Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞాపకాల తరంగిణి-74

నెల్లూరు జిల్లా కన్నియంపాడు గ్రామంలో మనసు ఫౌండేషన్ కొనసాగిస్తున్న స్కానింగ్ కార్యక్రమం

ఆంధ్ర పత్రిక దినపత్రిక విజయవాడ భవనాలను మా నెల్లూరు సంపన్నులు, కాంట్రాక్టర్‍లు ఖరీదు చేశారు. ఆ భవనమంతా ఆంద్ర దినపత్రిక, వారపత్రిక, భారతి సంపుటాలు, గ్రంథాలయం, రెవ్యూకి వచ్చిన పుస్తకాలు ఇట్లా పెద్ద గ్రంథాలయం ఉండేది. మొదట దాసరి నారాయణరావు గారు ఆంధ్ర పత్రిక భవనాలను ఖరీదు చేసి అక్కడ ‘ఉదయం’ దినపత్రికను కొన్నేళ్ళు నిర్వహించారు. ఆ విధంగా ‘ఉదయం’ దినపత్రిక సంపుటాలు అక్కడ stock చేయబడ్డాయి. ఆ భవనాన్ని ఖాళీ చేస్తూ, మా నెల్లూరు సంపన్న కుటుంబం ఆ మొత్తం గ్రంథ సంపదను నెల్లూరుకు ఉత్తరంగా ట్రంకు రోడ్డు సమీపంలో తాము నిర్వహించి మూసి వేసిన పరిశ్రమ భవన సముదాయంలో నిరుపయోగంగా పడి ఉన్న చిన్న మేడలో తెచ్చి పెట్టారు.

నెల్లూరుకు 10 మైళ్ళ దూరంలో వివిక్త ప్రదేశంలో పుస్తకాలు ఉంచిన ఇల్లు.

 

పుస్తకాలు

పుస్తకాలు

డా. ఎం. వి. రాయుడి గారికి ఈ సమాచారం తెలియగానే ఆ పారిశ్రామికవేత్తలను సంప్రదించి, ఆ గ్రంథాలను స్కాన్ చేసుకోవడానికి అనుమతి తీసుకుని, ఆ పనిని నెల్లూరులో పర్యవేక్షించమని నన్ను కోరారు. నెల్లూరు పారిశ్రామికవేత్తల వద్ద ఒక ఫ్యాక్టరీ మేనేజరు హోదాలో పని చేస్తున్న నా పూర్వ విద్యార్థి ‘బలరామరెడ్డి’ (బల్లయ్య అని మేము అధ్యాపకులం వ్యవహరించేది) సహకారం కోరగానే అతడు నెల్లూరులో నాకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాడు. రాయుడు గారు పంపిన ఉద్యోగులు, నేను, నా మిత్రుడు రసూల్ అందరం ఆ సరస్వతీ భాండాగారం తాళాలు తెరిపించి పుస్తకాలు తరలించే పనికి పూనుకొన్నాము.

వేల పుస్తకాలు, పత్రికలు – రెండు రోజులు శ్రమపడి కట్టలు కట్టి తరలించడానికి సిద్ధం చేశాము. ఆ నిర్జన ప్రదేశంలో మూతపడిన ఫ్యాక్టరీ భవనంలో, బందికానాలో ఉన్నట్లున్న ఆ పుస్తకాలను, మాకు ముఖ్యమని ఆ క్షణంలో తోచినవాటిని కట్టలు కట్టాము. మాకు ముందుచూపు లేకుండా పోయింది. సుమారు నాలుగు టన్నుల బరువును మోసే మినీ లారీని తెప్పించి, రెండవ రోజు సాయంత్రానికి పుస్తకాల కట్టలను లారీ కెక్కించి, బెంగుళూరు పంపించము. దోవలో చెక్ పోస్టు అధికారుల బెడద లేకుండా తగిన ఏర్పాట్లు అన్నీ స్వయంగా చూశాను.

