[శ్రీమతి పెబ్బిలి హైమవతి రచించిన ‘గెలిచేదాకా పోరాడు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ప్రయాణంలో ఉన్న రవి తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, తనకు ఎంతో ఇష్టమైన సొంతూరిని వదిలి వెళ్లడం ఇష్టం లేక ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చినా చదువు మానేసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంటాడు; అతడి స్నేహితులైన శివ, శ్రీను కూడా రవిని వదిలి ఉండలేక ఇంజనీరింగ్ చదువులను పక్కన పెడతారు. చిన్నతనంలో తుఫాను సమయంలో తన తల్లిదండ్రులు వెంకట్రామయ్య, అన్నపూర్ణమ్మ కులమత భేదాల్లేకుండా బాధితులను, గర్భిణీ అయిన ఏనాది సుక్కిని ఆదుకున్న తీరు రవిపై లోతైన ప్రభావం చూపడంతో, అతడు కూడా ఊరిలో సేవాభావంతో మెలుగుతుంటాడు. చదువు విలువను వివరిస్తూ వెంకట్రామయ్య ఎంత నచ్చజెప్పినా రవి ఊరిలోనే ఉంటానని మొండికేయగా, మరోవైపు స్నేహితుల ప్రోత్సాహంతో పత్రికా పోటీకి పంపిన తన కవితలు ఎంపిక కాకపోవడంతో రవి తీవ్ర నిరాశతో అన్నపానీయాలు మానేస్తాడు. అప్పుడు తండ్రి వెంకట్రామయ్య ఓటమిని గెలుపునకు సోపానంగా మార్చుకుని మళ్లీ ప్రయత్నించాలని హితవు చెప్పి రవిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మామూలు మనిషిని చేసినప్పటికీ, కొడుకు భవిష్యత్తుపై ఆయనకు బెంగ మాత్రం వీడదు. – ఇక చదవండి.]
“అన్నయ్యా, అయితే మీరెవరూ బీటెక్ చదివేందుకు పట్నం వెళ్లడం లేదా?” అని అడిగింది కమల దిగులుగా శివా వంక చూస్తూ.
“అలా అడుగవే అమ్మా.. ఆ రవిగాడు ఏ గంగలో దూకితే శ్రీనుగాడు, వీడూ అదే గంగలో దూకుతారట. కష్టపడి కని పెంచిన తల్లిదండ్రుల గోడు కొంచెం అయినా పట్టడం లేదు వీళ్లకి.. ఏంచేయాలో నాకూ మీ నాన్నకూ ఏమీ పాలుపోవడం లేదమ్మా!” అంది సావిత్రి నిరాశగా.
“అది కాదన్నయ్యా, మీకు వచ్చిన ఈ రేంక్లు ఇంకెవరికైనా వచ్చి ఉంటే.. ఎగిరి గంతేసి కాలేజీలో చేరి చదువుకునేవారు. మీరేంటి? చేతిలో ఇంతమంచి అవకాశం పెట్టుకుని మీనమేషాలు లెక్కపెడుతున్నారూ? ఇదిగో అన్నయ్యా, నేను ముందే చెబుతున్నాను, చిన్నదాన్ని అని నా మాట తేలిగ్గా కొట్టి పడేయకుండా జాగ్రత్తగా విను. మీరు వాడికి నిజమైన స్నేహితులు అయితే, వాడిని ఎలాగోలా ఒప్పించి చదువు కొనసాగించేలా చేయండి. అంతే తప్ప రవి కోసం మీరు చదువు మానుకోవడం సరైంది కాదు. అంతే కాదన్నయ్యా, మీరు చదువాపేస్తారు ఇప్పుడు.. వచ్చేఏడు నేను ఎంసెట్ రాసి సీటు తెచ్చుకుని బీటెక్‌లో జాయిన్ అయిపోతాను. అప్పుడు ఆ శ్రీనుగాడు నా కాళ్లా వేళ్లా పడినా నేను వాడిని పెళ్లి చేసుకోను గాక చేసుకోను!” అంది కమల ఖండితంగా.
