Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞాపకాల పందిరి-49

“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.

మిత్రత్వం… ఇలా కూడా!!

వైద్య రంగం – ముఖ్యంగా ప్రభుత్వ వైద్య రంగం రకరకాల రంగులు మార్చుకుంటూ, మొత్తం మీద పేదవాడికి అందాల్సిన వైద్యం వక్రరూపాలు దాల్చి పట్టాలు తప్పుతుందని చెప్పక తప్పదు. అలా అనీ అందరినీ ఒకేలా లెక్క కట్టడం సముచితం కాకపోయినా, ఒకరు చేసే తప్పు యావత్ అదికారుల మీద, సిబ్బంది మీద ప్రభావం పడుతుంది. తద్వారా ప్రజల్లో – ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల, అందులో పనిచేసే సిబ్బంది పట్ల చులకన భావం ఏర్పడడమే కాదు, అర్థం పర్థం లేని అలజడులకు కారణం అవుతుంది. ముఖ్యంగా, పై కేడర్ నుండి క్రింది స్థాయి ఉద్యోగుల వరకూ అవినీతిని ఆశ్రయించడమే దీనికి ముఖ్య కారణం.

ఒకప్పుడు ప్రభుత్వ వైద్య రంగంలో వివిధ స్థాయిల్లో ఎప్పటికప్పుడు ఆయా స్థాయి అధికారుల పర్యవేక్షణ సజావుగా, పకడ్బందీగా, కఠినంగా క్రమశిక్షణతో ఉండేది. రాష్ట్ర స్థాయిలో ఇద్దరు డైరెక్టర్లు, వారి క్రింది స్థాయి అధికారులు, జిల్లా స్థాయిలో, జిల్లా వైద్య అధికారి (డి.ఎం.&హెచ్.ఓ), వారి క్రింది అధికారులు, రీజియన్‌కు సంబంధించి (మూడు జిల్లాలు) ఒక రీజినల్ డైరెక్టర్, వారి క్రింది స్థాయి అధికారులు వుండి, జిల్లా ఆసుపత్రులు తాలూకా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షణ ముమ్మరంగా జరిగేది. అందుచేత అటు వైద్యులు, ఇటు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండి, పుష్టికరమైన వైద్య సేవలు అందించేవారు.

తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. నాటి ఉమ్మడి రాష్ట్రంలో, ఎన్. టి. రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి నిధులు రప్పించి, వైద్య రంగాన్ని మూడు విభాగాలుగా చీల్చినారు. జిల్లా, తాలూకా ఆసుపత్రులను ఒక ప్రత్యేక గొడుగు క్రిందికి తెచ్చినారు. అదే ‘వైద్య విధాన పరిషత్’. దీని రాష్ట్ర స్థాయి అధికారి కమీషనర్. అలాగే వైద్య విద్యను, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ క్రిందికి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ క్రిందికి తెచ్చినారు. దీనివల్ల సేవా కార్యక్రమాలు మెరుగుపడినా, పాలనాధికారం కూడా ముఖ్యమైన మూడు ముక్కలుగా చేయడం వల్ల ఎవరికి వారే …! అన్న చందంగా తయారయి ఒకరికి మరొకరు జవాబుదారీ కాకుండా అయినందు వల్ల, ఆసుపత్రుల మధ్య సమన్వయం లోపించి కొన్ని సమస్యలు ఎదురయినాయి. దీని పర్యవసానమే, కొన్ని జాతీయ కార్యక్రమాలు దెబ్బతిన్నాయి. అధికారుల పర్యవేక్షణా లోపం ఏర్పడింది. వైద్యుల్లో, వైద్య సిబ్బందిలో క్రమశిక్షణ లోపించింది. దీనికి తోడు లంచగొండితనం ప్రబలి పోయిందని చెప్పక తప్పదు. జిల్లా ఆసుపత్రులపై, జిల్లా వైద్యాధికారి పట్టు సడలిపోవడం, వైద్య విధాన పరిషత్, జిల్లా కో-ఆర్డినేటర్లను ఏర్పాటు చేయడం, వారు వైద్యసేవలతో పాటు, పరిపాలనా విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలిని ఏర్పాటు చేసి ఆ ప్రాంతపు శాసనసభ్యుడిని చైర్మన్ గాను, ఆసుపత్రి సూపరింటెండెంట్ సహాయకుడి గాను, వివిధ వర్గాలకు చెందిన నాయకులను సభ్యులుగానూ చేసింది. ఈ సలహామండలులు ఏ కొద్దీ ప్రాంతాల లోనో తమ విధులు సక్రమంగా చేసి ఆసుపత్రి అభివృద్ధిలోనూ, రోగులకు వైద్య సేవలు అందించడంలోనూ, తమ శక్తి సామర్ధ్యాలు చూపించారు. కానీ ఎక్కువ ప్రాంతాలలో ఈ సలహా మండలులు, ఆసుపత్రుల అభివృద్ధిని విస్మరించి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను, సిబ్బందిని ఇబ్బందిపెట్టి వసూళ్లు చేయడం ప్రారంభించడంతో, విచ్చలవిడి లంచగొండితనానికి ఆసుపత్రులు శ్రీకారం చుట్టాయి. చోటా మోటా నాయకులను తట్టుకోవడానికి సిబ్బందికి ఇది తప్పనిసరి అయింది. నాల్గవతరగతి ఉద్యోగులు కొంతమంది ఇతర ముఖ్యమైన ఉద్యోగులూ సంవత్సరాల తరబడి ఒకేచోట పాతుకుపోవడం వల్ల వారు ఏమి చేస్తే అదే కరెక్టు అన్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులకు కాస్త ముందు, నేను ఎదుర్కొన్న విషయం ఇక్కడ వివరించవలసిన అవసరం ఉంది.

అప్పటికి ఇంకా వైద్య విధాన పరిషత్ ఏర్పడలేదు. నేను మహబూబాబాద్ ఆసుపత్రిలో పనిచేస్తున్న రోజులు. కరీంనగర్ జిల్లాలోని ఒక ప్రాంతం నుండి డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాలో ప్రమోషన్‌తో ఒక పెద్దాయన బదిలీ పై మహబూబాబాద్‌కు వచ్చారు. ఎంతో అనుభవాన్ని మూటగట్టుకుని వచ్చిన వ్యక్తి. అతి సౌమ్యుడు,మృదు స్వభావి. నెమ్మదస్తుడు, కించిత్ భయస్తుడు కూడా. నాకు వేసెక్టమీ శస్త్ర చికిత్స (ఆయన, కుసుమ అనే స్టాఫ్ నర్స్) చేసింది కూడా ఆయనే! ఆసుపత్రి ఆవరణ లోని డాక్టర్ క్వార్టర్‌లో కుటుంబ సమేతంగా ఉండేవారు. కుటుంబ సంక్షేమం శస్త్ర చికిత్సలతో పాటు చిన్న చిన్న సర్జరీలు (డబ్బులు తీసుకుని) చేసేవారు. ఆ స్థానంలో ఎవరు వున్నా కొంచెం అటు ఇటూగా ఇదే పద్ధతి. రెండు గంటలనుండి, సాయంత్రం నాలుగు గంటలవరకూ బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునేవారు. నేను ఆసుపత్రి పని గంటల తర్వాత, అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత చిన్న క్లినిక్‌లో ప్రాక్టీస్ చేసేవాడిని. పనివేళల్లో నా సీటుకు అంటిపెట్టుకుని ఉండేవాడిని. మొదట్లో నాకు పెద్దగా పని ఉండేది కాదు. ఖాళీ సమయంలో చదూకోవడమో, కథలు – వ్యాసాలూ రాసుకోవడమో (నిజానికి పనివేళల్లో ఈ పని కూడా చేయకూడదు!) చేసేవాడిని. పేషేంట్స్ వస్తే చూసేవాడిని.

