Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గెలిచేదాకా పోరాడు-1

[శ్రీమతి పెబ్బిలి హైమవతి రచించిన ‘గెలిచేదాకా పోరాడు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

“జగమంతా దగా చేసినా.. చిగురంత ఆశను చూడు!”

ఎక్కడి నుండో అలలు అలలుగా పాట తేలి వచ్చి రవి చెవులకు సోకుతోంది. అయినా అతడిలో ఎలాంటి చలనమూ కలగలేదు.

కన్నీళ్లతో చెంపలు తడిసిపోగా తుడుచుకోవాలి అనే ఆలోచన కూడా అతడికి కలగలేదు.

ఇంతలో రవి సెల్ మోగింది. యాంత్రికంగా సెల్ అందుకొని “హలో!” అన్నాడు రవి.

“హలో రవీ, నేను శృతిని.. ఎలా ఉన్నావు?” అని అడిగింది శృతి అనురాగం అంతా గొంతులో నింపి. ఆమె నుండి ఫోన్ రావడంతోనే అప్పటి వరకూ నిస్తేజంగా పడుకుని ఉన్న రవి చటుక్కున లేచి కూర్చుని “బాగానే ఉన్నాను శృతీ!” అన్నాడు నిర్లిప్తంగా.

“నువ్వు బాగున్నానని చెప్పినా, నీ మాటల్లో వద్దన్నా ఎంత నిరాశ తొంగి చూస్తున్నదో తెలుసా నీకు? జరిగింది దారుణమే రవీ.. దాన్ని పదే పదే తలచుకొని బాధపడడం వలన ప్రయోజనం ఏమైనా ఉందా? మనసు కుదుట పరచుకో ముందు!” అంది శృతి ఓదార్పుగా.

“ఎలా శృతీ, కళ్లు మూసినా తెరిచినా కళ్ల ముందు అదే దృశ్యాలు మెదులుతున్నాయి.. అసలు నాకు బ్రతకాలనే అనిపించడం లేదు” అన్నాడు నిరాశగా.

“అదే చాలా తప్పు రవీ.. యుద్ధం చేయకుండా, ఓటమిని అంగీకరిస్తున్నావు నువ్వు. అది ఆత్మహత్యతో సమానం అనే విషయం తెలుసా నీకు? ‘ప్రయత్నించి ఓడిపో.. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు’ అన్నారు రవీంద్రనాధ్ ఠాగూర్. దాన్ని ఒక్కసారి స్మరణకు తెచ్చుకో.. అసలు జరిగింది పదే పదే తలచుకుంటూ అక్కడే ఉండి కుమిలిపోవడం వలన ప్రయోజనం ఏమైనా ఉందా? వెంటనే విశాఖ వెళ్లిపో.. వెళ్లేముందు ఇక్కడికి ఒకసారి వచ్చి వెళ్లు!” అంది శృతి అనునయంగా.

“విశాఖపట్నం వెళ్లి ఏం చేయాలి నేను? మొన్న నేను అక్కడకి వెళ్లినప్పుడు వాళ్లందరూ నన్ను చుట్టుముట్టి ‘మా డబ్బు మాకు తిరిగి ఇమ్మని లేదా ఫ్లాట్స్ అయినా కట్టి ఇమ్మని’ అని ఎంత గొడవచేశారో నీకు తెలుసు కదా. వాళ్లు నేను చెప్పేది వినిపించుకోకుండా అలా మాట్లాడుతూ ఉంటే నేనేమి చేయగలను?” అన్నాడు రవి నిరాశగా.

“అలా అని చేతులు ముడుచుకుని కూర్చుంటావా రవీ? నీకు ఇంత అన్యాయం చేసిన వారు హాయిగా తిరుగుతూ ఉంటే నీకు బాగుంటుందా? ఏదో ఒకటి చెయ్యి!

నీవు ఇప్పుడు ఒక్కడివి కాదు.. నీ వెంట నేను ఉంటాను. తోడుగా జీవితాంతం! ఆ పైన అన్నయ్య వదినా మీ స్నేహితులు ఉన్నారు. ఎక్కువ ఆలోచించకుండా వెంటనే బయలుదేరు!” అంటూ ఎన్నో ధైర్య వచనాలు చెప్పింది శృతి.

కొంచెంసేపు శృతితో మాట్లాడేక అతడి మనసు కుదుట పడింది.

ఫోన్ పెట్టేశాక.. నిజమే, జరిగినదానిని తలచుకొని ఏడుస్తూ కూర్చుంటే ఏమీ ప్రయోజనం లేదు. ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు.

