Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞాని

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పొన్నాడ సత్యప్రకాశరావు గారి ‘జ్ఞాని’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

‘రాఘవస్వామి’. ఈమధ్య ఆ ప్రాంతంలో ఆ పేరు బాగా వినబడుతోంది. “రామాలయం ప్రక్కనే ఉంటారట. మొహం చూసి చెప్పేస్తారట. ఏ సమస్యకైనా ఇట్టే పరిష్కారం చూపిస్తారట. ఏమి పుచ్చుకోరట. తోచింది పళ్ళెంలో వేసి వెళ్ళిపోవడమేనట. నోటమాట జరిగిపోతుందిట. బ్రతికి చెడ్డవాళ్ళట. పెళ్ళాం పిల్లల్ని వదిలేసి వచ్చారట.” ఇటువంటి “అలాగట”.. “ఇలాగట” లు గాలిలో పచార్లు కొడుతున్నాయి. ఇలాంటి వార్తలు ‘వింత ప్రపంచం’ సంపాదకుడు కామేశ్వరరావు దృష్టిలో పడ్డాయి. అదొక మాస పత్రిక. కొన్ని మామూలు వార్తలని, వ్యాసాలని, కథలు, కవితలనీ కాకుండా వింత వార్తలని, పరిశోధించి తెలుసు కొన్న వాస్తవాలని ప్రకటిస్తూ, చిదంబర రహస్యాలని బహిర్గతం చేస్తూ ఎలాగో నెట్టుకొస్తున్నాడు కామేశ్వరరావు. అతని మిత్రుడొకడు ఈ రాఘవస్వామి విషయం చెవిన వేశాడు. వేసి ఊరుకొంటే, “రోజుకో స్వామిజీ పుట్టుకొస్తున్నాడు. అందరి గురించి ఎక్కడ రాయగలం.. తేల్చగలం” అని వదిలేసే వాడే కానీ ఆ మిత్రుడు ఆ రాఘవస్వామిని నేను ఎక్కడ చూసానా అని ఆలోచిస్తే నీ దగ్గరే అని గుర్తు వచ్చింది. ఆ రాఘవస్వామి నీకు బాగా తెలుసు. నీ ఫ్రెండే అనేసరికి ఆలోచనలో పడ్డాడు కామేశ్వరరావు. రాఘవస్వామి అని పేరుగల స్నేహితుడే లేడు అనుకొని “నిజంగా నాకు తెలుసంటావా” అని అడిగాడు. ఆ మిత్రుడు “అతనో కాదో నాకు తెలియదు.. కాని అతనిలాంటి మనిషితో నీకు పరిచయం ఉంది. నీకు మంచి మిత్రుడు కూడా.. ఏమోలే మనిషిని పోలిన మనుషులుండొచ్చు కూడా” అన్నాడు. దాంతో గబగబ కొన్ని ఆల్బమ్‍లు తీసి ఇచ్చి “వీటిలో ఎవరో చెప్పు” అన్నాడు. పిల్లల పెళ్ళిళ్ళ నుంచి పత్రికకు సంబంధించిన కార్యక్రమాల వివరాలకు సంబంధించిన ఫోటోలతో కూడిన ఆల్బమ్ అది. అతను ఓపికగా చూస్తూ ఒక ఫోటో దగ్గర ఆగి “ఇదిగో ఇతడే ఆ రాఘవస్వామి” అన్నాడు. అతృతగా చూసాడు కామేశ్వరరావు. అది అతని కూతురి వివాహం నాటి ఫోటో. ఆ ఫోటోలో నూతన దంపతులతో పాటు తమ దంపతులు, తన మిత్రుడు ప్రసాద్ దంపతులు ఉన్నారు. ఆ ప్రసాద్‌ని చూపించి రాఘవస్వామి అంటాడేమిటి? అనుకొని “ష్యూర్, ఇతడేనా” అనడిగాడు కామేశ్వరరావు.

“చెప్పానుగా.. ఇలాగే ఉన్నాడు.. ఇతనో కాదో నాకు తెలియదు” అన్నాడు. కామేశ్వరరావు ‘పరిశోధకుడికి’ పనిపెట్టాడు. అయిదేళ్ళ నాడు కుమార్తె వివాహానికి భార్యతో కలిసి వచ్చాడు మిత్రుడు ప్రసాద్. చాలా సాదాసీదా మనిషి. ప్రైవేట్ ఉద్యోగి. చిరు జీతగాడు, నిక్కచ్చి మనిషి. అప్పుడప్పుడు తన పత్రికలలో వ్యాసాలు, కథలు వ్రాసేవాడు కూడా. అప్పుడే అతడి దగ్గర నుంచి రచనలు రావడం తగ్గిపోయాయి. “బాగానే రాస్తావు కదరా.. పంపరా.. నేను వేస్తానన్నా పంపవేరా” అనేవాడు. నవ్వేసేవాడు. “వీలు పడటం లేదురా” అనేవాడు. ఏదో నిస్పృహ ధ్వనించేది. పిల్లల చదువులు పెళ్ళిళ్ళ బాధ్యతలు వలన కాబోలు అనుకొన్నాడు. ఫోన్ చేస్తే ముక్తసరిగా మాట్లాడి పెట్టేసేవాడు. చాలా కాలంగా ఫోన్ కూడా లేదు. గట్టిగా విచారిస్తే ఇంట్లోంచి వెళ్ళిపోయేడని తెలిసింది. ఆర్థిక ఇబ్బందుల వలన ఇంట్లో గొడవలు వచ్చాయని అందువలన ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని కూడా తెలియవచ్చింది. అచూకీ దొరక లేదనీ తెలిసింది. అత్మహత్య చేసుకొన్నాడేమో అనే ధోరణిలోనే పోలీస్ చర్య తీసుకొన్నారు. కానీ అతనికి మానసిక దౌర్భల్యం లేదు. ఏ రుషీకేష్ లోనో వెతికితే దొరుకుతాడనుకొన్నాడు. కాలక్రమేణా, వివిధ పనుల ఒత్తిడి వలన ప్రసాద్ విషయం పట్ల శ్రద్ధ పెట్టలేదు కామేశ్వరరావు. సంసారంపై విసుగెత్తి సన్యాసి అయ్యాడా అనిపించింది. కాని పేరు బాగా తేడాగా ఉన్నదే అనుకొని పేరు మార్చుకోవచ్చులే అనుకొన్నాడు. కాని అతడిలోని పరిశోధకుడు ప్రసాద్ పూర్తి పేరేమిటా అని ఆరా తీశాడు. కే. ఆర్. ప్రసాద్ అని తేలింది. తను ప్రసాద్ అనే పిలుస్తాడు.. అందరిలాగా.. ‘అర్’ అంటే ‘రాఘవేంద్రా?’ చిక్కు వీడింది. కే. రాఘవేంద్ర ప్రసాద్.. ‘రాఘవస్వామి’ అయ్యుండొచ్చుగా.. అనిపించింది.. ఆలోచన సబబుగానే ఉంది. వెంటనే ఆశ్రమం గురించి విచారించి రాఘవస్వామితో పరిచయాన్ని పత్రికలో వేస్తామని ఆశ్రమానికి మంచి పేరు వస్తుందని నిర్వాహకులని ఒప్పించి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు కామేశ్వరరావు.