కూతురు మాటలు విని సావిత్రి తెల్లబోయింది. ఉన్న సమస్యలు చాలక ఇదో కొత్త సమస్యా అన్నట్లుగా చూసింది కూతురి వైపు. చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధాన్ని కూతురు ఇంత సునాయాసంగా ఎలా కాదంటోంది అని ఆశ్చర్యపోయింది.
అంతేకాదు, తన ప్రాణస్నేహితుడైన నీలకంఠంతో సంబంధం కలుపుకోవాలి అని ఎన్నో కలలు కుంటున్నాడు భర్త.. ఇప్పుడు కూతురు అన్న ఈ మాటలు వింటే అతడు తట్టుకోగలరా? అనుకుంది.
చెల్లెలి మాటలు విని శివా కూడా ఆశ్చర్యపోయాడు.
“ఏంటమ్మా, ఒక్కసారే ఇంత మాట అనేశావు? బీటెక్ చేయకపోతే శ్రీనూని పెళ్లి చేసుకోవా? ఈమాట గానీ వాడు వింటే ఎంత బాధ పడతాడో ఊహించావా?” అన్నాడు శివా ఆరాటంగా.
“నీ స్నేహితుల మీద నీకు ఉన్న అభిమానంలో సగమైనా నీ స్వంత చెల్లెలినైన నామీద ఉంటే ఎంత బాగుండేది? నీలకంఠం మావయ్య ఆశలన్నీ ఆ శ్రీనుగాడి మీదే, వాడు బాగా చదువుకోవాలి పెద్ద ఉద్యోగం చేయాలి అని మావయ్యా అత్తా ఎన్నో కలలు కంటున్నారు. వీడి వరస చూసి వాళ్లు ఎంత బాధ పడుతున్నారో ఏమైనా తెలుసా నీకు? స్నేహితుడ్ని ప్రేమించడంలో తప్పులేదు.. కానీ అదే సమయంలో కన్నవాళ్ళ గూర్చి కూడా కొంచం ఆలోచించాలి కదా! అదేమీ లేకుండా మీరు ఇలాగే ఉంటానంటే నా నిర్ణయం నాకు ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు!” అంది కమల తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ.
చెల్లెలి మాటలు విని ఆలోచనలో పడిపోయాడు శివా.
అన్నగారిలో కదలిక మొదలైంది అని గ్రహించి మనసులోనే చిన్నగా నవ్వుకుంది కమల. చావుకు పెడితే లంఖణానికి వస్తుంది కదా అనుకుంది. కూతురి మాటలు విని సావిత్రి మిన్నకుండ లేక పోయింది.
“చూడు నాన్నా, మీరు ఇద్దరూ చదవనని మొండికేస్తే మీతోపాటు చెల్లి జీవితం కూడా పాడై పోతుందిరా.. మన కుటుంబానికి నీలకంఠం మావయ్య కుటుంబానికీ ఉన్న స్నేహబంధం తెగిపోతుంది. స్నేహానికి ప్రాణం పెట్టే మీ నాన్న ఇలా జరిగితే తట్టుకోలేరు. కమల శ్రీనూల పెళ్లి గూర్చి మేమంతా వాళ్ల చిన్నప్పటి నుండీ అనుకుంటున్నదే కదా.. ఆ సంగతి నీకూ తెలుసు. మీ మూలంగా ఆ మాట ఈ రోజు కాదనుకునేలా చేస్తోంది. శివా! నేను మళ్లీ మళ్లీ చెప్పను, ఇదే ఆఖరుసారి.. మీరిద్దరూ పట్నం వెళ్లి చదువు కొనసాగించకపోతే నీ జీవితం పాడవడమే కాదు, చెల్లి భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. అలా జరిగితే, నేనింక ప్రాణాలతో మిగలను. కౌన్సెలింగ్‌కు ఇంకా మూడు రోజులే వ్యవధి ఉందంట. ఈలోగా ఏదో ఒకటి తేల్చుకోండి” అంది సావిత్రి దుఃఖంతో జీరబోయిన కంఠంతో.
