తను పల్లవి. తనంటే నీరద్‍కి ఇష్టం. అతనికొక్కడికే కాదు, పూణే లోని సెయింట్ విన్సెంట్స్ హై సెకండరీ స్కూల్‍లో తొమ్మిదో తరగతిలోని అబ్బాయిలందరికీ ఇష్టమే. అందులో ఆశ్చర్యమేమీ లేదు. అందంగా ఉంటుంది, బాగా చదువుతుంది కాబట్టి తనంటే ఇష్టం ఉండనివారు ఉండరు. నీరద్ ఆమెను దూరం నుంచే అభిమానిస్తాడు. అమ్మాయిలతో అంత సులువుగా మాట్లాడలేడు.
బడిలో ఏటా జరిగే పాటల పోటీ కోసం మూడు నెలలుగా సాధన చేస్తున్నాడు. ‘ఈ పోటీలలో నేను గెలిస్తే, నాకు పల్లవి స్నేహం దొరుకుతుంది’ అని తనకు తాను తరచూ చెప్పుకున్నాడు.
***
పాటల పోటీ మొదలయింది. నీరద్ ఆశించినట్లే, పల్లవి ముందు వరుసలో కూర్చుంది. ఇటీవల విడుదలయిన ఓ హిందీ సినిమాలోని ‘తన్హా దిల్’ (ఒంటరి హృదయం) అనే పాటని పాడాడు. పాట తర్వాత వినిపించిన చప్పట్ల ద్వారా అతనికి అర్థమైంది, తాను బాగా పాడానని. పల్లవి కళ్ళలో కనిపించిన మెచ్చుకోలు అతనికి మరింత ఆనందాన్నిచ్చింది.
మరికొంత మంది పిల్లలు వచ్చి పాడి వెళ్ళారు. కానీ వాళ్ళెవరూ నీరద్ స్థాయికి రాలేకపోయారు. తదుపరి పదో తరగతి చదివే సుధీర్ మిశ్రా వంతు వచ్చింది. అతనో ఔత్సాహికుడు. నిజానికి అతనికి గొప్పగా పాడ్డం రాదు. కానీ పోటీలలో పాల్గొనడం ముఖ్యం అని పాడడానికి వచ్చాడు. అతను పాడడానికి ప్రయత్నిస్తుంటే – నీరద్, అతని స్నేహితులు – బూ, బూ – అంటే ఒకటే హేళన చేశారు. ఎంత ఎగతాళి చేసినా, ఎలాగొలా పాట పూర్తి చేసి వేదిక దిగి వెళ్ళిపోయాడు సుధీర్.
అందరూ ఊహించినట్లే నీరద్‍కి ప్రథమ బహుమతి వచ్చింది. ట్రోఫీ తీసుకుని పల్లవి కోసం ప్రేక్షకులలో వెతికాడు. ఆమె వాళ్ళల్లో లేదు. నీరద్ ఆడిటోరియం బయటకు వచ్చి చూస్తే, పల్లవి సుధీర్ పక్కన కూర్చుని అతన్ని ఓదారుస్తూ కనిపించింది.
నీరద్‍ని చూసి, “సుధీర్‍ని అంతలా ఏడిపించాల్సిన అవసరం ఏముంది, ఈడియట్?” అంది.
నీరద్ మౌనంగా ఉండిపోయాడు.
“సుధీర్ గొప్ప గాయకుడు కాకపోవచ్చు, శ్రావ్యంగా పాడలేకపోవచ్చు. అంత మాత్రాన హేళన చేసే హక్కు నీకెవరిచ్చారు? తనకి ప్రతిభ లేని రంగంలో కనీసం పాల్గొనడానికైనా అతను ప్రయత్నించాడు. నువ్వలా ఎప్పుడైనా చేశావా? తనెంత బాధపడి ఉంటాడో ఆలోచించావా?” అంది పల్లవి.
తన చేతిని సుధీర్ భుజం మీద వేసి ఓదారుస్తూ ఉండిపోయింది పల్లవి.
“సుధీర్, నాది తప్పే. నన్ను క్షమించు. నా క్షమాపణలో నిజాయితీ ఉన్నట్టు అనిపించదు, కానీ నేను నిజంగా మన్నింపు కోరుతున్నాను” అన్నాడు నీరద్.
సుధీర్ తలాడించాడు, కానీ కళ్ళ వెంట నీళ్ళు కారుతునే ఉన్నాయి.
కాసేపాగి, “పల్లవీ, ఇంటికి వెళ్ళడం లేదా?” అడిగాడు నీరద్.
కొంతసేపు మాట్లాడలేదు పల్లవి.
“మా ఇంటి నుంచి సుధీర్ వాళ్ళ ఇల్లు దగ్గరే, వాళ్ళ నాన్నగారు వచ్చాకా, ఆయనతో కలిసి వెళ్తాను” అంది.
నీరద్ నీరసంగా ఇంటివైపు నడవసాగాడు. తన గెల్చిన ట్రోఫీ ఇప్పుడు ఓ చవకరకం లోహపు ముక్కలా అనిపిస్తోంది.
ఆంగ్ల మూలం: వికాస్ ప్రకాష్ జోషీ
అనువాదం: కొల్లూరి సోమ శంకర్
~
మూల కథ, మూల కథా సంకలనం గురించి:
‘Defeat’ అనే ఆంగ్ల కథ ‘Inspired by Tagore’ అనే సంకలనం లోనిది. విశ్వకవి రవీంద్రుని 150వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల నుంచి ఎన్నుకున్న రచనల సంకలనం ఇది. ఇందులో పాల్గొన్న వారిని రవీంద్రుని రచనల నుండి ప్రేరణ పొంది ఒక కథ లేదా కవిత లేదా వ్యాసం ఆంగ్లంలో రాయమని అడిగారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడిన ఈ పోటీకి ప్రపంచవ్యాప్తంగా గొప్ప స్పందన లభించింది. 15 ఏళ్ళ లోపు, 15 ఏళ్ళ పైబడిన వయసు విభాగాలలో నిర్వహించిన ఈ పోటీలో – భారత్, బంగ్లాదేశ్‌ల నుంచే కాకుండా – బ్రెజిల్ నుంచి చైనా వరకు, జమైనా నుంచి శ్రీలంక వరకు, 37 దేశాల నుండి 1400 ఎంట్రీలు రాగా, వాటిలో తుదకు కేవలం 300 ఎంట్రీలు గెలుపొందాయి. గెలుపొందిన రచనలు – కథలు, కవితలు, వ్యాసాలు – ‘Inspired by Tagore’ అనే పేరిట అందమైన సంకలనంగా ముద్రించబడ్దాయి. ఈ పోటీని సంపద్ అనే స్వచ్ఛంద సంస్థ, బ్రిటీష్ కౌన్సిల్, యునైటెడ్ కింగ్‌డం వారి సహకారంతో నిర్వహించింది. ఈ ‘Defeat’ అనే ఆంగ్ల కథ రవీంద్రుని కథ ‘Victory’ నుంచి ప్రేరణ పొందింది.
~
మూల రచయిత గురించి:
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.