తనని కార్యోన్ముఖుడ్ని చేసి నడిపిస్తున్న శృతిని తలచుకోగానే రవి మనసును ఆవరించుకుని ఉన్న బాధంతా మటుమాయం అయిపోయింది.

నిజంగా ఎడారిలో ఒయాసిస్సు లాంటిదే నా శృతి. తనే లేకపోతే నేను ఏమైపోయేవాడినో? అనుకున్నాడు.

వెంటనే ఒక నిశ్చయానికి వచ్చినవాడిలా అక్కడి నుండి లేచాడు రవి.

శృతి చెప్పినట్లే బేగ్‌లో బట్టలు సర్దుతుంటే తండ్రి తరచూ అనే మాటలు గుర్తుకు వచ్చాయి..

తండ్రి గుర్తుకు రాగానే అతడి కంట్లో తిరిగి క్రిష్ణా, కావేరీ గంగలు పొంగాయి. ఎలాగో తనను తాను సంబాళించుకున్నాడు. ఇంటికి తాళం వేసి బేగ్ పట్టుకుని బయటకు నడిచాడు.

సరాసరి చలపతి ఇంటికి వెళ్లాడు రవి. అతడు వెళ్లే సరికి చలపతి ఇంట్లో లేడు.

సావిత్రి అతడిని చూడడంతోనే “రవీ ,ఈవేళప్పుడు ఎక్కడికి ప్రయాణం?” అని అడుగుతూ మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది.

మంచినీళ్లు తాగి గ్లాసు పక్కన పెడుతూ “విజయవాడ వెళుతున్నాను అత్తా, అటునుండి అటు విశాఖపట్నం వెళ్తాను. మావయ్య వచ్చాక చెప్పు. నేను చెప్పకుండా వెళితే మావయ్య కంగారు పడతాడని ఇలా వచ్చాను!” అన్నాడు రవి.

“సరే , ఆలాగే చెప్తానులే కాస్త అన్నం తిని పో.. లేచి కాళ్ళు కడుక్కో ఈలోగా వడ్డించేస్తాను” అంది సావిత్రి ఆదరంగా చూస్తూ.

రవి లేచి కాళ్ళు కడుక్కుని వచ్చి భోజనానికి కూర్చున్నాడు.

అతడికి భోజనం వడ్డిస్తూ “జాగ్రత్త నాన్నా, జరిగింది మనసులో పెట్టుకొని అదే పనిగా ఆలోచిస్తూ దిగులు పడకు.. నాన్న ఎప్పుడూ మా అందరికీ చెప్పేమాట ఏమిటో తెలుసా? ‘భయం నీ ఓటమికి కారణం అయితే ఓర్పు పట్టుదల నీ విజయానికి మూలధనం అవుతుంది’. కనుక ఏది ఎలా జరిగినా ధైర్యంగా ఉండి ముందుకు సాగాలి అని చెబుతూ ఊరిని అంతటినీ ఒక్కతాటిపై నడిపించారు. నువ్వు కూడా నాన్న మాటలను ఆచరణలో పెట్టు. తప్పక ఈ కష్టాలను అన్నింటినీ అవలీలగా అధిగమించ గెలుపు సాధించ గలుగుతావు!” అంది సావిత్రి.

ఆమె మాటలు విని ఆశ్చర్యపోయాడు రవి. ఏమీ తెలియని అమాయకురాలిలా ఉండే అత్త ఎంత కరెక్ట్ గా చెప్పింది అనుకున్నాడు.

భోజనం ముగించి లేస్తూ “అలాగే అత్తా , నువ్వు చెప్పినట్లే చేస్తాను. వెళ్లి వస్తాను. మావయ్య వచ్చాక చెప్పు” అంటూ చెప్పులు వేసుకొని బయటికి నడిచాడు రవి.

దారి పొడుగునా ఏవేవో ఆలోచనలు అతడి మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉన్నాయి. అయితే నిన్నటిలా అతడిని కమ్ముకున్న దిగులు మేఘాలు ఈరోజు అతడి మనసును ఏమీ బాధించడం లేదు. శృతి, సావిత్రి చెప్పిన మాటలు అతడిలో కొత్త ధైర్యాన్ని నింపాయి.

“ప్రతి ఉదయం నీలో ఒక సరికొత్త ఆలోచనకు అంకురార్పణ జరగాలని, నీవు వేసే ప్రతి అడుగూ ప్రగతి దారిలో పయనించి ఉన్నత శిఖరాలకు చేరుకునే దిశగా సాగాలని.. అన్ని వేళలా గెలుపు నీ స్వంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను”.

