా యదురుస్టం..! పెద్ద మంతిరి ఆ యాస్పత్తిరి కొచ్చి తనికీ సేసినాడు. మంచాల్లేవని మరుగు దొడ్లు దగ్గిర పడేసిన నన్ను గబగబ తీస్కెల్లి మంచమేసి పడుకోబెట్టి వేయిజ్యం సేసినారు! మల్ల నా యదురుస్టం.. ఆ మంతిరి బాబే నా దగ్గిర కొచ్చి పరామర్శ సేసినాడు. నా రోగమేటో డాట్టర్ల నడిగి తెలుసుకున్నాడు. ఆ బాబెనకాల జనమే జనం.. అందరూ ఫోటోలు తీయించుకున్నారు! డాట్టరూ.. యిదిగో యితనికి మంచి వాయిజ్యం సేసి పంపించాల.. అని అడ్డరేసినాడు.. నా పక్కన్నిలబడి మల్ల పొటో తీయించుకున్నాడు. నేను మల్ల వారం తరలొచ్చి తనికీ సేస్తాను అని సెప్పీసి యెల్లి పోయినాడు! బాబుకు శాన సార్లు దండమెట్టీనుకున్నాను.

పది రోజులగ్గావాల.. బాగయిపోనానని సెప్పి పంపించేసినారు! ఆ మంతిరి బాబు మల్ల వస్తాడేటా అని సూసినాను. గానీ ఆ బాబు రాలేదు! ఆఁ.. సెప్పడం మర్చిపోయ్నాను ఆ మరుగు దొడ్ల దగ్గిర పడున్న రోజు రాతిరి నాకో కలొచ్చింది! నేను సచ్చి పోయున్నాను..! నా యాత్మ పచ్చిలాగ మారి నా కట్టి నొదిలేసి బయటికి యెగిరెల్లిపోయింది! దిక్కులేని నా కట్టి కోసం యెవలూ రాలేదు! మూడ్రోజుల తర్వాత ఆస్పత్తిరోల్లు మునసపాలోల్లకి కబురెడితే ఆల్లొచ్చి తీస్కుపోయి సెత్తలు నా కట్టి మీద కప్పీసి కాల్చీసినారట! నా కట్టి కాలుతుంటే యెగిరెల్లి పోయిన ఆ పచ్చి మల్ల వొచ్చి వో సెట్టు మీద కూసోని యేడుసుకుంటున్నదట..! యెందుకలాగ యేడుస్తున్నాదని అనుకుంటున్నానట! అంతలోన నాకు గబుక్కున తెలివొచ్చీసినాది! తెలివొచ్చేసింతరాత వొకాయన సెప్పిన మాటలు గేపకం వొచ్చినాయి! ఆ మనిసి యెవరో కాదు.. బంగారం రంగు మనిసి! గుడిలోన మంచి మాటలు సెప్పారన్నారే ఆ సాములోరే.

ఆ మాట లేటంటే..

ఆత్మ యేరు.. సెరీరం యేరు..! సచ్చిపోయాక సెరీర మొదిలేసి ఆత్మ యెల్లిపోతాది! ఆత్మ లేని సరీరంతో యేటి సాదించలేము. కాబట్టికి సెరీరం లోన ఆత్మ వున్నప్పడే యెవులికయినా.. యేదయినా మంచి పని సేయాలి.. వుపకారం సేయాల..! అని యేటేటో సెప్పినారు! నాకు శానా సంతోసమేసినాది! యెందుకంటే నా యాత్మ నా సెరీరంలో వున్నప్పడే కద నా కిడినీని మరో మనిసి కిచ్చి ఆ మనిసి పేనం కాపాడినాను! ఆ మాట మా వోల్లతోటంటే ఆల్లు ఆ రోజంత నన్ను బాగ తిట్టినారు!

“వోరి యెర్రి మొగవా.. నీ కిడినీని నీకు తెలీకుండ తీసేసి అమ్మీసి లచ్బలు దొబ్బేసినార్రా యెదవా..” అని!

ఆ డబ్బు పోయిందని నాకు బాద లేదు. పోతే పోనీ, ఓ మనిసి పేనం కాపాడినాను కదా.. అని శాన సంతోసమయి పోయినాను! అన్నట్టు సెప్పడం మర్చిపోయ్నాను.