తల్లి మాటలు వినడంతోనే శివా మనసు అల్లకల్లోలం అయిపోయింది.
ఆరాటంగా తల్లి చేతులు పట్టుకుని “అంత మాట అనకమ్మా.. నేనిప్పుడే శ్రీనూ వాళ్ల ఇంటికి వెళ్తాను. ఎలాగైనా వాడిని ఒప్పిస్తాను. ఇద్దరం కలిసి పట్నం వెళ్తాము. వీలైతే రవిగాడిని కూడా మాతోపాటు తీసుకు వెళ్తాము!”అన్నాడు శివా స్థిరమైన కంఠంతో.
“వెళ్లండి నాన్నా.. అందరూ కలిసి హాయిగా చదువుకోండి. మా అందరి ఆశ కూడా అదే.. మీరు బాగా చదువుకొని వృద్ధి లోకి రావాలనే మా తపనంతా!” అంది సావిత్రి ఆనందం నిండిన గొంతుతో.
కమల శివా దగ్గరకు వచ్చి భుజంపై తలవాల్చి “సారీ అన్నయ్యా, మీరంతా చదువులు మానేస్తున్నారు అనే ఆరాటంతో నేను చాలా కటువుగా మాట్లాడి నీ మనసు నొప్పించాను!” అంది సంజాయిషీ ఇస్తున్నట్లుగా.
“సారీ ఎందుకమ్మా.. మీరందరూ ఆలోచించేది మా బాగు కోసమే కదా! ఇంక ఇవన్నీ వదలెయ్యి.. నేను శ్రీనూ వాళ్ల ఇంటికి వెళ్లి వచ్చేస్తాను” అంటూ చెప్పులు వేసుకొని బయటకు నడిచాడు శివా.
శివా వెళ్లాక సావిత్రి కమల తలమీద చేయివేసి “చిన్నపిల్లవి అయినా మేము ఎవరిమీ చేయలేని పని నువ్వు సాధించావురా.. ఇవ్వాళ్టితో నా బెంగ అంతా తీరిపోయింది” అంటూ కూతురి వైపు మురిపెంగా చూస్తూ బుగ్గలు పుణికి ముద్దుపెట్టుకుంది.
“ఇందులో నా గొప్పదనం ఏమీ లేదమ్మా.. నిన్న శ్రీను బావతో ఫిజిక్స్ చెప్పించుకుందామని వెళ్లాను. బావ ఇంట్లో లేడని రవి బావ వాళ్లింటికి వెళ్లాడని చెప్పింది జానకత్త. సరే లెమ్మని నేను వచ్చేస్తూంటే మావయ్య పిలిచారు వెనక్కి. నేను వెనక్కి వెళ్ళి ‘ఏమిటి మావయ్యా?’ అని అడిగాను. ‘కమలా నేనొక మాట అడుగుతాను నిజం చెప్తావా?’ అనడిగారు. ‘అదేంటి మావయ్యా అలా అడుగుతున్నారు.. మీతో ఎప్పుడైనా అబద్దం చెప్పానా?’ అన్నాను తెల్లబోయి చూస్తూ. ‘ఏం లేదు, శ్రీనూని నువ్వు నిజంగా ఇష్టపడితే వాడిని పెళ్లి చేసుకోనని చెప్పు..’ అంటున్న మావయ్య మాటలు విని తెల్లబోయి ‘ఏమిటి మావయ్యా?’ అన్నాను ఆశ్చర్యంగా. ‘నువ్వు విన్నది నిజమే, వాడిని పెళ్లి చేసుకోనని గట్టిగా చెప్పు.. ఒకరికోసం ఒకరని కట్టకట్టుకొని కూర్చున్న ముగ్గురి తిక్కా చక్కగా వదులుతుంది.. అందుకే అలా అంటున్నాను. నేను చేప్పినట్టు చేస్తావా?’ అని అడిగారు. నేను ‘సరే’ అన్నాను. మావయ్య చెప్పినట్లే అంతా జరిగింది. అన్నయ్య వెళ్లి వాళ్లిద్దరినీ ఒప్పిస్తాడు.. ఆ నమ్మకం నాకు ఉంది” అంది కమల చెప్పడం ముగించి.
