[శ్రీమతి చెంగల్వల కామేశ్వరి గారి ‘జ్ఞాపకాలే జీవితం’ పుస్తకానికి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రాసిన ముందుమాటని పుస్తక పరిచయంగా అందిస్తున్నాము.]
“ప్రతి మనిషి జీవితం ఒక సుదీర్ఘమైన పుస్తకం. ఒక్కో పుటా ఒక్కో అనుభవానికి సాక్ష్యం.”
మనిషి జీవితంలో అమ్మా, నాన్నా, అన్నా, చెల్లి, తమ్ముడు, అక్క, భర్త, లేదా భార్య పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇదంతా ఒక పెద్ద చైన్.. ఈ పెద్ద గొలుసులో ఏ ఒక్క లింక్ తెగినా అంతే. అలాగే స్నేహితులు, పరిచయస్తులు, బంధువులు, బాంధవ్యాలు ఇవన్నీ మన వెంట నడిచే బంధాలే. పుట్టి పెరిగిన ఇల్లు, ఊరు, ఈ బంధాలు, ఆటలు, పాటలు, అనుభవాలు, అనుభూతులు, భావోద్వేగాలు, రాగద్వేషాలు వీటన్నిటి సమాహారం జీవితం.
అలాంటి జీవితంలో ఎదురయే అనుభవాలను దగ్గరివారితో భాగం పంచుకోవడం వేరు. అది కేవలం ఆ క్షణంలో కలిగిన భావాన్ని పంచుకోవడం. కానీ అక్షరీకరించడం వేరు. ఎన్నో అనుభూతులు, మరెన్నో అనుభవాలు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఇలా అనేక రకాల భావోద్వేగాలు అక్షరాల్లో నిక్షిప్తం చేసి, పాఠకులకు అందించాలంటే అందమైన భాష ఉండాలి. ఆ భాష అందమైన, రససిద్ధి కలిగించే వాక్యాలు ఉండాలి. అవి చదువుతూ ఉన్నప్పుడు పాఠకుడు ఇలాంటి అనుభవం నాకూ ఎక్కడో ఎదురైంది సుమా అనుకుంటూ నోస్తాల్జియా లోకి వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగే అనుభూతిని కలగచేయగలిగితే ఆ రచయిత సక్సెస్ అయినట్టే.
వ్యక్తిగత అనుభవాలను అక్షరీకరించడం అంటే ఆత్మకథ వ్రాయడం. ఆత్మకథ అందరూ రాయగలరా? రాయగలరు. కానీ అందరి ఆత్మకథా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఆత్మకథ రాయాలంటే సమాజంలో ప్రముఖులు మాత్రమె అయి ఉండాలా? ఒక సాధారణ మానవుడు తన ఆత్మకథ ఎందుకు రాయకూడదు? అబ్దుల్ కలాం, మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా, అంబేద్కర్, మహానటి సావిత్రి, లేదా మరో మహానటుడు ఇలా మహామహులే రాయాలని నిబంధన ఏమీ లేదు. ఎవరి జీవితం ఇతరులకి ఆదర్శప్రాయంగా ఉంటుందో వారంతా రాసుకోవచ్చు.
ప్రతి వారీ జీవితంలో ఎదుటి వారు నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటాయి. ఇది నిజం. జీవితం ఒక పోరాటం అయితే, ప్రతివాళ్ళు ఆ పోరాటం సాగించాల్సిందే, విజయం తప్పకుండా వరిస్తుంది. ఆ విజయంలో అనేక రహస్యాలు నిగూధంగా ఉంటాయి. వాటిని వెలికి తీసుకువచ్చి, స్వీకరించాలి. ఒక్కోరిది ఒక్కో అనుభవం. దాని నుంచి నేర్చుకునే పాఠాలు అనేక రకాలుగా ఉంటాయి. ఎవరికీ ఎలా ఉపయోగపడుతుంది అనేది వారి, వారి వ్యక్తిగత జీవితానుభవాలు, వారు అర్థం చేసుకున్న విధానం ద్వారా తెలుస్తుంది.
ఆత్మకథ అంటే వాస్తవం. ప్రతి సంఘటనా, ప్రతి పాత్రా జీవితానికి సంబంధించినవి అయి ఉండాలి. అందులో కల్పితం కానీ, అభూత కల్పన కానీ ఉంటే అది ఆత్మకథ అవదు. జరిగినవి జరిగినట్టు రాయాలంటే కొంతవరకు సాహసం ఉండాలి.
అందుకే ఆత్మకథ అందరూ రాయలేరు. వైజ్ఞానిక సాహిత్యం వేరు, కాల్పనిక సాహిత్యం వేరు. చరిత్ర వేరు, ఇతిహాసాలు వేరు, ఇలాంటి వ్యక్తిగత కథలు వేరు. దేని ప్రత్యేకత దానిదే. కాల్పనిక సాహిత్యం చదువుతున్నంత సేపూ పాఠకులని చక్కని ఊహల్లో విహరింపచేస్తుంది. ఆ తరవాత మర్చిపోతాం. వైజ్ఞానిక సాహిత్యం జ్ఞానాన్ని పెంపొందించుకోడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని పుస్తకాలు విజ్ఞానాన్ని అందిస్తే, కొన్ని వ్యక్తిత్వం రూపు దిద్దుకోడానికి సాయపడతాయి. ఇలా పుస్తకాలు అనేక రకాలుగా మనలని ప్రభావితం చేస్తాయి. మన జీవితాల మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముద్ర వేస్తాయి.