అది ఆశ్రమంలా లేదు.. ఏళ్ళనాటి రామాలయం.. దాని ప్రక్కన రామనవమి సంబరాల కోసం వదిలిన విశాలమైన ఆవరణలో పెద్ద షెడ్ వేసి ఉంది. ఒక ప్రక్కగా షిర్డీబాబా మందిరం ఉన్నది. వెనుకగా కుర్చీలు వేసి ఉన్నాయి. ఆ వెనుక ఇల్లులా ఉన్నది. కుర్చీలలో కూర్చొన్న భక్తులు ఒక్కొక్కరు ఆ ఇంటి ముందు గదిలోకి వెళ్ళి వస్తున్నారు. బహుశ ఆ గదిలో రాఘవస్వామి గారు ఉండొచ్చనుకొన్నాడు కామేశ్వరరావు. ఇంతలో అటుగా సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని వచ్చారు ఒకాయన. కామేశ్వరరావు సెల్ మోగింది. కట్ చేసి ఆయనను కలిసాడు కామేశ్వరరావు. “నేను వింత ప్రపంచం పత్రిక సంపాదకుడి” అంటూ ఆయనకు పరిచయం చేసుకొన్నాడు.. “ఓ! మీరేనా.. మీ కాల్ చూసే వస్తున్నాను. సంతోషం.. మా గుడికి వచ్చినందుకు” అన్నారు వీరభద్రరావు గారు. ఆ గుడి ధర్మకర్తగా తనని పరిచయం చేసుకొని. “రామాలయం మా తాతగారు కట్టించారండీ! మా నాన్నగారి తరువాత నేను చూస్తున్నానండి.. మావి అయిల్ మిల్స్ వ్యాపారం.. ఇంకా చాలా ఉన్నాయనుకోండి” అన్నారు. అన్ని వేళ్ళకు బంగారు ఉంగరాలు కనిపిస్తు స్థాయిని తెలుపుతున్నాయి. “మంచిదండీ!. మీ గురించి మీ సేవా కార్యక్రమాల గురించి విన్నాను. అందుకే ఒకసారి పరిచయం చేసుకొందామనుకొని వచ్చాను.. అలాగే ‘రాఘవస్వామి’ గారిని కూడా” అన్నాడు. అసలు పని అదే మరి! “ఓ! భేషుగ్గా” అన్నారు అనందపడిపోతూ వీరభద్రరావు గారు.. సేవా కార్యక్రమాల గురించి ఓ రెండు మూడు మాటలు చెప్పాక రాఘవస్వామి గురించి అడిగాడు. “ఎవరండీ ఈయన?” అంటూ. ఆయన చెప్పసాగారు.. సుమారు నాలుగైదేళ్ళ క్రితం ఈయన పరిచయం అయ్యారండీ! ఆ రోజు సెంటర్లో మా సంస్థ అన్నదాన కార్యక్రమం జరిపింది.. అప్పుడే తుఫాన్ వచ్చి వెలిసింది. నిరాశ్రయులకూ, అందరికోసం పెద్ద పెట్టున సేవా కార్యక్రమం జరిపాం. నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. బట్టలు కూడా పంచాం. అందరూ ఆతృతగా అందుకొంటున్నారు. ఈ స్వామి మాత్రం తనకేమి పట్టనట్టు అక్కడున్న రావిచెట్టు క్రింద కూర్చొని ఉన్నాడు శూన్యంలోకి చూస్తూ. అతను ఈ తుఫాన్ బాధితుడు కాడనిపించింది.. బ్రతికి చెడ్డవాడిలా ఉన్నాడు. నన్నెందుకో ఆకర్షించాడు. అటుగా వెళ్ళి ఆ చెట్టు క్రింద కూర్చొని తింటున్న ఒకాయనని అడిగాను “ఎవరు ఆయన. బువ్వ అక్కర్లేదా.. అందరూ లైన్లో నుంచుని ప్లేట్లు తీసుకొంటుంటే ఈయన కూర్చొనే ఉన్నాడు. తెచ్చి వడ్డించాలా” అని అడిగాను.

“కాదయ్యా! ఎక్కువగా అలాగే కూర్చొన్నా. చాలా తెలివైన మడిసిలా ఉన్నాడయ్యా..” అన్నాడు.

ప్రక్కవాడు అందుకొని “మరె! మొన్న ఎవరో ఇద్దరు ఏదో ఇంగ్లీషులో మాట్లాడుకొంటుంటే ఈయన ఇంగ్లీషులో వాళ్ళకేదో చెప్పేసి మరలా ఏమి ఎరగనట్లు కూర్చొన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతూ “ఈయనెవడ్రా బలే చెప్పాడు” అనుకోవటం నేను విన్నాన్నయ్యా..” అన్నాడు.