ఆస్పత్తిల్లోన నా పక్క పేసంటు నా గురించి అడిగి తెల్సుకోని దరమారావు బాబు గురించి సెప్పినాడు! ఆ బాబుకు యెన్నెన్ని దండాలెట్టినా తక్కువే! యెన్ని జనమలెత్తినా ఆ బాబు రునం తీర్చుకోలేం..! ఆ బాబు మా లాంటోల్లనే కాపాడానికి ఆశ్రమమొకటి పెట్టున్నాడు. నాలాంటి దిక్కులేనోల్లు.., ఆదరించేవోలు లేక అనాదలయిపోయినోల్లనీ, ముసిలోల్లనీ సేరదీసి కాపాడుతన్నాడు.. నేను యెల్లి నా కత సెప్పగానే సేర్సుకున్నారు.

పొద్దుట టిపినీ.. రొండు పూట్ల మంచి బోయిన మెడతన్నారు! జబ్బులు.. జొరాలొస్తే డాక్టర్లని తీసుకోనొచ్చి మందు లిప్పిస్తున్నారు..! దరమ తండ్రి!

రొండ్రోజులు యే పనీ లేక తినీసి తొంగుండిపోయినాను.., అలాగ యాశ్రమం లోన వుండి పోవడం నాయం కాదనిపించేసింది నాకు.

“బాబూ.. సూడానికి నేను వొంటి కన్ను గుడ్డోన్నే.. వొక్కాలు కుంటాన్నే. కానీ పన్లు మాత్తరం సేయగల్ను..! నాకేదయిన పని సూపించి యింత బువ్వెట్టండి సాలు..” అని దండవెట్టినాను.

“నీ యాత్మ దైర్నానికి మెచ్చుకుంటన్నానయ్యా..” అని నవ్వినాడా బాబు. ఆశ్రమం తోట లోన మొక్కలికి నీల్లు పెట్టడం.. ఆటి మంచి సెడ్డలు సూడ్డం, టయానికి యెరువూ.. గెత్తమెయ్యడం.. గోసాల పనీ అన్నీ నేర్చుకొని సేయడం మొదలెట్నాను..! యిదిగో.. యీ కర్ర కాలు ఆ బాబే సేయించి యిప్పించినాడు!

కూడుకీ.. గుడ్డకీ.. నీడకి.. ఆ బగమంతుడే ధరమారావు బాబు లాగొచ్చి దారి సూపించినాడని శాన సంతోసమయి పోయినాను.. అదీ బాబు నా కత..!

బాబూ.. నాలాగ నువ్వు సదువులేనోడివి కాదు.. గుడ్డోడివీ.. కుంటాడివీ కాదు.. తల్లిదండ్రుల్లేని అనాదవీ కాదు. పెద్ద చదువునే సదివానన్నావు. సదువూ వుండి.. అయినోల్లు.. కన్నోల్లు అందరూ వుండి.. వుజ్జీగం రాలేదని ఒక్క సెనంలోన నిరాసపడిపోయి రెయిలు బండి కింద బడి సచ్చిపోదావని యెల్లడమేటి బాబూ.. తప్పు .. శానా తప్పు..! మనుసు గట్టి సేసుకోని ఆలోసించు.. ఈ రోజు కాకపోతే రేపు లేదా..? ఆ బగమంతుడు యీ రోజొక్కటే యిచ్చేసి వూరుకున్నాడా..? రేపు అనేది మల్ల మల్ల యిస్తున్నాడు కదా.? యేమో.. యెవలు సెప్పగల్రు.. రేపో ఆ తరాత రేపో నీకు మంచుజ్జగం రాదా.. బతుకులోన సంతోసం నిండదా..? యేటి బాబూ.. కాదనీగలవా..? బాబూ.. నేను నీలాంటోల్లకి సెప్పగలిగేవోడ్ని కాదు.. అంత గేనమూ లేదు.. అనాద బికారోడ్ని.. ఒక్కమాటినుకే బాబూ. సెప్తా ..

పయిన బగమంతుడున్నాడు. కింద బూదేవతున్నాది. బగమంతుడు గాలీ నీలూ.. అగ్గి లాంటివి యిస్తున్నాడు. భూదేవత పంటలకని మట్టి యిస్తున్నాది. యియన్నీ మనుసులు.. జీవాలు అన్నీ బతకడానికే కద! కాబట్టికి పైన ఆ బగమంతుడు క్రింద యీ బూదేవతా నీకు రచ్చించడానికే వున్నారని గట్టిగ నమ్ముకో బాబూ.. బలిమిన పేనం తీసుకోకు.. అయినా యింత సదివిందీ పేనం తీసుకోడానికా..? తప్పు బాబూ.. మల్ల అలాంటి పని సెయ్యకు.. యెప్పుడూ సెయ్యకు..

