Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞాపకాల పొదరిల్లు

[తిరుమలశ్రీ గారు రచించిన ‘జ్ఞాపకాల పొదరిల్లు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

ఇంటర్మీడియట్ ఆఖరు సంవత్సరం ఆఖరి పరీక్ష రాసి హుషారుగా బయటకు వచ్చారు విద్యార్థులు. తలపైనుండి పెనుభారం తొలగినట్లనిపించింది అందరికీను. స్నేహితులంతా ఒకచోట చేరి పరీక్షలు ఎవరెవరు ఎలా రాసారో మాట్లాడుకుంటూ బయట సందడి చేసారు.

నీహారిక, ఆమె స్నేహితురాళ్ళు శిరీష, లాస్య, కార్తీక, రాశిల వదనాలు పరీక్షలు బాగా రాసామన్న సంతృప్తితో వెలిగిపోయాయి. “ఏయ్, ఐ-మాక్స్‌లో యానిమేషన్ ఫిల్మ్ వచ్చిందే. రేపు మ్యాటనీకి వెళదామే” అంటూ నీహారిక ప్రతిపాదించడంతో ‘సై’ అన్నారంతా.

పరీక్షలు ముగిసిన మూడవరోజునుండే మళ్ళీ పుస్తకాలతో కుస్తీపట్లు ఆరంభమయ్యాయి స్నేహితురాళ్ళకు. నీట్, బిట్స్ వగైరా ప్రవేశపరీక్షలకు ప్రిపరేషన్స్ ఆరంభించారు. ఐ.ఐ.టి.లో సీటు సంపాదించుకోవాలన్నది నీహారిక కోరిక. శిరీషకు మెడిసిన్ చదవాలన్న అభిలాష. ఇద్దరూ బ్రిలియంట్ స్టూడెంట్సే. ఎప్పుడూ తొంభైశాతానికి పైనే ఉంటాయి వారి మార్కులు.. లాస్య, కార్తీకలు ఫస్ట్ క్లాస్ విద్యార్థినిలు. ఎమ్సెట్ పాసయి బి.టెక్. లో చేరాలనుకుంటున్నారు. నీహారిక, శిరీషలు కోచింగ్ సెంటర్స్ లో చేరితే.. కార్తీక, రాశి కంబైన్డ్ స్టడీ చేయసాగారు..

ఓ రోజున ఇంటి అరుగుపైన మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని కూర్చున్న పక్కింటి దీపక్ కనిపించాడు నీహారికకు.. పధ్నాలుగేళ్ళు ఉంటాయి వాడికి. పదవతరగతి పరీక్షలు రాసాడు. తెలివైన విద్యార్థి. అన్ని తరగతులలోనూ నూటికి తొంభైఅయిదు శాతానికి తగ్గకుండా మార్కులు తెచ్చుకుంటూ ప్రథమస్థానాన్ని కైవసం చేసుకుంటున్నాడు. భావిలో వాడు గొప్ప ఇంజనీరు కావాలి, అమెరికాలో ఉన్నతస్థానాన్ని అందుకోవాలి అన్నది వాడి తల్లిదండ్రుల ప్రగాఢ వాంఛ.. తండ్రి రాష్ట్రప్రభుత్వంలో ఓ అధికారి అయితే, తల్లి ఓ ప్రైవేట్ స్కూలుకు ప్రిన్సిపాల్.

“ఏయ్, దీపక్! ఎందుకలా డల్‌గా కూర్చున్నావ్?” అంటూ పలుకరించింది నీహారిక.

వాడు తలెత్తి చూసి, “ఏమీ లేదక్కా!” అన్నాడు.

“క్యారమ్స్ ఆడుకుందాం, వస్తావా?” అనడిగింది, వాడి మూడ్స్‌ని లిఫ్ట్ చేసే ఉద్దేశ్యంతో.

“లేదక్కా! చదువుకోవాలి” అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.

