Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గెలిచేదాకా పోరాడు-3

[శ్రీమతి పెబ్బిలి హైమవతి రచించిన ‘గెలిచేదాకా పోరాడు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఊరేళ్ళే ముందు శృతిని కలుద్దామని వాళ్ళింటికి వెళ్ళి, ఆమె తండ్రి పానకాలరావు వల్ల అవమానానికి గురవుతాడు రవి. శృతితో కనీసం మాట్లాడే అవకాశం కూడా లేకుండా ఫోన్ తీసేసుకోవడంతో రవి తీవ్ర నిరాశలో కూరుకుపోయి తిరుగు ప్రయాణమవుతాడు. అతడి పరిస్థితి తెలుసుకున్న ప్రాణ స్నేహితులు శ్రీను, శివ వెంటనే రవి వద్దకు చేరుకుని అతడికి ధైర్యం చెబుతారు. తమ స్నేహ బంధం విలువను గుర్తు చేస్తూ, ఎన్ని కష్టాలు ఎదురైనా తాము అండగా ఉంటామని భరోసా ఇస్తారు. అనంతరం ముగ్గురూ కలిసి విశాఖపట్నం వెళ్లి కూలిపోయిన భవనాన్ని పరిశీలించి ఫోటోలు తీసుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాల కోసం రవితో పాటు స్నేహితులు కూడా బెంగళూరు బయలుదేరి, ఆర్థికంగా, మానసికంగా అండగా నిలబడటంతో రవిలో తిరిగి కొత్త ఉత్సాహం చిగురిస్తుంది. – ఇక చదవండి.]

ట్రెయిన్ ముందుకు సాగుతూంటే.. ఎంత వద్దనుకున్నా, రవి ఆలోచనలు గతం లోకి జారిపోయాయి.

రవికి తాను పుట్టి పెరిగిన ఊరంటే ఎంతో ఇష్టం. చుట్టూ కొండలు, ఊరి చివర చెఱువు.. వాటిలో తేలియాడే రంగురంగుల తామరపూలు.. ఎంత చూసినా తనివి తీరదు అతడికి.

అందుకే అతడు ఆ చెఱువు గట్టుకి ప్రతి రోజూ వెళ్లి ఉదయ సంధ్యల సౌందర్యాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ ఉంటాడు.

భావ కవితలు అల్లుకుని పాడుకుంటూ అమిత ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు. రవి స్నేహితులు శివా శ్రీనూలు స్నేహితుని ఆనందంలో పాలు పంచుకొని ఆనందిస్తూ ఉంటారు.

పై చదువుల కోసం వేరే ఊరు వెళితే ఈ సుందర దృశ్యాలకు దూరం అవుతానని చదువును కూడా వదులుకునేందుకు సిద్ధమై పోయాడు రవి.

అతడికి బాగా చదువుకోవాలి ఏదేదో సాధించాలి అని ఉన్నా ఊరి మీద మమకారం అతడిని కట్టిపడేసింది.

నిజానికి శివాకీ శ్రీనుకూ ఇంజనీరింగ్ చదవాలని మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఆశ ఉన్నా మిత్రుని వదిలి ఉండలేక వాళ్ళు కూడా చదువు వద్దనుకున్నారు.

రవికి తగిన వారే అతని మిత్రులు శివ, శ్రీనూలు. వారికి అతడంటే పంచప్రాణాలు. రవి ఏం చెప్పినా అది నూటికి నూరుపాళ్లూ సరైనది అని భావించి అతడ్ని సమర్థిస్తూ ఉంటారు.

అలా బాల్యం నుండీ ఒకే మాటగా, ఒకే బాటగా పెరిగారు ఆ ముగ్గురూ.

ఇంటర్ అయ్యాక తల్లిదండ్రుల బలవంతం మీద ఎంసెట్ రాసినా, ఇంజనీరింగ్ చదివేందుకు ఎవరూ సుముఖంగా లేరు. ముగ్గురూ వెయ్యి లోపు రేంక్ తెచ్చుకొని చదవకుండా ఇంట్లోనే ఉంటామని అనడం వారి తల్లిదండ్రులకు నచ్చకపోవడమే కాదు, వారి వైఖరి ఎవరికీ అర్థం కాలేదు.

అయినవారందరూ ఎంత చెప్పినా మిత్రులు ముగ్గురూ ఎవరి మాటా వినిపించుకోలేదు.

వాళ్లు ముగ్గురూ పుస్తక ప్రియులే.. తాము చదివిన పుస్తకాల్లోని కథా కథనం గూర్చి, అందులోని పాత్రల గూర్చి చర్చించుకుంటూ ఉంటారు నిత్యం.

ఊరిలో వారికి ఎవరికి ఏ అవసరం వచ్చినా, వారి తండ్రుల్లాగే వారు కూడా స్పందించి అవసరం అయిన సాయం అందిస్తూ ఉంటారు.