“మరి! తిండి .. అక్కర్లేదా” అడిగితే “ఎవరైనా ఏ పండో చేతిలో పెడితే తింటాడు. లేకపోతే లేదు. నిన్న వర్షం పడుతున్నా అంత చలిలోనూ అలాగే కూర్చొని పడుకొనే ఉన్నాడు” అన్నాడు.

ఆశ్చర్యం అనిపించి ఓ ప్లేట్ భోజనం తెప్పించి అతనికి అందచేశాను. మాసిన గడ్డం, లోతైన కళ్ళు, చిక్కిన శరీరం “ధన్యవాదాలు” అని ప్లేటు అందుకొన్నాడు. “ఎవరో పాపం” అనుకొన్నాను. తరువాత అతని విషయం మర్చిపోయాను. ఓ రెండు నెలల తరువాత మళ్ళీ అటుగా వెడుతూ అతడు కనబడతాడేమోనని చూశాను. అతను కనబడలేదు.. కాని అప్పుడు నాకు సమాధానం చెప్పిన వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళని అడిగాను.

“ఓ! ఆయనా? ఆయన మామూలోడు కాదండి. చాలా మహిమలున్నాయి., స్వామికి.. ఏం చెబితే అది జరిగిపోతుంది. ఆ ప్రక్క వీధిలో ఓ పాతబడిన ఇల్లుంది. ఆ ఇల్లు తీసేసి కొత్తది కట్టించే ఉద్దేశంలో ఉన్నాడు యజమాని. ఇతడి మీద ఎలా గురి కుదిరిందో గాని ఈయనని అక్కడ ఉండమన్నాడు” అన్నాడు. అతను చెప్పిన ఇంటి వైపు వెళ్ళాను. అతడు వరండాలో కూర్చొని ఉన్నాడు. ఎవరితోనో ఏదో చెబుతున్నాడు. రెండు నిమిషాలు అయ్యాక ఆ వ్యక్తి ఈయనకి నమస్కరించి చేతిలో ఉన్న అరటి పళ్ళు ఆయన ముందుంచితే వాటిల్లోంచి సగం తీసి ఇస్తే పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆ పళ్ళ మధ్యలో పెద్దనోటు కూడా కనిపించింది. ఆ నోటుని ఆ పళ్ళని ఓ బుట్టలో పడేసాడు అయన. బయటకొచ్చిన ఆయనని అడిగాను వివరం. “అబ్బో! చాలా మహత్తు ఉందండి ఆయన దగ్గర. చెప్పినవి జరుగుతున్నాయి..” అని వెళ్ళిపోయాడు. నా వ్యాపారంలో నా భాగస్వామితో నాకు భేదాభిప్రాయాలు వచ్చాయి. నాకు ఓ పరిష్కారం కూడా తట్టింది.. అయినా ఈయన ఏం చెబుతాడో అడుగుదామా అనిపించింది.

ఇంతలో ఆశ్చర్యకరంగా ఆ ఇంటి ముందు ఓ కారు ఆగింది. ఇద్దరు వ్యక్తులు దిగి వెళ్ళి ఆయన దగ్గర నుంచున్నారు. ఆయన ఒకరితో మాట్లాడుతున్నాడు.. కనీసం కారులోంచి వచ్చినవాళ్ల వంక కూడా చూడలేదు. మాట్లాడటం పూర్తి అయ్యాకే వారి వంక చూసాడు.. ఇద్దరూ సమస్కరించి ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు. అడిగితే తెలిసింది. ఆ స్థలం యజమాని అని. ఏదో సలహా కోసం వచ్చాడని. మరింత ఆశ్చర్యం కలిగింది. నేను వెళ్ళి నా భాగస్వామితో వచ్చిన సమస్య గురించి చెప్పి పరిష్కారమడిగాను. నిముషంలో నాకు ఇంతకు ముందే సూచించబడిన పరిష్కారము చెప్పేసి మరొకరితో మాట్లాడసాగాడు. నేను నమస్కరించి జేబులోంచి వందరూపాయల నోటు తీసి ముందు పెట్టాను. ఆయన అక్కడ ఉన్న బుట్టలో వెయ్యమన్నట్లు సూచించాడు. వేసి వెనుతిరిగాను.. కొంతమంది రెండు అరటి పళ్ళు ఇస్తున్నారు. కొంతమంది ఏమి ఇవ్వటం లేదు. కొంతమంది పదో పరకో వేస్తున్నారు. బుట్టలో పదులు, వందనోట్లు కూడా ఉన్నాయి. పళ్ళ బుట్టయితే నిండిపోయింది. వచ్చేస్తూ ఆ డబ్బులు ఏం చేస్తాడని ఎక్కడుంటారని అడిగాను. అక్కడే ఉంటారని డబ్బులు ఆ ప్రాంగణం యజమాని తాలూకా వాచ్‍మన్ తీసుకొంటాడని పళ్ళు అందరికి పంచేస్తాడని తెలిసింది. ఆ వాచ్‌మన్ భార్య భోజనం పంపిస్తుందని ఒక్క పూటే తింటాడని చెప్పారు. ఆశ్చర్యంతో వెనుతిరిగాను.

మరికొన్ని నెలలు గడిచాక అటుగా వెడుతూ ఉత్సుకతతో అతడిని కలిసి వెడదామనిపించి వెళ్ళాను. ఆ స్థలంలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆయనని చూడటానికి వస్తున్న జనం పెరుగుతున్నారట కూడా. నిర్మాణం పూర్తయితే ఆయన ఎక్కడ ఉంటాడో అనే ప్రశ్న వినబడుతోంది.. మనిషిలో బాగా మార్పు వచ్చింది. గడ్డం బాగా పెరిగింది. ధ్యానం తాలూకా ప్రశాంతత మనిషిలో కనపడుతోంది. ‘సంపూర్ణ సాధుత్వం’ కనిపిస్తోంది. ఆయనతో మాట్లాడాలి అనిపించి ఓరగా నించున్నాను.

