[వంశీకృష్ణ గారి ‘గోధుమ రంగు ఊహ’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు శ్రీ వంశీకృష్ణ గారి మూడవ కథాసంపుటి ‘గోధుమ రంగు ఊహ’. ఈ సంపుటిలో 14 కథలున్నాయి. ఈ పుస్తకం శీర్షిక చూసినా, లేదా అదే పేరుతో ఈ పుస్తకంలో కథ పేరు పరిశీలించినా, ముందుగా పాఠకులలో కలిగే సందేహం.. ‘ఊహకి రూపం లేదు కదా మరి రంగెలా ఉంటుంది అని’. ఆ సందేహాన్ని తమ ముందుమాట ‘భావోద్వేగాల ఇంద్రధనువులు’లో తీరుస్తారు ప్రసేన్. ఊహకి రంగు ఎందుకుంటుందో, అది గోధుమ రంగే ఎందుకవుతుందో వివరించారు. “గోధుమరంగుకు సాహిత్యంలో, చిత్రకళలో చాలా అర్థాలున్నాయి. గోధువు అంటే మట్టి. గోధుమ అంటే బతుకు. గోధుమ అంటే ప్రకృతి. గోధుమ అంటే జ్ఞాపకం. గోధుమ అంటే విషాదం. గోధుమ అంటే సందేహం. గోధుమ అంటే తటస్థత. గోధుమ అంటే సమతూకం, గోధుమ అంటే ఆధ్యాత్మికత. గోధుమ అంటే అస్పష్టత. గోధుమ అంటే అనుబంధాలు. గోధుమ వర్ణం అంటే ఇంకా చాలా చాలా. లెక్కలేనన్ని లోతులు అంతుచిక్కని అర్థాలు. ఈ అర్థాలు, లోతులు అన్నీ వంశీ కథల్లో ఉన్నాయి” అంటారు ప్రసేన్.
ఈ కథల నిండా జీవితం పరచుకుని ఉంది. చిన్న చిన్న సంతోషాలు, వెతలు, వేధింపులు, అవమానాలు, నిస్సహాయతలు, కాస్తంత భరోసా, కొద్దిగా నమ్మకం కలిగించే మనుషులు! నిష్క్రియాపరత్వాన్ని స్వభావంగా మార్చుకున్న వ్యవస్థ, ప్రభుత్వం కన్నా మిన్నగా ఎదిగి అందర్నీ, అన్నిటినీ తమ చెప్పుచేతలలో ఉంచుకునే నేతలు.. దంపతుల మధ్య ప్రేమలు, ప్రేమ కన్నా కఠినమైన వాస్తవాలను గ్రహించి, ప్రేమికురాలికి గుడ్ బై చెప్పిన ప్రేమికుడు. పదవీ బాధ్యతలలో ఉన్నప్పుడు క్రింది స్థాయి సిబ్బందిని వేధించి, రిటైరయ్యాకా అందరూ సమానమే అనే జీవితసత్యం తెలుసుకున్న అధికారి.. ఇలా రకరకాల వ్యక్తులు ఈ కథల్లో కనబడుతారు. ఓ రకంగా మనకి మనమే తారసపడతాం. చాలా కథల్లో పాఠకులు కూడా ఏదో ఒక పాత్రతో ఐడింటిఫై అవుతారు.
***
‘అడవి అంటుకున్నది’ కథ ప్రతీకాత్మకమైనది. ఒక మహమ్మారి ప్రపంచాన్నంతా చుట్టుముట్టినప్పుడు ఇక్కడ మన వ్యవస్థ ఎలా పనిచేసిందో జంతు పాత్రల ద్వారా చెప్తారు రచయిత. మనుషుల్లోని భయాన్ని కొందరెలా సొమ్ము చేసుకుంటారో ఈ కథ చెబుతుంది. సమస్య ఒకటైతే, పరిష్కారం మరొకటి చూపించి, తిమ్మిని బమ్మి చేసి, జనాలని మభ్యపెట్టే నేతల స్వభావాన్ని ఈ కథ పట్టిస్తుంది.