వారి తీరు చూసిన ఊళ్లో వారందరూ ఆ మిత్రులు ముగ్గురినీ అల్లరి చిల్లరిగా తిరిగే పిల్లల్లాగా భావించడం లేదు అందుకే. మనకేదైనా కష్టం వస్తే శివా, శ్రీనూ, రవిల దగ్గరకు వెళితే చాలు.. వాళ్లే చూసుకుంటారు అన్నీ అనుకుంటారు అందరూ.

చదువుకోసం వాళ్లు పట్నం వెళ్లకపోయినా ఊరి వారందరి దృష్టిలో వారు ఆణిముత్యాలే!

***

రవి తండ్రి వెంకట్రామయ్య. ఆ ఊరిలో ఉన్న మోతుబరి రైతులలో అతనొకడు. వ్యవసాయం అంటే అతడికి అపారమైన ప్రేమ. వెంకట్రామయ్యకు ఇరవై ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మామిడి తోట ఉంది. అంత ఉన్నా, చేను గట్టు మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చోడు అతడు అందరి లాగానూ.

జీతగాళ్లతో పాటు తానూ స్వయంగా అరక కట్టి పొలం దున్నుతాడు. శ్రమలోనే ఆనందం పొందుతాడు అతడు.. అంతే కాదు ఎవరికి ఏ ఆపద వచ్చినా, వాళ్లు ఉన్నవాళ్లా, లేనివాళ్లా లేక చిన్న కులమా, పెద్ద కులమా అని చూడకుండా చేతనైనంత సాయం అందిస్తూ ఉంటాడు.

అలా అని తాను ఏదో ఘనకార్యం చేసినట్లుగా ఎప్పుడూ భావించలేదు అతడు. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే అతడి మంచితనమే ఆ ఊరిలో చిన్నా పెద్దా అందరి చేతా వెంకట్రామయ్యకు మంచి వ్యక్తి అని, మనసున్న మారాజు అనే గుర్తింపును తెచ్చి పెట్టింది.

ఎవరికి ఏ అవసరం వచ్చినా, అందరూ మంచికీ, చెడ్డకూ వెంకట్రామయ్యనే సలహా అడుగుతూ ఉంటారు.

అతడి భార్య పేరు అన్నపూర్ణమ్మ. పేరుకు తగినట్లే అందరినీ ఆదరిస్తూ ఉంటుంది. ఆకలి అని ఆ ఇంటికి వచ్చిన వారెవరినీ కడుపు నింపకుండా పంపదు ఆమె.

తల్లిదండ్రుల్లో ఉన్న ఈ మంచితనం, సేవాభావం యొక్క ప్రభావం రవి పైన బాగా పడిsది. ఎవరికైనా, ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించి పేరు ప్రతిష్ఠల కోసం కాకుండా అప్పటికప్పుడు వారికి తగిన సహాయం అందిస్తూ ఉంటాడు.

అతడి మిత్రులు నిత్యం అతడినే అనుసరిస్తూ ఉంటారు.

రవిది చాలా సున్నితమైన మనస్సు. తల్లిదండ్రులలాగే అతడు కూడా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే అది తనకు వచ్చినట్లుగానే ఎంచి బాధపడతాడు.

వారిని ఏదోరకంగా తండ్రి మాదిరిగానే ఆదుకోవాలని చూస్తాడు. దానికి కారణం అతడికి చిన్నతనంలో జరిగిన సంఘటనే!

ఒకసారి తుఫాన్ భీభత్సం వలన వాళ్ల ఊళ్లోనే గాక చుట్టుపట్ల ఊళ్లోని వారి అందరి పంటలూ నాశనం అయిపోయాయి. బీదా బిక్కీ కొంపా, గోడూ పోగొట్టుకుని తిండీ తిప్పలు లేక అల్లాడి పోసాగారు.

ఆ సమయంలో ప్రభుత్వం అందించే సాయం నామమాత్రంగానే ఉండడంతో.. వెంకట్రామయ్య తన గాదెల్లోని పురులు విప్పించి ధాన్యం మిల్లు పట్టించి అందరినీ ఆదుకున్నాడు.

అది చూసి ఊళ్లో ఉన్న చలపతి లాంటి స్నేహితులు “ఏమిట్రా వెంకా నువ్వు చేస్తున్న పని.. వెనకా ముందూ చూడకుండా ఉన్నదంతా ఊడ్చి పెట్టేస్తున్నావు. రేపు నీకు అవసరం అయితే ఎలా? ఎక్కడి నుండి తెస్తావు?” అన్నారు మందలింపుగా.

ఉన్నదంతా ఇలా దానధర్మాలు చేశాక ఆతరువాత తన స్నేహితుడు ఎక్కడ ఇబ్బంది పడతాడోనని అతడి బెంగ.