రెండో విడత మిగిలిన పుస్తకాలు తరలించే కార్యక్రమం వెంటనే సాధ్యం కాలేదు. ఈ వ్యవధిలో మిగిలినవి చెల్లాచెదురయిపోయాయి. రాయుడు గారు తెలుగు పుస్తకాల స్కానింగ్ కార్యక్రమానికి మొట్టమొదట ఈ విధంగా ముడిసరుకు సమకూర్చటంలో ‘నేను సయితం సమిధొనొక్కటి’ అర్పించాను. 2018 వరకు మనసు ఫౌండేషన్ పుస్తకాల కార్యక్రమం బెంగుళూరులో సాగింది.

2018 మార్చ్ 14న రాయుడు గారు నెల్లూరు జిల్లా వాయువ్య సరిహద్దులో పామూరుకు పది కిలోమీటర్ల దూరంలోని కన్నియంపాడు గ్రామ పొలిమేరల్లోని తన ఫాం హౌస్‌లో స్వర్గీయ కారా మాస్టారు చేతుల మీదుగా స్కానింగ్ సెంటర్‍ని ప్రారంభించారు.

కారాగారు ప్రారంభిస్తున్నారు

ఆ రోజు పదుగురు సాహితీ బంధువులు అక్కడ చేరారు. ప్రొఫెసర్ కేతు విశ్వనాథరెడ్డి దంపతులు, డా. కడియాల రామ్‍మోహనరాయ్ దంపతులు ఇంకా అనేకులు.

ఆవిష్కరణ రోజు కారా మాస్టారు తో 1 డాక్టర్ మన్నం చంద్ర మౌళి 2. డాక్టర్ కడియాల రామమోహనరాయ్, 3 ప్రొఫెసర్ కేతు విశ్వనాథ రెడ్డి 4.డాక్టర్ మన్నం రాయుడు 5 డాక్టర్ కాళిదాసు పురుషోత్తం 6.కారా మాస్టారు, కారా మాస్టారు కుమారుడు.

స్థానిక గ్రామీణ యువతులకు పుస్తకాల స్కానింగ్‌లో శిక్షణ ఇప్పింది వారి చేత ఆ కార్యక్రమం అమలు చేశారు. రోజూ ఆ యువతులకు ఉదయం కాఫీ ఫలహారాలు, మధ్యాహ్న భోజనం అన్నీ ఉచితంగానే సరఫరా చేస్తారు జీతం కాక.

జపాను నుంచి దిగుమతి చేయబడ్డ ఏడు A3 సైజు స్కానింగ్ యంత్రాలు నెలకొల్పబడ్డాయి. మొదట మొదట సెంటర్‌కు వచ్చిన తెలుగు అచ్చు పుస్తకాలు ఏవైనా సరే ముందు స్కాన్ చేసి పడేసేవారు. ఇప్పుడు స్కాన్ అయిన పుస్తకాల వివరాలు, data digitize చేశారు. ఒక పుస్తకం తొలి ప్రచురణకు ప్రాముఖ్యత ఇస్తారు. లభించకపోతే ఎన్నో ప్రచురణనైనా స్కానింగ్ చేస్తారు.

