Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గోవా కడలి తీరాన శతాధిక తెలుగు కవితా కేళి – నివేదిక

ది. 19-05-2026, 20-05-2026 మరియు 21-05-2026 తేదీల్లో ఏ.కే. తెలుగు మీడియా, ఎఫ్. టామ్ (మహారాష్ట్ర  తెలుగు సంఘాల సమాఖ్య) మరియు ముంబయి భారతి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘గోవా కడలి తీరాన శతాధిక తెలుగు కవితా కేళి’ కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక. తమిళనాడు మరియు ఒడిషా, మొత్తం ఏడు రాష్ట్రాలకు చెందిన కవులు, కళాకారులు చురుకుగా పాల్గొని కార్యక్రమం దిగ్విజయం చేశారు.

తేది 19-05-2026 సాయంత్రం ఏడు గంటలకు, హోటల్ సభాస్థలిలో డా. బండారు సుజాతా శేఖర్ గారి వాగ్దేవి స్తుతి తో కార్యక్రమం మొదలయింది. ఆ తర్వాత వారు రచించిన దీర్ఘ కవితా సంపుటి ‘మట్టి గీతం’ యొక్క ‘సుదూర గమ్య ఆవిష్కరణ మహోత్సవం’తో కార్యక్రమం ముందుకు సాగింది. ఆ కార్యక్రమానికి శ్రీ గంజి జగన్ బాబు అధ్యక్షత వహించగా, శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ కలెక్టర్, కవయత్రి శ్రీమతి తులాల సవరమ్మ గారు, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోవా నివాసి శ్రీ మురళీధర్ కొచ్చెర్ల గారు గౌరవ అతిథిగా, ఏ.కే. తెలుగు మీడియా సంస్థాపక అధినేత శ్రీ కంటె అశోక్ గారు, ముంబయి భారతి అధ్యక్షులు డా. అంబల్ల జనార్దన్ గారు వేదిక నలంకరించారు. శ్రీమతి తులాల సవరమ్మ మరియు డా. అంబల్ల జనార్దన్ గార్లు దీర్ఘ కవితా సంపుటి ‘మట్టి గీతం’ సంయుక్తంగా ఆవిష్కరించారు. శ్రీమతి తులాల సవరమ్మ గారు మాట్లాడుతూ ఎప్పుడూ ఒంటరిగా బయట కాలు పెట్టని తను, గోవా పర్యటనకు వచ్చి, ఈ కవితా సంపుటి ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన అంత మంది తెలుగు వారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

గ్రంథ ఆవిష్కర్త డా. అంబల్ల జనార్దన్ గారు దీర్ఘ కవితా సంపుటిని పరిచయం చేస్తూ, పాతిక సంవత్సరాల క్రితం ముంబయిలో తను, డా.ఎన్.గోపి గారి ‘జలగీతం’ మరాఠీ అనువాద సంపుటి పరిచయం చేసిన సందర్భం జ్ఞప్తికి తెచ్చుకున్నారు. డా. గోపి గారు పంచభూతాల్లో ఒకటైన నీటిపై కావ్యం రాస్తే, డా. సుజాత గారు మరో పంచభూతమైన ‘మట్టి గీతం’ రాయడం ఎంతో  ముదావహం అని కొనియాడారు. మట్టి, మానవ మనుగడకై తోడ్పడే విధానం, దానిలోని  తాత్వికత, దాని పరిధి, మొదలైన వాటిపై కావ్యంలోని కొన్ని కవితా పంక్తులు చదివి వివరించారు. ఒక ప్రయోజనకరమైన ‘మట్టి గీతం’ రచించిన కావ్యకర్త డా. బండారు సుజాతా శేఖర్ అభినందించారు.

గౌరవ అతిథి, గోవా నివాసి శ్రీ మురళీధర్ కొచ్చెర్ల గారు మాట్లాడుతూ, గోవాలో అంత మంది తెలుగు వారిని కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. శాస్త్రజ్ఞులైన  వారు, ఒక పాట కూడా ఆలపించారు. ఆ తర్వాత డా. బండారు సుజాతా శేఖర్ దంపతులు, వేదికపై ఉన్న అందరిని జ్ఞాపిక, శాలువా, ‘మట్టి గీతం’ పుసకంతో ఘనంగా సన్మానించారు. శ్రీ దాచేపల్లి బుచ్చయ్య గారి వందన సమర్పణతో ఆ కార్యక్రమం ముగిసింది.