“ఏమిట్రా చలపతీ అందరిలాగే నువ్వు కూడా మాట్లాడుతున్నావు.. మన చుట్టుపట్ల పది ఊళ్లవాళ్లు ఆకలితో అల్లాడుతూంటే, మనకి నోట్లోకి ముద్ద ఎలా వెళుతుందిరా? ఎవరైనా రోగం రొష్టు వచ్చి చనిపోతే ఆ దారి వేరు.. ఆకలికి మాడి చావడం కంటే దౌర్భాగ్యం ఇంకేముంటుందిరా? అందరూ పోయాక, మిగిలే వల్లకాడు లాంటి ఈ ఊరిలో మృష్టాన్నాలు తింటూ మనమెలా బ్రతకగలం చెప్పు?” అన్నాడు వెంకట్రామయ్య.

ఆ మాటలు వినడంతోనే స్నేహితుడి పెద్దమనసుతో పాటు తన అల్పత్వం కూడా చలపతికి బోధపడింది. వెంటనే చేసిన తప్పుని సరిదిద్దుకునేందుకు తన గాదెల పురులు కూడా విప్పించాడు చలపతి.

వారిని చూసి శ్రీనూ తండ్రి నీలకంఠం అవడానికి సన్నకారు రైతే అయినా తనకి ఉన్నంతలోనే పప్పులూ బియ్యం అందించాడు తనవంతుగా తుఫాను బాధితులను ఆదుకునేందుకు.

అదంతా కళ్లారా చూసిన రవికి తండ్రి అంటే గౌరవభావంతో పాటు ఆరాధన కూడా కలిగింది. అలా అతడి మనసులో ఇతరులకు సాయపడాలి అనేదానికి బీజం పడింది.

మిత్రులు ముగ్గురూ అలా తమ తండ్రుల అడుగు జాడల్లో నడుస్తూ ఊరందరి తలలో నాలుకలా మెలగసాగారు.

అదే రోజున జరిగిన మరో సంఘటన కూడా రవి మనసుపై చెరగని ముద్ర వేసింది.

అన్నపూర్ణమ్మకి పూజలు, పునస్కారాలు కొంచెం ఎక్కువే.. అలాగే భర్తలాగే ఆమె కూడా సేవాభావం కలిగిన ఇల్లాలు.

ఈ వరదలూ తుఫాను భీభత్సం వలన పంటల సమయంలో ఊరూరా తిరుగుతూ ఊరి చివరన చిన్న గుడారాలు వేసుకుని తట్టలూ, బుట్టలూ అల్లుకుని పొట్ట పోషించుకునేవారికి చేద్దామంటే పనిలేక, తినడానికి తిండి లేక అల్లాడిపోయారు.

ఆ రోజు నిండు గర్భిణీ అయిన ఏనాది సుక్కి “అమ్మా, ఆకలి.. ఆకలి!” అని ఆర్తనాదంలాంటి కేకలు పెట్టి అడుక్కుంటూ వచ్చి నడిరోడ్డు మీద సొమ్మసిల్లి పడిపోయింది. అదే సమయంలో ఆమెకు నొప్పులు కూడా ప్రారంభం అయ్యాయి.

ప్రసవవేదన పడుతున్న సుక్కిని చూసిన చుట్టుపట్ల ఇళ్లల్లోని ఆడవారు అయ్యో పాపం! అనుకుంటూ ఎలాగైనా ఆమెను కాపాడాలి అనే ఆరాటంతో వెంటనే ఆమె దగ్గరకు వెళ్లారు. వారితో పాటు అన్నపూర్ణమ్మ కూడా అక్కడకు వెళ్లింది.

పరిస్థితి గమనించి.. అందరూ కలసి సాయం పట్టి సుక్కిని అన్నపూర్ణమ్మ ఇంటి వసారాలోకి చేర్చి.. చీరను చుట్టూ దడిలా కట్టి ఆమెకు చేతనైనంతలో సపర్యలు చేశారు వారు.

ఒక గంటసేపు కష్టపడిన సుక్కి పండంటి బిడ్డను ప్రసవించింది. ఆమెకు సుఖ ప్రసవం కావడంతో అందరి మనసులూ తెరిపిన పడ్డాయి.

ఆ సమయంలో వారికి ఆమె కులగోత్రాలు కాని పేదరికం గాని కనిపించలేదు.. సాటి ఆడదాన్ని ఆదుకోవాలి అన్న ఆలోచన తప్ప ఇంకేమీ లేకపోయింది. గండం గడిచాక సుక్కికి పథ్యపానాలు అన్నీ అన్నపూర్ణమ్మే చూసుకుంది.

అది చూసిన రవి “అమ్మా, ఆ ఏనాది వాళ్లను ఎవరూ గుమ్మంలోనికి కూడా రానివ్వరు కదా.. అలాంటిది ఈరోజు మీరందరూ కలిసి సపర్యలు చేశారు. అంతేకాక నువ్వేంటమ్మా, ఇంట్లో పెట్టుకోవడమే కాక మనం తినే గిన్నెల్లోనే అన్నం పెడుతున్నావు ఆమెకి?” అని అడిగాడు ఆశ్చర్యంగా.

