గుర్తొస్తే.. గుండె ఝల్..!!
ఇప్పుడు కాస్త పరిస్థితులు మారాయి కానీ.. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే తల్లితో పాటు ఇంటిల్లిపాదీ తెగ బాధపడిపోయేవారు. మొదటి సంతానం అసలు ఆడపిల్ల వద్దని కోరుకునేవారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లి, తన భర్త ముఖం చూడాలంటేనే భయకంపితురాలైపోయిన రోజులు. ఆమె అలా భర్త నుండే కాదు, అత్తామామలనుండి ఇతర బంధువర్గాలనుండి కూడా, ఆడపిల్లను కనడం అంటే అదొక నేరంలా భావించిన రోజులవి. ఇక రెండో సంతానం కూడా ఆడపిల్లను కంటే, ఆ కన్నతల్లి అనుభవించే మానసిక క్షోభను వర్ణించలేము. ఇంట్లో వాళ్ళతో పాటు, ఇరుగుపొరుగు నుండి వచ్చే సూటిపోటి మాటలకు మానసికంగా కృంగిపోయే పరిస్థితి ఏర్పడేది. ఆడపిల్ల పుట్టుక సమాజంలో అంత వ్యతిరేకత సంతరించుకోవడానికి కారణాలు అనేకం ఉండచ్చు. కానీ అది జన్మనిచ్చే తల్లికి సంబంధం లేని అంశం. కానీ తల్లిని మాత్రమే టార్గెట్ చేసి యావత్ సమాజమూ ఆమెను గుండెల్లో గుచ్చుకునే మాటలతో హింసించడం ఎంతవరకూ సమంజసం? కొంతకాలానికి తల్లులు కూడా తమకు పుట్టబోయే శిశువు ఆడపిల్ల కాకూడదని పూజలు, ప్రార్థనలు చేసిన సంఘటనలు కూడా లేకపోలేదు. ఆడపిల్ల పుడితే తమ కొడుక్కి మరో పెళ్లి చేస్తామని కోడళ్లను బెదిరించిన/హెచ్చరించిన అత్తమామలు ఎంతమందో!
‘ఆడపిల్లను కన్నావంటే.. నీకు విడాకులిస్తా’నని భయపెట్టిన భర్తలనూ చూసాం. మరి ఆడపిల్ల పుట్టకపోతే భవిష్యత్ సమాజ నిర్మాణం ఎలా కొనసాగుతుందని ఎవరూ ఎందుకు ఆలోచించలేదో! అయితే ఆడపిల్లను ఎందుకు వద్దనుకునేవారో ఆలోచిస్తే కొన్ని విషయాలు మన ముందు ప్రత్యక్షం కాక తప్పదు.
ఎవరైనా ముందు కోరుకునేది మగపిల్లవాడిని. కారణం అతగాడు వంశోద్దారకుడై, వారి వంశం లేదా ఇంటిపేరు కొనసాగేలా చూడగలడన్న ఉద్దేశం కావచ్చు. కానీ మరో ఇంటి ఆడపిల్ల తోడు లేకుండా మగపిల్లాడు ఆ పని కూడ చేయలేడు కదా! అయినా మగపిల్లాడే కావాలంటారు. అలాగని మగపిల్లాడిని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఆడపిల్ల వద్దనుకోవడం, ఆడపిల్ల పుడితే భయకంపితులు అయిపోవడం పొరపాటుకదా!
మరి కొందరైతే, పేదరికంతో ఆడపిల్లను పెంచలేని పరిస్థితి, పుట్టినప్పటి నుండి అంచలంచెలుగా ఎదుగుతున్న ఆడపిల్లను రక్షించుకోలేని పరిస్థితి. కాపాడుకోలేని పరిస్థితి. ఇది పేదల్లోనే కాదు గొప్పింటి కుటుంబాలలో సైతం ఇదే తంతు. లేదంటే పేదవాళ్ళింట్లో జరిగేవి త్వరగా ప్రచారం అవుతాయి. పెద్దవాళ్ళ గుట్టు చప్పుడు అవసరం అయితే తప్ప బయటికి రావడం కష్టం!
అందువల్ల అప్పట్లో ఆడపిల్ల వద్దనుకునేవాళ్లే ఎక్కువ వున్నారు. తర్వాత మరో ముఖ్యమైన విషయం – ఆడపిల్లల పెళ్లిళ్లు. ఈ పెళ్లిళ్ల దగ్గరే అసలు సమస్య.