జాలిగా చూసింది నీహారిక.. తల్లిదండ్రులు వాణ్ణి క్షణం కూడా బయటకు వదలరు. ఆటలకు పంపించరు. తోటి పిల్లలతో కలవనివ్వరు. టీవీ, సినిమాలూ నిషిద్ధమే. ఎంతసేపూ చదువే. చిన్నప్పట్నుంచీ అంతే! స్కూలు, ఇల్లు, చదువే వాడి లోకం.

తరగతులన్నీ వాడు ప్రథముడిగా ఉత్తీర్ణుడవుతూంటే గర్వంగా ఉంటుంది వారికి. అందరితోనూ గొప్పగా చెప్పుకుని మురిసిపోతూంటారు. అంతటితో ఆగకుండా నూటికి నూరుశాతం మార్కులు తెచ్చుకోవాలని వాణ్ణి ఒత్తిడి చేస్తారు. అందుకు రేయింబవళ్ళు కదలకుండా కూర్చోబెట్టి చదివిస్తారు. తల్లిదండ్రుల కలలను సాకారంచేసే యజ్ఞంలో సమిధ అయ్యాడు వాడు.

ఓసారి దీపక్ తనతో అన్న పలుకులు నీహారిక మదిలో మెదిలాయి- ‘అక్కా! అందరు పిల్లల్లాగే నేనూ ఎందుకు ఆడుకోకూడదు? గ్రౌండుకు వెళ్ళి క్రికెట్ ఆడాలని వుంటుంది. ఇతరపిల్లలతో కలసి ఆటలన్నీ ఆడుకోవాలని వుంటుంది. టీవీలో నాకిష్టమైన క్రికెట్ మ్యాచ్ చూడాలని వుంటుంది. సరదాగా కాసేపు బైట తిరిగి రావాలనిపిస్తుంది. కానీ మమ్మీ, డాడీ వెళ్ళనివ్వరు.. ఆటలాడితే చదువు రాదా, అక్కా? తోటిపిల్లలతో కలిస్తే చెడిపోతామా?.. చదువంటే నాకు ఇష్టమే, అక్కా! కానీ, అస్తమానూ పుస్తకాలే అంటే, బోర్ కొడుతోంది..’ వాడికి ఏంజవాబివ్వాలో తెలియలేదు తనకు.

‘పిల్లలు ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు అభిలషించడంలో తప్పులేదు. కానీ ఆ క్రమంలో పిల్లలు కోల్పోతున్నదేమిటో గ్రహించలేకపోతున్నారు. కోల్పోయిన బంగారుబాల్యాన్ని తిరిగి ఇవ్వలేమన్న ఇంగితజ్ఞానం విద్యాధికులైన తల్లిదండ్రులకు సైతం లేకపోవడం శోచనీయం!..’ అనుకుంది.

స్నేహితురాళ్ళు నలుగురూ ప్రవేశపరీక్షలు బాగా రాసారు. మంచి ర్యాంకులు వస్తాయన్న ధీమాతో ఉన్నారు. ఎవరు ఏ కోర్స్ తీసుకుంటారో, ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నారో ముందే నిర్ణయించేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫీజులు వగైరాలు, హాస్టల్ సదుపాయాల గురించి కూడా సమాచారం సేకరించారు.

ఇంటర్ ఫలితాలు రావడం ఆలస్యమయింది. ముందుగా ప్రవేశపరీక్షల ఫలితాలు వచ్చేసాయి.. ఎదురుచూసినట్టే నీహారిక, శిరీషలకు హయ్యర్ ర్యాంక్స్ వస్తే.. కార్తీక, రాశిలకు మధ్యస్థ ర్యాంకులు వచ్చాయి. అందరికీ కోరుకున్న కోర్సులలో, కాలేజీలలో అడ్మిషన్ దొరుకుతుందని గట్టినమ్మకం ఏర్పడింది. ఆనందంతో పార్టీ కూడా చేసుకున్నారు.

