[సెప్టెంబరు 10 శ్రీ విశ్వనాథ వారి జయంతి పురస్కరించుకుని, వారి శైలిలో వ్రాసిన ‘గిజిగాని గూడు!’ అనే రచనని అందిస్తున్నారు సముద్రాల హరికృష్ణ.]
విశ్వమను విద్యాలయమున, భగవంతుడు అను పెద్ధ మేష్టారి వద్ద నేర్చినదందువా?!
మంచి నాయనవే!
వాడేమి బెత్తము చేతబట్టి ఆకులెంచుట, గూళ్ళల్లుట, చేయించుననియా?!
చేయించును, చేయించడు.
చేయి పట్టి, పాఠము చెప్పి బోధించకున్నను నీవన్నట్లు వాడొక ఉపాధ్యాయుడే.
దక్షిణామూర్తి వాలక మనుకొనుము.
అనుకొనుట యేమి, దక్షిణామూర్తియే!
ఆ మూర్తి చేయు మౌనవ్యాఖ్య లోని భాగమే,దాని పర్యవసానమే ఈ చరాచర సృష్టి లోని సర్వమునకు ప్రాప్తించిన తెలివి.
చీమలను తీసికొనుము.
చక్కెర పలుకో, బెల్లపుముక్కయో ఉన్న చోటు నెట్లు పసిగట్టునో; ఎట్లు బారులు తీరి, మైసూరు మహారాజా వారి సైనికులు వలె ఒక క్రమ పద్ధతిలో సాగి గమ్యమును చేరునో?!
మధ్యను నీవొక పుల్లనో, వ్రేలినో పెట్టి చూడుము,అది యొడుపుగ తప్పించుకొని మరల దాని సహచరుల పంక్తిలో చేరి పయనము సాగించును.
దాని పాలిటికి అదియే సుదీర్ఘ ప్రయాణము!
పాపము, అల్ప ప్రాణము!
అట్టిదే, ఈ గిజిగాడు గూడు కట్టుకొను చాతుర్యము.
ఏమి అల్లికయో, ఎంతటి కౌశలమో ఆ అల్లికలో!
తగిన దళముల నేరుట, ఏరినవానిని అనువుగ చీల్చుట, చీల్చిన వానితో అడ్డములు నిలువులు ఐమూలలుగ బిగించుట – అహో ఏ ఉపాధ్యాయుడు నేర్పకనె నేర్పి పంపెనో?!
పరమాశ్చర్యము!
వీని కున్న ఇంగితము, సహవాస సౌమనస్యము, ఉన్నది పంచుకొనుట యను సల్లక్షణమూ మానవునిలో చూతుమా?!
సకృత్తుగ యనియే యనవలయును.
ఇక ఆ ఆఫ్రికా ఖండములో అంతస్తు లంతస్తులుగ కట్టునట గూళ్ళను, ఈ గృహనిర్మాణ నిపుణములైన పక్షులు!
అందులో ఒక కుటుంబము కాదట నివసించునది, ఒక సమూహమే!
అట్లైన మానవుల కరుదైన బంధుప్రీతితో పోల్చిన, కించిదధిక మనియే యనవలెను ఈ విహంగ జాతికి!
ఇది యొక్కటి యని యేమి?
ఈ విశ్వనిర్మాణమే స్థూలదృష్టికి యొక గిజిగాని గూడు వలె తోచును.
అసంఖ్యాకమైన జీవరాశులు, సృష్టివిశేషములు.
ప్రాణము లేని వానితో కలిపి వెరసి చరాచరము లనుట.
సాధువులు కొన్ని, విషపూరితములు కొన్ని.
సౌమ్యముల చెంగట క్రౌర్యములు.
పరోపకారమే లక్ష్యమను నదీనదములు,తరురాజములు.
శుష్క విస్తార సైకతభర మరుభూములు.
భ్రమల గొల్పు మరుమరీచికలు!
భయంకరవిషములు, వానికి విరుగుళ్ళు!
హిమానీపాతములిటు, అగ్నిపర్వతములటు!
కోటి వర్ణములు, వేనవేల ఆకృతుల పత్రములు, పుష్పములు, ఫలములు!
నోటి కొదగనివి కొన్ని! వాసన లేనివి కొన్ని!
ఒకటియ రెండ, ఎన్నని చెప్పగలము ఈ అనంత విశ్వమున గిజిగాని గూటివలె అల్లబడిన ఘన మర్మముల!
ఇది గిజిగాని గూడేమొ కాని తన్నిర్మాణ చాతురి విషయమై,ఇందింతయు గజిబిజి మాత్రము కనరాదు సూక్ష్మేక్షికకు!
ఇందేదియు యథాలాపముగ చేసినది కాదు.
