[శ్రీమతి పెబ్బిలి హైమవతి రచించిన ‘గెలిచేదాకా పోరాడు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[తీవ్ర నిరాశలో ఉన్న రవిని అతని ప్రేయసి శృతి ఫోన్ ద్వారా ఓదార్చి, ఆత్మవిశ్వాసాన్ని నింపి విశాఖపట్నం వెళ్లమని ప్రోత్సహిస్తుంది. శృతితో పాటు అత్త సావిత్రి, అక్క శాంతి చెప్పిన ధైర్య వచనాలతో రవి తన కష్టాలను ఎదిరించాలనే ఉత్సాహంతో విజయవాడ మీదుగా శృతి ఇంటికి చేరుకుంటాడు. అయితే శృతి తండ్రి పానకాలరావు అతడిని సాదరంగా ఆహ్వానించకుండా, రవికి ఆస్తి, ఉద్యోగం లేవనే కారణంతో శృతితో నిశ్చితార్థమైన సంబంధాన్ని వదులుకుంటున్నట్లు ముభావంగా ప్రకటిస్తాడు. శృతికి కూడా ఈ నిర్ణయం తెలుసని పానకాలరావు అబద్ధం చెప్పగా, రవి ఆగ్రహంతో ఒక ఏడాది లోగా నెలకు లక్ష రూపాయలు సంపాదించి, తనపై ఉన్న కేసులు, అప్పులు తీర్చుకుని వస్తానని సవాల్ చేసి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతాడు. రవి వెళ్ళిన తర్వాత హాల్లోకి వచ్చిన శృతి, తండ్రి తన ప్రమేయం లేకుండా రవిని వెళ్లగొట్టాడని తెలుసుకుని తీవ్రంగా రోదిస్తుంది; రవి సాధించుకు వచ్చినా రాకపోయినా అతడే నా భర్త అని, వేరే పెళ్లి చేస్తే కోర్టుకు వెళ్తానని శృతి హెచ్చరించడంతో, పానకాలరావు ఏడాది పాటు పెళ్లి ప్రస్తావన తేనని చెబుతూనే, వారిద్దరూ మాట్లాడుకోకుండా ఉండటానికి శృతి సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కొని స్విచ్ఛాఫ్ చేస్తాడు. – ఇక చదవండి.]
రవి పానకాలరావుతో సవాలు చేసినట్లుగా మాట్లాడాడే గానీ గుమ్మం దాటి బయటకు వచ్చాక అతడి మనసంతా శూన్యం అవతరించినట్లుగా అయిపోయింది.
‘శృతిని కలుసుకోవాలని రెక్కలు కట్టుకుని వచ్చిన నాకు కలలో కూడా ఊహించని విధంగా ఎంత చేదు అనుభవం ఎదురైంది ఏమిటి? పెళ్లి చూపుల నాడే అతడి స్వభావం ఎలాంటిదో తెలిసింది. చలపతి మావయ్య కూడా ఈ సంబంధం చేసుకోవడం అంత మంచిది కాదని హెచ్చరించాడు ముందుగానే. కానీ శృతిని చూసిన మరుక్షణమే నా మనసు తన వశం అయిపోయింది. మా అనుబంధం ఈనాటిది కాదని, జన్మజన్మల బంధమని అనిపించింది నాకు.. ఇంచుమించు శృతికి కూడా అలాగే అనిపించింది. నాకు తెలుసు.. తండ్రి నిర్ణయం ఇదని తెలిస్తే శృతి కూడా తట్టుకోలేదు’ అనుకున్నాడు దిగులుగా.
‘అయితే ఈరోజు అదంతా తారుమారైంది’ అనుకున్నాడు రవి బాధగా. ‘నేను వచ్చి వెళ్లానని తెలిస్తే శృతి ఎంత బాధపడుతుందో.’ అని అనుకుంటూ జేబులోని సెల్ తీసి శృతికి రింగ్ చేశాడు. అది స్విచ్ ఆఫ్ అని రావడంతో.. ‘ఎప్పుడూ లేనిది ఈరోజు శృతి సెల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అంటే అక్కడ ఏదో జరిగింది. బహుశా పానకాలరావు ఏదో చేసి ఉంటాడు. మేమిద్దరం కనీసం మాట్లాడుకునేందుకు కూడా వీలు లేకుండా! శృతి ఫోన్ తీసేసుకున్నాడు అన్న మాట’, అనుకున్నాడు బాధగా.
