Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞాపకాల తరంగిణి-75

1970-80లలో నెల్లూరులో సాంస్కృతిక వాతావరణం

నెల్లూరులో అభ్యుదయ వేదిక పేరుతో ఒక సంస్థను 1979 ప్రాంతంలో ప్రారంభించాము. వి.ఆర్ కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకులు మందపాటి పట్టాభిరామారెడ్డి గారు దీనికి ప్రేరణ. తొలుత సామాజిక అంశాలు, అశ్లీల సినిమాలు, అశ్లీల సినిమా పోస్టర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాము. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఇందులో అభ్యుదయ భావాలున్న అన్నిరకాల వామపక్ష వ్యక్తులు సభ్యులు. అప్పటికే సిపిఎం, ఎంఎల్ గ్రూపుల మధ్య సంబంధాలు బెడిశాయి. నేను లెఫ్టు టు లెఫ్ట్ భావజాలం వైపు మొగ్గి ఉన్నా. 1977లో బీహార్లో బెల్చి అనే గ్రామంలో భూస్వాములు తొమ్మిది మంది దళితుల్ని కాల్చిచంపారు. పిప్రాలోనూ ఇటువంటివే మానభంగాలు జరిగాయి. ఇవన్నీ మామూలే కానీ ఈ మారు పత్రికలలో వార్తలు రావడంతో దేశం అట్టుడిపోయింది. అభ్యుదయ వేదిక ఇటువంటి తీవ్రమైన అంశాలపై స్పందించకపోవడం చాలా బాధ కలిగి, నా అభిప్రాయం మిత్రుల వద్ద వ్యక్తపరచాను. నేనలా అభిప్రాయం వ్యక్తపరిచినందుకు అభ్యుదయ వేదిక నన్ను సంజాయిషీ అడిగింది. వేదిక స్వచ్ఛంద సంస్థ, పార్టీ కాదు అని సమాధానమిచ్చి దానినుంచి బయటికి వచ్చాను. నాతోపాటు జమీన్ రైతు ఉపసంపాదకులు, నా మిత్రులు స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ కూడా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ అనుభవంతో నేను అభ్యుదయ శక్తులకు సహకరించానే కానీ ఎన్నడూ ఎందులోనూ సభ్యత్వం తీసుకోలేదు. అందుకే కెవిఆర్ నన్ను ‘భావబంధు’వని అనేవారు.

స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ

ఆ రోజుల్లో నెల్లూరులో డాక్టర్ రాజగోపాలరెడ్డి గారు, ప్రభుత్వ బిఇడి కళాశాలలో హిందీ అధ్యాపకులు, పసల భీమన్న, వెంకటేశ్వరరావు, మార్కండేయులు, హేతువాదసంఘంలో ప్రముఖులు. 1973లోనో ఆ తర్వాతనో శ్రీలంక నుంచి నెల్లూరు వచ్చి డాక్టర్ కోవూర్ నెల్లూరులో అనర్గళంగా ఉపన్యసించారు. నెల్లూరు పురమందిరం పట్టలేదు. నగరంలో అదొక చారిత్రక సంఘటనగా గుర్తుండిపోయింది. కోవూరు గారి ఉపన్యాసం తరువాతనే 1979లో బియిడి కాలేజి హిందీ లెక్చరర్ పసల భీమన్న, (వీరిది తూర్పుగోదావరి జిల్లా.) వీరికి తోడు మార్కండేయులు, వెంకటేశ్వరరావు మరికొంతమంది హేతువాదులు బహుశా నెల్లూరులో హేతువాద ఉద్యమం 1979-84 మధ్య చాలా ముమ్మరంగా నిర్వహించారు. నేను ఆ సంఘంలో సభ్యుణ్ణి కాకపోయినా వారందరు నాకు మంచి మిత్రులు. వారి కార్యక్రమాలకు హాజరయ్యేవాణ్ణి. నిప్పుల గుండం తొక్కడం, మహిమలు, అతీతశక్తులు లేవని నిరూపించే ప్రదర్శనలు వగైరా కార్యక్రమాలు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. నెల్లూరు సాంస్కృతిక చరిత్రలో, నా జీవితంలో వర్ధమాన సమాజం, యువభారతి, అభ్యుదయ వేదిక, హేతువాద సంఘం, ప్రోగ్రెసివ్ ఫిల్మ్ అసోసియేషన్, నెల్లూరు కెమెరా క్లబ్, మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. ప్రముఖంగా అనిపిస్తాయి.