“అరే నాన్నా, వాళ్లన్నీ పోగొట్టుకుని నిరాధారంగా నిలబడ్డారు. ఈ ఆపద సమయంలో అదీ ఇదీ అని చూసుకుంటే ఎలా? ఈ ఆచారాలనేవి మనిషి క్రమబద్ధంగా జీవించడానికి ఏర్పాటు చేసినవే గానీ, మనిషికీ మనిషికీ మధ్య అడ్డుగోడ కట్టేందుకు కాదు? ఆమె కష్టంలో ఉంది. ప్రతి ఆడదానికీ పురుడు అంటే పునర్జన్మతో సమానం అంటారు. అలాగే ఆ సమయంలో ఉన్న ఏ స్త్రీ అయినా ఆదిశక్తితో సమానం అంటారు పెద్దలు.. అలాంటి దేవతామూ ర్తికి మనం సాయం చేయడం అంటే మనకు మనం చేసుకున్నట్లే కదా! ఇంక కులాల గూర్చి.. నాకెప్పుడూ కులమతాల మీద నమ్మకం లేదురా! భగవంతుడి సృష్టిలో అందరూ సమానులని నా నమ్మకం. అదీగాక మీ నాన్నగారు అదే చెబుతూ ఉంటారు. నాన్నగారు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు కదా.. ఇవన్నీ విడమర్చి చెప్పడమే కాదు ఆచరించి చూపిస్తారు. కష్టంలో ఉన్నవారు ఎవరైనా ఎలాంటి వారు అయినా, వారికి ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించి తగిన సాయం అందిస్తారు. తాను చదివే పుస్తకాల సారం కూడా ఇదేనని చెప్పారు నాకు. అందుకే భగవంతుడు అన్ని కులాలలోనూ పుట్టాడని చెప్పారు. అంతేనా, ఆ పరమాత్ముడు మత్స్య కూర్మ వరాహ నరసింహా అవతారాలెత్తి సకల జీవరాశిలోనూ, అన్నిటా, అంతటా తానే ఉంటానని ఏ బేధభావమూ లేదని నిరూపించాడు అని చెప్పారు నాన్న. అలాంటి నారాయణ మూర్తికే లేని బేధభావాలు మనకెందుకురా.. ఎందుకురా వీటి గూర్చి మనం ఆలోచించడం?

ఇవన్నీ వదిలిపెట్టి చక్కగా చదువుకో.. లేదా పంచాయితీ ఆఫీసు దగ్గర సహాయ కేంద్రాల్లో నాన్నా చలపతి మావయ్యా నీలకంఠం బాబాయి ఉన్నారు.. అక్కడికి నువ్వూ, నీ ఫ్రెండ్సూ వెళ్లి వాళ్లకు సాయం చేయండి” అంది అన్నపూర్ణమ్మ.

తల్లి మాటలు విన్నాక తానెంత తప్పుగా ఆలోచించినదీ రవికి బోధపడింది. అంతే కాకుండా ఈ సంఘటనతో తల్లి మీద అంతులేని గౌరవం కలిగింది.

అప్పటి నుండీ తల్లిదండ్రులు చేసే ప్రతి మంచి పనిలోనూ తాను కూడా ఇష్టంగా పాలు పంచుకోసాగాడు రవి.

***

వెంకట్రామయ్యకు చదువు అంటే ఎంతో ఇష్టం. ఊరిలో ఉన్న జూనియర్ కాలేజీలో ఇంటర్ వరకూ చదివాడు అతడు. పై చదువులకు పట్నం వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణం లోనే అతడి తండ్రి జగన్నాధం పాము కాటుకు గురై మరణించాడు.

దాంతో కుటుంబ భారమంతా అతని పై పడింది. అతడి తర్వాత పుట్టిన ముగ్గురు చెల్లెళ్ల బాధ్యతా అతడిదే అయింది. తల్లి అండదండలతో వ్యవసాయం చూసుకుంటూ చెల్లెళ్ల పెళ్లిళ్లు చేసి బాధ్యతను తీర్చుకొని ఆ తర్వాత తాను కూడా పెళ్లి చేసుకున్నాడు.

బాగా చదువుకోవాలి అనే కోర్కె తనకు తీరకపోయినా, తన పిల్లలిద్దరినీ బాగా చదివించి ఆ లోటు తీర్చుకోవాలి అనుకున్నారు వెంకట్రామయ్య దంపతులు.

వారు ఆశించినట్లే శాంతి ఊరిలో ఇంటర్ పూర్తి చేసి పట్నంలో బంధువుల ఇంట్లో ఉండి డిగ్రీ ఫైనలియర్ పూర్తి చేసి పీజీ చేస్తోంది. ఆ తరువాత పిజి అయ్యాక లెక్చరర్ అవ్వాలనేది ఆమె కోరిక.