శృతి ముందు రోజు పెట్టిన మెసేజ్‌ను పదే పదే మననం చేసుకున్నాడు రవి.. కంట్లో నుండి ధారగా కారే కన్నీటిని తుడుచుకున్నాడు. స్థిరచిత్తంతో ప్రయాణం కొనసాగించాడు.

ట్రైన్ దిగి అత్తవారింటికి బయలుదేరాడు రవి. అత్తవారిల్లు దగ్గరే కనుక ఉల్లాసంగా నడవసాగాడు. చాలా రోజుల తర్వాత శృతిని కలుసుకుంటున్నాను అనే ఆనందం అతడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.

తల్లిని తీసుకు వెళుతూ తన అక్క శాంతి చెప్పిన మాటలు రవి మనసులో మెదిలాయి.

“తమ్ముడూ, ఏ ఒక్కరి జీవితమూ పుట్టుకతోనే పూలవనం కాదు. అందరి జీవితాలూ పడిలేచే కెరటాల వంటివే. అసలు ఈ భూమి మీద సమస్యలు లేని మనుషులు ఎవరూ ఉండరు. అందుకే రేపటి మీద ఆశతో నమ్మకంతో బ్రతుకుదాము. ఏదో నాటికి ఈ సమస్యల వలయం నుండి తప్పక బయట పడతాము. ఆ నమ్మకం నాకు ఉంది” అంది.

 అనుభవంతో అక్క చెప్పిన ఆమాట ఎంత నిజం అనుకున్నాడు రవి. నా మేలు కోరే ఆత్మీయులు అందరూ చెప్పినట్లు ఇంతవరకూ జరిగిన చేదు అనుభవాలను పక్కకు నెట్టేసి కొత్త జీవితం ప్రారంభించాలి అనుకోగానే అతడిలో కొత్త ఉత్సాహం వచ్చి చేరింది.

 శృతితో గడిపిన అందమైన సాయంత్రాలు రవి మనసులో మెదిలి మరింత చురుకుగా అడుగులు ముందుకు వేశాడు.

సాధారణంగా రవి ఈ బండికే వస్తాడు కనుక పానకాలరావు అతడి రాక కోసం వరండాలో ఎదురు చూస్తూ కూర్చున్నాడు.

రవి రావడంతోనే మునుపటిలా సాదరంగా ఆహ్వానించ లేదు. “బాగున్నావా రవీ?” అంటూ పొడిగా పలకరించి “రా, కూర్చో!” అంటూ వరండాలో ఉన్న కుర్చీ చూపించాడు.

పరాయివారు ఎవరైనా అతడ్ని కలుసుకునేందుకు వస్తే, హాల్లోకి పిలవకుండా వరండాలో ఉన్న కుర్చీల్లోనే కూర్చోబెట్టి మాట్లాడి అటునుండి అటే సాగనంపడం పానకాలరావుకి అలవాటు.

ఇప్పుడు రవిని కూడా ముభావంగా పలకరించి వరండాలోనే కూర్చోబెట్టేశాడు ఆయన.

ఫ్రెషప్ అయి వచ్చేందుకు లోపలికి వెళ్లబోతున్న రవిని ఆపేశాడు పానకాలరావు.

“రవీ, నీతో మాట్లాడాలి, ఇలా కూర్చో!” అంటూ.

అతడి ఆలోచన ఏమిటో తెలియని రవి, ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ “చెప్పండి మావయ్యా!” అన్నాడు.

“రవీ, నీకు ఇలా చెప్పవలసి వచ్చినందుకు నాకు చాలా బాధగానే ఉంది. అయినా చెప్పక తప్పడం లేదు..” అంటూ ఆగాడాయన.

“ఏ విషయం మావయ్యగారూ?” అనడిగాడు రవి అతడి ఆంతర్యం ఏమిటో తెలియక.

“అదే రవీ, మీ పెళ్లి విషయం..” అంటున్న పానకాలరావు మాటలను పూర్తి చేయనివ్వలేదు రవి.

“నాన్నగారు పోయి సంవత్సరమైనా కాలేదు కదా.. ఇంకో పక్క నేను చాలా సమస్యల్లో ఇరుక్కుని ఉన్నాను. ఇలాంటి సమయంలో పెళ్లేమిటండీ?” అన్నాడు రవి విస్మయంగా చూస్తూ.