సాధారణంగా, పనివేళల్లో ప్రైవేట్ సర్జరీలు వస్తే, ఓ.పి, ఆపేసి ఇతర డాక్టర్లు సర్జరీలు చేసుకుని డబ్బు సంపాదించుకునేవారు. కొందరు నన్ను రిక్వెస్ట్ చేసి కాసేపు ఓ.పి.లో కూర్చోమనేవారు. వారి అభ్యర్ధన మేరకు నేను వెళ్లి అక్కడ చిన్న చిన్న సమస్యలకు మందులు రాసేవాడిని. ఇలా.. నడుస్తున్న వ్యవహారం పరస్పర అవగాహనతో, ఆనందం గానే గడిచిపోతోంది. కాస్త అతి తెలివైన వాళ్ళు ఓ.పి.ని, ఫార్మాసిస్టుకి అప్పజెప్పి, తమ స్వంత పనులు చేసుకునేవాళ్ళు. డాక్టర్లు ఉండగా ఫార్మాసిస్టు రోగులను చూడడం, వంట మనిషి (రాములు) ఇంజెక్షన్లు ఇవ్వడం నేను జీర్ణించుకోలేక పోయేవాడిని. వాళ్ళ.. వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం ఇలాంటి పనులు జరిగేవి. గ్రామ పెద్దలు, వివిధ రకాల నాయకులు వారికి అవసరం వచ్చినప్పుడు మాత్రమే, ఆసుపత్రి వంక తొంగి చూసేవారు (ముఖ్యంగా వారికి సంబందించిన, పోస్టుమార్టంలు, మెడికొ లీగల్ కేసులు వచ్చినప్పుడు). అసలు అక్కడ ఏమి జరుగుతుందో ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఈ నేపథ్యంలో ఒక సంఘటన జరిగింది. అది నాకూ డిప్యూటీ సివిల్ సర్జన్‌కు (నాకు బాస్ అన్న మాట!) సంబందించిన విషయం.

ఒక రోజు, ఎప్పటిమాదిరిగానే తొమ్మిది గంటలకు ఆసుపత్రికి వెళ్లి అటెండన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి వచ్చి నా సీట్‌లో కూర్చున్నాను. జనరల్ ఓ.పి.ని ఆనుకుని వున్నచిన్న గది నాకు కేటాయించారు. నేను వచ్చిన పేషెంట్‌లను ఒక్కొక్కరిని చూసి పంపిస్తున్నాను. సుమారు మధ్యాహ్నం పదకొండు గంటలకు, మా డిప్యూటీ సివిల్ సర్జన్ గారు వచ్చి, ఒక ఆర్దరు వేసినట్టుగా – “వెళ్లి జనరల్ ఓ.పి. చూడండి” అన్నాడు. నేను కాసేపు ఆలోచించి “నేను చూడను” అనేశాను.

“అదేంటి.. నేను చెబుతుంటే ఎందుకు చూడరు?” అన్నాడు కాస్త సీరియస్‌గా.

“మీరందరూ ఉండగా.. నేనెందుకు చూడాలి?” అని ఎదురు ప్రశ్న వేసాను. “మాకు వేరే పనులున్నాయి” అన్నాడు.

“అయితే.. ఓ. పి. మూసుకుని వెళ్ళండి” అని ఒక ఉచిత సలహా ఇచ్చాను.

“మీకు అసలు పేషెంట్స్ ఉండడం లేదు, ఖాళీగా వుంటున్నారు” అన్నాడు, ముఖం అదోలా పెట్టి.

“వచ్చిన వాళ్ళని చూడడం నా బాధ్యత! నేను పనిచేయకుంటే నా పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవలసిన బాధ్యత మీది! నేనైతే ఊరిమీద పడి డెంటల్ పేషెంట్స్‌ను తీసుకు రాలేను కదా!” అన్నాను.

“మీరు ఇప్పుడు జనరల్ ఓ.పి.లో కూర్చోవలసిందే! నేను ఆఫీస్ ఆర్డర్ ఇస్తాను” అన్నాడు. “అది నేను పట్టించుకోను” అన్నాను

“ఏమి ఎందుకు?” అని ఎదురు ప్రశ్న వేసాడు.