‘ఒక పసుపు పచ్చ సాయంకాలం’ భార్యని ఆలస్యంగా అర్థం చేసుకున్న ఓ భర్త కథ. “మేమిద్దరమూ అనుభవిస్తున్న జీవితం వేరు. అనుభవించాలి అనుకున్న జీవితం వేరు.” అనుకుంటాడు భర్త. “పూర్ణ మెల్లగా నా దగ్గరకు వచ్చింది. నా చేతిని ఆమె చేతిలోకి తీసుకుంది. చల్లటి స్పర్శ, పాతికేళ్ళ క్రితంలా వెచ్చగా లేదు. ఇసుకలోకి నీళ్లు మెల్లగా ఇంకిపోయినట్టు స్పర్శ నా లోపలకు ఇంకిపోయింది. వాన తగ్గాక వచ్చే మట్టి పరిమళం పూర్ణను తాకి, ఒక పరమహంసనో, అవధూతనో తాకి పునీతమయినట్టుగా పునీతమయి నా లోపలకు చేరుకుంది. ఆకాశంలో విరిసిన ఇంద్రధనువులోని సప్త వర్ణాలు ఒకే ఒక శ్వేత వర్ణంలో లయించినట్టు పూర్ణ శ్వాస నా దేహం లోని అనువణువులోనూ నిండిపోయింది. నేను పూర్ణ లో కలిసిపోయాను.” ఈ వాక్యాలు చదువుతుంటే వంశీకృష్ణ గారి లోని కవిని చూస్తారు పాఠకులు.
‘ఎదురైన దృశ్యం’ కథలో భావుకత కన్నా ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యతనిచ్చిన కరుణాకర్, ప్రాణప్రదంగా ప్రేమించిన రేవతిని పెళ్ళి చేసుకోడానికి వెనుకాడుతాడు. ఎందుకు? ‘ఎక్కడో ఓ చిన్న సందేహం. జీవితం అనుకున్నట్టు సాగదని.’ వాళ్ళ దారులు వేరవుతాయి. కొన్నేళ్ళకి ఓ ఉమ్మడి మిత్రుడి ద్వారా రేవతి చనిపోయిందని తెలుస్తుంది. ఆమెని కడసారి చూడాలని ఆమె సొంతూరుకి వెడతాడు కరుణాకార్. చూడగలుగుతాడా? ప్రేమలో ఉన్నప్పుడే ఆమెని సరిగా ‘చూడని’ మనిషి, ఆమె భౌతిక కాయాన్నైనా ‘చూస్తాడా?’. మనుషులని అర్థం చేసుకోవడంలో విఫలమయితే, తరువాతెప్పుడు తీరుబాటుగా అర్థం చేసుకుని, దూరం చేసుకున్నందుకు విలపించాల్సి ఉంటుంది.
డబ్బు మీద ఆశ మనిషిని ఎంతలా పతనం చేస్తుందో ‘గాంధీ’ కథ చెబుతుంది. తమ విషాదాలను కూడా సొమ్ము చేసుకోవాలనుకునే రామానుజం లాంటి వ్యక్తుల బాధ సానుభూతి కలిగించదు. పైగా ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. ఆ పరిస్థితికి కారకులెవరో అన్వేషించమంటుంది.