అయితే ప్రకృతి ఆరాధకుడైన రవి చదువు కోసం ఆ ఊరు విడిచి వెళ్లవలసి వస్తుందని ఇంటర్ తర్వాత పై చదువులపై ఆసక్తి కనబరచలేదు.

సాటి వారి పిల్లలందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ లేదా డిగ్రీయో ఏదో ఒకటి చదువుతూ ఉంటే, తన కొడుకు రవి తెలివితేటలు ఉండి కూడా చదువు పట్ల ఎందుకింత నిరాసక్తంగా ఉంటాడో అర్ధం కాలేదు వెంకట్రామయ్యకు.

ఆ రోజుతో పొలంలో నాట్లు వేయడం పూర్తయిపోయింది. నాటిన మడులన్నిటినీ సంతృప్తిగా చూసుకొని ఇంటిదారి పట్టాడు. పొలం నుండి ఇంటికి వస్తూ రవి విషయం ఆలోచించసాగాడు. ఆ రోజు భోజనాల దగ్గర ఆ విషయమే కదిపాడు అతడు.

“ఏరా, నీ తోటి వాళ్లందరూ పై చదువుల కోసం పట్నం వెళ్తున్నారు. నువ్వు మాత్రం ఏ ప్రయత్నం లేకుండా ఇంట్లోనే ఉంటానని అంటున్నావు.. ఏమిట్రా ఇది?” అని అడిగాడు.

“ఏమో నాన్నా, నాకు వాళ్ల లాగా అక్కడికి వెళ్లి చదువుకోవాలని లేదు. నేనిక్కడే ఉందామని అనుకుంటున్నాను” అన్నాడు రవి.

“ఇక్కడా.. ఇక్కడుండి ఏం చేస్తావురా?” అనడిగాడు వెంకట్రామయ్య కొడుకు వంక ఆశ్చర్యంగా చూస్తూ.

“నేను కూడా నీతో పాటు వ్యవసాయం చేస్తాను నాన్నా!” అన్నాడు రవి.

“ఏంట్రా నువ్వు వ్యవసాయం చేస్తావా? ఏనాడైనా అరక కట్టి చేలో దిగావా? ఏం వచ్చు అని వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నావు.. గట్టున కూర్చుని పనోళ్లతో పని చేయిస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? ఆరుగాలాలు భూమిని చంటి బిడ్డలా సాకాలిరా.. అలా అయితేనే పుడమి తల్లి కరుణించి మన చేతికి పంటలను ఇస్తుంది. ఒకోసారి ప్రకృతి వైపరీత్యాల వలన చేతికి వచ్చిన పంట నోటి దాకా రాకుండా పోతుంది. అలాంటి శ్రమను ఆటుపాట్లను నువ్వు పడగలననే అనుకుంటున్నావా?” అన్నాడు వెంకట్రామయ్య మందలిస్తున్నట్లుగా.

“రాకపోతే నేర్చుకుంటాను నాన్నా.. ఎవరూ పుట్టుకతోనే అన్నీ చేయలేరు కదా.. అంతెందుకు నువ్వు కూడా తాతయ్య పోయాక ఇంటర్తో చదువాపేసి వ్యవసాయంలో దిగలేదా.. నేను కూడా అంతే!” అన్నాడు రవి వాదిస్తున్నట్లుగా.

కొడుకు మాట విని వేదాంతిలా నవ్వాడు వెంకట్రామయ్య.

“అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు.. నాకు వేరే దారి లేక నా చెల్లెళ్ల పెళ్లిళ్ల్లు, కుటుంబ బాధ్యతలు మీద పడడం వలన అలా చేశాను. నీకేం రా.. అలాంటి బాదరబందీలు ఏమీ లేవు కదా! హాయిగా చదువుకోరా బాబూ!” అన్నాడు వెంకట్రామయ్య హితవు చెప్తున్నట్లుగా.

“అందరూ పల్లకీ ఎక్కాలని అనుకుంటే, మోసేవారు ఎవరు నాన్నా.. మనిషికి ఐదు వేళ్లూ నోట్లోకి పోవాలంటే పంటలు పండించాలి కదా! ఆ పని నేను చేస్తానని అంటున్నాను” అన్నాడు రవి తార్కికంగా.

కొడుకు వాదన విని తెల్లబోయి చూశాడు వెంకట్రామయ్య.

“ఒరే రవీ, నీ ఆలోచన మంచిదేరా.. కాదనను. కానీ అతి సుకుమారంగా పెరిగిన నీవు ఈ పొలం పనుల శ్రమకి తట్టుకోలేవురా! అంతేకాదు నాన్నా, ఈ ఆస్తులు ఇవ్వాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ విద్య అనేది దొంగలు దోచుకు పోలేనిది. దానం చేసినా ఏమాత్రం తరిగిపోనిది.. అంతేకాదురా, పదిమందిలోనూ నీకు విద్య ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పిస్తుంది. చీకట్లో ఉన్న నీ మేధస్సును తేజోవంతం చేస్తుంది.

