Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞానకాంతుల దీపావళి

[దీపావళి సందర్భంగా ‘జ్ఞానకాంతుల దీపావళి’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]

పురాణాలు, ఇతిహాసాలలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉన్నది. దీపావళి అంటే దీపాల వరుస చీకటిని తొలగించి, వెలుగులు నింపేదే దీపం. ఒక దీపం వెలిగితే దాని కాంతి నలుదిక్కులకు విస్తరిస్తుంది. అలా కాక అనేక వేల, లక్షల, కోట్ల దీపాలు ఎంతటి కాంతినిస్తాయో కదా! అజ్ఞానం పై జ్ఞానం, అధర్మంపై ధర్మం, అన్యాయంపై న్యాయం గెలుపొందటమే దీపావళి గొప్పతనం. అందుకే దీపాన్ని వెలిగిస్తూ

శుభం కరోతి కళ్యాణం
ఆరోగ్యం ధన సంపదః!
శత్రుబుద్ధి వినాశాయ
దీపజ్యోతి ర్నమోస్తుతే!!

దీప జ్యోతి పరబ్రహ్మ
దీపజ్యోతి జనార్ధనః!
దీపో హరతు మేపాపం
దీపజ్యోతి ర్నమోస్తుతే!!

అని దేవుడి ముందు దీపాన్ని వెలిగిస్తూ నమస్కారాన్ని చేస్తారు.

రాత్రి చీకట్లను పోగొడుతూ నక్షత్రాలు ప్రవేశిస్తాయి. నెల అంతా చంద్రుని వెన్నెలల వెలుగులుంటాయి. కానీ అమావాస్య నాడు మాత్రం చుక్కల వెలుగులే దారి చూపుతాయి. పూర్వం నక్షత్రాల గమనాన్నిబట్టి కాలనిర్ణయం, మార్గ నిర్దేశం చేసేవారు. అంత గొప్ప కాంతితో వెలుగుతాయి తారకలు. ఇలమీద వెలుగులీను తారకలే దీపాలు. ఆశ్వయుజ అమావాస్యనాడు ఈ దీపాలను వెలిగించి లోకులు అందరూ దీపావళి పండుగను జరుపుకుంటారు.

రామాయణంలో శ్రీరాముడు రావణసంహారం చేసి 14 సంవత్సరాల తరువాత అనంతరం అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అయోధ్యానగర ప్రజలందరూ ఆయనను స్వాగతించడానికి దీపాలు వెలిగించినట్లు కథనం.

భాగవతంలో హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించి సముద్రంలో దాచినప్పుడు ఆ తల్లిని రక్షించడానికి శ్రీహరి వరాహావతారమును ధరిస్తాడు. లోకాల ఉపద్రవాన్ని తప్పించి లోకులను రక్షించటానికి భూదేవిని రక్షిస్తాడు. అప్పుడు భూదేవికి వరాహ స్వామికి పుట్టిన పుత్రుడే నరకాసురుడు. అతడు నిషిద్ధకాలమైన సంధ్యాసమయంలో కలిగిన కుమారుడు కనుక ఇతనికి రాక్షస లక్షణాలు వచ్చాయని భూదేవికి చెబుతాడు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణచేయు శ్రీహరి చేతనే తన కుమారునికి మరణమున్నదేమోనని భూదేవి భయపడుతుంది. తన పుత్రుని రక్షించమని శ్రీహరిని కోరింది. అప్పుడు మహా విష్ణువు తల్లి చేతులలో తప్ప మరెవరి చేతులలోనూ అతనికి మరణము లేదనే వరాన్ని ప్రసాదిస్తాడు. ఏ తల్లి అయినా తనకు తానుగా కుమారుడిని చంపుకోదు కదా! అని భావించిన భూదేవి ఎంతగానో ఆనందాన్ని పొందుతుంది.

నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిష్యపురాన్ని పాలిస్తున్నాడు. నరకాసురుడు కొంతకాలమయిన తర్వాత అతనిలో రాక్షస ప్రవృత్తి ప్రకోపించింది. దానితో ఋషులు చేసే యజ్ఞాలను ధ్వంసం చేయటమే కాక దేవతలను, ప్రజలను, స్త్రీలను బాధించడం ప్రారంభించాడు. అనేక రాజ్యాల మీద దండయాత్రలు చేసి దాదాపు 16 వేలమంది రాకుమార్తెలను బంధించాడు. అతని దురాగతాలకువిసిగిన దేవతలందరూ మహావిష్ణువుని ప్రార్థించగా ద్వాపరయుగంలో తాను శ్రీకృష్ణుడిగా అవతరించి నరకాసురుని సంహారం చేయగలవాడనని వారికి వరం ఇస్తాడు.

ద్వాపరయుగంలో శ్రీహరి శ్రీకృష్ణుడిగా, భూదేవి సత్యభామగా అవతరిస్తారు. దేవతలు, ఋషులు, సాధు, సత్పురుషులు వచ్చి నరకుని బారినుంచి రక్షింపుమని శ్రీకృష్ణుని ప్రార్థింపగా నరకాసుర సంహారంచేసి దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేస్తానని చెబుతాడు.