అంతా విన్న సావిత్రి “అయితే ఇదంతా మావయ్య ప్రోత్సాహమా? ఏమైనా అన్నయ్య మనసు మారింది కదా.. ఇంకా అన్నీ వాడే చక్కదిద్దుకొని వస్తాడు. వాడి స్నేహితులు ఇద్దరినీ వాడే దారిలో పెడతాడు” అంది ఉత్సాహంగా.
***
రవి చదువు విషయంలో ఆందోళన చెందుతున్న వెంకట్రామయ్య ఒకసారి తన మిత్రుడు చలపతి దగ్గరకు వెళ్లి వస్తే మనసుకు కాస్త ఊరటగా ఉంటుందని అనిపించి అన్నపూర్ణమ్మకు చెప్పి వాళ్లింటి వైపు నడిచాడు.
అతడ్ని చూడడంతోనే “ఏరా వెంకా, దారి తప్పి వచ్చినట్లున్నావు మా ఇంటికి?” అంటూ హాస్యం ఆడుతూనే మిత్రుడ్ని సాదరంగా ఆహ్వానించి కుర్చీ చూపించాడు చలపతి.
“ఏం లేదురా, నా మనసేం బాగుండడం లేదు. రవి ఇంక చదవడట.. ఈనగాచీ నక్కలపాలు చేసినట్లు చేస్తున్నాడు.. మీవాడేం అంటున్నాడు?” అని అడిగాడు నిరాశగా.
“మా శివా సంగతా.. మీ రవి ఏ గంగలో దూకితే.. మా శివ, ఆ శ్రీనూ ఆ గంగలోనే దూకుతామని అంటున్నారు.. కానీ, మీ చెల్లి నూతిలో దూకుతాను.. గోతిలో దూకుతాను అని గొడవ చేసి శివాని విశాఖపట్నం వెళ్లేందుకు ఒప్పించింది. వాళ్లు రేపు లేదు ఎల్లుండి విశాఖపట్నం బయలుదేరుతున్నారు” అన్నాడు చలపతి.
“మంచి మాట చెప్పావురా.. మీ శివాని ఆసరా చేసుకొని రవిని కూడా పంపించే ప్రయత్నం చేయాలి అయితే!” అన్నాడు వెంకట్రామయ్య ఆశగా.
ఇంతలో శివ బయట నుండి వస్తూ కనిపించాడు వాళ్లకి.
“ఏం శివా, మొత్తం మీద మంచి నిర్ణయమే తీసుకున్నావు.. చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాలి గానీ, ఈ పల్లెటూళ్లో పడి మగ్గితే ఏమొస్తుంది? ఇంతకూ శ్రీను ఏమంటున్నాడు?” అనడిగాడు.
“వాడు కూడా డిటోనే మావయ్యా! వాడి ఇంట్లో కూడా మా ఇంట్లో లాగే పోరు పెట్టి ఒప్పించారు.. ఇప్పుడు అక్కడ నుండే వస్తున్నాను” అన్నాడు శివ.
“మంచిదిరా, మీ ఇద్దర్నీ చూశాకైనా వాడిలో వేడి పుడుతుందేమో చూద్దాము.. మీరు పట్నం వెళ్లిపోతే వాడిక్కడ ఒంటరి వాడయిపోతాడు. ఆ మాటే చెప్పి వాడ్ని ఎలాగోలా ఒప్పించి మీతో పాటు తీసుకుపోండిరా! అప్పుడే మీ స్నేహానికి ఒక అర్థమూ, పరమార్థమూ ఉంటుంది” అన్నాడు వెంకట్రామయ్య.
