మా అన్నలు..!!
ఆనాటి కుటుంబ వ్యవస్థలో, అంటే ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లిన రోజుల్లో కుటుంబాల మధ్య, రక్తసంబందాల మధ్య, అన్యోన్యతలు, అనురాగాలూ, ప్రేమలూ గొప్పగా చెప్పుకునేట్టుగా ఉండేవి. పెద్దల యెడ గౌరవం, భయము-భక్తి అంచనాలకు మించి ఉండేవి. కుటుంబ పెద్ద చెప్పినట్టు, మిగతా కుటుంబ సభ్యులందరూ వినేవారు. అలాగే ఇంటి పెద్దలు కూడా కుటుంబ సభ్యులనందరినీ ఒకేలా చూసేవారు, ఒకేలా ప్రేమించేవారు. ఎలాంటి అరమరికలకు తావుండేది కాదు. అందరూ ఆనందమయ, సుఖమయ జీవితం గడిపేవారు. చిన్నలకు పెద్దలు ప్రతి విషయంలోనూ, ప్రతి అంశం లోనూ మార్గదర్శనం చేసేవారు. అలా కుటుంబాలు కలిసికట్టుగా ఉండేవి. అందరిదీ ఒకే మాటా – ఒకే బాట అన్నట్టుగా ఉండేది. ఆరోగ్య సమాజానికి ఆయా కుటుంబాలు ఒక మాదిరిగా ఉండేవి.
అయితే కాలంతో పాటు అన్ని విషయాల్లోనూ మార్పులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాలు కూడా దీనికి అతీతం కాదు! నాకు వూహ తెలిసే సమయానికి, సమాజాన్ని అవగాహన చేసుకునే సమయానికి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరిస్తూ వచ్చినా, చాలాకాలం వరకూ, రక్తసంబంధీకుల మధ్య బంధాలూ, అనుబంధాలూ, ప్రేమలూ, సజావుగా కొనసాగుతూనే వచ్చాయి.
క్రమంగా ఒంటరి జీవితాలకు తప్పని పరిస్థితులలో అలవాటు పడ్డ జనంలో అభిమానాలూ, ఆత్మీయతలు కనుమరుగై, వాటికి బదులు, స్వార్థం, అసూయ వంటివి ప్రధాన స్థానాన్ని ఆక్రమించాయి. స్వప్రయోజనాలే ప్రధాన అంశాలుగా రూపాంతరం చెందాయి. ఆడ మగ అనే తేడా లేకుండా కేవలం స్వప్రయోజనాలనే ఆలంబనగా చేసుకుని, నేను – నాది అనే సూత్రానికి బానిసలుగా సమాజం మార్పును ఆశించడం, కేవలం ధనమే, బంధుత్వాలకు బంధుత్వ విచ్ఛిన్నానికి కేంద్ర బిందువుగా మారిపోవడం వంటివి జరిగిపోతూ వున్నాయి. అప్పట్లో స్త్రీలు ఉద్యోగం చేసేవారు కాదు, చేసినా అతికొద్దిశాతం మాత్రమే ఉండేది. అందుచేత సంపాదన – డబ్బు మగవారి ఆధీనంలో ఉండేవి స్త్రీమూర్తులు, మగ పెద్దల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వచ్చేది. అందుచేత స్త్రీకి ఆర్థికపరమైన స్వేచ్ఛ ఉండేది కాదు. ఇప్పటి పరిస్థితి అలా లేదు. పురుషుడితో సమానంగా స్త్రీలు కూడా ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. అలా వారికి ఆర్ధిక స్వేచ్ఛ కూడా ఏర్పడింది.
ఇది మంచికే జరిగినా, కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో పెనుమార్పులు వచ్చి మంచిని మించి ప్రేమలూ అభిమానాలూ ఆప్యాయతలు పక్కదోవ పడుతున్నాయి. మానవీయ విలువలకు గండి పడుతున్నది. ఇటువంటి పరిస్థితులలో అంతో ఇంతో రక్తసంబంధీకులతో నాకున్న అపారమైన అభిమానాన్ని, ప్రేమను, గుర్తు చేసుకోవాలంటే కాస్త వెనక్కి వెళ్లి గతాన్ని తవ్వుకోవాలి. అందులోభాగమే నా సోదరులను గుర్తు చేసుకునే విషయం. ఇందులో ఒకే రక్తం పంచుకుని పుట్టినవాళ్ళు, ఇంటిపేరుగల బంధువులూ వున్నారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు, రక్తసంబంధీకులతో ఎప్పుడూ సత్సంబంధాలు కలిగివుండాలనే నా ఆలోచనలకు ప్రేరణయే ఈ వ్యాసం.