రవీ, బంగారం కరిగిపోవచ్చు.. డబ్బు తరిగిపోవచ్చు.. అలాగే పువ్వు వాడిపోవచ్చు.          కానీ నేర్చుకున్న విద్య మాత్రం దిక్సూచిలా జీవితం అంతా మనకి దారి చూపిస్తుందిరా! మన జీవితానికో స్థిరత్వాన్ని, మన వ్యక్తిత్వానికో వికాసాన్నీ ఇస్తుందిరా!

బాబూ, నీ గూర్చి మీ అమ్మ కంటే, నీకంటే, నీ స్నేహితుల కంటే నాకే ఎక్కువ తెలుసురా.. నీలో ఒక ప్రకృతి ఆరాధకుడు ఉన్నాడు. అందుకనే కదా, అందమైన మన ఊరిని, ఈ పరిసరాలను విడిచి వెళ్లేందుకు నీ మనసు అంగీకరించడం లేదు.. కనుక చదువుకు ప్రత్యామ్నాయంగా వ్యవసాయాన్ని ఎంచుకున్నావు, ఈ ఊరి నుండి కదలకుండా ఉండేందుకు.

కానీ రవీ, వ్యవసాయం చేయడం అనేది అంత సులువైన పని కాదురా! మనం ఆరుగాలాలు శ్రమ పడినా ఒకోసారి వానలు రాకా, వరదలు వచ్చో, అదీగాకపోతే చీడపీడలు పట్టో చేతి దాకా వచ్చిన పంట నోటి దాకా రాకుండా పోతుంది.

అంతేకాదురా, నీవు వ్యవసాయం లోకి దిగితే ఒకోసారి ఊపిరి తీసేందుకు కూడా సమయం చిక్కదు. అప్పుడు నీ ప్రకృతి ఆరాధనకు సమయం కొంచెం కూడా మిగలక పోతే నువ్వు తట్టుకోగలవా?

అదే పై చదువుల కోసం పట్నం వెళ్లావనుకో.. శెలవులకు ఇంటికి వచ్చినప్పుడు నీ కళ్ల నిండుగా మన ఊరి అందాలను ఆస్వాదించవచ్చు. అప్పుడు నీవు రాసుకొని, పాడుకొనే పాటలు కూడా మరింత మధురంగా, భావయుక్తంగా ఉంటాయి!” అన్నాడు వెంకట్రామయ్య నచ్చజెప్తున్నట్లుగా.

“నువ్వు చెప్పింది కరెక్టే నాన్నా.. కానీ, నేనిప్పుడు చదివి ఉద్యోగాలు చేయాలా.. ఊళ్లేలాలా? అలా చేయకపోతే గడవని పరిస్థితి కాదు కదా మనది? మనకి ఉన్నది చాలదా?      మీరన్నట్లు లోకజ్ఞానం సంపాదించేందుకు నా ఇంటర్ చదువు చాలదా? ఇంకా డిగ్రీలు సంపాదించాలా? మీరూ ఇంటరే కదా చదివారు.. దాంతోనే కదా ఊర్లో వాళ్లందరికీ మంచీ చెడ్డా బోధించగలుగుతున్నారు..           నాన్నా, నాకిలా ఇక్కడ ఉండడమే ఇష్టం! నాకు నచ్చినట్లుగా నన్ను జీవించనివ్వండి ప్లీజ్!” అన్నాడు రవి స్థిరమైన కంఠంతో.

కొడుకు మాటలు విని అయోమయంగా చూశాడు వెంకట్రామయ్య. ఎలా వీడిని మార్చాలి అనుకున్నాడు బాధగా.

“మరి అలాంటప్పుడు ఎంసెట్ రాసి ఆ రేంకు ఎందుకు సంపాదించుకున్నావురా?” అన్నాడు వెంకట్రామయ్య అర్థం కానట్లుగా చూస్తూ.

“అది నా తోటి వాళ్ల దగ్గర నా సామర్ధ్యం నిరూపించుకునేందుకు.. అదీకాక నేను రాయకపోతే, శివా శ్రీనూ ఎంసెట్ రాయమని అన్నారు. వాళ్లకు చిన్నప్పటి నుండీ ఇంజనీరింగ్ చదవాలని ఎంతో ఆశ. నాకోసం వాళ్లు మానేయడానికి సిద్ధపడ్డారు. అందుకోసమే, వాళ్ల గురించి రాసాను తప్ప నాకు చదవాలని ఉండి కాదు” అన్నాడు రవి తేలిగ్గా.

“బాగానే ఉంది ఒకరికోసం ఒకరిమంటూ ఎంసెట్ రాశారు. నువ్వు చదవను అంటున్నావని వాళ్లకి ఎంతో ఇష్టం అయిన ఇంజనీరింగ్‌ను వాళ్లూ చదవడం లేదు. నీ మూలాన వాళ్ల భవిష్యత్తు దెబ్బ తింటున్నది గమనించారా? నీ ఆలోచన ఎంతమాత్రం సరైంది కాదురా!” అన్నాడు వెంకట్రామయ్య.