బాబూ, వోసారి వో సాములోరు సెప్పింది నీకు సెపుతాను.. యినుకో బాబూ.. అయి శానా మంచి మాటలు..! అలాంటియి యెవులు సెప్పినా సెవిలోకెక్కించుకోవాలట..!

బగమంతుడు పెతీ మనిసికి బతకడానికొక గీత రాస్తాడట..!! తొందరపడి ఆ గీత దాటకూడదట..! మనం కావాలనుకోని దాటాలన్నా దాటలేమట..! కష్టాలు రానీ సుకాలు రానీ ఆ గీత లోపలే వుండి అనబగించాలట.. ఆటినే కర్మ పలాలు అంటారట! మనం దేనికెంత పలం? అని ముందాలోసన సెయ్యకండా మన పనులు అంటే మంచి సేసే పనులు సేసుకోని పోవాలంట..! సివరాకరికి ఆ పలాలన్నీ ఆ బగమంతుడే యిస్తాడంట! అయన్నీ మల్ల ఆయనే సొయంగ సెప్పినాడంట! అదే బగమంతుని గీత అంట! యిలాంటి గొప్ప గొప్ప మాటలు తెలివి గేనం లేక అరదం సేసుకోవేక వొక అనాద బతుకు బతకలేక ఆ గీత దాటీయాలని శానా సార్లు పెయత్నించినాను. కానీ యేటయింది..? నా కతంత యిన్నావు గదా.. కొంచెం సేపు ఆలోసన సెయ్యి మరి..” కొన్ని క్షణాల విరామం తర్వాత..

“యేరా గుడ్డోడా.. నా సావు నేను సావడానికని నా దారిన యెల్తున్న నన్ను సావనీకండా బయటికి లాగి.. యిక్కడ కూసోబెట్టి.. నీ కతంత సెప్పీసి నా బుర్ర బాద పెట్టీడమెందుకురా..? నా బాదలు నువ్వు తీరుస్తావా..? ఆరుస్తావా..?” అని కోపం తెచ్చుకోని నీవేదన్నా అనొచ్చు.. నేను పడతాను. కానీ యెందుక్కాపాడినానో తెల్సునా బాబూ.. నువ్వు నాలాంటి మనిసివే.. వొక మనిసి తోటి మనిసిని కాపాడలేకపోతే యెందుకీ మనిసి జనమ! మనిసి ఏ బస్సో లారో గుద్దేసి సచ్చిపోడానికి రడీ గున్నా.. మరెలాగో పేనం పోయి రోడ్డు మీద పడున్నా.. సేయవలసింది సేయకండా.. పక్కన్నిలబడి పొటోలు తీయించుకుంటన్నారని మావోల్లు సెప్పుకోవడం నేను శాన సార్లు యిన్నాను. బాబూ.. ఆల్లవీ మనిసి జనమలేనా..? కలికాలంల యిలాగే జరగతాయంట మరి..!

“బాబూ.. బతుకు మీద ఆస వదిలేసుకుని తిండీ శాన దినాల నుండి మరిసి పోయినట్టున్నావు.. ముందు వెల్లి నీ యాకలి తీర్సుకో.. యెల్లు..” అంటూ మూడు పది రూపాయల నోట్లను ‘అతని’ చేతిలో పెట్టాడు ‘కత’ ముగించి!

అప్రయత్నంగా అందుకున్న అనంత్.. బి. టెక్.కు అనంతాకాశంలో ఒక విశ్వరూపం గోచరించి.. కర్తవ్యం బోధించినట్లుగా అనిపించింది! నిశ్చేతనతో వుండి చాలా సేపు – కర్ర కాలుతో దీటుగా నడుచుకుంటూ వెళ్లి పోతున్న అతన్నే చూస్తూ వుండిపోయాడు! కాస్సేపటికి మెల్లగా తేరుకున్నాడు!

రావి చెట్టు చెప్టా మీద నుండి లేచాడు! మళ్లీ రైలు పట్టాల వైపు కాక మరో వైపుకు అడుగులు వేసాడు.

ఆ మునిమాపువేళ.. పూర్ణ చంద్రోదయం అవుతుండగా దానివైపే దృష్టి సారించాడు!

Exit mobile version