శృతితో మాట్లాడే అవకాశం లేకపోవడంతో రవికి పిచ్చి పట్టినట్లుగా అయింది.. భవిష్యత్తు అంతా అగమ్యగోచరంగా కనిపించింది అతడికి.
‘ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి.. ఏం చేయాలి? శృతిని అందుకోవాలంటే పానకాలరావు చెప్పినట్లుగా అన్నీ చేయగలగాలి. అది సాధ్యమవుతుందా? అప్పుడు ఏదో ఉద్రేకంతో పానకాలరావు మాటలకు సరే అంటే సరే అన్నానే గానీ, అతడు కోరిన విధంగా తాను చేయగలడా?’ అనుకున్నాడు రవి సందేహంగా.
అలా ఆలోచిస్తూనే స్టేషన్‌కి చేరుకొని టికెట్ తీసుకొని తన ఊరు వెళ్లేందుకు ట్రైన్ ఎక్కాడు రవి.
తిరిగి రవి ఆలోచనలు పరిపరివిధాలుగా పోయాయి. మనసంతా కకావికలం అయిపోగా తల వెనక్కి వాల్చి కొన్ని నిమిషాలు అలాగే ఉండిపోయాడు.
వెంటనే తన బాధను ప్రాణ స్నేహుతులైన శివా, శ్రీనూలతో పంచుకోవాలని అనిపించింది రవికి.
అతడు కాల్ చేసిన వెంటనే శ్రీను ఫోన్ ఎత్తి “ఏంట్రా రవీ, ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు?” అని అడిగాడు ఆదుర్దాగా.
శ్రీను గొంతు వింటూనే అంతవరకూ బిగబట్టుకున్న మనసు వశం తప్పింది రవికి.
బిగ్గరగా ఏడ్చేస్తూ “శ్రీనూ!” అన్నాడు.
స్నేహితుడి ఏడుపు వినడంతోనే శ్రీను మనసు బెంబేలు పడిపోయింది. “ఎందుకు ఏడుస్తున్నావురా రవీ, ఏమైంది?” అని అడిగాడు శ్రీను ఆతృతగా.
“ఏం చెప్పనురా? శృతి నాకు ధైర్యం చెబుతూ విశాఖపట్నం వెళ్లే ముందు ఒకసారి విజయవాడ వచ్చి వెళ్లమంది. నేను కూడా మనసు కూడదీసుకుని బయలుదేరి విజయవాడ వచ్చాను. కానీ ఇంటి దగ్గర నేను అనుకున్నది ఒకటి.. ఇక్కడ మా మామగారి ఇంట్లో జరిగినది ఒకటి అయింది. ఉదయం ట్రైన్ దిగి మా అత్తవారింటికి వెళ్లానురా. అక్కడ మా మావగారు శృతిని కలుసుకోకుండా అడ్డు కొట్టడమే కాకుండా, నన్ను చాలా అవమానించాడు.
నేను ఆస్తిపాస్తులు ఏమీ లేని బికారినట.. నేను ఉన్న ఉద్యోగం వదులుకొని ఆస్తి నంతటినీ నాశనం చేశానుట.. తన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లీ చేస్తే ఏమి పెట్టి పోషిస్తావు? నీకు వచ్చే ఆ ముష్టి జీతం నా కూతురి చేతి ఖర్చులకు కూడా రాదని ఎద్దేవా చేశాడురా! ఒక సంవత్సరం లోగా లక్ష రూపాయలు జీతం వచ్చే ఉద్యోగం సంపాదించడంతోపాటు నా అప్పులన్నీ తీర్చి నామీద కేసులేమీ లేకుండా చేసుకోవాలట. అలా అయితేనే శృతిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు. కోపంలో బాధలో నేను సరే అన్నాను.. కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఇదంతా నేను చేయగలనా అని. పాపం ఇదంతా శృతికి ఏమీ తెలియదు రా.. అందుకే నన్ను విజయవాడ రమ్మంది. నన్ను వాళ్ల నాన్న ఇలా గెంటివేశాడు అని తెలిస్తే ఎంత బాధ పడుతుందో శృతి. చివరికి తనతో మాట్లాడే అవకాశం నాకు లేకుండా శృతి సెల్ తీసేసుకున్నాడు ఆ దుర్మార్గుడు! దాంతో నా జీవితం అంతా అయోమయం అయిపోయింది. ఇప్పుడు నేను ట్రెన్‌లో ఉన్నాను.. తిరిగి ఇంటికి వెళ్తున్నాను” అంటూ జరిగిందంతా చెప్పాడు రవి.