కన్యాశుల్కం సమస్య సమసిపోయి పూర్తిగా దానికి భిన్నమైన మరో సమస్య ‘వరకట్న సమస్య’ ఆడపిల్ల మెడకు ఉరితాడుగా మారింది. కట్నం కోసం అత్తమామల నుండి, భర్త నుండి, ఆడపడచుల నుండి, మరుదుల నుండి వేధింపులు, అవి భరించే ఆడపిల్లలకే కాదు, ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు కూడా నరకప్రాయంగా మారింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలలో ఈ సమస్య కాన్సరులా విస్తరించడం మొదలుపెట్టింది. ఆడపిల్లలు వద్దనుకోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. దీనితో పాటు కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటున్నామని చెబుతూ, పెళ్లిళ్లు అయిన తర్వాత నిజస్వరూపాలు బయటపడి, అక్కడ కూడా ఆడపిల్ల భంగపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెద్ద కులాలుగా చెప్పబడే కుటుంబాలలోని ఆడపిల్లలు, తక్కువ కులాలుగా చెప్పబడే కుటుంబాలలోని ఉన్నతస్థాయి గల అబ్బాయిలను ప్రేమ పేరుతోనో, కులాంతర వివాహం పేరుతోనో ఎగరేసుకుపోతున్నప్పుడు, చిన్న కుటుంబాలలోని ఆడపిల్లలు నష్టపోవడం మరో విచిత్రమైన అంశం. ఎంతో ఆశతో కని, ప్రేమగా పెంచి, పెద్దచేసిన ఆడపిల్ల పెళ్లి పేరుతో అన్ని ఇబ్బందులు పడడం, యవ్వనంతో మొదలై పెళ్లయ్యేవరకూ ఆడపిల్లను రక్షించుకోలేని అయోమయంలో చిన్నకుటుంబాల తల్లిదండ్రులు పడిపోవడం లాంటి సమస్యలు ఆడపిల్ల వద్దనుకోవడానికి కారణాలు కావచ్చు. కానీ అది మన చేతిలో లేదు కదా! ఆడ-మగ క్రోమోజోముల కలయికల నిష్పత్తిమీద ఆధారపడి ఉంటుంది. దానిని మాత్రం ఎవరూ అర్థం చేసుకోరు. అయితే ఈ సందర్భంలో నా అనుభవం ఒకటి మీతో పంచుకోవాలని ఆడపిల్ల తండ్రిగా ఆశపడుతున్నాను. అలా అని ఆందోళన పడవలసిన విషయం కాదు గాని ఆ సమయంలో నా లాంటి తండ్రి పడే టెన్షన్ వర్ణించలేనిది.
1994లో నేను మహబూబాబాద్ నుండి బదిలీ అయిన తరువాత జనగాం ప్రభుత్వ ఆసుపత్రిలో (ఇప్పుడు జిల్లా ఆసుపత్రి) బాధ్యతలు స్వీకరించిన పిదప స్థిరనివాసం హన్మకొండలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పిల్లలిద్దరినీ, నారాయణ రెడ్డి గారి ‘సెయింట్ పీటర్ హై స్కూల్’లో చేర్చడం జరిగింది.
మా అమ్మాయి ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజులనుకుంటా. నేను ఉదయం స్కూటర్ మీద కాజీపేట స్టేషన్‌కు వెళ్లి స్కూటర్ స్టాండ్‌లో పెట్టి భాగ్యనగర్ ఎక్సప్రెస్లో జనగాం డ్యూటీకి వెళ్ళేవాడిని. మా పాపకు మొదటి నుండి బయాలజీ సబ్జక్టులో అభిరుచి బాగా ఉండడం వల్ల వాళ్ళ బడిలో బయాలజీ టీచర్ శ్రీ ఫణికుమార్ (ముంబైలో స్థిరపడ్డారు) గారి వద్ద ట్యూషన్ ఏర్పాటు చేసాము. ఆయన ‘సుమంగళ ఫంక్షన్ హాల్’ వెనుక వీధిలో ఉండేవారు. ఆయన బోధనా పరంగానూ, క్రమశిక్షణ పరంగానూ, వ్యక్తిత్వపరంగానూ చాలా మంచివాడని తెలిసి అక్కడ ట్యూషన్ ఏర్పాటు చేసాము.
