[అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ‘గోడ మీద అమ్మ’ అనే రచన అందిస్తున్నారు పెద్దాడ సత్యప్రసాద్.]
అమ్మ దేవుడికి మారు రూపం. అమ్మకు మించిన దైవం వేరేది ఉండదు. తన కడుపులో తొమ్మిది నెలలు మోసి ఆ బరువుని సైతం ఆనందంగా చూసే అమ్మ కన్నా త్యాగమూర్తి ఎవరు ఉంటారు. తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీర్చే అమ్మని సృష్టించి ఆ దేవుడు ఆమె అనురాగం ముందు తాను ఎంతో చిన్న అని తెలుసుకుని ఏనాడో చిన్నబోయాడు. ఇలా అమ్మ గురించి ఎన్నో చెప్పవచ్చు. భాష చాలదు, భావాలు కూడా అసలు చాలవు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అమ్మ అంత గొప్పది, ఈ విశ్వం పట్టనంత ప్రేమ రూపంగా అమ్మ అగుపిస్తుంది. అలాంటి అమ్మ మాయమైపోతే. అమ్మ లేని లోకం ఎలా ఉంటుంది.
ఇది ఏ కధలోనో మాట కాదు, ఏ సినిమాలోనో డైలాగ్ అంతకంటే కాదు. మనసు లోతుల నుంచి లోపలి పొరల నుంచి వచ్చిన మాట. అవును తన కడుపులో దాచి బయటకు వచ్చాక కను రెప్పలా కాచి ఏళ్ళకు ఏళ్ళు ఎదిగి ఎంతో పెద్దవాడు అవుతున్నా తనకు మాత్రం ఎప్పటికీ నెలల బాలుడిగానే భావిస్తూ అలాగే చూస్తూ ప్రేమిస్తూ వచ్చిన అమ్మ ఉన్నట్లుండి అదృశ్యం అయితే ఈ లోకంలో ఎలా ఉంటుంది. అంతా శూన్యంగా కనిపించదా. అమ్మ లేని నిజాన్ని చిన్ని గుండె తట్టుకోలదా. అమ్మ అన్నది అలవాటు అయిన పెదవులు అదే పనిగా తారకమంత్రంగా జపిస్తూ అమ్మ కోసం తపిస్తూ ఉంటే అమ్మ మాత్రం కంటి ఎదురుగా కనిపించకుండా హృదయం చిద్రం కాదా. బాధ కలిగినా ఆనందం కలిగినా విషాదం అయినా వినోదం అయినా అమ్మ అన్న మాటలే కదా నోట వల్లించేది. అవే కదా పుట్టిన దగ్గర నుంచి అలవాటుగా అలవోకగా మనసు సంభాషించేది. అలాంటి అమ్మ లేకపోవడమేంటి. ఇది నిజమేనా లేక కలా ఇది కదా అసలైన సందేహం.
ఇది కదా ఉన్న స్థితి నుంచి శూన్యం వైపుగా చూపులు వెళ్ళిపోతున్న దైన్యానికి దారి తీసేది. అమ్మ దేవుడు కంటే గొప్పది అంటారు కదా. అందుకేనా ఆమె కూడా దేవుడి కంటే మరో ఎత్తులో తాను కూడా అతి పెద్ద పీఠం వేసుకుని కొలువు ఉండడానికి వెళ్ళిపోయిందా. అవును అదే నిజమనిపిస్తోంది. అమ్మ వెళ్ళింది దేవుడి దగ్గరకే. అచ్చంగా అక్కడికే. కానీ అక్కడ ఆమెకు సమున్నత స్థానం ఎపుడో తయారుగా ఉంది దానిని అధిష్టించేందుకు ఒక మంచి ముహూర్తం చూసుకుని అమ్మ వెళ్ళిపోయింది. తరచి చూడగా ఇదే నిజమనిపిస్తోంది. నిజమేంటిది ఇదే అక్షర సత్యం. ఇదే అసలైన వాస్తవం. అమ్మ వెళ్ళింది అక్కడికే. ఇంతకంటే ఎంతో వైభోగాలు ఉన్న లోకంలో తాను సుఖపడడానికి కానే కాదు. ఆ లోకంలోకి వెళ్ళి అక్కడ నుంచి కూడా తన బిడ్డను చూసి మనసారా దీవించడానికి. అక్కడ వైభోగాలు అన్నీ తన బిడ్డకు దక్కాలని నిండు ఆశీస్సులు అందించడానికి. అవును ఇదే సత్యం. అమ్మను దేవుడు కంటే గొప్ప అని ఇపుడు ఇంకా బలంగా చెప్పాలనిపిస్తోంది. ఎలాగంటే దేవుడికి ఒక రూపం లేదు, ఆయనను ఎవరెలా అనుకుంటే అలాగే కనిపిస్తారు.