‘ఆట ముగిసాకా’ కథ రామ్‌రావ్ అనే ఓ ఉన్నతాధికారి, బ్యాంకులో తన క్రింది అధికారి మురళిని వేధిస్తాడు. అతని పనితీరులో ఏమీ తప్పు ఉండదు. అయినా రుసరుసలు, అరుపులు తప్పవు. మరో కొలీగ్ ద్వారా అధికారి ప్రవర్తనకి అసలు కారణం తెలుస్తుంది మురళికి. అయినా, మురళి ఆయన ప్రవర్తనని పట్టించుకోడు, ముందుకు సాగిపోతాడు. కానీ రిటైరయ్యాకా రామ్‌రావ్‌కి వాస్తవం బోధపడుతుంది. మురళికి ఫోన్ చేసి, ఇంటికి రమ్మంటాడు. చెస్ ఆడతాడు. ఆట అయిపోయాకా, పావులని డబ్బాలో పడేస్తూ, “జీవితం ఇంతే మురళీ! ఆట ముగిశాక రాజు, బంటు కలిసి ఒకే డబ్బాలో నిద్రించినట్టు, జీవితంలో మనుషులు ఎన్నుకున్న కెరీర్ అనే ఆట ముగిసాక మనుషులు అందరూ ఒకే నేల మీద పడుకుని, ఒకే ఆకాశాన్ని కప్పుకోవాలి. ఆ ఆకాశం కింద వర్ణ, వర్గ, లింగ వివక్ష ఏదీ ఉండదు. ఈ సత్యం తెలిసేసరికి జీవితం చేయి జారిపోయింది” అంటాడు రామ్‌రావ్.
‘ఉష్… మాన్ చెప్పని కథ’ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అనేకానేక ఘటనలకు ప్రతిరూపం. మనుషుల మధ్య నమ్మకం తొలగిపోయి, మౌఢ్యం పెరిగిపోతున్న వైనాన్ని అద్భుతంగా కాప్చర్ చేసిన కథ. ఈ పరిస్థితికి కారకులెవరు అని ప్రశ్నించుకుంటే, ఆలోచిస్తే.. చాలా లోతులకి వెళ్ళాల్సొస్తుంది. మతం, సంపద కూడబెట్టడం, పేదరికం, ప్రపంచీకరణ, హింస వంటి మూల కారణాలను కాకుండా, తక్షణ వైరం కలిగించే ఉదంతాలను కారణాలుగా చూపెట్టి మనుషుల మధ్య సామరస్యతని దూరం చేస్తున్నవారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటుందీ కథ. ఈ కథలోని “అయినా ఈ ప్రపంచం అంతా ద్వేషం మీదే నడుస్తోంది. ద్వేషం ఈ ప్రపంచాన్ని నడిపించే ఇంధనం” అన్న వాక్యాలు భయపెడతాయి. సామాజిక మాధ్యమాలలో ఇప్పటి ట్రోలింగ్ చూస్తుంటే వాటికి మూలం ద్వేషమేనని అనిపిస్తుంది. ఆలోచింప చేస్తుందీ కథ, ఎన్నో ప్రశ్నలు మిగులుస్తుంది.
‘పైసా.. వసూల్’ కథ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొట్టేవాళ్ళ గురించి, అప్పు తీర్చే వీలు ఉన్నా, రాజకీయనేతల మాటలు నమ్మి రుణమాఫీ కోసం ఎదురుచూసేవాళ్ళ గురించి, విల్‍ఫుల్ డీఫాల్టర్ల గురించి, రిటైర్మెంట్ దగ్గరకొస్తున్న సమయంలో మేనేజ్‌మెంట్ పెట్టే ఒత్తిడిని తట్టుకోలేని అధికారుల గురించి కళ్ళకు కట్టినట్టు చెబుతుంది. వ్యవస్థలని నిర్వీర్యం చేయడం బహుశా మనకి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో! మరి మనమేం చేయాలి? మనసుకి కంట్రోల్ ఆల్ట్ పట్టుకుని డిలీట్ కొట్టమంటుందో పాత్ర. బహుశా అదే అత్యంత సులువైన పరిష్కారమేమో!