అంతా విని “ఛండాలుడు, ఎంత పని చేశాడురా.. చివరికి శృతిని కలుసుకోకుండా కనీసం తనతో మాట్లాడే వీలు లేకుండా చేశాడన్న మాట ఆ త్రాష్టుడు!” అన్నాడు శ్రీను కోపంగా.
“అతడలా చేసినందుకు కాదురా నా బాధ.. మా ఇద్దరికీ కమూ్యనికేషన్ లేకుండా చేసాడు కదా, అదే నా బాధ. తట్టుకోలేక పోతున్నాను నేను. మనసంతా చిందరవందరగా ఉంది. అరే శ్రీనూ, నాకిలా జరిగాక, నాన్న పోయి అయోమయంలో పడిపోయాక, శృతి ఇన్ని రోజులుగా ఈ కష్టకాలంలో నాకు ఎంతో సపోర్టు ఇచ్చిందిరా.. శృతితో మాట్లాడకుండా ఎలా ఉండాలిరా! తను లేని ఈ జీవితం నాకు వద్దనిపిస్తోందిరా !” అంటూ తిరిగి ఏడ్చేశాడు రవి.
చుట్టూ ఉన్నవారు తనని గమనిస్తారు అనే ఆలోచన కూడా కలగలేదు రవికి.
ఆ మాటలు వింటూనే కంగారు పడిపోయాడు శ్రీను. మిత్రుడికి దెబ్బ మీద దెబ్బలా తగులుతున్న ఈ పరిణామాలకి అతడు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడు అనే భయం కలిగింది.
“ఒరే రవీ, ఏమిట్రా అంత ఢీలా పడిపోతున్నావు.. నిన్న గాక మొన్న పరిచయమైన శృతి లేకపోతే జీవితం అంతా అయిపోయినట్లేనా? చిన్ననాటి నుండీ ఒక ప్రాణంలా ఉన్నాం మనం. అదేమీ లెక్కలేదా నీకు? తను లేకపోతే జీవితం వద్దని అనుకోవడమేనా? ఇంతేనా మన స్నేహానికి ఉన్న విలువా, అర్ధమూను?” అని కొంచెం కోపంగా, బాధగా చెప్పి..
ఆ తరువాత తన మాటలను రవి ఎలా తీసుకుంటాడోననే జంకుతో స్వరం తగ్గించి “అది కాదురా రవీ, బాధపడుతూ కూర్చుంటే పనులు అవుతాయా.. మంచికో చెడుకో అతడితో సవాల్ చేశావు. ఎలాగోలా ఆ పానకాలరావు అన్నట్లే అన్నీ సాధించి చూపించి శృతిని నీ స్వంతం చేసుకుందువుగాని.. దిగులు పడకురా!” అన్నాడు శ్రీను ఓదార్పుగా.
“అదంతా అయ్యే పనేనా?” అన్నాడు రవి బాధగా.
“కాదని ఎందుకు అనుకుంటున్నావు? స్థిర చిత్తంతో అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. నీకు చేతకాకపోయినా, ఎదుర్కోవలసిన యుద్ధం జీవితం.. అది నిన్ను చంపదు గానీ, చావుదెబ్బలు కొడుతుంది. కింద పడే కొద్దీ అది పోరాటమే! ఎప్పుడైతే లేచి నిలబడి ఎదుర్కుంటావో అప్పుడు అది చరిత్ర అవుతుందిరా! నిరాశ నీ దరికి చేరనీయకు. ఆశను నీ ఆలంబనగా చేసుకుని ముందుకు సాగిపో.. నీ వెంట మేముంటాము” అన్నాడు.
శ్రీను మాటలతో కొంచెం ఊరట చెందాడు రవి.
ఇంతలో “ఎవరితోరా ఇంతసేపూ మాట్లాడుతున్నావు?” అంటూ వరండాలో ఉన్న శ్రీను దగ్గరకు వచ్చాడు శివ.