శ్రీకృష్ణుడు నరకాసుర సంహారానికి బయలుదేరుతాడు. అప్పుడు సత్యభామ తాను కూడా యుద్ధానికి వస్తానని బయలుదేరుతుంది. రణరంగం స్త్రీలకు తగదని ఎవరు ఎంతగా వారించిన ఆమె తన పట్టు వదలలేదు. శ్రీకృష్ణుని వెంట ఆమె కూడా యుద్ధానికి బయలుదేరింది. అందునా నరకాసురునికి తల్లి చేతిలో తప్ప అన్యుల చేత మరణం లేదు కదా! ఆ సంగతి తెలిసిన శ్రీకృష్ణుడు ఆమెను సమరానికి తీసుకు వెళ్లడానికి సిద్ధపడతాడు. అందుకు కారణం సత్యభామ భూదేవి అంశయే కదా. అందుకే పరమాత్మ నరకాసురునిపై యుధ్ధరంగానికి వెళుతూ ఆమెను కూడా తనతో తీసుకువెళతాడు.

శ్రీకృష్ణునికి, నరకాసురునికి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో నరకాసురుని బాణంతగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ నరకునితో భయంకరమైన యుద్ధంచేసి అతనిని నిలువరిస్తుంది. ఆ యుద్ధంలో సత్యభామ అలసిపోతుండగా మూర్ఛనుంచి తేరిన శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆమెచే నరకాసురుని సంహరింప చేస్తాడు. ఆ నరకాసుర సంహారం జరిగినరోజే ఆశ్వయుజ బహుళచతుర్దశి.

ఆ రోజుననే నరకాసురుని సంహరించారు కనుక ఆ రోజును నరక చతుర్దశి అని వ్యవహరించడం ఆనవాయితీగా మారింది.

నరకాసుర సంహారంతో తమ బాధలు తొలగిపోయాయని సకల లోకవాసులు ఆనందంతో దీపాలు వెలిగించి పండుగను జరుపుకోవడం సాంప్రదాయమైంది. తల్లిచేతనే మరణం ఉన్నదనే వరాన్ని పొందినప్పటికీ, నరకాసురుడు చివరకు తల్లి చేతిలోనే మరణిస్తాడు. నేల మీద ఒరుగుతూ అమ్మా! అన్న నరకాసురుని కేకతో సత్యభామకు సర్వం విదితమవుతుంది. కుమారుని మరణానికి దఃఖితురాలవుతుంది.

అయినా లోకకంటకుడైన కుమారుని ‘దుష్టాంగము ఖండించిన రీతి’ అన్నట్లుగా పుత్రుని సంహరించింది. ఆమె చేసిన ఈ పని పిల్లలు చెడుమార్గము పట్టినప్పుడు తలిదండ్రులు పిల్లలను శిక్షించి మంచి మార్గం వైపు మళ్ళించాలి అనే నీతిని ప్రభోదిస్తుంది ఈ దీపావళి పండుగ.

తామసగుణ ప్రవర్తనగల నరకాసురుడు సత్వ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మకు సత్యభామ రజోగుణ ప్రేరితై ఆదిపరాశక్తివలె సహాయం చేస్తుంది. ఆడదంటే అబలు కాదు శక్తి స్వరూపిణులు. అనురాగాన్ని పంచగలరు అవసరమైతే అపర కాళికలుగా మారి అంతం చేయగలరనటానికి ఈ నరకాసుర సంహారమే నిదర్శనం.

దీపావళి పండుగ అమావాస్యనాడు పిల్లలు పెద్దలు అందరూ అభ్యంగన స్నానం ఆచరించి కొత్తబట్టలు వేసుకుంటారు. ఆనాడు లక్ష్మీదేవిని నాణెములతో అర్చించి ఆ తల్లి కృపకు పాత్రులవుతారు. దీపావళి అంటే జ్ఞాన కాంతులను వెలిగించే దీపాల పండుగ.

దీపావళి జ్ఞానకాంతులను వెలిగించే దీపాలవరుసల పండుగ. మనిషి తనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించుకుని ఇతరులకు మేలు చేయాలనే కాంతిని మనసంతా నింపుకోవాలి. అందుకే అమవసి చీకటిలో రాత్రి వెలిగించిన ఒక్క చిన్న దీపమైన అంతులేని కాంతినిచ్చి ఆ భగవానుని చేరుకోవడానికి మనకు మార్గం చూపుతుంది. భక్తి మార్గ సాధనలో భగవంతునికి సమర్పించే మనసు పూజా పుష్పమైతే, మనలోని ప్రాణదీపమే ఆయన ముందు మనం వెలిగించిన దివ్వె కావాలి. అదే మానవజన్మకు సార్ధకత. మోక్షమార్గానికి చేయూత అవుతుంది.

“నమస్తే దేవదేవేశ
శఙ్ఖ చక్ర గదా ధర।
భక్తేచ్ఛోపాత్తరూపాయ
పరమాత్మన్నమోఽస్తుతే॥”

అని భాగవతం. ఓ దేవదేవా! శంఖచక్రగదాధారీ! భక్తుల కోరిక మేరకు వివిధ రూపాలను ధరించే పరమాత్మా! నీకు నమస్కారములు.

Exit mobile version