Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞాపకాల పందిరి-130

జ్ఞాపకానికి సాక్ష్యం..!!

జ్ఞాపకం.. అది ఒక చెప్పలేని అనుభూతి. మంచిదైతే, ఆనందం; కలసి రానిదైతే విషాదం! ఆనందమైనా, విషాదమైనా జ్ఞాపకం, జ్ఞాపకమే. జ్ఞాపకాలు గతానికి లేదా జరిగిపోయిన వాటికి సాక్ష్యాధారాలు. జ్ఞాపకం మన మనస్సులోనే ఉంటే అది కేవలం మనకు మాత్రమే పరిమితం. మన జ్ఞాపకం యావత్ జనావళికి లేదా ఒక వర్గం ప్రజలకు మాత్రమే అవసరం అయినప్పుడు అది మన మనస్సులోనుండి బయటకు రావాలి. అది బయటి ప్రపంచానికి తెలియాలంటే ఏమి చేయాలి? ఏదో ఒక రూపంలో అది జనావళికి తెలియాలి. అవి ఒకటి పుస్తక రూపం, రెండవది దృశ్య రూపం. అది ప్రస్తుతం అందుబాటులో వున్న వీడియోలు, నాటి నుండి నేటి వరకూ కొనసాగుతున్న ఛాయా చిత్రాలు లేదా ఫోటోలు కావచ్చు. ఫోటోలు అందుబాటులో ఉన్నంతగా అందరికీ వీడియోలు అందుబాటులో వుండవు. వీడియోలు తయారు చేసుకునే కళ కూడా అందరికీ చేత కాదు. అందుచేత సామాన్యుడు సైతం జ్ఞాపకాన్ని దాచుకోగల అవకాశం ఫోటో తోనే సాధ్యం అవుతుంది.

రచయిత అబ్బాయి రాహుల్ కానేటి (బోస్టన్) అరుదైన ఫొటొ

ఒకప్పుడు కెమెరాను కలిగివుండడమన్నా, ఫోటో లు తీసుకోవడం అన్నా గొప్పింటి వారికే సాధ్యం. అది ఒక హోదాకు ఆనవాలు. కెమెరా భుజానికి తగిలించుకుని తిరగడం ఒక ఫ్యాషన్. సామాన్యుడికి అప్పట్లో ఫోటో అంటే అందని ద్రాక్షపండే, ఇక కెమెరా సంగతి చెప్పనక్కరలేదు.

ఫోటో స్టూడియోలు ఎక్కడో ప్రధాన కేంద్రాల్లో ఉండేవి. ఫోటో తీయడమూ, నెగెటివ్ కడగడం, ప్రింట్ తీయడం అదొక పెద్ద కార్యక్రమం. నెగెటివ్ ఫిలిం దాచుకుంటే, ఎప్పుడైనా ఎన్నైనా కాపీలు తీసుకునే అవకాశం ఉండేది. ఫోటో గురించి అవగాహన లేని పల్లె ప్రజలు ఫోటో తీయించుకోవడానికి భయపడేవారట. అసలు అప్పట్లో వాళ్లకి ఫోటో అవసరమే ఉండేది కాదు. తర్వాత.. తర్వాత మనిషి గుర్తింపు కోసం ఫోటోలు ప్రాచుర్యంలోకి రావడంతో, స్టూడియోల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. నాటి వరంగల్ జిల్లా, ఇనుగుర్తికి చెందిన సోదరపండితులు, అంటే, వద్దిరాజు సోదరులు, ఆ ప్రాంత ప్రజలకు కెమెరా గురించి, ఫోటోల గురించి తెలియని కాలంలో, వారు స్వయంగా మద్రాసు వెళ్లి, ఫోటోగ్రఫీ నేర్చుకుని, కెమెరాతో ఇనుగుర్తికి చేరుకొని, అక్కడివారికి ఫోటోలు తీయ ప్రయత్నిస్తే, వాళ్ళు భయపడి పారిపోయారట!