“అదే రవీ నేనంటున్నది కూడా.. శృతి నాకు ఒక్కగానొక్క కూతురు. దాన్ని పువ్వుల్లో పెట్టి పెంచాను. నీకు చూస్తే ఇప్పుడు సెంటు భూమి కూడా లేదు. అలాగే రూపాయి ఆదాయం వచ్చే మార్గం కూడా కనిపించడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో శృతిని పెళ్లి చేసుకుని దాన్ని ఎలా సుఖపెట్టగలవు? అందుకే రవీ, మీ సంబంధాన్ని మేము వదులుకుందామని నిర్ణయించుకున్నాము” అన్నాడు పానకాలరావు.

అతడి మాటలు వింటూనే రవి నిశ్చేష్ఠుడయి పోయాడు.. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని అతడు కలలో కూడా అనుకోలేదు.

ఎన్ని బంగారు కలలు కన్నారు.. అవన్నీ కలలేనా? తనూ, శృతీ కలిసి భవిష్యత్తు కోసం ఊహించిన ఊహలన్నీ ఇలా గాలిమేడలై కూలిపోవలసిందేనా?     ఎంతో ఆదరంగా మాట్లాడే మావయ్యగారు ఈరోజు ఎందుకిలా మాట్లాడుతున్నారు అనుకున్నాడు.

శృతి లేకపోతే అతడికి జీవితమే లేదనిపించింది. శృతి లేని జీవితాన్ని అతడు ఊహించుకోలేక పోయాడు. బాధతోనూ, ఆవేశంతోనూ రవి మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది.

అతడి కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లుగా, ప్రపంచం అంతా గిర్రున తిరిగి పోతున్నట్లుగా అనిపించడమే కాదు, కళ్లు చీకట్లు కమ్మినట్లుగా అనిపించింది. ఆసరా కోసం కుర్చీ హేండిల్ పట్టుకున్నాడు రవి.

ఒక్క క్షణం అచేతనంగా ఉండిపోయాడు. చివరికి అతి ప్రయత్నం మీద మాటలు కూడదీసుకుని “ఏంటండీ మీరంటున్నది, శృతిని నాకిచ్చి చేయరా.. ఈ సంగతి శృతికి తెలుసా?” అని అడిగాడు రవి పానకాలరావు వంక అపనమ్మకంగా చూస్తూ. ఎందుకంటే శృతి మనసేమిటో అతడికి క్షుణ్ణంగా తెలుసు కనుక.

“తెలుసు, మేమందరమూ కలిసి కూర్చునే ఈ నిర్ణయం తీసుకున్నాము” అన్నాడు పానకాల రావు తొణకూ బెణుకూ లేకుండా.

రవి పానకాలరావు వంక అపనమ్మకంగా చూస్తూ “నేను నమ్మను.. శృతి అలాంటి నిర్ణయం ఎన్నటికీ తీసుకోదు. అలా తీసుకుని ఉంటే, నన్నీ రోజు ఇంత దూరం ఇక్కడికి రమ్మని పిలిచేదే కాదు. ఎందుకంటే నిన్న తను నాతో జరిగిందంతా మరిచిపోయి, రేవటి నుంచి మనిద్దరం కొత్త జీవితం ప్రారంభిద్దామని ఎంతో ధైర్యం చెప్పింది. నాకు ధైర్యం చెప్పి నన్ను ప్రోత్సహించిన శృతి ఇంతలోనే ఇలా ఎలా మారిపోయింది? ఏదీ, ఒకసారి శృతిని పిలవండి నేను మాట్లాడుతాను!” అన్నాడు రవి ఆరాటంగా అతడి వంక చూస్తూ.

“ఏమీ అవసరం లేదు, నేను చెప్తున్నాను కదా.. ఇదే ఫైనల్! ఇక మాట్లాడేది ఏమీ లేదు” అన్నాడు పానకాలరావు ఖండితంగా.

ఆ మాటలు విని అతడి వంక తదేకంగా చూశాడు రవి కొన్ని క్షణాలు.

ఆ తరువాత మెల్లగా “మావయ్యగారూ, నాకు ఆస్తి లేదనే కదా శృతిని నాకు ఇవ్వనని అంటున్నారు.. ఆస్తి లేకపోతే ఏమండీ, నాకు డిగ్రీ ఉంది కదా.. ఏదో ఒక ఉద్యోగం చేసి శృతిని పోషించుకుంటాను.. మీలాగే శృతిని నా కళ్లల్లో పెట్టి చూసుకుంటాను’ నామాట నమ్మండి!” అన్నాడు రవి కంపిస్తున్న స్వరంతో అభ్యర్ధనగా చూస్తూ.

అతడి మాటల్లోని అభ్యర్ధనా, దైన్యం పానకాలరావు మనసుని ఏమాత్రం కరిగించ లేదు.