కొద్దిరోజులకు ఇంటర్మీడియట్ పరీక్షాఫలితాలు రానే వచ్చాయి. అవి స్నేహితురాళ్ళను గొప్ప షాక్‌కి గురిచేసాయి. ముఖ్యంగా, నీహారికను! మిగతా సబ్జెక్టులన్నిటిలోనూ తొంభయ్ లలో వచ్చినా..మ్యాథ్స్‌లో 49, ఫిజిక్స్ లో 29 మార్కులు వచ్చాయి ఆమెకు!! శిరీషకు ఫస్ట్ క్లాస్ వస్తే.. రాశి, కార్తీకలు సెకండ్ క్లాసులో పాస్ అయ్యారు.

మ్యాథ్స్, సైన్స్ నీహారికకు అత్యంత ప్రీతికరమైనవేకాక, స్ట్రాంగ్ సబ్జెక్ట్స్. వాటిలో తొంభైఐదు శాతానికి తగ్గదు ఎప్పుడూను. పైగా, ఒక్కప్రశ్నా విడిచిపెట్టకుండా అన్నీ కరెక్ట్‌గా రాసింది. ఇంటికి వచ్చాక తాను రాసిన జవాబులను వెరిఫై చేసుకుంది కూడాను. అలాంటిది మ్యాథ్స్, ఫిజిక్స్ లలో అంతతక్కువ మార్కులు వచ్చాయంటే.. ఆమే కాదు, ఆమె స్నేహితురాళ్ళు, క్లాస్‌మేట్స్ కూడా నమ్మలేకపోతున్నారు. నీహారిక గురించి బాగా ఎరిగున్న టీచర్స్ సైతం విభ్రాంతికి గురయ్యారు.

నీహారిక కుదేలయిపోయింది. అనూహ్యమైన ఆ పరిస్థితిని తట్టుకోలేక మానసికంగా కృంగిపోయింది. తిండి తినడంలేదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు. గదిలోంచి బయటకు రావడంలేదు.

“పరీక్షాపత్రాలను దిద్దడానికి తగినంత సిబ్బంది లేక, కాంట్రాక్ట్ మీద బయటనుండి అన్-ట్రెయిన్డ్ వ్యక్తులను తీసుకువచ్చి చేయించారట. ఫలితాల విడుదలలో జాప్యానికి కారణం కూడా అదేనట” చెప్పాడు నీహారిక తండ్రి. “పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారంతా”.

“పోనీలే, సప్లిమెంటు ఎగ్జామ్ రాద్దువుగాని. ఈ మాత్రానికే బెంగపడి డీలాపడిపోకు” అంటూ కూతుర్ని ఓదార్చింది తల్లి.

ఎవరు, ఎన్నివిధాలుగా ఓదార్చజూచినా నీహారిక మనసు కుదుటపడడంలేదు. చదువు మొదలుపెట్టాక అంతటి ఘోరమైన ఫలితాలు ఎప్పుడూ చవిచూడలేదు తాను.. ఇంటర్ పరీక్షలు చాలా బాగా రాసింది. నిజానికి మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్‌లో ఫుల్ మార్క్స్ ఎదురుచూసింది. అంత ఘోరంగా ఫెయిలవుతుందని ఊహలో కూడా అనుకోలేదు. మనసును ఏవిధంగానూ సరిపెట్టుకోలేకపోతోంది. ఐ.ఐ.టి.లో చేరి రిసెర్చ్ చేయాలనుకున్న ఆమె కలలు సమూలంగా కూలిపోయాయి.

బయట ముఖం చూపించడానికి మనస్కరించడంలేదు నీహారికకు. తనలోతానే కుమిలిపోయింది. జీవితం పైన విరక్తి కలుగుతోంది. ఫలితంగా, ఓ బలహీనక్షణంలో ఆత్మహత్య చేసుకోవాలన్న నిశ్చయానికి వచ్చేసింది!..