“ఎంత మాట మావయ్యా.. వాడు మా పక్కనుంటే మేము హీరోలం.. వాడు లేకపోతే మేము జీరోలమే కదా! శ్రీనూ, నేనూ ఇప్పుడే ఆ విషయం గూర్చి చర్చించుకున్నాము. ఎలాగైనా వాడ్ని ఒప్పించి మాతో పాటు తీసుకువెళ్లి పోతాము. వాడి గురించి మీరు ఏమీ బెంగ పడకండి. రేపు జరిగే కౌన్సిలింగ్‌కి మేము ముగ్గురం కలిసి ఎటెండ్ అవుతాము” అన్నాడు శివ నిబ్బరంగా.
“థేంక్స్ శివా, నా బెంగంతా వాడి గూర్చే.. మీలాంటి మిత్రులను కలిగి ఉండడం వాడి అదృష్టం! మీ నాన్నతో నా స్నేహం యాభై ఏళ్ల నాటిది. దాన్ని మీరు ఇలా కొనసాగించడం చాలా గొప్పగా ఉంది నాకు.. వెళ్లొస్తాను చలపతీ! శివా, ఇక నీదే భారం!” అంటూ వెంకట్రామయ్య శివ భుజం తట్టి సంతృప్తి నిండిన మనసుతో అక్కడి నుండి బయలుదేరాడు.
***
శ్రీనూ, శివా కలిసి రవి దగ్గరకు వచ్చారు ఆ సాయంత్రం.
వాళ్లను చూడడంతోనే “రండి రండి.. నేనే వద్దామని అనుకుంటున్నాను. ఇంతలో మీరే వచ్చారు” అన్నాడు రవి ఉత్సాహంగా.
“మేమిద్దరం చెఱువు కట్టకి వెళ్లాము.. నువ్వు అక్కడ లేకపోవడంతో ఇలా వచ్చాము” అన్నాడు శ్రీను.
“నేను బయలుదేరానురా.. అమ్మ గారెలు చేస్తున్నాను, తిని వెళ్లమంటే ఆగాను” అన్నాడు రవి నవ్వుతూ.
“నువ్వు ఆగడం మంచిదే అయింది లేరా.. నీతో పాటు మాకు కూడా ఈపూట గారెల విందు అన్న మాట!” అన్నాడు శివ.
అన్నపూర్ణమ్మ నవ్వుతూ పళ్లెం నిండుగా గారెలు వేసి తెచ్చి వాళ్ల ముందు పెట్టి “మీరిక్కడకు రాకపోయినా రవి మీ వాటా మీకు తెస్తాడు గదా, అక్కడికి.. ఈ రోజు వాడికి మోత బరువు తగ్గిందంతే! శుభ్రంగా తిని వెళ్లండి” అంటూ మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది.
ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ తినడం ముగించి అన్నపూర్ణమ్మతో చెప్పి చెఱువు గట్టుకు బయలుదేరారు.
ముగ్గురూ చెరువు కట్టకు చేరుకున్నాక.. నిత్యం తాము కూర్చునే చోటికి వెళ్ళి కూర్చున్నారు.
“అరే రవీ, రేపు నేను విశాఖ బయలుదేరుతున్నానురా కౌన్సిలింగ్‌కి!” అన్నాడు శివ.
“అవును రవీ, నేను కూడా వాడితో పాటు బయలుదేరుతున్నాను.. ఇంట్లో చాలా గొడవలై పోయాయి. అందుకే వెళ్తున్నాను” అన్నాడు శ్రీను.
వాళ్లిద్దరూ చెప్పింది వినడంతోనే ఒక్క క్షణం మాట రానట్లుగా చూశాడు రవి వారి వంక. చివరికి గొంతు పెగుల్చుకొని “అవునా.. మీరిద్దరూ వెళ్లిపోతే నేనిక్కడ పూర్తిగా ఒంటరినై పోతానురా.. అలా అని మీరు వెళ్ళకూడదు అని కాదు!” అన్నాడు దిగులుగా.