“ఆ చూస్తావు, ఎలా చూస్తావో చెప్పు? నీకు వచ్చిన ఉద్యోగాన్ని కాలదన్నుకున్నావు.. ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నావు. అంతా అయ్యాక ఇప్పుడు ఏ ప్రైవేటు కంపెనీలోనో పది వేలకీ, పాతిక వేలకీ ఉద్యోగం చేస్తావు. నీకు వచ్చే ఆ ముష్ఠి జీతంతో నా కూతుర్ని పోషించగలననే అనుకుంటున్నావా? నీవు తెచ్చే ఆ జీతం దాని చేతి ఖర్చులకు కూడా సరిపోదు. ఇక తిండెలా పెడతావు?” అన్నాడు పానకాలరావు హేళనగా చూస్తూ.

అతడి మాటలు వినడంతోనే రవికి భరించలేనంత కోపం వచ్చింది.

అంతవరకూ సౌమ్యంగా మాట్లాడిన రవి “అయితే నేను ఎంత సంపాదిస్తే మీరు నాకు శృతినిచ్చి పెళ్లి చేస్తారు?” అనడిగాడు పళ్ల బిగువున కోపాన్ని అదిమి పెడుతూ.

“ఏంటీ, సవాలు చేస్తున్నావా నాతో? నెలకు కనీసం లక్ష రూపాయలైనా సంపాదించగలగాలి నువ్వు.. అంతే కాదు, ఒక్క సంవత్సరం లోగా నీ అప్పులన్నీ తీరిపోవాలి. అలాగే నీ మీద ఉన్న కేసులన్నీ తొలగిపోవాలి. అలా నీవు చేయగలిగితేనే మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది” అన్నాడు పానకాలరావు కండీషన్లు పెడుతున్నట్లుగా.

రవి నెలకు లక్ష సంపాదించడం పెద్ద కష్టం కాదని అతడికీ తెలుసు.. అందుకే అప్పులూ, కేసులూ మాట ఎత్తి అతడ్ని ఇరుకున పడేస్తున్నానని అనుకున్నాడు పానకాల రావు.

ఇవన్నీ జరగాలి అంటే సంవత్సర కాలం సరిపోదు. అందుకే సంవత్సరం గడువు పెట్టాడు. ఈ దెబ్బతో రవి వెనక్కి తగ్గుతాడని అతడి ఆలోచన.

అప్పుడు నిర్భయంగా శృతికి వేరే సంబంధం చూసి పెళ్లి చేయవచ్చు అనేది అతడి ఆలోచన. అందుకే పొమ్మని అనకుండా పొగ పెట్టినట్లు ఇలాంటి షరతులు విధించాడు అతడు.

పానకాలరావు మాటలు వినడంతోనే కోపావేశాలతో రగిలిపోయాడు రవి. శృతిని తనకిచ్చి చేయకుండా వుండేందుకే అతడు ఇలాంటి షరతులన్నీ విధిస్తున్నాడని గ్రహించాడు.

ముందు రోజు శృతి రవితో మాట్లాడి ఉండకపోతే, పానకాలరావు షరతులకు భయపడి వెనక్కి తగ్గేవాడే.. కానీ శృతి అతడిలో నిరాశను పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని మనస్సు నిండా నింపింది. ఆమె తోడుంటే ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలను అనే ధైర్యం కలిగింది రవికి.

అందుకే “సరేనండీ, మీరన్నట్లే తప్పకుండా మంచి ఉద్యోగం సంపాదించుకోవడమే కాదు, కేసులన్నీ తొలగిపోయేలా చూస్తాను.. అలాగే, మీరు అన్నట్లుగానే ఈ సంవత్సర కాలంలోనూ శృతికి పెళ్లి ప్రయత్నాలు ఏమీ చేయకూడదు” అన్నాడు రవి హెచ్చరికగా.

“ష్యూర్, ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పను!” అన్నాడు పానకాలరావు బింకంగా.

“అవును, మీరు ఇచ్చిన మాటను ఎంత నిలబెట్టుకుంటారో నిశ్చితార్ధమైన మా బంధాన్ని తెంచేయాలని కంకణం కట్టుకోవడం లోనే తెలుస్తోంది. ఇది చాలదా మీ నిబద్ధతను నిరూపించేందుకు? రంగులు మార్చే ఊసరవెల్లిలా ఈ రకంగా వ్యవహరిస్తారు అని నేను కలలో కూడా అనుకోలేదు. అందుకే మీరు ఇప్పుడు అన్న మాటలను అన్నిటినీ నా సెల్ ఫోన్‌లో రికార్డు చేశాను. అన్న మాటకు కట్టుబడకుండా ఈసారి మాకు వ్యతిరేకంగా ఏమి చేసినా, ఈ సెల్‌ఫోన్‌లో రికార్డయినది అంతా తీసుకుని మీ అమ్మాయితో కలిసి కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతాను” అన్నాడు రవి కోపంగా చూస్తూ.