ఇంతకీ దేవుడికి ఆ రూపం కూడా ఉందో లేదో తెలియదు. అంతే కాదు ఇంకా లోతుగా ఆలోచిస్తే ఆ దేవుడు కూడా ఉన్నారో లేరో కూడా అసలు తెలియదు. అవును ఈ సృష్టి మొదలయ్యాక దేవుడిని చూసాను అన్న వారు ఒక్కరు కూడా లేరు. కానీ దేవుడికి మించిన చల్లని దీవెనలతో కళ్ళారా కనిపిస్తూ తన జీవితం మొత్తం అర్పిస్తూ ఎన్నో సేవలు చేసిన అమ్మ మాత్రం ఇలలో ఉంది. ఆమె కళ్ళెదురుగా నిలిచి అప్యాయానురానాలను కరువు తీరా అందించింది. ఇక అలసితి సొలసితి ఆమె అంతర్ధానమైంది. అది కూడా కన్న బిడ్డ కోసమే. ఈ భౌతికపరమైన శరీరం చిత్రమైన వేళ ఈ పాత వస్త్రాన్ని వదిలేసి తన రూపాన్ని కళ్ళలో పెట్టుకుని చూసుకోమని అమ్మ పోతూ పోతూ కూడా ఒక అద్భుతమైన సందేశం ఇచ్చింది.
అవును ఆమె ఇపుడు ఎదురుగా సజీవంగా లేదు కానీ ఆమె కళ్ళెదురుగా పటంలో నవ్వుతూ ఉంది. గోడ మీద గాలికి కదలాడే పటంలో నుంచి తన హావభావాలను అందంగా ప్రదర్శిస్తూ ఆప్యాయతను అక్కడ నుంచే పంచుతోంది. అవును ఆమె గోడ ఎక్కింది పటంగా. అంతకంటే ముందు గుండెల్లో పీఠమెక్కింది. అక్కడ శాశ్వతంగా తిష్ట వేసుకుని బిడ్డ ఆశలో శ్వాసలో తానుగా మారి మురిపిస్తోంది. ఆమె అమ్మ. అందుకే ఆమె ఎక్కడికీ పోలేదు. తాను పంచిన రక్తంలోనే అంతర్లీనంగా ప్రవహిస్తోంది. తాను తనువిచ్చి పెంచిన ఆ దేహంలోనే అమ్మగా కమ్మగా వేద ఘోష వినిపిస్తోంది. ఇక ఏ భయం అక్కరలేదు, ఏ సందేహం అంతకంటే అవసరం లేదు, అమ్మ నాలోనే ఉంది. అవును అమ్మ నాతోనే ఉంది. కొండంత ప్రేమతో నిండుగా దీవిస్తూ ఆమె ఎప్పటిలాగే ఉంది. అమ్మ ఎక్కడికీ పోలేదు. తలపులలో మెదులుతూ ఉంది. పిలుపులలోనూ పదిలంగా ఉంది. ఈ భావన ఎంత మధురం. ఈ అనుభూతిలో ఎంతటి తీయదం. ఇదే ఎప్పటికీ శాశ్వతం.
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