ఎవరితోనో చక్కని ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళనుంచి మరిన్ని వివరాలు సేకరించాను. గతంలో ఏదో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడని తెలిసింది. బుట్టలో ఇప్పుడు అయిదువందల నోట్లు కూడా అప్పుడప్పుడు పడుతున్నాయట. కానీ ఏనాడు తనంతట తానుగా తన కోసం ఒక్క నోటు కూడా తీసుకోలేదట; కొంత వాచ్‌మన్‌కిచ్చి కొంత పంచేస్తూన్నాడట. అది వాచ్‌మన్‍కి నచ్చక గొడవవడుతున్నాడట అంతా తనకే రావాలని. ‘ఈ ఆపార్ట్‌మెంట్ పని పూర్తయితే ఈసారి మకాం మార్చాల్సివస్తుంది. అప్పుడు కుదురుతుంది వాచ్‌మన్ రోగం.. లేకపోతే ఏ రోజు డబ్బులు ఆరోజే భోజన ఖర్చుకు మినహాయించుకొని మిగతావి పంచెయ్యమంటే కొన్ని పంచి సగం నొక్కేస్తున్నాడా వాచ్‌మన్’ అని అక్కసు వెళ్ళగక్కాడు ఆ వ్యక్తి. అలా ఈ రాఘవస్వామి పరిచయం కలిగింది. నాకెందుకో సదభిప్రాయం కలిగింది. ఈ ఆరునెలలలో ఒక్క చెడ్డమాట కూడా వినబడలేదు. అయితే అపార్ట్‌మెంట్ పని పూర్తికాగానే ఎక్కడికి వెడతాడా, ఎక్కడుంటారా అనే సందేహాలు వినబడుతున్నాయి. అతడి కోసం ఆ యజమాని ఒక ప్లాట్ ఇవ్వడు కదా! అలా అలోచిస్తుంటే ఓ అలోచన తట్టింది.

మా రామాలయం ప్రక్కనే ఖాళీ స్థలం ఉన్నది. ఆ స్థలంలో కళ్యాణ మండపం కట్టే ఆలోచన కూడా ఉన్నది. ఈ స్వామిని అక్కడ ఉండమని అడిగితే ఉభయతారకంగా ఉంటుంది. ఇతడి కోసం వచ్చేవాళ్ళు గుడికి కూడా వస్తారు.. కళ్యాణమంటపం పనులు మొదలు పెట్టినపుడు అక్కడ కొంచెం అలికిడి ఉండటం మంచిదే. అతడికి ఆశ్రయం కల్పిస్తే ఒక మంచి వ్యక్తికి సాయం చేసినట్లవుతుంది. మరో ప్రక్క తన రామాలయానికి భక్తులు పెరుగుతారు. అలా ఉభయతారకంగా ఉంటుంది అనిపించి అదే ఆలోచనని ఈ రాఘవస్వామి చెవిలో వేసాను.. ‘స్వామి ఈ నిర్మాణం పూర్తి అయిన తరువాత మీరుండటానికి ఇబ్బంది కలుగుతుందేమో’ అన్నాను.. ‘ఇక్కడికి ఇలా వస్తానని నేనూ అనుకోలేదు. ఇక్కడికి తీసుకువచ్చిన వాడే ఇంకొక చోటు చూపిస్తాడు’ అన్నారాయన ప్రశాంతంగా. ఎక్కడా రేపు గురించిన ఆలోచనే కనబడలేదు. నిజమైన సాధువులా కనబడ్డారు. దానితో నా ఆలోచన చెప్పి మా రామాలయం దగ్గర ఉండమని ఆహ్వానించాను. సరే అని వచ్చేసారు.

స్థలం మారినా ఆయనని వెతుక్కొంటూ వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. కొత్త భక్తులూ కుదిరారు. కళ్యాణ మంటవం ఆలోచనను చెప్పి భక్తుల సహకారం అవసరముంటుందని అయితే భక్తుల సంఖ్య పెరగట లేదని కూడా తెలియచేసాను. ఆయన ఓ సారి ఆ స్థలాన్ని పరిశీలించి ఇక్కడొక సాయీ మందిరాన్ని నిర్మించండి మీకు ఆదాయం పెరుగుతుందని సలహా ఇచ్చారు. ఆ సలహాలో ప్రజల నాడి కనిపించింది. అలాగే నిర్మించాను. సాయి మందిరంతోబాటూ రామాలయానికి భక్తులు పెరిగారు. ప్రక్కనే ఉండటం వలన నా కళ్యాణమంటపం ప్రతిపాదనకు చందాలు బాగానే పోగపుతున్నాయి., త్వరలో నిర్మాణం మొదలు పెడతాం. అంతా ఈ స్వామి దయే” అని విపులంగా చెప్పి “భక్తులు తగ్గుతున్నారు. నాతో రండి” అని లోనికి తీసుకువెళ్ళారు. మాట్లాడుతున్న భక్తుడు వెళ్ళిపోగానే మావైపు చూసారు. ఈ అయిదేళ్ళల్లో చాలా మార్పు కనిపిస్తోంది. సింధూరవర్ణపు పంచె, కండువా. మెడలో రుద్రాక్షమాల, విభూతి రేఖలు, గెడ్డం, ప్రశాంత వదనం చిన్నగా చిరునవ్వు, చూపరుల నాకర్షించే ఆహార్యంతో ఉన్నారు. నన్ను గుర్తుపట్టినట్లు కళ్ళు చెబుతున్నాయి. మా పూర్వ పరిచయం సంగతి తెలియని వీరభద్రరావు గారు “స్వామి ! మన ఆశ్రమం గురించి నలుగురికి చెప్పటానికి ఈ స్వామి వచ్చారు. ఇంటర్వూ కాలవాలట.” అన్నారు “అలాగే ఇద్దాం” కౌంచెం సేపు వేచి ఉండండి. భక్తులను పంపించేసి వస్తానన్నారు నన్ను చూస్తూ. నన్ను గుర్తుపట్టినట్లుగా కళ్ళు పలకరించాయి. “వీరు నాకు తెలిసిన వారే. వీరిని రమ దగ్గరకు తీసుకువెళ్ళండి” అన్నారు. రమ అంటే ఆయన భార్యే. ఆమె కూడా ఇక్కడే ఉందా అనుకొంటూ వీరభద్రరావు గారి వెంట వెళ్ళాడు కామేశ్వరరావు. “మీకు ముందే తెలుసన్న మాట మరి ఆ విషయం ముందే చెప్పలేదేంటండి” అన్నారు వీరభద్రరావు.. “ఈయన నాకు తెలిసిన వ్యక్తి అని నాకు ఇప్పుడే తెలిసిందండి” అంటూ ఆయన వెంట వెళ్ళాడు కామేశ్వరరావు. వెనుక ఉన్న ఇంటిలో రమ దగ్గరకి తీసుకెళ్ళి “మీరు మాట్లాడుతుండండి. నేను మళ్లీ వస్తాను” అని వెళ్ళిపోయాడు వీరభద్రరావుగారు..