ఆ తర్వాత శతాధిక కవి సమ్మేళనం జరిగింది. హాజరైన కవులు, తమ కవితలతో అందరిని అలరించారు. కొందరు గోవా ప్రకృతిని వర్ణిస్తే, కొందరు తెలుగు భాష ఔన్నత్యంపై, కొందరు ఛందోబద్ద కవితలు ఆలపించారు. అందరు కవులను నిర్వాహకులు ‘గోవా కడలి కవిరత్న’ పురస్కారంతో పాటు, శాలువా, జ్ఞాపిక, డా.అంబల్ల జనార్దన్ గారి కథానికా సంపుటి ‘ప్రాణధార’, డా. బండారు సుజాతా శేఖర్ గారి దీర్ఘ కవితా సంపుటి ‘మట్టి గీతం’తో సన్మానించారు. అంతే కాదు, కార్యక్రమ సమన్వయకర్తలు శ్రీ గంజి జగన్ బాబు, శ్రీ కంటె అశోక్ గార్లను ‘గోవా కడలి సమన్వయ రత్న’ పురస్కారంతో పాటు, శాలువా, జ్ఞాపిక, డా.అంబల్ల జనార్దన్ గారి కథానికా సంపుటి ‘ప్రాణధార’, డా. బండారు సుజాతా శేఖర్ గారి దీర్ఘ కవితా సంపుటి ‘మట్టి గీతం’తో సన్మానించారు. అలాగే దీర్ఘ కాలంగా గోవాలో ఉంటూ సమాజ సేవ చేస్తున్న ఆరుగురు తెలుగు సంస్థల పదాధికారులను ‘గోవా కడలి సేవా రత్న’ పురస్కారాలతో సత్కరించారు. వివిధ బృందాల సమూహ ఫోటోలు తీసుకున్న తర్వాత, వందన సమర్పణతో ఆనాటి కార్యక్రమం ముగిసింది.

తేదీ 20-05-2026 మరో మరుపురాని రోజు. ఆనాడు, నిర్వాహకుల మన్ననను స్వీకరించి, మన తెలుగువారైన గోవా గవర్నర్ గౌ. అశోక్ గజపతి రాజు గారు ఆ బృందానికి ఆత్మీయ విందుతో గోవాకు స్వాగతం పలికారు. ఎంతో మంది తెలుగు వారున్న గోవాలో ఒక ‘తెలుగు భవన్’కి ప్రభుత్వం భూమి కేటాయించాలనే మా విన్నపానికి సానుకూలంగా స్పందించి, స్థానిక ప్రభుత్వానికి శిఫారసు చేస్తానన్నారు.

ఆ సందర్భంగా డా. అంబల్ల జనార్దన్, డా. బండారు సుజాతా శేఖర్, శ్రీ జక్కని గంగాధర్, శ్రీమతి లతా తేజేశ్వర్ ‘రేణుక’ గార్లు, తాము రచించిన పుస్తకాలను గౌ. గవర్నర్ గారికి సమర్పించారు. గవర్నర్ గారు బృందం సభ్యులతో ఫోటో దిగారు.

ఆ తర్వాత గోవాలోని కొన్ని ప్రేక్షణీయ స్థలాలను, మందిరాలను, సందర్శించి బసకు తిరిగి వచ్చారు. ఆ రాత్రి సభాస్థలిలో సమావేశం కాగా, సభ్యులు తమ తమ కళలను ప్రదర్శించారు. కొందరు పాటలు పాడితే, కొందరు రాగయుక్తంగా పద్యాలు ఆలపించారు. కొందరు తమ పర్యటన అనుభవాలను పంచుకున్నారు. కొందరు చలన చిత్రాల్లోని సుదీర్ఘ సంభాషణలను భావయుక్తంగా అభినయించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు.

తేదీ 21-05-2026 ఉత్తర గోవాలోని ఒక సముద్రంలో ఓ గంట, ఓడ ప్రయాణంలో, తీరాల్లోని ఐదు ప్రేక్షణీయ స్థలాలను వీక్షించారు. ఆ తర్వాత, మరికొన్ని  స్థలాలను వీక్షించి రాత్రి తమ, తమ స్థలాలకు పయన మయ్యారు.

మొత్తం మీద ఆ బృందం, గోవా సందర్శనలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలను మూటగట్టుకొని, అంత మంచి అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలర్పించి సెలవు తీసుకున్నారు.

Exit mobile version