అన్నలు అనగానే ప్రస్తుత జనావళికి గుర్తుకు వచ్చేది అడవులు – అడవుల్లో నివసించే ‘అన్నలు’ (నక్సలైట్లు). త్యాగమయ జీవితం వారిది. సమసమాజం కోసం వారి జీవితాలను త్యాగం చేసిన పుణ్యమూర్తులు వాళ్ళు. వారు ఆశించిన మార్పు సమాజంలో ఎంత వచ్చింది? అన్న విషయం పక్కన పెడితే నేను చెప్పదలచుకున్న అన్నలు, వాళ్ళు కాదు, నా రక్తం పంచుకుపుట్టిన సోదరులు, నా ఇంటి పేరుగల సోదర బంధువులు, వారితో నాకున్న అనుబంధం గురించి చెప్పడమే నా ఉద్దేశం.
నేను పుట్టిన సంవత్సరమే (1953) మనదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినట్టు గుర్తు. అప్పుడు మా ‘దిండి’ గ్రామం, రాజోలు తాలూకా లోను, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఉండేది. ఆ రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మొదటి వ్యక్తి మా అన్నయ్య (కజిన్) స్వర్గీయ కానేటి మోహనరావు. ఆ ప్రాంతం అంతా కమ్యూనిస్టుల హవా నడుస్తున్న రోజులవి. ప్రజల పక్షాన పోరాడుతున్న పేదల పార్టీ అప్పుడది. ఆ పార్టీ అభ్యర్థిగానే మా అన్నయ్య పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనాడు. కులవివక్షత రైతుకూలీల సమస్యలు వంటి ప్రధాన అంశాలపై పోరాడి ఫలితాలు సాధించిన పార్టీ అది. అందుకే బాల్యమునుండి మానాయన స్వర్గీయ కానేటి తాతయ్య గారిద్వారా మాపై కమ్యూనిస్టు పార్టీ భావజాలం తద్వారా నాస్తికత్వం అబ్బినాయి. మోహన రావు గారి తర్వాత మా కుటుంబంలో అంతటి రాజకీయ నాయకుడు మళ్ళీ కనిపించలేదు.
తర్వాత మరో అన్నయ్య (మా ఇంటిపేరు గల) అప్పటినుండీ ఇప్పటివరకూ మంచి కమ్యూనిస్ట్ కార్యకర్త, మోహనరావుగారికి స్వయానా తమ్ముడు, శ్రీ కానేటి సుబ్బారావు. తర్వాత ఆయన కానేటి విజయకుమార్‌గా పేరు మార్చుకున్నాడు. వంద సంవత్సరాలకు చేరువలో వున్న ఈయన మా గ్రామం నుండి కాకినాడకు వలస పోయి అక్కడ వ్యవసాయదారుడిగా స్థిరపడినాడు. ఈయన సంతానంలో కూడా ఎవరూ రాజకీయ నాయకుడిగా ఎదగలేదు. ప్రజా నాట్యమండలి సభ్యుడిగా ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు.
మా రక్తసంబంధీకుడైన అన్నయ్య స్వర్గీయ కానేటి కృష్ణమూర్తి. ఈయనను ‘పెద్దన్నయ్య’ అని పిలిచేవాళ్ళం. మా పెదనాన్న స్వర్గీయ కానేటి సత్తయ్య గారి రెండవ సంతానం ఈయన. మమ్ములను పెద్దన్నయ్య ఎంతో ప్రేమగా చూసుకునేవారు. నాటి కేంద్ర రైల్వే మంత్రి స్వర్గీయ బాబూ జగజ్జీవనరామ్ హయాంలో ఈయన రైల్వే ఉద్యోగిగా ప్రవేశించారు. మా కానేటి కుటుంబంలో ఈయన మొదటి (కేంద్ర ప్రభుత్వ) ఉద్యోగి. పెద్దన్నయ్య, రాజమండ్రికి వలసపోయి పదవీ విరమణ సమయానికి అక్కడ (శంభు నగర్) స్థిరపడినవారు. ఆయన క్రమశిక్షణ, మంచితనం, ప్రేమానురాగాలు మరచిపోలేనివి. అంత పొడుగైన నా పేరు (కానేటి లక్ష్మీ వరప్రసాద్) సూచించిన ఘనత మా పెద్దన్నయదే!