ఇందేదియు యథేచ్ఛగా వ్యవహరించునది కాదు.
ఆ శాస్త్రవేత్త యనినట్లు, ‘God never plays Dice!’ భగవంతుని సృష్టిలో నెట్టి అనియతియు, అనిశ్చితియు లేవు.
పైకట్లున్నది యనిపించినను, అంతర్నిహితమైన ఒక శ్రుతి, ఒక లయ, ఒక పరమ ప్రామాణికమైన అమరికతో సాగునదే ఈ జగచ్చక్రము!
ఎన్ని రకముల జీవరాశులు?!
వేటికగు ఆహారము వాటికి!
దీని కిది ఆహారము,దానికి ఇంకొకటి-సర్వము ఒక సునిశ్చితమైన చట్రమున ఏర్పరచినట్లనిపించును.
ఆ అంతంత గ్రహములట్లు ఆకాశమున, ఆ రోదసిలో నిలుచుటేమి?
కక్ష్య దాటి ఒకటి నొకటి యొరుసుకొనవే?!
ఏ శక్తి వానిని సౌరకుటుంబమున అట్లు తిప్పుచున్నవి?
నవీనులనెడి వారు చెప్పెడి గురుత్వాకర్షణ యనిననూ, ఆ శక్తికి కారణమేదియో, యెవ్వరో యుండవలెను కదా?!
అసలా మహచ్ఛత్రము ఆకాశమటుల నిల్చుట ఏమి, ఈ భూమండలముపై?!
ఆ కడలి నెవరు నియంత్రించుచున్నది వేలావలయితమై యుండి పోవుటను?!
ఆ ఉషోదయ సాయం సాంధ్యరాగము లేమి, ఆ దివారాత్రముల క్రమమేమి, ఆ ఋతుచక్రమేమి యుగముల పర్యంతమై, ఒకే వరుసను వచ్చి పోవునట్లు?!
ఎవ్వరా మహోపాధ్యాయుడు ఇవి అన్నియు వీటికి బోధించి చేయించుచున్నది?!
మరల ఆ దక్షిణామూర్తి యే, ఆ మౌన వ్యాఖ్యయే!
మూర్తి యని సాకారముగ చెప్పుటకిష్టము లేని యెడల ‘శక్తి’ యనుము,అభ్యంతరమేమి?!
ఆ దైవము ఏ ఏ జీవరాశికి ఏది ఎంతవరకును వలయునో యంతంత తెలివి వాటి బుర్రలలో నిక్షిప్తము చేసియే పంపునని తోచును.
ఆహారము సంపాదించుకొనుటకు, బతుకు నడుపుటకు, ప్రాణ రక్షణకు, ప్రాణ పోషణకు తగిన శక్తులు ఏ ప్రమాణములో అవసరమో అవి సహజాతములై వచ్చును కాబోలు, ఏ జాతికి దానికి!
వాడుకొనుట యవ్వాని మీద ఆధారితము.
ప్రాయశః అన్ని జీవరాశులును తమ పరిధి నెరిగి ప్రవర్తించునవే యని చెప్పవలె.
మేధావి యని విర్రవీగు ఈ నరుడొక్కడే దానికి మినహాయింపు.
అనగా ఎవరో ఆ మినహాయింపు పైనుండి ఇచ్చినది కాదు, వీని బుద్ధి వికృతి వలన అలవడు చెడుగునకు అది యొక గౌరవప్రదమైన వ్యవహారమనవలె.
కుండ బద్దలు కొట్టి చెప్పవలెనన్న,వీని వివేకహీనత,వీని ఇంద్రియ లోలతలే కారణములీ నియతి తప్పుటకు.
ఆహార విహారాదు లన్నిట మితి మీరియే నడచుచున్నా డనవలె.
కాల మదియొక చమత్కారము.
ఏది ఎచ్చట ఎప్పుడు బహిర్గతము కావలెనో, యది అటులనే జరుగును.
వీని మార్గభ్రష్టత్వ ఫలమును వీడును అనుభవించక తప్పదు.
నేడు కాకున్న రేపు.
రేపు కానిచో, ఆ మరుదినము!
అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్!
సరిసరి, ఒకానొకని పద్ధతి యిటులనే ఉండును.
వాడొక గోదావరి వంటి ఉధృతి గలవాడు.
ఆ ప్రవాహవేగమున ఎన్నియో కొట్టుకొని రావచ్చును.
అట్లని ఆ నదీమతల్లి స్వాదునీరమును కాదందుమా?!
ఇదియునట్లే, కానిండు, భగవదేచ్ఛ!
పక్షి యేమి, మనిషి యేమి, మంచి యేమి చెడుగేమి–
అంతయు వాడాడించు నాటకము లోని అంకములే!
స్వస్తి!