“మీరా అన్నయ్యగారు.. ఎవరో అనుకొన్నాను.. రండి, కూర్చొండి అంటూ లోనికి వెళ్ళి గ్లాసుతో మజ్జిగ ఇచ్చింది.. గ్లాసు అందుకొంటూ “ఏమిటమ్మా ఇది.. ఈ అవతారం ఏమిటి? సన్యాసి జీవితం ఏమిటి? ఏం జరిగిందసలు? అయిదేళ్ళనాడు ఇంటినుంచి వెళ్ళిపోయారని చెప్పావు. తరువాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలువలేదు. నేనూ కొంచెం శ్రద్ధ పెట్టలేదనుకో..” అన్నాడు.. అమె కండ్లనీరు పెట్టుకొంది. “ఏం చెప్పమంటారు.. నేను పాపిష్టిదాన్ని.. అయన నిప్పులాంటి మనిషని మీకూ తెలుసుగా. ప్రైవేటు ఉద్యోగం.. ఆశయాలు, అత్మాభిమానం ఎక్కువ. అన్యాయాన్ని, సహించరు.. యజమాని ఆవేశంలో ఏదో అన్నా సహించి అంకితభావాన్ని నటిస్తూ అడ్డదారిలో సంపాదించేవాళ్ళు ఎందరో.. ఈయనకి అలాంటివి గిట్టవు.. దానితో అతి సామాన్యమైన జీవనం మాత్రమే సాధ్యమయ్యింది మాకు. అమ్మాయిని, అబ్బాయిని బి.ఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివించారు.. బి.టెక్ చదివించ లేకపోయినా మంచి కాలేజీలోనే క్యాంపస్ జాబ్‌కి అవకాశమున్న కాలేజీలోనే డిగ్రీ చదివించారు. అమ్మాయి ఎలాగో ఉద్యోగం తెచ్చుకొంది. అయితే ఆడపిల్ల ఆడపిల్లే కదా! ఓ అయ్య చేతిలో పెట్టాం, కట్న కానుకలకి అప్పు చెయ్యాల్సి వచ్చింది. చిన్నవాడైన అబ్బాయి అంది వస్తాడనుకొనేసరికి వాడు సరిగ్గా చదవక క్యాంపస్‍లో జాబు తెచ్చుకోలేకపోయాడు. యమ్.సి.ఏ. చేస్తానన్నాడు. సరే అని మంచి కాలేజీలోనే చేర్చించారు. అక్కడా క్యాంపస్‌లో జాబు తెచ్చుకోలేకపోయాడు. కానీ బాధ్యతను తెచ్చుకొన్నాడు. ఓ అమ్మాయిని ప్రేమించాడట. తొందర పడ్డారు. ఆమె నెల తప్పింది. వాళ్ళు సహజంగానే గొడవ చేసారు. వీడికి సరైన ఉద్యోగం లేకుండానే పెళ్ళి చెయ్యాల్సి వచ్చింది. ఏదో ఉద్యోగంలో వేయించారు. రిటైర్మెంట్ దగ్గరపడింది. ఈయన స్నేహితుడు ఒకాయన బాధల్లో ఉండి పిల్ల పెళ్ళికి చీటీ పాడుకొన్నాడు.. ఈయన పూచీకత్తు మీద.. ఏమయిందో అతడు కట్టడం మానేసాడు. ఈయన కట్టవలసి వచ్చింది. రిటైర్మెంట్ డబ్బులు.. వచ్చినవే తక్కువ అవి కాస్తా అలా వెళ్ళిపోయాయి. ఇంతలో మనవడు పుట్టాడు. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. శుభ్రంగా చదివిస్తే, అవకాశాలు కల్పిస్తే అంది పుచ్చుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని కాస్త సాయంగా ఉండాల్సిన కొడుకు బి.టెక్ చేయించలేదనో, ఆస్తులు సంపాదించలేదనో, బుర్రలేకుండా.. స్యూరిటీలు ఇచ్చి ఉన్న డబ్బులు కూడా పోగొట్టారనో మాటి మాటికీ వేధించేవాడు. కొడుకు మీద ప్రేమతోనూ, ఇబ్బందులను తట్టుకోలేక నేను కూడా ఈయనని తూలనాడేదాన్ని.. ‘భరించలేక నేను మీకు ఉపయోగపడలేకపోయాను, మీకు భారంగా కూడా ఉండను’ అంటూ ఓ కాగితం మీద వ్రాసి కనబడకుండా వెళ్ళిపోయారు.