ఈ సంపుటిలోని అన్ని కథల కంటే, ఎక్కువగా చర్చకు వచ్చినది ‘దుస్తులు’ కథ. ఓ టివీ షో లో యాంకర్‍గా చేసే చంద్రకళ వేసుకునే డ్రెస్‌లు ఆమె కొడుక్కి నచ్చవు. తన తల్లిని అందరూ అదోలా చూడడం, ఆమె ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆమె రివీలింగ్ డ్రెస్‌ల గురించే మాట్లాడడం, అమ్మని చాలామంది ఓ సెక్స్ సింబల్‌లా చూస్తున్నారన్న విషయం ఆ పసివాడిని తీవ్రంగా గాయపరుస్తుంది. దుస్తుల విషయంలో తల్లిని మార్చలేకపోతాడు. ఒత్తిళ్ళకి నలిగిపోయి, బలవన్మరణానికి పాల్పడతాడు. ఈ కథ చదువుతున్నప్పుడు ఇటీవల ఓ సినిమా సంబంధిత ఇంటర్వ్యూలో ఓ నటికీ, ఓ జర్నలిస్టుకి మధ్య జరిగిన వివాదం పాఠకులకు గుర్తుకువస్తుంది. ఈ కథ వేసే కొన్ని ప్రశ్నలను పుస్తకం చివర్లో గుడిపాటి ప్రస్తావించారు. కనబడని కోణాల నుంచి చూడాలని అర్థమవుతుంది.
‘ఊహలకి రంగులుంటాయి, రంగులకి ప్రాణం ఉంటుంది’ అంటుంది కృష్ణవేణి ‘గోధుమ రంగు ఊహ’ కథలో. ప్రాణం పోసే వాటి రంగు ఆకుపచ్చ అనీ, కమ్ముకొచ్చే మృత్యువుది గోధుమ రంగు అని ఈ కథ చెబుతుంది. జీవన తాత్త్వికత నిండా పరచుకున్న కథ ఇది. ఎవరెలా అర్థం చేసుకుంటే, వారికలా అర్థమవుతుంది.
ఒకప్పటి ప్రేమికులు కొన్నాళ్ళకి దంపతులవుతారు. కొన్నేళ్ళకి తల్లిదండ్రులవుతారు. ఓ పాప పుట్టి వారికి ఆనందం కలిగిస్తుంది. జీవితాన్ని మారుస్తుంది. కానీ ఓ ప్రమాదంలో ఆ పాప చనిపోయాకా, ఆ ఇద్దరి ప్రపంచం స్తంభించిపోతుంది. ఆ దుఃఖం నుంచి తేరుకోడానికి ఆ ఇద్దరూ చేసే ప్రయత్నాలలో ఆమె అంతర్ముఖురాలవుతుంది, అతను బహిర్ముఖుడవుతాడు. ఇద్దరి మధ్యా అధిగమించలేనంత ఎడారిలా దూరం! చామంతులు మొలవాల్సిన చోట బ్రహ్మచెముడు మొక్కలు! ఏ వాక్యాలు/పేరాలతో అయితే మొదలయిందో, అవే వాక్యాలూ/పేరాలతో ముగుస్తుంది ‘మౌన’ కథ.
‘శ్యామ కల్యాణి’ కథ వార్ధక్యానికీ, శైశవానికి గొప్ప లంకె వేస్తుంది. ఒకనాటి తిరస్కరణలు, నేటి మోసాలు కలిపి సూర్యనారాయణ శాస్త్రిని సొంతూరు నుంచి నగరానికి తెచ్చి, ఓ అపార్టుమెంటులోని సెల్లారులోకి చేరుస్తాయి. ఆ అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ గంగరాజు కూతురు కళ్యాణి ప్రసవానికి వస్తుంది. ఆమెకు ఓ పాప పుడుతుంది. ఇక శాస్త్రి గారిలో పాత ఉత్సాహం పొంగుకొస్తుంది. భౌతికంగా కదలలేకపోయినా, మానసికంగా చురుకుగా మారి పాపతో ఆడుకుంటారయన. పాపకీ, ఆయనకీ మధ్య అనుబంధపు వంతెన ఏర్పడిపోతుంది. “పసికందు చేసే ధ్వనులన్నీ ఒక సారి షడ్జమం లానూ, మరొక సారి మధ్యమం లానూ, ఇంకొకసారి పంచమం లానూ అనిపిస్తాయి ముసలి సూర్యనారాయణ శాస్త్రికి. ఈ పిల్ల అన్ని సంగతులూ పాడుతుంది కానీ నిషాదం జోలికి పోదు ఎందుకని అని ఆయన లోలోపల ఆశ్చర్య పోతారు. ఈ పిల్ల తల్లి కల్యాణి అయితే ఈ పిల్ల శ్యామ కల్యాణి అనుకుంటారు ఆయన లోలోపల”. కథ పూర్తి చేశాకా, చిన్నపాటి వేదన కలుగుతుంది పాఠకులలో.
దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి ‘అద్దంలో జిన్నా’ కథ స్ఫూర్తితో రాసిన కథ ‘అద్దంలో అమరేంద్ర’. పేరు మార్చినా చివరలో మోదీ అని ఉంచారు కాబట్టి అది ఎవరిని ఉద్దేశించి రాసినదో అర్థమైపోతుంది పాఠకులకు. ఒక వ్యక్తిని అత్యంత తీవ్రంగా వ్యతిరేకించేవాళ్ళు, అంతే తీవ్రంగా ప్రేమించేవాళ్ళు ఉన్నప్పుడు – ఆ వ్యక్తి గురించి చర్చ, రచ్చ తప్పవు. ఏ కోణం నుంచి చూస్తే, ఆ వ్యక్తి అలా కనబడతాడు. కొందరికి దేవుడైతే, కొందరికి దానవుడు. రాజకీయ నాయకులు అనుసరించే ఒక స్ట్రాటజీని ఈ కథ ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. మౌనం వీడమని అడుగుతున్న చోట పలుకు లేకుండా ఉండిపోవడం; కేరింతలు ఎదురైన చోట మాటలు ఝరిలా ప్రవహించడం! మనుషులు భావాలుగా మారిపోయి, రాజకీయనేతల బారిన పడితే ఎదురయ్యే ప్రమాదాన్ని ఈ కథ చెబుతుంది. వ్యక్తిత్వంపై ఒకసారి మచ్చపడ్డాకా, చెరుపుకోడానికి ఎంత ప్రయత్నించినా పోదని చెబుతుంది.
‘సెలవు’ కథ విశ్వవిద్యాలయాల లోని కుల వివక్షనీ, ఆధిపత్య జాడ్యాలని ప్రస్తావిస్తుంది. వాటితో విసిగిపోయిన, వెలికి గురైన ఓ విద్యార్థి జీవితానికి సెలవంటాడు.
‘కొండ మీద’ కథ సమాజంలో నిర్లజ్జగా సాగిపోతున్న వనరుల దోపిడీని ప్రదర్శిస్తుంది. వ్యవస్థీకృతమైన వంచనని వ్యక్తిగత స్థాయిలో ఎదుర్కోవాలనుకున్న మిత్రుల ప్రయత్నం ఫలించిందా?
***
ఈ కథలన్నీ చదివాకా, “వంశీ మధ్యతరగతి కథకుడు. వంశీ సామాన్య పాఠకుడి కథకుడు” అన్న ప్రసేన్ గారి అభిప్రాయంతో పాఠకులు ఏకీభవిస్తారు. ఈ కథల గురించి చెబుతూ, “లోకాన్ని, మనుషులను సరికొత్త చూపుతో అవలోకించే సానుకూల పరిమళాన్ని పరివ్యాప్తం చేస్తాయి” అని అన్నారు గుడిపాటి. అవును, నిజమే అనుకుంటారు పాఠకులు!!
***
రచన: వంశీకృష్ణ
ప్రచురణ: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
పేజీలు: 135
వెల: ₹ 150.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
పాలపిట్ట బుక్స్, హైదరాబాద్. ఫోన్: 9848787284
వంశీకృష్ణ: ఫోన్: 9573427422
~
ఆన్‌లైన్‍లో:
https://www.telugubooks.in/products/goduma-rangu-uha
~
శ్రీ వంశీకృష్ణ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-vamsykrishna/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