పుస్తకాలు స్కానింగ్ చేసేందుకు నిర్దుష్టమైన విధి విధానాలు తయారయ్యాయి. పుస్తకాన్ని రిజిస్టరులోకి ఎక్కించడం, పుస్తకాన్ని శుభ్రం చెయ్యడం, అన్ని పేజీలు ఉన్నాయా అని పరిశీలించి, నంబరు వెయ్యడం, స్కాన్ చేసిన తరువాత అన్ని పుటలు స్కాన్ అయ్యాయని నిర్ధారించుకోవడం, కుట్లు విప్పిన గ్రంథాన్ని యథారూపంగా బైండ్ చేయడం, స్కాన్ చేసిన కాపీని శుభ్రం చేసి, ఫోటో‌షాప్ చేసి, పిడిఎఫ్‍ లోకి మార్చడం ఇదొక నిర్దుష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. చాలా శ్రద్ధగా, కమిట్‍మెంట్‍తో నిర్వహించే ప్రక్రియ. ఇటువంటి పనులకు యువతులే బాగా పనికివస్తారని, శ్రద్ధగా చేస్తారని, కన్నియంపాడు చుట్టుపట్ల నివసించే గ్రామీణ యువతనే ఎంపిక చేసుకొని నియమించడం జరిగింది. కొందరు ఇంజనీరింగ్ చదివిన వారు, కొందరు బిఎస్‍సి, ఇట్లా అందరూ విద్యావంతులైన యువతులే. ఎవరైనా వివాహం వంటి కారణాల వల్ల వెళ్ళిపోయినా, వారి స్థానంలో స్థానికులొకరిని తీసుకుంటారు. స్కానింగ్ సెంటర్ సాయంత్రం 5 గంటలకు మూసి వేస్తారు. రాత్రి ఎవరూ ఉండరు, వాచ్‌మన్‍లు తప్ప.

స్కానింగ్ సెంటర్ యువతులతో రాయుడు గారు, ఇతరులు

కన్నియంపాడు ఫాం హౌస్‍లో రాయుడు గారు తమ ఊహల ప్రకారం ఒక చిన్న సినిమా హాలంత భవనం, క్రింద పైనా, ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 మంది అతిథులు వచ్చినా అక్కడ సుఖంగా ఉండవచ్చు.

రాయుడు గారు, మనసు ఫౌండేషన్ ప్రచురణలు

రాయుడు గారు, వారి సోదరులు, బంధువర్గం అంతా సంక్రాంతికి అక్కడ చేర్తారు. మిత్రులు కూడా వస్తారు. రాయుడి గారి తండ్రి స్వర్గీయ నరసింహం గారి విగ్రహాన్ని ఫాం హౌస్ ప్రవేశ ద్వారంలో నెలకొల్పారు. కవులు, రచయితలు, ఆయా రంగాల్లో విశిష్ట కృషి చేసిన పెద్దలు అంతా చేర్తారు. కోలాహలంగా, సరదగా ఉంటాయి  ఆ సమావేశాలు.

రాయుడు గారి తండ్రి విగ్రహం

నేను కనీసం అరడజను సార్లు రాయుడిగారితో పాటు కన్నియంపాడులో ఉన్నాను. చాలా సంతోషంగా గడిచిపోయాయి ఆ సమావేశాలు.

కన్నియంపాడు స్కానింగ్ సెంటర్‍లో స్కాన్ అయిన పుస్తకాల డిజిటల్ కాపీలు బెంగుళూరులో, గుంటూరులో, శ్రీకాకుళం కథానియలయంలో నిలువ చేస్తున్నారు. ఎవరికి ఏ పుస్తకం అవరసమైనా, కాపీరైటు గడువు expire అయిన పుస్తకాలను మనసు ఫౌండేషన్ పంపుతుంది. శిథిలమవుతున్న, మళ్ళీ లభించని అచ్చు పుస్తకాల నన్నింటినీ స్కాన్ చేసే కార్యక్రమం, కోవిడ్ వ్యాధి సమయంలో కొంత మందగించినా, నిరంతరాయంగా సాగిపోతూంది. ఇందుకు అవసరమైన ధనం కూడా మనసు ఫౌండేషన్ సమకూరుస్తోంది తప్ప, ఎవరి వద్ద విరాళాలు స్వీకరించదు.

ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు నిరాసక్తంగా దేన్నీ పట్టించుకోని సందర్భంలో మనసు ఫౌండేషన్ సంస్థ మన వారసత్వ సంపదను భద్రపరిచే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. తెలుగు భాషాభిమానులు, తెలుగు ప్రజలు ఈ గొప్ప కార్యాన్ని చేపట్టిన మనసు ఫౌండేషన్‌కు కృతజ్ఞతాబద్ధులై ఉంటారు.

(ఫోటోలు: డా. కాళిదాసు పురుషోత్తం)

Exit mobile version