చెంగల్వల కామేశ్వరిగారి ఈ ‘జ్ఞాపకాలే జీవితం’ అన్న ఆత్మకథ చదివితే, కొందరికి ఇలాంటి అనుభవాలు నాకూ ఉన్నాయి సుమా అనిపిస్తే, మరికొందరికి ఇలాంటి అనుభవాలు నాకూ ఉంటె ఎంత బాగుండేది అనిపిస్తుంది.
తను పుట్టిన ఊరు వడలి పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురం. వాళ్ళ బామ్మ, తాతగారి ఊరు.
ఆ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పెద్ద బంధుబలగం మధ్య పుట్టి పెరిగారు ఆమె. ప్రతి వారికీ ఎన్ని అనుభవాలు ఉన్నా, సమస్త ప్రపంచం పర్యటించినా, కొద్దికాలం అయినా గ్రామీణ జీవన సౌరభం ఆఘ్రాణించాలి. అప్పుడే సంపూర్ణమైన జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది.
ఒక కుటుంబం అంటే ఒక వ్యవస్థ, ఒక్కో వ్యవస్థలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, అలవాట్లు, జీవన విధానం, సంస్కృతీ, ఆహారపు అలవాట్లు ఇలా ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా బ్రాహ్మణుల జీవితంలో ఉండే బహుముఖీన అలవాట్లు, సంస్కృతీ, సంప్రదాయాలు తెలుసుకుంటున్నా కొద్దీ ఆసక్తిగా అనిపిస్తాయి. ప్రతి కుటుంబానికి చరిత్రలో కొన్ని పేజీలు కేటాయించబడి ఉంటాయి. ఆ చరిత్రలో వచ్చే పాత్రలు అమ్మా, నాన్న, అన్నలు, తమ్ముళ్ళు, బాబాయిలు, పెదనాన్నలు, తాతలు, అమ్మమ్మలు, మేనత్తలు, ఇంకా ఎందఱో బంధువులు. రకరకాల స్వభావాలు, మనస్తత్వాలు.. ప్రపంచ సాహిత్యం వివిధ రకాల ఆచారాలు, సంస్కృతీ, సంప్రదాయాలను మనకి తెలియచేస్తుందో అలాగే ఇలాంటి జీవిత గాధలు కూడా మనకి తెలియని కొన్ని విషయాలు తెలియచేప్తాయి.
కామేశ్వరిగారి బాల్య, కౌమారం, యవ్వనం కూడా ఎంతో ఉల్లాసంగా, హాయిగా, ఆహ్లాదంగా సాగిపోయింది. మంచి కుటుంబ వాతావరణంలో పద్దతిగా, క్రమశిక్షణగా పెరిగారు. చదువు మధ్యలో ఆపి వివాహం చేసుకున్నారు. వైవాహిక జీవితంలో కూడా ఆమె ఒక విధంగా చాలాకాలం ఎంతో సుఖంగా, భర్త ప్రేమానురాగాలను అనుభవిస్తూనే బతికారు. ముత్యాల్లాంటి పిల్లలు ఉన్నారు. ప్రతి మనిషీ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర కొంత భాగం ఒడిదుడుకులు ఉంటాయి. అన్నీ సవ్యంగా ఉంటే అది జీవితం ఎలా అవుతుంది? ఆ ఒడిదుడుకులు తట్టుకుని, సమస్యలని తనకి అనువైన విధంగా పరిష్కరించుకుంటూ, ముందుకు సాగడమే జీవనసమరాన్ని ఎదుర్కోవడం. ఆమె కూడా అల్లాగే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పోరాడారు. గెలిచారు. ఈనాడు ఒక రచయిత్రిగా, మహిళామండలి ప్రధాన కార్యదర్శిగా, ఒక యాత్రా నిర్వాహకురాలిగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు కామేశ్వరి గారు.
‘జ్ఞాపకాలే జీవితం’ అనే మకుటం ఈ పుస్తకానికి ఒక విలువ ఆపాదించింది. ఇది నవలా? పెద్ద కథా! ఆత్మకథా! అని అనుమానం కలుగుతుంది. ఆత్మకథ అనగానే ఆసక్తి పోతుంది. అందుకే ఆమె తన ఆత్మకథని, ఒక నవలగా పాఠకులకు ఆసక్తి కలిగించేలా రాసారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ధైర్యంతోపాటు, కొంత తెగింపు ఉంటేనే ఈరోజు ఈ స్థానం పొందడం జరగదు. అలాంటి ఆత్మవిశ్వాసంతో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ ఆమె ఇంకా ముందుకి సాగిపోవాలని అభిలషిస్తూ..
***
రచన: చెంగల్వల కామేశ్వరి
పేజీలు: 161
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్,
కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్: 9000413413
రచయిత్రి:
9849327469
అచ్చంగా తెలుగు బుక్స్:
8558899478 (వాట్సప్ మాత్రమే)