ఇద్దరు అక్కలతో రచయిత (అక్కలు ఇద్దరూ ఇప్పుడు లేరు)

ఆలా.. అలా.. తర్వాత.. తర్వాత ఫోటోల ప్రాముఖ్యత పెరిగింది. ఫోటో స్టూడియోల గిరాకీ కూడా గణనీయంగా పెరిగింది. దిన పత్రికలకు, వార, పక్ష, మాస పత్రికలకు ఫోటోల అవసరం పెరిగినందున, మధ్యతరగతి వారు సైతం కెమెరాలు కొనుక్కునే స్థాయి రావడం పెద్ద మార్పు. బడిలో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, గ్రూపు ఫోటోలు వగైరా అవసరాన్ని పెంచింది. అవి తర్వాతి కాలంలో జ్ఞాపకాలుగా ఎలా మిగిలిపోతాయో అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది.

అమ్మాయి నిహారతో రచయిత

వంద సంవత్సరాలనాటి ఫోటో ఇప్పటి వారి వంశవృక్షానికి చెందిన ప్రతినిధులు చూస్తే యెంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది! నవ భారత రాజ్యాంగ నిర్మాత, డా. బి.ఆర్.అంబేద్కర్‌ను గానీ, మన మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూని గానీ, గాంధీ మహాత్ముడిని గానీ సరోజినీ నాయుడిని గానీ, రవీంద్రనాథ్ టాగోర్‌ని గానీ, పృథ్వీరాజ్ కపూర్‍ని గాని, కె.ఎల్. సైగల్‍౬ను గానీ, ఈ తరంలో చూసినవారెందరు? కేవలం ఫోటోలు మాత్రమే సామాన్యుడికి దిక్కు.

ఫోటోల ప్రాధాన్యత పెరిగిన తర్వాత, ఫోటో ఆల్బమ్‌లు, మనిషి జీవితంలోకి రంగ ప్రవేశం చేశాయి. పెళ్లిళ్లలో, పుట్టినరోజు పండుగల్లో, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలలో, ఫోటోలకు గిరాకీ పెరిగి, ఖరీదైన ఆల్బమ్ తయారు చేయించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి (ఫోటోలకు తోడు ఇప్పుడు వీడియోలు కూడా సుమండీ), వీటి కోసం వేలు లక్షలూ ఖర్చుపెట్టడానికి ఎవరూ వెనకాడడం లేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, ఒకరిని చూసి మరొకరు దీనికి అలవాటు పడ్డారు/అలవాటు పడుతున్నారు.

శ్రీమతితో రచయిత

ఈ మధ్యకాలంలో పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత (కొందరు) ఫోటో షూట్ పేరుతొ ఆ ఫోటోల కోసం లక్షలు ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు.

పూర్వం చిన్న చిన్న ఉద్యోగాల కోసం, కూలీలుగా, రంగూన్ (బర్మా) వెళ్లివచ్చిన వారి ఇళ్లల్లో వంద సంవత్సరాలు పైబడిన వారి ఫోటోలు ఇప్పటికీ కనిపిస్తాయి. పెళ్లిళ్ల విషయంలో, పెళ్లి చూపులకంటే ముందు, ఫోటోలు (వివిధ భంగిమలలో) చూడడం కూడా పైగా అలవాటు అయింది.