“మన రవితో రా.. పాపం వాడి పరిస్థితి చూస్తే నా గుండె చెఱువై పోతోంది రా..” అంటూ జరిగిందంతా చెప్పాడు శ్రీను.
అంతా విన్న శివ “అయ్యో, ఇలా జరిగిందేమిట్రా.. ఈ కష్టకాలంలో శృతి సపోర్టు కూడా లేకపోతే చాలా కష్టంరా.. ఇప్పుడు వాడేదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు ఆపగలరురా?” అన్నాడు శివ ఆందోళనగా.
“నాకూ అదే భయంగా ఉందిరా.. వాడిని మనం ఎలా కాపాడుకోగలం? ఇవన్నీ ఎందుకు గానీ, రేపు శని ఆదివారాలు శెలవే కదా.. ఈరోజు రేపు శెలవు పెట్టి మనం ఒకసారి వాడి దగ్గరకు వెళ్లి వచ్చేద్దాం!” అన్నాడు శ్రీను.
“సరే, అలాగే చేద్దాం!” అన్నాడు శివ.
ఇద్దరూ కలిసి గబగబా బట్టలు సర్దుకుని స్టేషన్‌కు చేరుకున్నారు. విజయవాడ వెళ్లే ట్రైన్ సిద్ధంగా ఉండడంతో టికెట్ కొనుక్కుని ఎక్కేశారు. విజయవాడలో దిగిన వెంటనే మరో ట్రైన్ పట్టుకుని మర్నాడు పది గంటలకల్లా మిత్రుడ్ని చేరుకున్నారు ఇద్దరూ.
హఠాత్తుగా వచ్చిన వాళ్లిద్దర్నీ చూసి చలపతి ఎంతో ఆశ్చర్యపోయాడు.
జరిగిందంతా వాళ్ల ద్వారా విన్న చలపతి “ఆ దరిద్రుడు ఇలాంటి వాడని నాకు ముందే తెలుసు. అందుకే మా వెంకాకి ఈ సంబంధం వద్దని చెప్పాను.. నా మాట విన్నాడు కాదు. చూడండి ఇప్పుడేమైందో?” అన్నాడు బాధగా.
“జరిగిపోయినదాని గూర్చి చర్చ వద్దు నాన్నా.. ఇప్పుడు జరగవలసిన దాని గూర్చి ఆలోచిద్దాం! వాడసలే బాధలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో మనం నీరసపడి, వాడిని ఇంకా దిగులు పడేలా చేయవద్దు” అన్నాడు శివ.
“సరే శివా, నీవు చెప్పినట్లే చేద్దాము!” అన్నాడు చలపతి.
“నాన్నా, ఒకసారి మేము రవిని కలిసి వస్తాము” అన్నాడు శివ.
మిత్రుడి కొడుక్కి వచ్చిన కష్టం చూసి తల్లడిల్లిపోయాడు చలపతి. “సరే వెళ్లి రండి! ఒరేయ్, ఒంటరిగా వాడొక్కడూ అక్కడ ఎందుకు.. జరిగిందేదో జరిగిపోయింది.
వాడెలా ఉన్నాడో చూసి వెంటనే ఇక్కడికి తీసుకు వచ్చేయండి. అసలు వచ్చిందగ్గర నుంచీ వాడు తిన్నాడో లేదో?” అన్నాడు చలపతి ఆదుర్దాగా.
“సరే నాన్నా, మేము వెళ్లి వాడ్ని తీసుకువస్తాము” అని చెప్పి మిత్రులిద్దరూ రవి ఇంటికి బయలుదేరారు.
వాళ్లను చూడడంతోనే రవి కళ్లు జలపాతాలయ్యాయి. రవిని అలా చూడ్డంతోనే వాళ్లిద్దరి కళ్లూ చెమ్మగిల్లాయి. ఇద్దరూ అతడికి చెరో పక్కనా కూర్చుని ఓదార్పుగా ఎన్నో చెప్పారు.
“ఒరే, నువ్విలా నిస్తేజంగా కూర్చుంటే ఏమీ సాధించలేవురా.. నువ్వనుకున్నది సాధించాలంటే మనసు కూడ దీసుకుని కార్యరంగం లోకి దిగాలిరా.. తప్పదు!” అన్నాడు శ్రీను.