“నువ్వు మాత్రం ఎందుకురా ఇక్కడ ఉండడం? నీకు మాకంటే మంచి రేంకు వచ్చింది.. ఏ బ్రాంచిలో కావాలంటే ఆ బ్రాంచిలో సీటు వస్తుంది. హాయిగా ముగ్గురం ఎప్పటిలాగే ఒక్క చోటే ఉండి కలిసి చదువుకోవచ్చు!” అన్నాడు శివ ఉత్సాహంగా.
“ఇంతకు ముందు చెప్పాను కాదురా.. నేను రానురా! ఈ చదువులకూ, నాకూ సరిపడదు. నేనిక్కడే ఉండి మా నాన్నకు వ్యవసాయంలో సాయం చేస్తాను” అన్నాడు రవి.
“అరే రవీ, నువ్వు సాయం చేసినా చేయకపోయినా ఇక్కడ పనులేమీ ఆగిపోవురా.. అక్కడికి వస్తే చదువుతో పాటు మనకి మంచి ఎక్స్పోజర్ ఉంటుందిరా! నువ్వేమీ అనుకోనంటే నేను నీకో విషయం ఫ్రాంక్‌గా చెప్తానురా.. మొన్న ఆ పత్రికల వాళ్లు నీ కవితను సాధారణ ప్రచురణకి కూడా తీసుకోలేదని ఎంతో బాధపడ్డావు.. మేమిద్దరం కూడా అలాగే ఫీల్ అయ్యాము. ఆ తరువాత బహుమతి వచ్చిన కవితలను నేను చదివానురా! శివ కూడా చదివాడు. చాలా బాగున్నాయి అవి. నీ బాధలో నువ్వుండి ఆ పత్రిక తెచ్చినా నువ్వు చదవలేదు. మేమూ నిన్ను బలవంత పెట్టలేదు. నిజంగా బహుమతి వచ్చిన కవితలు చాలా చాలా బాగున్నాయి. భావం, భాషా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.
రవీ, ఇంతకాలం మనం ఈ ఊరూ, ఈ పరిసరాలు.. ఇదే మన ప్రపంచం అనుకున్నాము. నీ కవితల్లో కూడా అవే పొందుపరిచావు. మనకున్న అవగాహనా, అనుభవం అంతే! అందుకే వాళ్లు రాసిన కవితల ముందు నీ కవితలు తేలిపోయాయి. అదే నీవు మాతో పాటు విశాఖపట్నం వచ్చావనుకో.. నీ ప్రపంచం, నీ పరిధీ చాలా విస్తృతమవుతుంది. అక్కడ మంచి మంచి లైబ్రరీలు ఉన్నాయి. ఆ సాహిత్యం చదవడం వలన నీ భాషా పరిజ్ఞానాన్ని బాగా పెంపొందించుకునే అవకాశం ఉంది. దాని వలన నీ రచనలు మరింత శోభాయమానంగా ఉంటాయి. నీ కలానికి తిరుగుండదు ఇంక ఆలోచించు!” అన్నాడు శ్రీను.
అతడి మాటల్లోని యథార్థం గమనించి రవి ఆలోచనలో పడ్డాడు.. ఇంతకాలం బావిలో కప్పలా తానెంత తప్పుగా ఆలోచిస్తూ వచ్చాడో బోధపడింది అతడికి.
స్నేహితుడు ఆలోచనలో పడడం చూసి “ఒరే రవీ, నీ అంతవాడు లేడని అంటూ ఒకవిధంగా మేమే నిన్ను తప్పు దోవ పట్టించామురా! మాకున్న పరిజ్ఞానం చాలా స్వల్పం. అందుకే నీ కవితలు బాగున్నాయని, పత్రికలకు పంపమని ప్రోత్సహించి నిన్నింత బాధకు గురి చేసింది మేమే కదా! నువ్విక్కడ ఈ బాధల్లో ఒంటరిగా ఉండిపోతే మేమక్కడ స్థిమితంగా ఎలా చదువుకో గలుగుతామురా! ప్లీజ్, రవీ నువ్వు కూడా మాతో పాటు వచ్చేయరా అక్కడికి!” అన్నాడు శివ, రవి రెండు చేతులూ పట్టుకొని.