“ప్రతి ఉద్యోగికి ప్రభుత్వ పరంగా ఒక జాబ్ చార్ట్ ఉంటుందని మీకు నేను వేరే చెప్పనక్కరలేదు. అందులో మీరు చెప్పే డ్యూటీ నాకు లేదు. మీరు ఇప్పుడు చెబుతున్న పని నేను చెయ్యాలంటే, నాకు ‘డైరెక్టర్ ఆఫ్ హెల్త్  సర్వీసెస్’ నుండి ప్రత్యేకమైన అధికారిక ఉత్తర్వులు అవసరం” అన్నాను

ఇక నాతో టైం వెస్ట్ అనుకుని, జనరల్ ఓ.పి. ఫార్మాసిస్టుకు అప్పజెప్పి ఆయన ఆపరేషన్ థియేటర్‌కు వెళ్ళిపోయాడు. మరునాడు నాకు తప్పక మెమో వస్తుందని,  దానికి సరైన సమాధానం ఎలా ఇవ్వాలో కూడా ఒక ఐడియా మైండ్‌లో పెట్టుకున్నాను.

కానీ.. నా ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా మరునాడు ఆయన నా సీట్ దగ్గరికి వచ్చి నవ్వుతూ – “ప్రసాద్,బాగున్నారా?” అని పలకరించాడు. నేను కూడా ఏమీ జరగనట్టుగానే ఆయనను నవ్వుతూ పలకరించాను.

ఏమి జరిగిందన్నది నాకు తెలీదు కానీ, అప్పటినుండీ మేము మంచి మిత్రులం అయిపోయినం. కుటుంబంతో మంచి స్నేహ సంబంధాలు ఏర్పడినాయి. వాళ్ళ చిన్నబాయిని (రాజు.. అని పిలిచేవారు) ఇద్దరం విజయవాడ శివార్లలో వున్నఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చి వచ్చాము.

వాళ్ళ పెద్దమ్మాయిని బెజవాడలోని కోటేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న బి.ఎడ్. కాలేజీలో చేర్చి వచ్చాము. ప్రతి ఆదివారము మా అత్త గారు వెళ్లి ఆ అమ్మాయిని చూసి వచ్చేది. అలా మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తర్వాత ఆయన వరంగల్ ఎం.జి.ఎం. ఆసుపత్రిలో ఆర్.ఎం.ఓ.గా నియమింప బడినందువల్ల వరంగల్ వచ్చేసారు. నాకు జనగాం బదిలీ అయినందువల్ల నేను హన్మకొండలో స్థిరపడ్డాను. అలా.. అప్పుడప్పుడూ వారి ఇంట్లో కలుస్తుండేవాళ్ళం.

చాలా కాలం కుటుంబ సమేతంగా ఆయన ఎక్సయిజ్ కాలనీలో వారి సొంత ఇంట్లో వున్నారు. ఇద్దరు కొడుకులూ, ఇద్దరు కూతుళ్లు చక్కగా ప్రయోజకులైనారు. తర్వాత వారంతా హైదరాబాద్‌కు వెళ్లిపోవడం ఆయన చనిపోవడం కూడా జరిగింది. చివరికి ఆయన నాకు మంచి స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా మిగిలారు. ఇవాళ ఆయన లేకపోయినా, మా ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగినా తర్వాత ఒకరికొకరం తెలుసుకుని దగ్గరయ్యాము. అందుచేత ఇక్కడ ఆయన పేరు చెప్పకుండా ఉండడం సమంజసం కాదని నాకు అనిపిస్తున్నది.

ఆయన డా. ఎస్. వెంకటేశం గారు. ఏదో రూపంలో, ఏదో సందర్భంలో డా. వెంకటేశం గారు నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తూనే వుంటారు. ఆయన చివరి క్షణాలు చూడలేకపోవడం బాధాకరమే!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version