కుమారుడు (వంశీకృష్ణ)తో రచయిత అన్నయ్య మీనన్

ఈ రోజున అతి సామాన్యుడు సైతం ఫోటోలు తీసుకోగల సువర్ణావకాశం, మన ఆధునిక పరికరం ‘మొబైల్ ఫోన్’ (చాలా మంది సెల్ అంటున్నారు) కల్పించింది. ఇతరుల ఫోటోలు ప్రదేశాలూ ఫోటో తీయడమే గాక తనకు తాను (సెల్ఫీ) ఫోటో తీసుకుని అప్పటి కప్పుడు చూసుకునే వెసులుబాటు ఈనాడు ‘మొబైల్’లో లభ్యమవుతున్నది. అంత మాత్రమే కాదు మన ఫోటోలను (ఆల్బమ్ అవసరం లేకుండా) ఎప్పటికీ దాచుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకునే అవకాశం కూడా మొబైల్ లో వుంది. ఈ రోజుల్లో వృత్తిపరంగానూ, ప్రవృత్తిపరంగానూ కొందరు మాత్రమే కెమెరాలు వాడుతున్నారుగానీ ఇతరులు ఎవరూ కెమెరాల జోలికి పోవడం లేదు.

కుబ్డీగూడ(హైదరాబాద్)లో పెద్దన్నయ్య కె.కె.మీనన్ తో రచయిత

స్వతహాగా నేను ఫోటోలు అంటే ఇష్టపడతాను. ఫోటోలు దాచుకోవడానికి ఇష్టపడతాను ఆల్బమ్‌లు తయారు చేసుకోవడానికి ఇష్టపడతాను, ఫోటోలు సేకరించడానికి ఇష్టపడతాను.

ఆల్బం లలో కొన్ని….

అలా అవకాశం వచ్చిన తర్వాత వేల ఫోటోలు నాకిప్పుడు స్టోర్ అయి వున్నాయి. సందర్భానుసారంగా వాటిని నేను ఏదో సందర్భంలో ఉపయోగించుకుని జ్ఞాపకాలను సింహావలోకనం చేసుకుంటుంటాను. నా కుటుంబానికీ, స్నేహితులకు సంబందించిన చాలా ఫోటోలు వారి దగ్గర లేనివి నా దగ్గర దొరుకుతాయి. మొబైల్ వచ్చిన తర్వాత ఇది మరింత సులభమైంది. ఫేస్‌బుక్‌లో ఒక ఫోటో పోస్ట్ చేస్తే మరు సంవత్సరం ఆ ఫోటోను ఫేస్‌బుక్ మనకు జ్ఞాపకం చేస్తుంది. మెమొరీస్‌లో ఆ ఫోటో ప్రత్యక్షం అవుతుంది కూడా.

గురువు గారు డా.పి.రామచంద్రా రెడ్డిగారితో రచయిత

చిన్నప్పటి నుండి ఫోటోలు దాచుకోవడం నాకు అలవాటు. నేను చదువుకుంటున్న కాలంలో మా తమ్ముడు (పిన్ని కొడుకు, సరిపల్లి) ఆశీర్వాదం, దోహా -ఖతార్ నుండి చిన్న కెమెరా (16 ఎం. ఎం) తెచ్చి నాకు బహుమతిగా ఇచ్చాడు. దానితో అనేక ఫోటోలు తెలిసీ తెలియని విధానంలో తీశాను. ఆ కెమెరా తో తీసిన నా తల్లిదండ్రుల ఫోటో ఇంకా నా దగ్గర ఉండడం నా అదృష్టం. తర్వాత ఆ కెమెరా నా మిత్రుడు ఒకాయన తీసుకుని పాడుచేసి ఇచ్చాడు. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. తర్వాత కెమెరా కొనుక్కునే స్థాయి వచ్చిన తర్వాత రెండు కెమెరాలు కొన్నాను. కానీ అవి ఇప్పుడు ఉపయోగానికి లేవుగానే భద్రంగా వున్నాయి. ఇప్పుడు మొబైల్ సర్వం అయిపొయింది. మొబైల్‌తో ఫోటోలు తీసుకోవడమే గాక, ఫోటోలు అందులో దాచుకునే వెసులుబాటు ఉండడం వల్ల ఇప్పుడు సందర్భం ఏదైనా ఎవరికీ వారు ఫోటోలు తీసుకోవడం ఒకరికొకరు పంచుకోవడం, అవసరమైన వాటిని దాచుకోవడం వంటివి సులభతరం అయింది.