“అవును రవీ, శ్రీను చెప్పింది కరెక్టు.. నువ్వు రేపే విశాఖపట్నం బయలుదేరు. అసలిదంతా ఎలా జరిగిందో, ఎవరు చేశారో ఎంక్వయిరీ చెయ్యాలి. అవసరమైతే మా జాబులకు రిజైన్ చేసి నీతో పాటు నడుస్తాము. కష్టమైనా, సుఖమైనా మనం ముగ్గురం కలిసి పంచుకుందాము” అన్నాడు శివ ధృఢంగా.
“నిజమేరా, జరిగిందంతా విని అక్క కూడా ఈ మాటే చెప్పింది. కానీ ఇప్పుడు నేను విశాఖ వెళ్లి చేసేదేమీ కనిపించడం లేదు. మా బావగారు, వాళ్ల చిన్నాన్న ఇలా చేసినందుకు చాలా బాధపడుతున్నారు. వాళ్లు కూడా శృతితో మాట్లాడే ప్రయత్నం చేశారు గానీ, పడనివ్వలేదట.. పైగా నా కూతురు, నా ఇష్టం అంటూ బావగార్ని తూలనాడారట! ఆయన జరిగినదానికి బాధపడవద్దనీ, అక్కడ బెంగుళూరులో తెలిసిన వారి వద్ద ఏవో వేకెన్సీలు ఉన్నాయని నన్ను బెంగుళూరు రమ్మన్నారు.. అక్కడే ఏదో ఒకటి చూద్దాం అన్నారు. నాకు కూడా అదే సరైంది అనిపించింది.. ఇప్పుడు నాకు జాబ్ చాలా అవసరం రా!” అన్నాడు రవి.
“మీ బావగారు చెప్పింది కరెక్టేరా.. కాకపోతే అక్కడికి వచ్చే ముందు విశాఖ లోని నీ వర్క్ స్పాటుకి వెళ్లి అంతా పరిశీలించు. అవన్నీ ఫొటోలు తీసి తీసుకురా.. ముందు ముందు అవి చాలా పనికి వస్తాయి” అన్నాడు శ్రీను.
“సరే, నీవన్నట్లే చేస్తాను. మధ్యాహ్నం బండికి విశాఖపట్నం వెళ్తాను. రేపు అక్కడ చూసుకొని బెంగుళూరు బయలుదేరతాను” అన్నాడు రవి.
“సరే, అలాగే చేద్దువు గానీ, పద మా ఇంటికి వెళ్దాం, నాన్నగారు నిన్ను తీసుకురమ్మన్నారు” అన్నాడు శివ.
“ఎందుకులేరా ఇప్పుడు?” అన్నాడు రవి మొహమాటంగా చూస్తూ.
“నోరు మూసుకుని పదరా, నిన్ను తీసుకుని వెళ్లకపోతే మానాన్న నన్ను తిడతారు” అన్నాడు శివ.
“సరే పదండిరా!” అన్నాడు రవి.
ఇపుడు అతడి ముఖం కొంచెం తేటగా ఉంది.. మిత్రులు ఇద్దరినీ చూడడం తోనే అతడికి కొత్త శక్తి వచ్చినట్లు అయింది. మిత్రుల రాకతో పాటు వారి అనునయ వాక్యాలు అతడిని ఎంతో సేద తీర్చాయి.
రవిని చూడడంతోనే చలపతి ఆదరంగా దగ్గరకు తీసుకుని “ఏంట్రా రవీ, ఇలా అయిపోయావు.. నాన్న లేకపోయినా, నేను ఉన్నాను కదరా! చూడు, ముఖం ఎలా పీక్కుపోయిందో.. నిన్న వచ్చిన దగ్గరనుడీ ఏమీ తినలేదు కదూ నువ్వు? నువ్విలా చేస్తే నాకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించావా? పై లోకంలో ఉన్న మీ నాన్న మనసు ఎంత క్షోభ పడుతుందో ఆలోచించావా?” అన్నాడు డగ్గుత్తికతో.
“తెలుసు మామయ్యా, కానీ ఎంత ప్రయత్నించినా మనసులో బాధని దిగమింగుకోలేక పోతున్నాను. కన్ను మూసినా, తెరిచినా నాన్నే గుర్తుకు వస్తున్నారు.. ఆ పైన కుప్ప కూలిపోయిన బిల్డింగ్! ఇప్పుడు.. ఇప్పుడు..” అంటూ మాట పూర్తి చేయలేక ఏడ్చేశాడు రవి.