“ఏమో నాన్నా మీరెంత చెప్పినా నామనసు చదువు వైపు మొగ్గు చూపడం లేదు”.

కొడుకు మాటలు విన్నాక ఇంకేం మాట్లాడాలో తోచలేదు అతడికి. భోజనం ముగించి లేచాడతడు అక్కడి నుండి.

తండ్రికి తన మనసులో మాట చెప్పేశాక రవి మనసు కూడా తేలిక పడింది. ఇకపై చదువు గూర్చి ఇంట్లో ఎటువంటి చర్చా రాదని అనుకొని స్థిమితపడ్డాడు అతడు.

అయితే మనసులో ఏ మూలో నా మూలంగా నా స్నేహితులు చదువు మానుకుంటున్నారు.. నా వలన వారి భవిష్యత్తు పాడవుతుందా? అనే మీమాంశ కలిగినా.. అది క్షణకాలం మాత్రమే నిలిచింది రవికి. తిరిగి తన ధోరణిలో తాను పడిపోయాడు.

ఒకరోజు రవి తాను రాసిన కవితను మిత్రులు ఇద్దరికీ వినిపించాడు.

అది విని “ఎంత బాగా రాశావు రవీ కవిత.. దీన్ని ఏదైనా పత్రికకు పంపితే కళ్ల కద్దుకుని వేసుకుంటారు.. అంత బాగున్నాయి. చక్కగా అందరూ చదువుతారు. నీకు మంచి పేరు కూడా వస్తుంది” అన్నాడు శ్రీను.

“అవును రవీ, అలా చెయ్యి.. నీ పేరు పత్రికల్లో వస్తే, ఫలానా కవి నా క్లోజ్ ఫ్రెండ్ అని అందరితో గర్వంగా చెప్పుకుంటాం మేము” అన్నాడు శివ.

“ఒరేయ్ బాబులూ, ఇవన్నీ నాకోసం నేను సరదాగా రాసుకున్నానే గానీ, పేరు ప్రతిష్ఠల కోసం కాదు!” అన్నాడు రవి చిన్నగా నవ్వుతూ.

“అలా అనకురా, ఎంత నీకోసం నువ్వు రాసుకున్నా పది మందిలో గుర్తింపు ఉంటేనే, ఏ కళ అయినా రాణిస్తుంది. బంగారు పళ్లేనికైనా గోడ చేర్పు కావాలంటారు అందుకే! కనుక నా మాట విని ఏదైనా పత్రికకు పంపు రవీ!” అన్నాడు శ్రీను.

“అవునురా, శ్రీనుగాడు చెప్పింది నిజం.. ఆ మధ్య ఏదో పత్రికలో కవితల పోటీ ప్రకటన చూశాను. నేను లైబ్రరీకి వెళ్లి తీసుకువస్తాను ఆ వివరాలు. దానికి పంపరా, నీకు తప్పకుండా బహుమతి వస్తుంది” అన్నాడు శివ ప్రోత్సహిస్తున్నట్లుగా.

వాళ్లిద్దరూ అంత గట్టిగా చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు.

శివ తెచ్చిన పత్రికా ప్రకటన చూసి.. తాను రాసిన వాటిలో చాలా బాగున్నాయి అనుకున్న రెండు కవితలను ఫెయిర్ చేసి పోటీకి పంపాడు రవి. ఈ అనుభవం అతడికి చాలా కొత్త..

అందుకే కవిత పోస్టు చేసిన మర్నాటి నుండే ఫలితాల కోసం చాలా ఉద్విగ్నంగా ఎదురు చూడడం మొదలు పెట్టాడు రవి..

ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఫలితాలు వెలువడ్డాయి. రవి పంపిన కవితల్లో ఒక్క దానికి కూడా బహుమతి రాలేదు సరికదా.. సాధారణ ప్రచురణకు కూడా ఎంపిక కాలేదు ఏదీ. ఆ ఫలితాలను చూసి ఎంతో కృంగిపోయాడు రవి.

అంతవరకూ తన కవితలపై తన ప్రతిభ పైనా ఎంతో నమ్మకంతో ఉన్న రవి ఫలితాన్ని చూడడంతోనే అగాధంలో పడిపోయినట్లుగా భావించాడు. శివా, శ్రీనూ ఎంత ఓదార్చినా రవి మనసు కుదుట పడలేదు.

అన్నం, నీళ్లూ మానుకుని అలా మంచం మీదే పడుకొని శూన్యం లోకి చూస్తూ ఉండిపోయాడు. పొలం నుండి వచ్చిన భర్తతో రవి తిండీ, నీళ్లూ మానేసి పడుకున్నాడని.. ఎంత చెప్పినా వినకుండా భోజనానికి రావడం లేదని చెప్పి బాధపడిరది అన్నపూర్ణ.