నిజానికి అతడు ఈ సంభాషణను రికార్డు ఏమీ చేయలేదు. అసలు అలా చేయాలనే ఆలోచన కలగలేదు అతడికి. దానితోపాటు అంత అవకాశం కూడా కలగలేదు. కేవలం అతడిని బెదిరించాలనే అలా అన్నాడు రవి.

అతడి మాటలు వినడంతోనే పానకాలరావు మాటల్లోనూ చూపుల్లోనూ పదును కొంత తగ్గింది. “అదికాదు రవీ..” అంటూ గొంతు తగ్గించి ఏదో చెప్పబోయాడు అతడు.

 తన మాటలు విని పానకాలరావు భయపడుతున్నాడు అని గ్రహించిన రవి స్వరం పెంచి..

 “మాటలు వద్దు ఇక.. ఏమైనా ఇంత జరిగిన తర్వాత కూడా మీకు థేంక్స్ చెప్పకుండా ఉండలేక పోతున్నాను.. ఎందుకంటే మీరు ఉదారంగా నాకొక సంవత్సరం గడువు ఇచ్చారు కదా.. నా దృష్టిలో అది తక్కువదేమీ కాదు. తప్పకుండా నేను అనుకున్నది సాధించి మీ ముందుకు వస్తాను!” అంటూ అక్కడ ఉన్న తన బేగును తీసుకొని విసురుగా బయటకు నడిచాడు రవి.

అతడు బాధపడుతూ వెళుతున్నాడు అని గాని.. నేను అనుచితంగా ప్రవర్తించానా?అనే ఆలోచన గాని పానకాలరావుకి ఇసుమంత అయినా కలగలేదు.

అతడు వెళ్లిపోయాడు, ఇక రాడు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వీధి తలుపు వేసి హాల్లోకి నడిచాడు పానకాలరావు.

అప్పటికి సరిగ్గా ఉదయం ఆరున్నర గంటలయింది.

వనజమ్మ గాభరాగా పక్కమీద నుండి లేచి ‘రవి వచ్చేది ఈ బండికే గదా!’ అనుకుంటూ హాల్లోకి వచ్చింది.

ఎదురుగా భర్త నిదానంగా కూర్చుని పేపరు చదువుకోవడం గమనించి “అమ్మయ్య, రవి ఇంకా రాలేదు” అనుకుంది, జరిగినదేమీ తెలియకపోవడం వలన.

పానకాలరావు ఏమీ జరగనట్లుగా పేపరు చదువుతూ కూర్చున్నాడు. వనజమ్మను చూసినా పట్టించుకో లేదు అతడు. అయినా ఏమీ అనుకోలేదు ఆమె. సరాసరి వచ్చి అతడి దగ్గర కూర్చుంది.

 భార్య తనతో మాట్లాడడానికే వచ్చిందని అర్ధమై ‘ఏమిటీ’ అన్నట్లుగా చూశాడు పానకాలరావు.

“ఏమండీ, ఈ రోజు రవి వస్తాడు. నిన్న మన శృతితో అన్నట్లుగా అతడితో మాట్లాడకండి. పిల్లలిద్దరూ ఒకరి మీదొకరు అంతులేని ప్రేమనూ, మమకారాన్నీ పెంచుకున్నారు. అలాంటి జంటను విడదీయడం మహా పాపం అండీ! ఒక్కగానొక్క పిల్ల మనకి.. మన శృతి సుఖమే కదా మనకి ముఖ్యం.. అది రవితో తప్ప ఇంకెవరితోనూ సంతోషంగా ఉండలేదండీ.. మనకింత సిరిసంపదలు ఉన్నాయి. ఇది చాలదా వాళ్లు సుఖంగా బ్రతకడానికి? ఒక్కసారి ఆలోచించండి!” అంది వనజమ్మ బ్రతిమాలుతున్నట్లుగా అతడి వంక జాలిగా చూస్తూ.

ఎంతటి కఠిన పాషాణమైనా కరుణ పూరితమైన ఆమె మాటలు వినడంతో కరిగి పోవాల్సిందే. కానీ పానకాలరావు మనసులో మాత్రం ఎలాంటి చలనమూ కలగలేదు.