చప్పున శివ రవిని పట్టుకుని “ఊరుకోరా, జరిగిందంతా నాన్నకి చెప్పాను.. కానీ, నువ్విలా అన్నిటికీ బెంబేలు పడిపోతే మాకెవరికీ ఏమీ బాగోలేదురా!” అన్నాడు తాను కూడా కన్నీరు కారుస్తూ.
“మీరున్నారనే ధైర్యంతోనే ఈ మాత్రమైన బ్రతుకుతున్నాను శివా!” అన్నాడు రవి భారంగా.
భోజనాలయ్యాక రవి విశాఖపట్టణం బయలుదేరాడు. మిత్రుడ్ని ఒంటరిగా పంపడం ఇష్టం లేక ఆ సాయంత్రం రవితో పాటు ఇద్దరూ విశాఖపట్నం బయలుదేరారు. చలపతికి కూడా అదే మంచిదని అనిపించింది.
ముగ్గురూ కలిసి విశాఖపట్నం వెళ్లారు. కూలిపోయిన బిల్డింగ్ చూడడంతోనే రవి గుండె చెరువై పోయి అక్కడే కూలబడి ఏడ్చేశాడు. శ్రీనూ, శివా అతి కష్టం మీద అతడ్ని అక్కడి నుండి లేవదీశారు.
అనుకున్నట్లే అక్కడ ఫొటోలు తీశారు.. ఆ రాత్రి రవి అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో ముగ్గురూ విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో బెంగుళూరు బయలుదేరారు.
ట్రైన్ ఎక్కే ముందు శివా, శ్రీనూ ఎటియంలో డ్రా చేసి చెరో పదివేలూ తెచ్చి రవికి ఇచ్చారు.
“వద్దురా, నాకెందుకు డబ్బు?” అన్నాడు రవి తెల్లబోయి చూస్తూ.
“ఉంచరా.. ఈ చిన్న మొత్తం నీ సమస్యలన్నీ తీరుస్తుందని కాదు. సమయానికి ఏదైనా అవసరం పడితే అక్కరకు వస్తుందని” అంటూ శివా శ్రీనూలు ఆప్యాయంగా అతడి భుజం తట్టారు.
రవి ఇద్దరి వైపూ ఆత్మీయంగా చూస్తూ “మీరిద్దరూ నా స్నేహితులు కావడం నిజంగా నా అదృష్టంరా! చిన్నప్పటి నుండీ మీరు అడుగడుగునా నా వెన్నుదన్నుగా నిలిచారు. చదువు మానేసి మన ఊరిలోనే ఉండిపోదామని అనుకున్న నన్ను చదువుకునేలా చేశారు. ఇప్పుడు నాకోసం మీ పనులన్నీ చెడగొట్టుకొని వచ్చి నాకు ఊరట కలిగేలా మాట్లాడుతూ నాతోనే ఉన్నారు. అవసరమైతే నాకోసం మీ జాబ్స్ మానేస్తామని అంటున్నారు. ఏ మనిషికైనా ఇంతకంటే కలిమీ, అదృష్టం ఇంకేముంటుందిరా?” అన్నాడు చెమ్మగిల్లిన కళ్లతో రవి.
“అలా అనకురా రవీ, చిన్నప్పటి నుండీ మన ముగ్గురం దేహాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా పెరిగాం. మనలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అది మనందరిదీను.. నువ్వెప్పుడూ మమ్మల్ని వేరు చేసి మాట్లాడకురా!” అన్నాడు శివ.
“అవును రవీ, నువ్వెప్పుడూ పాడుతూ ఉంటావు కదా.. ఒక పాట..
స్నేహ బంధమూ ఎంత మధురమూ, చెరిగిపోదు మాసిపోదు జీవితాంతమూ..
ఒకే ఆత్మ వుంటుందీ రెండు శరీరాలలో, ఒకే మాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో..
ఒక్కటే దొరుకుతుంది జీవితంలో.. అది వాడిపోదు, వీడిపోదు కష్టసుఖాల్లో.. స్నేహ బంధమూ!!
మల్లె పూవు నల్లగా మాయవచ్చునూ, మంచు కూడ వేడి సెగలు ఎగియవచ్చునూ..
పూవు బట్టి తేనె రుచీ మారవచ్చునూ, చెక్కు చెదరనిదీ స్నేహమనీ నమ్మవచ్చునూ..