ఆ రాత్రి మౌనంగా రెండు మెతుకులు కతికి లేచింది నీహారిక. తల్లి ఏదో అంటే, అన్యమనస్కంగానే జవాబిచ్చింది. ఆ పిల్ల మది పెనుతుఫానుకు గురయిన సముద్రంలా ఉంది. తన గదికి వెళ్ళి లోపల గెడ పెట్టుకుంది.

అమ్మ, నాన్న నిద్రపోయేంతవరకు వేచియుండాలనుకుంది నీహారిక. ఆమె వదనంలో దృఢనిశ్చయం స్పష్టంగా ద్యోతకమవుతోంది. ఒంటిగంటకు.. ముహూర్తం పెట్టుకుంది, ఈ లోకానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పడానికి. అమ్మ-నాన్నలకు క్షమాపణలు చెప్పుకుంటూ ‘ఆఖరు ఉత్తరం’ రాసిపెట్టింది. అనంతరం ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది..

గడియారం ఒంటిగంట కొట్టడంతో త్రుళ్ళిపడింది. గదిలో వెలుగుతూన్న నైట్ ల్యాంప్ కాంతివిహీనంగా ఉంది. బెడ్ మీంచి లేచి నిలుచుంది నీహారిక. ఓసారి గదంతా చూసుకుంది. మూలనున్న ముక్కాలిపీటను తెచ్చి గదిమధ్యనున్న సీలింగ్ ఫ్యాన్ క్రింద ఉంచింది. చున్నీని ఫ్యాన్‌కి బిగించి ఉరి వేసుకోవాలన్న ఆలోచన!

దిట్టంగా వుండే చున్నీకోసం వెదుకుతూంటే, నేలపైన కాళ్ళకు ఏదో తగిలి ముందుకు తూలిందామె. క్రిందకు వంగి దాన్ని తీసి చూసింది. ఫ్యామిలీ ఫొటో ఆల్బమ్!

ఆ రోజు అదే ఊళ్ళో ఉంటూన్న నీహారిక పిన్ని వచ్చింది చూడ్డానికని. పిన్నికూతురు మీనాకి అయిదేళ్ళుంటాయి. హుషారయిన పిల్ల. ‘అక్కా!” అంటూ నీహారికను వదలదు. నీహారిక గదిలో దూరి, అక్క కొత్తగా ఏమేమి ఫ్యాన్సీ వస్తువులు కొనుక్కుందోనని ఆమె డ్రెస్సింగ్ టేబుల్ ని రెయిడ్ చేస్తుంటుంది.. ఆరోజు ఇల్లంతా చక్కబెడుతూ ఎక్కణ్ణించి తీసిందో, ఫొటో ఆల్బం తీసింది. దానితో నీహారిక గదికి వెళ్ళింది. అప్పుడు ఆమె ముసుగుతన్ని నిద్రపోతోంది. మీనా అక్కడే కూర్చుని ఆల్బమ్ తిరగేసింది. కాసేపటి తరువాత దాన్ని వదిలేసి, డ్రెస్సింగ్ టేబుల్ మీద పడింది. అక్క మేకప్ సామాగ్రిని ఒక్కొక్కటే తీసి పరిశీలించింది. క్రీమ్ రాసుకుంది. పౌడర్ పూసుకుంది. పెదాలకు లిప్ స్టిక్ పూసుకుంది. నెయిల్ పాలిష్ తీసి గోళ్ళకు రంగు వేసుకుంది.. నీహారిక లేవకపోవడంతో తల్లి దగ్గరకు పరుగెత్తింది.

ఆ ఆల్బమ్ అక్కడకు ఎలా వచ్చిందా అని విస్తుపోయింది నీహారిక. టేబుల్ పైన పెట్టబోతూ అనాలోచితంగానే దాన్ని తెరచింది..