“వనజా, ఈ విషయంలో నీవు ఏమి చెప్పినా వినను.. రవి ఆల్రెడీ వచ్చి వెళ్లాడు. నేనే అతడిని సాగనంపాను. ఇక అతడి బెడద మనకి ఉండదు” అన్నాడు కటువుగా భార్య వంక చూస్తూ.

“వచ్చి వెళ్లాడా.. అతడు వచ్చిన సంగతి మాకెవరికీ చెప్పకుండా ఇటునుండి ఇటే సాగనంపారా? ఎంత పని చేశారండీ?” అంది వనజమ్మ బాధగా.

అప్పుడే నిద్ర లేచిన శృతి తల్లిదండ్రుల సంభాషణలో రవి పేరు వినిపించడంతోనే దిగ్గున పక్కమీద నుండి లేచి తలుపు తీసుకొని హాల్లోకి వచ్చింది. వస్తూ.. తండ్రి అన్న చివరి మాటలు విన్నది.

“నాన్నా, రవిని వెళ్లగొట్టేశావా? మొత్తం మీద నీ పంతం నెరవేర్చుకున్నావే గానీ.. నాకేం కావాలో, నేనేం కోరుకుంటున్నానో గమనించ లేక పోయావు కదా! కన్నతండ్రి వై ఉండి నా మనసు బాధపడుతుంది అని తెలిసి కూడా ఇలా ఎలా చేయగలిగావు నాన్నా? ఇంత జరిగాక రవి నా ముఖం చూస్తాడా, ఎప్పుడైనా? నీలాగే నేను కూడా మోసగించానని అపార్ధం చేసుకోడా? ఎందుకు నాన్నా ఇలా చేశావు.. ఏం సాధించాలని?” అంది ఏడుస్తూ.

“ఛ ఛ, పొద్దున్నే ఏమిటీ సంత నాకు.. రవీ, రవీ అనే మాట తప్ప మీ తల్లీ కూతుళ్లిద్దరికీ ఇంకేమీ పని లేదా?” అన్నాడు పానకాలరావు రంకెలు వేస్తున్నట్లుగా.

“నా బాధ నీకు సంత గోల లాగే ఉంటుంది నాన్నా.. కానీ అతడు నాకు దూరమైతే నేను బ్రతకను. గర్తుంచుకో!” అంది శృతి ఆగ్రహంగా తండ్రి వంక చూస్తూ.

“నేను అంత కాని పనేమీ చేయలేదు. నేనేం చేసినా నీ బాగు కోరే చేశాను.. ఆస్తి లేకపోయినా ఉద్యోగం చేసి నిన్ను పోషిస్తాను అన్నాడు అతడు. ఆ రవి తెచ్చే ముష్ఠి జీతంతో నీ బ్రతుకు వెళ్లమారదు అని గట్టిగా చెప్పాను. చేతనైతే సంవత్సరం లోగా నెలకు లక్ష రూపాయలు వచ్చే ఉద్యోగం సంపాదించి చూపించమన్నాను. దానితో పాటు ఒక సంవత్సరం లోగా అతడి మీద ఉన్న కేసులన్నీ తొలగించుకొని రూపాయి అప్పు లేకుండా చేసుకుంటే అప్పుడు నిన్నిచ్చి పెళ్లి చేస్తానని అన్నాను, తప్పా? సరే, సంపాదించి చూపిస్తానని వెళ్లిపోయాడు పౌరుషంగా .అతడు అవన్నీ చేసుకొచ్చిన నాటి మాట గదా.. అందుకే సరే అని అన్నాను నేను” అన్నాడు పానకాలరావు ఎకసక్కెంగా కూతురి వంక చూస్తూ.

తండ్రి మాటలు విని తెల్లబోయినట్లుగా చూసింది శృతి ఒక్క క్షణం.

“బాగుంది నాన్నా నువ్వు విధించిన షరతులు.. పొమ్మన లేక పొగ బెట్టినట్లు చేశావు కదా! ఈ రోజుల్లో నెలకు లక్ష రూపాయల జీతం సంపాదించడం పెద్ద కష్టం కాదు. కానీ అతడు చేయలేడని తెలిసీ కావాలని కేసులు, అప్పులు మాట ఎత్తావు కదా.. ఏమిటి నాన్నా ఇదంతా? ఇదేమైనా సినిమా అనుకున్నావా, లేక నవల అనుకున్నావా? ఇలాంటి ఛాలెంజిలు విసరడానికి.. ఇది జీవితం నాన్నా! నిజ జీవితంలో ఏ తండ్రీ నీలా చేయడు.. కూతురి సుఖంకోసం అనే పేరుతో!” అంది బాధగా.