ఈయన మంచి నటుడు (దిండి ప్రజానాట్య మండలి) కూడా. గ్రామంలో ప్రతి సంక్రాంతికి తప్పక ఒక నాటక ప్రదర్శన ఉండేది. మా చినాన్నలలో ఒకరి ఏకైక కుమారుడు స్వర్గీయ కానేటి అప్పారావు. ఈయనను వేంకటపతి అని కూడా పిలిచేవారు. అలా ఎందుకు పిలిచేవారో తెలియదు. ఈయనను ‘చిన్నన్న’ అని పిలిచేవాళ్ళం. యువకుడిగా కమ్యూనిస్టు ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి. ఈయన మా అన్నదమ్ములను, అక్కలను ఎంతో ప్రేమగా చూసేవాడు. అది ఆయన వివాహం జరిగినంత వరకూ కొనసాగింది. తర్వాత ఉద్యోగరీత్యా చిన్నన్న నాగార్జున సాగర్ వెళ్ళినాడు. అంతమాత్రమేకాదు, అప్పుడే బి.ఎడ్. పూర్తి చేసిన మా పెద్దక్క స్వర్గీయ కానేటి మహానీయమ్మకు టీచర్‍గా ఉద్యోగం ఇప్పించిన ఘనత ఈయనదే! అక్క సాగర్ లోనే పదవీ విరమణ చేసి అక్కడే తుది శ్వాశ విడిచింది. చిన్నన్న మా చిన్నప్పుడు ప్రజానాట్యమండలి నాటకాల్లో నటించడం నాకు గుర్తు వుంది. సాగర్‌లో రిట్రెంచ్ అయిన తర్వాత కొంతకాలం చిన్నన్న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో కండక్టర్‌గా పనిచేశారు. ఆయన చివరి రోజులు దిండి గ్రామంలోనే గడపగలగడం ఆయన అదృష్టం.
గ్రామ సర్పంచిగా ఒక టెర్మ్ చేయాలని ఆయనకు ఒక కోరిక ఉండేది. ఆ కోరిక నెరవేరకుండానే ఆయన వెళ్ళిపోయాడు. నన్ను దిండి చరిత్ర రాయమని అడుగుతుండేవాడు. ఆ పని కూడా సాధ్యం కాకపోవడం దురదృష్టకరం.
మరో చిన్నాన్న కొడుకు స్వర్గీయ కానేటి భగవాన్ దాస్ (రాజు) ‘దాసన్న’ అని పిలిచేవాళ్ళం. ఈయన మమ్ములను ఎంతగానో ప్రేమించేవాడు. మేము బాగా చదువుకుంటామని మమ్ములను ప్రత్యేకంగా చూసేవాడు. వడ్రంగంలో అందెవేసిన చేయి. గొప్ప పనిమంతుడుగా పేరు తెచ్చుకున్నారు. ఈయన కూడా కొంతకాలం నాగార్జున సాగర్‌లో (నిర్మాణ సమయంలో) పని చేశాడు. తర్వాత స్వగ్రామం దిండికి వచ్చి చనిపోయేవరకూ అక్కడే గడిపాడు. దాసన్న చదువుకున్నది తక్కువైనా మంచి భాష ఉపయోగించి మాట్లాడేవాడు. వందల సంఖ్యలో డిటెక్టివ్ నవలలు చదివిన అనుభవం ఆయనది. మంచి, మర్యాద, ప్రేమలకు ఆయన పెట్టింది పేరు. దురదృష్టం ఏమిటంటే మద్యపాన వ్యసనం ఆయన జీవన శైలిపై ఒక మచ్చగా మిగిలిపోయింది. అదే అతనిని కాటేసి చంపింది.