బడిలోనూ, బయటా, ఆయనకు మంచి పేరు ఉండేది. మా పాప రోజూ సైకిల్ మీద ట్యూషన్‌కు వెళ్లి నేను జనగాంకు బయలుదేరే సమయానికే ఇంటికి వచ్చేసేది. బయాలజీలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆమె చిన్నప్పుడే గట్టి నిర్ణయం తీసుకుంది. అమెరికా వెళ్లి అక్కడ పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా పొందాలన్నది ఆమె ప్రధాన ఆశయం. ఆ ఉద్దేశం తోనే కష్టపడి చదివేది. దానికి సరిపడా ఫలితాలు కూడా పొందేది. నేను కూడా ఆ దిశలోనే బాగా ప్రోత్సహించేవాడిని. ససేమిరా మెడిసిన్ చదవమని ముందే చెప్పేసింది. ఏదైనా అలా నిష్కర్షగా భయం లేకుండా చెప్పేసేది. వాళ్ళ అమ్మకు ఆమెను డాక్టర్ చేయించాలని ఉండేది. నేను మాత్రం అమ్మాయి నిర్ణయానికే ప్రాధాన్యత నిచ్చాను.
అలా రోజూ ట్యూషన్‌కు వెళ్లి వచ్చేక్రమంలో ఒకరోజు నేను జనగాం బయలుదేరే సమయానికి మా అమ్మాయి ఇంటికి రాలేదు. కాసేపు ఎదురు చూసాను అయినా రాలేదు. నాలో భయం మొదలైంది. అప్పటికి మొబైల్ సదుపాయం రాలేదు. ల్యాండ్ ఫోన్ ఉండేది. అలా టీచర్ ఫణికుమార్ గారికి ఫోన్ చేసాము. ఆయన రోజూ మాదిరిగానే సకాలానికే ఇంటికి తిరిగి వచ్చిందని చెప్పాడు.
నాలో టెన్షన్ మొదలైంది. నా శ్రీమతి మాత్రం చాలా మొండి ధైర్యంతో “మీరు జనగాం వెళ్లిపోండి, అమ్మాయి వస్తుందిలే” అని నాకు దైర్యం చెప్పి నన్ను సాగనంపింది. అయిష్టంగానే నేను బయలుదేరి, నేను వెళ్ళవలసిన రైలు వెళ్లిపోవడంతో బస్సు పట్టుకుని జనగాం చేరుకున్నానే గాని, నా మనసులో మనసు లేదు. అమ్మాయి ఇంకా ఇంటికి వచ్చిందోలేదోనన్న భయం నన్ను అక్కడ సరిగా పనిచేయనివ్వలేదు.
సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వస్తేనే గానీ అసలు విషయం తెలియలేదు. అప్పుడు తెలిసింది ఏమిటంటే అమ్మాయి సైకిల్‌కు పంక్చర్ పడడంతో ఆమె ఆ పని కోసం కొంత సమయం దారిలో వెచ్చించవలసి వచ్చింది. ఇంట్లో కంగారు పడతారన్న విషయం ఆమెకు అవగాహన లేదు.
చిన్నప్పటి నుండీ ఆమెకు ఎక్కడా లేని దైర్యం. ఆమె ఇంటికి వచ్చి తయారై హాయిగా బడికి వెళ్ళిపోయింది. నా శ్రీమతి చక్కగా బ్యాంకుకు వెళ్ళిపోయింది మధ్యలో నేను పెద్ద టెన్షన్‌కు గురి అయ్యాను.
ఆడపిల్లను యెంత జాగ్రత్తగా పెంచాలో, యెంత జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలో, ఉండవలసిన అవసరం ఎంతో గుర్తు చేయడానికే ఈ సంఘటనను ఇక్కడ ఉదహరించాను. ఈ రోజున నా కుమారుడు ఉద్యోగ రీత్యా ఎక్కువకాలం అమెరికాలో ఉంటున్న నేపథ్యంలో, సర్వం తానే అయి కంటికి రెప్పలా కాపాడుతున్నది ఒక ‘ఆడపిల్ల’ అదే నా కూతురు నిహార. పిల్లలు ఇద్దరూ నాకు సమానమే, కానీ ఆడపిల్ల ప్రత్యేకం! ఒక రకంగా ఆ.. అన్నకు (రాహుల్) ఈ చెల్లెలు (నిహార. కానేటి) కూడా ప్రత్యేకమే!
ఆనాటి సంఘటన గుర్తుకు వస్తే ఇప్పటికీ ఒళ్ళు ఝల్లుమంటుంది. నేను ఆ రోజు జనగాం ఎలా వెళ్లగలిగానా.. అన్నది ఇప్పటికీ ఆశ్చర్యమే!! ఆడపిల్లలంటే ఇప్పుడు ఆషామషీ కానే కాదు. ఇప్పుడు ఆడపిల్లలే కావాలనుకునే రోజులు కూడా రాబోతున్నాయ్. ఎప్పుడైనా ఆడ : మగ సమతుల్యత పాటించవలసిందే. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. ఆడ పిల్లలు వద్దు అనే నినాదానికి చరమ గీతం పడేద్దాం.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.