ఆమె ముఖం కోపావేశాలతో ఎర్రబడిపోయింది. కాళ్లూ చేతులూ ఒణుకుతూండగా అక్కడ ఉన్న సోఫాలో కూలబడిపోయింది నిస్సహాయంగా చూస్తూ.

“ఎవరూ చేయలేదు, నేను చేశాను.. అయితే ఇప్పుడూ ఏమంటావు? నేను చెప్పినట్లు చేసుకు రమ్మను. అప్పుడు అతడి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తాను!” అన్నాడు పానకాలరావు మొండిగా.

“మా ఇద్దర్నీ విడగొట్టడానికి భలే ప్లాన్ వేశావు నాన్నా.. కానీ నీ మాట ప్రకారం రవి ఇవన్నీ సాధించుకు వచ్చినా, మానినా అతడే నా భర్త! నిశ్చితార్ధం అయితే నా దృష్టిలో సగం పెళ్లి అయినట్లే లెక్క! మీరందరూ కలిసి నిర్ణయించిన శుభ ముహూర్తాన పది మంది పెద్దల ముందు, అందరి ఆశీర్వాదాలతో మా పెళ్లి నిశ్చయం చేశారు.. దైవం వేసిన ఈ బంధాన్ని నీవెంత ప్రయత్నించినా విడగొట్టలేవు. ఇంకొక మాట, నేను మేజర్‌ని.. నాకిష్టం లేకుండా, పెళ్లి లాంటిది వేరే అతనితో ఏమైనా తల పెట్టావో, తండ్రివని కూడా చూడకుండా నీ మీద నేను కేసు పెడతాను, జాగ్రత్త!” అంది శృతి ఆవేశంగా అక్కడి నుండి లేస్తూ.

ఆమెకు ఏం చేయాలో, ఎలా ఈ సమస్య నుండి బయటపడాలో తోచడం లేదు. మనసంతా అస్తవ్యస్తంగా తయారయింది.

రవి దూరమై పోతున్నాడు అనే బాధ శృతి మనసుని కాల్చేస్తోంది.

ఇందాక రవీ, ఇప్పుడు శృతీ వేరే పెళ్లి తలపెడితే కోర్టుకీడుస్తాము అనే మాట అనడం పానకాలరావుకి మింగుడు పడలేదు. అందుకే చివాలున అక్కడ నుండి లేచి..

“ఓహో, అంత వరకూ వచ్చిందా నీ వ్యవహారం.. సరే, నేను ఏడాది దాకా నీ పెళ్లి మాట తల పెట్టను.. ఈ సంవత్సర కాలంలో నువ్వు అతనితో ఏ కమ్యూనికేషన్ లేకుండా ఉండగలవా?” అన్నాడు పానకాలరావు సవాల్ చేస్తున్నట్లుగా చేతులు గాలిలో ఆడిస్తూ.

తండ్రి అలా అడిగేసరికి నిరుత్తరురాలు అయినట్లుగా చూసింది శృతి. రవితో మాట్లాడకుండా ఎలా ఉండాలి? అసలు ఉండగలనా? అనుకుంది.

“ఏం మాట్లాడవు.. అసలిదంతా ఎందుకు? నీ సెల్ఫోన్ నీకు లేకుండా చేస్తే సరిపోతుంది గదా! అప్పుడు అతడి మాట నీకూ, నీ మాట అతడికీ చేరదు. ఇంక నాపై మీరిద్దరూ కేసు ఎలా పెడతారో చూస్తాను!” అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్లి శృతి గదిలో ఛార్జింగ్ పెట్టి ఉన్న ఫోన్ తీసి స్విచ్ ఆపేసి జేబులో వేసుకున్నాడు పానకాలరావు.

తండ్రి చేసిన పని చూసి హృదయ విదారకంగా ఏడుస్తూ నుంచున్న చోటునే కుప్పలా కూలిపోయింది శృతి. ఇంత మొత్తుకుంటున్నా, నా మనసును మా నాన్న అర్ధం చేసుకోకుండా బద్ధ శత్రువులా ఇలా చేస్తున్నాడేమిటి అనే భావన శృతి మనసును ఛిద్రం చేసింది.

హృదయ విదారకంగా ఏడుస్తున్న కూతురి వంక.. నిమ్మకు నీరు ఎత్తినట్లు తాపీగా కూర్చొని ఉన్న భర్త వంక నిస్సహాయంగా చూసింది వనజమ్మ.

(ఇంకా ఉంది)

Exit mobile version