1964 ప్రాంతంలో నెల్లూరులో సాంస్కృతిక కార్యక్రమాలకోసం పెన్నేపల్లి గోపాలకృష్ణ, వి.ఆర్.సి. తెలుగు అధ్యాపకులు మద్దూరి సుబ్బారెడ్డి, యూత్ కాంగ్రెస్ వారపత్రిక ప్రచురణకర్త ఎల్.వి.కె మొదలైన వారు సభ్యులుగా యువభారతి సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ఐదారేళ్ళు దేదీప్యమానంగా ఒక వెలుగు వెలిగింది. చిట్టిబాబు, బాలచందర్, వంటి విద్వాంసుల కచేరీలు, సినిమా నటులు టివి. రమణారెడ్డి మ్యాజిక్ ప్రదర్శనలు వంటి వైవిధ్యం ఉన్న ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. ఈ సంస్థ సలహాదారు ఆ రోజుల్లో వి.ఆర్.కళాశాల ఆఫీసు మేనేజర్.గా పనిచేసే టి.వి.రమణారెడ్డి అనే గొప్ప cultured man. ఆయన పేరుకు కాలేజీ మేనేజరే కాని మొత్తం కాలేజీ విద్యార్థులు అందరూ ఆయనంటే విపరీతమైన గౌరవం ప్రదర్శించేవారు. ఆయనకు నాటక ప్రదర్శనల్లో నైపుణ్యం ఉంది. చక్కగా పాడేవారు. పిల్లలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయంగా ఉండేవారు. తెల్లటి హాఫ్ షర్ట్, తెల్లని ధోవతి కోడిపిల్లల తల్లిలా చుట్టూతా విద్యార్థులు. కమిటీ ఏదో కారణం వల్ల ఆయనకు మేనేజర్ బాధ్యతలు అప్పగించకుండా మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించింది. అందువల్ల ఆయన స్వచ్ఛందంగా విద్యార్థుల యోగక్షేమాలు చూడడమే తన బాధ్యతగా స్వీకరించారు.

నెల్లూరులో బిఇడి కాలేజీ లో హిందీ లెక్చరర్ పసల భీమన్న, వారి శ్రీమతి. భీమన్న విద్యాశాఖలో డెప్యూటీ డైరెక్టర్ చేసి పదవీవిరమణ చేశారు.

ఆ రోజుల్లో విఆర్. కళాశాల సాంస్కృతిక ఉత్సవాలు నెల్లూరు నగరానికే ఒక ఆకర్షణ. సాంస్కృతికోత్సవాలు చూడడానికి నెల్లూరు పౌరులు కూడా ఎగబడేవారు. ఏ పార్టీ విద్యార్థి సంఘమైనా సాంస్కృతిక ఉత్సవాలను ఆయన సలహాల ప్రకారమే నిర్వహించేది. నాటికల పోటీలో పాల్గొనే బృందాలు ముందు ఆయన ముందు ప్రదర్శించి ఆయన సలహాలను తీసుకొనేవారు.