మొదటి పుటలో ఉన్న ఫొటో మీద పడ్డాయి ఆమె చూపులు.. నీహారిక అమ్మ-నాన్నల పెళ్ళిఫొటో అది. దానివంక ముచ్చటగా చూసింది.. ‘అమ్మ ఎంతందంగా ఉంది! నాన్నకూడా హ్యాండ్సమే..’ అనుకుంటూ, ఆ ఫొటోని ముద్దు పెట్టుకుంది. తనకు అమ్మ అందమే వచ్చిందంటారంతా.

లేత తమలపాకుల వంటి చేతివ్రేళ్ళు ఆల్బమ్ పుటలను త్రిప్పుతూంటే, కలువకన్నులు ఫొటోలను ఆసక్తిగా వీక్షిస్తూంటే, మంచం పైన చతికిలబడింది తనకు తెలియకుండానే.

ఆ ఫొటో– అమ్మ గర్భిణీగా ఉన్నప్పుడు తీసినది. అమ్మలో నిండుదనం తొణికిసలాడుతోంది. ఆ గర్భంలో ఉన్నది తానే నన్న భావవీచిక మదిని తాకి అధరాలు విచ్చుకునేలా చేసింది.

తరువాయి ఫొటో– అమ్మకు శ్రీమంతం చేస్తున్నప్పటిది. పెళ్ళిఫొటోలో అమాయకత్వం ఉట్టిపడుతూంటే.. శ్రీమంతపు ఫొటోలో అమ్మ వదనంలో పరిణితి గోచరిస్తోంది. ‘అమ్మ అందాలపోటీకి వెళ్ళుంటే.. తప్పక ‘మిస్ ఇండియా’ నో, ‘మిసెస్ ఇండియా’ నో అయ్యుండేది!’– నవ్వుకుంది నీహారిక.

ఆ ఫొటోలు మెదడుపొరలలో నిక్షిప్తంగా ఉన్న జ్ఞాపకాల తుట్టలను కెలుకుతూంటే.. అవి మనసుకు ఏదో ప్రశాంతతను ఆపాదిస్తూంటే.. అసంకల్పితంగానే ఒక్కో పుటనే త్రిప్పసాగింది.

మరో ఫొటో– తనదే. నెలల పిల్ల. తెల్లగా, ముద్దుగా, బొద్దుగా ఉంది.. కొద్దిసెకన్లపాటు తన పసిప్రాయాన్ని ఆసక్తిగా చూసుకుంది. తరువాతి ఫొటో తనను ఉయ్యాలలో వేసి, నామకరణం చేసినప్పటిది.. నుదుటను పావలాకాసంత సిలాయి బొట్టు. బుగ్గపైన, అరికాళ్ళకు కూడా నల్లటి బొట్లు. చక్కటి పువ్వుల ఫ్రాక్. మెళ్ళో బంగారు గొలుసు. బుల్లివ్రేళ్ళకు ఉంగరాలు.. ఉయ్యాలతొట్టెలో పడుకుని కాళ్ళూ, చేతులూ ఆడిస్తూ బోసినవ్వులు ఒలికిస్తోంది తాను.

ఆ ఫొటోని చూస్తూంటే, లోగడ అమ్మ చెప్పిన సంగతులు మదిలో మెదిలాయి.. ’నీహారిక నాన్నమ్మ పేరు సుబ్బాయమ్మ. శుక్రవారం పుట్టిందని, నీహారికకు నాన్నమ్మ పేరు కలిపి ‘సుబ్బలక్ష్మి’ అని పెట్టాలన్నారంతా. అందుకు నీహారిక తల్లి ససేమిరా అంది. ‘నా చిట్టితల్లి బంగారుబొమ్మ. దానికి పాతచింతకాయ పేర్లు పెడితే ఊరుకోను’ అని పోట్లాడింది. ‘నీహారిక’ అన్న పేరు తానే ఎంపిక చేసింది. ఆ విషయంలో అత్తమామలతో పెద్ద గొడవే అయింది. నీహారిక తండ్రి తటస్థంగా ఉండిపోవడంతో చేసేదిలేక మిన్నకుండిపోయారు వాళ్ళు. అయితే, తమ మాట చెల్లలేదన్న కోపంతో క్రేడిల్ సెరెమనీకి వాళ్ళు రాలేదు’.