రచయిత కెమెరాతో(తమ్ముడి బహుమతి) తల్లిదండ్రులను రచయిత తీసిన మొదటి ఫోటో

నా జ్ఞాపకాల పందిరి వ్యాస పరంపరలో, ఇలాంటి ఫోటోలు ఎన్ని, ఎలా చోటుచేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటిని చూస్తున్నప్పుడు నా మనస్సు సుదీర తీరాలకు వెనక్కు మళ్లుతుంది. నాకే కాదు, ఎవరికైనా, పాత జ్ఞాపకాలను తోడి చెప్పే పాత ఫోటోలు అబ్బురమనిపిస్తాయి, ఆనంద డోలికల్లో ముంచి తెలుస్తాయి.

విషాద ఛాయలు ముసురుకునేలా చేస్తాయి. ఫోటోలకు అలాంటి శక్తి వుంది. జీవితంలో బాల్యం నుండి, వృద్ధాప్యం వరకూ తమ ఫోటోలు తాము చూసుకోగలిగే వారు నిజంగా అదృష్టవంతులు.

రచయిత పెళ్లి రిసెప్షన్ (ద్వారకా హొటల్,హైదరాబాద్)

నేను నా ఫోటోలతో పాటు, నా పెళ్లి ఫోటోలు, రిసెప్షన్ ఫోటోలు, పిల్లల ఫోటోలు (వేరు వేరుగా), గృహ ప్రవేశం ఫోటోలు, పిల్లల పెళ్లిళ్ల ఫోటోలు, వేరు వేరుగా ఆల్బంలు తయారు చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం, మొబైల్ ఫోన్‌నే, కెమెరా గానూ, ఆల్బమ్ గాను, అందరి లాగానే నేనూ ఉపయోగించు కుంటున్నాను. ఫోటోల అవసరం పూర్తిగా అవగాహన ముందు లేకపోవడం వల్ల ఎన్నో అమూల్యమైన ఫోటోలు స్వయంగా డిలీట్ చేయడం ఇప్పటికీ నాకు బాధ కలిగిస్తుంటుంది. అంతమాత్రమే కాదు, ఎన్నో చక్కని ఫోటోలతో వున్న నా మొబైల్ కొద్ది సంవత్సరాల క్రితం పోగొట్టు కోవడం పెద్ద విషాదం. ఇలా ఫోటోలు కేవలం ప్రవృత్తిలో భాగంగా చూడడమే కాకుండా, గత మన జ్ఞాపకాల సాక్ష్యాధారాలుగా మనం చూడాలి. మానసిక తృప్తికి ఎన్నెన్నో జ్ఞాపకాలు ఈ ఫోటోలు మనతో పాటు పయనిస్తాయి. మన భావి తరాలకు జ్ఞాపకాల పందిరిని వేస్తాయి. చారిత్రిక ఆధారాలుగా మిగిలిపోతాయి.

అందుచేత అరుదైన ఫోటోలను తప్పక దాచుకోవడం మంచిది. వాటి విలువ, ఆ ఫోటోల అవసరం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అయితే తమ ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసుకునేవారు, ముఖ్యంగా స్త్రీమూర్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి వెనుక చెడు ఉంటుందన్నట్టు, ఫోటోలను మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేసే ప్రమాదపు ముఠాలు కూడా ఉంటాయి, అందుకే ఫోటోలను పోస్ట్ చేసే ముందు పది సార్లు ఆలోచించాలి. ఫోటోల గురించి యెంత చెప్పినా తక్కువే! చివరగా ఒక మాట – మనుష్యులను చూడకుండా (పెళ్లికూతురైనా, పెళ్ళికొడుకయినా) కేవలం ఫోటోల ఆధారమా పెళ్లిళ్లు ఖరారు చేసుకోవడం అసలు సరయిన పద్ధతి కాదు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version