తెలిసిన వాళ్ళందరికి చెప్పాం, వెతికాం., వెతికించాం.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. జాడ తెలియలేదు. నా కొడుకుకి నేను భారమయ్యాను. వాడి మీద ప్రేమతో వాడిని వెనకేసుకు వచ్చినందుకు నాకు శాస్తి చేసాడు. ‘నువ్వెందుకు? నువ్వు పో.. కంటే సరిపోదే.. ఇల్లు కూడా సమకూర్చలేదు’ అంటూ కోడలు, కొడుకు అడిపోసుకొనేవారు.. అటువంటి సమయంలో వాడికి యాక్సిడెంట్ అయ్యింది. మూడు నెలలు బెడ్ మీదనే ఉన్నాడు. మందులకు కాదు కదా రోజు గడవని పరిస్థితి. అటువంటి సమయంలో ఈయనని మోసం చేసిన స్నేహితుడు వచ్చి పరిస్థితులు కారణం వలన అలా చెయ్యవలసి వచ్చిందని తన వలన ఒక మంచి వ్యక్తి చాలా కష్టాలు పడవలసి వచ్చిందని అందుకు తాను సిగ్గుపడుతున్నానని ప్రతిఫలంగా పూచికత్తు నిమిత్తం చెల్లించిన డబ్బులు వడ్డీతో కలిపి ఇచ్చేస్తున్నానని నాలుగు లక్షలు తెచ్చి ఇచ్చాడు. హాస్పిటల్ ఖర్చులు ఇతర అప్పులు తీర్చేసినా కొడుకు దగ్గర ఇంకా లక్ష మిగిలింది.. అది కూడా ఎంతో ఆవసరమైన సమయంలో డబ్బులు రావడం, అతడు మా అబ్బాయికి మంచి ఉద్యోగం వేయించడంతో కళ్ళు తెరుచుకొన్నాయి. నా కాళ్ళమీద పడ్డాడు. “నాన్న ఎక్కడున్నా వెతికి తెస్తానమ్మా” అన్నాడు. ఆ మాటకు సంతోషించాను గానీ కోడలులో పెద్ద మార్పులేదు దానితో ఇంట్లో నా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది.

ఇలా ఉండగా ఓ సారి హఠాత్తుగా మా పిన్ని వచ్చింది. ‘ఒసేయ్ నీ మొగుడ్ని చూసానే. అశ్రమం పెట్టాడు. ఋషిలా బ్రతుకుతున్నాడు. మంచి పేరు తెచ్చుకొన్నాడు. నీ కోడలు దగ్గర ఇంకెన్నాళ్ళు పాట్లు పడతావు కానీ నాతో వచ్చేయ్.. నేను రాఘవేంద్ర దగ్గరకి తీసుకెడతాను’ అన్నది.. ‘అయనని ఎన్నో మాటలు అన్నాను. కొడుకు మీద ప్రేమతో. వాడు డబ్బు కనిపిస్తేనే ‘అమ్మా’ అంటాడు.. కోడలు అదీ లేదు. నాకు ఆ శాస్తి జరగాల్సిందే’ అన్నాను. ‘అలా కాదు నేను రేపు వెళ్ళి అన్నీ చక్కబరిచి పస్తాను’.. అని మళ్ళీ ఈయనని కలిసి ఆ వీరభద్రరావు గారికి మా కథంతా చెప్పి ‘అవిడకూ ఇక్కడ ఆశ్రయం కల్పించమ’ని అడిగింది. ‘అయ్యో ఎంత మాట, గురువుగారి భార్య! తప్పకుండా తీసుకురండి’, అనడం నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కాళ్ళ మీదబడితే ‘సరే ఉండు’ అని ఉండనిచ్చారు. సంవత్సరం అవుతోంది. ఆశ్రమ నిర్వహణలో పాలు పంచుకొంటున్నాను.

ఆ మధ్య కొడుకు, కోడలు కూడా వచ్చి కాళ్ళమీద పడ్డారు. నాలుగు లక్షలు ఇచ్చి ఉద్యోగం వేయించిన ఆ స్నేహితుడికి నేనూ ఇంటిలోంచి వెళ్ళగొట్టబడినట్లు తెలిసింది. ముందు తండ్రి, నీ తరువాత తల్లిని కూడా వెళ్ళిపోయేటట్లు చేస్తావా. వెళ్లు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొంటేనే నిన్ను మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకొంటా. అంత వరకు నిన్ను నా ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను అని ఉద్యోగం తీసేసాడట. దాంతో కొడుకు కోడలు చెంపలేసుకొని వచ్చి కాళ్ళ వేళ్ళా పడి మళ్ళీ ఉద్యోగం సంపాదించుకొన్నాడు. ఆ స్నేహితుడిని కూడా తీసుకువచ్చి. అంతా నాటకీయంగా సినిమాలలో జరిగినట్లున్న విషయాలను విని అబ్బురపడ్డాడు కామేశ్వరరావు. మిత్రుడి మీద గౌరవం రెట్టింపయింది. ఇంతలో స్వామి పిలుస్తున్నారంటూ కబురు వచ్చింది.. వెళ్ళాడు.

ఆధ్యాత్మిక గ్రంథాలయంలో ఉన్నదా గది. ఓ కుర్చీలో కూర్చొని ఉన్నారు రాఘవస్వామి. లోనికి వెళ్ళి అందరిలాగే పాదాభివందనం చేయబోయాడు, “ఛ.. నువ్వేంట్రా కాముడూ” అని వారించి కుర్చీలో కూర్చోబెట్టాడు.. “కాముడూ అనే పిలుస్తాడు. ఆ పిలుపు విన్నాకా వాతావరణం కాస్త ప్రశాంతంగా మారినట్లయ్యింది. “ఎలా ఉన్నావురా..? నేను నీ ప్రసాదనే అనుకో.. ఫ్రీగా ఉండు” అన్నాడు. “ఏమిటీ అవతారం ప్రసాద్ గారు..” అన్నాడు కామేశ్వరరావు.. “ఇదిగో అదే ప్రసాద్ అని పిలు చాలు” అన్నారు రాఘవస్వామి.

“నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయావని తెలిసాక రెండుసార్లు మీ ఇంటికి వచ్చాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు అచూకీ తెలియనట్లు తెలిసింది. ఆ తరువాత రమగారికి ఫోన్ చేస్తాను. కాని ఎన్నిసార్లు చేసినా కలవలేదు. ఈలోగా మా అమ్మాయి డెలివరీకి రావటం తరువాత అబ్బాయి పెళ్ళి పత్రిక గొడవల వలన మళ్ళీ మీ ఇంటికి వెళ్ళలేదు. చాలాసార్లు మా పత్రికలో నీ ఫోటో వేసి ఆచూకి తెలిపితే బహుమానాన్ని కూడా ప్రకటించాను. మొన్న నా మిత్రుడొకడు ఈ ఊర్లో ఇక్కడ నిన్ను చూసి ‘ఈయన మీ ఫ్రెండ్‌గా ఉన్నారండీ’ అని చెబితే నిర్ధారణ చేసుకోవడానికి ఇంటర్వ్యూ మిషతో వీరభద్రరావుగారితో మాట్లాడివచ్చాను. రమ విషయం అంతా చెప్పారు. అన్నీ అర్థం చేసుకోవచ్చు కానీ భక్తులు చెబుతున్న మహిమలు ఎలా సంపాదించావు” అడిగాడు కామేశ్వరరావు.

చిరునవ్వు నవ్వి చెప్పాడు ప్రసాద్ – “మహిమలు! అందరికి మహిమలే కావాలి. మానవత్వం అక్కర్లేదు దానవత్వానికి జడుస్తారు. నాలో ఉన్న మానవత్వాన్ని ఎవరూ చూడలేదు. మహత్యాన్నే చూసారు. మీరు చూసారు కాబట్టే కనబడింది. నాకు ఏ మహిమలు లేవు. అంతా చూడటంలోనే ఉంది. ఎలా చూస్తే అలా కసబడుతుంది.. అంతే! నీకు తెలుసుగా! నాదసలే అంతంత మాత్రం ఆదాయం. అనిల్ అంబాని ఇంట్లో పుట్టుంటే బాగున్ను అనుకొనే కొడుకు వీధిలాంతర్ల దగ్గర చదువుకొని అంబానీల కన్న గొప్పవాళ్ళయిన కొదుకులతో తనని పోల్చుకోడు. ఏకపక్షమే. నేను రిటైర్ అయ్యాను. అదే సమయంలో నేను ష్యూరిటీ ఇచ్చిన మిత్రుడు డబ్బులు కట్టకపోవడంతో నేను కట్టాల్సి వచ్చింది. నాకొచ్చే కొద్దీ సొమ్ము అలా ఖర్చయిపోయింది. సహజంగానే భార్యా పిల్లలు తిట్టారు. నేను నా కొడుకు కోరినచోటే ఎమ్.సి.ఏ చెప్పించాను. సరిగ్గా చదువలేదు. క్యాంపస్లో నెగ్గలేదు. ఏదో చిన్న ఉద్యోగంలో వేయించాను. ఈలోగా పెళ్ళి చేసుకొన్నాడు. సంసారం పెరిగింది. ఇబ్బందులు ఎక్కువయ్యాయి. కానీ నేనూ వాటికీ బాధ్యుడినేనా? రమా నన్నే అనేది. పాపం! ఆమెకీ మంచి నగలు గట్రా చేయించలేకపోయాను. నేను ఎంచుకొన్న మార్గం అలాంటిది. ఒకరోజు చాలా ఘర్షణ జరిగింది. నేను వాళ్ళకి విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వలేకపోయాను. కానీ కనీస అవసరాలు తీర్చాను. సామాన్యమైన జీవనాన్ని ఇచ్చాను. అక్కడ నుంచి వాడు ఎదగటం మానేసి నన్నే అడిపోనుకొన్నాడు. భరించలేకపోయాను. ఇల్లు వదిలి ఈ ఊరు వచ్చేసాను.

ఓ రావిచెట్టు దగ్గర కూర్చొన్నా. ఒక ప్రక్క గుడిసెలు.. లేబర్ కాలనీ.. మరోపక్క మధ్య తరగతి ఇండ్లు నాలో నేను మథన పడుతూ కూర్చొన్నా.. ఎంతసేపు కూర్చొన్నానో తెలియదు. ఆకలి వెయ్యడంతో ఈ లోకంలోకి వచ్చా. ‘ఎవుర్రా ఈయన.. కూలీ కెళ్ళేముందు చూసా.. పనైపోయి వచ్చేసరికి కూడా ఇంకా కూకునే ఉన్నాడు’ ఎవరివో మాటలు వినబడ్డం.. ‘పిచ్చోడిలా లేడే..’ అంటూ ఇంకోవ్యక్తి. ‘ఎవురుస్వామి, ఏడ నుంచి వచ్చారు..’ అని నీరసంగా కనిపిస్తున్న నా చేతిలో ఓ అరటి పండు పెట్టాడు. ‘థ్యాంక్స్’ అని పండు తిన్నాను. ఇంకొకటి ఇచ్చాడు. కొద్దిగా ఆకలి తీరింది. నా దగ్గర డబ్బులున్నాయి. ఓ పదిరూపాయలు ఆయనకిచ్చి మళ్ళీ కళ్ళు మూసుకొన్నాను. వాళ్ళు వింతగా చూసారు. ఆ రాత్రి అక్కడే గడిపా.. ప్రొద్దుటే లేచి ఆకలి దప్పులు తీర్చుకొని వచ్చి అక్కడే కూర్చొన్నాను. అక్కడ ఉంటున్న పిల్లలనుకొంటా ఏదో లెక్క రాక క్రిందా మీదా పడుతున్నారు. పిలిచి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాను. వాళ్ళు సంతోషించి ఇంట్లో చెప్పి స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇంతలో మరో చోట ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతూ రావి చెట్టు దగ్గరకొచ్చారు. మిగతా వాళ్ళు సర్ది చెబుతున్నా వినటం లేదు. నేను కలుగచేసుకొని ఒక సలహా ఇచ్చాను. అందరికి నచ్చింది. దండం పెట్టి వెళ్ళిపోయారు. అక్కడున్న వాళ్ళందరూ నన్నొకలా చూసారు.