వారిద్దరి మాటలూ వినడంతోనే రవిలో కదలిక మొదలైంది. “సరేలేరా, మీరు నా మంచి కోసమే కదా చెప్తున్నారు.. నేను కూడా మీతో పాటు అక్కడికి వచ్చేస్తాను. ఈ మాట వింటే మా నాన్న కూడా చాలా సంతోషిస్తాడు” అన్నాడు రవి.
అతడి నిర్ణయం విని శివా, శ్రీనూలు ఎంతో సంతోషించారు. రాబోయే కాలం గూర్చి ఉత్సాహంగా ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు.
ఆరోజే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిపోయినట్లుగా కలల్లో తేలిపోయారు.
ఇంటికి వచ్చాక “నాన్నా, నేను కూడా శివా, శ్రీనూలతో పాటు విశాఖ వెళ్తున్నాను” అని చెప్పాడు రవి.
కొడుకు నిర్ణయం విని వెంకట్రామయ్య అన్నపూర్ణమ్మలు ఆనంద భరితులయ్యారు.
రవి వెంట వచ్చిన శివా, శ్రీనూల వైపు కృతజ్ఞతగా చూశాడు వెంకట్రామయ్య.
ముగ్గురి ఇళ్లల్లోనూ ప్రయాణ సన్నాహాలు మొదలయ్యాయి.
మిత్రులు ముగ్గురూ విశాఖ చేరుకున్నారు. రవి సివిల్ ఇంజనీరింగ్‌లో జాయిన్ అయ్యాడు. శివా, శ్రీనూ మెకానికల్‌లో జాయిన్ అయ్యారు.
“ఒరే రవీ, నువ్వు కూడా మాతో పాటు మెకానికల్ తీసుకుంటే బాగుండేదిరా.. చక్కగా ముగ్గురం కలిసి కంబైన్డ్ స్టడీస్ చేసేవాళ్లం!” అన్నాడు శ్రీను.
“నాకు సివిల్ ఇంజనీరింగే ఇష్టంరా.. పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టవచ్చు. అయినా, బ్రాంచీలు వేరైనంత మాత్రాన మన స్నేహానికి అడ్డేముందిరా?” అంటూ నవ్వాడు రవి.
“నిజమేరా.. నీకు సివిల్ ఇంజనీరింగ్ మీద ఇంత ఆసక్తి ఉండి దాన్ని చంపుకొని అక్కడే ఉండిపోవాలని ఎలా అనుకున్నావురా?” అని అడిగాడు శ్రీను సందేహంగా చూస్తూ.
“ఒరే బాబూ, ఎందుకు ఏమిటి అని అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండిరా.. ఏదో అవగాహనా లోపం వలన అలా చేశాను. మీ వలన తిరిగి నా తప్పు దిద్దుకున్నాను!” అంటూ నవ్వాడు రవి.
“భలే వాడివిరా బాబూ!” అంటూ రవి భుజం చరిచాడు శివా.
ఎక్కడికి వెళ్లినా ముగ్గురూ కలిసే వెళ్లేవారు. విడని జంటలా తిరిగే ఆ ముగ్గురినీ ‘త్రిమూర్తులు’ అని నామకరణం చేసి ముద్దుగా పిలుచుకోసాగారు కేంపస్‌లో.
రవి విశాఖపట్నం వచ్చాక చదువుతో పాటు తన రచనా వ్యాసంగాన్ని కూడా బాగా మెరుగు పరుచుకున్నాడు. ఇప్పుడు అతడు రాసే కథలూ, కవితలూ వివిధ పత్రికల్లో ప్రచురించబడుతున్నాయి.