రమణారెడ్డి గారికి పిల్లలు లేరు. పెన్షన్ తప్ప వేరే ఆదాయం లేదు. పూర్వవిద్యార్థులు రమణారెడ్డి గారి షష్టిపూర్తి నెల్లూరు టౌన్ హాల్లో అపూర్వంగా జరిపి ఏభైవేలు పర్సు బహూకరించారు. రమణారెడ్డి గారికి పిల్లలు లేరు. ఆయన పదవీవిరమణ తర్వాత విశ్రాంత జీవితం చాలా సంతోషంగా గడచిపోయింది.

విఆర్. కాలేజీ మేనేజర్ గా చేసిన టి.వి.రమణారెడ్డి గారి షష్టిపూర్తి సభలో పెన్నేపల్లి గోపాలకృష్ణ సన్మానపత్రం సమర్పిస్తూ

నెల్లూరులో ఏటా పోస్టల్, టెలిగ్రాఫ్, టెలిఫోన్ శాఖ సాస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేది. క్రీడల పోటీలు వి.ఆర్.కళాశాల మైదానంలో, సాంస్కృతిక కార్యక్రమాలు నెల్లూరు టౌన్ హాలులో జరిగేవి. మా చిన్న అక్క భర్త ఎస్.ఎల్. నరసింహం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని నాటికల ప్రదర్శనలో, లలిత సంగీతంలో, జానపద సంగీత పోటీల్లో బహుమతులు సాధించేవారు. ఆ రోజుల్లో ఈ ప్రదర్శనలు కూడా నెల్లూరు ప్రజలకు గొప్ప వినోదం. పోస్టల్ శాఖ క్రీడల పోటీల్లో నాటకరాణి శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి అన్ని పోటీల్లో బహుమతులు సంపాదించి టౌన్‌లో పెద్ద హీరోల్లాగా ప్రసిద్ధులయ్యారు.

రచయిత బావగారు ఎస్.ఎల్.నరసింహం అక్క కమలమ్మ

మా బావగారు ‘వరూధిని ప్రవరాఖ్యం’ పేరుతో 15 నిమిషాల ప్రదర్శన- మోనో యాక్షన్ చేసేవారు. ఆయనకు ఆ ప్రదర్శన చాలా పేరు తెచ్చింది. జానపదులు ప్రదర్శించే గంగాగౌరి సంవాదం విధానంలో సగం ముఖానికి ప్రవరుడి వేషం, సగం ముఖానికి వరూధిని మేకప్ వేసుకుని తెర అటూఇటూ లాగుతూ సంభాషణలు, పద్యాలు చది వేవారు. మా బావగారు పిల్లల భవిష్యత్ కోసం సీనియారిటీని వదులుకొని తిరుపతిలో పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ వద్ద పబ్లిక్ రిలేషన్స్ ఇన్‍స్పెక్టర్‌గా చాలా ఏళ్ళు చేశారు. పెద్దబ్బాయి డాక్టర్ అయి సైన్యంలో చేరాడు. మిగతా పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేశారు. తిరుపతిలో ఉన్నపుడే దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో వెలువడిన ‘మామగారు’ సినిమాలో ముఖ్యమైన పాత్ర మామగారు పాత్ర ధరించారు. ఆ సినిమా విజయం సాధించింది. తర్వాత సినిమాలలో అవకాశాలు వచ్చినా ఆయన పిల్లల భవిష్యత్తు కోసం సినిమా అవకాశాలు వదులుకొన్నారు.

‘మామగారు’ సినిమాలో మామగారు పాత్రలో ఎస్. ఎల్.

విశ్రాంత జీవితంలో ఆయన వెంకటగిరి రాజా డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర గేయధార వ్యాఖ్యాతగా ఢిల్లీ నుంచి మద్రాసు వరకు వందల ప్రదర్శనల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తర్వాత సాయిభక్తులై భజనగీతాలు పాడారు, రాశారు. ఆ గేయాలు రికార్డులుగా విడుదలయ్యాయి కూడా. బావగారు నిండు జీవితం గడిపి 92వ ఏట స్వర్గస్థులయ్యారు.

Exit mobile version