‘థాంక్యూ, మమ్మీ!’ అనుకుంది నీహారిక అప్రయత్నంగా.

మరో ఫొటో– తనకు అన్నప్రాశన చేసినప్పటిది.. తన ముందు తినుబండారాలు, దేవుడిపటం, పెన్ను-పుస్తకం, ఇంకా ఏవేవో వస్తువులూ పెట్టారట. తాను ప్రాక్కుంటూ వెళ్ళి ‘పెన్’ తీసిందట!.. ’ నా చిట్టితల్లి చదువుల సరస్వతి అవుతుంది!’ అంటూ తెగమురిసిపోయారట అమ్మ, నాన్నాను.

తనను బళ్ళో వేసినప్పటి ఫొటోలో– స్కూల్ యూనిఫాంలో వీపుకు స్కూల్ బ్యాగ్ తగిలించుకుని క్యూట్ గా ఉంది తాను- టార్టాయిస్‌లా.. ఆ తరువాత, వివిధ తరగతులలో బహుమతులు తెచ్చుకున్నప్పటి ఫొటోలు..

ఓ ఫొటో దగ్గర నీహారిక చూపులు ఆగిపోయాయి. తాను ‘రజస్వల’ అయినప్పటిదది. పట్టుచీరలో, మొగలిరేకులతో అల్లి కుట్టిన జడతో, ఒంటి నిండా ఆభరణాలతో ఎంతో అందంగా వుంది. ‘మినీ మంజుల’ అంటూ నవ్వారంతా. ‘మంజుల’ అమ్మ పేరు.

‘నా తల్లి బంగారుబొమ్మ. దీనికి నా దిష్టే తగిలేటట్టుంది. ఫంక్షన్ అయిపోయాక గుప్పెడు ఎండుమిరపకాయలు, ఉప్పూ తీసిపారేయాలి!’ అంటూ అమ్మ ముఖమంతా ముద్దులతో ముంచెత్తేస్తుంటే, కిసుక్కున నవ్వింది తాను.. నాన్న కూడా, ‘నా చిట్టితల్లి అప్పుడే పెద్దదయిపోయిందా!’ అంటూ నుదుటిమీద ప్రేమగా చుంబిస్తూంటే, కించిత్తు సిగ్గువేసింది.

చూపులు మరో ఫొటో వద్ద ఆగిపోయాయి.. అందులో నాన్న బోడిగుండుతో ఉన్నారు. అది నీహారిక మదిలో మరో ముఖ్యమైన జ్ఞాపకాలతుట్టను రేపింది.. ’ఎనిమిదవ తరగతి చదువుతూండగా చికెన్ గున్యాతో మంచం పట్టింది తాను. చాలా సీరియస్ అయిపోయింది. అప్పుడు ఇలవేల్పయిన ఏడుకొండలవాడికి అమ్మ ముడుపు కట్టింది. నాన్న తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నారు.. బెంగతో చిక్కి సగమయిపోయారిద్దరూ. మూణ్ణెల్ల తరువాత కోలుకుంది తాను. నాన్న వెంటనే తిరుపతి వెళ్ళి హుండీలో ముడుపులు వేసి, మొక్కులు తీర్చుకుని వచ్చారు. ఎప్పుడూ దువ్వెన జేబులో పెట్టుకుని పదిసార్లు క్రాపు దువ్వుకునే నాన్న అలా గుండు కొట్టించుకోవడం విశేషమే!’