ఎంత గొప్పగా ఉందిరా? ఈ పాట రాసిన కవి ఎవరో కానీ, మనని ఉద్దేశించి రాశాడు అనిపిస్తుంది నాకు” అన్నాడు శ్రీను ఇద్దరి వంకా ప్రేమగా చూస్తూ.
“అవును రవీ, జరిగిందంతా విడిచిపెట్టేయరా.. ఈవేల్టి నుండీ కొత్త జీవితం ప్రారంభించు. కష్టాలు వస్తే రానీయరా.. ధైర్యం అనే ఆయుధంతో వాటన్నిటినీ ఎదిరిద్దాం! ధైర్యం అనేది మన కంటికి కనబడక పోయినా అది మనలో ఉంటే.. మీ మామ లాంటి వారిని, ఆ జగతీ ఇండస్ట్రీస్ ఎండీని చాలా సులభంగా ఓడించవచ్చురా! ఒకోసారి మనకెదురయ్యే సమస్యలే మనకి కొత్త పాఠాలు నేర్పుతాయి. మన సామర్ధ్యాన్ని మనకి తెలిసేలా చేస్తాయి. రవీ, ఇదంతా నీకు తెలియదని కాదు.. రవీంద్రనాధ్ ఠాగూర్ గారు అన్నట్లుగా మనం ప్రయత్నం చేసి ఓడిపోయినా ఫర్వాలేదు. దాని వలన అనుభవం వస్తుంది. ఇక ముందు ఏమి చేయాలో, ఎలా చేయాలో తెలుసుకుంటాం. అదే ప్రయత్నం చేయడంలో ఓడిపోతే ఎన్నటికీ ముందుకు సాగలేము. కనుక ధైర్యంగా ముందుకు సాగాలి. ఏది ఏమైనా మేమిద్దరం నీ వెంటే ఉంటామని మర్చిపోకు!” అన్నాడు శ్రీను.
“రవీ, మొన్న అంతరిక్షం సినిమా చూశాం రా.. అందులో హీరోయిన్ హీరో వరుణ్‌కి ఒక మాట చెపుతుంది.. ‘ప్రపంచంలో మూడు రకాల మనుషులు ఉంటారు. మొదటి వారు ఏమి సాధించాలో తెలియని వారైతే, రెండవ వారు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదో చిన్న అవరోధం వచ్చిందని ఆ పని విడిచిపెట్టి వెళ్లి పోతారు, అదే మూడవ రకం వారు మొదలు పెట్టిన పనిని ఎన్ని అవరోధాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు’ అంటుంది. ఇది మనం చిన్నప్పుడు భర్తృహరి చాటువుల్లో చదివిందేననుకో! ‘ఆరంభింపరు నీచ మానవుల్!’ అని. అందుకే ఆ పద్యాలు రాసి ఎన్నాళ్లయినా, ఒక జీవన వేదంలా నేటికీ మిగిలిపోయాయి. కనుక నీ నడక నలుగురికీ బాట కావాలి. నీ మాట మంచిది అవ్వాలి. నీ చేయి పదిమందికీ సాయం చేయాలి. నీకై చరిత్రలో ఒక పేజీ లిఖించబడాలి.. అన్నారు కలాం గారు. ఆ మాటలనే నువ్వు ఆదర్శంగా తీసుకోవాలి.. కార్యోన్ముఖుడవై విజయాన్ని సాధించరా.. ఇంతకంటే నీకు చెప్పేదేమీ లేదు!” అన్నాడు శివ రవి భుజం తడుతూ.
ఆ తర్వాత ముగ్గురూ కబుర్లలో పడిపోయారు.
ఉన్నట్లుండి శ్రీను “అరే రవీ, నువ్విప్పుడు బెంగుళూరు వస్తున్నావు కదా, మాతో పాటు.. నువ్వు కూడా మాతోనే ఉండిపోరా, చక్కగా మనం ముగ్గురం కలిసి ఎప్పటిలాగే సంతోషంగా గడపవచ్చు.. అలా చేస్తే నువ్వు ఒక్కడివే ఉన్నావనే దిగులు ఉండదు మాకు!ఇక నుండీ నువ్వొక్కడివీ అనుకోవద్దురా రవీ.. మన ముగ్గురం కలిసి ఒకటే అనుకో! నీతో అక్క ఉంది, మేమూ ఉంటాము. నీకు బావగారు జాబ్ చూపిస్తే సరే, లేదా మేమే ఏదో ఒకటి చూస్తాము, సరేనా?” అన్నాడు.