రచయితగా రవికి కేంపస్ లోనే కాదు, బయట కూడా మంచి గుర్తింపు వచ్చింది. అడపా దడపా లైబ్రరీల్లో జరిగే సాహితీ సమావేశాల్లో అతడు కూడా పాల్గొంటున్నాడు.
మిత్రులు ముగ్గురూ ఫైనలియర్ లోకి వచ్చారు.. శెలవులు వచ్చినప్పుడు ముగ్గురూ కలిసి స్వంత ఊరు వచ్చి సరదాగా గడిపి వెళ్లసాగారు.
(ఇంకా ఉంది)
రచయిత్రి పెబ్బిలి హైమావతి చిన్నతనం నుంచే రచనల పట్ల మక్కువ పెంచుకున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే ఆమె తన మొదటి కథను రాసినప్పటికీ, అది అముద్రితంగానే ఉండిపోయింది. ఆమెకు తన పెద్ద అన్నయ్యే ప్రధాన స్ఫూర్తి కాగా, వారి ఇంట్లోని స్వంత లైబ్రరీలోని మంచి మంచి పుస్తకాలు చదవడం వల్లే ఆమె రచయిత్రిగా మారారు. తొమ్మిదో తరగతిలోనే వివాహం జరగడం, ఇంటి పెద్ద కోడలిగా బాధ్యతలు నిర్వహించడం, ఆ తర్వాత పిల్లల చదువుల వల్ల ఆమె చాలా కాలం పాటు రాయలేకపోయారు. అయితే, తన ఇద్దరు పిల్లలు మెడిసిన్ చదువుతున్న సమయంలో ఆమె మళ్లీ కలం పట్టారు. అలా ఆమె 48వ ఏట, 2001 జులైలో ‘ఆంధ్రభూమి’ మంత్లీ మ్యాగజైన్లో ప్రచురితమైన ‘ఎందాక ఈ పరుగు?’ అనే కథ ఆమె మొదటి ముద్రిత రచనగా నిలిచింది. తెలుగు భాష మృతభాషగా మారిపోకుండా కాపాడుకోవాలనే తపనతో ఆమె నిరంతరం శ్రమిస్తున్నారు.
పెబ్బిలి హైమావతి గారు ఇప్పటివరకు 33 నవలలు, 125 కథలు, 25 కవితలు రాశారు. ప్రముఖ సాహిత్యవేత్త కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైన ‘హైమావతి కథలు’ ఆమె మొదటి పుస్తకం కాగా, ‘కథా మంజీరాలు’, ‘జీవితాన్ని ప్రేమించు కథలు’ అనే మరో రెండు కథా సంపుటాలను కూడా ఆమె వెలువరించారు. కథా సుధ, మాతృదేవోభవ, పూలబాటగా, అమృత వాహిని, సృష్టిలో తీయనిది, విజేత, అవును పెళ్లంటే నూరేళ్ల పంట, నాతి చరామి, అన్నపూర్ణ, స్వాతి వాన కోసం, స్వయం సిద్ధ, మనసున మల్లెల మాలలూగెనే, అమృత కలశం మరియు త్రివేణి (3 నవలల సంపుటి) వంటి ఎన్నో నవలలను ఆమె ప్రచురించారు. ఆమె సాహిత్య సేవకు గుర్తింపుగా బలివాడ కాంతారావు పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాతృ వందనం పురస్కారం, రామ్కీ ఎన్‌పవరింగ్ ఉమెన్స్ అవార్డు, ‘జీవితాన్ని ప్రేమించు’ కథల సంపుటికి ఎం జీ రంగా ఫౌండేషన్ పురస్కారంతో పాటు మరెన్నో అవార్డులు ఆమెను వరించాయి. ఆమె రచనలపై పరిశోధనలు చేసి నాగార్జున, ఆంధ్రా విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు పరిశోధకులు పీహెచ్డీ, ఎంఫిల్ పట్టాలు అందుకోవడం విశేషం.