అలాగే, మరో మరువలేని జ్ఞాపకం – ఇంకో ఫొటోతో.. ఆ ఫొటోలో అమ్మ చేతికి మట్టిగాజులు ఉన్నాయి. ఎప్పుడూ బంగారుగాజులే తొడిగేది తాను. తనకు పదవ తరగతి పరీక్ష ఫీజు కట్టడానికి సొమ్ము సర్దుబాటు కాలేదని, చేతిగాజులు తీసిచ్చేసింది. నాన్న సంశయిస్తూంటే, ‘పిల్ల చదువు కంటే ముఖ్యంకావివి. తరువాత మళ్ళీ అమర్చుకోవచ్చును’ అంది. వాటిని అమ్మి ఫీజులు కట్టేసారు. ఇప్పటికీ మట్టిగాజులే అమ్మచేతుల్ని అలరిస్తున్నాయి.

అది ఆల్బమ్ కాదు- ‘జ్ఞాపకాల పొదరిల్లు’! దాన్ని తిరగేస్తూంటే.. జ్ఞాపకాలు తరంగాలుగా ఎగిసిపడుతూంటే.. నీహారిక మదిలో హఠాత్తుగా ఏదో కదలిక! ఇదమిద్ధమని తెలియని భావన.. అలజడి..

‘అనుక్షణమూ తన సుఖంకోసం, తన బంగారు భవిష్యత్తుకోసం తపించిపోతూ.. తమ సుఖాలను మానుకుని, తానే లోకంగా జీవించే.. అమ్మ-నాన్నలు.. తాను లేకపోతే ఉండగలరా!?’ అన్న భావవీచిక ఆమె మదిని బలంగా తాకింది. ‘అసలు ఆ ఆలోచననే భరించగలరా? ఆత్మహత్య చేసుకుని తన దారి తాను చూసుకుంటే.. వారు ఏమైపోతారు? జీవితాంతం తన తలపులతో నరకం అనుభవిస్తూ జీవచ్ఛవాల్లా మనవలసిందేనా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పదిహేడేళ్ళపాటు అపురూపంగా పెంచి పోషించుకున్న బిడ్డే పోయాక.. తమ జీవితాలకిక అర్థం ఏమిటనుకుని.. వారూ తన మార్గమే అనుసరిస్తేనో..!?’

గుండె ఝళ్ళుమంది ఆ పిల్లకు. ముఖం చేతుల్లో కప్పుకుని భోరున ఏడ్చేసింది.

కేవలం పరీక్షలో మార్కులు తగ్గాయని తనువు చాలించాలనుకుంటోంది తాను. అది పిరికితనం అవదా? అమ్మ, నాన్నలను పెనుదుఃఖంలో ముంచి తన దారి తాను చూసుకోవాలనుకోవడం.. స్వార్థం కాదా??

పిల్లలకోసం తమ సర్వస్వం ధారబోసే తల్లిదండ్రులను, తమను ప్రేమించే తోబుట్టువులను మరచి.. ఏదో ఒక బలహీన క్షణంలో పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం.. ఎంతవరకు కరెక్ట్? వారి గురించి తల్లిదండ్రులు కన్న కలలు, చేసిన త్యాగాలు, పడిన బాధలు.. అన్నీ వృథా కావా? కన్నవారిని, అయినవారిని జీవచ్ఛవాలలా మిగిల్చి తాము సాధించేదేమిటి?!..

నీహారిక మదిలో సాగరమథనం ఆరంభమయింది.. నిరాశానిస్పృహలకు గురై ఎంత తప్పుగా ఆలోచించింది తాను! మార్కులే జీవితం కాదే! చదువు జీవితంలో ఓ భాగం మాత్రమే. అంతకంటె మిన్న అయినవి– ప్రేమలు, పాశాలు, బంధాలు, అనుబంధాలు, అనురాగాలు, అనుభూతులు..!

‘నో! తాను ఆ తప్పటడుగు వేయదు. అమ్మ-నాన్నల కడుపుకోతకు కారణం అవదు’.

మనసు దిటవుచేసుకున్న నీహారిక, తన కళ్ళు తెరపించిన ఆ ఆల్బమ్‌ని ప్రేమగా నిమురుతూ ముద్దు పెట్టుకుంది. దాని ద్వారా భగవంతుడే తనకు జ్ఞానోదయం చేసాడనుకుంది.