నాకు తోబుట్టువు, పెద్దన్నయ్య స్వర్గీయ కె. కె. మీనన్ (కానేటి కృష్ణ మీనన్) మా కుటుంబంలో, బంధువుల్లో, ‘బులి కృష్ణ మూర్తి’గా ఆయన ప్రసిద్ధుడు. చిన్నతనం లోనే మా పెద్దమ్మకు (రామరాజులంక) పెంపుడు కొడుకుగా వెళ్ళిపోయినప్పటికీ ఆ విషయం మాకు తెలియనంతగా మమ్ములను ప్రేమించాడు. హైస్కూల్ స్థాయిలో నేను సంస్కృతం (రాజోలు హైస్కూల్) చదవడానికి ఆయనే కారకుడు. ఎనిమిదవ తరగతిలో అనారోగ్యం వల్ల చదువుకు అంతరాయం కలిగినప్పుడు, నాకు పునర్జన్మనిచ్చినవాడు, నేను మెట్రిక్యూలేషన్ చదివి పాసు కావడానికి కారకుడు మా పెద్దన్నయ్య! నా బాల్యం సింహభాగం ఆయన దగ్గరే గడిచింది. అన్నయ్య కథకుడూ, నవలాకారుడూ కావడం మూలాన, ఆ వాసనలు నన్ను చుట్టుముట్టి నన్నూ ఒక రచయితగా తయారుచేశాయి. ఈరోజున నా ఈ స్థాయికి ప్రధాన కారకుడు పెద్దన్నయ్య మీనన్ గారే! ఆయన ఋణం తీర్చుకునే అవకాశం పెద్దగా రాకపోయినా, ఆయన కథల మొదటి సంపుటి ‘ఇది స్త్రీకింగ్ కాదు’, చిన్నన్నయ్య, డాక్టర్ మధుసూదన్ కానేటి (విశాఖ పట్నం) తో కలసి రెండవ ముద్రణ తీసుకొచ్చే అవకాశం కలిగింది. అది కొంతలో కొంత తృప్తి. ఆయన చివరి రోజులు అనారోగ్యంతో, వృద్ధాశ్రమంలో మరణించడం అత్యంత బాధాకరం.
నా రెండవ అన్నయ్య, ఉద్యోగరీత్యా విశాఖపట్టణంలో స్థిరపడినాడు. ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రంలో అనౌన్సర్‌గా చేరి, సాహిత్యపరంగా అనేక వైవిధ్యమైన కార్యక్రమాలు రూపొందించి అధికారుల, శ్రోతల మన్ననలు పొందినాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జర్నలిజం బోధించాడు. ఎంతోమందికి, తన సహాయ సహకారాలు అందించాడు. సర్వీసులో వున్నప్పుడే పి.హెచ్.డి. పట్టా పొందినాడు. మంచి రచయిత, సమీక్షకుడు, విమర్శకుడు మా చిన్నన్నయ్య. ఆయన రచనలు పుస్తక రూపంలోకి రాకపోవడం (పి.హెచ్.డి. గ్రంథం తప్ప) బాధాకరం. ఎదుటివారిని ప్రోత్సహించడం లోనే ఆయన ఆనందాన్నీ, తృప్తిని పొందినాడు. నేను 1964 ప్రాంతంలో అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో వున్నప్పుడు, నా వెన్నంటి వుండి దైర్యం చెప్పేవాడు. అంతమాత్రమే కాదు, నా బంగారు భవిష్యత్తును ఊహించి చెప్పినాడు. నేను దంతవైద్య రంగం లోనికి వచ్చి అందులో స్థిరపడడానికి కూడా కారకుడు ఈయనే. అప్పటి వరకూ నాకు దంతవైద్యంలో డిగ్రీ కోర్సు ఉన్నట్టు తెలియదు. పదవీ విరమణ తర్వాత విశాఖపట్నం లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. మా అన్నదమ్ములు – అక్క చెల్లెళ్లలో ప్రస్తుతం మేమిద్దరమే మిగిలాం. పరస్పరం ఫోన్లో పలకరించుకుంటుంటాం.
మా అన్నల గురించి వివరించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మావి ఉమ్మడి కుటుంబాలు కాకపోయినా, ఉమ్మడి కుటుంబాలలో వుండే ప్రేమలూ అభిమానాలూ – ఆత్మీయతలూ, మాతో కలసి నడుస్తూనే వున్నాయి. అలాంటి అన్నలను కలిగిన నేను అదృష్టవంతుడినే మరి. ఇలాంటి బంధాలు సమాజంలో ఎప్పటికీ కొనసాగాలనే నేను కోరుకుంటాను.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.