నేను ప్రత్యేకంగా చేసిందేమి లేదు. ఆ పిల్లలకు లెక్కలు చెప్పాను. ఎన్నో పుస్తకాలు చదివి ఉండటంతో, వ్యాసాలు కథలు వ్రాసిన అనుభవంతో వారి సమస్యకు పరిష్కారం చెప్పాను. ఎవరో ఏదో పని మీద వెడుతూ అవుతుందా అంటే తిథి వారాలను బట్టి అవుతుందని చెప్పాను. ఆ పని అయింది. ఆ వ్యక్తి నలుగురికి చెప్పాడు. నా దగ్గర ఉన్న కొద్ది డబ్బుని పిల్లలుంటున్న ఇంటి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు భోజనం పెట్టారు. రాత్రి మళ్ళీ పండే తీసుకొన్నాను. అక్కడే పడుకొన్నాను. మర్నాడు అలాగే గడిచింది. స్కూలుకెళ్ళే ముందు పిల్లలు దగ్గరకి వచ్చేవాళ్ళు. సందేహాలు తీర్చేవాడ్ని. తరువాత కూలి పనులకు వెడుతూ పెద్దలు, ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు. సైకాలజీ చిట్కా వైద్యాలు, జాతకాలు, ఆధ్యాత్మికత, ఇలా అన్ని అంశాల మీద నాకున్న అవగాహన నాకు ఉపయోగపడింది. దేనినయితే నా ఇంటి దగ్గర ‘చాదస్తం’ అన్నారో ఇక్కడది ‘జ్ఞానం’ గా ఉపయోగపడింది. స్వీకరించబడింది. అప్పటివరకు నిష్ఠగా బ్రతికి ఉండటంతో బహుశా వాక్శుద్ధి కూడా ఉపయోగపడిందనుకొంటా. నీ దగ్గరకి సలహా కోసం వచ్చేడంటే వాడు ఏదో కష్టాలలో ఉండే ఉంటాడు. కష్టం వచ్చినప్పుడే కదా దేవతలు, దెయ్యాలు కూడా గుర్తుకొస్తాయి. నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో రావిచెట్టు చుట్టూనో లేదా దగ్గరలో ఉన్న గుళ్ళోనో మండలం పాటు రోజూ 108 ప్రదక్షిణాలు చెయ్యమనేవాడిని. స్తోత్రాలు చదువుకోమనేవాడిని. అలా చేస్తే మనిషికి ఏకాగ్రత, ఆరోగ్యం కలుగుతాయి. ఏకాగ్రతతో చేసే పనులు జరుగుతాయి. కష్టసుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. అందుకే నా దగ్గరకి సలహాలకి వచ్చారు.. అది ఎల్లకాలం ఉండదు.. ఆరునెలలలో మంచి రోజులు వస్తాయని చెప్పడంలో తప్పులేదు. మంచి జరుగుతుందని చెప్పటం ఆశాజనకమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. దానికై ఏ శాస్త్రమూ చదవనక్కర్లేదు.

పదిమందిలో అయిదుగురికి జరిగితే వాళ్ళు ఒక్కొక్కరూ పదిమందికి చెబుతారు. ఫలించని వాడు రాకపోవచ్చు. కాని ఫలితం పొందినవాడు ఇంకొంతమందితో వస్తాడు. జనాలని ఎలా మోసం చెయ్యవచ్చో కూడా అర్థం అయింది. అయితే నాకు మోసం చేసే ఉద్దేశం లేకపోవడం, అన్నింటికన్నా నేను దేనిని అశించకపోవడం నన్నో ‘జ్ఞాని’ ని చేసాయి. గురువుని చేసాయి. తలచుకొంటే నవ్వు వస్తుంది. నాకు లేని శక్తులన్నీ నాకు ఆపాదించబడ్డాయి. అది వారి మూఢాభిమానం.. దానినే కొంత మంది సొమ్ము చేసుకొంటారు. నాకు ఏమీ మహిమలు లేవన్నా, ఆఖరికి ఇంటినుంచి వచ్చేసానన్నా వినలేదు. నిరాడంబరుడనీ, సన్యాసం తీసుకొన్నారనీ ప్రజలలోకి వెళ్ళింది. చెప్పానుగా గృహస్తాశ్రమంలో నా వ్యక్తిత్వం, తెలివితేటలు ఇంటివారు కోరుకొన్నట్లుగా సంపాదించలేకపోయాయి.

ఇప్పుడు నా సంపాదన చూశావుగా.. నేను ఎప్పుడూ లెక్కపెట్టను. వచ్చిందంతా అన్నదానాలకి ఇతర సేవా కార్యక్రమాలకే ఇచ్చేస్తాను. మొన్న కోడలు వచ్చి రమతో అంటోందట. ‘అత్తయ్య గారు మీరు కొంత సొమ్ము ఉంచుకోవచ్చు కదా’ అంటే తద్వారా కొడుకుకి ఇమ్మనేగా.. రమ నాతో చెప్పింది. ‘ఏమైనా ఇబ్బందులున్నాయోమోనండి’ అని. ఇబ్బందులు ఏమైనా ఉంటే వచ్చి వీరభద్రరావు గారితో చెబితే ఆయన ఇస్తారు.. ఈ సంపద నా జ్ఞానానిది.. ఆ జ్ఞానాన్ని చూసిన వాళ్ళది. నాలో ఛాదస్తాన్ని, పనికిరానితనాన్ని చూసిన వాళ్ళది కాదు.

అయినా వాళ్ళు వచ్చి వాళ్ళ అవసరం చెప్పి నాకు కూడా ట్రస్టీ అయిన ఈ రామాలయం ఓనర్ వీరభద్రరావు గారిని అడిగి తీసుకోమని చెప్పాను. ఎన్నో సార్లు ఆయనే అడిగాడు ఏమైనా అవసరాలున్నాయా అని.. మనిషి జ్ఞానాన్ని సంపాదించాలి. సంపాదించిన జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. ఆ జ్ఞానం సంపాదించిన సంపదనీ పంచాల్సిందే.. నేను వేరే చోట ప్రవచనాలు చెప్పాలి. బయలుదేరాలి.. మీరు వస్తే రండి..” అని లేచారు ఆ జ్ఞాని తన జ్ఞాన సంపదను పంచడానికి.

సమాప్తం

Exit mobile version