‘తనలా తొందరపాటుకు గురయ్యే ఇతర పిల్లలు కూడా ఓ క్షణం ఆగి, తమవారి గురించి ఆలోచిస్తే ఎంత బావుణ్ణు!’ అనిపించింది.

ఆల్బమ్‌ని పక్కను పెట్టి లేచింది నీహారిక. స్టూల్ ని యథాస్థానంలో పెట్టేసింది. మెళ్ళోని చున్నీని తీసి విసిరేసింది. టేబుల్ మీదుంచిన సూయిసైడ్ లెటర్‌ని చింపి ముక్కలు చేసి చెత్తబుట్టలో పడేసింది. ‘సారీ..అమ్మా, నాన్నా!’ అనుకుంది, తేలికగా ఊపిరి పీల్చుకుంటూ.

అంతలో గడియారం మూడు కొట్టింది. అదే సమయంలో పక్కింట్లోంచి హఠాత్తుగా ఏడ్పులు వినిపించాయి. ‘ఏమయిందా?’ అని కంగారుపడుతూ గదిలోంచి బైటకు పరుగెత్తింది. అప్పుడే హాల్లోకి వచ్చారు ఆమె తల్లిదండ్రులు. అంతా కలసి పక్కింటి వైపు వెళ్ళారు.

దీపక్ తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు!

‘మమ్మీ.. డాడీ! నన్ను క్షమించండి..ఈ లైఫ్ నాకు నచ్చడంలేదు. అందుకే..’ – అని ఉత్తరం రాసిపెట్టాడు.

గుండెలు అవిసేలా ఏడ్చారు దీపక్ తల్లిదండ్రులు. తల్లి గుప్పెడు నిద్రమాత్రలు మ్రింగేసింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

నీహారిక నిశ్చేష్ఠురాలయింది. ‘అక్కా!’ అంటూ నోరారా పిలిచే దీపక్‌ని ఆ స్థితిలో చూస్తూంటే దుఃఖం ముంచుకువచ్చింది.. ఆ పిల్ల మనసంతా కకావికలమయిపోయింది.. ’తాను పోయుంటే అమ్మ-నాన్నలు కూడా అలాగే ఏడ్చేవారా? అమ్మ కూడా దీపక్ మమ్మీలాగే ఆత్మహత్యకు పాల్పడేదా??..’ ఆమె హృదయం ద్రవించిపోయింది..

ఇక కొసమెరుపుకు వస్తే–

ఇంటర్ పరీక్షాఫలితాలు వెలువడ్డాక పదుల సంఖ్యలో విద్యార్థీవిద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. పరీక్షాపత్రాల కరెక్షన్‌లో ఘోరమైన అవకతవకలు జరిగాయంటూ విద్యార్థి సంఘాలు రోడ్డు ఎక్కాయి. తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.. చివరికి ఇంటర్ బోర్డ్ ఆవిషయాన్ని నిస్సిగ్గుగా ఒప్పుకుని, ‘రీ-వాల్యుయేషన్’కి పూనుకుంది. ఫలితంగా ఎందరో విద్యార్థులు – ఆత్మహత్య చేసుకున్నవారిలో కొందరితో సహా – ఉత్తీర్ణులు కావడం విశేషం! అంతేకాదు, నీహారిక మార్కులు కంప్యుటేషన్‌లో తల్లక్రిందులయినట్లు తేలింది. ఆమెకు మ్యాథ్స్ లో 94, ఫిజిక్స్ లో 92 మార్కులు వచ్చాయి!!

అయితే, ప్రజల మనసులలో తేలుకొండెలా గ్రుచ్చుకుంటూన్న ప్రశ్న ఒక్కటే – ‘అన్యాయంగా బలయిపోయిన పసివాళ్ళ మరణాలకు బాధ్యులెవరు..!?’

Exit mobile version