భార్య చెప్పిన మాట వినడంతోనే వెంకట్రామయ్య మనసు గిలగిల లాడిపోయింది. ఇంత సున్నిత మనస్కుడు ఈ మాయదారి లోకంలో ఎలా నెట్టుకు రాగలడు? ఇంత చిన్న వైఫల్యాలకే ఇలా కృంగిపోతే ముందు ముందు జీవితంలో ఎదురయ్యే పెను సవాళ్లను ఎలా తట్టుకుంటాడు వీడు? అనుకున్నాడు బాధగా.

కొడుకు ఉన్న గదిలోకి వెళ్లి అతడు పడుకున్న మంచం మీద కూర్చుని అనునయంగా తల మీద చేయి వేసి “ఏమిటి నాన్నా ఇదంతా, నీ కవితలను ఆ పత్రికల వాళ్లు తీసుకోనంత మాత్రాన జీవితం అంతా ముగిసిపోయినట్లేనా? దాని కోసం ఇలా అన్నం నీళ్లూ మానేయడం ఏమైనా బాగుందా?రవీ, నీలాంటి వారిని చూసి అబ్దుల్ కలాం గారు ఏమన్నారో తెలుసా? ‘కింద పడ్డానని నీ పయనాన్ని ఆపకు.. తిరిగి ప్రయత్నం సాగిస్తే విజయం నీ స్వంతం అవుతుంది’ అన్నారు.. అంతేకాదు నాన్నా, ఓటమి గురువు లాంటిది, ఎన్ని సార్లు ఓడిపోయిన వ్యక్తికైనా గెలవాలనే పట్టుదలను నేర్పుతుంది.. నీలో గెలవాలనే పట్టుదల బలీయంగా ఉంటే, ఓటమి నీ జీవితంలోకి అడుగైనా పెట్టలేదు అంటారు పెద్దలు.

ఈ చిన్న అపజయాన్ని నీ గెలుపుకు సోపానంగా మలచుకొని.. మరింత పట్టుదలగా కృషి చేసి విజయం సాధించాలి తప్ప ఇలా బేలగా మారకూడదు. నాన్నా రవీ సాధారణంగా మనందరి ఆలోచనలూ పైపైనే ఉంటాయి.. జీవితంలో మన ఎదురుగా ఉన్న తలుపు మూసుకుపోతే, మరో చోట ఇంకో తలుపు మన కోసం తెరుచుకునే ఉంటుంది. కానీ మనం మాత్రం మూసుకుపోయిన తలుపును చూస్తూ కుమిలిపోతామే కానీ, కొత్తగా తెరుచుకున్న తలుపును గమనించము.

ఎందుకంటే ఓటమి భారం మనల్ని కృంగదీయడం వలన. ఒక అవకాశం చేజారిపోయినా మనకోసం మరో అవకాశం ఎదురు చూస్తూ ఉంటుంది అని గమనించము.ఇప్పుడు నీ తీరు కూడా అలాగే ఉంది. ఇది కాదురా పద్ధతి.. ఓడినా తిరిగి గెలిచే వరకూ మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే గెలుపు నీ తలుపు తడుతుంది. పద నాన్నా, భోజనం చేద్దాం! నువ్విలా ఉంటే అమ్మకీ నాకూ కాళ్లూ చేతులూ ఆడడం లేదు. అనవసరంగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు రా!” అంటూ రవి చేయి పట్టుకొని మంచం మీద నుండి లేవదీశాడు వెంకట్రామయ్య.

తండ్రి మాటలు కొంచెం ఊరటగా అనిపించడంతో నెమ్మదిగా లేచాడు రవి.

అవును నాన్న చెప్పింది నిజం.. నేను సిన్సియర్‌గా ప్రయత్నించి విజయం సాధించాలి అనుకున్నాడు మనసులో స్థిరంగా.

కేవలం కవితల కోసం ఉద్దేశించి వెంకట్రామయ్య చెప్పిన మాటలు రవికి భవిష్యత్తులో జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే స్థైర్యాన్ని ఇచ్చాయి.

తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి రావడం చూసి అన్నపూర్ణమ్మ మనసు తేలికపడింది. గబగబా కంచాలు పెట్టి ఇద్దరికీ వడ్డించింది. ఇద్దరూ ఏమీ జరగనట్లే కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు.

రెండు రోజుల్లో రవి మామూలు మనిషి అయ్యాడు. ఎప్పటిలాగే చెఱువు గట్టుకి షికారుగా వెళ్లసాగాడు. కొడుకు మామూలుగా తిరుగుతున్నా, వెంకట్రామయ్యకు మాత్రం అతడి భవిష్యత్తు పట్ల బెంగగానే ఉంది.

(ఇంకా ఉంది)

Exit mobile version