“అంత మాటన్నావు అదే చాలురా.. నేను అక్క దగ్గరకు వెళ్లకపోతే అక్క బాధపడుతుంది. మనం తరచూ కలుస్తూనే ఉంటాము కదా!” అంటూ రవి తేటగా నవ్వాడు.
శివ రవి భుజం తట్టి “నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలిరా!” అన్నాడు ఆప్యాయంగా.
“తప్పక మీ సూచనలు పాటిస్తాను రా!” అన్నాడు రవి.
మిత్రులిద్దరూ ఇచ్చిన ధైర్యం వలన రవిలోని నిరాశ మెల్లగా తగ్గిపోయి నూతనోత్సాహం చోటు చేసుకుంది.
(ఇంకా ఉంది)
రచయిత్రి పెబ్బిలి హైమావతి చిన్నతనం నుంచే రచనల పట్ల మక్కువ పెంచుకున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే ఆమె తన మొదటి కథను రాసినప్పటికీ, అది అముద్రితంగానే ఉండిపోయింది. ఆమెకు తన పెద్ద అన్నయ్యే ప్రధాన స్ఫూర్తి కాగా, వారి ఇంట్లోని స్వంత లైబ్రరీలోని మంచి మంచి పుస్తకాలు చదవడం వల్లే ఆమె రచయిత్రిగా మారారు. తొమ్మిదో తరగతిలోనే వివాహం జరగడం, ఇంటి పెద్ద కోడలిగా బాధ్యతలు నిర్వహించడం, ఆ తర్వాత పిల్లల చదువుల వల్ల ఆమె చాలా కాలం పాటు రాయలేకపోయారు. అయితే, తన ఇద్దరు పిల్లలు మెడిసిన్ చదువుతున్న సమయంలో ఆమె మళ్లీ కలం పట్టారు. అలా ఆమె 48వ ఏట, 2001 జులైలో ‘ఆంధ్రభూమి’ మంత్లీ మ్యాగజైన్లో ప్రచురితమైన ‘ఎందాక ఈ పరుగు?’ అనే కథ ఆమె మొదటి ముద్రిత రచనగా నిలిచింది. తెలుగు భాష మృతభాషగా మారిపోకుండా కాపాడుకోవాలనే తపనతో ఆమె నిరంతరం శ్రమిస్తున్నారు.
పెబ్బిలి హైమావతి గారు ఇప్పటివరకు 33 నవలలు, 125 కథలు, 25 కవితలు రాశారు. ప్రముఖ సాహిత్యవేత్త కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైన ‘హైమావతి కథలు’ ఆమె మొదటి పుస్తకం కాగా, ‘కథా మంజీరాలు’, ‘జీవితాన్ని ప్రేమించు కథలు’ అనే మరో రెండు కథా సంపుటాలను కూడా ఆమె వెలువరించారు. కథా సుధ, మాతృదేవోభవ, పూలబాటగా, అమృత వాహిని, సృష్టిలో తీయనిది, విజేత, అవును పెళ్లంటే నూరేళ్ల పంట, నాతి చరామి, అన్నపూర్ణ, స్వాతి వాన కోసం, స్వయం సిద్ధ, మనసున మల్లెల మాలలూగెనే, అమృత కలశం మరియు త్రివేణి (3 నవలల సంపుటి) వంటి ఎన్నో నవలలను ఆమె ప్రచురించారు. ఆమె సాహిత్య సేవకు గుర్తింపుగా బలివాడ కాంతారావు పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాతృ వందనం పురస్కారం, రామ్కీ ఎన్‌పవరింగ్ ఉమెన్స్ అవార్డు, ‘జీవితాన్ని ప్రేమించు’ కథల సంపుటికి ఎం జీ రంగా ఫౌండేషన్ పురస్కారంతో పాటు మరెన్నో అవార్డులు ఆమెను వరించాయి. ఆమె రచనలపై పరిశోధనలు చేసి నాగార్జున, ఆంధ్రా విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు పరిశోధకులు పీహెచ్డీ, ఎంఫిల్ పట్టాలు అందుకోవడం విశేషం.
